శ్రీకృష్ణదేవరాయలు
సీ. ఆంధ్రులభావనాట్యస్థానములలోన,
నాడు నీకావ్యకన్యకలఁ గాంచి
అనిఁ గన్నుమాయ కింకను దోఁచు నీసమి,
త్కంఖాణఖురళికాంకములఁ జూచి
కలితశౌర్యజ్వాలఁ గరఁగించి పోసిన,
జయశాసనస్థిరాక్షరము లరసి
పెద్దనార్యునిమనోవీధి కందక దాటి,
దిశలఁ దాండవమాడు తేజమొంచి

శ్రీకృష్ణదేవరాయలు - జాషువా
భారతి, మార్చి 1929.
గీ. చిరము నీరాజ్యలక్ష్మి వర్షించు బాష్ప,
పూర మదె తుంగభద్రాఖ్యఁ బూని పారు
చుండు నెపుడు బళ్ళారిమండలమున
ఆంధ్రకవిచంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!!
సీ. మహితాంధ్రభోజనామకరత్నము వహించి
క్రాలు విశాలవక్షస్‌స్థలంబు
పరభీకరప్రభావమ్ము బయ ల్చిమ్ము,
సరిలేని కోరమీసములజంట
చతురభ్దివలయితక్ష్మాభారమునకుఁ బెం
పున నిక్కి కనుచుండు భుజయుగంబు
దురమున నిప్పుక ల్గురిసి దీనులయందు
దయలు వర్షించు నేత్రద్వయంబు
గీ. అష్టదిగ్గజవాగమౄతార్ద్ర మగుచుఁ
బావనంబైన నీసభాభవనవిభవ
మక్కటా! జీర్ణ నగర కుడ్యాంతరములఁ
బండి నిద్రించెనే కృష్ణపార్థివేంద్ర!
సీ. భాషాసముద్రకుంభజుఁడ వీవయ్యును
విద్వవత్కవుల గారవించినావు
ప్రతిపక్షరాజభార్గవనాఁడవ యయ్యు
వెన్నిచ్చుచో విడిపించినావు
వైరికిరీటశుంభత్పదాబ్జుఁడ వయ్యు
బెద్దనపదము సేవించినావు
అర్థార్థిజనకల్పకానోకహుఁడవయ్యు
సత్కృతులకుఁ జేయి సాచినావు
గీ. ఔర! శ్రీకృష్ణరాయ నీయంతవాని
దివికి నర్పించుకొన్న మాదేశజనుల
భాగ్యహీనత నొక్కి చెప్పంగలేక
చిలువరాయఁడు వేయినాల్కలు వహించె
ఉ. ఆయతవర్ణనావిభవ మచ్చుపడం బనిఁబూని విష్ణుచి
త్తీయము వ్రాసినావు కవిధీరుల గుండెలు తత్తరిల్ల నేఁ
డీ? యొకడేని మీసముపయిం జెయివైచి రచించు సత్కవి
ధ్యేయుడు? క్లిష్టకావ్యమనకేమి? యశక్తులు కృష్ణభూపతీ!

శ్రీకృష్ణదేవరాయలు - జాషువా
భారతి, మార్చి 1929.
సీ. కవిసింహములు నీకుగా సృష్టిగావించు
కృతిపుత్రికలను దుఃఖితలఁజేసి
ఆవాడసింధురాజాగ్రణు ల్పుత్తెంచు
కానుకబండ్లు వెన్కకు మరల్చి
ముదురువెన్నెలఁజిందు ముత్యాలగద్దియు
పరరాజధూర్తుల పాలుసేసి
నిరతంబు పగర నెత్తురుటేరుల మునుంగు
కత్తి కాఁకటిచిచ్చుఁ గలుగఁజేసి
గీ. కుడియెడమలను నీతోడఁ గూడు తిరుగు
సుకవికులకోకిలమ్ముల శోకజలధి
ముంచి యలబృహస్పతివ్రాఁత మంచి దగుట
దివికిఁ బోయితె శ్రీకృష్ణదేవరాయ!
సీ. ఆశీర్వదించినారా వ్యాసవాల్మీకి
బృందారకమునీంద్రు లెదురువచ్చి?
కన్నావె కవిభయంకరుఁగాళిదాసు భో
జుండన్నవాడె విశ్రుతగుణుండు?
రంభ నీతోడఁ గేరడ మాడునే దానఁ
గోపించునే నలకూబరుండు?
బలభేది వేయుఁ గన్నుల జూచి నిను గౌర
వించుచున్నాఁడె కోవిదులలోన?
గీ. తిరిగి నీనెయ్యపుం గవీశ్వరుల గోష్టి
జరుగుచున్నదె దేవేంద్రపురమునందు?
యెచటనుండిననేమి శ్రీకృష్ణరాయ!
భరతపుత్రుల నొకకంట నరయుమయ్య!
[క్రోధన నామ సంవత్సర ఫాల్గుణ మాసము, 1929 మార్చి భారతి పత్రిక, సంపుటము 3, సంఖ్య 3 న ప్రచురింపబడిన ఈ పద్యాలను ఈమాటకు అందించిన జెజ్జాల కృష్ణ మోహనరావు గారికి కృతజ్ఞతలు - సం.]
mOhana అభిప్రాయం:
July 2, 2010 4:36 pm
జాషువ గారు “గబ్బిలము”లో గబ్బిలమును చూడుమన్న ప్రదేశాలలో హంపీక్షేత్రము కూడా ఉన్నది. ఆ సమయములో వారు వ్రాసిన పద్యాలు -
హంపీక్షేత్రముఁ జూచి పోవలయు నమ్మా తెల్గురాజ్యంపు నై-
లింప శ్రీల కొకానొకప్పు డది కేళీరంగ మేతద్రమా
శంపావల్లరు లాఱిపోయిన ప్రదేశంబందు నీ బందుగుల్
కొంప ల్గట్టి నివాస ముండెదరు నీకుం గూర్తు రానందమున్
పరదాపద్ధతి మాన్పిరో సిరికిఁ గుప్పల్ వోసి యంగళ్ల యం-
దురుమాణిక్యము లమ్మినా రచట మున్నో పక్షిణీ, మూరురా-
యరగండండు మహేంద్రవైభవముతో నాంధ్రక్షమామండలిన్
బరిపాలించిన నాఁటి పెంపును దలంపన్ మేను గంపించెడిన్
పగతు రసూయచేతఁ గరవాలములన్ దనువెల్లఁ జెండినన్
జిగిరిచియున్న యుగ్రనరసింహుని భీమదృగంచలంబులన్
బొగలుడి వోవలె దతని మ్రోల నిమేషము నిల్వఁజాలినన్
ఖగపతి నిన్ను ధైర్యవతిఁగా గణియింతురు వీరయోధులున్
ఏనికవంటి సానువు గణేశుని నున్నని బొజ్జమీఁదఁ గా
లూనఁగ లేదు తుమ్మెద తదుజ్జ్వలశిల్ప మఖండ తుంగభ-
ద్రానది కప్పగించుకొని దద్దమలైన తెలుంగువారి వి-
ద్యానగరాన జిందు మొక యశ్రుకణంబు నుపాయనంబుగన్
సరసుఁడు కృష్ణభూవిభుఁడు స్వారియొనర్చిన పారసీహుమా
దొరల ఖురాగ్రహల్యలను దున్నిన భూములలోన నాంధ్ర సుం-
దరు లొకనాఁడు నాటుకొనినారు దిగంత జయప్రదోహముల్
గరిసెల నించినా రురువుగా ఫలియించిన సుప్రతిష్ఠలన్
మూరురాయరగండఁ డూరేగ డీనాఁడు
విద్యానగర రాజవీథులందు
మేలైన పట్టుడేరా లెత్త రీనాఁడు
పారసీక గుఱాల బేరగాండ్రు
ఇనుపరోకళ్ల సాధన సేయ వీనాఁడు
కొమ్ము నిక్కిన భద్రకుంజరములు
తెలుఁగు స్కంధావారముల నిండ దీనాఁడు
మరఫిరంగుల తెల్లదొరల దండు
మణిమయంబైన యాంధ్రసామ్రాజ్య రథము
భువికిఁ గ్రుంగిన పదియు నాఱవ శతాబ్దిఁ
గృష్ణవిభు వీటఁ బ్రొద్దు గ్రుంకినది మొదలు
ఋషిఖగాంగన తెల్లవారినది లేదు
విధేయుడు - మోహన
గన్నవరపు వరాహ నరసింహ మూర్తి అభిప్రాయం:
July 3, 2010 9:09 pm
గుఱ్ఱపు జాషువా కవిత గొంటెగ వేయదు తప్పు గెంతులున్
వెఱ్ఱగు గబ్బిలమ్మటనె వేసఁగి కమ్మగ గూయు కోయిలే
తొఱ్ఱల దాగియుండునునె దోయజ మందలి తేనె సోకుచున్
ఎఱ్ఱనె నవ్యతాంధ్రమున నెన్నగఁ బాడెనె నింపు గీతముల్ .
venkatraj అభిప్రాయం:
August 9, 2010 7:51 am
మీరు చాలా బాగా రాసారు. ధన్యవాదములు………….