ఈమాట » సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక

Expand to right
Expand to left

సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక

సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు.

నిడివి: ౬౫ (65) ని.

(సేకరణ: పరుచూరి శ్రీనివాస్)

సిరిమువ్వలు

ఆకాశవాణి పత్రిక ‘వాణి’లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల ప్రకటన చూసి 1969లో ఒకనాడు రేడియోస్టేషనుకు వెళ్ళి శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారిని కలిశాను. “ఈ ఉద్యోగాలు నీకెందుకయ్యా! మంచి సంగీతనాటిక రాసి ఇవ్వు ప్రచారం చేద్దాం” అన్నారాయన.


సిరికాకొలను చిన్నది
వేటూరి సాహితీ సమితి ప్రచురణ
2004, రూ.60.00

ఎన్నాళ్ళనుంచో ఈ ‘సిరికాకొలను చిన్నది’ అంతరంగ స్థలం మీద అప్పటికే గజ్జె కట్టి ఆడుతూ వుండేది. కూనిరాగాలు తీస్తూ ఉండేది. శ్రావణిగా, సుధాలాపసుందరిగా వినిపించేది. నర్తనబాలగా, ముకుందమాలగా కదిలేదీ కదిలించేది. మురిపిస్తూనే ముముక్షువును చేసేది. రజనీకాంతరావుగారి మాటతో, మా తండ్రిగారి (డాక్టర్ వేటూరి చంద్రశేఖరశాస్త్రి గారు) ఆజ్ఞతో వెంటనే మద్రాసు వెళ్ళి రాత్రింబవళ్ళు రాసి ఈ అందాలరాశిని నేను తొలిసారిగా అక్షరాలా చూసుకున్నాను. పద్యాలు, పదాలు, పాటలు, గద్యాలు, పలు విన్యాసాలు! రేడియో నాటిక గదా అని చాలా కుదించాను.

అంతకుముందు రూపక రచనలో చేయి తిరిగినవాడను కాను. రాగతాళాలకు, స్వరకల్పనకు సరి తూగుతుందో లేదో అని సందేహం వచ్చింది. వెంటనే నాకు ఆప్తులు, బంధువులు అయిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారికి ఈ కాగితాలన్నీ యిచ్చి నా సందేహం చెప్పాను.

దాదాపు రెండుగంటలపాటు వంచిన తల ఎత్తకుండా ఆయన నాటిక అంతా చదివి, “దీనికి సంగీతం నేనే చేస్తాను” అంటూ రజనీకాంతరావు గారికి ఫోను చేశారు. “మీరు చేస్తే అంతకన్నా కావలసిందేముంది. అయితే ఆ స్క్రిప్టు నేను ఇంతవరకూ నేను చూడలేదు. అది వెంటనే పంపమనండి” అన్నారు రజనీగారు.

అటు తరువాత రజనీకాంతరావు గారి సూచనల మేరకు దానిని మరింత తగ్గిస్తే ఒకటిన్నర గంటల నాటిక అయింది. అప్పటికి గంటకు మించి ఆకాశవాణి రూపకాలు లేవు. కానీ సాహితీ సంగీత పక్షపాతులు, స్వయంగా కవీ, సాహితీవ్రతులూ అయిన రజనీకాంతరావు గారు సిరికాకొలను చిన్నది నాటికను గంటన్నర కార్యక్రమంగా ప్రత్యేక అనుమతి పైనుంచి తెప్పించి మరీ ప్రసారం చేశారు. పునః పునః అనేకసార్లు ఈ నాటిక ప్రసారం అయింది. తెలుగు సాహితీపరుల ఆదరాభిమానాలకు నోచుకుంది. శ్రీ పెండ్యాలగారు విజయవాడలో 20 రోజులు వుండి దీనిని ఒక యజ్ఞంగా నిర్వహించి స్వరబద్ధం చేశారు.


వేటూరి సుందరరామమూర్తి
1936-2010

ఇది కథో కల్పనో నాకు తెలియదు. కానీ ఇది సజీవశిల్పం. ఈ శిల్పం చెక్కడానికి ఉలి, ఊపిరి, శిలా, వైఖరి మాత్రం నా మాతామహుల వారసత్వం. అందుకే ఇది వారికే అంకితం.

తన వాణితో తెలుగు నేలను పులకింపజేసి ఆకాశవాణిగా, అశరీరవాణిగా, అందని లోకాలలో అమరగాయనిగా మిగిలిపోయిన కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారు కథానాయిక ‘అలివేణి’గా అందరి హృదయాలలో నిలిచిపోయారు.

శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు. శ్రీ శ్రీగోపాల్, శ్రీ మల్లిక్, శ్రీ ఎన్.సి.వి. జగన్నాధాచార్యులు, మరెందరో ఈ చిన్నదానికి సింగారాలు దిద్దిన మహనీయులు. అందరికీ శిరసు వంచి పాదాభివందనాలు చేయడం తప్ప నేనేమి చేయగలను! వారి పుణ్య సంస్మరణకే ఈ నాలుగు మాటలూ….

- వేటూరి సుందరరామమూర్తి
హైదరాబాద్, 6-7-2004.

 

(8 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Ramnath అభిప్రాయం:

    July 2, 2010 1:45 pm

    Sreenivas,
    Very good. I have been looking for this a longtime. Was the famale voice sree Rangam gopala ratnam?

  2. JAGADEESHWAR అభిప్రాయం:

    July 4, 2010 4:17 am

    very good

  3. Sreenivas Paruchuri అభిప్రాయం:

    July 12, 2010 7:26 am

    Ramanath-gaaru,

    Yes, its the voice of Srirangam Gopalaratnam. See Veturi’s preface above.

    Regards,
    Sreenivas

  4. hareesh అభిప్రాయం:

    July 16, 2010 1:49 am

    వేటూరి మరణానంతరం ఈమాట వారు ఒక ప్రత్యేక సంచిక గాని, ఒక ప్రత్యేక సంస్మరణ వ్యాసం కాని వెలువరించకపోవడం చాల ఆశ్చర్యంగాను మరియు చాల బాధగాను అనిపించింది. ఇప్పటికైన వేటూరి సంస్మరణార్థం వేటూరి గురించి తెలిసిన విజ్ఞులెవరి చేతనైనా ఒక ప్రత్యేక వ్యాసం రాయించాలని ఈమాట వారికి నా విజ్ఞప్తి.

  5. Dr Tatiraju Venugopal అభిప్రాయం:

    July 16, 2010 3:15 pm

    ‘”తన బాణీతో తెలుగు నేలను పులకింపజేసి ఆకాశవాణిగా (పాడనా వాణి కల్యాణి గా- అన్నది ఆయనే) అందాల లోకాలలో అమర కవిగా మిగిలి పొయిన వేటూరి వారు” తీర్చి దిద్దిన ‘సిరికా కొలను చిన్నది’ - ‘అలివేణీ ఆణి ముత్యమా’ అన్నట్లు ఉన్నది. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి- ఈ నెల ‘ఈ మాట’ ‘ఈ మాసపు పాట’ అంత హాయిగా ఉంది. సేకరించిన శ్రీనివాస్ గారు ధన్యులు.
    -డా. తాతిరాజు వేణుగోపాల్

  6. విజయవర్ధన్ అభిప్రాయం:

    July 22, 2010 1:01 am

    అరుదైన ఈ recordingను పంచుకున్న శ్రీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు

  7. గోపీకృష్ణ అభిప్రాయం:

    July 24, 2010 4:41 am

    రూపకము బాగుంది. Quality of audio is very good.

  8. Rajesh Devabhaktuni అభిప్రాయం:

    August 25, 2010 7:22 am

    ఆహ…! ఎంత చక్కటి సంగీత నాటకం….! ఇంత మంచి నాటకమును అందించినందుకుగాను కృతఙ్ఞతలు…! ఆడియో క్వాలిటీ చక్కగా ఉంది.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a