రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం

ఇంత స్వరూప సాన్నిహిత్యం వున్న ఈ రెండు సంస్కరణల మధ్య చెప్పుకోదగ్గ బేధం ఒక విషయంలో ఉంది. అది, సంస్కృతీకరణ ప్రధానంగా మతధార్మిక సంబంధమైన సందర్భాలలో – సంస్కృత పూజా విధానాలు, కర్మకాండలు, తదితర ఆచారాలు అనుసరించడం ద్వారా జరిగినది. ఇస్లామీయకరణ ఇందుకు భిన్నంగా, లౌకిక రాజకీయ సందర్భాలలో – రాజాస్థానీకుల వేష భాషలు, బిరుదులు తద్వారా, తన ప్రభావాన్ని చూపింది. ఇస్లామీయకరణ యొక్క ఈ లౌకిక స్వభావాన్ని, ప్రత్యేకించి దక్షిణ ఆసియా చరిత్ర పరిశోధకులు గుర్తించడం, గుర్తుంచుకోవడం ఎంతో అవసరం. ఇస్లాం మత ప్రచారానికీ, ఇస్లామీయ సంప్రదాయాల ప్రభావానికి ఉన్న ఈ వ్యత్యాసాన్ని గుర్తించలేక పోవడంతో ఏర్పడిన అపోహ విజయనగర చరిత్రను విశ్లేషించటంలో జరుగుతున్న తప్పిదాలకు కారణ భూతమవుతూనే వున్నది. ఈ అపార్థానికి ఒక విపులమైన ఉదాహరణను ప్రస్తావించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను:

ఇంతకు ముందే చెప్పినట్లుగా హిందూరాయసురత్రాణ అన్న పదానికి కుల్కే “ముస్లిం రాజులలో సుల్తాను వంటి హోదా కలిగిన హిందూ రాజు” గా భాష్యం చెప్పాడు. ఈ భాష్యాన్ని కుల్కే హరిహర బుక్క రాయలిద్దరూ ఒకప్పుడు ఇస్లాం మతాన్ని స్వీకరించారనే ఒక చారిత్రక వాస్తవాన్ని వమ్ము చేయటానికి అనుకూలమైన ఆధారంగా వాడుకున్నాడు. కుల్కే చెప్పిన కథానుక్రమంలో, హరిహర బుక్క రాయలు మొదట వోరుగల్లు రాజైన కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థాన ఉద్యోగులు. ఢిల్లీ సుల్తాను వరంగల్లును ఆక్రమించుకున్న తరువాత, భావి విజయనగర సామ్రాజ్యానికి చేరువలో ఉన్న కంపిలికి పారిపోయారు. కంపిలి కూడా ఢిల్లీ సుల్తాను వశమయినప్పుడు, వీరిద్దరూ సుల్తానుకు బందీలుగా ఢిల్లీలో ఉన్నప్పుడు ఇస్లాం మతానికి మార్పిడి చేయబడ్డారు. అందుకు ఈనాముగా వారిని దక్కను భూమిలో తలెత్తుతున్న తిరుగుబాటును అణచడానికి సుల్తాను పంపించాడు. అయితే, దక్కను చేరగానే, రాయలిద్దరూ, ఇస్లాం మతాన్ని విసర్జించి, తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొని, హిందూ రాజ్యంగా విజయనగరాన్ని స్థాపించారు.

ఈ విధంగా చెప్పి, “హరిహర బుక్క రాయలిద్దరూ, ఇస్లాం తీసుకున్న పక్షంలో అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రకారం సుల్తాను అన్న పదాన్ని హిందూ సందర్భంలో వాడగలిగే ప్రసక్తి ఎంతమాత్రమూ లేదు. ఇస్లాం నిజంగానే స్వీకరించినట్లైతే, ఈ అవమానాన్ని వారిద్దరూ ఒక రహస్యంగానే ఉంచి కాలగర్భంలో మరుగున పడేట్టుగా చూసుకునేవారు. అలా జరగకపోవడం, హరిహర బుక్క రాయలిద్దరూ ఇస్లాం స్వీకరించారన్నది ఒక కట్టుకథగా, ఒక వదంతిగా నిరూపిస్తున్నది” అని కుల్కే తన వాదనను సమర్ధించుకున్నాడు.

కుల్కే వాదనలో గమనించదగ్గ లోపాలు రెండు. ఈ లోపాలు రెండూ కూడా ఇస్లాం మతధర్మ ప్రచారానికీ, ఇస్లామీయకరణకూ గల తేడాను గుర్తించడంలో కుల్కే వైఫల్యాలని చెప్పక తప్పదు. అవి:

1. సుల్తాను అన్న పదం రాచరికార్థంలో కాక మతపరమైన సహజార్ధంగా కుల్కే భావించాడు. ఈ భావనకు ఊనికనిచ్చే ఆధారాలు ఏమీ లేకపోగా సుల్తానుకి ఏ రకమైన మత పరమైన సంబంధం లేదని గమనించగలం. మధ్యకాలిక ఇస్లాం రాజ్యాంగపు ఒక విశిష్టత ఏమిటంటే రాజకీయ, సైనిక అధికారాలను సుల్తానుకు కట్టబెట్టి, మతపరమైన, ప్రార్ధన, బోధలు, మత గ్రంథ విశ్లేషణ తదితరమైన బాధ్యతలపై కలిఫాకు సంపూర్ణాధికారాన్ని ఇవ్వడం (లూయీస్, 1988).

{ఇక్కడ తప్పక ప్రస్తావించవలసిన అంశ ఒకటున్నది: కుల్కే సమీక్ష 20వ శతాబ్దపు చారిత్రకులైన, సూవల్, నీలకంఠ శాస్త్రి, వేంకటరమణయ్య తదితరుల వ్యాఖ్యానాల కలగూరగంప. ఈ వ్యాఖ్యానాలు పరస్పర సంబంధం లేని 14న శతాబ్దపు ఇబ్న్ బట్టూతా, బార్నీ వ్రాసిన పర్షియన్ చరిత్రలు, రాజకాలనిర్ణయము, విద్యారణ్యశకము వంటి సంస్కృత చారిత్రక గ్రంధాలు మాత్రమే కాక కన్నడ జనపద గాధలైన కుమారరామనచరితె, బళ్ళారాయనయుద్ధ తదితర మూలాలనుంచి సంగ్రహించబడి, ప్రస్తుత సామాజిక మతమౌఢ్య మనోభావాలకు వత్తాసు పలికేవిధంగా కలుపు చేయబడినవి. సంస్కృత గ్రంధాలన్నిటిలోనూ హరిహర బుక్క రాయలను పేరుపెట్టి ప్రస్తావించి, ప్రతాపరుద్రుని ఆస్థానానికి, ఆపై కంపిలరాయని ఆస్థానానికీ జోడిస్తాయి. కానీ, ఇవే కాక పర్షియా చరిత్ర పుస్తకాలలో కూడా, కంపిలరాయని ఢిల్లీ సుల్తాను జయించిన సందర్భపు వర్ణనలో ఎక్కడా ఈ రాయల సోదరుల ప్రస్తావన కనపడదు.}

2. ఈ రెండవ లోపం మరింత సమస్యాత్మకమైనది. ఇది కుల్కే ఈ కథను ఒక మతమార్పిడికి సంబంధించిన కథగా చూడడం. ఖచ్చితంగా ఈ కథ మతాంతరపు సంఘటన కాదు. ఈ కథకు మూలాధారాలైన సంస్కృత మాతృకలు – రాజకాల నిర్ణయము, విద్యారణ్య కాలజ్ఞానము – రెంటిలోనూ మతాంతర ప్రస్తావన లేదు. ఈ మాతృకల ప్రకారం, హరిహర బుక్క రాయ సోదరుల విశ్వాసానికి (సత్యసంధతకు) సంతుష్టుడై సుల్తాను కర్నాటక్లో కొంత భాగాన్ని రాయలకు బహుమతిగా ఇచ్చాడు. సుల్తానుచే ఆ విధంగా ఆదేశించబడిన (ఆజ్ఞాప్త) ఆ సోదరులు, తమకివ్వబడిన భూభాగాన్ని సంతోషింగా పాలించుకున్నారు. ఈ గ్రంధాలలో ఈ సన్నివేశాన్ని వర్ణించిన తీరు, వాడిన భాష, ఈ సంఘటనను మతధర్మ పరిధిలో కాకుండా, రాజకీయ పరిధిలో స్పష్టంగా నిలుపుతుంది. అందువల్ల, ఈ ఘట్టాన్ని ఒక బలవంతపు మతమార్పిడిలా (మతధర్మ పరిధికి లోబడినట్టిది) కాక, సంగమ వంశ రాజుల విజయనగర స్థాపన, సుల్తానుకు వారి సేవల ప్రతిఫలంగా భావించవలసి వుంటుంది. ఈ నిష్కర్ష విజయనగర సామ్రాజ్యాన్ని “ముస్లిముల దండయాత్రలకు ఎదురొడ్డి హిందూ ధర్మ పరిరక్షణకు పెట్టని కోటగోడై నిలిచినది”గా మతతత్వ విశ్వాసాల ఆధారంగా వచ్చే భావనలకి కంటగింపుగా ఉండచ్చునేమో కానీ, ఇస్లామీయకరణ ద్వారా పరివర్తనం చెందుతూ పురోగమించిన విజయనగర సామ్రాజ్యానికి చక్కగా ఇముడుతుంది. కుల్కే వాదనలు చెప్పబూనినట్లు ఈ కథ సంగమ వంశ రాజుల ‘హిందూరాయసురత్రాణ’ అన్న ప్రయోగాన్ని వివాదగ్రస్తం చేయదు సరికదా, హిందూ రాజులలో సుల్తాను అన్న ఆ విశేషణపు పూర్తి అర్థాన్ని మనకు తేటతెల్లం చేస్తుంది.

{నాకు తెలిసినంత వరకూ, 14వ శతాబ్దపు బార్నీ, ఇబ్న్ బట్టూతాల వైనంలో మాత్రమే మతమార్పిడి ప్రస్తావన కనిపిస్తుంది. ఇబ్న్ బట్టూతా, కంపిలరాయ నగరంలోకి జొరబడి సుల్తాను సైన్యం రాయ కంపిలుని పదకొండు కుమారులతో సహా పుర ప్రజానీకాన్ని బందీలుగా తీసుకుందని, వారిని ఇస్లాం మతానికి మార్చి, సుల్తాను వారికి ఆమిర్ హోదా నిచ్చాడని స్పష్టంగా పేర్కొన్నాడు. బార్నీ, ఇంత వివరంగా కాకపోయినా, మతమార్పిడి జరిగిందని చెప్తూ మతభ్రష్టత్వ ప్రస్తావన చేస్తాడు. కన్యా నాయక్ బంధువులలో ఒకరిని సుల్తాను కంపిలకు పంపినపుడు అతను ఇస్లాం నుంచి మతంతరం చెంది తిరుగుబాటు చేసినట్టు, తత్ఫలితంగా కంపిల హిందువుల చేజిక్కినట్టూ బార్నీ తన వృత్తాంతంలో రాసుకున్నాడు.}

చివరిగా, పూర్వాధునిక భారత చరిత్రను కేవలం హిందూ-ముస్లిం మతాల సంఘర్షణగా మాత్రమే కాక అంతకంటే విస్తారమైన సాంస్కృతిక మిథశ్చేష్టగా భావించినప్పుడే ఆ కాలపు చరిత్ర లోతునూ, గొప్పదనాన్నీ పూర్తిగా అర్థం చేసుకోగలం. మతధార్మిక ప్రభావం తప్పకుండా ఈ సహచర్యలో ఒక పాత్ర వహించింది. కానీ అది ఏకపాత్ర కాదు; ప్రధానమైన పాత్ర అంతకన్నా కాదు. ఈ పరిశీలనకు అనేక పరిశోధనల ఫలితాలు ఊనికనిస్తున్నాయి. కానీ, తీవ్రవాద మత శక్తుల పడికట్టు ప్రచారాల ప్రభావం వల్ల ఈ విషయం మరుగున పడుతున్నది. ఈ ప్రచారాన్ని, పూర్వాధునిక భారత చరిత్రను, ఆ కాలంనాటి జనజీవనంలోని సంక్లిష్టతలని పరిపుర్ణంగా అర్థం చేసుకోగలగడం ద్వారానే అడ్డుకోగలం. ఈ దిశగా, వాస్తవిక, సాంస్కృతిక, కళారూపాల ఆధారంగా పరిశోధనలు కొనసాగించాలి. విజయనగర రాజాస్థాన వస్త్రధారణ గురించిన ఈ నా ప్రయత్నం ఆ దిశలో ఒక మార్గదర్శకమైన ముందడుగు అవుతుందని ఆశిస్తున్నాను. ఈ పరిశోధన ద్వారా విజయనగర రాజాస్థానపు దుస్తులలో ఇస్లామీయకరణ ప్రభావం ఒక విశ్వవ్యాప్తమైన ప్రక్రమంలో భాగం అని మనం గ్రహించవచ్చును. ముఖ్యంగా, ఈ ఇస్లామీయ ప్రభావం, ముస్లిం దండయాత్రల బలవంతపు ఫలితం కాదనీ, కొందరు క్రియాశీల వ్యక్తులు ఒక నూతన ప్రపంచ పరిణామక్రమంలో తమ ఉనికిని నిలుపుకొని వృద్ధి చేసుకోడానికై, ఉద్దేశపూర్వకంగా తెచ్చుకున్న వ్యూహాత్మక మార్పు అని విశదమవుతున్నది.

(ఫిలిప్ వాగనర్ వ్రాసిన ఈ పరిశోధనాత్మక వ్యాసం ది జర్నల్ ఆఫ్ ఆసియన్ స్టడీస్ (సంచిక 55, సంపుటి 4, పే. 851-880, నవంబర్ 1996) లో ప్రచురించబడింది. ఆసక్తి గలవారికోసం ఈ అనువాదపు ఇంగ్లీషు మూలం ఉపయుక్త గ్రంథ వ్యాస సూచి సహితమైన పూర్తిపాఠాన్ని, అనుబంధంగా ఇస్తున్నాం – సం.)