ఈ సందిగ్ధం తొలగించుకోడం కోసం, ఒక ముఖ్యమైన దృశ్య ఆధారాన్ని పరిశీలిస్తాను. ఈ చిత్రపఠం 17వ శతాబ్దం ద్వితీయార్థానికి చెందిన మదురై రాజాస్థానాపు చిత్రపఠం గా భావిస్తారు. గుడ్డపై రంగుల అద్దకంతో వేసిన ఈ చిత్రం పారిస్‌లో అసోసియేషన్ ఫర్ ది స్టడీ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఏషియన్ టెక్స్‌టైల్స్(AEDTA – Association pour l’etude et la documentation des textiles) వారి సేకరణల్లో ఉంది. పదిహేను, పదహారవ శతాబ్దాల నుంచి ఏ ఆధారమూ లేకపోయినా, మదురై రాజాస్థానం విజయనగరం తర్వాత అధికారంలోకి వచ్చిన వాటిలో ముఖ్యమైనది, కాల రీత్యా చాలా దగ్గరైనదీ కావడంతో, ఈ చిత్రపఠం మనకు ప్రత్యేకాసక్తిని కలిగిస్తుంది. ఈ చిత్రం ద్వారా, విజయనగర రాజాస్థాన వస్త్రధారణా నియమాలలో వ్యత్యాసాలున్నాయనే కాక, వాటి వెనక వున్న సామాజిక సందర్భాన్ని కూడా ఈ చిత్రం సూచనప్రాయంగా తెలియజేస్తుంది.

మదురై రాజ్య కాలపు చిత్రం, 17శతాబ్ది
ఈ చిత్రం రెండు భాగాలుగా ఉంది. రాజప్రాసాదంలో ఒక కులీనుని విలాస కార్యకలాపాలను ఒక కథగా వర్ణిస్తున్నదిగా ఉంది. చిత్రం పైభాగం మొదటి ఘట్టంలో అతను మంగళవాద్యాలు వాయిస్తున్న స్త్రీలు వెంట రాగా అంతఃపురం లోకి ప్రవేశిస్తున్నాడు. రెండవ ఘట్టంలో ఇంకొక గదిలో ఒక శృంగార సమావేశంలో ఉన్నాడు. చివరగా మూడవ ఘట్టంలో రాజప్రాసాదంలో తన సహచరితో ఆసీనుడై, బైట జరుగుతున్న ఒక ఊరేగింపును చూస్తున్నాడు. ఈ ఊరేగింపు మొదట్లో ఛత్రితో అశ్వారోహకుడు, బహుశా యుద్ధం నుంచి తిరిగివస్తున్న రాజకుమారుడో, సైన్యాధ్యక్షుడో ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా మనకు కనిపించేది, ఈ ఇద్దరు రాచరీకుల దుస్తులలో ఉన్న వ్యత్యాసం. అశ్వారూహుడైన వ్యక్తి కబాయి ధరించివున్నట్లు స్పష్టంగా తెలుస్తుండగా, రాజప్రాసాదంలోని వ్యక్తి అనాచ్ఛాదితమైన చాతీతో, ధోవతీ, కండువా ధరించి ఉన్నాడు. ఈ వ్యత్యాసాల ద్వారా ఈ చిత్రపఠం వస్త్రధారణలో ఏ నియమాన్ని సూచిస్తున్నది?
ఈ ఇద్దరు కులీనులూ ఒకే భవన ప్రాంగణంలో ఉన్నా, వీరిరువురి కలాపాలలో బేధం ఉంది. ఒకరు ఆంతరంగిక, విశ్రాంత కలాపాలలో ఉండగా, ఇంకొకరు, సైనిక కవాతులో ఉన్నాడు. జాన్ ఫ్రిట్జ్ (John Fritz, 1984) పదకోశాన్ననుసరించి ఈ విభిన్న కలాపాలను నేను నైవాసిక, ఔద్యోగిక సందర్భాలుగా గుర్తిస్తాను. ఈ చిత్రపఠం ఆధారంగా విజయనగరంలో హైందవ సాంప్రదాకమైన దుస్తులు నైవాసిక కార్యకలాపాలకు, ఇస్లామీయ సాంప్రదాయపు దుస్తులు ఔద్యోగిక బాధ్యతలకి సబబైనవిగా భావించినట్టు తెలుస్తున్నది.
ఈ నైవాసిక, ఔద్యోగిక విభజన వెనుక అంతర్లీనంగా చిరపరిచితమైన, మౌలికమైన ద్వంద్వత కనిపిస్తుంది. అది దేశీయంగా కనీసం ఐదు, ఆరు శతాబ్దాల కాలం నుండి బహిరంగ, అంతరంగ సామాజిక సందర్భాల మధ్య గీయబడిన విభజన రేఖ. ఈ ద్వైదీభావం తెలుగుతో సహా అన్ని ద్రావిడ భాషల్లో నైఘంటికమైంది. తమిళ భాష జంట పదాలైన అకం (అంతరంగిక, గార్హస్తిక) పురం (బహిరంగ, జన సాధారణ) ఇందుకు చక్కని ఉదాహరణ. ఈ ద్వైదీభావం ప్రాచీన తమిళ కావ్య సాహిత్యాన్ని వర్గీకరించడానికి, అర్థం చేసుకొనేందుకు కూడా ఎంతగానో తోడ్పడింది.
{ఏ. కే. రామానుజన్ (A. K. Ramanaujan; 1985, 86) తమిళ సాహిత్యంలో ఈ ద్వంద్వతని వికరణాత్మకంగా ప్రేమ (అకం) – యుద్ధము (పురం) అన్న భావాలలో ఎంతో విపులంగా వివరించాడు. అంతే కాకుండా అకం-పురం వర్గీకరణ ఆధారంగా కన్నడ జానపద సాహిత్యాన్ని ఆకళింపు ఎలా చేసుకోగలమో స్పష్టంగా తెలియ పరిచాడు. ఈ సందర్భాన్ని అతను, “ఈ ద్వైదీభావం ఒక వ్యక్తికీ సమాజానికి మధ్యనున్న విభజన కాదు. ఇది ఒక మనిషి ఆంతరంగిక జీవనానికి, పురజీవనానికీ మధ్య గీసుకున్న గీత. తన కుటుంబంతో నాలుగు గోడల మధ్య ఏకాంత జీవనావరణానికి, అంతకంటే విస్త్రుతమైన ఉమ్మడి కుటుంబము, కులము, వర్గము, సమాజము వంటి ఆవరణాలకు మధ్య చేసుకున్న విభజన”గా గుర్తిస్తాడు.}
ఈ నిర్వచనం ద్వారా, మదురై చిత్రపఠంలోని నైవాసిక, ఔద్యోగిక సందర్భాలని అకం – పురం సామాజికాలుగా చప్పున గుర్తించగలం. అందువల్ల, రాజప్రసాదంలో, ఏకాంతంగా స్త్రీ సాహచర్యంలో ఉన్న వ్యక్తి హైందవ సంప్రదాయపు దుస్తులలో ఉండగా, భవనం వెలుపల అశ్వారూఢుడై, సైనికుల మార్బలంతో చుట్టడి వున్న యోధుడు ‘పురం’ కార్యకలాపాలకు అనుగుణంగా కబాయీ ధరించి వున్నాడు. ఈ చిత్రం ద్వారా మనకు విజయనగర సామ్రాజ్యంలో కూడా హైందవ, ఇస్లామీయ సాంప్రదాల దుస్తులు కలివిడిగా వాడబడేవని తెలుస్తున్నది. అంతే కాక విదేశీ దౌత్యవేత్తలు, చరిత్రకారులు తమ రచనల్లో ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడానికి కారణం కూడా సులువుగానే బోధపడుతుంది – రాజాస్థానంలో పుర సందర్భాలలోనే వారి సమావేశాలు కొనసాగేవి కాబట్టీ, రాజాస్థానీకులు తమ నివాసాలలో ఏ దుస్తులు ధరించారో వారికి తెలిసే అవకాశం లేదు కదా!
ఇస్లామీయకరణ – సంస్కృతీకరణ
చివరిగా, ఇస్లామీయకరణ మరింత నిడివైన సిద్ధాంతంగా వేరే చారిత్రక సందర్భాలను కూడా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే పనిముట్టుగా మార్చే ప్రయత్నం చేస్తాను. ఇస్లామీయకరణని నిర్మాణాత్మకంగా సంస్కృతీకరణ అనే చిరపరిచితమైన ఇంకొక సామాజిక మార్పుతో పోల్చి వాటి మధ్య గల స్వరూప సాన్నిహిత్యాన్ని బేరీజు వేయడం ద్వారా ఈ ప్రయత్నాన్ని మొదలు పెడతాను.
1952లో మొదటిసారి ఎం. ఎన్. శ్రీనివాస్ (M. N. Srinivas; 1916-99), సంస్కృతీకరణ (Sanskritization) అన్న పదాన్ని ప్రవేశపెట్టాడు. అప్పటినుంచీ ఈ పదం సముచితమా కాదా అన్న వివాదం కొనసాగుతూనే ఉంది. అందుకు తోడుగా ఈ పదం భిన్న రూపాంతరాలలో, ఒకదానికొకటి సంబంధం లేనివిగా కనిపించే అనేక ప్రక్రియలలో వాడబడింది. కానీ, కుల్కే (1976) చెప్పినట్టు గానే, ఈ పదానికి ఆధారమైన మౌలిక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రశ్నించినట్టు కనపడదు. శ్రీనివాస్ తన మౌలిక సిద్ధాంతంలో, తదుపరి చర్చల్లో ప్రధాన పాత్ర కల్గిన రెండు పార్శ్వాలను ఎత్తిచూపాడు. ఈ రెండు పార్శ్వాలు, ఇస్లామీయకరణతో పోలికకు ఉపయోగపడేవిగా కనిపిస్తాయి. ఒకటి, సంస్కృతీకరణని నిమ్న వర్గాల ప్రజలు సమాజంలో పై స్థాయికి ఎదగడం కోసం, అనుభవసిద్ధంగా తెచ్చుకున్న మార్పుగా శ్రీనివాస్ నిర్ధారించాడు; రెండు, ఈ స్థానికమైన కట్టుబాట్లు, ఆచారాలను తృణీకరించి వాటి స్థానే ఉత్కృష్టమైన ధర్మంగా భావించబడే సంస్కృత సంస్కృతిలో ఆచార వ్యవహారాలను అనుకరించటం ద్వారా ఈ మార్పు జరిగిందని చూపించాడు. ఈ మార్పులో మొదట ముఖ్యమైనవిగా కనిపించినవి బ్రాహ్మణ కులస్తుల ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలుగా శ్రీనివాస్ (1952లో) ప్రకటించాడు. అయితే, తర్వాత వ్రాసిన పరిశోధనా వ్యాసాలలో సంస్కృతీకరణ, బ్రాహ్మణులను అనుకరించడం మాత్రమే కాదని, ఈ మార్పు బ్రాహ్మణత్వపు పరిధికి వెలుపల కూడా విస్తారంగా జరిగిందనీ ప్రకటించాడు.
శ్రీనివాస్ వాదనలో మరొక ముఖ్యమైన సవరింపు మేరియాట్ (McKim Mariott) 1955లో చేశాడు. ఈ సవరింపు ద్వారా సంస్కృతీకరణ, శ్రీనివాస్ అభిప్రాయపడినట్టు స్థానిక సాంప్రదాయాలను సమూలంగా తుడిచిపెట్టి ఆ స్థానే వచ్చింది మాత్రమే కాదనీ, సంస్కృత సంస్కృతి నుంచి వచ్చిన సాంప్రదాయాలతో పాటుగా స్థానిక సంప్రదాయం కూడా కొనసాగిందనీ మేరియాట్ నొక్కి వక్కాణించాడు. (ఉదా: పల్లెల్లో గ్రామదేవతల మండపాలలో సంస్కృత దైవాలను కూడా ప్రతిష్ఠించటం. కాని పక్షంలో సంస్కృత సాంప్రదాయంలో స్థానిక దేవతలను దర్శించటం, అంటే, గ్రామ దేవతను సంస్కృత దైవానికి ఒక అవతారంగా, ఒక అంశగా పునర్వచించుకోవడం).
విస్తరణలో, నుడికారంలో తేడాలు ఎన్ని వున్నా, మౌలికంగా ఒక రాజ్యాధికారి ప్రపంచ పటం మీద తన అధికారం గుర్తింపబడటం కోసం చేసుకున్న ఇస్లామీయకరణకూ, ఒక చిన్న సామాజిక వర్గం తమ వర్గ స్థాయిని ఉమ్మడిగా సమాజంలో పైమెట్టుకు చేర్చడం కోసం తమ ఆచార వ్యవహారాలు, దైవ మందిరాలలో చేసుకున్న సంస్కృతీకరణకూ, పెద్దగా వ్యత్యాసముందని నేను భావించను. ఈ రెండు చర్యల్లోనూ, ఒక స్థానిక సంప్రదాయం వాడుకలో విస్తారమైన పరాయి సంప్రదాయపు శాదృశ రూపంతో వినిమయింప బడుతున్నది. అంతే కాక ఈ రెండు పద్ధతులలో కూడా ఈ మార్పు ఆ వర్గ (రాజ్య) పురోగమనానికి, అభివృద్ధికీ తోడ్పడేదిగానే ఉంది. ఆసక్తి కలిగించే ఇంకొక విషయం, ఈ మార్పుల వలన స్థానిక సమాజం మరింత విస్తారమైన, విశ్వవ్యాప్తమయిన సాంస్కృతిక సమాజంతో సంభాషించే ఆస్కారం ఏర్పడింది. ఆఖరుగా, విశ్వవ్యాప్త సంస్కృతి, సంప్రదాయాల ప్రభావంతో వచ్చిన మార్పుల వల్ల స్థానిక సంస్కృతి మరింత విశ్వజనీనమయే అవకాశం లభించింది.