రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం

{ప్రాచీన హిందూ కావ్యమూ, శిల్పమూ దేహం గురించిన ధ్యాసలోనే నిమగ్నమైనట్టు కనిపించడం వెనక కారణం ఇదే – శరీరాన్ని ప్రదర్శించడం ద్వారా, ఆ శరీరం కలిగివున్న మానవుని గుణగణాలను విస్పష్టంగా సూచించడం కోసమే. బాణుడి కావ్య కథానాయకుడైన హర్షుని వర్ణన ఈ పరిశీలనకు ఎన్నో సమంజసమైన ఉదాహరణలిస్తుంది. ఉదా: “వైరి సైన్య ఘట్టనకు అదరక అడ్డుకోగల్గిన అతని విశాలమైన వక్షస్థలము, ధృఢత్వముచే అతని వలువలలో ఇమడలేక (ఆకాశమే హద్దు అయినట్లుగా) వేన వేల ఏనుగులు దంతములతో కుమ్మగా వచ్చిన కాఠిన్యము తొలగించలేని నునుపుదనముతో, స్ఫటిక శిఖరముతొ భాసించు కైలాసము వలే నుండెను”. గుప్త బుద్ధుని చిత్రంలో, బుద్ధుడికి కలిగిన జ్ఞానోదయాన్ని సౌష్టవశుద్ధి గలిగిన అవయవాకృతి ద్వారా ప్రదర్శించడం, ఈ పరిశీలనకు ఒక శైల్పిక ఉదాహరణ.}

ఈ హైందవ ధర్మానికి, ఇస్లాం సంప్రదాయం పూర్తి విరుద్ధమైనది. ఇస్లాం మత ధర్మం ప్రకారం అనాచ్ఛాదిత శరీరం లజ్జాపూరితమైనది. దుస్తులు శరీరాన్ని నగ్నత్వం లేకుండా కప్పుకోడానికి దేవుడు ఇచ్చినవని చెప్పబడింది*. కేవలం దుస్తులు శరీరాన్ని కప్పడమే కాకుండా, అవయవాకృతిని బహిర్గతం చేసేట్టుగా బిగుతుగా ఉండకుండా ఒదులుగా కూడా ఉండాలి. శరీరాన్ని పూర్తిగా కప్పుకోవలసిన ఈ ధార్మిక అవసరం, పొడుగాటి అంగీలూ, బురఖాలూ, ఇతర ఇస్లామీయ సాంస్కృతిక చిహ్నాలైన దుస్తులతో చక్కగా తీరుతుంది.

*{ఈ ధర్మం ఖుర్’ఆన్ ద్వారా చెప్పబడింది: “ఆదాము బిడ్డలారా, మేము మీ కోసము, మీ నగ్నత్వమును కప్పుకొనుటకై ఈ ఉడుపులను సృష్టించినాము” (7.27). రియాద్ అల్-సాలిహిన్ అన్-నవా’వీ హడిత్ సంకలనంలో “దుస్తులు, వాటి ముడి పదార్థము, వాటి రంగులు” అనే వ్యాసాంశానికి ముందుమాటగా ఉండటం ద్వారా, ఇస్లామీయ సంప్రదాయంలో ఈ ప్రకరణ యొక్క విశిష్టత మరింత తేటతెల్లమవుతుంది (ఖాన్, 1975).}

వస్త్ర ధారణా ధర్మాలలో ఉన్న ఈ మౌలికమైన విబేధం వల్ల దక్షిణ హిందూ రాజుల కొద్దిమాత్రపు దుస్తులు, ఇస్లామీయ సుల్తానులకు లజ్జావిహీనంగా, అనాగరికంగా అనిపించగలవు. అంతే కాకుండా, హిందూ రాజులలో సుల్తానుగా, ఇస్లామీయ సుల్తానులకు పరిచయం చేయబడినప్పుడు, ఇస్లామీయ సాంప్రదాయం ప్రకారం వేషధారణ రాజుకు గౌరవాన్ని కలిగిస్తుంది. ఈ కారణం వల్లనే, విజయనగర రాజాస్థానంలో కబాయి వాడుక సంస్థాగతమైందని నా అభిప్రాయం. తిమురిద్ కాలపు ఒక ముఖ్యమైన పర్షియా చరిత్ర పుస్తకం, అబ్దుల్ సమర్‌ఖండి రాసిన మత్లా-ఇ సా’దయఁ వ మజ్మాఁ-ఎ-బహ్రెయన్, నా అభిప్రాయాన్ని నిజమని రుజువు చేస్తుంది.

అబ్దుల్ రజాక్ సమర్‌ఖండి (Abd Al-razzaq Al-samarQandi; 1413-82), తిమురిద్ రాజు షా రుఖ్ ఆస్థానంలో ఉన్నతోద్యోగి. 1442లో కాలికట్ సమ్మూతిరి రాజుల ఆహ్వానం మేరకు భారతదేశానికి దౌత్యవేత్తగా పంపబడ్డాడు. కాలికట్లో దిగగానే, స్థానికులు ఈ పర్షియా దౌత్యవేత్తకి చాలా వింతగా కనిపించి ఇబ్బంది పడ్డాడు. మనుషులూ రాక్షసులూ కాని వారిలా ఉన్నారనీ, పీడకలలు తెచ్చేట్లున్నారని కవితాత్మకంగా వర్ణించాడు. సమర్‌ఖండికి ఇంత ఇబ్బంది కలిగించిన విషయం ఏమిటో స్పష్టంగానే తెలుస్తుంది, అది; శరీరాన్ని చాలా తక్కువగా కప్పుతున్న హిందూ దుస్తుల పోకడ. “నగ్నంగా నల్లగా, కొల్లాయి గుడ్డలు నడుము చుట్టూ మాత్రం కప్పుకుని ఉన్నారు. రాజులు కూడా ఈ రకమైన దుస్తులే వేసుకున్నారు. రాజుకీ, బిచ్చగాడికీ తేడా తెలియదు” అని రాశాడు. అంతే కాక అక్కడ ఉన్న ముస్లిం వర్తకులను, “చక్కనైన అరబీ సాంప్రదాయపు దుస్తులు ధరించి, సంబరాలలో మునిగి” వున్నవారిగా వర్ణించడంతో, ఇస్లామీయ ప్రభావం తెలుస్తుంది. అంతే కాక, సమర్‌ఖండికి కాలికట్ రాజాస్థానం నుంచి ఆదరమైన స్వాగతం లభించలేదు. షా రుఖ్ వ్రాసిన లేఖను చదివినప్పుడు కూడా ఏ ఉత్సుకతనూ రాజు చూపలేదని చెప్పుకున్నాడు. ఆ రాయబారం అలా పేలవంగా ముగిసిపోయేదే. కానీ, కాలికట్ కన్నా చాలా విశాలమైనది, బలమైనది అయిన విజయనగర సామ్రాజ్యపు రాజాస్థానం నుండి ఆహ్వానం అందడం ఆ దౌత్యకార్యాన్ని ఒక మలుపు తిప్పింది.

రెండవ దేవరాయ రాయలికి తిమురిద్ దౌత్యవేత్త కాలికట్ విచ్చేసినట్లు తెలియగానే, అతనికి ఆహ్వానం పంపించాడు. సమర్‌ఖండి విజయనగరం చేరగానే అతనికి రాయల రాజాస్థానం ఘన స్వాగతం పలికింది. కాలికట్‌ను ఎంత మొక్కుబడిగా, నిస్తేజంగా వర్ణించాడో, విజయనగరాన్ని అంతే ఉత్సాహంగా, గొప్పగా, చాలా వివరంగా సమర్‌ఖండి వర్ణించాడు. “విజయనగరానికి ఒక ఉత్తముడు, సమర్ధుడు అయిన రాజు ఉన్నాడు. విజయనగర ప్రజలకు ప్రపంచంలోనే సాటి లేరు” అని పేర్కొన్నాడు. రాయలు, తిమురిద్ దౌత్యవేత్తని తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు. తిమురిద్ పాదుషా మాకు దూతని పంపడం సంతోషకరమైన విషయం అని గౌరవం చూపించాడు. వారానికి రెండు సార్లు రాజుతో ఏకాంతంగా సంభాషించే వీలుతో పాటు, చక్కటి వసతి, ఉదారమైన భత్యమూ కల్పించాడు. షా రుఖ్ గురించి ఎన్నో వివరాలు అడిగి మరీ తెలుసుకున్న రాయలు, సమర్‌ఖండికి ఎంతో మర్యాదపూర్వకంగా అనిపించాడు. అన్నిటికంటే ముఖ్యంగా, విజయనగరపు రాజు నగ్నంగా హిందువులా కాకుండా, మేలిమీ జేతూనీ పట్టుతో నేసిన అంగీ ధరించి శరీరాన్ని పద్ధతిగా కప్పుకుని వున్నాడని సమర్‌ఖండి రాసుకున్నాడు. ఇలా సాంప్రదాయ బద్ధంగా దుస్తులు ధరించిన రాజు షా రుఖ్ తో పోలికకు తగినవాడు. ఆ రకంగా తిమురిద్ రాయబారి చేరవలసిన చోటికే చేరి, ‘హిందూ రాజులలో సుల్తాను’ను కనుక్కోగలిగాడు.

ఇస్లామీయ సాంప్రదాయాలను గౌరవించడం వల్ల విజయనగర రాజాస్థానంలోకి కబాయి వచ్చినా, దాని వాడుక మరింతగా వేళ్ళూనడానికి ఇంకో కారణం ఇస్లామీయ సంప్రదాయమైన ఖిల్’ఆత్ – రాజులు రాయబారుల ద్వారా ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం. ఈ సంప్రదాయం, రెండు రాజ్యాల మధ్య దౌత్య సంబంధాలని నిర్ధారిస్తుంది. ఖిల్’ఆత్ లో సామాన్యంగా దుస్తులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ దుస్తులు ఆ రాజాస్థానపు దుస్తులను పోలి అత్యంత ఖరీదైనవి, మేలిమి నాణ్యత గలవీ అయివుంటాయి. ఈ రకమైన ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం ఎప్పటినుంచో హిందూ సాంప్రదాయంలో వుంది. అయితే, విజయనగర రాజుల కాలపు వాడుకలో ఇది ఇస్లామీయ సాంప్రదాయానికి చేరువయింది. పట్టుపంచలు, సుగంధ ద్రవ్యాలు, రత్న హారాలు, తాంబూలం ముఖ్యంగా ఉండే హైందవ సాంప్రదాయం కొంచెం మరుగై, పట్టుపంచల స్థానే మేలిమి పట్టుతో నేసిన కబాయి, తలపాగాల స్థానే కుళ్ళాయి వచ్చి చేరాయి. విజయనగర సైన్యంలో టర్కీ యోధుల దళాలు, వాణిజ్యంలో అరేబియా, పర్షియా మారకులు, ఇరుగు పొరుగు ముస్లిం రాజ్యాల దౌత్యవేత్తలు, విజయనగర ప్రజానీకంలో ప్రధానభాగమైన ఈ కాలంలో ఈ మార్పు మరింత ప్రస్ఫుటంగా రాజాస్థాన సాంప్రదాయంగా మారడంలో అనౌచిత్యమేమీ లేదు.

ఇక్కడ క్లుప్తంగా కబాయి, కుళ్ళాయిల ప్రాధాన్యాన్ని తెలిపే రెండు పుస్తకాలని పరామర్శిస్తాను. ఒకటి, కృష్ణదేవరాయల పాలనను (1509-29) వివరించే 16వ శతాబ్దపు రాయవాచకము. ఈ పుస్తకంలో కబాయి, కుళ్ళాయిలు బహుమతులుగా ఇవ్వబడినట్లు ఎన్నో సన్నివేశాలున్నాయి. మొదటిది, రాయలు తన మహామంత్రి సాలువ తిమ్మరుసుకు ఏడు బహుమతులు (ఉచిత సప్తాంగము – కబాయి కుళ్ళాయి తాళి చౌకట్లు పీతాంబరం గంధ కస్తూరి తాంబూలాదిగా) ఇచ్చి సన్మానించాడు. అలానే, తన ఆస్థాన కవులైన, ముక్కు తిమ్మన, అల్లసాని పెద్దనలకు కూడా ‘కుళ్ళాయి కబాయి తాలి చౌకట్లు పేరులు కోకటాకులు’ ఇచ్చి సత్కరించాడని రాయవాచకం చెప్తుంది. ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం, సాంప్రదాయకంగా నిర్వచింపబడిన ఉచిత సప్తాంగంలో తలపాగా (శిరోవేష్ఠి), పైపంచ (అంబరం) స్థానే కబాయి, కుళ్ళాయి రావడం. రెండవ పుస్తకం, పోర్చుగీసు రాయబారి డొమింగో పేస్ రాసిన చరిత్ర. ఈ పుస్తకంలో లో పేస్ కనీవినీ ఎరుగని రాజ ఔదార్యంతో పాటుగా తన దేశ దౌత్యవేత్త క్రిస్తొబావ్ దె ఫిగైరేదోకి జరిగిన రాచమర్యాదలను విపులంగా వర్ణించాడు. దౌత్యవేత్తకు రాజు, నాణ్యతలో తన దుస్తులనే పోలివున్న కబాయి, కుళ్ళాయిలని, ఇతర ఉద్యోగులకు పట్టుతో నేసిన శాలువాలు బహుకరించాడని పేర్కొన్నాడు. పోర్చుగీసు దౌత్యవేత్తకు ఒక హిందూ రాజు, ఇస్లామీయ సాంప్రదాయపు దుస్తులు బహుకరించడం, విజయనగర రాజాస్థానంలో కబాయి, కుళ్ళాయి స్థానాన్ని తెలుపుతోంది. ఈ విధంగా, ఇస్లామీయ సాంప్రాదాయాన్ని హైందవ సాంప్రాదాయంతో అనుసంధించడం ద్వారా విజయనగర సామ్రాజ్యం విస్తారమైన ఇస్లామీయ ప్రపంచంలో వారితో సమానమైన దౌత్య సంబంధాలని నెలకొల్పుకొని, తనను పటిష్ఠం చేసుకోగలిగింది.

రాజాస్థాన వస్త్రధారణ: నియమాలలో వ్యత్యాసం

విజయనగర రాజాస్థానంలోకి కబాయి, కుళ్ళాయి ఏ రకంగా చొచ్చుకొని పోయాయో ఇప్పటి దాకా నేను వివరించాను. అయితే, నా ఉద్దేశం ఇవి హైందవ సాంప్రదాయ వస్త్రాలను పూర్తిగా తొలగించాయని ఎంతమాత్రమూ కాదు. నిజానికి, విజయనగర రాజాస్థానీకులు, కులీనులు చాలా సందర్భాల్లో హిందూ సంప్రదాయాన్నే తమ వస్త్రధారణలో పాటించేవారని ఎన్నో సాంస్కృతిక చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు ప్రశ్నలు తలెత్తుతాయి: 1. ఈ రెండు సాంప్రదాయాలలో రాజాస్థానీకులు ఎప్పుడు ఏ సాంప్రదాయాన్ని పాటించేవారో తెలుసుకోగలమా? అంటే, వేసుకున్న దుస్తులను బట్టి ఆ సామాజిక సందర్భాన్ని నిర్వచించగలమా? 2. స్థానిక చరిత్రలోనే కనిపించే ఈ ఆధారాలకీ, కబాయీ కుళ్ళాయీ వాడుక అన్ని సందర్భాలలోనూ ఏకరీతిగా ఉండేదన్న అభిప్రాయాన్ని సూచిస్తున్న విదేశీ చరిత్రకారుల సాహిత్యాధారాలకీ సమన్వయం ఎలా సాధించడం?