తలకట్టు గురించి ఈ చరిత్రకారులందరూ ఇంచుమించుగా ఒకటే విధంగా వర్ణించారు. విజయనగర రాజులూ, రాజాస్థానీకులూ జరీ టోపీలు ధరించేవారని, ఇది ఖచ్చితంగా కుళ్ళాయి అని, ఈ వర్ణనలలో తెలుస్తుంది. వెర్తెమా “రాజు ధరించిన కుళ్ళాయి రెండు జానల పొడుగున్నది” అని వర్ణిస్తే, కృష్ణదేవరాయలను (1509-29) దర్శించిన పేస్, “రాయలు తన తలపై గెలీసియన్ కిరీటమును పోలిన టోపీ ధరించినాడని” వివరించాడు. రాజాస్థానీకుల కుళ్ళాయిలు కబాయిల్లాగానే రకరకాల తానులనుంచి కుట్టబడినట్టుగా ఈ చరితల్లో ఉన్నది. పేస్ ముఖ్యంగా కేవలం పురుషులే కాక, రాణివాస పరిచారికలు కూడా ఇవి ధరించేవారని, వీరి కుళ్ళాయిలపై ముత్యాలతో కుట్టిన పూల అలంకారాలు ఉండేవని పేర్కొన్నాడు. ఈ కుళ్ళాయిల తయరీలో కూడా వాడిన గుడ్డ, నాణ్యత ధరించేవారి స్థాయీ స్తోమతలపై ఆధారపడిందిగా మనం ఊహించవచ్చు.
ఈ కబాయి, కుళ్ళాయి విజయనగర రాజుల కాలానికి దక్షిణ భారతంలో ఎవరికి తెలియని వస్త్ర విశేషాలు. నిజానికి, విజయనగర రాజులు వీటిని స్వాగతించి ధరించటం, అప్పటిదాకా ఉన్న రాజాస్థాన వస్త్రధారణా నియమాలకు విరుద్ధంగా తీసుకున్న ఒక విప్లవాత్మక చర్యగా చెప్పక తప్పదు. కబాయీకి ముందు రోజుల్లో, దక్షిణభారత రాజాస్థానీకులు అనాచ్ఛాదితమైన చాతీతో ఉండేవారు. తమ పైశరీరాన్ని కేవలం ఒక నలు చదరపు అంగవస్త్రంతో కప్పుకునేవారు. ఇదే విధంగా, కుళ్ళాయికి ముందు కుట్టిన టోపీల ఉనికి ఎక్కడా లేక, రాజులు సాధారణంగా రత్నఖచిత స్వర్ణ కిరీటాలు ధరించడమూ, రాజాస్థానీకులు తలపాగా చుట్టుకోడమూ సాంప్రదాయంగా ఉండింది. ఈ సాంప్రదాయం విజయనగర సామ్రాజ్యం అప్పటికే ఇస్లామీయ సమాజాల్లో ప్రాచుర్యమైన ఆహార్యాన్ని గ్రహించి తమకు అనువుగా దిద్దుకున్నది. అరబీ ‘కబా’, పర్షియన్ ‘కులా’ లకు, విజయనగరపు కబాయి, కుళ్ళాయిలకు మధ్య వున్న సారూప్యతలే ఇందుకు నిదర్శనం.
పై వివరణ వల్ల విజయనగర సామ్రాజ్యపు రాజాస్థానపు దుస్తులైన కబాయి, కుళ్ళాయి ఇస్లామీయ సమాజాల నుండి వచ్చిన సాంస్కృతిక మార్పులని విశదం అవుతుంది. వెంటనే, ఈ సంప్రదాయం ఖచ్చితంగా ‘ఎప్పుడు’, ‘ఏ విధంగా’ విజయనగర సంస్కృతిలో భాగమయింది అనే ప్రశ్న తలెత్తడం సహజం. కానీ, ఇక్కడ నేను అంతకంటే మౌలికమైన ప్రశ్నను పరామర్శించదలిచాను: విజయనగర రాజులు తమ వస్త్ర సాంప్రదాయంలో ఈ మార్పులు ‘ఎందుకు’ తెచ్చుకున్నారు?
హిందూ రాజులలో సుల్తాను
విజయనగరాన్ని మొదటగా పాలించిన సంగమ వంశ రాజు మొదటి బుక్కరాయల గురించిన ఒక శాసనంలో (1352) అతని స్వీయవర్ణన ఈ విధంగా ఉంది: “సుసంపన్నుడు, మహా మండలేశుడు, శత్రు రాజ దండకుడు, మాట తప్పెడి రాజులను కఠినంగా శిక్షించేవాడు, హిందూ రాజులలో సుల్తాను, ప్రాక్పశ్చిమ సాగరాలకు ఇంద్రుడు, శుభాన్ని కలిగించే వీరుడు” (ఉజ్జాయింపుగా చేసిన అనువాదం. -వాగనర్). ఈ లిఖిత శాసనం విజయనగర రాజుల ‘హిందూరాజులలో సుల్తాను’ అన్న వాడుకకు మొదటి తార్కాణం. చిన్న చిన్న మార్పులతో ఈ బిరుదు వాడుక షుమారు 250 సంవత్సరాలు బుక్కరాయల వారసులలో, తదుపరి విజయనగరాన్ని పాలించిన రాజ వంశాలలో 17వ శతాబ్దం మొదటి దాకా కొనసాగింది.
ఎందరో చరిత్రకారులు ఈ బిరుదుని విశ్లేషించకుండా, వారి వ్యాసాల్లో కేవలం ఉటంకించారు. ఉదాహరణకి, వసుంధర ఫిలియోజట్ (Vasundhara Filliozat, 1973), “ఈ పదం (హిందూరాయసురత్రాణ) క్లిష్టమైనది. పరిశోధకులకు చిక్కును కలిగిస్తుంది. సంస్కృతంలో గానీ, కన్నడంలో గానీ ఈ పదానికి సంతృప్తి కలిగించే అర్థ వివరణ దొరకదు. సురత్రాణ అన్న పదం ముస్లిం బిరుదు అయిన సుల్తానుకు సంస్కృత తత్సమంగా స్వీకరించక తప్పదు. సురతాలు అన్న పదం ఇదే విధంగా కన్నడ భాషలో సుల్తానుకు తత్సమం అవాలి. కేవలం ఈ విధంగానే ఈ పదానికి ఒక సరి అయిన అర్థం వస్తుంది. బహుశా, ఈ బిరుదు బుక్కరాయనికి ఇరుగు పొరుగు ముస్లిం రాజులు ఇచ్చినదిగా భావించవచ్చు”, అని అభిప్రాయపడింది. నాకు తెలిసినంతలో ఈ పదానికి అర్థాన్ని వివరించడానికి ప్రయత్నించిన ఒకే ఒక చరిత్రకారుడు హెర్మన్ కుల్కే (Herman Kulke, 1985) ఇలా రాస్తాడు: “ఈ పదానికి సరి అయిన అర్థం గోచరించదు. బహుశా ఇది విజయనగర రాజులు సాటి రాజులలో తమ ఏకఛత్రాధిపత్యాన్ని ప్రకటించడం కోసం ముస్లిం రాజులనుండి తీసుకున్న ఒక పోలిక కావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి”. ఈ రకమైన నిర్వచనంతో కుల్కే ఈ బిరుదుని ఒక సంగతమైన పదంగా గ్రహించినట్లు తెలుస్తుంది. అంటే సుల్తాను అన్న పదాన్ని ఏ రకమైన సామాజిక సాంస్కృతిక ప్రకరణం లేకుండా వాడిన పదంగా, విజయనగర రాజులు తాము సుల్తానులమని ప్రకటించడం లేదనీ, ముస్లిం పాలకులలో సుల్తానుల హోదాతో సమానమైన హోదా హిందూరాజులలో తమకుందని చెప్పుకోడం వారి ఉద్దేశంగా అనిపిస్తుందనీ కుల్కే వివరణ.
అయితే కుల్కే వివరణకు లొంగని కొన్ని అంశాలున్నాయి. మొదటి అంశం: ఈ వివరణ మొదటి బుక్క రాయలిని ఒక విరోధాభాసమైన స్థితిలో పెడుతుంది. ఒక పక్క హిందూరాజులలో సుల్తానునని చెప్పుకుంటున్నా, ఆ శాసనంలోని మిగతా బిరుదులు అతని సామంత రాజు హోదాలో మాత్రమే నిలబెడతాయి. ఒకరిద్దరు మినహా, సంగమ వంశ రాజులందరూ వారిని వారు మహా మండలేశ్వర, ఓఢియ అని గౌరవించుకున్న వారే కానీ, రాజాధిరాజ, రాజపరమేశ్వర వంటి రాచరికపు బిరుదులను రెండవ హరిహరరాయల కాలందాకా (1377-1404) ఎవరూ స్వీకరించలేదు. కానీ హిందూరాయసురత్రాణ అన్న బిరుదు అప్పటికే కనీసం ఐదు శాసనాల్లో లిఖించబడి ఉన్నది. రెండవ అంశం: బుక్కరాయలి కాలం నాటివే అయిన ఇంకొక రెండు శాసనాలలో హిందూరాయ అన్న విశేషకాంశ లేకుండా అతను కేవలం సుల్తానుగా పొగడబడి ఉన్నాడు. ఇలా హిందూరాయ అన్న విశేషకం లేనప్పుడు ఈ బిరుదు కుల్కే నిర్వచనం ప్రకారం సుల్తానుకు సంగతమైన, సమానధర్మ పదంగా ఎలా అవగలదు? అందువల్ల, ఈ పదానికి వేరొక వివరణ అవసరం తప్పనిసరిగా ఉంది.
నేను ఈ విధంగా ప్రతిపాదిస్తున్నాను: సుల్తాను, హిందూరాజుల్లో సుల్తాను – ఈ రెండు బిరుదులు ఉపమానాలుగా కాక మాటకు మాటగా, ముఖ్యార్ధంగానే వాడబడ్డాయి. అంటే విజయనగర రాజులు తమని తాము సుల్తానులుగానే ప్రకటించుకున్నారు: అయితే ఈ సుల్తానత సాపేక్షికమైన రాచరికపు హోదాకు సంబంధించింది కాదు. ఇది సుల్తానులకున్న ఇస్లామీయ సాంస్కృతిక దృక్పథం ఆధారమైనది. ముఖ్యంగా, హిందూరాజుల్లో సుల్తానును అని ప్రకటించుకున్న రాజుకు ఇస్లామీయ నాగరిక రాజకీయ సమాజంతో పరిచయమున్నది అని, ఇందువల్ల మిగతా రాజులనుంచి ఈ రాజు భిన్నమైనవాడు అని ఈ బిరుదు సూచిస్తుంది. విజయనగర సామ్రాజ్యపు తొలినాళ్ళకే, ఉత్తరభారత దేశం చాలా వరకు ఢిల్లీ సుల్తాను పాలనలో ఉంది. దక్షిణ భారతంలో విజయనగరానికి సరిహద్దుల్లో ఉన్న గుల్బర్గా, బీదార్ (బహమనీ రాజులు, 1347-1527), అహ్మద్ నగర్ (1490-1636), బిజాపూర్ (1489-1686), గోల్కొండ (1512-1687) రాజ్యాలన్నీ, చిన్న చిన్న ముస్లిం రాజుల ఆధీనంలో ఉన్నాయి. అందువల్ల ముస్లిం రాజ్యాలతో కేవలం హిందూ సాంప్రదాయ ధోరణుల్లో రాజ్యాధికారపు ఔరసత్వాన్ని ప్రకటించుకోడం, అంటే రాజుగా తన అధికారాన్ని సాటి రాజులు చట్టబద్ధమని ఒప్పుకొనేలా చేయడం, సరిపోదు. ఈ పరిస్థితుల్లో విజయనగరపు రాజుల చట్టబద్ధతకి ముస్లిం రాజుల అంగీకారం కూడా తప్పనిసరి అయింది. విజయనగరపు రాజులు కేవలం హిందూ ఔరసత్వపు ధర్మాలనే కాక, ఇస్లామీయ ఔరసత్వపు ధర్మాలు కూడా చట్ట సమ్మతమని అంగీకరించగలిగినప్పుడే ఇది పరస్పర సాధ్యం అవుతుంది. ఈ అంగీకారానికి హిందూ రాజుల్లో సుల్తాను అన్న బిరుదు ఒక సంకేతం అవుతుంది.
ఇక్కడ ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి: ఈ కాలం నాటికే, వాణిజ్యపు ఎల్లలు దక్షిణ భారత దేశాన్ని దాటిపోయాయి. నైరుత కర్ణాటక తీరపు భత్కల్ రేవు ద్వారా దక్షిణ చైనా నుంచి పర్షియన్ అఖాతం, ఎర్ర సముద్రపు అంచుల దాకా విస్తరించి ఉన్న ఒక అతిముఖ్య వాణిజ్య రహదారిలో విజయనగరం ఒక ప్రధాన భాగమయింది. దక్షిణ అరేబియా తీరంలో ఆడెన్ నుంచీ, పర్షియన్ అఖాతపు ముఖద్వారం వద్ద ఉన్న హోర్ముజ్ నుంచీ, విజయనగరం తన అతి ముఖ్యమైన మారకాన్ని – మేలిమి జాతి యుద్ధాశ్వాలను – భత్కల్ రేవుకు దిగుమతి చేసుకుని, అక్కడినుంచి విజయనగరం చేర్చేవారు. తమ సైనికావసరాలకు ఇలా దూర తీర వాణిజ్యంపై ఆధారపడిన విజయనగర రాజులకు ఆ ప్రాంతాల రాజ్యాలపై ఆసక్తి ఉండి ఉండాలని అనుకోవడం సహజం. అనుకున్న విధంగానే, ఇరాన్, మధ్య ఆసియాలను పాలిస్తున్న తిమురిద్ వంశ రాజు, సమకాలికుడు అయిన షా రుఖ్ దూత మలబార్ తీరపు కాలికట్ నగరానికి దౌత్యకార్యంపై వచ్చినప్పుడు, రెండవ దేవరాయ రాయలు (1422-46) తన ఆహ్వానాన్ని పంపి సంబంధాల పెంపు కోసం ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో, హిందూరాజుల్లో సుల్తానును అని చెప్పుకోడం, హైందవ పరిభాషను దాటి, ఇస్లామీయ పరిభాషతో సంపర్కం ద్వారా తన రాచరికపు హోదాను వారికి అర్థమయ్యేలా ప్రకటించుకోడం కోసం అయివుండాలి.
{విజయనగర యుద్ధాశ్వాల వాణిజ్యంలో భత్కల్ రేవు పోషించిన ప్రముఖ పాత్రను సంజయ్ సుబ్రహ్మణ్యం (Sanjay Subrahmanyam) తన వ్యాసాల్లో విపులంగా చర్చించాడు. ఈ వ్యాసాలలో విజయనగరం ఒక విశ్వజనీన దృక్పథం కలిగిన నగరంగా గోచరిస్తుంది. పోర్చుగీసు వారి ప్రతిఘటనను తోసిరాజని, 1530ల దాకా కూడా భత్కల్ రేవు నుండి దక్షిణ అరేబియాకు వాణిజ్య నౌకల రాకపోకలుండేవి. 1570 నాటికి భత్కల్ క్షీణించింది; ఇందుకు కారణం, గోవా కేంద్రంగా పోర్చుగీసు వారు చూపుతున్న ఆధిక్యత కన్నా, విజయనగర సామ్రాజ్యం అప్పటికే అంతరిస్తుండడం ముఖ్య కారణం (సం.సు., 1990).}
ఈ పరిశీలన సబబు అయిన పక్షంలో, విజయనగర సంస్కృతిలోకి ఇస్లామీయ కబాయి, కుళ్ళాయిలు సహజంగానూ, తప్పకుండానూ ప్రవేశించడానికి గల రెండు కారణాలను గుర్తించవచ్చును. ఒకటి – కబాయిని ఎంచుకోడంలో ఇస్లామీయ, హైందవ సాంప్రదాయ వేషధారణలో ఉన్న తేడా. ఇస్లామీయకరణకి ముందు హైందవ ధర్మం ప్రకారం, శరీరం మానవుని అస్తిత్వంలో ఒక విడదీయరాని భాగం. మనిషి లోపలి గుణ స్వరూపానికి ఒక బాహ్య సంకేతం. ఈ సాంస్కృతిక సందర్భంలో దుస్తుల ప్రయోజనం శరీరాన్ని కప్పడం, అంటే దాచిపెట్టటం కాదు. దుస్తుల ప్రయోజనం శరీరాన్ని ప్రదర్శించడం, శరీరాకృతికి అనుగుణంగా చుట్టుకొని, శరీరాన్ని బహిరంగపరచటం అవుతుంది.