రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం

హిందూ – ముస్లిం మతాల మధ్య ప్రస్తుతం నెలకొని వున్న రాజకీయ వాతావరణం దక్షిణ ఆసియా చరిత్రను సంకలిస్తున్న ఈ శతాబ్దపు చరిత్రకారులపై ఎంతో ప్రభావం చూపిస్తున్నది. ఈ కాలంలో, ఈ ఇస్లామీయకరణ తరహా ప్రతిపాదనలు కూడా ఇప్పటిదాకా ఎవరూ చేయకపోడం ఆశ్చర్యం కలిగించేది కాకపోయినా, కొట్టొచ్చేట్టుగా కనపడే విషయం. ఒక్క మార్షల్ హాడ్జ్‌సన్ (Marshall G.S. Hodgson) పరిశోధనలలో తప్ప ఇటువంటి ప్రతిపాదనలు మరెక్కడా కనపడలేదు. హాడ్జ్‌సన్ విజయనగర సామ్రాజ్యాన్ని తన వ్యాసాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 1970లో ప్రచురించిన ఒక వ్యాసంలో, “పదహారవ శతాబ్దికల్లా, తూర్పు దేశాల కిరస్తానీ, హిందూ, తేరావాద బౌద్ధ మతాల ప్రజానీకం అంతా కూడా ఇస్లాం సాంస్కృతిక ప్రపంచపు పరిధుల్లోకి వచ్చేశారు. ఇస్లాం సాంస్కృతిక ప్రభావం హిందూ విజయనగరం, నార్మన్ సిసిలీ వంటి సర్వ స్వతంత్ర రాజ్యాలపై కూడా పడింది” అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో, అవిశ్రాంతంగా విస్తరిస్తున్న ఇస్లాం నాగరికత ప్రభావానికి లోనైన ఎన్నో రాజ్యాలలో విజయనగర సామ్రాజ్యం ఒక ముఖ్యమైన సమాజమని హాడ్జ్‌సన్ చేసిన పరిశీలన కూడా గమనించదగ్గది. ఈ పరిశీలన నొక్కి చెప్తున్నది ఏమిటంటే ఇస్లాం సాంస్కృతిక ప్రభావానికి స్వచ్ఛందంగా లోనైనవి స్వతంత్ర రాజ్యాలనీ, ఏ ఖలీఫాకో సామంతులు కారనీ. ఈ ప్రభావం మత ప్రభావం కాదనీ, ఇది లౌకిక లేదా ఐహిక స్థాయిలో వచ్చిన మార్పు అని కూడా తెలుస్తుంది.

హాడ్జ్‌సన్ ఈ మార్పును ప్రత్యేకించి చూపడం కోసం ఇస్లామిక (Islamic) అన్న విశేషణాన్ని మత సంబంధమైన విషయాలకు మాత్రమే వాడుతూ, మతంతో సంబంధం లేకుండా ముస్లిం సమాజాలలోనూ, ముస్లిములు కాని సమాజాల్లోనూ కూడా కనిపించే ఇస్లాం నాగరిక సంస్కృతిని నిర్వచించడానికి కొత్తగా ఇస్లామీయక (Islamicate) అన్న విశేషణం సృష్టించాడు. ఈ పదం ఇస్లామీయక చరిత్రకారులకు ఎంతోకాలంగా పరిచయం ఉన్నా, మతమౌఢ్య భావజాలం సిద్ధాంతాలకీ రాజకీయాలకీ మధ్యనున్న సరిహద్దు చెరిపివేయడం వల్ల దక్షిణ ఆసియా చరిత్రకారులకు తెలియకుండా పోయింది. మతధర్మ సహిత ఇస్లామీకరణకూ, మతధర్మ రహిత ఇస్లామీయకరణకు ఉన్న భేదం చాలా ముఖ్యమైనది. అందువల్ల ఈ వ్యాసంలో నేను హాడ్జ్‌సన్ నిర్వచనం ప్రకారమే ఇస్లామీయకరణ అని ఉపయోగిస్తాను. అందువల్ల, నేను విశ్లేషిస్తున్నది సాంస్కృతిక సంబంధమైనదని స్పష్టమౌతుంది.

కబాయి – కుళ్ళాయి

విజయనగర సామ్రాజ్యపు దుస్తులలో ఇస్లామీయకరణకు ఒక చక్కటి దృష్టాంతం విరూపాక్షాలయంలో (లేపాక్షి, అనంతపురం జిల్లా) 1530ల కాలం నాటి ఒక వర్ణచిత్రంలో ఉంది. ఆలయపు నాట్యమండపం లోకప్పు మీద ఉన్న ఈ చిత్రంలో కొంతమంది రాజాస్థానీకులు వీరభద్రునీ, భద్రకాళినీ పూజిస్తున్నట్టు ఉంటుంది. ఈ చిత్రంలో ఇంచుమించు అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించి ఉంటారు – తెల్లని పొడుగైన కబాయీ అంగీ, పొడుగ్గా కోలగా ఉన్న కుళ్ళాయి జరీ టోపీ. ఈ కాలానికే చెందిన ఎన్నో చిత్రాలలో ఈ దుస్తులు మనకు కనిపిస్తాయి కానీ, ఈ లేపాక్షి చిత్రంలో ఉన్నంత వివరంగా మరెక్కడా ఉండవు.


కబాయీ, ~1530 లేపాక్షి చిత్రం

కుట్టిన తీరులో కబాయి ఒక పొడుగైన అంగీలా కనిపిస్తుంది. చేతులు కొంచెం బిగుతుగా కుట్టివున్నాయి. అంగీ పొడుగు మారుతూ ఉంది, కొందరికి మోకాళ్ళ వరకే ఉన్న అంగీ, మరికొందరికి మడమల దాకా ఉంది. దీనికి కారణమేదో తెలియకపోయినా, పొట్టి కబాయీలు ధరించిన వారు సేవకులుగా, లేదా కింద తరగతి ఆస్థానీకులుగా ఈ చిత్రం ద్వారా ఊహించవచ్చును. అంగీ మెడ వెడల్పుగా, మెడ కప్పు సన్నటి పట్టీలా వెనకకు మడతపెట్టబడి ఉంది. అంగీ నిలువునా ముందు భాగంలో చీలిక ఉండి బొత్తాములు కుట్టినట్టుగా ఉంటుంది. ప్రతీ కబాయి ఒకే రకమైన తెల్లటి సాదా గుడ్డతో కుట్టినట్టుగా ఉంది. నడుము దగ్గర బిగుతుగా కట్టుకున్న దట్టీ మాత్రమే విభిన్నమైన రంగులలో ఉంది.


కుళ్ళాయి, ~1530 లేపాక్షి చిత్రం

లేపాక్షి చిత్రంలో కనిపిస్తున్న కుళ్ళాయి, కోలగా పొడుగ్గా ఉంది. ఈ టోపీ ఒకటిన్నర తలల పొడుగుతో, గుండ్రటి పైఅంచుతో సన్నటి పొడుగైన త్రిభుజాకారపు పొన్నుగుడ్డలను పక్క పక్కనే పేర్చి కుట్టబడి. టోపీ కింది అంచులకు ఏ విధమైన అంచు లేకుండా నేరుగా ఉంది. అయితే చిత్రంలో ప్రముఖులుగా కనిపించే ఇద్దరి కుళ్ళాయిలకు మాత్రం, టోపీ పైనుంచి రెండు జరీ పేలికలు వేలాడుతున్నాయి (వీరిద్దరూ విరూపాక్ష ఆలయ నిర్మాణకులైన వీరన్న, విరుపన్నలని సమాచారం – అను.). కుళ్ళాయి మీద జరీ, పొన్నుగుడ్డల అంచులకు పరిమితమై ఉంది. ఈ చిత్రంలో రెండు రకాల జరీ అల్లికలను మనం గమనించవచ్చు. ఒకటి మూడు రెక్కల కలువుపూలు, ఆకులు కలిగిన తీగ నమూనాతో ఉంటే రెండవది రెండు గోళాల మినారు లాంటి జ్యామిత్తిక ఆకృతితో ఉంది.

లేపాక్షి చిత్రం ద్వారా మనకు ఎన్నో విలువైన వివరాలు లభించినా, కబాయిల ముడిగుడ్డ, ఏ సందర్భాలలో ఇవి ధరించారో తెలిసే వివరాలు లభించవు. విజయనగరాన్ని దర్శించిన విదేశీ యాత్రికుల వ్రాసిన యాత్రానుభవాలలో ఈ వివరాలు ముబ్బడిగా దొరుకుతాయి. విజయనగర కాలం నాటి దక్షిణ భారత దేశపు వేషభాషలు, వ్యవహార సాంప్రదాయాల గురించి ఎంతో విలువైన సమాచారం, స్థానిక చరితల్లో కన్నా ఎక్కువగా, అరబీ, పర్షియా, చీనీ, పోర్చుగీసు, ఇటలీ సందర్శకుల పుస్తకాల్లో దొరుకుతుంది (బహుశా దైనందిన జీవితంలో భాగమైన అంశాలను జనసామాన్యమైనవిగా భావించి స్థానిక సాహిత్యకారులు వాటిపై శ్రద్ధ చూపకపోయి ఉండవచ్చు). నిజానికి ఈ యాత్రా చరితలను ప్రాథమిక జాత్యధ్యయన శాస్త్ర వ్యాసాలుగా భావించవచ్చు. అటువంటి కొన్ని చరితల ఆధారంతో ఈ దుస్తుల గురించి మరికొంత విశ్లేషణ సాధ్యమౌతుంది.

పదిహేను, పదహారవ శతాబ్దాలలో విజయనగరంపై రాయబడిన విదేశీ చరితలన్నిటిలోనూ కూడా మహారాజు, అతని ఆస్థానీకులు అందరూ పొడుగైన అంగీలు ధరించినట్టుగా ఉంది. అయితే, ఆ అంగీ వర్ణన వారికి పరిచయమైన దుస్తుల పోలికలతో ఉండటం కద్దు. ఉదా: 15వ శతాబ్దిలో విజయనగర రాజు దేవరాయ రాయలను దర్శించిన అబ్దుల్ సమర్‌ఖండీ (Abd Al-samarqandi; 1422-46) మహారాజు ‘కాబా’ను పోలిన అంగీ ధరించాడని వర్ణించాడు. రాజు వేసుకున్న అంగీ పల్చగా పావడాలా ఉన్న చొక్కాలా ఉందని వర్తెమా (Ludovico di Varthema; 1502-08), పొట్టిలంగా చొక్కా కలిపి కుట్టిన బజురిని పోలి వుందని న్యూనెజ్ (Fernao Nunez; 1535-37) వర్ణించారు. డొమింగో పేస్ (Domingo Paes; 1520-22) వీరిలో మొదటిగా కబాయి అన్న పదం వాడి, అది నూలు, పట్టు, జరీ ముడిగుడ్డ నుండి కుట్టినదిగా వర్ణించాడు. (ఇది బహుశా అప్పటికే కన్నడ భాషలో ఉన్న పదమయి వుండవచ్చు.) సెసారొ ఫెడెరిచి (Caesaro Federici ~1750) తెలుపే కాకుండా సిందూరపు రంగు కబాయీలనూ, ముఖ్మల్, సన్న పట్టు, డమాస్కు పట్టు, తదితరమైన గుడ్డల నుండి కుట్టబడినవిగా, కబాయి గుడ్డ రకమూ, నాణ్యతా ధారకుని స్థాయి, స్తోమతలపై ఆధారపడి ఉన్నవిగా వివరించాడు. రాజు ధరించిన కబాయి సాధరణంగా మేలిమి పట్టుతో కుట్టబడి గులాబీపూల ముగ్గు బంగారు జరీతో ఉండేవని పేస్, న్యూనెజ్ చరితల్లో ఉన్నది. చివరిగా, ఈ కబాయి వినియోగం పరిమితమని కూడా ఈ చరితల్లో నమోదు చేయబడింది.

వర్తెమా తన చరితలో స్పష్టంగా కబాయి సంపన్న వర్గాల వారు మాత్రమే ధరించేది గానూ, సామాన్యులు అర్ధనగ్నంగా కేవలం మొలగుడ్డతో మాత్రమే ఉండేవారనీ పేర్కొన్నాడు. సంపన్నుల దుస్తు అయినప్పటికీ, కబాయి ధారణ కేవలం విజయనగరం, దాని సామంత రాజాస్థానాల వరకే పరిమితమయింది. ఇందుకు భిన్నంగా మిగిలిన దక్షిణ భారత రాజ్యాలలో, ముఖ్యంగా విజయనగరం నుంచి స్వతంత్రంగా ఉన్న సముద్ర తీరగత రాజ్యాలలో, సాంప్రదాయ హిందూ వస్త్ర ధారణే కొనసాగింది. అబ్దుల్ రజాక్, 1440లలో కాలికట్‌ను పాలించిన సమ్మూతిరిప్పాడ్ వంశస్థ రాజులు మిగతా హిందువల మల్లేనే అర్ధ నగ్నంగా ఉన్నారని రాశాడు. వాస్కో డ గామా (Vasco Da Gama; 1460-1524)చరితల్లో కూడా ఇదే విధంగా ‘గౌరవనీయులైన హిందువులు’ నడుము వరకూ అనాచ్ఛాదితంగా ఉండి, కింది శరీరాన్ని మేలిమి నూలు బట్టతో కప్పుకునేవారని ఉన్నది. చీనీ ముస్లిం సందర్శకుడు మా హుఆన్ (Ma Huan, 1433) కొచిన్, కుయిలోన్, సిలోన్, చివరికి ముస్లిముల సంఖ్య ప్రధానమైన మాల్దీవులలో కూడా ఇదే రకమైన వస్త్రధారణ గమనించినట్టుగా తన జ్ఞాపికలలో రాసుకున్నాడు.