ఎలిపోమను

తొన్నాడు మఠములో పంచాక్షరీ అంటె
పులకించి కనుమూసి మఠమేసుకున్నాను.
పెళ్ళిచూపుల్లోన చూపు కలిపినట్టుగ –
తత్వార్ధ సాధనము ఇలాగే గావాల.
మీదటికి ధ్యానమని పిలిసి కూకుంటేను
వాత నొప్పులు తగిలి ఉష్టబెట్టుకున్నాను.
నడవలేనోడికి బరువులెత్తినట్టుగ –
ఆరంభ శవుర్యము ఇలాగే గావాల.
ఇవ్వాళ ధ్యానమని గురుడు దండిస్తేను
ఒగ్గడియ కూకోని లెగిసెళ్ళిపోతాను.
నట్టింట పాదరసం జారిపోయినట్టుగ –
ఉన్నకాడె ఉండంటె ఇలాగే గావాల.

నీతి చంద్రిక నీను తొలిసుట్టు విన్నప్పుడు
కట్టీసినట్టయ్యి కష్టపెట్టుకున్నాను.
అడివి దున్నకి తెచ్చి పలుపు కట్టినట్టుగ –
అల్లడ తల్లడంటె ఇలాగే గావాల.
మీదటికి నీతులు నియమములు వినుకోని
నా చిత్తానుసారమే నీనుందుననుకున్నాను.
కన్ని తెంచుకు పశువు కలదిరుగుతున్నట్టు –
నీతీ జాతి లేదంటె ఇలాగే గావాల.
ఈయేడు యమ నియమ ధర్మములు చవులుగొని
ఇందలేటున్నాయి బంధనాలన్నాను.
వెలయాలు ఒళ్ళిరిసి వెక్కిరించినట్టుగ –
మబ్బు విడిసిన ఎండంటె ఇలాగే గావాల.

శ్రీచక్ర యోగమని తత్వగురుడంటేను
గొప్ప సాధనమని బోధించుకున్నాను.
మిండగాడు పొద్దుగాల మిడిసి కూకున్నట్టు –
పెద్దవారి ఎచ్చులంటె ఇలాగే గావాల.
శివ తత్వ మార్గమని స్వామి రమ్మంటేను
ఇంకెంత దూరమని ఇదిలించుకున్నాను.
ఈవొడ్డుకావొడ్డు అవుపించనట్టుగ –
అవ్వా బువ్వా అంటె ఇలాగే గావాల.
ఎటు దుక్కు వెల్దుమని ఇప్పుడడిగిన తెన్ను
ఎక్కడికీ ఒద్దురని నిలవరించుకుంటాను.
తెల్లారిపోనిచ్చి దొంగ పడుకున్నట్టు –
ఉడిగిపోవడమంటె ఇలాగే గావాల.

మునుపు సభలోకొచ్చి మాట్లాడమంటేను
తెలివైన వోడినని కులికి మాటాడేను.
అందగత్తె అలాగిలా తిప్పుకోనెల్లినట్టు –
కంచు మోగడమంటె ఇలాగే గావాల.
పడిపూజ భాషణము శెలవియ్యమంటేను
పలుమార్లు వల్లించి విసిగిపోతున్నాను.
గుడ్డోడూ గుడ్డోడూ గెడ్డలో పడ్డట్టు –
పాడిందే పాటంటె ఇలాగే గావాల.
ఈపాలి అచలమును చదవ రమ్మంటేను
హద్దు మీరగలేక అట్టె నిలుచున్నాను.
పంజరములో చిలక పలుకాడబోనట్టు –
ఏమి చెప్పుదునంటె ఇలాగే గావాల.

ఆనాడు వాదములు తలకెత్తుకున్నప్పుడు
అడ్డు చెప్పినవాని అడకించి పంపేను.
ఆవిటికి పుంజుల్ని బరి దించినట్టుగ –
కాలు దువ్వడమంటె ఇలాగే గావాల.
అటుమీద వాదులకి కబురొచ్చినప్పుడు
వాదముల వెనకున్న మర్మములు వెదికేను.
తగుమనిషి సాక్షుల్ని తరచి రమ్మన్నట్టు –
ఆలకించడమంటె ఇలాగే గావాల.
ఈనాడు తగువులకి బయలెళ్ళినప్పుడు
విన్న మాటలనెల్ల విడిసి వస్తున్నాను.
వెర్రోడు ఆడకనే ఈడిగిలినట్టుగ –
అంతా కులాసంటె ఇలాగే గావాల.