అ, న్యాయం
జూలై 13, 2009
వారం రోజులుగా వింటున్న గ్రేప్ వైన్‌కి ఆ సోమవారం తెరపడింది. శుక్రవారం పొద్దున్నే పింక్ స్లిప్పులిస్తారని తెల్సిపోయింది కనక ఎవరు పోతారో ఎవరు మిగుల్తారో అనేదాని మీద తర్జనభర్జనలు మొదలయ్యాయి. కంట్రాక్టర్లు పోతారు సరే కానీ వాళ్ళకిచ్చిన కంట్రాక్టుల వల్ల ఏడాది చివరిదాకా వాళ్ళని కొనసాగించాలి తప్పదు. ఇంకపోతే మిగిలిన ‘ఎఫిషియెంట్’ స్టాఫ్ లో గ్యారంటీగా ముగ్గురు పోయే ఛాన్స్ ఉంది. అందులో ఇద్దరు కొత్తగా చేరినవాళ్ళు కనక వాళ్ళుపోతారు. మిగిలిన పోయే/పోబడే ఒకరూ ఎవ్వరు?
తను జేరి ఆరేళ్ళు కావస్తూంది ఇప్పటికి. తన హెచ్-వన్ వీసా పొడిగించబడి ఆఖరు ఏడాదిలో కుంటుతూంది. లేబర్ ఐపోయినా గ్రీన్ కార్డు రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఇప్పుడు కానీ తనని తీసేస్తే ఇప్పటిదాకా కంపెనీ పెట్టుకున్న లాయర్ ఛార్జీలు, ఇమిగ్రేషన్ ఫీజులకి తిలోదకాలే కనక తనని తీసేయడానికి ఛాన్సు తక్కువేనేమో? ఉద్యోగం పోతే మారుమూల నున్న ఈ లిటిల్ రాక్‌లో నాకేం ఉద్యోగం దొరుకుతుంది? ఎవడు చెప్పొచ్చాడు ఏమి జరుగుతుందో!… ఆలోచిస్తున్నాడు రామారావు.
సాయంకాలం ఇంట్లో అదే డిస్కషన్ మళ్ళీ గీత తోటి. పదేళ్ళ పెద్దమ్మాయి, ఏడేళ్ళ బాబిగాడు ఆడుకోడానికి దగ్గిరకొస్తే కొంచెం చిరాగ్గా ఉన్నా నచ్చచెప్పి వాళ్ళని వాళ్ళ రూములోకి పంపించేడు. ఉద్యోగం పోతే తర్వాతేమిటన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాల్సి వస్తోంది. ఒకటి మాత్రం నిజం. ఎవడి ఉద్యోగం పోయినా ఈ ప్రపంచం అలా పోతూనే ఉంటుంది. ఉద్యోగం నిలబెట్టుకున్నవాడు రారాజు, మళ్ళీ రౌండ్ లే ఆఫ్‌లు వచ్చేదాకానే ఐతే మాత్రం? గంటల తరబడి గీతతో డిస్కషన్ చేసాక మొత్తం మీద తేలిందేమిటి? ఏమీ లేదు. పోవడానికి ఛాన్సు లేదని అనుకోవడానికి బాగానే ఉంది కానీ పోతే? చిరాకెత్తి “పోతే పోనీ. ఇంక దీని గురించి మాట్లాడుకోవద్దు” అంటూ వెళ్ళిపోయేడు రామారావు.
జూలై 17, 2009
పేలవల్సిన బాంబు శుక్రవారం పొద్దున్నే పేలింది. రామారావుక్కూడా ఉద్యోగం పోయింది. బాస్, “నీ గ్రీన్ కార్డు ఎప్పుడొస్తుందో ఏమిటో తెలియదు. అప్పటి దాకా నిన్ను పోషించాలంటే తడిసి మోపెడు అవుతుంది. రామారావ్! నువ్వు బాగా టాలెంట్ ఉన్నవాడివి. నీకు ఇంకో ఉద్యోగం దొరుకుతుందనుకుంటున్నాను త్వరలో. ప్లస్ నీకు వచ్చే ఆరువారాల సెవరెన్స్ పేకేజ్ వస్తుంది. ఏమీ పర్వాలేదు. నీకు రెఫరెన్స్ కావాలిస్తే నేను ఉన్నాను కదా?” అన్నాడు. ఈ మాటలకేం అనుకుంటూ ఆఫీసులో తన సామానంతా ఇచ్చిన బాక్సుల్లో పెట్టుకుని ఇంటికొచ్చేడు. మధ్యాహ్నమే వచ్చేసిన మొగుడ్ని చూసేసరికి జరిగింది గీతకి చెప్పక్కర్లేకుండానే తెల్సిపోయింది.
మౌనంగా అన్నం తినేటప్పుడు గీతతో అన్నాడు రామారావు, “ఆరువారాలదాకా జీతం, బెనిఫిట్సూ అన్నీ ఇస్తారు. ఆ తర్వాత నుంచే అన్నీ చూసుకోవాల్సింది.” ఏమనాలో తోచలేదు గీతకి. “ఆరువారాలంటే సెప్టెంబర్ పదిహేను దాకానా?” తనలో తను అనుకుంటున్నట్టూ అంది. “కాదులే అక్టోబర్ ఒకటి దాకా అని చెప్పేరు, పోనీలే అని మొత్తం సెప్టెంబర్ నెలంతా ఇద్దామనుకున్నారు కాబోలు,” చెప్పి చేయికడుక్కుని లేచిపోయేడు రామారావు.
ఆగస్ట్ 18, 2009
రోజూ పంపించే రెస్యూమెలతో, వచ్చే రిజక్షన్ లెటర్స్ తో ఈమైల్ కోటా తరిగిపోతోంది. గ్రీన్ కార్డు ఉండి ఉంటేనా, అనుకోని రోజులేదు. నాన్న పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఇంట్లోనే వుంటున్నాడని పిల్లలకి కూడా తెల్సిపోయింది. రెస్టారెంట్ భోజనాలు, మాల్ షాపింగులూ, వీకెండ్ ట్రిప్పులూ అన్నీ బంద్! మెల్లిగా సబ్జక్ట్ మీద పట్టు తప్పుతోంది రామారావుకి. ఒకప్పుడు కళ్ళు మూసుకుని డేటాబేస్ మీద స్క్రిప్టు రాసేయగల్గిన రామారావుకి ఇప్పుడు తాను రాసింది కరక్టేనా అనే అపనమ్మకం పొడసూపుతోంది. ప్రాక్టీస్ చేద్దామంటే కావాల్సిన ఒరాకిల్ సాఫ్టువేరు ఇంట్లో లేదు. రామారావు జీవితంలో ఇంకో నెల అలాగే గడిచిపోయింది. ఆగస్టే రామారావు జీవితంలో అత్యంత నిదానంగా గడిచిందేమో?
సెప్టెంబర్ 10, 2009
ఇరవై రోజుల్లో రాబోయే క్రూసిఫిక్షన్ తల్చుకుంటూ లేటుగా పడుకున్నాడు రామారావు. శాలరీ రాకపోయింది సరే ఇప్పుడు అక్టోబర్ నుంచీ మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉండదు. అది కావాలంటే కోబ్రా అనేదాన్ని తీసుకోవాలి. ఎవడు పెట్టేడో కానీ ఈ కోబ్రా పేరు, అది నిజంగానే తాచుపాము లాంటిది. కరిస్తే ఇంక బతకడం కల్ల. ఈ కోబ్రాకి డబ్బులు కట్టాలి అనే ఆలోచనకే ఒళ్ళు గగుర్పొడుస్తోంది రామారావుకి. మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.
ఓ రాత్రివేళ కూతురు లేపింది. “నాన్నా నాకు భయం వేస్తోంది” అంటూ.
“ఎందుకమ్మా? ఏమైంది?”
“ఉరుములు మెరుపులు వస్తున్నాయి. తుఫాను వస్తుంది”
“ఏమీ ఫర్వాలేదు పడుకో” అంటూ అమ్మాయిని దాని రూములోకి నడిపించుకెళ్ళేడు రామారావు. తన బెడ్రూం లోకి వస్తూంటే హాల్లో ఫైర్ ప్లేస్ దగ్గిర ఏదో కదుల్తున్నట్టూ కన్పించింది. దగ్గిరకెళ్ళి చూసేడు. ఏదో సాలీడు. ఇదొకటి ఇప్పుడు. ఈ ఫైర్ ప్లేస్ క్లీన్ చేసి ఉంచుకోవాలి మళ్ళీ స్నో పడేలోపున. పొద్దున్న చూడొచ్చులే అనుకుంటూ వెళ్ళి పడుకున్నాడు.
అరగంట పోయేక మళ్ళీ వచ్చింది కూతురు ఏడుస్తూ, “డాడీ నేనిక్కడే నీ దగ్గిర పడుకుంటా!” అంటూ.
ఈ సారి రామారావుకి తప్పలేదు. పిల్లని మంచం మీద గీతపక్కకి చేర్చి కాసేపాగి తానెళ్ళి హాల్లో కార్పెట్ మీద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు. చిన్నగా పాప గురక వినిపిస్తోంది. అప్పుడే నిద్రపోయిందా? ఎంత అదృష్టవంతులీ పిల్లలు? ఇదేనేమో వాళ్ళు ఈ చీకూ చింతా లేకుండా పడుకో గలిగే వయస్సు, నిట్టూర్చేడు రామారావు. గడియారం పరిగెడుతూనే ఉంది.
సెప్టెంబర్ 11, 2009
గంటలో తెల్లవారుతుందనగా మెలుకువొచ్చింది రామారావుకి. కుడి చెవిలో ఏదో మంట. చిటికిన వేలు పెట్టి అటూ ఇటూ తిప్పేడు. నెప్పి తగ్గేటట్టు లేదు. ఇదెక్కడి కొత్త గోలరా భగవంతుడా అనుకుంటూ మళ్ళీ పడుకోవడానికి ఉపక్రమించేడు. ఓ గంట పోయేక గీత లేచింది. ఎనిమిదికల్లా పిల్లల్ని స్కూలుకి పంపాలి మరి. కార్పెట్ మీద పొర్లుతున్న రామారావుకేసి చూసి, రాత్రి నిద్ర పట్టలేదా? అంటూ బాత్రూంలోకి దారితీసింది. తనూ లేచి పిల్లలిద్దర్నీ రెండో బాత్రూంలోకి తోసి ఇంకో రోజు మొదలెట్టేడు నిరుద్యోగి రామారావు.
పిల్లల్ని స్కూల్లో దింపి వచ్చాక చెప్పేడు రామారావు గీతతో, “ఈ కుడిచెవిలో ఏదో దూరినట్టుంది. బాగా నెప్పి పెడుతోంది. నీళ్ళు పోసాను కానీ నెప్పి తగ్గలేదు.”
మధ్యాహ్నం రెండింటికి మొదలైంది రామారావుకి అసలు ప్రహసనం. ఒళ్ళంతా దద్దుర్లు లేచాయి ముందుగా. పిల్లలిద్దరూ స్కూల్ నించి వచ్చేసరికి రామారావు కాళ్ళు కదపలేని స్థితిలో హాల్లో కార్పెట్ మీద పడి ఉన్నాడు. గీత కంగారుగా గుండె మీద చెయ్యివేసి చూసే సరికి గుండె విపరీతంగా కొట్టుకుంటోంది. మెల్లిగా లేపి సోఫా మీద పడుకోపెట్టి ఎమర్జన్సీకి ఫోన్ చేయడానికి వెళ్ళేసరికి రామారావుకి డోకులు మొదలయ్యాయి. ఆంబ్యులెన్స్ వచ్చేసరికి రామారావు వేసుకున్న చొక్కా పూర్తిగా తడిసిపోయి కళ్ళు తేలేసి ఉన్నాడు. గీతనీ పిల్లల్నీ తర్వాత కార్లో రమ్మని రామారావుకి తీసుకుని, చెవులు గింగిర్లు ఎత్తే సైరన్ గోలతో ఆంబులెన్స్ సెయింట్ మేరీ ఆస్పత్రికి సాగిపోయింది.
“అమ్మా నాన్నకేమైందే?” అడిగేరు పిల్లలు బేలముఖంతో.
“తెలీదర్రా. ఇప్పుడు మనం హాస్పటల్కి వెళ్దాం. అక్కడ డాక్టర్ చెప్తారు.” అంది కంగారుగా కారు తాళాలు చేతిలోకి తీసుకుంటూ.
ఎమర్జన్సీ వార్డులోకి వెళ్ళగానే గీతనీ, పిల్లల్నీ ఒక రూములో కూర్చోపెట్టి నోరు విప్పేలోపుల బయటకెళ్ళిపోయింది నర్సు. కాసేపటికి ఒక డాక్టర్ లోపలకి వచ్చాడు. వస్తూనే “మీరు రామారావుకి ఏమవుతారు?” అన్నాడు.
“నేను రామారావు వైఫ్ ని. వీళ్ళిద్దరూ మాపిల్లలు.”
“ఓ ఐ సీ. నా పేరు డాక్టర్ స్టీవ్ సాండర్స్. మీకు ఇక్కడ చుట్టాలు ఎవరైనా ఉన్నారా సహాయంగా?”
ఈ పాటికి కొంచెం బెదురు పుట్టుకొచ్చింది గీతకి. “ఎందుకండీ? రామారావుకి ఏమీ ఫర్వాలేదు కదా?” డాక్టర్ సాండర్స్ గీత చేతులు మెల్లిగా వణకడం గమనించేడు.
“పిల్లల్ని బయట ఉన్న ప్లే ఏరియా లో ఉంచి రండి. నేను చెప్తాను.”
పిల్లల్ని బయట వదిలి రాగానే డాక్టర్ గదిలోకి వచ్చేడు. ఈ సారి నర్సు కూడా ఉంది ఒక గ్లాసు మంచినీళ్ళతో.
“అయాం సారీ గీతా, రామారావు ఇక్కడకొచ్చేసరికే, బహుశః ఆంబ్యులెన్సులో అయ్యుండొచ్చు, పోయాడు. ఇంకా మరణం ఎలా వచ్చిందో తెలియదు. కానీ అటాప్సి చేసి పేథాలజిస్ట్ మీకు వివరణ ఇవ్వగలరు. అయాం ట్రూలీ సారీ.”
ఒక్కొక్క పదం సమ్మెట దెబ్బలా పడుతూంటే కుప్ప కూలిపోయింది గీత. నర్సు డాక్టర్ సహాయంతో గీతని లేపి కూర్చోపెట్టి మొహం నీళ్లతో తుడిచింది. పావుగంట కూర్చున్నాకా నూతిలోంచి మాట్లాడుతున్నట్టూ అడిగింది గీత. “మేము ఆయన్ని చూడొచ్చా?”
“తప్పకుండా. కానీ ఇక్కడ ఇంకో గంట కన్నా ఉంచము. మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పిలుద్దాము. ఓ గంట పోయాక బాడీ మోర్గ్ లోకి మార్చవల్సి ఉంటుంది. కానీ ప్రాణం పోవడానికి కారణం కావాలంటే మాత్రం పేథాలజిస్ట్ రిపోర్ట్ వచ్చేదాకా ఆగాలి. దానికో రెండు మూడు రోజులు పట్టొచ్చు…” చెప్పుకుపోతున్నాడు డాక్టర్ తన ధోరణిలో.
తెల్సిన ఇంకో తెలుగు ఫేమిలీని పిలిచి మిగతా తతంగం కానిచ్చేడు డాక్టర్. రామారావు బాడీని మోర్గ్ లోకి చేర్చి అటాప్సీకి ఆర్డరిచ్చేరు. అదైనా లైఫ్ ఇన్స్యూరెన్సుకి పేపర్లు పంపించాలి కాబట్టి. తర్వాత వారం ఎలా గడిచిందో దేముడికెరుక. గీతకా ఉద్యోగం లేదు. ఉండడానికి వీసానూ లేదు. పిల్లల్ని స్కూల్ మానిపించేసింది. జీవితమే పోతుంటే స్కూల్ ఒక అడ్డా? తను నించున్న నేల రెండుగా విచ్చుకుపోయి లోపలకి కూరుకుపోతున్న భావన. తోటి తెలుగువాళ్ళు ఆదుకోకపోయి ఉంటే ఏమై ఉండేది… ఆ ఆలోచనే భయంకరంగా ఉంది.