పసిఁడిపల్లకి
మనుచరితంబుఁ బెద్దన సుమంజులనూత్నకవిత్వఫక్కికం
దనపనుపున్ గ్రహించి తుదిదాక సమాప్తము జేసెనన్న శో
భనమగు వార్త చారసమవాయము దెల్పఁగ మెచ్చి, తత్కవిన్
ఘనముగ సత్కరించు పథకంబుఁ దలంచి మనంబునందునన్.
ఆ మహితాత్ముని గొనిరాన్
శ్రీమహితుఁడు కృష్ణరాజసింహుం డంపెన్
చామీకరవిరచిత నా
నామణిగణఖచితనూతనాందోళంబున్.
వినయసమాహితాత్ములగు వీరభటావళు లప్సరోంఽగనా
మణులకె నృత్యగీతముల మర్మము దెల్పఁగఁజాలు నర్తకీ
మణులు, సువాసినీమణులు మానితరీతిని దోడురాఁగ నా
మణిమయయాప్యయానము సమాదృతి మీరఁగఁ గొంచు నేఁగియున్
బ్రహ్మతేజము మీరు ఫాలభాగమునందుఁ
దిరునామదీప్తులు మెఱయుచుండ,
ఎత్తుబాహులయందు బెత్తెడంచుల జరి
యుత్తరీయపుకాంతి యోలగింప.
వెడదయురమ్ముపై నిడుపైన యజ్ఞసూ
త్రద్వయవిద్యుతుల్ దనరుచుండ,
మల్లెపూడాలుకుం జెల్లెలై విలసిల్లు
తెల్ల దోవతికాంతి యుల్లసిల్ల,
బదరికాశ్రమంబున నున్న వ్యాసు వోలె
కోకటాగ్రహారంబునఁ గొలువుదీఱు
నాంధ్రకవితాపితామహు నరసి వారు
ప్రభుని పన్పును దెల్పిరి ప్రణతులగుచు.
నర్తకీమణుల్ లాస్యవిన్యాసమెసఁగ
కవిగళంబున సుమదామకంబు నిడిరి;
మంగళంబులు వాడి సుమంగళులును
రాజు పన్పును దెల్పిరి రాజకవికి.
ఇభగమనల్, భటాళి వచియించిన వాక్యము లాలకించి, సం
ప్రభవితమోదచిత్తుఁడయి “వల్లె” యటంచును బల్కి, కృష్ణభూ
విభుని మహాదరంబునకు విస్మయహర్షము లుప్పతిల్లఁగా
శుభదినమొండు సూచి కవిసోముఁడు పైనముగట్టె నేఁగగన్.
ధవళపట్టంబరంబునఁ దనదు కృతినిఁ
జుట్టి, స్వర్ణపేటికయందుఁ బెట్టి దాని,
హైమపల్యంకికాసీనుఁడయ్యె నతఁడు
పద్మపీఠికఁ గూర్చున్న బ్రహ్మవోలె.
ముందరఁ జేరి సుందరు లమోఘముగా నటియించుచుండ, నిం
పొందఁగ నైదువల్ భవికమోహనగీతము లాలపింపఁగన్,
స్కంధములందు నెత్తికొని స్వర్ణమయంబగు యాప్యయానమున్
ముందుకు సాగినారు భటపుంగవులంతట సాధుసాధుగన్.
ఇట్లు వారలు విజయపురీంద్రమందు
అంతిమావరణంబును నందుకొనిరి;
ఆవరణపాలకుల్ వారి నచట నిల్పి
ప్రభున కెరిగించిరంతట వారి రాక.
అంతకు మున్నె చారతతు లా కవిలోకమణీప్రయాణవృ
త్తాంతము గంటగంటకును ధాత్రిపువీనుల నూదియుండుటన్
సాంతము చేసియుండె నృపచంద్రముఁ డా కవిచంద్రు నాగమం
బెంతొ ఘనంబుగా జరుపు నిచ్ఛను గట్టడులెల్లఁ దొల్లిగన్.
అన్నరనాథచంద్రుఁడపు డద్రిసమున్నతహస్తిపృష్ఠసం
పన్నసువర్ణమందిరసమంచితపేశలపట్టుపీఠిపైఁ
జెన్నుగఁ గూరుచుండి కవిసింహు నెదుర్కొన నేఁగె నాట్యపుం
గన్నెలు మంత్రులున్ బుధులుఁ గట్టికలుం జనుదేరఁ దోడుగన్.
అట్లు పరివారసంయుతుం డగుచు వేగఁ
గవివృషభునికి నెదురేఁగి కౌఁగిలించి,
కేలొసఁగి ప్రియమార నె క్కించుకొనియె
భద్రగజముపైఁ దనతోడ పార్థివుండు.
“జయజయ రాజ! రాజపరమేశ్వర! శాత్ర
వేశభీదాయక! కృష్ణరాయ!
జయజయ కవిరాజ! సరసచతుర్విధ
కవితాకళత్ర! చొక్కయసుపుత్ర!
జయము మహారాజ! జంభారిసన్నిభ
శ్రీమహస్సముదాయ! కృష్ణరాయ!
జయము సత్కవిరాజ! స్వర్గురూపమసుధీ
సాంద్ర! నందపురవంశాబ్ధిచంద్ర!
జయము ద్రవిడాంధ్రకర్ణాటసార్వభౌమ!
జయము సంస్కృతాంధ్రకవితాసార్వభౌమ!
జయము కృష్ణరాయనృపేంద్ర! జయము! జయము!
జయము పెద్దనసుకవీంద్ర! జయము! జయము!”
అనుచుఁ గట్టికవారు సంస్తుతు లాలపించుచునుండఁగన్
గొనబుగా రమణీగణంబులు గొండ్లిసల్పుచునుండఁగన్
పణవవేణుమృదంగగీతులు ప్రస్ఫుటంబగుచుండఁగన్
చనెను ముందున కా సమాజము సంతసం బెద నిండఁగన్.
“చూడవే సింగారి! సురచక్రవర్తియే
కృష్ణుఁడై నేడు సందృష్టుఁడయ్యె!
పరికింపవే భామ! సురగురుండే నేడు
పెద్దనాకృతి నొంది ముద్దులొల్కె!
కాంచవే కనకాంగి! కంఠీరవోజస్సె
ప్రభువురూపమునొంది ప్రకటమయ్యె!
తిలకింపవే జాణ! నళినజుతేజస్సె
కవిరూపముం గొంచుఁ గానుపించె|”
అనుచుఁ బౌరాంగనామణుల్ ననలవానఁ
గురియుచుండఁగ సాగెను కువలయేశ
కవిగణేశుల పయనంబు కక్ష్యలెల్ల
పూలబాటలై విలసిల్లఁ జాలఁజాల.