ఆముక్తమాల్యద – కృష్ణదేవరాయల నవ్య రాజనీతి

ఆముక్తమాల్యదలోని రాజనీతిలో నిరాసక్తతతో కూడిన తాత్వికదృష్టి కనబడుతుంది. ఈ కింది పద్యంలోని ద్వంద్వ ప్రతిపాదనలను చూడండి:

చంపి ధార్మికుండు సతిఁ బొంది మఱి బ్రహ్మ
చారి బొంకి సత్యశాలి యార
గించి సదుపవాసి కేడించి శూరుఁడు
చింది ధనియు నగు విచిత్ర సరణి (278)

రాజు యుద్ధంలో చంపినా ధార్మికుడే; సతులున్నా బ్రహ్మచారియే; అబద్ధమాడినా సత్యశాలియే; చక్కటి భోజనం ఆరగించినా ఉపవాసియే; ఉపాయాలతో గెలిచినా కూడా శూరుడే; దానం చేసినా ధనవంతుడే, విచిత్రమగు రీతిలో.

లోకధర్మం వేరు, రాజధర్మం వేరు అన్న విషయం ఈ రచయితకు స్పష్టంగా తెలుసు. ఇవేకాక, ఈ రాజనీతి విభాగంలో పాత నీతిశాస్త్రాలలో కనిపించే విషయాలు ఎన్నో కనిపిస్తాయి: బలవంతుడైన పొరుగు రాజులతో ఎలా ఉండాలి? బలహీనుడైన రాజుతో ఎలా ఉండాలి? న్యాయపాలన ఎలా చేయాలి? చారులను, భటులను ఎలా చూసుకోవాలి? తన కిందివారికి ఏ విధమైన బహుమానాలతో తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి? మొదలైన విషయాలపై చర్చ ఇందులో కనిపిస్తుంది. రాజులకు మంత్రులకు మధ్య ఘర్షణ ఏర్పడితే ఆ తగవును ఎలా పరిష్కరించాలన్నది కరణాలు రాసిన ఎన్నో పుస్తకాలలో సర్వసామాన్యంగా కనిపించే విషయమే. అదే విషయాన్ని ఈ రాజనీతి విభాగంలో రాజుగా తన దృష్టితో చూసి రాసిన ఈ పద్యాలని చూడండి:

చదివి యధర్మ భీరు నృప శాస్త్ర విధిజ్ఞతల న్వయస్సు డె
బ్బదిటికి లోను నేఁబదికి బాహ్యమునై యరుజన్స్వపూర్వులై
మద మఱి రాజు ప్రార్థన నమాత్యతఁ గైకొని తీర్చు పాఱువా
రొదవిన నంగము ల్మిగుల నూర్జితమౌటకుఁ బూటసాలదే

అట్టి మంత్రివర్గంబు దొరకదేని

నీతిన్ దాని తలంచి చేయఁ బని గానీ కాకపోనీ బల
వ్రాతార్థాఢ్యత నెమ్మి నుండ కొరుఁ బ్రోవన్మంత్రి యంచుం గుణా
తీతున్ గుమ్మడికాయ యంత యగుముత్తెంబై మనంబేర్పన
ట్లే తా నాతని చేతిలో బ్రదుకువాఁడే యౌఁ జుమీ మీఁదటన్ (211-213)

శాస్త్రాలన్ని చదివి, అధర్మము పట్ల భీతితో రాజశాసనాన్ని విధిగా అనుసరించేవాడు, వయస్సు 50-70 మధ్య ఉండి, వంశపారంపర్యంగా వచ్చే రోగాలు లేనివాడై, నిగర్వియైనవాడు, రాజు ప్రార్థిస్తేనే అమాత్యపదవిని ఒప్పుకునే బ్రాహ్మణుడు లభిస్తే అతని ద్వారా రాజ్యాంగాలను బలిష్టం చెయ్యడానికి ఒక్కపూట చాలదా?

ఒకవేళ అటువంటి మంత్రివర్గము దొరకకపోతే – నీతిని తానే యోచించి అమలుపరచాలి. తనకంటే గొప్పవాడు కదా అని ఎవడినో ఒకడిని నియమిస్తే, గుమ్మడికాయంత ముత్యాన్ని ధరించిన వాడు మోయలేక బాధ పడినట్లు తాను బాధ పడక తప్పదు.

చతుర్థాశ్వాసపు చిట్టచివరి పద్యాలలో ఒకటైన ఈ కింది పద్యంలో తన రాజనీతి సారాంశమంతా గుదిగుచ్చినట్లు ఇలా అంటాడు:

చేయునది రాజ్యమఁట యఘ
మే యవధిగ నీగువారమే మనఁ జన దా
మ్నాయంబు నశక్యాను
ష్ఠేయముఁ జెప్పదు స్వశక్తిఁ జేయుగఁ జెప్పన్ (284)

రాజ్యమేలడానికి పాపపు పనులు చేయాల్సి వస్తుందని గాని, ఆ పాపాల నుండి బయటపడలేమని గానీ తలపకూడదు. వేదశాస్త్రాలు సాధ్యంకాని ధర్మాన్ని విధింపవు. నీ శక్త్యనుసారంగా ధర్మాన్ని ఆచరించమనే అవి చెబుతాయి.

ఉపసంహారం

ఆముక్తమాల్యద రాజనీతి విభాగంలో ఒక రకమైన వైరుధ్యం మనకు కనబడుతుంది: ఒక పక్క రాజతంత్రత గురించి లౌకిక పరమైన రాజనీతిని బోధిస్తూనే మరో పక్క పారమార్థికతను ఉగ్గడిస్తూ రాజ్యాన్ని, రాజభోగాలను త్యజించడమే రాజు యొక్క పరమావధి అని ఉపదేశించడం మనకు కనిపిస్తుంది. అయితే, శ్రీవైష్ణవ తత్త్వాన్ని రాజనీతికి కూడా వర్తింపజేస్తే ఈ రకమైన వైరుధ్యాన్ని తేలికగానే వివరించవచ్చు. శ్రీవైష్ణవ సిద్ధాంతాల ప్రకారం సృష్టి అంతా పరమేశ్వరుని భోగ స్థానమే. అందుచేత రాజరికాన్ని ఒక సామాజిక ధర్మంగా, మోక్షసాధనను ఒక వైయుక్తిక ధర్మంగా వేరుచేసి చూడాలి. రాజు తన జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు రాజభోగాలను త్యజించి సన్యసించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆముక్తమాల్యద కావ్యంలో ఈ రకమైన దృక్పథానికి వ్యతిరేకత కనిపించక పోగా, యోగులైన రాజుల పట్ల అమితమైన ఆరాధనా భావం కనిపిస్తుంది. అంతమాత్రం చేత రాజరికపు సమస్యలకు సన్యాస యోగమే సమాధానమని ఈ కావ్యంలో ఎక్కడా చెప్పలేదు. కాంటరోవిట్జ్ (Ernst Kantorowicz)చెప్పిన ద్విదేహ సిద్ధాంతం ఇక్కడ ప్రతిపాదించాడని చెప్పడానికి ఆస్కారం లేకున్నా, శ్రీవైష్ణమతానుసారమైన ఇహలోక వాస్తవతత్త్వం ప్రాధాన్యత సంతరించుకొని, రాజు తన ధర్మాలను విడనాడి భక్తి వైరాగ్యాల దారి పట్టకుండా ఆపుతుంది.

కృష్ణదేవరాయల రాజనీతి ప్రభావం తన తరువాతి విజయనగర రాజలపైనే కాక ఇతర సామ్రాజ్యాలపై ఉందని చెప్పుకోవచ్చు. మొగల్ కవి అబుల్ ఫైజ్ రాసిన నల దమయంతి చరిత్రలో కూడా ఇదే విధమైన రాజనీతి చర్చ కనబడడం యాదృచ్ఛికం కాకపోవచ్చును. అలాగని అబుల్ ఫైజ్‌కు ఆముక్తమాల్యదతో పరిచయం ఉందని చెప్పలేము. ప్రస్తుతానికి కృష్ణదేవరాయలు చర్చించిన రాజనీతి సమస్యలు మధ్యయుగంలో అమిత ప్రాధాన్యత సంతరించుకున్నాయని, ఆనాటి రాజకీయ, సామాజిక, తాత్విక చింతనను ఆముక్తమాల్యద ఒక కళాత్మకమైన రూపంగా మనకు అందిస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు.

(వెల్చేరు, షూల్మన్, సుబ్రహ్మణ్యం వ్రాసిన ఈ పరిశోధనాత్మక వ్యాసం సౌత్-ఇండియన్ హొరైజన్స్, ఫ్రాఁస్వా గ్రోస్ 70వ జన్మదిన సందర్భ సన్మాన సంకలనంలో (South-Indian Horizons, Felicitation volume for Francois Gros. Edited by Jean Luc Chevillard and Eva Welden, A Department of Indology publication – 94, French Institute of Pondicherry, 2004) ప్రచురించబడింది. ఆసక్తి గలవారికోసం ఈ అనువాదపు ఇంగ్లీషు మూలం పూర్తిపాఠం, రాజనీతి విభాగం పూర్తి అనువాదంతో సహా అనుబంధంగా ఇస్తున్నాం – సం.)


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి:

వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు.

 ...


డేవిడ్ షూల్మన్

రచయిత డేవిడ్ షూల్మన్ గురించి:

డేవిడ్ షూల్మన్ (David Shulman) జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీలో తులనాత్మక మతధర్మశాస్త్ర విభాగంలో ఆచార్యుడిగా, దక్షిణ భారతదేశపు భాషలు, సాహిత్యం తదితర అంశాలపై పరిశోధిస్తున్నారు. 1976లో లండన్ యూనివర్సిటీ నుండి పిహెచ్.డీ. 1987 మెక్ఆర్థర్ ఫెలోషిప్ గ్రహీత. ఇజ్రాయెల్ అకాడెమీ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ గౌరవసభ్యుడు. ఇజ్రాయెలీ, పాలస్తీనీయుల ఉమ్మడి శాంతి దళం సభ్యుడిగా ఇరు దేశాల మధ్య శాంతి, సామరస్యాల కోసం కృషి చేస్తుంటారు

 ...