పొరుగువారితో వాణిజ్య సంబంధాలే కాక, దేశ ఆర్థిక ఔన్నత్యానికి కావలసిన మౌలిక వసతులు, వనరులు కల్పించి దేశాన్ని సుభిక్షంగా ఉంచడం చాలా ముఖ్యమని ఈ కింది పద్యం చెబుతోంది:
దేశ వైశాల్య మర్థసిద్ధికిని మూల
మిల యొకింతైన గుంటగాల్వలు రచించి
నయము పేదకు నరిఁ గోరునను నొసంగి
ప్రబలఁ జేసిన నర్థ ధర్మములు పెరుఁగు (236)
దేశ ఆర్థిక సిద్ధికి మూలమైన భూమి కొంచమైనా, తటాకాలు, కాల్వలు నిర్మించి పేదవారికి పన్నులు కట్టడంలో వెసులుబాటు కలుగజేసి వారు వృద్ధి పొందటానికి అవకాశం కల్పిస్తే, దేశములో ధర్మార్థములు కూడా వృద్ధి చెందుతాయి.
ఇది శ్రీవైష్ణవ మతానుసారమైన కొత్త రాజనీతికి ప్రతీక. భోగానురక్తులకు బాహాటంగానే ప్రోత్సహించే తత్త్వనీతిసారం. తరువాతి కాలంలో, అమిత భోగలాలసత్వానికి ప్రాధాన్యత ఇచ్చిన నాయక రాజుల రాజతంత్రం ఒక రకంగా విజయనగర రాజనీతి ప్రభావ ఫలితమనే చెప్పవచ్చు. (నాయకరాజుల భోగలాలసత్వం పై మరిన్ని వివరాలకు వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్మన్, సంజయ్ సుబ్రమణ్యం రాసిన Symbols of substance: Court and State in Nayaka-Period Tamilnadu పుస్తకం చదవండి.)
ఎచ్చో గజఘోటక్రయ
తచ్చర్వణసుభటజీవి తద్విజసురపూ
జోచ్చనిజభోగముల కగు
వెచ్చము వెచ్చంబు గాదు విత్తంబునకున్ (262)
ఏనుగులు, గుర్రాలను కొనుటకు, వాటిని మేపుటకు అయ్యే ఖర్చు, మంచి భటుల జీతాలకు, బ్రాహ్మణులకు, దేవతల పూజలకు, రాజుల ఉన్నతమైన భోగాలకు అయ్యే ఖర్చు దుర్వ్యయమని తలపరాదు.
రాజుల జీవితంలో భక్తి, వైరాగ్యాలకు కూడా ప్రాధాన్యత ఉంది కాని, అది సరైన సమయంలో ఆచరించవలసిన ఆశ్రమ ధర్మం. రాజ సింహాసనం అధిష్టించి, రాజ్యపాలన జరిపే సమయంలో రాచరికపు భోగాలను త్యజించాలనుకోవడం అర్థం లేని పని. ఈ రకమైన దృక్పథం శ్రీవైష్ణవ మతం బోధించే వాస్తవిక తత్త్వ ప్రభావమే. ప్రజలు ముఖ్య అనుభోక్తగా భావించే రాజే రాజ్యసుఖాలను అనుభవించకపోతే ఇక ఆ ప్రజలు ఏ రకంగా సుఖానురక్తులై ఉండగలరు?
తనుభృశ దమనజ సుకృతము
ధనదత్తినె కొనఁగవలయుఁ దత్తదృతుకమ
ర్దన మజ్జన భోజన లే-
పన వసన ప్రసవ వహనపరతం బతికిన్ (280)
తన తనువును మిక్కిలి ఉపవాసాలతో శోషింపజేసి సంపాదించే పుణ్యమును ధనమును దానం చెయ్యడం ద్వారా కూడా పొందవచ్చు. అందువలన ఏయే కాలాలకు అనుకూలమైన మర్దన, స్నాన, భోజనాలను, లేపనాలు, వస్త్రాలు, పుష్పాలతో కూడిన సేవలను స్వీకరిస్తూ రాజు ఆయాకాలాలలో సుఖాలను అనుభవించాలి.
నిజానికి, ఈ విభాగంలో ఒక్కోసారి రాజు శరీరానికి, రాజ్య భూభాగానికి అంతరం లేకుండా ఒకదానికి మరొకటి ప్రతీకలుగా వాడడం గమనించవచ్చు. శరీరపరంగా, రాజ్యపరంగా ప్రతి విశేషణానికి రెండురకాలుగా అర్థాలు వచ్చేటట్టు ఉభయాన్వయంగా నడిపించిన ఈ అద్భుతమైన పద్యాన్ని చూడండి:
తద్‌జ్ఞ మండలిఁ గూర్చి ధాతువుల్ దెలిసి హే
మాదులఁ గొని ప్రకృత్యనుగుణాల్ప
జీవనాహృతులచేఁ జెలఁగి మహాబలో
ద్రేకంబు మర్దన రిత్తఁ జేసి
స్నేహార్ద్రుఁ డగుచు నశేషంబుఁ బోషించి,
నరవర్ణముల తప్పు సరణు లుడిపి
సతతద్విజ ప్రతిష్ఠాశాలియై బలి
యించుపట్టులు బలియించి పలుచఁ
జేయ పట్టులు పలుచఁగాఁ జేసి తేజ
మొసఁగ శోధన మఱవక యొసఁగ వలయు
సాంగ రాజ్య మొకెత్తుగ స్వాంగ రాజ్య
మొక్క యెత్తుగ నృపతి యా యుష్యపరత (270)
శరీర పరంగా: వైద్యులను (తద్‌జ్ఞ మండలి) కలసి, సప్త ధాతువులను తెలుసుకొని సువర్ణ భస్మము మొదలగు వానిని పుచ్చుకొని (హేమాదులన్ గొని), తన శరీర ప్రకృతికి అనుగుణంగా మిత భోజన స్వీకరణతో, వాతము యొక్క ఉద్రేకాన్ని మర్దనతో అణగించి, నూనె పూసుకొన్న (స్నేహార్దుడు: స్నేహ=నూనె + ఆర్దుడు=పూసుకున్న వాడు) వాడై, అన్ని అంగాలను పోషించి, నెరసిన రంగులను (నరవర్ణముల) మాన్పి (ఉడిపి), ఎల్లప్పుడు దంతములయొక్క (ద్విజ) ఉనికిని కాపాడువాడై (ప్రతిష్ఠాశాలియై), చేతికండలను (బలియించు పట్టుల) బలిసేటట్టు చేసి (బలియజేసి), నడుమును, కడుపును సన్నగా చేసి (పలుచజేయు పట్టుల పలుచజేసి), తేజస్సు కలుగునట్లుగా మరువక దేహశుద్ధి (శోధన) చేసుకొని వర్థిల్లాలి (ఎసఁగ వలయు) ఆయుర్వృద్ధి కోసం (ఆయుష్య పరత).
రాజ్య పరంగా: అభిజ్ఞులను (తద్‌జ్ఞ మండలి) కలసి, సువర్ణాది జనకములైన ధాతువులను తెలుసుకొని, వానిని పుచ్చుకొని (హేమాదులన్ గొని), ప్రజల ప్రకృతికి అనుగుణంగా మితమైన పన్నులతో, ప్రబల శత్రువు యొక్క ఉద్రేకాన్ని మర్దనతో అణగించి, స్నేహర్దుడై, సమస్త ప్రజలను పోషించి, బ్రహ్మణాది వర్ణముల యొక్క (నరవర్ణముల) తప్పు సరణులు మాన్పి (ఉడిపి), ఎల్లప్పుడు ద్విజుల ప్రతిష్ఠలను కాపాడువాడై (ప్రతిష్ఠాశాలియై), దుర్గముల (బలియించు పట్టుల) బలోపేతం చేసి (బలియజేసి), మధ్యదేశమందలి అడవులను పలుచగా చేసి (పలుచజేయు పట్టుల పలుచజేసి), తేజస్సు కలుగునట్లుగా మరువక శోధన చేసుకొని వర్థిల్లాలి (ఎసఁగ వలయు) రాజ్య ఆయుర్వృద్ధి కోసం (ఆయుష్య పరత).
పై పద్యం రాజు రాజ్యాన్ని ఎలా చూసుకుంటాడో తన శరీరాన్ని అలాగే పరిరక్షించుకోవాలి అని చెప్పటం ద్వారా ఆ రోజుల్లో రాజదేహానికి ఇచ్చిన ప్రాముఖ్యతను వెల్లడి చేస్తుంది. తిరుపతి వంటి వైష్ణవ దేవాలయాల్లో దేవుని విగ్రహాలంకరణలకు ఇచ్చే ప్రాముఖ్యత కూడా వైష్ణవ మతస్తుల దేహప్రాధాన్యతను తెలుపుతుంది. విజయనగర రాజులగురించి విపులంగా రాసిన పోర్చుగీసు వారి రాతలలో కూడా ఈ విషయం స్పష్టమౌతుంది. 1510లో కృష్ణదేవరాయల గురించి పేస్ రాసిన ఈ వాక్యాలు చూడండి:
The king is accustomed to drinking a quantity (quartilho: three-quarter pint) of sesame oil every day before daylight, and he anoints himself all over with the said oil; he covers his loins with a small cloth, and takes in his arms great weights made of earthenware, and then, taking a sword, he exercises himself with it till he has sweated out all the oil, and then he wrestles with one of his wrestlers. After this labour he mounts a horse and gallops about the plain in one direction and another till dawn, for he does all this before daybreak. Then he goes to wash himself, and a Brahmin washes him whom he holds sacred, and who is a great favourite of his and is a man of great wealth …” (English translation from Sewell, A forgotten Empire, p, 241)
అంతకు ముందే కృష్ణదేవరాయలను వర్ణిస్తూ పేస్ రాసిన దాన్ని బట్టి రాయలు ఆజానుబాహుడేమీ కాదని, స్ఫోటకపు మచ్చలున్న ముఖంతో కొంత స్థూలకాయుడేనని మనకు తెలుస్తోంది. అయితే, పేస్ వర్ణనలో రాయలు మంచి రంగుగల దేహంతో ఎప్పుడూ అహ్లాదకరమైన చిరునవ్వుతో ఉండేవాడని కూడా తెలుస్తున్నది. పొరుగువారైన పోర్చుగీసు వారిచేత కూడా రాజులలో ఉత్తముడిగా, ధర్మ ప్రభువుగా కీర్తింపబడటం రాయల గొప్పతనాన్ని చాటుతున్నది.
పేస్ వర్ణనలలో రాయలు ఆదర్శవాదిగా కాక, ఆచరణాత్మకమైన క్రియాశీలిగా మనకు కనిపిస్తాడు. తన పనులను తన కింది అధికారులకు అప్పజెప్పి రాజ భోగాలలో, సాహితీ గోష్టులలో మునిగి తేలే రాజు కాదు రాయలు. పేస్ మాటల్లోనే, రాయల దినచర్య ఇలా ఉండేదట:
Thence he goes to a building made in the shape of a porch without walls, which has many pillars hung with cloths right up to the top, and with the walls handsomely painted (…). In such a building he dispatches his work with those men who bear office in his kingdom, and govern his cities, and his favourites talk with them. The greatest favourite is an old man called Temersea [timmarusu] he commands the whole household, and to him all the great lords act as to the king. After the king has talked with these men on subjects pleasing to him he bids enter the lords and captains who wait at the gate, and these at once enter to make their salaam to him (Sewell, A forgotten Empire, 241-242).
రాజు తన దేహాన్ని ప్రతినిత్యం వ్యాయామాలతో యుద్ధరంగంలో పాల్గొనడానికి అనువుగా పుష్టిగా ఉంచుకున్నా, ఆముక్తమాల్యద రాజనీతి ప్రకారం రాజు తనంతట తానుగా యుద్ధంలో పాల్గొనవలసిన అవసరం లేదు.
ధరణిపుఁ డెందునేఁ దగదు తాఁ జన నూఱట కొక్కనిం దగుం
దొర నొనరించి వంప నరి దుర్బరులుచేఁ జెడఁ డాతఁ డర్థభూ
కరితురగర్థి లేక కొఱ గాఁడటు సేయ ద్విజాన్యుఁ డల్క కౌ
నెరపు నతండునున్ వలయు నిండిన దుర్గబలోర్వి యీఁ దగున్ (255)
రాజు తనంతట తానే శత్రువు వద్దకు వెళ్ళకూడదు. తన సహాయకులలో ఒకరిని అధిపతిగా చేసి పంపుట యుక్తము. శత్రువు బలహీనుని చేత సాధింపబడడు కావున ఆ అధికారికి కావలసిన ధన, భూ, హస్త, తురగాదులను ఇవ్వు. అబ్రాహ్మణునికి ఇటువంటి అధికారం ఇస్తే జయించిన రాజ్యం తనదేనంటాడు. కాబట్టి బ్రాహ్మణ అధికారికి దుర్గాదులిచ్చి అదుపులో పెట్టుకోవాలి.
అయితే, శ్రీకృష్ణదేవరాయలు ఈ సలహాను తానే పూర్తిగా పాటించలేదు. బీజాపూర్ పై చేసిన దండయాత్రలో కృష్ణదేవరాయలే స్వయంగా పాల్గొన్నట్టు మనకు తెలుస్తోంది. అయితే, రాయల అల్లుడైన అరవిదు రామరాయలవలే కృష్ణదేవరాయలు తెలివితక్కువగా ప్రతి యుద్ధంలో పాల్గొన్నాడని చెప్పడానికి వీలులేదు. అరవిదు రామరాయలు 1550లో, 1560లో జరిగిన యుద్ధాలలో స్వయంగా పాల్గొని, చివరకు 1565 యుద్ధంలో హతమార్చబడ్డాడన్న విషయం మనకు తెలిసిందే.