ఆముక్తమాల్యద – కృష్ణదేవరాయల నవ్య రాజనీతి

రాజనీతి: విశ్లేషణ

పైన చెప్పిన నైతిక సాహితీ సంప్రదాయాలు, చారిత్రక పరిణామాల నేపథ్యంలో కూర్చబడ్డ ఆముక్తమాల్యద రాజనీతి విభాగంలోని పద్యాలను కొన్నింటిని విపులంగా పరిశీలిద్దాం.

స్థానిక నాయకుల, సామంత రాజుల నియంత్రణే కాకుండా స్వతంత్రంగా జీవనం సాగించే ఆటవిక జాతి ప్రజలను ఎలా అదుపులో ఉంచాలన్న విషయచర్చ కూడా ఆముక్తమాల్యదలో కనిపిస్తుంది. ఉత్తర, ఈశాన్య సరిహద్దులలో నివసించే మన్య ప్రాంత ప్రజలే కాక, నైరుతి దిశలోని కొడగు (కూర్గ్) ప్రాంత ప్రజలు, పశ్చిమ కనుమలలో నివసించే ఆటవికులను దృష్టిలో ఉంచుకొని ఈ పద్యాలు రాసి ఉండవచ్చు.

క్షమఁ గుఱుమన్నెపుం గహనచారి జనంబెడ దోషదృష్టి కు
డ్యము గడుంగంగఁ బూన్కి; దెగ దల్గిన సర్వము; బాస నీగి వ
శ్యముగ నొనర్ప దాడి కగు; నౌ గడి కొల్లలకు; న్శతాపరా
ధమును సహస్రదండము నతర్క్యము సర్వము నేలువానికిన్ (257)

మన్నెం జనం చాలా తప్పులు చేస్తారు. వాళ్ళను దండించి మార్చాలనుకోవటం మట్టిగోడను కడగటం లాంటిది. బహుమానాలిచ్చి, నిజం తప్పకుండా మెలిగి, వాళ్ళతో స్నేహం చెయ్యి. నీ యుద్ధాల్లో వాళ్ళు బాగా సహాయపడతారు.

ఆముక్తమాల్యదలో చెప్పిన రాజనీతి ఒక సామ్రాజ్య నిర్మాణానికి అవసరమైన రాజనీతి. అనుభవజ్ఞుడైన రాజు, తన దశాబ్ద కాలపు స్వానుభవాలను సాలోచనగా మనకు చెబుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని సార్లు, రచయిత చెప్పే నీతులు లోకవిరుద్ధంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, ఈ కింది పద్యంలో దుర్గములకు సేనానులుగా బ్రాహ్మణులనే నియమించమని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

దుర్గములాప్త ద్విజవర
వర్గమునకె యిమ్ము; దుర్గవత్తత్తతి క
త్యర్గళ ధరాధిరాజ్య వి
నిర్గత సాధ్వసత పొడమ నిలుపకు కొలఁదిన్ (207)

ఆప్తులైన ద్విజులను దుర్గములకు అధిపతులుగా నియమించు. అయితే, ఈ దుర్గాలను కాపాడుకోవడానికి ఎంత అవసరమో అంత సైన్యాన్ని మాత్రమే ఇవ్వు. నివారింప శక్యము గాని సైన్యాధిపత్యం వారికి ఇవ్వటం వలన వారు నీ పట్ల భయము లేకుండా మసలే అవకాశం ఉంది.

అనాదిగా క్షత్రియ ధర్మాలుగా భావించే సేనాధిపత్యాన్ని బ్రాహ్మణులకు ఇవ్వమనడం విశేషం. అయితే, ఆనాటి ఇతర రాజుల గురించి, రాజ్యాల గురించి, ఆ కాలపు పౌరుష్యశాస్త్రాన్ని గురించి అధ్యయనం చేస్తున్న నేటి పండితులకు ఈ నీతి సబబుగానే తోస్తుంది. ఇటువంటి దృక్పథాన్నే వివరించే మరో పద్యం చూడండి:

బాహు జాంఘ్రిజ ముఖ విడంబనకు నయినఁ
గొలిచి మనువిప్రధర్మంబు దెలిసి యైనఁ
బూని సంకటముల నిల్చుఁ గానఁ దఱచు
బ్రాహ్మణునిఁ బ్రభుఁ జేయుట పతికి హితము (217)

క్షత్రియ, శూద్రుల అపహాస్యానికి వెరచియైనా – విప్రధర్మము, మను ధర్మము తెలిసిన వాడుగా – సంకటపువేళలలో పూని నిల్చువాడు కాబట్టి బ్రాహ్మణుడిని ప్రభువుగా నియమించుట రాజుకు హితమే.

అంతేకాక, బ్రాహ్మణ ధర్మము స్థానిక ప్రాంతీయ భేదాల నుండి కొంత స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి వారిని నియంత్రించడం కొంత సుళువు. అదీకాక, ఈ పాటికి బ్రాహ్మణులు వైదికకర్మలేకాక, యుద్ధవిద్యలలోను, ఇతర లౌకిక కర్మలలోనూ ఆరితేరిన వారౌతున్నారు. పీష్వా బ్రాహ్మణులు మరాఠ రాజ్యాన్ని ఏలిన 18వ శతాబ్దానికి ముందు రోజులివి. 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబు వద్ద భూమి శిస్తు వసూలు పనులతో మొదలుపెట్టి, చివరకు యుద్ధరంగంలో పాల్గొన్న అక్కన్న, మాదన్నలు, ఆరోజుల్లో బ్రాహ్మణులు క్షాత్రధర్మాన్ని కూడా నిర్వర్తించారని చెప్పడానికి మరో ఉదాహరణ.

అయితే, బ్రాహ్మణులపై చూపించే ఆదరణ, వారు తన వ్యవస్థకు లోబడి ఉన్నంతవరకే కాని వారికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించేదిగా ఉండకూడదు. చాలా ప్రసిద్ధమైన ఈ కింది పద్యం చూడండి:

అక్షర పక్షపాతమున నర్థము నూళ్ళ నొసంగి, నుబ్బునన్
భిక్షుజటాధరాదికులు భిన్న నిజవ్రతులౌదు; రైన దు
ర్భిక్షరుజా శిశుచ్యుతులు పెక్కగు; భక్తియు చాలు, దానఁ ద
త్ప్రక్షుభితత్వ మేయఘముఁ దార్పదు, శంకఁ దలంగు మియ్యెడన్ (242)

అక్షర పక్షపాతముతో ధనాన్ని, ఊళ్ళను ఇస్తే పొగరుతో ఉబ్బిపోయి భిక్షువులు, జటాధరులు నియమాలు పాటించని వారౌతారు. అలా కావడంతో దుర్భిక్షము, వ్యాధులు, బాలారిష్టాలు పెరుగుతాయి. కాబట్టి వారి పట్ల భక్తి చాలు. వారు క్షోభపడుటవలన ఏ పాపము కలుగదు. సందేహపడకు.

పై పద్యం ముఖ్యంగా మఠాధిపతులను దృష్టిలో ఉంచుకొని రాసినట్టుగా అనిపిస్తుంది. ఈ పద్యం పదిహేను-పదహారవ శతాబ్దపు కాలంలో మఠాధిపతులకు, రాచరిక వ్యవస్థకు మధ్య ఉన్న ఘర్షణను ఎత్తిచూపుతుంది. శృంగేరి మఠానికి, విజయనగరానికి మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధంపై మరిన్ని వివరాలకు హెర్మన్ కుల్కే (Hermann Kulke) రాసిన Maharajas, Mahants and Historians: Reflections on the Historiography of Early Vijayanagara and Sringeri ని చూడవచ్చు.

ఇంతే కాక, ఆముక్తమాల్యద కావ్యంలో విస్తరిస్తున్న విజయనగర సామ్రాజ్యాన్ని సూచించే పద్యాలు మనకు కనిపిస్తాయి. కొత్త ప్రాంతాలను, ప్రజలను తన రాజ్యంలో కలుపుకోవటంలో ఉండే సాధకబాధకాలను రాయలు కొన్ని పద్యాల ద్వారా మనకు సూచిస్తాడు. ఈ సామ్రాజ్య విస్తరణతో పాటు ఇతర రాజ్యాలతో, దేశాలతో ఆర్థిక సంబంధాలు, సరకుల ఎగుమతి, దిగుమతితో కూడిన వాణిజ్య సంబంధాలు పెరిగాయని చెప్పవచ్చు. అందుకే ఒక పద్యంలో పొరుగుదేశాల వర్తకులను గౌరవంగా చూసుకోవాలని, ఓడరేవులను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెబుతాడు. పొరుగుదేశాలవారితో సముద్ర వర్తకమంటే భయపడే ఇతర రాజ్యాలకు భిన్నంగా విజయనగర రాజులు సముద్ర వ్యాపారం చేసేవారని పోర్చుగీసు ఆధారాల ద్వారా మనం ధ్రువపరుచుకోవచ్చు.

రేవు ల్మావు మతంగజంబును మణిశ్రీఖండముక్తాదియున్
రా, వాణిజ్యము పెంచి యేలఁగ నగు; న్వర్షంపు టెవ్వన్ రుజన్
హావళ్ళిన్ దిగు నన్యభూప్రజల రా జాయాయిజాత్యౌచితిన్
బ్రోవంగాఁదగుఁ; దోఁట దొడ్డి గను లాప్తుల్చూడఁ బంపందగున్ (245)

రేవులకు గుర్రాలు, ఏనుగులు, రత్నములు, చందనము మొదలగు పరిమళ ద్రవ్యములును, ముత్యములు వచ్చునట్లుగా వాణిజ్యము పెంచి పోషించాలి. క్షామము చేత, రోగము చేత, అలసట చేత దిగు అన్య దేశ ప్రజలను రాజు వారి వారి జాతికి తగినట్లుగా రక్షించాలి; తనకు ఆప్తులైన వారికి తోటలు, దొడ్లు, గనులు మొదలగు బహుమానాలతో పరామర్శ చేయుటకై పంపుట యుక్తము.

ఈ రకమైన ఆదరణ చూపడంలో రాజు అమాయకత్వమేమీ లేదు. ఆ రోజుల్లో సముద్ర వ్యాపారానికి, యుద్ధరంగంలో విజయాలకు ఉన్న అవినాభావ సంబంధం మనకు తెలిసిందే. న్యూనెస్ (Fernao Nunes) 1530లో రాసిన లేఖల ఆధారంగా విజయనగర రాజులు మేలిమి జాతి గుర్రాలని విదేశాలనుండి దిగుమతి చేసుకునే వారని తెలుస్తుంది. సాళువ నరసింహరాయలు తనకు కావల్సిన గుర్రాలని హోర్ముజ్ నుండి, ఏడెన్ నుండి తెప్పించుకొనేవాడని, అందుకు ప్రతిగా ఆ వర్తకులకు వారు అడిగినంత ధనం ముట్టజెప్పేవాడట. న్యూనెస్ కృష్ణదేవరాయల గురించి రాస్తూ, “ఈ రాజు పదమూడు వేల హోర్మూజ్ గుర్రాలని తెప్పించుకొని, అందులో నాణ్యతగల గుర్రాలని తన గుర్రపుశాలలో వినియోగించాడు” అని పేర్కొన్నాడు. ఈ కింది పద్యం న్యూనెస్ చెప్పిన అభిప్రాయాన్నే దృవీకరిస్తున్నదని చెప్పవచ్చు:

సింధుర మహాశ్వముఖ్యము ల్చేర్చు దౌల
దీవి వణిజుల కూళ్ళు సద్గృహములు పురిఁ
గొలుపుఁ దేజంబు వెల మేలు గలుగఁ బ్రాఁత
వారిఁగాఁ జేయు మరి నవి చేరకుండ (258)

ఏనుగులను, గొప్ప గుర్రాలను మొదలగువానిని తెచ్చునట్టి దూర ద్వీప వర్తకులకు ఊళ్ళు, నీ పట్టణాలలో మంచి ఇండ్లు, కొలువును, బహుమానాలను అందించు. వారికి మంచి ధర ఇచ్చి వారి వస్తువులు నీ శత్రువులకు చేరకుండా నీకు చెందేట్లుగా చేసుకో.