మళ్ళీ ఇన్నాళ్ళకి
సౌందర్య కీర్తనా, ప్రేమ ప్రకటనా
మోయలేక విఫలమైన అక్షరం
ఏ కాలపు, ఏ దేహపు మడతల్లోనో ముడుచుకుని -
ప్రియా, మళ్ళీ ఇన్నాళ్ళకి ఇంకో ప్రేమ కవిత
ఉవ్వెత్తున లేచిన వెచ్చటి నెత్తుటి ఉప్పెన
మోహాల దేహాలకు నేర్పిన అయస్కాంత భాషకు
చేజిక్కీ చిక్కదు అర్థం అవతలనే
ప్రియా, అంతా వొట్టి జ్ఞాపకం
లోలోపల ఏ దీపం ఎప్పుడు వెలిగిందో
జ్ఞాపకాల మిణుగురులు అంటుకుని
వేడిమి లేదు; అయినా
ప్రియా, ఈ వెలుతురు చాలు మనకు
రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారు. పదమూడేళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ... పూర్తిగా »
rama bharadwaj అభిప్రాయం:
May 2, 2010 12:55 am
జ్ఞాపకాల మిణుగురులు అంటుకుని దీపాలు వెలగవు.ఆడంబరం ఎక్కువ తప్ప అనుభవం అందివ్వని కవిత ఇది.
రమ.
nagarajuavvari అభిప్రాయం:
May 4, 2010 7:55 am
అయ్యా,
అన్నింటికిమించి గ్రంథాలయం శీర్షికన మీరు పొందుపరచిన వివిధ కవుల సాహిత్యము నన్ను ఎంతగానో ఆకర్షించింది.ఇది కండ్లకు అద్దుకోదగిన ప్రయత్నం
కామేశ్వర రావు అభిప్రాయం:
May 6, 2010 2:41 am
మళ్ళీ ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు ఈమాటలో మీ కవిత :-) చాలా బాగుంది. అవును, జ్ఞాపకాల మిణుగురులకి వెలుగు తప్ప వేడిమెక్కడిది!
Gannavarapu Varaha Narasimha Murty అభిప్రాయం:
May 11, 2010 10:42 pm
చంద్ర గారి కవిత బాగుంది.
మిణుగురు పురుగుల దివ్వెలఁ
ప్రణయంబులు ప్రజ్వరిల్లి పరిణతి జెందున్
తృణముల నిసుకల తిన్నెల
మణిమయ ప్రభవమ్ము లవియె మమతలు పొంగన్.
B.Narendrababu అభిప్రాయం:
June 16, 2010 3:14 am
మోహాల దేహాలకు నేర్పిన అయస్కాంత భాష…. చాలా బాగుంది.