అతను తలొంచుకు కూచుని వింటున్నాడు తండ్రిమాటలు. తల్లిమొహం పదే పదే గుర్తొస్తోంది ఎంచేతో, తండ్రిమొహం ఎదురుగా ఉన్నా. “శ్రీరంగవల్లి” రూపు కంటికి ఆనడం లేదు.
“నీకు గుర్తుందా విజయవాడలో సన్మానం జరిగినప్పుడు. మొదట మీఅమ్మ రానంది కానీ నేనే గట్టిగా చెప్పేను ఆవిడ కూడా రావాలని. నా అర్థాంగి. నాకు సత్కారం అంటే తనకీ సత్కారమే కాదూ. ఆవిడ వేదికమీద ఉంటేనే నాకు పరిపూర్ణమయిన సంతృప్తి అని”.
కొడుకు మళ్ళీ తల్లిమొహం గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించాడు. నిన్నటివరకూ కళ్ళఎదుట నడయాడిన అమ్మ – ఆవిడమొహం ఈరోజు ఇలా మసకమసక అయిపోతోందేం? తల గోడకేసి కొట్టుకోవాలనిపించింది.
“ఆరోజు నేనే చెప్పేను ఆ సెక్రటరీకి మా ఆవిడని కూడా గౌరవించాలని… సభలో ఆవిడకి కూడా శాలువా కప్పించేను నేనే చెప్పి. మీఅమ్మది ఎంత దొడ్డ మనసో… సాయంత్రం ఇంటికొచ్చేవేళకి గుమ్మంలో గంగిరెద్దు కనిపించిస్తే, ఆ శాలువా ఆఎద్దుమీద కప్పింది. చూశావా… అంతటి ఔదార్యం ఆ మహాయిల్లాలిది“.
అది ఔదార్యం? దానగుణమేనా, మరోటా?… ఉహూఁ… చక్రికి అలా గందరగోళం అయిపోయింది మనసంతా.
గౌతమి, “అత్తగారు ఆ శాలువా దానిమీద విసిరేసేరు, చూసారా?” అంది ఆరోజు తల్లివెనకాలే ఇంట్లోకి వస్తూ. తల్లిమొహంలో ఆ పూట తనకి దానగుణం కనిపించడంలేదు ఎంతగా కళ్ళు పొడుచుకు చూసినా. కళ్ళు గట్టిగా మూసుకుని మరోసారి జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నించేడు. అమ్మమొహం అలుక్కుపోయి కనిపిస్తోంది. ఆమొహంలో… అదేదో… చిరాకులా ఉంది కానీ ఔదార్యంలా అనిపించడంలేదు… అయ్యో, దేవుడా! ఇంత మందబుద్ధిని చేసేవా నన్ను? అమ్మమొహం గుర్తించేపాటి తెలివయినా లేకుండా చేసేవేమిటి? – చక్రధరం జుట్టు పీక్కున్నాడు.
“అంతటి మహా మనీషి మరి పుట్టబోదు…” అంటూ శ్రీరంగశయనం బాధపడిపోతున్నాడు. ముప్ఫైనాలుగేళ్ళు తన మంచీ చెడ్డా, ఆలనా, పాలనా చూసిన ఇల్లాలు తన్నొంటరిగాణ్ణి చేసి తరలిపోయింది.
“ఇప్పుడు నాగతేం కానూ … ” అంటూ ఏడుస్తున్నాడాయన.
ఆయనవేపు మరోసారి చూసేడు చక్రి. రవంత జాలేసింది రెండునిముషాల పాటు. పాపం, ఎంతలేదన్నా ముఫ్ఫైనాలుగేళ్ళు కలిసి కాపురం చేసింతరవాత ఆమాత్రం బాధ ఉండదా సహధర్మచారిణి పోయినందుకు అనుకున్నాడు. తనజీవితంలో పాలు పంచుకున్న మనిషి మరింక ఉండదనుకుంటే ప్రాణం గుబగుబలాడదా అనిపించింది. మరోసారి, ఆయనమొహంలోకి తేరి పారచూశాడు.
“నాకేం కావాలో చూసుకుని అమర్చిపెట్టడంలోనే పరమానందం పొందింది గానీ ఏనాడూ తనకిది కావాలని కోరి ఎరగదు. అంతటి ఉత్తమురాలిని మరి కానం. సాయంత్రాలు ఆఫీసు నుంచొచ్చి, తోటి సావాసగాళ్ళతో నేను పేకాటక్కూర్చుంటే, కాలేజీనించి హడావుడిగా వచ్చి, వేడి వేడి పకోడీలు చేసి పెట్టి, ఆ తరవాతే వంట మొదలు పెట్టేది… ఒక్కసారి మాత్రం కాబోలు అలిగి, అన్నం తిననని పట్టు బట్టుక్కూచుంది. నాకు నేను వడ్డించుకు తినాల్సొచ్చింది.”
అంతవరకూ ఓపిగ్గా వింటున్న మరో చుట్టం, “అదేమిటండీ, ఆవిడ చేసిన వంట ఆవిడ తినకుండా మీరు కూర్చుని భోంచేశారా?” అన్నాడు.
అమాయకుడు కాకపోతే అలా అడుగుతాడా?
“నాకోసం చేసిన వంట నేను తినకపోతే, పాపం, ఆవిడ చిన్నబుచ్చుకోదూ? అక్కడికీ అన్నాను, ఒకటి కాదు రెండుసార్లు, నువ్వూ తిందూ గానీ, రా అని. ఆకల్లేదంది. మరి, ఆకల్లేదంటే, తిను, తిను అనడం తగునా?”
“పాపం, మీకు మీరే వడ్డించుకు తినాల్సొచ్చిందా” ఎదురింటి ఎల్లమ్మగారు నొచ్చుకున్నారు.
శ్రీరంగశయనం విచారంగా తలూపేరు.
వచ్చినవారందరూ ఒకొకరే పొద్దు పోతోందంటూ లేచేరు.
నెలరోజులయింది. శ్రీరంగశయనం గతించినభార్యనీ, ఆమె ధార్మికచరిత్రనీ కీర్తిస్తూనే ఉన్నారు, గంగాప్రవాహఝరిలా.
అంతవరకూ మాటాడకుండా కూర్చున్న కొడుకూ, కోడలూ లేచారు.
“కూరేం చేద్దాం?” అంది గౌతమి.
“నిన్న తెచ్చిన బెండకాయలు ఉన్నాయి కదా” అన్నాడు చక్రధరం ఆమెని అనుసరిస్తూ.
శ్రీరంగశయనం కోడలివెనక వెళ్తున్న కొడుకుని చూశారు తీక్షణంగా. ఓ పావుగంట అయినతరవాత, ఏమనుకున్నారో, “చక్రీ, ఇలా రా. నీతో మాటాడాలి” అంటూ పిలిచారు, స్వరం పెంచి.
“వస్తున్నా. బాబుకి స్నానం చేయించి వస్తా. అన్నం తింటూ మాటాడుకుందాం,” అన్నాడు చక్రి గదిలోకి వచ్చి, బాబుని తీసుకు బాత్రూంవేపు నడుస్తూ.
తండ్రి తలూపేడు అప్రసన్నంగానే.
ఆరాత్రి భోజనాలదగ్గర నెమ్మదిగా చెప్పేరాయన తనమనసులో మాట, “నీకు గుర్తుందా, మా ఆఫీసులో వేణుగోపాల్. వాళ్ళ చెల్లెలుంది, చేసుకోమంటున్నాడు. నీకూ తెలుసు కదూ ఆవిడ. నాలుగేళ్ళక్రితం భర్త పోయాడు.”
నోట్లో ముద్ద పెట్టుకోబోతున్నకొడుక్కి కొరబోయింది. గొంతు సవరించుకుంటూ నీళ్ళగ్లాసు అందుకున్నాడు. గ్లాసులో నీటితెరల్లో అమ్మమొహం అలుక్కుపోయి కనిపించింది.
కూర మారు వడ్డించబోతున్న కోడలి చేతిలోంచి గరిటె జారి గిన్నెలో పడి ఖంగుమంది.
తండ్రికి ఒళ్ళు మండిపోయింది ఆ యిద్దరివరసా చూసేసరికి. “తప్పకుండా చేసుకోండి, మీకు ఆలనా పాలనా చూసుకోడానికి మనిషి కావాలి” అనవలసిన కొడుకు ఇలా గుక్కిళ్ళు మింగడమేమిటి? చటుక్కున నీళ్ళగ్లాసు అందుకుని, అరచేతిలో నీళ్ళు పోసుకు కంచంలో వదిలి, లేచిపోయేరాయన.
లేస్తూ, లేస్తూ, “ఆవిడ వితంతువని కాబోలు నీబాధ?… నాకలాటి నికృష్టపు ఆలోచనల్లేవు… నిన్ను కూడా నాలాగే… ఆధునికభావాలతో… పెంచేననే అనుకున్నాను ఇంతకాలం. ఛీ ఛీ, నాకడుపున చెడబుట్టేవు“, అనేసి, విసవిస అంగలేస్తూ హాల్లోకి వెళ్ళిపోయేరు.
కొడుకు వంచిన తల ఎత్తలేదు. కోడలు స్థబ్ధురాలయి కూర్చుండిపోయింది.
రెండునిముషాలపాటు భోజనాలగదిలో గాలి ఘనీభవించిపోయింది, చురకత్తి విసిరినా తెగనంత దట్టంగా, మట్టసంగా.
శ్రీరంగశయనం తిరిగి గుమ్మంలోకి వచ్చి, “నీకు మీ అమ్మలాటి మనిషి కావాలని ఉందేమో. అమ్మలాటి మనిషి మళ్ళీ దొరకదు. నేను వేణుగోపాల్ చెల్లెల్ని చేసుకుంటానంటే నా విశాల హృదయమే అదీ,” అన్నారు గుండెలమీద చేత్తో రాచుకుంటూ.
కొడుక్కి అదును దొరికింది, “లేదు, నాన్నగారూ, వేణుగోపాల్‌గారి చెల్లెలంటే నాకు గౌరవమే! ఆవిడ అమ్మలాటి ఉత్తమాయిల్లాలు కాదు. అందుకు నేను విచారించడంలేదు కూడా. మీకే… మీరే… మీరే… ఆమె… అమ్మ లాటి ఉత్తమాయిల్లాలు కావాలని ఆశ పడుతున్నారనీ…” అన్నాడు ‘అమ్మలాటి ఉత్తమాయిల్లాలు’ అన్నపదం ఒత్తి పలుకుతూ.
అన్న తరవాత తన భార్య గౌతమివైపు చూశాడు. ఆ ముఖం అమ్మ తన ఆశలకీ, ఆశయాలకీ, అభిప్రాయాలకీ ప్రతీకగా తీర్చిదిద్దిన ముఖమేమో అన్న అనుమానం అతనికి గతంలో చాలాసార్లు కలిగింది. ఇప్పుడు ఆ ముఖంలో అమ్మ ముఖం ప్రస్ఫుటంగా తీరిచి దిద్దినట్టు కనపడింది అతడికళ్ళకి.
వెనక్కి తిరగబోతున్న శ్రీరంగశయనం వెర్రిగా చూశాడు కొడుకుమొహంలోకి.
ఆ యువకుడి అభిప్రాయం ఆ పెద్దమనిషికి అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు.