
సా విరహే అష్టపది, మేవారి శైలి
కపిల వాత్స్యాయన్
కేవలం అనువాదాలే కాక జయదేవుని గీతగోవింద కావ్యపు పాటలకు, పద్యాలకు ఎందరో చిత్రకారులు శతాబ్దాలుగా చిత్రాలు వేస్తున్నారు. గీతగోవింద అష్టపదులకి మేవార్, కాంగ్రా శైలుల చిత్రాలను నేషనల్ మ్యూజియం[6], [7] వారు పుస్తకంగా ప్రచురించారు. ఈ అష్టపదికి సంబంధించిన చిత్రాలను ఇందిరా గాంధీ జాతీయ కళా సంస్థ వారి వెబ్‌సైట్లో కూడా చూడవచ్చును. జయదేవుని అష్టపదులకు భరతనాట్యం, కూచిపూడి, మణిపురి, ఒడిస్సీ, కథక్, మోహినియాట్టం వంటి ఎన్నో రీతులలో నాట్యము చేస్తారు. ఈ సా విరహే అష్టపదికి కేరళ సాంప్రదాయమైన మోహినియాట్టంలో అంజలీ పణిక్కర్ నాట్యాన్ని, భరతనాట్య శైలిలో శివకామి నాట్యాన్ని ఇంటర్నెట్లో చూడవచ్చు.
సామాన్యంగా అష్టపదులను పాడేటప్పుడు, మొదట అష్టపది ముందు శ్లోకాన్నీ, తరువాత వచ్చే సంక్షిప్త సంగ్రహాన్నీ ఆలపించాలి. అయితే ఈ నియమాన్ని అందరూ పాటించరు. అదే విధంగా ఎవరికి తోచిన రాగతాళాలను వాళ్ళు వాడుతారు. ఏ కొందరో తప్ప అందరూ అష్టపదిలో అన్ని చరణాలూ పాడరు. సంస్కృతంలో మొదట చరణము, ఆ తరువాత ధ్రువము లేదా పల్లవి వస్తాయి. ఈ అష్టపదికి పల్లవి సా విరహే తవ దీనా. కానీ, చాలా మంది ‘నిందతి చందన మిందుకిరణం’ అనే దానినే పల్లవిగా కూడా వాడతారు. భారతీయ సంగీత పద్ధతుల్లో (హిందూస్తానీ, కర్ణాటక) పాడేవారు ఒక్కొసారి అష్టపదులకు ‘రాధా’ అనో, ‘రాధే’ అనో, ‘కృష్ణా’ అనో అష్టపదిలో లేని పదాలు కలుపుతారు.
జయదేవుడు ఈ అష్టపదిని కర్ణాట రాగంలో, ఏక తాళంలో స్వరపరిచినట్లుగా అష్టపది ప్రారంభంలో వుంది. దీన్ని ఏక తాళ బద్ధంగా పాడాలి. కర్ణాట రాగం అన్నది ప్రస్తుతం వాడుకలో లేదు. ఈ రాగం గురించిన ఏ వివరాలూ అందుబాటులో లేవు. కానీ ఈ రాగం గురించి శ్రుతిరంజని[8] అనే గీతగోవింద వ్యాఖ్యలో ఒక ధ్యాన శ్లోకంగా ఈ క్రింది విధంగా చెప్పబడింది.
కృపాణపాణిః గజదంతపత్రం
ఏకం వహన్ దక్షిణ కర్ణపూరం
సంస్తూయమానః సురచారణౌఘైః
కర్ణాటరాగః శిఖి నీలకంఠః
(సురచారణులు పొగడుతూ ఉంటే, శిఖికంఠుడు కుడి భుజంపై గజదంతాన్ని, మరో చేతిలో కత్తిని పట్టుకొని నడుస్తున్నాడు. ఇట్టి సమయాలలో కర్ణాటరాగాన్ని పాడుట సమంజసము.)
ఈ అష్టపదిని బాగేశ్వరి రాగంలో పాడుతారని మంచాళ జగన్నాథ రావు[9] సూచించారు. ఈ బాగేశ్వరి రాగంలో ప్రస్తుతం ఎవరూ పాడినట్టు లేదు. ఈ అష్టపదిని సౌరాష్ట్ర, కానడ, దర్బారీ కానడ రాగాలలో కూడా పాడవచ్చనీ ఈ కావ్యపు వావిళ్ళ వారి ప్రతిలో[1] వున్నది. వీటిలో ఈ అష్టపది దర్బారీ కానడ రాగంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇదే కాకుండా కొంతమంది మిశ్ర కానడలోనూ, యమన్ కళ్యాణిలోనూ, మాండ్ లోనూ, చక్రవాకంలోనూ, ఇలా పలురాగాల్లో స్వరపరిచారు. ఈ జయదేవాష్టపది చాలా భాషల సినిమాలలో కూడా వున్నది. దర్బారీ కానడ రాగం కానడ రాగానికి అనుబంధ రాగమనీ, దక్షిణాదినుండి తాన్సేన్ హిందూస్తానీ సంగీతానికి తీసుకెళ్ళాడని నానుడి. దర్బారీ కానడ రాగ కదంబములో మిగిలిన రాగాలను గురించి రాజన్ పర్రికర్ ఒక చక్కటి వ్యాసం రాశారు.
సంగీతంలో రాగాలన్నీ రసప్రధానమయినవి. కొన్ని రాగాలకి నిర్దిష్టమయిన రస రూపం వుంది. అంటే ఆయా రాగాలు ఆయా రసాలు పలికించడానికి వాడడం కద్దు. రసాలకీ ఒక అర్థమూ, సమయమూ ఉంటాయి. ఈ రసప్రధాన రాగాల్ని కొన్ని ప్రత్యేక సందర్భాలని చెప్పడం కోసం సంగీతంలో వాడుతారు. ఈ అష్టపదిని స్వరపరిచిన రాగాలూ, పాటల వివరాలూ ఇక్కడ పొందుపరుస్తున్నాం.
దర్బారి కానడ
సా విరహే – ఎం.ఎల్. వసంత కుమారి, శ్రీవిద్య
పైన చెప్పిన దాన్ని బట్టి చూస్తే, సా విరహే అష్టపది విరహగీతం కాబట్టీ, పైగా పున్నమి వెన్నె లనే సందర్భం ఉండడంవల్లా, దీనికి రాత్రి పాడే ఒక రాగమయితే సరిగ్గా వప్పుతుందన్న అభిప్రాయముంది. ఈ విధంగా చూస్తే దర్బారి కానడ రాత్రి పూట పాడే రాగం. ధ్యానానిక్కూడా వాడుతారు. ఎం.ఎల్. వసంత కుమారి పాడిన ఈ అష్టపది వింటే అటువంటి భావనే కలుగుతుంది. కానడ, దర్బారీ కానడ వినడానికి ఒకేలా ఉన్నా రెంటికీ చాలా తేడాలున్నాయి. కానడ రాగంలో శుద్ధ దైవతం వాడతారు. దర్బారీకానడలో చతురస్ర దైవతం ఉంటుంది. రి,ప,గా అన్న ప్రయోగం రెంటిలోనూ ఉన్నా, గా-మా-రీ-సా, మ-ప-ద-ని-సా ప్రయోగాలు దర్బారీకానడలో ఎక్కువగా కనిపిస్తాయి. కానడలో కాకలి నిషాదం అన్య స్వర ప్రయోగం కనిపిస్తుంది. అలాగే కానడలో గ-మ-ద-ని-సా అన్న ప్రయోగమూ కనిపిస్తుంది.
దర్బారీ కానడలో చాలా సినిమా పాటలున్నాయి. జగదేక వీరుని కథలో ‘శివశంకరి’, అలాగే బైజూ బావరా సినిమాలో ‘ఓ దునియాకే రఖ్ వాలే’ కూడా దర్బారీ కానడ పాటలే. ఇందులో మ-ప-ద-ని-సా ప్రయోగం ఉంటుందని ఇంతకు ముందు అనుకున్నాం. ఈ బైజూ బావర పాట ఈ మ-ప-ద-ని-సా స్వరాల తోనే మొదలవుతుంది. సాధారణంగా రాగంలో మధ్యనున్న స్వరాలతో పాటనెత్తుకోడం ఒరవడి కాదు. కష్టం కూడా. నౌషాద్ వంటి మహా సంగీత దర్శకులకే అలాంటి ప్రయోగాలు సాధ్యం. అలాగే మేరే హుజూర్ సినిమాలో మన్నాడే అవార్డు గెలుచుకున్న పాట ‘ఝనక్ ఝనక్ తొరి బాజే పాయలియా’ కూడా దర్బారీ కానడలోదే! ఈ సినిమా పాటలు ఇక్కడ దర్బారీ కానడరాగాన్ని గుర్తుపట్టడం కోసం ఇవ్వడం జరిగింది. తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందిన తెలుగు హనుమాన్ చాలీసాక్కూడా ఎం.ఎస్ రామారావు గారు ఈ దర్బారీ కానడ రాగానే ఎంచుకున్నారు.
మిశ్ర కానడ
సా విరహే తవ దీనా – రఘునాధ్ పాణిగ్రాహి
లక్షణాల రీత్యా కానడకీ, మిశ్ర కానడకీ తేడాలున్నాయి. ముఖ్యమైన తేడా నిషాద స్వరం (ని) లోనే ఉంటుంది. మిశ్రకానడలో కైశిక, కాకలి రెండు నిషాదాలూ వుంటాయి. కాకలి నిషాదాన్ని అపురూప ప్రయోగంగా వ్యవహరిస్తారు. రఘునాధ్ పాణిగ్రాహీ పాడిన గీతగోవింద ఆల్బంలో సా విరహే అష్టపది ఈ రాగం లోనిది. లవకుశ సినిమాలో జగదభి రాముడు శ్రీ రాముడే పాట కానడ రాగమే. అలాగే శ్రీ నగజా తనయం పాట కూడా. నర్తన శాలలో ‘జననీ శివకామినీ’, గృహాప్రవేశం లో ‘దారి చూపిన దేవతా’, సిరిసిరి మువ్వలో ‘పిలిచాను ఎదుట నిలిచాను – గోదారల్లే’ మరికొన్ని ఉదాహరణలు.
చక్రవాకం
సా విరహే – మంగళంపల్లి బాలమురళీకృష్ణ
హిందూస్తానీలో పైన చెప్పిన రాగాల్లోనే ప్రసిద్ధి చెందినా, కర్ణాటక సంగీతంలో ఈ అష్టపదిని చాలా రాగాల్లోనే స్వరపరిచారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఈ పాటని చక్రవాక రాగంలో అతి సరళంగా భజన సాంప్రదాయ పద్ధతిలో పాడారు. ఈ పాటలో కూడా కొత్తదనం కనిపిస్తుంది. దీన్ని అనుసరించే కె. కృష్ణకుమార్ – బిన్ని కృష్ణ కుమార్ పాడారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పాడిన ‘పిబరే రామరసం’ ఈ చక్రవాకరాగం లోదే. తులాభారం సినిమాలో ‘రాధకు నీవేరా ప్రాణం’ పాట ఈ రాగంలోనే కూర్చారు.
ద్విజావంతి
సా విరహే తవ దీనా – కవళం శ్రీకుమార్
ఇది హిందూస్తానీ సాంప్రదాయ రాగం. ప్రముఖ వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు ఈ రాగాన్ని కర్ణాటక సంగీతంలోకి తెచ్చారని అంటారు. ఈ రాగాన్ని జుజావంతి లేక జయజయవంతి అని కూడా వ్యవహరిస్తారు. కవళం శ్రీకుమార్ (1, 2, 3) ఈ అష్టపదిని పూర్తిగా కర్ణాటక శాస్త్రీయ సంగీత పద్ధతిలో పాడారు. ‘హిమగిరి సొగసులూ’ (పాండవ వనవాసం), ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై’ (డాక్టర్ చక్రవర్తి) పాటలు ఈ రాగంలోనివే.