20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక

అమెరికాని భూతలస్వర్గంగా ఊహించుకొని మోసపోయిన వైనాలు, అమెరికా కృత్రిమజీవితం నికృష్టం అని చెప్పే నీతి కథలు – ఇవి ఇంకో రకం. అమెరికాలో నైతిక జీవనం అరసున్న అని కథలో ప్రతిబింబించాలి. అమెరికా కృత్రిమత్వం కొట్టొచ్చినట్టు చెప్పాలి. కథకుడు ఈ విషయం నమ్మినా, నమ్మకపోయినా, అది కథకుడి అనుభవంలో ఉన్నా లేకపోయినా, కథకోసం అల్లిక! భోగభాగ్యాలు, డాలర్లూ నిజమైన సుఖాన్నివ్వవు అనే నీతి బోధ! మానసిక సుఖం అక్కడే సాధ్యం! ఇదీ వరస. ఇటువంటి కథల్లో మనది కర్మభూమి అని, మన ప్రాచీన సంస్కృతి, మన సంప్రదాయాలూ ఎంతో గొప్పవని ఒక పాత్రచేతో – ఒక్కొక్క సారి ముఖ్యపాత్ర చేతో, కథకుడో, కథకురాలో – ఉపన్యాసం ఇప్పిస్తారు! వస్తువు సమకాలీనమైనదైనా కథకుడికున్న దృక్పథం మూలంగా కథా, కథనం రెండూ కూడా చప్పగా తయారవుతాయి. మరికొన్ని కథల్లో డేటింగ్‌ తెచ్చే దౌర్భాగ్యం కథావస్తువు. మెలికలు తిప్పి, ఏదో రకంగా అది తప్పు అని నిరూపించడానికి పడే వ్యధ స్పష్టంగా కనిపిస్తుంది! కథలో కృతకత్వం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఇటువంటి కథలు చాలా భాగం కథాకథనంలో ఉన్న లోపాలతో ఉంటాయి.


20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక
మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల
పరిచయ గ్రంథం

మరోరకం కథలు. ఇక్కడి వాళ్ళు రాసినవే! పూర్తిగా అక్కడి వాతావరణం. ఆ చక్కని పల్లెటూరి వాతావరణం, ఆ మమకారాలు, ఈతచెట్టులూ, అరిటి తోటలు! పైరగాలి! అక్కడి పేదవారి అన్యోన్యత, సహృదయత్వం, కలుపుగోలుతనం! వాటిని ఇక్కడి హుందాలతో పోల్చి, ఈ అమెరికన్‌ జీవనవిధానాన్ని ఈసడించుకోవడం, తూలనాడటం, కథా వస్తువు! అంతమాత్రం చేత, కథనం బాగున్న కథలు లేవని అనను. కొద్దిమంది కథని చాలా అందంగా చెప్పగలిగారు. నిర్మాణ చాతుర్యం మూలంగా కథ చదివిస్తుంది. నా బాధల్లా డయస్పోరా జీవితం ఇతివృత్తంగా తీసుకొని అల్లిన కథలు, చక్కని కథానిర్మాణంతో మరోసారి చదివించే కథలు, చాలా తక్కువగా వున్నాయి. కాని, దురదృష్టవశాత్తు, ఈ సంకలనంలో (ఇతర అమెరికన్‌ కథాసంకలనాలలో కూడా!) ఏ విధమైన సెలెక్టివిటి లేకపోవడం మూలంగా అటువంటి కథలు పూర్తిగా మరుగున పడిపోతున్నాయి.

పోతే, కథకి ప్రయోజనం ఉండాలని, అది జీవితాన్ని విమర్శించాలనీ, సాంఘికన్యాయాన్ని కూర్చాలనీ కొంతమంది కథకుల దృఢనమ్మకం. వాస్తవాన్ని చిత్రించని రచనలు, ఎంత అందంగా ఉన్నా అవి సమాజానికి మేలు చెయ్యవు; హాని చేస్తాయనే ఒక రకమైన భ్రమ! కాగా కథలో సందేశం ఉండాలనే నమ్మిక! ( హెమింగ్వేని ఎవరో అడిగారట! ఫలానా కథలో మీ సందేశం ఏమిటీ అని. ఆయన, సందేశం కావాలంటే పోస్టాఫీసుకి పోవాలి; కథ దగ్గిరకి కాదు, అన్నాట్ట!)

తమాషా ఏమిటంటే, అక్కడనుండి (అంటే తెలుగునాడు నుండి) ప్రచురించబడే కొన్ని పాక్షిక సంకలనాలలో (biased collections) కథలు చదివినా, లేదా కనీసం సంపాదకుల పరిచయవాక్యాలు చదివినా మనకు ఈ పై సమాధానాలే వస్తాయి, కథ గురించి! కథా వస్తువు, కథాస్థలం మాత్రం వేరు! మనవాళ్ళు రాస్తున్న కొన్ని కథలకీ, అక్కడ పత్రికల్లో వస్తున్న చాలా కథలకీ తేడా ఏమీలేదనిపిస్తుంది. స్థలం తప్ప!

కారణం? నా ఉద్దేశంలో ఇక్కడ కథలు రాస్తున్నవాళ్ళల్లో చాలామంది భౌతికంగా (ఫిజికల్‌ గా) అమెరికాలో ఉన్నారు కానీ, మానసికంగా, ఇంకా ఆంధ్రాలోనే ఉన్నారు. లేదా, డయాస్పోరా కథ అంటే, నాకున్న అవగాహన తప్పేమో తెలియదు.

Paul Gilroy (The Black Atlantic : Modernity and Double Consciousness, Harvard University Press, 1993) ఆఫ్రికన్‌ డయాస్పోరా గురించి అన్న ఈ క్రింది మాటలు మనకి కూడా వర్తిస్తాయని అనుకుంటాను.

“… Diaspora invariably leaves a trail of collective memory about other times and places. Most displaced immigrant people frame these attachments with the aid of living memory and the continuity of cultural traditions. It is not uncommon for some diasporas to have these memories refracted through a prism of history to create maps of desire and attachment.”

అయితే గాజుఫలకంలో తెల్లని వెలుగు రేఖకి వచ్చే వక్రీభవనం, ఆ పంచరంగుల అందం, అన్నీ మనకథలలో మరీ మరీ వక్రీకరించబడుతున్నాయేమోనన్న అనుమానం రాక మానదు.


ఈ సంకలన ప్రచురణతో నాకున్న కొన్ని ‘పేచీలు’ చెపుతాను. కొన్ని ఉచిత సలహాలు కూడా మనవి చేస్తాను. ఈ సలహాలు పాటిస్తే, పుస్తకం స్థాయి తప్పకుండా పెరుగుతుందని నా విశ్వాసం.

ముందుగా, అచ్చుతప్పులు – ఈ సంకలనంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రూఫ్ రీడింగ్లో కాస్త శ్రద్ధ చూపిస్తే పడ్డ శ్రమకి ఫలితం బాగుండేది. జనరల్‌ ఎడిటర్‌ గారి పరిచయ వాక్యాలలోనే ముద్రారాక్షసాలు కొంచెం బాధాకరం. కథల సూచికలో కథకుల పేర్లలో అచ్చుతప్పులు. కొన్ని కథలలో, మధ్యలో ఇంగ్లీషు మాటలు ఎగిరిపోవడం, ఫుట్ నోటులు మాయవవడం జరిగింది. ఇకపోతే విరామచిహ్నాల (punctuation) గురించి చెప్పనవసరం లేదేమో! విరామ చిహ్నాలపై ఒక హాస్య సంభాషణ చెప్పి మీకు రిలీఫ్ ఇస్తాను. ఎల్మోర్‌ లెనర్డ్ (Elmore Leonard) రాసిన గెట్ షార్టీ (Get Shorty, Delta, New York 1995) నవలలో ఒక వంచకుడికి మరొకడితో సంభాషణ ఈ పద్ధతిలో సాగుతుంది.

“…నన్నడుగుతున్నావా? నీకు మాటలు కాగితం మీదపెట్టడం వచ్చా అని? …నీ బుర్రలోకి వచ్చిన మాటలన్నీ ఒకదాని తరువాత ఒకటి వెంటనే కాగితం మీద పెట్టు. నువ్వు చెయ్యాల్సింది అంతే. స్కూల్‌ లో రాయడం నేర్చుకున్నావా లేదా? … తరువాత, కామాలు గట్రా పెట్టడానికి ఎవడో ఒకడు దొరుకుతాడు. ఆ పని చేసే వాళ్ళు బోలెడుమంది ఉన్నారు, తెలుసా?”

ఇది, ఎడిటర్లమీద విసురు! సీరియస్‌గా నామనవి. పుస్తకంలో అచ్చుతప్పులు రెండవ ముద్రణలో సవరిస్తే బాగుంటుంది. “స్వచ్చంద సేవకులుగా మేము ఈ సాహితీ సేవ చేస్తున్నాం,” అని తప్పుకొపోవడం తప్పు. ఎందుకంటే, ఈ పుస్తకానికి పూర్వం ముప్ఫైఎనిమిది ప్రచురణలు చేసిన సంస్థ అలా అని సర్దుకోవడం, cop out అనక తప్పదు.

ప్రచురణ కర్తలకి ఏదోవిధంగా వంద పైచిలుకు కథానికలు అచ్చువెయ్యాలనిపించింది. అందులోనూ, నూటపదహారయితే మరీ బాగుంటుదనిపించి ఉండాలి. లేదా పవిత్రత మీదో, పుణ్యత మీదో వ్యామోహం అయిఉండాలి. అందుకేనేమో, ఇరవై ఇద్దరు రచయితల రచనలు నలభైఏడు ప్రచురించారు. తిరిగి మరొకసారి ఈ రచనలు చదివితే, ఆయా రచయితలకి (మి టూ!) అంత జాగా ఇవ్వనవసరం కనిపించలేదు. అధ్యక్షులు, ఇలా రాశారు: “…తమ సృజనాత్మక రచనలద్వారా – అంటే తాము రచించిన కథలూ కవితలద్వారా – చరిత్రను సృష్టిస్తున్నట్టుగానీ, చరిత్రని పదిల పరుస్తున్నట్టుగానీ తెలుగు రచయితలకీ – ముఖ్యంగా ఉత్తర అమెరికా తెలుగు రచయితలకి – తెలియజేయడం, వారి రచనలని పదిలపరచడం నా దృష్టిలో చాలా ముఖ్యమైన విషయం,”

రచనలు పదిలపరచడమే ముఖ్యమైన విషయమైతే, ఆ ఇరవై ఇద్దరి రచనలూ ఒక్కొక్కటే అచ్చువేసి ఉంటే, మరొక ఇరవై ఐదు రచయితలకి చోటు దొరికి ఉండేది కదా! అంతే కాదు. కథల పోటీలలో నెగ్గిన కథలు, కొంతకాలం తరువాత మళ్ళీ చదివితే, ఇవి మరోసారి ఒక బృహత్సంకలనంలో ప్రచురించడానికి తగినవేనా అన్న అనుమానం రాక మానదు. పైగా, ఇవన్నీ ఇదివరకు వంగూరి ఫౌండేషన్‌ వారు ప్రచురించిన ఇతర సంకలనాలలో అచ్చులో పదిలపరచబడ్డాయి కదా? సంస్థ అధ్యక్షులు, సంపాదకుల ఇష్టాఇష్టాలను ప్రశ్నించి వాళ్ళకి కోపం తెప్పించడం, విసుగెత్తించడం నా అభిమతం కాదు అని మనవి చేసుకుంటున్నాను.

‘రచన’ శాయి గారిచ్చిన యోగ్యతా పత్రం మీద రెండు మాటలు. అమెరికాలో చాలా మంది తెలుగు కథకులకున్న కోరికే ఈ సంకలన ప్రచురణ కర్తలకు కూడా ఉన్నట్టు కనపడుతున్నది. అక్కడి పత్రికల్లో తమ కథలని అచ్చు వేయించుకోవడం, అక్కడి సంకలనాలలో ఎంపిక కావాలన్న వ్యామోహం, అక్కడి వారి మెప్పు కావాలని ఊరట పడటం, వగైరా. నిజం చెప్పండి. ఇప్పుటికీ అక్కడనుంచి యోగ్యతా పత్రం ఇక్కడి కథలకి అవసరముందా? ఆంధ్రదేశం నుంచి వస్తూ ఉన్న సంకలనాలని చూస్తూనే ఉన్నాము. ఆ సంకలనాలలో కథల ఎంపిక వెనుక ఉన్న రాజకీయ పక్షపాతం, వాళ్ళ ఉద్దేశంలో కథకి ఉండవలసిన ప్రయోజనం గురించి నిర్దిష్టమైన అభిప్రాయాలు – వీటి గురించి ఇప్పుడు ముచ్చటించడం అప్రస్తుతం. ఒక విషయం మాత్రం నిజం. అక్కడి సంపాదకులకు అమెరికా తెలుగు సాహిత్యంపై ఏర్పడ్డ condescending వైఖరి కొత్తదేమీ కాదు. ఈ విషయం శాయిగారు ఉదహరిస్తూనే, వరసగా ఒక పాతిక తెలుగుదేశపు కథల జాబితా ఇచ్చారు. కావాలంటే ఇలాంటివి ఒక వంద కథలు చెప్పగలనన్నారు. ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు. అభ్యంతరం లేదు. కానీ, ప్రతిసారీ, అమెరికా తెలుగు కథలని ఆంధ్రదేశం నుంచి ప్రచురించబడే తెలుగు కథలతో పోల్చటం అక్కడి సంపాదకులకి, విమర్శకులకి, సమీక్షకులకీ, ఒక అసంకల్ప ప్రతీకార చర్యలా తయారయ్యింది. విసుగు పుట్టిస్తూన్నది. అక్కడి ధోరణి ఇప్పుడిప్పుడే మారదు కూడా. ‘రచన’ శాయి గారంటే మీకెంత గౌరవం ఉన్నదో నాకూ అంతే గౌరవం ఉన్నది. అయితే, ఒక్క విషయం నిక్కచ్చిగా చెప్పుకోవాలి. అమెరికా తెలుగు కథ అమెరికా కథ. పీరియడ్. అందుకనే నేను ఎడ్వర్డ్ ఓ’బ్రైన్‌ గురించి అంత వివరంగా ముచ్చటించాను.

అమెరికా సాహితీవేత్తల పరిచయ గ్రంథంలో నాలుగు భాగాలున్నాయి. మొదటిభాగంలో ఉన్న అందరు రచయితల సాహిత్య చరిత్ర ఎడిట్‌ చేసి, కుదించి అచ్చువేసి ఉంటే బాగుండేది. రెండు, మూడు నాలుగు – ఈ భాగాలు ఎందుకో నాకు అంతుపట్టలేదు. అమెరికాలో తెలుగు ‘రచయితలు’ వెరసి 450 పైచిలుకు ఉన్నారని చెప్పటానికా?

ఆఖరిగా ఒక మాట.

ఈ పుస్తకం వంగూరి ఫౌండేషన్‌ వారు ఎంతో శ్రమకోర్చి కూర్చారు. అందుకు వారికి మరోసారి ధన్యవాదాలు. అయితే, ఎంపిక పరంగా మరికొంత శ్రద్ధతో ఈ పుస్తకం ప్రచురించి ఉంటే, అమెరికాతెలుగుకథానిక పై పరిశోధన చేద్దామనే ఉబలాటం ఉన్న ముందుతరాల పరిశోధకులకి యెంతో ఉపయోగపడేది.