20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక


20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక
ధర, ఇతర వివరాలు

సింగపూరు చైనావారితో పోల్చి చూసుకుంటే మనకీ వాళ్ళకీ సన్నిహితమైన పోలికలున్నాయి. సింగపూరు చైనావారు డయాస్పోరా కమ్మూనిటీలకి సాహిత్యావశ్యకతని ఎలా అర్థం చేసుకున్నారో, ఏవిధమైన చర్యలు తీసుకొని వారు డయస్పోరా సాహిత్యాన్ని సృష్టించుకున్నారో – ఇత్యాది విషయాలు రెండు సాహితీ సదస్సులలో చెప్పింది నాందీ ప్రస్తావనలు అనుకుంటే, ఇప్పుడు చెప్పేది విష్కంభం అనుకోవచ్చు. విష్కంభంలో సాధారణంగా ఒక తక్కువ స్థాయిలో ఉన్ననటుడు (inferior actor) రంగస్థలం మీదికొచ్చి ఈ మధ్యకాలంలో, అంటే అంకానికీ అంకానికీ ఉన్న మధ్యకాలంలో జరిగిన కథ చెప్పుతాడు. ఆ పాత్రకి నేను తగుదనే అనుకుంటున్నాను. డయాస్పోరా సాహిత్యం గురించి ఈ కథా సంకలనం నేపథ్యంలో, కథలకు మాత్రమే పరిమితంచేసి సూచనగా పరామర్శిస్తాను.

డయాస్పోరా కమ్యూనిటీలలో సహజంగా కనిపించే కొన్ని లక్షణాలు మరొకసారి గుర్తు చేసుకోవటం అవసరం. ఈ లక్షణాలు:

  1. మాతృదేశపు జ్ఞాపకాలు ( నాస్టాల్జియా),
  2. ఈ పెంపుడుదేశంలో మనం ఏనాటికీ పూర్తిభాగస్వాములం అవలేమనే గాఢమైన నమ్మకం,
  3. మాతృదేశ సాహితీ సంస్కృతుల్లో వచ్చే మార్పులలో, విప్లవాలలో భాగస్వాములమవాలనే ఉబలాటం,
  4. సామూహిక సృహ, ఉమ్మడితనం, దృఢమైన ఏకత్వ నిరూపణ, వగైరా.

కారణాలు ఏమయితేనేం, సాధారణంగా డయాస్పోరా కమ్యూనిటీలన్నిటిలో ఈ పైన చెప్పిన అన్నిలక్షణాలూ కనిపించవు. ఏ కొన్నిలక్షణాలు ఉన్నా, దానిని డయాస్పోరా గా చెప్పవచ్చు.

ఉత్తర అమెరికాకి వలసవచ్చిన తెలుగు వారిని కాలక్రమానుసారం మూడు తరాలుగా, లేకపోతే మూడు తరహాలుగా విభజించవచ్చు. 1950 నుండి 1970ల వరకూ ఉత్తర అమెరికాకు వచ్చినవారు అందరూ ఉన్నతవిద్యాభాసం కోసం విద్యార్థులుగా వచ్చినవారు. అట్లా వచ్చిన వారి సంఖ్య కూడా చాలా పరిమితమైనదే! ఇక్కడ స్థిరపడి పోయిన కొద్దిమందీ ఈ మొదటి తరహా జనాభా. వీరికి వ్యక్తిగతంగా తెలుగు వారం అనే భావన ఉన్నా, ‘మేం తెలుగువాళ్ళం, తెలుగు వారిగా మనం ఉమ్మడిగా కలిసి ఏదో చేద్దాం’ అనే గాఢమైన వాంఛ ఉండి ఉన్నా, సామూహికంగా ఏవో కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు లేవనే చెప్పాలి. మొదటి కారణం: సామూహిక సృహతో ఏకత్వనిరూపణకి కావలసిన మంది బలం లేదు. రెండవకారణం: ఏ కొన్ని ముఖ్యనగరాలలో మందిబలం ఉన్నా, ఆర్థిక బలం లేదు. అయినప్పటికీ కూడా కొద్దిమంది ఉత్సాహవంతులు తెలుగు భాష, తెలుగు సాహిత్యపరంగా ఏదో సాధిద్దామని కుతూహలం చూపించారు. వీళ్ళని పయనీర్లని అనవచ్చు.

తరువాత, 1970 – 1990 లలో అమెరికాఖండానికి వచ్చిన తెలుగువారి సంఖ్య బాగా పెరిగింది. వీరిలో ఎక్కువమంది వైద్యులు, ఇంజనీర్లు, కొంతమంది వ్యాపారరంగంలో పట్టాలు పుచ్చుకున్నవారు. ఈ ఇరవై ఏళ్ళలో వలసకొచ్చిన జనబాహుళ్యానికి మంది బలమే కాకుండా, ఆర్థిక బలం కూడా కలిసి వచ్చింది. అప్పుడే చాలా పట్టణాలలో తెలుగు సంఘాలు స్థాపించడం, సామూహికంగా పండగలు, పబ్బాలు జరుపుకోవడం మొదలయ్యింది. ఊరూరా వెలిసిన తెలుగు సంస్థలు వ్రాత పత్రికలు – ముఖ్యంగా కమ్మ్యూనిటీ వార్తలకోసమే ననండి – నడపడం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఒక సరికొత్త వాతావరణం సృష్టించబడిందని ఒప్పుకోవాలి. అయితే చెప్పుకోదగిన వలస సాహిత్యం రావడానికి కావలసిన హంగులేవీ ఏర్పడలేదు. అటువంటి సాహిత్యానికున్న ఆవశ్యకత సృహలోకి కూడా రాలేదేమో అనిపిస్తుంది. అందుకు చాలాకారణాలున్నాయి. నాకు తోచిన ఒక ముఖ్య కారణం: ఈ సమయంలో వచ్చిన వారందరి ప్రావీణ్యత, వైద్య, యాంత్రిక సాంకేతిక విజ్ఞాన రంగాలకే పరిమితమై ఉండడం, సాహితీరంగం గురించి స్వతహాగా అవగాహనలేకపోవడం. అంతమాత్రం చేత వాళ్ళు సాహితీప్రియులు కాదనడంలేదు; సాహితీసృహ లేదనే అంటున్నాను. అయితే వీరు సాహితీపరంగా ఏవిధమైన ప్రయత్నాలు చెయ్యలేదనడం కూడా నిజం కాదు. సాధ్యమయినంతలో, తెలుగునాడునుంచి సాహితీపరులని, అంటే పేరుమోసిన కవులని, రచయితలనీ ఆహ్వానించడం, వారిచ్చే ఉపన్యాసాలు, ఉద్బోధలు ఆనవాయితీగా వినడం, వినిపించడం జరుగుతూనేవచ్చింది. ఈ ఉద్బోధల ద్వారా వచ్చింది, డయస్పోరా కమ్యూనిటీ సాధించిందీ, నిజానికి ఏమీ లేదని తరువాత గానీ తెలిసిరాలేదు. ఈ సమయంలో వచ్చిన వారిని ప్రాక్టీషనర్స్‌ అని చెప్పవచ్చు. సంఘస్థాపన, సామూహిక ఉత్సవాలూ భారీఎత్తున జరిపించి దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఒక రకమైన ఉమ్మడితనం ఉన్నదని చూపించారు. అయితే, సంస్కృతి పేరుతో ఎక్కువభాగం సినిమారంగానికే అంకితమవడం కూడా జరిగింది.

1990నుంచి ఇప్పటివరకూ వలసవచ్చిన వాళ్ళు పూర్తిగా సాంకేతికవిజ్ఞానశాస్త్రంలో పట్టాలు పుచ్చుకున్న నిపుణులు. ముఖ్యంగా కంప్యూటరు రంగంలో పనిచేస్తున్నవారు. ఈ తరం వారి రాకతో అమెరికాలో తెలుగువారి సంఖ్య బాగా పెరిగింది. వీరి సగటు ఆర్థిక స్థోమత పైన చెప్పిన రెండవ తరహావారితో సరితూగుతుంది. సాంకేతికంగా ఈ సమయంలో చాలా మార్పులు వచ్చాయి. కమ్యూనికేషను విప్లవం వచ్చింది. ముఖ్యంగా, తెలుగువారికి సంబంధించినంతవరకూ, తెలుగు సినిమాలు, తెలుగు సినిమా పాటలు సమృద్ధిగా, తెలుగునాడుతో సమతూకంలో తేలికగా లభించడం మొదలయ్యింది. అటు, ఇటు రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఈ తరం వారిలో చాలామందికి ఎనిమిది గంటలు మాత్రమే ఉద్యోగరీత్యా మనది కాని పరాయి వాతావరణం; అంతే! మిగిలిన సాంఘిక వ్యాపకాలు అన్నీతెలుగు దేశంలో ఉన్నట్టే జరుగుతూ వున్నాయి. ఇది కృత్రిమంగా కనిపించవచ్చు. లేదా భ్రమ కావచ్చు! దానికి తోడు ఈ తరం వాళ్ళు చదువుకున్న పాఠ్యభాగాలలో తెలుగు చాలా పరిమితం అవడంతో, మొత్తం మీద చాలామందికి సాహిత్యపరంగా ఆసక్తి తక్కువేనని చెప్పాలి. అయితే ఒక సుగుణం. తెలుగు భాషపై, తెలుగు సాహిత్యంపై స్వయం కృషితో ఆసక్తి పెంచుకున్నవారు, కేవలం భాషపై మమకారంతో ఇక్కడి తెలుగువారికి సాంకేతికంగా ఎంతో ఉపకారం చేస్తున్నవారు ఈ భాగం నుండే వచ్చారు. ఈ ఉపకారం వ్యాపారాభిలాషతో కాకుండా, స్వఛ్ఛందంగా పనికట్టుకొని చేస్తున్నవాళ్ళు ఈ తరం వారే!

ఈ సంకలనంలో అమెరికాకి వలసవచ్చిన ఈ మూడుతరాల వారూ తయారుచేసిన కథా సాహిత్యం, వలస కథాసాహిత్యం పొందుపరచబడింది. ఎవరినీ కించపరచకండా, ఎవరినీ అందలం ఎక్కించకండా, స్థూలంగా ఈ సంకలనంలో కథలగురించి ముచ్చటిస్తాను.

తెలుగు దేశంలో ఉండగా ఎప్పుడూ తెలుగు రాయని వాళ్ళు, గట్టిగా తెలుగు చదవనివాళ్ళు, ఏదో ఊసుపోకకి తెలుగు పత్రికలని చూసీ చూడనట్టు చూసి పడేసేవాళ్ళు, ఇక్కడికొచ్చాక ‘రచయితలు, కవులూ’ అయ్యారు. కారణం: బహుశా నాస్టాల్జియా అవచ్చు. డయాస్పోరాకి ఉండే లక్షణాలలో నాస్టాల్జియా ఒకటి కదా! పైన చెప్పిన మూడు తరాల తెలుగువారు తెలుగులో రాయడం బాగా పెరిగింది. సాంకేతికంగా తెలుగులో రాయడం సులువవడం, ప్రచురణ తేలికవడం, పాఠకుల సంఖ్య పెరగడం, అక్కడి పత్రికలు – దిన వార మాస పత్రికలు – సమృద్ధిగా ఇంటర్నెట్లో దొరకటం, అక్కడ పత్రికలలో అచ్చవుతున్న కథాసాహిత్యం అచ్చయిన వెంటనే చదవడానికి అవకాశాలు పెరగటం, మొదలైన కారణాలు ‘రచయితల’ సంఖ్యని ముమ్మరంగా పెంచాయి. అమెరికానుండి రచనలు సాగిస్తున్న వారి సంఖ్య సుమారు నాలుగు వందల పైచిలుకేనట! వీరిలో చాలామంది కథానికలు అల్లుతున్నవారే! అయితే ఒక్క విషయం స్పస్టంగా కనబడుతుంది; చాలామందికి రాయడం వచ్చు, కానీ వాళ్ళు రచయితలు కారు. అంటే, రాయటం వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కడూ రచయిత కాలేడని అర్థం.

కథలు అల్లుతున్న వారిలో, నూటికి తొంబది మందికి కథావస్తువు, ఇతివృత్తం, ఇక్కడి భార్యాభర్తల సంసార వ్యాపకాలు. అమెరికాలో తెలుగు సంసారాల పోకడ, వారి దినచర్య. చక్కని కథావస్తువు. కాదనలేం. కాని, దురదృష్టవశాత్తు ఈ కథలు చాలా మటుకు ఫార్ములా కథలుగా రూపొందుతున్నాయి. కథ జరిగే స్థలం ఒక్కటే: అమెరికా, అదీ పేరుకే! ఆయన, ఆవిడ ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటారు. అంతవరకూ బాగానే ఉన్నది. ఆవిడ ఉద్యోగం చేస్తున్నా, పనినుంచి తిరిగి రాగానే ఇంటిలో వంట చేయాలి. ఇంటికి తిరిగి రాగానే తెలుగు ఆడపడుచుగా మారిపోవాలి. అది ఆయన కోరిక. అది అన్నివేళలా సాధ్యం కాదు, సులభం కూడా కాదు. దానితో సంసారంలో ఘర్షణలు ప్రారంభం!

కొన్నికథల్లో ఈ కొత్తకాపురంలోకి అత్తమామలు వస్తారు. వాళ్ళకి వీళ్ళ పద్ధతులు సుతరామూ నచ్చవు. చికాకు! అయితే, ఈ రకం కథలు అల్లే వాళ్ళల్లో చాలామందికి తమ కథలని ఏదోరకంగా సుఖాంతం చెయ్యాలనే మథన కనిపిస్తుంది. కథకుడు ఆమెనీ అతన్నీ తాత్కాలికంగా వేరుచేస్తాడు. అప్పుడు ఈ కథ ఆంధ్రాలో కూడా అచ్చయ్యే అవకాశాలు ఎక్కువ. అక్కడ పత్రికలలో అచ్చవడం గొప్పగా భావించడంతో, అక్కడి కథల్లా ఇక్కడి కథలని బలాత్కారంగా మలచడం కొందరి కథకుల్లో కొట్టవచ్చినట్టు కనబడుతుంది. మరి కొన్ని కథల్లో ఆవిడ ఇండియా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఈ తరహా కథల్లో, అంటే ఫార్ములా కథల్లో, జంపాల చౌదరి చెప్పినట్టుగా ఆస్టిన్‌, అట్లాంటాకి బదులు హైదరాబాదో, అనకాపల్లో అని మారిస్తే కథకి ఏ విధమైన ఢోకా లేదు.

మరికొన్ని కథలలో వస్తువు ఇదే! ఇక్కడి ఫామిలీ లైఫ్! అయితే కథలో మరొక ట్విస్ట్. అతను మరోకులం వాడు. ఉదాహరణకి అగ్రకులం వాడనుకోండి. ఆమె కులం వేరు! అయినా, ఆమెను ప్రేమించి పెళ్ళాడతాడు, అక్కడే, ఆంధ్రాలో! ఆమె పేద కుటుంబం నుంచి వచ్చింది. ఇద్దరి తల్లిదండ్రులూ పెళ్ళికి కూడా రారు. ఇంతవరకూ సహజత్వంలో లోటులేదు. ఇటువంటివి జరుగుతున్నాయి కదా! ఆ భార్యా భర్తలిద్దరూ అమెరికా వచ్చేస్తారు. అతనికి ఉద్యోగం. ఆమెకు ఉద్యోగం వచ్చేటంత చదువు లేదు. ఏదో వానాకాలం చదువే! ఇక్కడ చదువుకుంటానంటుంది. అతను సరేనంటాడు. అక్కడిదాకా బాగుంది. ఆమె కాలేజీలో ఎవరో మరో తెల్లవాడితో – వాడిపేరు జాన్‌ అనుకోండి! – ఆమెకు వాడితో చనువుగా ఉండటం మొదలవుతుంది. ఇటువంటి సంఘటనలు అమెరికాలో మాత్రమే జరుగుతాయనే భ్రమకి కారణం తెలియదు! కథని మరింతబాగా బాగా అమెరికనైజ్‌ చెయ్యాలనే దృష్టితో, భర్తకి భార్యపై అనుమానం కలిగించాలి. ఇద్దరి మధ్యా అపార్థాలూ, పోట్లాటలు. వేరుపడటం, విడాకులు. అతను వెంటనే ఇండియా వెళ్ళి ఈ సారి అమ్మా నాన్నలు కుదిర్చిన డాక్టర్‌ అమ్మాయిని, తనకులస్తురాలిని, యధావిధిగా శాస్త్రయుక్తంగా తిరపతిలో పెళ్ళి చేసుకొని వస్తాడు. అరేంజ్డ్ మేరేజస్‌ మంచివనే నీతి బోధతో, కథ అతనికి సంబంధించినంత మటుకూ సుఖాంతం!

మరొక పెద్ద సినిమాటిక్‌ ట్విస్ట్. మొదటి భార్యని జాన్‌ వంచన చేస్తాడు! అంతకన్నా పెద్ద ట్విస్ట్. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని కథల్లో ఆమెని చంపెయ్యవచ్చు. కొన్నిటిలో ఆమె వికలాంగి అయి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఈ జాన్‌ అన్న తెల్లవాడిని జగన్నాధం అనే జగ్గయ్యపేట వాస్తవ్యుడిగా చేస్తే ఈ కథ తెలుగు సినిమాకథే అవుతుంది! ఇలాంటి కథలు తెలుగు సినిమాలు చూసి రాస్తున్నట్టుగా కనిపిస్తాయి. లేదా, తెలుగు సినిమా తయారీ కోసం రాస్తున్నట్టుగా ఉంటాయి.