ఈమాట » రెండు శ్రీల కవి

Expand to right
Expand to left

రెండు శ్రీల కవి

ఇదిలా వుండగా, కమ్యూనిస్టు పార్టీ తెలుగు దేశంలో అత్యద్భుతమైన రీతిలో ఇటు కార్మికులూ, అటు కర్షకులూ లేని కార్మిక కర్షక పార్టీగా మధ్యతరగతి మేధావి వర్గ నాయకత్వంలో వృద్ధిపొందుతోంది. మొదట్లో ఇంగ్లండ్ లోని మార్క్సిస్టు నాయకులు చెప్పిన మార్గంలోను, దరిమిలా రష్యా నేతలు చెప్పిన అడుగుజాడల్లోనూ, చక్కగా ఎర్ర జెండాలు ఎగరవేస్తోంది. జీవితంలో, గాంధీగారి అనుయాయిగా నిత్యం రెండు పొట్టి ఖద్దరు లాగూలూ, రెండు ఖద్దరు చొక్కాలు తప్ప ఇంకే బట్టలూ లేని సామాన్య వ్యక్తిగా, పార్టీ మెస్సులో తిండి తింటూ అందరితో కలిసి పనిచేసే పుచ్చలపల్లి సుందరయ్య గారూ, అంతకన్నా కాస్త ఎక్కువ విశ్వవిద్యాలయపు వాసనతో చండ్ర రాజేశ్వరరావు గారూ పార్టీ శ్రేణులని తమ ఉన్నత వ్యక్తిత్వాలతో ఉత్తేజపరుస్తూ ఉండేవాళ్ళు.

రష్యా పార్టీ అడుగుజాడల్లో నడిచే వీళ్ళకి, పార్టీకి సాహిత్యరంగం అనుబంధంగా ఉండడం ఎంత అవసరమో బాగా తెలుసు. కాంగ్రెసు పార్టీ కానీ, సోషలిస్టు పార్టీ కానీ మరే రాజకీయ పార్టీ గానీ అప్పటికీ ఇప్పటీకీ బోధపరచుకోలేని ఒక విశేషం కమ్యూనిస్టు పార్టీ తొలిరోజులనుంచీ బోధపరచుకుంది. రచయితలూ, కవులూ పార్టీకి అనుబంధంగా ఉంటే వాళ్ళు జనంలో అభిప్రాయాలని సునాయాసంగా మార్చడానికీ, కొండొకచో రక్షణ కవచంగా కాపాడడానికి అద్భుతంగా ఉపయోగపడగలరు, అన్న సంగతి. ఈ ఆలోచన మూలభావంగా తెలుగుదేశంలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. ఈ సంఘానికి రచయితలు స్వయంగా నాయకత్వం వహిస్తున్నట్టు కనిపిస్తుంది కాని, వెనకాతల పగ్గాలు చేతబట్టి వీళ్ళను నడిపించేవాళ్ళు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు.

తెలుగుదేశంలో అప్పటికే కవులూ, పండితులూ పరిషత్తులుగా, సమితులుగా పనిచేయడం ఆరంభమయింది. అఖిలాంధ్ర పండిత సభ, నవ్య సాహిత్య పరిషత్తూ, ఇవి కవుల్నీ పండితుల్నీ ఒక వేదిక మీద కలిపాయి. అప్పటికింకా రచయితలు అనే వర్గం ఏర్పడలేదు. కలిసి పనిచేసే ఈ సంస్థలలోని వారు భారతికి రచనలు పంపేవారు. అలాంటివి అసలు రచనలే కావని తిరగబడ్డ యువవర్గం ఆధునికపు ఆలోచనలతో వేరే పత్రికలకోసం ఎదురుచూసేది. కొంపెల్ల జనార్దనరావు ఉదయినిని నడపాలని అనుకోడం ఈ ఉద్యమంలో భాగమే.

కవి పండితులు నడిపే సంస్థలు మూత పడుతున్న కాలంలో చాప కింద నీరులా అభ్యుదయ రచయితల సంఘం వచ్చింది, అందులో పైకి కనిపించే అభ్యుదయ పదాన్ని అమాయికంగానో (ఇంకోరకంగా చూస్తే, బహుశా మాయికంగానో) చూసి, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారి దగ్గరనుంచి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారితో సహా చాలామంది ఈ సంఘంలోకి ఎగబడ్డారు. శ్రీశ్రీని ఈ సంఘంలోకి కమ్యూనిస్టు పార్టీ కావాలని ఆకర్షించుకుంది.

తాను మార్క్సిస్టు కాడు. తాను విప్లవకారుడు కాడు. ఏమన్నా అయితే అరాచక పురోగామి వాది. అస్థిమిత భావోద్రేకి. అనిశ్చల తీవ్రమనస్కుడు. అవిశ్రాంత అన్వేషి. చుక్కాని లేని పడవ. తెగిన గాలిపటం. తనకీ లోకానికీ పడదు. కానీ లోకం తనకి కావాలి. తానేదో లోకానికి చేయగలననే నమ్మకం. అంతలోనే నిరాశ. అంతులేని అశక్తత. ఇది అప్పటి శ్రీశ్రీ వ్యక్తిత్వం. ఇది నేను కల్పించింది కాదు. మహాప్రస్థానంలో ఉన్న పద్యాలన్నీ చదివితే మీకు తట్టే వ్యక్తిత్వం ఇదే. కాని అవన్నీ కలిపి చదివి అందులో వినిపించే వ్యక్తిని పట్టుకోడానికి మహాప్రస్థానం ప్రచురించిన తర్వాతి వాతావవరణం అవకాశం ఇవ్వలేదు. తానై శ్రీశ్రీ అలాటి పని చెయ్యడానికి ప్రోత్సాహం ఇవ్వలేదు.

మహాప్రస్థానంలో ఉన్న పద్యాలన్నీ కలుపుకుంటే శ్రీశ్రీ, అతని సహచరుడైన శ్రీరంగం నారాయణ బాబుతో సహా ఒక కొత్త అతినవ్య (మోడర్నిస్ట్) కవిత్వం రాస్తున్నాడని బోధపడుతుంది. ఆధునిక కవిత్వం మనం ఎరుగుదుం. అతినవ్య కవిత్వం అంతకన్నా భిన్నమైనది. ఆధునిక కవిత్వం తెలుగులో గురజాడతో మొదలైంది అంటారు. కానీ, తెలుగులో ఆధునికత పదహారో శతాబ్దంలోనే మొదలైందనీ, గురజాడ దానికి పొడిగింపనీ, ఆ తరవాత వలస రాజ్య కాలంలో ఇంకోరకమైన ఆధునికత వచ్చిందనీ, దాన్ని తెలుగులో ఉండే ఒకే ఒక్క ఆధునికతగా భ్రమ పడుతున్నామనీ నా వాదన. అది ఇప్పుడు ప్రస్తుతం కాదు. కానీ, శ్రీశ్రీ, అతని అనుయాయులూ అప్పట్లో రాస్తున్న అతినవ్య కవిత్వం ఈ రెండు రకాల ఆధునికతకీ భిన్నమైనది. యూరోపులో మోడర్నిజం అనే పేరుతో దాదాపు ఇరవై యేళ్ళపాటు సాహిత్య కళా రంగాల్లో నడిచిన ఉద్యమానికి, శ్రీశ్రీ, అతని అనుయాయులూ రాసిన అతినవ్య కవిత్వానికీ చాలా దగ్గర పోలికలున్నాయి.

శ్రీ శ్రీ మహాప్రస్థానం రాసినది 1930లలో. తెలుగులో ఆనాటి కవులు అప్పటి ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మన్ రచయితలకి సమకాలికులమని, సమవుజ్జీలమని అనుకునేవారు. విశాఖపట్నంలో చాసో, శ్రీశ్రీ, రోణంకి అప్పలస్వామి, శ్రీరంగం నారాయణ బాబు ఇంకా వీళ్ళ స్నేహితులు, ఆ వూళ్ళో రీడింగ్ రూమ్ అనే పేరుతో ఉన్న లైబ్రరీలో ఇంగ్లండు నుంచి వచ్చే పత్రికలు చదివేవారు. ఆ తరువాత శ్రీశ్రీ మద్రాసు వెళ్ళినా ఆ సంబంధాలు పోలేదు. కూర్చున్నది విశాఖపట్నంలోనే కావచ్చు లేదా మద్రాసులో కావచ్చు. కానీ వీళ్ళకి ప్రత్యక్ష సహచరులు లండన్ లోనూ పారిస్ లోనూ రాస్తున్న కవులే. ఆనాటి రాజకీయాల, ఆర్ధిక పరిస్థితుల ప్రభావాలు వీళ్ళ జీవితాలలో ప్రత్యక్షంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అప్పటి ఆర్థిక మాంద్యం వీళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేసింది. మనది వేరే దేశం వేరే సంస్కృతి అనే భావనకి తావు లేకుండా చేసింది. ప్రపంచ కుటుంబంలో మనం భాగస్వాములం అన్నంతగా అంతర్జాతీయ తత్వం వీళ్ళలో పాతుకుపోయింది. కవుల్లో అప్పుడున్నంత బలంగా ప్రపంచ భావన, ప్రపంచీకరణ గురించి ఇంతగా మొత్తుకుంటూన్న ఇప్పుడు కూడా లేదు.

దీని ఫలితాలు మహాప్రస్థానం నిండా కనిపిస్తాయి. స్విన్ బర్న్, ఎడ్గార్ ఎలన్ పో, ఎమీల్ ఫర్హారెన్ - వీళ్ళ కవితలు నిరాఘాటంగా మహాప్రస్థానంలో చోటు చేసుకున్నాయి. మిగిలిన పద్యాల్లో చాలావాటిలో యూరోపియన్ కవుల ప్రభావాలు, ప్రరోచనలు తేలిగ్గా దొరుకుతాయి. అయినా, ఇవి నూటికి నూరు పాళ్ళూ తెలుగు పద్యాలే. తెలుగు చేత కొత్త కొత్త పనులు చేయించడం, ఆ రోజుల్లో కవులు పనిగట్టుకుని చేసిన పని. సంప్రదాయాన్ని ఎదుర్కోడం అప్పటి నవ్య కవులందరూ ఉమ్మడిగా చేశారు. చెపితే నమ్మరు గానీ అప్పటి విశ్వనాథ సత్యనారాయణ గారితో సహా అందరూ అతినవ్య కవిత్వం రాసి, సంప్రదాయాన్ని ఎదుర్కున్న వారే. ఆయన రాసిన కిన్నెరసాని పాటలు కొంపెల్ల జనార్దనరావుతో కలిసి శ్రీశ్రీ విని ముగ్ధుడైపోయేవాడు. శ్రీశ్రీ కవితా ఓ కవితా చదివినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్ష స్థానం లోంచి లేచి వచ్చి అతన్ని కౌగిలించుకున్నారు. తెలుగులో నేనంటున్న అతినవ్య (మోడర్నిస్ట్) కవితావిర్భావానికి కవులు ఉద్యమిస్తున్న కాలం అది.

తరవాత కొన్నేళ్ళపాటు శ్రీశ్రీ అధివాస్తవిక రచనలు చేశాడు. పఠాభి ఫిడేల్ రాగాలు రాస్తున్న రోజుల్లో (1939) అతని సాహచర్యంలో రకరకాల కొత్త కవిత్వం రాశాడు. క్రమక్రమంగా శ్రీశ్రీ ‘కొత్త’కి పర్యాయపదం అయ్యాడు.

భావకవిత్వం అప్పటికి చెప్పుకోదగిన కొత్త కవిత్వం. భావకవుల పనినంతటినీ గుది గుచ్చి ‘వైతాళికులు’ సమర్థంగా అందించింది. కృష్ణశాస్త్రి గారు దానికి తెరవెనుక సూత్రధారి. పేరు ముద్దుకృష్ణదైనా పని కృష్ణశాస్త్రిది. ఆ కూటమిలో చేరకూడదని అప్పటి అతినవ్య కవులు శ్రీశ్రీతో సహా ఉమ్మడిగా నిర్ణయించుకున్నారు. (అయినా, ఆఖరి క్షణంలో ఎవరికీ చెప్పకుండా శ్రీశ్రీ తన పద్యాలు వైతాళికులలో చేర్చడానికి ఇచ్చి వచ్చాడు. కానీ ఈ విషయంపై చర్చ ఇక్కడ అప్రస్తుతం.)

ఆనాటి అతినవ్య కవుల్లో ఒకరుగా పుంఖానుపుంఖంగా రచనలు చేస్తూ మద్రాసులో చిల్లర ఉద్యోగాలు చేస్తూ కాలం గడిపేవాడు శ్రీశ్రీ. ఈ కాలంలో శ్రీశ్రీ రాసిన అధివాస్తవిక రచనలు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన అతినవ్యతకి ఉదాహరణలు. వాటిని స్వయంగా శ్రీశ్రీయే మార్క్సిస్టు ఉద్యమకారుల ఒత్తిడికి లోబడి తరువాతి కాలంలో తిరస్కరించడం తెలుగు సాహిత్యంలో ఒక విషాదం. అధివాస్తవికత తన జీవితంలో ఒక దశాచ్ఛిద్రం అని శ్రీశ్రీ ప్రకటించుకున్నాడన్న మాట పక్కకి పెట్టి, అధివాస్తవిక కవిగా తనను తాను గుర్తించుకోలేక పోయినా మనం గుర్తించి, ఆ కవిత్వాన్ని తిరిగి చదివి కొత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీరంగం నారాయణ బాబుతో విడిపోయి శ్రీశ్రీ తనకి తాను అపకారం చేసుకున్నాడు. నారాయణ బాబు చచ్చిపోతూ ఆరుద్రకి ఇచ్చిపోయిన కవిత్వ లిఖిత ప్రతి, శ్రీశ్రీతో ఆరుద్రకి విబేధాలు వచ్చిన తర్వాతగాని నవోదయ రామ్మోహనరావుగారికి ప్రచురణకి చేరలేదు. ఆ రచనల్లో సంస్కరణలు చేయగలిగిన సరైన చారిత్రక నేపథ్యం రాయగలిగిన ఒకే వ్యక్తి ఆరుద్ర ఆపని చెయ్యలేదు. అంచేత ఒట్టి లిఖితప్రతి ఉన్నది ఉన్నట్టుగానే అచ్చయింది. అప్పటికి నారాయణ బాబుని అంతా మరిచిపోయారు.

కాని నారాయణబాబుని గుర్తుపెట్టుకుని, శ్రీశ్రీ సంపూర్ణ సాహిత్య సంకలనాలు పరిశీలిస్తే అందులో ఉన్న చాలా రచనలకీ, నారాయణ బాబు రచనలకీ పోలికలు చాలా కనిపిస్తాయి. అనేక విచిత్ర రచనలూ, కొత్త ప్రయోగాలూ ఉభయులూ కలిసి చేస్తున్నారనిపిస్తుంది. అప్పటికి గాని, శ్రీ శ్రీ కవితా వ్యక్తిత్వం అతినవ్య (మోడర్నిస్ట్) ఉద్యమానికి నాయకత్వం వహించగలిగేంత బలమైనదని మనకు స్పష్టంగా తెలీదు.

కాని, ఈ కవితా వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టగల సంఘటన ఈ సమయంలోనే జరిగింది. అదే అభ్యుదయ రచయితల సంఘ నిర్మాణం. అభ్యుదయ రచయితల సంఘం తెలుగులో అతినవ్య కవిత్వానికి అడ్డుకట్ట వేసి కవిత్వాన్ని వ్యక్తి నుంచి సమూహం వైపూ, అంతరంగం నుంచి బహిరంగం వైపూ, కవిత్వం నుంచి నినాదం వైపూ నడిపించింది. శ్రీశ్రీ స్వయంగా మహాప్రస్థానంలో ఉన్న అనేక అతినవ్య కవితల్ని విస్మరించి మరో ప్రపంచ గీతాన్నీ, జగన్నాధుని రథచక్రాల గీతాన్నీ, ప్రతిజ్ఞనీ, గర్జించు రష్యా గీతాన్నీ పరాకాష్టగా భావించాడు.

ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేస్తుంది, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రష్యా యుద్ధంలోకి దిగడం తెలుగు యువకుల మనస్సుల్లో కలిగించిన ఉద్రేకానికి శ్రీశ్రీ గర్జించు రష్యా గీతం ఆకారాన్నివ్వడం తలుచుకుంటే. కాని ఈ నాడు ఎప్పుడూ నిజంగాలేని ఒక కాల్పనిక రష్యాని ఊహించుకుంటే తప్ప ఆ గీతానికి మీమనస్సుల్లో కనీసపు కవిత్వచ్చాయగా కూడా అస్తిత్వం ఏర్పడదు. నిజానికి ఇప్పుడు అది చదువుతుంటే నవ్వొస్తుంది.

క్రమంగా శ్రీశ్రీ తనకే అర్థం కాని, అర్థం చేసుకోడానికి ఎన్నడూ ప్రయత్నించని మార్క్సిస్టు ఆర్థిక విధానాలనీ, రాజకీయ తాత్వీకతనీ తనకు ఆపాదించుకొని తేలికపాటి ఉద్వేగానికి ప్రతీకగా నిలబడ్డాడు. అభ్యుదయ కవిత్వపు ఉద్యమ దశలో ఎవరో నడిపిస్తుంటే నడిచే బుట్టబొమ్మలా సాహిత్య రంగంలో ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తాను కవిగా క్షీణించి పోయాడు. కాని, మహాకవిగా ఒక విలక్షణమైన ఉద్యమానికి ప్రాణం పోశాడు. ఈకాలంలో అతను రాజకీయ ప్రకటనలూ, సాహిత్య ప్రవచనాలూ ఒకే రకమైన డొల్లతనంతో నిండి వుండేవి. అవి అతని ఆరాధకులకి, (నాకు కూడా) గొప్పగా పనికొచ్చేవి. వాళ్ళకి అవసరమైన రూపంలో కనిపించడమే అతను చేయదల్చుకున్న పని.

ఆతరవాత ఉద్యమాల తీవ్రత చల్లారిన తరవాత శ్రీశ్రీ సాహిత్య రంగంలోంచి పక్కకి వెళ్ళి సినిమా పాటలు రాశాడు. సరిగ్గా అదేకాలంలో, నక్సల్బరీ ఉద్యమం మొదలైనప్పుడు, శ్రీశ్రీకి అరవయ్యేళ్ళు నిండగా, విశాఖపట్నంలో అతనికి చేసిన షష్టిపూర్తి చారిత్రకంగా చాలా ముఖ్యమైన సంఘటన. అందులో చురుగ్గా పాల్గొన్నవాడిగా నేను ఇప్పుడు వెనక్కి సాలోచనగా చూసుకుంటే అప్పటి ఉత్తేజంలో నాకు బోధపడని సంగతులు ఇప్పుడు చాలా కళ్ళకు కడుతున్నాయి. అందులో ఒక్కటి మాత్రం చెప్తాను.

ఆనాటి షష్టిపూర్తిలో అన్ని వేలమంది జనం మధ్య వేదిక మీద శ్రీశ్రీ ఒంటరిగా కూర్చున్నాడు. అప్పటి ఉద్వేగపూరిత వివాదాత్మక సంఘటనల మధ్య శ్రీశ్రీ నిజంగా లేడు. అప్పటికే తన వ్యక్తిత్వంతో నిమిత్తం లేని ప్రతీకగా అయిపోయానన్న సంగతి అతనికి ఎక్కడో అంతరాంతరాలలో తెలిసినట్టే ఉంది. అప్పటి శ్రీశ్రీని గుర్తుకు తెచ్చుకుంటే, అసలు తనకేమీ పట్టనట్టుగా అదేదో ఎవరికోసమో ఎవరికో జరుగుతున్న ఉత్సవంగా, అన్నిటికీ దూరంగా ఉన్నవాడిలా కూర్చున్నాడని అనిపిస్తుంది. అంతమందీ అక్కడ ఉద్వేగంగా మాట్లాడిన తరవాత, ఆరుద్ర ఒక పెద్ద దుమారం సృష్టించే ఉపన్యాసం చేసిన తరవాత, శ్రీశ్రీ లేచి నిర్లిప్తంగా, సాదా గొంతుకతో నాలుగు మాటలు చెప్పి కూర్చున్నాడు.

ఆ తరువాత శ్రీశ్రీ నూటికి నూరుపాళ్లు సాహిత్య రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. విరసం నడిపించింది, అతను నడిచాడు. కవినాయకుడిగా చెట్టంత ఎత్తు ఎదిగాడు, కానీ కవిగా చల్లారిపోయాడు. రెండు మాటల్లో ముగించాలంటే శ్రీశ్రీ కవిత్వం రాస్తున్నప్పుడు మార్క్సిస్టు కాడు. మార్క్సిస్టులతో కలిసి నడిచినప్పుడు కవి కాడు.

(ఇది పూర్తిగా రాసిన వ్యాసం కాదు. తరవాత రాయబోయే వ్యాసానికి ఒక రేఖామాత్రమైన ఊహ మాత్రమే. కొద్దిరోజుల్లో దీన్ని వివరంగా రాస్తాను. - నారా)

ముందరి పేజీ(లు) 1 2

రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌ లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నారు. పాతికేళ్ళపైగా అక్కడే ఉన్నారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాసారు. ...

 

(3 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Rohiniprasad అభిప్రాయం:

    January 1, 2010 12:26 pm

    కవులూ, రచయితలూ కూడా మామూలు మనుషుల్లాగే ఆలోచిస్తూ, తమ శక్తిసామర్థ్యాల మేరకు రచనలు చెయ్యడం మొదలెడతారు. ఆ రచనల ప్రభావం సాహితీరంగంమీదా, సమాజంమీదా రకరకాలుగా పనిచేస్తుంది. వాటి ఫలితాలు మళ్ళీ ఆ రచయితలని ప్రభావితం చేస్తాయి. వీటన్నిటివల్లా వారి అభిప్రాయాలు బలపడడమో, బలహీనపడడమో, మరింత స్పష్టతని సంతరించుకోవడమో స్వాభావికంగా జరగడంతో వారి తరవాతి రచనలూ, వారి దృక్పథమూ మారే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిణామాలు ప్రసిద్ధ రచయితలందరిలోనూ కనిపిస్తాయి. ఇది సహజమే.

    కొన్ని దశాబ్దాలపాటు, వివిధ సందర్భాల్లో, వివిధ ప్రేరణలూ, ఒత్తిళ్ళూ పనిచేస్తున్నప్పుడు వారు వెలువరించే రచనలన్నీ ఒకేలా ఉండాలని అనుకోవడం సరికాదు. ఎంత గొప్ప రచయితయినా మనం అతని రచనల్లో కొన్ని బావున్నాయనీ, కొన్ని బాలేవనీ అనుకోవడంలో తప్పులేదనుకుంటాను.

    రచయితలూ, రాజకీయపార్టీలూ ఒకరినొకరు సందర్భానుసారం ‘వాడుకోవడం’ మామూలే. కేవలం ఆ కారణంగా రచయితలను దుమ్మెత్తిపొయ్యవలసిన అవసరం లేదనుకుంటాను. ప్రేరణ ఎటువంటిదైనా రచనను evaluate చెయ్యవచ్చు. వ్యాసకర్త చెప్పినట్టుగా సమకాలీన వాతావరణం గడిచిపోయిన తరవాత భావితరాలు ఆవేశ కావేషాలకతీతంగా వాటిని సమీక్షించుకోవచ్చు.

    కన్యాశుల్కమనేది సమస్య కాకుండాపోయిన తరవాత కూడా గురజాడ నాటకం చదివి ఆనందిస్తున్నాం కదా. నిజాం జులుం గతించిపోయాక కూడా బండెనక బండిగట్టి పాట ప్రేక్షకులను ఎంత ఉత్తేజపరుస్తుందో ముంబయిలో 2008లో నేను నిర్వహించిన సంగీతవిభావరిలో అందరం గుర్తించాం.

    శ్రీశ్రీనో, మరొక రచయితనో ఈనాడు మనం అర్థంచేసుకుంటున్నప్పుడు గతంలో అతను పొందిన ప్రశంసలనూ, విమర్శలనూ అతిగా పట్టించుకోకుండాఉంటే మనకే మంచిదేమో. అందరూ గొప్ప కవులే అయినప్పటికీ శ్రీశ్రీ, విశ్వనాథ, ఆరుద్ర, సినారె మొదలైన కవులందరినీ కాలమే వారికి సముచితమనిపించే స్థానాల్లో నిలబెడుతుంది.

  2. rama bharadwaj అభిప్రాయం:

    January 1, 2010 2:38 pm

    రేఖామాత్రంగా నారాయణరావు గారు శ్రీశ్రీ గురించి శ్రీశ్రీ కవిత్వం గురించి చేసిన కొన్ని ఊహలమీద రేఖామాత్రంగా నాలో కల్గిన సందేహాలు క్లుప్తంగా ఇలాంటివి.

    ఇటీవల హైద్రాబాద్ లో పుస్తకప్రదర్శన జరిగింది. అందులో నా దృష్టిలో పడిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇలా ఉన్నాయి.

    తెలుగు సరిగ్గా చదవనుకూడా తెలియని..అర్ధంకాని కొందరు కుర్రకారు పనిగట్టుకుని పుస్తకాల షాపుల్లో అడిగి మరీ శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకాన్ని కొనుక్కోవడం. నేను వారిని ఆ పుస్తకాన్ని ఎందుకు కొంటున్నారని అడిగాను. అందులో మెడిసన్ ఆఖరు సంవత్సరం చదివే ఒక అమ్మాయి నాతో చెప్పిన జవాబు ఇదీ!! “మామ్ నాకు మహాప్రస్తానం భాష ఏమీ బోధ పడదు. కానీ ఆ పోయెమ్స్ చదివితే నాకు బాగుంటుంది. ఒక ఆకర్షణ ఏదో ఆ మాటల్లో ఉంది. అందుకని కస్టపడి అయినా నేను మహా ప్రస్తానాన్ని చదవాలని అనుకుంటున్నాను అంది.

    నేను ఇప్పుడు చెప్పిన అమ్మాయి విప్లవ సంస్థల్లో పనిచేసే అమ్మాయి కాదు. మహాప్రస్థానపు పూర్వాపరాలేవీ ఆ అమ్మాయికి తెలియవు. ఆ అమ్మాయి ఆరుద్రని గాని విరసం ఆవిర్భావాన్ని గానీ ఎరగదు. వాటివేటిమీదా ఆ అమ్మాయికి ఆసక్తి కూడా ఉన్నట్టు లేదు.

    ఒకానొక రాజకీయ సంక్షుభిత కాలం గడిచిపోయేకా నారాయణ రావు అభిప్రాయం ప్రకారం మహాప్రస్థానం నాటి ఆవేశాలు సంపూర్తిగా చల్లారాకా నిజానికి ” మరోప్రపంచం” లాంటి కవిత్వపు అవసరం లేని కాలానికి ఆ కవిత్వం మీద ఆసక్తీ లేదా అనురక్తీ కలగడానికి మరి వీలు లేదు. చాలావరకూ “అభ్యుదయ కవిత్వపు స్పందనలు అలా ఎన్నో అలా చల్లారిపోయినవి ఉన్నాయి కూడా!! కానీ మహాప్రస్థానం విషయంలో ఆనాటి రాజకీయ సందర్భం ప్రపంచంలో మారిన ఈనాటికీ ఆ సంకలనం మీద మాత్రం ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేక పోవడాన్ని మనంచూడవచ్చు.

    నారాయణరావుగారు ఏ వయసులో శ్రీశ్రీ మహాప్రస్థానం చేత ప్రేరణ పొందారో ఆ వయసులోని యువతీ యువకులు ఈనాటి తరం వాళ్ళు సైతం ప్రేరణపొందటం వెనక గల కారణాన్ని కేవలం “జాంతవమైన ప్రేరణ గా మాత్రమే” క్లుప్తీకరించి మాట్లాడలేం!! ఈనాటి తరానికి కూడా ఆ పుస్తకంలో కావలసినదేదో ఉందన్న అంచనాకి రావాల్సి ఉంటుంది.

    శ్రీశ్రీతో తన నడివయసు దాకా సరిపడా పరిచయం కల్గిన నారాయణరావు సూటీగా తనకి కల్గిన అనుమానాలనీ..లేదా తన పరిశీలననీ శ్రీశ్రీతోనే ఎందుకు ప్రస్తావన చేయలేకపోయారన్న ప్రశ్నకి ఇక్కడ చోటుంది. అది అటుంచితే.. శ్రీశ్రీ జతించిన ఒక పాతిక ఏళ్ళకి నారాయణరావుకి మహాప్రస్థానం లోని గేయాలు రష్యా మీద రాసిన దానితో సహా ” నవ్వొచ్చేలా ఉండి ఉండొచ్చు”. కానీ ప్రపంచానికి రష్యా ఒక కాల్పనికమైనదే అయినా ఒక స్వప్నాన్ని అందించిన మాట వాస్తవం. ప్రపంచ సాహిత్యానికి రష్యన్ రచయితలు ఎన్నో రకాలుగా ప్రేరణని ఇచ్చారన్నది ఒక వాస్తవం. ఇక్కడ రష్యా అన్న దాని ఉథ్థాన పతనాలు మనం చూసాము గనక ఆ మాట అనగలుగుతున్నాం!! అది మనకి సమీప కాలంలో జరిగిన రాజకీయ ఘటన. అదే మనకి సుదూరమైన రోమన్ గ్రీక్ రాజకీయ సాహిత్య ఘటనల మీద మనం ఇలాంటి వ్యాఖ్యానాలు చేయగలమా?? రాజకీయ సంక్షోభం సంభవించిన అన్ని ప్రాంతాల్లోనూ ఆనాటి కాలంలో దానికి సంబంధించిన సాహిత్య స్పందనలు వస్తాయి.ఆనాటికి అవి సత్యం అవి ఆనాటికి ఒక ఆదర్శం! శ్రీశ్రీ మహాప్రస్థానం తో సహా!!

    ఇంక శ్రీశ్రీ సృజనలోని నిజాయితీని మనం ఇవాళ శంకించడంలో అర్ధంలేదు. ఆయన మార్క్సిస్ట్ గా మారి వాటిని రాసాడా లేదా కేవలం నిబధ్ధత లేని ఉత్తుత్తి తెచ్చుకోలు ఉద్రేకాన్ని ప్రదర్శంచాడా అన్నది ఏ రుజువులకీ దొరకనిది.అలాంటి ప్రకటనలకి ఏ చెల్లుబాటూ ఉండదు . అలాగే ఆయన నాయకత్వం మీద కూడా!!

    శ్రీశ్రీ ప్రభావం అన్నది ఒక వాస్తవం. శ్రీశ్రీ సాహిత్యం ఒక అవసరం అయిన మాట వాస్తవం.ఒక తరానికి కాదు రెండు తరాలకి కాదు. ఈనాటికీ ఆయన సాహిత్యంలో ఉత్తేజ పూరితమైన ఒక ప్రాణశక్తి కవిత్వ పిపాసువులకి దొరుకుతోంది. నారాయణరావుగారికి అర్ధ రహితంగా కన్పించి ” నవ్వుతెప్పిస్తూన్న’ విధానంలో కాకుండా శ్రీశ్రీ గేయంలోంచి తమతమ ఆవేశాలకి తమతమ ప్రేరణలకి మార్గాలు వెతుక్కుంటున్న ఈనాటితరం శ్రీశ్రీలో చూస్తున్నదేమిటి అన్నది అర్ధం చేసుకోవాల్సి ఉంది.

    శ్రీశ్రీ కాలంనాటి వ్యక్తిగత స్పర్ధలతో సంబంధం లేని తరాలు ఆయన కవిత్వంలో ఏమిటి వెతుక్కుంటూ ఇవాళ్టికీ మహాప్రస్థానాన్ని కొనుక్కుంటున్నారో గమనించవలసి ఉంది. అది తెలియందే అతి సునాయాసంగా శ్రీశ్రీని అంచనా వేయడం కస్టం. కవితాస్పందన వేరు. అకడమిక్ విశ్లేషణ వేరు. శ్రీ శ్రీ కవిత్వం మెదడు పైపై పొరలనే తాకిందో..మరింతగా ఇంకి ఈనాటికీ మనసులోతులనే అంటిందో తెలుసుకోగల కొలమానం ఒక్క శ్రీశ్రీ కవిత్వమే!! దానికి సాటి అయినది అది మాత్రమే!! ఆకాశానికి సాటి అయినది ఆకాశమే అయినట్టూ..సముద్రానికి సాటి అయినది ఒక్క సముద్రమే అయినట్టు!!

    రమ.

  3. mOhana అభిప్రాయం:

    January 1, 2010 4:20 pm

    మలయాళంలో ఉందో లేదో తెలీదు కానీ, కన్నడములో మహాప్రస్థానం అనువదించబడినది. మచ్చుకు ఒక ఉదాహరణ -

    శ్రీశ్రీయవర మహాప్రస్థాన మత్తొందు ప్రస్థాన - ఆయ్ద కవితెగళు నుండి
    (అనువాదం - ఎచ్ ఎస్ శివప్రకాశ్, బంజగెరె జయప్రకాశ, రాఘవేంద్ర రావ్
    ప్రచురణ - సాహితీ మిత్రరు, బెంగళూరు, 1991)

    ఒందు రాత్రి (ఒక రాత్రి)

    గగనవెల్లా తుంబి
    హొగె హొగెయంతె హరడి
    బహుళపచమి జ్యోత్స్న
    భయపడిసువుదు నన్న

    ఆకాశద మరుభూమి
    ఎల్లెడె, అకటా!
    ఈ రాత్రి కెరళిదె
    మరళ బిరుగాళి!

    గాళియలి గోచరిసద
    గడసు దెవ్వగళు
    భూ దివగళ మధ్యె
    ఈజుతలివె!

    బాయ్తెరెదు, ఘోషిసి
    ఉక్కువుదు సాగర!
    మదగజద కళేబరదంతె
    చలిసద బెట్ట!

    అంబరద మరుభూమియలి
    కాలు కత్తిరిసి హోద
    ఒంటె ఒంటెయంతె
    ఇహుదు చంద్రమ!

    విశ్వవెల్లా హరడి
    బెళ్ళదిబూదియ తెరది
    బహుళ పంచమి జ్యోత్స్న
    భయ పడిసువుదు నన్న!

    విధేయుడు - మోహన

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a