ఈమాట » శ్రీశ్రీ అనువాదాలు - ఒక పరిశీలన

Expand to right
Expand to left

శ్రీశ్రీ అనువాదాలు - ఒక పరిశీలన

ఈ కవిత అంటే శ్రీశ్రీకి చాలా ఇష్టమట. ఒక కమ్యూనిస్టు కవి మాత్రమే ఇటువంటిది రాయగలడని శ్రీశ్రీ అభిప్రాయం. నిజానికి ఈ కవిత రాసిన గ్రీకు కవి ఒడిసియస్ ఎలీటీస్ (Odysseas Elytis) కమ్యూనిస్టు కాదు. అతను గ్రీకు జాతీయతని పరిపూర్ణంగా ప్రేమించిన కవి. గ్రీకు భాషని, సంస్కృతిని అభిమానించిన కవి. తన జాతి చైతన్యవంతమవ్వాలని కవిత్వం రాసిన కవి. ఈ కవితలో అధివాస్తవిక ఛాయలున్నా ఇది ప్రధానంగా ప్రతీకాత్మక కవిత. ఇందులోని పిచ్చి దానిమ్మచెట్టు కాంతికీ చైతన్యానికీ ప్రతీక.

Whistling through vaulted arcades, tell me, is it the mad pomegranate tree
That leaps in the light, scattering its fruitful laughter
With windy willfulness and whispering, tell me, is it the mad pomegranate tree
That quivers with foliage newly born at dawn
Raising high its colours in a shiver of triumph?

నరనరాన నూతనోత్తేజం నిండిన అనుభూతి ఇది. ఇందులో విప్లవోద్రేకం కానీ కమ్యూనిజం కాని నాకు కనిపించలేదు.

ఇట్టే వెలుతురులోకి ఉరికేది
ఈ పిచ్చి దానిమ్మ చెట్టేనా, చెప్పవూ?
ఉయ్యాలలూగే గాలుల గుసగుసలలో
సారవంతమైన తన సంతోషాన్ని వెదజల్లేది
ఎవరు చెప్పవూ, ఈ పిచ్చి దానిమ్మ చెట్టేనా?
ఉదయవేళ అపుడే తొడిగిన మొగ్గలతో
ఊగుతూ ఉవ్వెత్తుగా తన రంగుల పింఛం విప్పి
విజయగర్వ రోమాంచంతో కులికేది
చెప్పవూ ఈ పిచ్చి దానిమ్మ చెట్టేనా?

అన్న శ్రీశ్రీ అనువాదంలో ఆ ఉత్తేజం నాకు కనిపించ లేదు. ‘సారవంతమైన తన సంతోషం’ అన్న పదబంధంలో ‘fruitful laughter’లోని ఆనందానుభూతి లేదు. పైగా మూలంలో ఉన్న వేగం (అంతా ఒకే వాక్యం అవడం వల్ల వచ్చిందది) ద్వారా కలిగే ఉత్సాహం అనువాదంలో కనిపించదు. అలాగే ఈ కవితలోని మరికొన్ని వాక్యాలు అనువదించడంలో శ్రీశ్రీ మూల కవిత తత్త్వాన్ని, సారాన్ని సరిగా గ్రహించలేదని అనిపిస్తుంది:

Is it the mad pomegranate tree that combats the cloudy skies of the world?

చెప్పవూ ఈ పిచ్చి దానిమ్మ చెట్టేనా ప్రపంచపు నీడలతో పోరాడేది

Fluttering a handkerchief of leaves of cool flame

ఆకుల పోకెట్ రుమాలు ఊపుతుంది? సరికొత్త నిప్పులు చెరుగుతుంది?

High as can be, with the blue bunch of grapes that flares and celebrates
Arrogant, full of danger-tell me, is it the mad pomegranate tree

నిర్లక్ష్యంగా ప్రమాదకరంగా
ద్రాక్షలతల వినీల శిఖరాల మధ్య
విందులతో వీరావేశంతో

అన్నిటికన్నా నన్ను ఆశ్చర్యపరచింది ఈ వాక్యాల అనువాదం:

Never sad and never grumbling-tell me, is it the mad pomegranate tree
That cries out the new hope now dawning?

ఒకసారి విషాదంతో, ఒకమారు విభ్రమిస్తూ
ఈ పిచ్చిదానిమ్మ చెట్టేనా, చెప్పవూ
ఏదో నవీన ప్రభాతాన్ని ఎలుగెత్తి చాటుతుంది?

మూలంలో దానిమ్మ చెట్టుకి విషాదమూ, విచారమూ ఏప్పుడూ ఏమాత్రమూ లేవు. మరి అనువాదంలో ఎందుకు వచ్చింది?! పైగా అది ‘ఏదో’ నవీన ప్రభాతం కానే కాదు. అది the new hope. మూల కవితలోని తత్త్వాన్ని గ్రహించకపోవడం వలన సరిగ్గా రాని అనువాదానికి ఈ ‘పిచ్చి దానిమ్మ చెట్టు’ ఒక ఉదాహరణ అని నా అభిప్రాయం.

మూల కవితలోని Themeని సరిగ్గా అనువదించగలిస్తే శైలిని అనుసరించక పోయినా అది మంచి అనువాదం అయ్యే అవకాశం ఉందనడానికి ఒక ఉదాహరణ బోదురు కప్ప అనే అనువాద కవిత. ఇది ట్రిస్టాఁ కోర్బియేర్ (Tristan Corbiere) రాసిన లె క్రపో (Le Crapaud) అనే ఒక ఫ్రెంచి కవితకి అనువాదం. ఫ్రెంచి కవితలోనూ, దాని ఇంగ్లీషు అనువాదంలోనూ ఒక రకమైన ఛందస్సు అంత్యప్రాస పాటించబడ్డాయి. కానీ తెలుగులో శ్రీశ్రీ వాటిని పాటించలేదు. అయినా అది నాకు పెద్ద లోపంగా కనిపించలేదు. మూలం లోని గొంతుల మార్పూ, వైరుధ్యాల మేళవింపు కొంత కనిపించకపోయినా మొత్తమ్మీద అనువాదం మూలకవిత ఇచ్చే అనుభూతినే కలిగిస్తోందని నాకు అనిపించింది. ఇది అధివాస్తవిక కవిత కావడం బహుశా దీనికి ముఖ్య కారణం అయ్యుండవచ్చు. ఆ కవిత ఇది:

బోదురు కప్ప

గాలిలేని రాత్రిపూట ఏదో పాట…
-దట్టపుటాకుల కత్తిరింపు బొమ్మలకి జిలుగు మలమలాలు చంద్రుడు సింగారిస్తున్నాడు.
ఓ పాట, ప్రతిధ్వనిలా అకస్మాత్తుగా, వడిగా, పూడ్చబడి, అల్లక్కడ, ఆ బోలెడు బురద కింద
-ఆగింది. దా! అక్కడే ఉంది. అదృశ్యంగా…

బోదురు కప్ప! అదిగో నీడలో! నా దగ్గరా జడుపు? నీ నమ్మకమైన కసాయిని కానూ నేను!
చూడండతణ్ణి. క్షౌరమైన కవిని, రెక్కైనా లేదు. బురదకి పుట్టిన కోకిల… దారుణం!
… పాడుతున్నాడే అరే! దారుణం!! ఏం? ఎందుకని దారుణం?

బాగా చూశారా అతని ప్రకాశించే నేత్రాలని?…
ఊహుఁ నిష్క్రమించాడు. చల్లబడి, తన రాతి కిందికి గుడ్ నైట్ – మీరు విన్న బోదురు కప్పని నేనే.

కొన్ని కొన్ని కవితలకి మాత్రం శైలి చాలా ముఖ్యమవుతుంది. దాన్ని సరిగా అనువదించకపోతే అనువాదం బాగుండదు. దీనికి ఒక ఉదాహరణ ‘చలికాలపు ఉదయం. ఇది అలెక్జాండర్ పుష్కిన్ (Alexander Pushkin) రాసిన వింటర్ మార్నింగ్ (Winter Morning) అనే రష్యన్ కవితకి అనువాదం. ఇది ఒక భావ కవిత. ఇందులో కూర్చిన ఛందస్సూ అంత్యప్రాసలూ ఆ కవితలోని భావుకతకి ఎంతో దోహదం చేస్తాయి.

Frost and sun – what a glorious day!
Yet still, sweet friend, you sleep away –
It’s time, gorgeous, for you to stir:
Open wide your dreamy eyes
To catch the dawn glow in northern skies –
Rise up like a northern star!

అని మొదలయ్యే ఈ కవితలో శీతకాలపు ఉదయం కవి హృదయంలో కలిగించిన ఉత్సాహానుభూతిని చాలా సమర్థవంతంగా ఆవిష్కరిస్తుంది.

హేమంత సూర్యకాంతి ఎంతమంచి దివసం
ఇంకా నిద్రపోతావేం? ఇది చక్కని ఉదయం!
సఖీ, సుభగ ముఖీ, చాలు సిగ్గులేని మగత
ఆవలింత మాను, నిదుర కనులు తెరువు సుంత!

అని మొదలయ్యే శ్రీశ్రీ అనువాదంలో మొదట అలాంటి తూగు కనిపించినా, పోనుపోనూ దానిని కోల్పోయి అనువాదం పేలవంగా మారుతుంది. పైగా అక్కడక్కడ పదాలలో గ్రాంధికపు వాసన ఇబ్బంది పెడుతుంది.

అనువాదంలో ఎదురయ్యే ఒక ముఖ్య సమస్య - మూల కవితలో ఆ సంస్కృతికి స్వంతమైన విషయాలను అనువాదంలోకి తీసుకురావడం. ఆ విషయాలను ఉన్నవున్నట్టుగా అనువాదంలో పెడితే, అనువాద భాషా పాఠకులకి అవి అర్థం కాకపోవచ్చు. ఆందువల్ల వాటికి ప్రత్యామ్నాయంగా అనువాద భాషా సంస్కృతిలోని విషయాలను ఔచితీమంతంగా వాడవలసి ఉంటుంది. దీనిని గియోమ్ అపోలినెయర్ (Guillaume Apollinaire) రాసిన జోన్ (Zone) అనే కవిత అనువాదంలో శ్రీశ్రీ అద్భుతంగా నిర్వహించాడు. మూలం లోని Eiffel Tower కుతుబ్ మీనార్ గానూ, Pope Pius X శ్రీ శంకరాచార్యులుగానూ, Christ’s flaming halo మహాశివుని మండే మూడవ నేత్రంగానూ - ఇలా మూలంలోని ఫ్రెంచి సాంస్కృతిక చిహ్నాలన్నీ అనువాదంలో తెలుగుదనాన్ని సంతరించుకున్నాయి. పదాలలోనూ వాక్యాలలోనూ ఎంతో స్వేచ్ఛ తీసుకున్నా మూలంలోని Theme, Tone, Style మూడింటినీ అచ్చంగా అనువదించిన అద్భుతమైన అనువాదం ఈ కవిత.

ఇలా వ్యాఖ్యానిస్తూ పోతే పెద్ద విమర్శ గ్రంథమే తయారవుతుంది. ఈ వ్యాసం శ్రీశ్రీ అనువాదాల గురించి ఒక విహంగ వీక్షణమే కాబట్టి ఇక్కడితో ఆపుతాను. ఎన్ని మంచి చెడ్డలున్నా శ్రీశ్రీ అనువాదాలకి తెలుగు సాహిత్యంలో ఎంతో విలువైన స్థానం ఉంది. వీటి గురించి మరింత విస్తృత విమర్శ అవసరం. శ్రీశ్రీ అనువాదాలనుంచి నేర్చుకోవలసిన అంశం మరొకటి ఉంది. ఆ అనువాదాలలో చాలా సమకాలీన పాశ్చాత్య కవుల కవిత్వం కనిపిస్తుంది. తన కాలంలోని ప్రపంచ కవిత్వంపై శ్రీశ్రీకున్న పట్టుని ఇవి నిరూపిస్తాయి. ఇది కవులకీ విమర్శకులకీ ఎంతో అవసరం. ప్రస్తుతం మన కవి విమర్శకులకు సమకాలీన ప్రపంచ సాహిత్యం ఎంతవరకూ పరిచయమో పెద్ద అనుమానమే. ఈ విషయంలో ఈమాట దృష్టి సారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రతి సంచికలోనూ ఒక పరభాషా కవిని పరిచయం చేస్తూ ఆ కవి కవితలకి కొన్ని అనువాదాలు ప్రచురిస్తే నావంటి కూపస్థ మండూకాలకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

ముందరి పేజీ(లు) 1 2 3
 

(13 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Rohiniprasad అభిప్రాయం:

    January 1, 2010 8:55 pm

    “ఆ కాలంలో యువతరాన్ని ఉర్రూతలూగించినంతగా అతని కవిత్వం ఈ కాలపు కుర్రకారును ప్రభావితం చేస్తుందని నేననుకోను.”
    పై వ్యాఖ్యకు ఇటీవలి రమా భరద్వాజ్ అనుభవం కొంతవరకూ సమాధానమిస్తుంది.
    శ్రీశ్రీ చేసిన వచన అనువాదాలూ ఉన్నాయి. మిఖయీల్ షోలఖొవ్ రష్యన్ నవలిక వాటిలో ఒకటి. (పేరు గుర్తులేదు). తనకు నచ్చినవీ, ప్రభావితం చేసినవీ అనేక రచనలను ఆయన అనువదిచాడు. చివరిదాకా నీరసపడకుండా, active గా జీవించాడు. ఇది మనమ్ గుర్తుచుకోవలసిన విషయం.

  2. Sowmya అభిప్రాయం:

    January 2, 2010 1:05 am

    వ్యాసం ఆసక్తికరంగా ఉంది. అయితే, శ్రీశ్రీ అనువాదాలు అన్నాక, కవిత్వం మాత్రమే చెప్పారే… శ్రీశ్రీ అనువాద కథలు కూడా చాలానే ఉన్నాయి కదా… శ్రీశ్రీ కథలు సంకలనంలో కూడా చాలా అనువాదాలు ఉన్నాయి.
    రో.ప్ర గారు అన్నట్లు - చివరి వరకూ ఆక్టివ్ గా జీవించారనిపిస్తుంది… అధివాస్తవిక కవిత్వాన్ని అనువదిస్తే ఎలా ఉంటుందో…కుతూహలం కలిగించారు. ధన్యవాదాలు.

  3. రవిశంకర్ అభిప్రాయం:

    January 2, 2010 6:24 pm

    మీ విశ్లేషణ బాగుంది. శ్రీశ్రీ అనువాదాల్లో కొంత స్వేచ్చ తీసుకున్నాడని భావించటం సమంజసంగా ఉంటుంది. ఖడ్గసృష్టిలో వీటిని అనువాదాలని గాక, అనుసృజన అనే పేర్కొన్నారు. ఆ కవితలన్నిటిలోను The Snows of Yester Year కి చేసిన అనుసరణ ఎక్కువ ప్రసిద్ది పొందిందనుకుంటాను.

    పిచ్చిదానిమ్మ చెట్టు గురించి ఒక మాట. సుమారు మూడు సంవత్సరాల క్రితం ఎలీటిస్ కవిత్వం చదువుతున్నప్పుడు ఈ కవిత విపరీతంగా నచ్చటం వల్ల నేను కూడా ఇదే పేరుతో దీనిని అనువదించాను. ఆసక్తి ఉన్నవారు ఆ అనువాదాన్ని చూడవచ్చు:

    అప్పటికి నేను శ్రీశ్రీ అనువాదం చదవలేదు. ఇది ప్రచురితమయ్యాక, చలసాని ప్రసాద్ గారు శ్రీశ్రీ అనువాదాన్ని గుర్తుచేస్తూ, ఈ అనువాదం తేడాగా ఉందని ఆ పత్రికకి ఉత్తరం రాసారు. శ్రీశ్రీ కూడా ఆంగ్లం నుంచే అనువదించి ఉంటారని భావిస్తాను. ఆయన ప్రామాణికంగా తీసుకున్న ఆంగ్లానువాదం - అంటే 1949 కి ముందు ఈ కవితకి వచ్చిన ఆంగ్లానువాదం - దొరికితే శ్రీశ్రీ పాటించిన భేదాలు అందులోనే ఉన్నాయేమో పరిశీలించవచ్చు.

  4. Kameswara Rao అభిప్రాయం:

    January 3, 2010 1:30 pm

    రోహిణీప్రసాద్‌గారూ, రమగారి అనుభవం బట్టి శ్రీశ్రీ కవిత్వం ఈనాటి యువతని కూడా అప్పటి కాలంలో లాగానే ఉర్రూతలూగిస్తుందని నిశ్చయించలేము కదా. రమగారు అన్నట్టు, ఈనాటి యువతకి కూడా ఆసక్తి కలిగించే విషయాలు ఆ కవిత్వంలో ఏమిటన్నది పరిశీలించాల్సిన అంశం.

    సౌమ్యగారూ, అవును. శ్రీశ్రీ కవిత్వేతర సాహిత్యాన్ని కూడా అనువదించాడు. ఈ వ్యాసం, మొదటి పేరాలో చెప్పినట్టు, కవిత్వ అనువాదాలకే పరిమితం.

    రవిశంకర్‌గారూ, మీ అనువాదం నాకు శ్రీశ్రీ అనువాదం కన్నా నచ్చింది. దీనికి ఒక ముఖ్య కారణం ఆంగ్ల మూలంలో ఉన్న తేడా అయ్యుండవచ్చు. ఈ వ్యాసం రాసిన తర్వాత వెతుకుతూ ఉంటే, మరో ఆంగ్ల అనువాదం కనిపించింది. శ్రీశ్రీ అనువాదానికి ఇదే మూలం. ఇది Nanors Valaoritis and Bernard Spencer చేసిన అనువాదం.

  5. rama bharadwaj అభిప్రాయం:

    January 4, 2010 3:08 am

    కామేశ్వరరావు గారూ!!

    ఏ విషయాన్ని తేల్చడానికీ ఎవరిదగ్గరా ఖత్చితమైన data అంటూ ఉందా?? అదీకాక “ఆనాటికాలంలో” సైతం కవిత్వం పట్ల ఆ మాటకొస్తే సాహిత్యం విషయంలోనూ నిజంగా ఆసక్తి ఉన్నవాళ్ళ శాతం ఎంతా??ఇవేవీ ఎవరి లెఖ్ళకీ తేలేవికావు. ఇవాళ్టికీ కవిగా శ్రీశ్రీ పేరే ఎక్కువగా కుర్రకారుకి తెలుసన్నది [సాహిత్యం గురించి కాస్తగా తెలిసిన కుర్రకారు] అర్ధమౌతున్న విషయం!

    otto reno castillo కవితనికూడా ఒకదానిని[మెక్సికన్ కవి అనుకుంటాను]శ్రీశ్రీ తెనుగున అనువాదంచేసాడు. కానీ ఆ అనువాదం కూడా ఏమంత బాగా అన్పించదు. కానీ అదే శ్రీశ్రీ ” మరీముఖ్యంగా ఒక మాఘమాసపు గాలి” అని పూర్తిగా తెలుగువాతావరణం తీసుకొచ్చి కవితని ఎత్తుకున్నప్పుడు మాత్రం అలా ఒక్కశ్రీశ్రీవే చేయగలడు అనికూడా అన్పించకపోదు.కవులు కూడా మానవమాత్రులే గనక ఆ క్షణంలో వాళ్ళలోని భావుకత స్థాయిని అనుసరించే ఆ అనువాదం రూపొందుతుంది. ఒక్కోసారి అత్యధ్బుతమైన మెరుపులు కురిపించగల్గిన వారే ఒక్కోసారి యాధాలాపంగా సరిచూసుకోకుండా కూడా వాక్యనిర్మాణం చేయడాన్ని మనం గమనించవచ్చు.అది సహజం కూడా!కవి తాలూకు సృజన ఐనా లేదా అనుసృజన ఐనా అన్నిసార్లూ ఆహా!! అని అన్పించేలా ఉండదు…అని మనకి శ్రీశ్రీ ఇంకా ఇతర కవుల కవిత్వం చదివినప్పుడు స్పస్టంగానే తెలుస్తుంది. అయితే సృజన అన్న అనుభవం తెలిసినవారు కవిలోని ఉత్తమోత్తమమైన ఊహలనీ కవితావాక్యాలనీ గౌరవించి అంతగా బాగారాని వాటిని ఆ కవి కవితాపటిమ మీదున్న గౌరవం తో ఉపేక్షించి లేదా సహించి వారు రాసిన ఆ గొప్పకవిత్వానికి కైమోడుస్తారు. ఇది అన్ని కాలాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ సాహిత్యకారుల పట్ల ఆ ప్రాంతపు ప్రజలు అనుసరించిన ఒక గౌరవం!! వారి అక్షరానికి చేసిన ఒక మన్నన.

    రమ.

  6. Srinivas Nagulapalli అభిప్రాయం:

    January 5, 2010 2:45 pm

    ఎప్పటిలాగానే కామేశ్వరరావుగారు, మంచి ఆసక్తికరమైన వ్యాసాన్ని, అనువాదంలోని ఎన్నో విషయాలను ఓపికతో ఎత్తి చూపించి విశ్లేషించినందుకు చాలా కృతజ్ఞతలు.

    వీలైతే, మరొక్క అంశంపై మీ ఆలోచనలు తెలియజేయ మనవి. మనం శ్రీశ్రీ కవితలు, ఇంగ్లీషు,ఇతర భాషలనుంచి శ్రీశ్రీ అనవాదాలు చదువుతున్నాం కదా ప్రధానంగా (ఈ సంచికలో కూడా). అట్లే, శ్రీశ్రీ కవితలను భారతేతర భాషలు (English, French etc) లోకి అనువాదాలు చేసారా, చేస్తే ఎట్లున్నాయి, చేయకపోతే దానికి కారణాలు_ ఇట్లా ఏమైనా దానిగురించి చెప్ప మనవి.

    మోహనగారు మహాప్రస్థానం కన్నడ అనువాదం తెలిపారు. రవీంద్రుని కవితలు, తిరుక్కురళ్ వంటివి కొన్ని తప్ప, భారతీయ భాషల్లోని కవితలేవీ కూడా పెద్దగా పాశ్చాత్య భాషల్లోకి అనువదింపబడలేదేమో అని అనుమానం. మన కవులు ఫలానా కవిత ఏ English, French నుంచో బాగుందనిఎన్నుకొని, సొంతానికి అనువాదాలు చేసారో, అట్లే మన మహాకవుల కవితలు ఎక్కువగ పాశ్చాత్య భాషల్లోకి ఎందుకు ఎక్కువగా అనువదింపబడటం లేదో తెలియదు. అవి సార్వజనీనం కావు అని అనుకోవాలో కూడా తెలియదు.
    ======
    విధేయుడు
    _Srinivas

  7. V R Veluri అభిప్రాయం:

    January 5, 2010 10:32 pm

    శ్రీనివాస్‌ గారు కామేశ్వర రావుగారిని అడిగినా, చొరవచేసుకొని నాకు తెలిసిన వివరాలు చెప్పుతాను. ఇదివరలో తెలుగు కవిత్వం నుంచి ఇంగ్లీషులోకి వచ్చిన అనువాదాలు ఏమీ లేవనే చెప్పాలి.

    గత పాతిక సంవత్సరాలుగా, వెల్చేరు నారాయణ రావు తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదాలు చేస్తున్నారు. ఆయన స్వయంగాను, డేవిడ్ షూల్ మన్, హాన్క్ హైఫెట్జ్ తోను కలిసి చేసిన కొన్ని అనువాదాలు మనవి చేస్తాను.

    1. For the Lord of the Animals - Poems from the Telugu, The Kaalahastiswara Satakamu, by Dhurjati ( University of California Press, 1987), with Hank Heifetz.

    2. Twentieth Century Telugu Poetry , An Anthology ( Oxford University Press, 2002) .

    3. Hibiscus on the Lake, Twentieth Century Telug Poetry from India
    ( University of Wisconsin, 2002)

    4. Classical Telugu Poetry, An Anthology ( Oxford University Press, 2002), with David Shulman.

    5. A Lover’s Guide to Warangal, The Kridabhiramamu by Vinikonda vallabharaaya ( Permanent Black, Distributed by Orient Longman Ltd., 2002) with David Shulman.

    6. The Sound of the Kiss, Pingali Surana’s Kalapurnodayam (Columbia University Press, 2002) with David Shulman.

    7. The Demon’s Daughter, Pingali Surana’s Prabhaavati Pradyumnamu (State University of New York Press, 2006) with David Shulman.

    8. When God is a Customer, Telugu Courtesan Songs by Kshetrayya and Others ( University of California Press, 1994) with A. K. Ramanujan and David Shulman.

    9. God on the Hill, Temple Poems from Tirupati, Annamayya (Oxford University Press, 2005) with David Shulman.

    10. A Poem at the Right Moment, remembered verses from premodern South India ( University of California Press, 1998) with David Shulman.

    I have very reliable information from one of the translators that the Manucaritra by Allasani Peddana is ready for publication.

    I haven’t mentioned Narayana Rao’s other translations ( from Telugu prose works and Sanskrit poetic works).

    Most of these books are available at Amazon.com

    Regards,

    Veluri Venkateswara Rao

  8. రవిశంకర్ అభిప్రాయం:

    January 5, 2010 11:07 pm

    కామేశ్వరరావు గారు - మీ పరిశోధనలో చాలా మంచి సోర్సు సంపాదించారు. ఎట్టకేలకు శ్రీశ్రీ ఉపయోగించిన ఆంగ్లానువాదం చూడటం చాలా ఆనందం కలిగించింది. ఊహించినట్టుగానే అనేక భేదాలు ఆంగ్లానువాదంలోనే ఉన్నాయి. శ్రీశ్రీ అనువాదం ఆంగ్లానువాదాన్ని అనుసరించే ఉంది గదా . ఒక్క “లవంగాలు తమ పసరిక చేతులతో పోగుచేసేటప్పుడు” అన్నచోట మాత్రం cloverను cloveగా పొరపడ్డారేమో అనిపిస్తుంది. ఈ ఆంగ్లానువాదాన్ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు.

  9. rama bharadwaj అభిప్రాయం:

    January 6, 2010 2:50 am

    శ్రీనివాస్ గారూ!! పాతకాలంలో ఎక్కువగా భారతీయ భాషల్లోకి ప్రపంచ భాషలనించి కవిత్వం ఇంకా నాటకాలూ అనువాదం జరిగిన మాట నిజమే. మన భారతీయ భాషలనించి పరాయి దేశస్థులు సంస్కృత నాటకాలని తొలిగా అనువాదాలు చేసుకున్నారు. అయితే ఇటీవలకాలంలో వారు మన సమకాలీన సాహిత్యంవేపు కూడా దృష్టి సారిస్తున్నారు. భారతీయ కవుల కవిత్వాలని ఇంగ్లీషు నించి వారివారి భాషల్లోకి అనువాదం చేసుకుంటున్నారు. అందులో ఒక్కోసారి పూర్తిగా వారి దేశం వారే ఉండగా ఒక్కోసారి ఆయా దేశాల భాషలు వచ్చిన భారతీయులే ఇందుకు ముందుకువస్తున్న దాఖలాలూ కన్పిస్తున్నాయి. అనువాదాలు జరగాలన్న ఆలోచనలు మొదలయ్యాయి. అది స్వాగతించవలసిన విషయమే!!

    వేలూరి వారుబహుశా తెలియక చేర్చినట్టులేదు. పీ.వీ.నరసింహారావు గారు జయప్రభగారి ప్రేమ కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసారు. penguin india వారు ఆ పుస్తకాన్ని ద్విభాషా సంకలనంగా “unforeseen affection and other poems” అనే పేర 2005 లోనే ప్రచురించారు.

    రమ.

  10. Sreenivas Paruchuri అభిప్రాయం:

    January 6, 2010 5:45 am

    అట్లే మన మహాకవుల కవితలు ఎక్కువగ పాశ్చాత్య్ల భాషల్లోకి ఎందుకు ఎక్కువగా అనువదింపబడటంలేదో>>
    ఎక్కువగా అంటే! వేలూరిగారు పైన కొన్ని ఉదాహరణలు చెప్పారు. ముఖ్యంగా ఇరవయ్యవ శతాబ్దపు కవిత్వాన్ని చాలామంది అనువాదం చేశారు. ఉదా: S.S. Prabhakararao, Post-independence Telugu poetry, Writers workshop, Calcutta, 1993. అలాగే B.V.L.N. రావు గారు అరవయిల్లో కొన్ని క్షేత్రయ్య పదాలు, కొన్ని వేమన పద్యాలు చేయడం జరిగింది. ఈమధ్య కాలంలో శిష్ట్లా శ్రీనివాస్ గారు కొంత pre-19th century (సుమతి, పెద్దన, రాయలు) సాహిత్యాన్ని అనువదిస్తున్నారు. ఏమయినా అధికభాగం ఆంగ్లంలోకి మాత్రమే అనువదించబడుతున్నాయి. కొన్ని స్పానిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌ లలోకి కూడా (వీటిలో కొన్ని శ్రీశ్రీ కవితలున్నాయి.) వెళ్ళాయి. వాటిపైన ఆ దేశాల్లో స్పందనెలా వుదో మరి? అలాగే అనువాదం ఎంత *బాగా* వుంది అనేది మరో ప్రశ్న.

    ప్రతిదీ కాకపోయినా కవితలు బానే అనువదించబడుతున్నాయి. (శ్రీశ్రీగారే స్వయంగా తన మహాప్రస్థానంలో కవితలన్నీ అనువాదం చేసుకున్నారు.) తెలుగునుండి కూడా. కొందరి (వారసుల)తో కాపీరైట్ల సమస్యలున్నాయి.

    ప్రస్తుత వ్యాసం శ్రీశ్రీ వేరే భాషలనుండి చేసిన అనువాదాలపైన కాబట్టి, తెలుగునుండి యితర భారతీయేతర భాషల్లోకి జరిగిన అనువాదాల గురిచి మరోసారెక్కడైనా రాయ ప్రయత్నిస్తాను.

    – శ్రీనివాస్

  11. సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    January 6, 2010 11:29 am

    చాలా కాలంక్రితం అంపశయ్య నవీన్ వెల్చేరు గారి “Hibiscus in the Lake” - Twentieth Century Telugu Poetry From India” పుస్తకంపై సమీక్ష రాస్తూ - “అనువాదం అనుసృజనగా మారితేనే అది రక్తి కడుతుంది” అని చెబుతూ ఆంధ్రజ్యోతిలో (”ఇంగ్లీషు కొలనులో తెలుగు మందారం” - 2006 లో.) వ్యాసం రాసారు. ఆ వ్యాసంలో చెప్పిన విషయాలు ఖండిస్తూ అనువాదాల గురించి”మనం అక్కడ మొదలు పెట్టలేమా” అని వేలూరి గారు మరో వ్యాసం రాసారు. అందులో అనువాదాల గురించున్న (ముఖ్యంగా ఇంగ్లీషు అనువాదాలపై ) అపోహల గురించీ, అపార్థాల గురించీ చర్చించారు.

    “కవితా కవితా ” పద్యానికి శ్రీశ్రీ అనువాదాన్నీ, వెల్చేరు గారి అనువాదాన్నీ పోల్చి చూపిస్తూ, శ్రీశ్రీ గారి ఇంగ్లీషు అనువాదమే గొప్పదన్నట్లుగా నవీన్ రాసారు. వెల్చేరు గారి అనువాదం శ్రీశ్రీ అనువాదంకన్నా చాలా మెరుగునీ వేలూరి గారు సమాధానం ఇచ్చారు. ఆ రెండు వ్యాసాల్లో అనువాదాల గురించి చాలా మంచి చర్చా వస్తువుంది. అనువాదాల గురించి వెల్చేరు గారి వ్యాసం ఈమాటలో ప్రచురించారు.

    -సాయి బ్రహ్మానందం.

  12. Srinivas Nagulapalli అభిప్రాయం:

    January 6, 2010 1:55 pm

    ఓపికతో ఒక్క చోట పుస్తక వివరాలిచ్చినందుకు వేలూరిగారికి కృతజ్ఞతలు. వాటి (చాలా మటుకు?) గురించి “రచ్చబండ”లో వేలూరిగారు, పరుచూరి గారు పరిచయం చేసినట్టు గుర్తు. వేల్చేరుగారి “after word” మొదటగా చదివింపజేసే పుస్తకాల పట్టికలో మనపూర్వకవులవే ఎక్కువగా ఉండడం కాకతాళీయం కాక, వారు చెప్పకుండా చేసే ఇంకో విమర్శేమో అనిపిస్తుంది!

    పరుచూరిగారి ప్రశ్న “వాటిపైన ఆ దేశాల్లో స్పందనెలా వుదో మరి? అలాగే అనువాదం ఎంత *బాగా* వుంది అనేది మరో ప్రశ్న” నాది కూడా. శ్రీశ్రీకి మాత్రమే వర్తింపజేస్తూ, “తెలుగునుండి అనువాదాల” గురించి ఒక్క మాట.

    సాధారణ పదాలను అసాధారణంగా వాడడం, శబ్ధాల లయ, ఊగులతో కవితనుర్రూతలూగించడం శ్రీశ్రీ కవితల్లో “కొట్టి”నట్టు కనపడుతుంది. అందుకు శ్రీశ్రీ గారి కవితలు మనకెంతగా నచ్చుతాయో, అందుకే వాటి భారతీయేతర భాషల అనువాదాలు ఎవరివైనా సరే అంతగా నచ్చవేమో అని (చెడ్ద)పెద్ద అనుమానం. భారతీయ భాషల్లో కనిపించే పదాల జిగిబిగి, శబ్దాల లయవిన్యాసం, భారతేతర భాషల్లో (సులభంగా) సాధ్యం కాదని అనిపిస్తుంది. అదీకాక, భాషపైనున్న పర్వతమంత ప్రతిభ శ్రీశ్రీ భావాలలో లోతులేకపోవడం కూడా ఒక కారణమేమో.
    =======
    విధేయుడు
    _Srinivas

  13. rama bharadwaj అభిప్రాయం:

    January 7, 2010 1:08 am

    పరుచూరి శ్రీనివాస్ గారు రాసిన పేర్లకి మరికొన్ని ముఖ్యమైన జోడింపులు.

    తెలుగులో భావకవులనీ..అభ్యుదయా కవులనీ ఇంగ్లీషులోకి తొలిగా అనువాదంచేసిన ఒక మంచి అనువాదకుడు శ్రీనివాస్ రాయప్రోల్ గారు. ఆయన జయప్రభ గారి కవిత్వాన్ని కూడా ఇంగ్లీషు లోకి అనువదించారు. ఇంగ్లీషులో కవిగా అంతర్జాతీయ గుర్తింపు కల్గిన వారు శ్రీనివాస్ రాయప్రోల్ . american poet willims carlos willims వంటి వారితో ఆయనకి మంచి స్నేహం ఉండేది.

    శ్రీనివాస్ రాయప్రోల్ తెలుగు కధల్ని కూడా ఇంగ్లీషులోకి అనువాదం చేసినవారు. అలాగే తెలుగు కధలని ఇంగ్లీషులోకి అనువాదం చేసిన మరో అనువాదకుడు రంగారావుగారు. ఆయన అనువాదాలని penguin సంస్థ ప్రచురించింది. అలాగే డి.కేశవరావు గారు కూడా తెలుగు ఆధునిక కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించిన వారు.

    ఇంక శ్రీనివాస్ పరుచూరి చేసిన వ్యాఖ్య”బాగా” అన్నది..ఈ సరికే చర్చింపబడి ఉంది. ఎవరికి “బాగా” అన్నది ముఖ్యం. అనువాదం చేసినవారికా?? లేక ఆ అనువాదాలని చదివిన వారికా?? అని. ఏ భాషలోకి అనువాదం అవుతున్నాయో ఆ భాషలోని నుడికారంతో ఆ భాషకి సొంత కవిత్వంలాగా అన్పించేది మంచి అనువాదంగా అనుకోవాలి. ఇందులో చర్చకి అవసరమైన విషయాలు అనేకం ఉంటాయి.మూలంలోని ప్రాణశక్తి అనువాదంలోకి రాగలగాలి.

    శ్రీశ్రీ కవిత్వం బహుశా భారతీయ భాషలలోకి అనువాదం బాగా అవుతుందేమో గానీ ఇంగ్లీషులోకి అనువదించినప్పుడు అంత బాగా చేయడం కొంచెం కష్టమైన విషయమే ఏ అనువాదకుడికైనా!! ఇవన్నీ అనువాదం చేసేవారి ముందున్న సమస్యలు. అలాగని అనువాదాలు చేయకుండా కూడా ఉండడం సరికాదు. తగినంత శ్రధ్ధ ఉండాలి అనువాదంచేసేవారికి. తగినంత నైపుణ్యం కూడా ఉండాలి. తగినంత సమయాన్ని వారు వెచ్చించ గలిగి కూడా ఉండాలి. అలా పని చేసేవారికి ఆర్ధికమైన వనరులు కూడా సమకూడేలా ఉండాలి. అప్పుడు మాత్రమే అనువాదాలు చేయడానికి వ్యక్తులు మరింతగా ముందుకి వచ్చే వీలుంది.
    రమ.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a