తెలుగు వీర లేవరా
[శ్రీశ్రీ 1981లో అమెరికా పర్యటనలో పిట్స్‌బర్గ్ నగరంలో ఒక సభలో చదివి వినిపించిన ఈ పాట వీడియో ఈమాట పాఠకుల కోసం ప్రత్యేకం. - సం.]
నిడివి: షు. 2ని.
(సేకరణ: మద్దిపాటి కృష్ణారావు, వడ్లమూడి బాబు)
[శ్రీశ్రీ 1981లో అమెరికా పర్యటనలో పిట్స్‌బర్గ్ నగరంలో ఒక సభలో చదివి వినిపించిన ఈ పాట వీడియో ఈమాట పాఠకుల కోసం ప్రత్యేకం. - సం.]
నిడివి: షు. 2ని.
(సేకరణ: మద్దిపాటి కృష్ణారావు, వడ్లమూడి బాబు)
శ్రీనివాస్ అభిప్రాయం:
February 6, 2010 4:29 pm
సేకరణ శ్లాఘనీయం. ఒక చిన్న అప్రస్తుత విషయం,.
“ప్రతి మనిషీ తొడలుగొట్టి శృంఖలాలు పగులగొట్టి, చురకత్తులు పదును బెట్టి, తుది సమరం మొదలు బెట్టీ, సింహాలై గర్జించాలీ……..”
“ప్రతి మనిషీ - సింహాలై”; ఏక వచనానికీ, బహు వచనానికీ పొత్తు కుదరలేదు కదా! ఇన్నాళ్ల తరవాత ఈ మధ్యే ఏదో బ్లాగులో చదివేను. మహాకవి మహా కవే.
చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:
February 8, 2010 9:47 am
ఏక వచన బహు వచనాలే కాదు, అర్ధాలలో కూడా పొంతన లేని పాట ఇది.. యుద్ధానికి ప్రేరేపించే పాటలకి అర్ధంలో పొందిక వొద్దిక వుండనక్కర లేదనుకుంటేనో లేక పోతే ఏదో పెద్దాయన రాసుకున్నాడులే అని సరిపెట్టుకుంటేనో తప్ప, ఈ పాట వినడానికి నిజానికి చాలా చికాకు కలిగిస్తుంది.
శ్రుంఖలాలలో వున్న మనిషి ఎవడయినా తొడలు కొట్ట గలుగుతాదా ? చురకత్తులు చేత పట్టి దాడి చేసే మనిషి ప్రవృత్తి తొడలు కొట్టి సవాలు చేసేదిగా వుంటుందా ?
అన్నిటికీ మించి ఈ పాట అటు తెలుగు సంస్కృతికీ ఇటు మన్నే ప్రాంత సంస్కృతికీ జనరంజకమైన కట్టుకధ ద్వారా అన్యాయం చేస్తుంది. అల్లూరి సీతా రామరాజు చేసింది మన్నెం పితూరీ. మన్నే ప్రాంత ప్రజలలో తాము తెలుగు వారిమన్న స్పృహ , ఇప్పటికీ వుండదు. 1920 వ దశకంలో వుండే దన్న అబద్ధం సినిమా చెప్తే, దానికి ఒక మార్చింగ్ సాంగు కవి రాయవలసి వచ్చింది. పైగా అందులోకి మనకి అర్ధం కానీ భాషలో రాసిన పాట అని మనకి మనం నచ్చ జెప్పుకుని వింటే ఒక మాదిరిగా రిపబ్లిక్ డే రోజు పేరేడు లో ఎన్ సి సి కుర్రాళ్ళ బాండ్ లాగా బాగానే వుంటుంది. యదాలాపంగా వింటే వొళ్ళు గగుర్పొడుస్తుంది కూడానూ.
rama bharadwaj అభిప్రాయం:
February 8, 2010 10:54 am
“కల్పన” అని ఒక విషయం ఉంటుంది చాకిరేవు ఉపేంద్ర గారూ!! అందులో మనం విశ్లేషించే reality పొసగదు. మన్నెం దొరల లో లోలోపల ఉన్న ఆవేశాలని, సీతారామరాజు తెల్లదొరలకి వ్యతిరేకంగా రౌద్రాన్ని ఉసిగొలిపేలా బయటికి తీస్తున్నాడు అని చూసినప్పుడు ఆ పాట సహజంగానే కన్పిస్తుంది.
సిన్మా మొత్తం మీద సీతారామారాజు అటు తెల్లదొరలతో ఆంగ్లంలోనూ..ఇటు మన్నెం దొరలతో కొండభాషలోనూ మాట్లాడాలి మరి న్యాయంగా మీ వాస్తవికత ప్రకారం. కానీ రూదర్ ఫర్డ్ గా ఇంగ్లీషు వాడిని పెట్టి తియ్యలేని ఆ తెలుగు సినిమా లో జగ్గయ్యని తెల్లదొరగా జనం ఊహించుకోవలసినట్టుగానే..సీతారామరాజు మాట్లాడిన తెలుగు భాషని కూడా మనం ఆయా సందర్భానుసారం ఊహించుకోవాలన్నమాట! లేకపోతే మన్నెం భాషలోనో లేదా ఇంగ్లీషు భాషలోనో తియ్యాల్సిన సినిమాని సీతారామరాజు సొంత భాష అయిన తెలుగులో తియ్యడం ఏమిటీ?? ప్రేక్షకులు “తెలుగు”వాళ్ళు గనక. కొండదొరలు కారు గనకానూ!! తెలుగువీరలేవరా అని మీకు నచ్చకపోతే “కొండవీర లేవరా”!! అని మీరు మీ కోసం పాడుకుంటే గనక శ్రీశ్రీకి ఏమంతగా అభ్యంతరం ఉండకపోవచ్చు.
పాటపాడుతున్నది అల్లూరి. పాడాల్సిన పాట సీతారామరాజు మనస్సుని ప్రతిబింబించేలా ఉండాలి. ఆ సినిమాకి నాయకుడు ఆయన గనక.మల్లుదొరో..గంటందొరో పాడే సందర్భం కాదది. తెలుగు మన్యం అది. వాళ్ళలో వాళ్ళేం మాట్లాడుకున్నా మైదానప్ప్రాంతపు నాయకులతో ఆ గిరిజనులు వాళ్ళ యాసలోనే కావచ్చుగాక కానీ తెలుగులోనే మాట్లాడాలి.
యుధ్ధంలో తొడగొట్టే ఉద్రేకం అవసరం గనక అలాంటి భావనకి అవకాశం ఉంటే అది సహజమే!! పాట రాసిన శ్రీశ్రీ, పాట పాడిన ఘంటశాల, ఆ సినిమా తీసిన ఘట్టమనేని కృష్ణ, ఆ సినిమాని చూసిన కోట్లాది ప్రజ ఇందరూ తెలుగువాళ్ళు. ఆ సినిమాకి రావాల్సిన డబ్బులు తెలుగు వారినించి. అది తెలుగువారి ఆవేశాల దర్పణం గా ఉండటమే సబబు అని వాళ్ళకందరికీ స్పష్టత ఉంది. మరి మీరు మీ ఉతకడంలో భాగంగా ఇన్నింటినీ మరిచి బాదుడు బాదుతానంటే ఎలా??
రమ.
చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:
February 8, 2010 11:53 pm
రమ గారూ, కల్పన అన్నది ఒకటి కాదు, చాలా వుంటాయి.
నా చిన్నప్పుడు మా తాత వీపు తొక్కుతూ నేను చెప్పిన నలభై రోజుల ధారా వాహిక కూడా కల్పనే. అది నాకూ, మా తాతకీ తప్ప మరెవరికీ ఆసక్తికరంగా వుండదు. సోదమ్మలూ, సోమిదేవమ్మలూ చెప్పేవి కూడా కల్పనలే. అభూత కల్పనలూ వుంటాయి, కవిత్వాలూ వుంటాయి, దెయ్యం కథలూ, బూతు కథలూ కూడా కల్పనలే. ఆఫీసునించి లేటుగా రావటానికి భర్తలు చెప్పే కారణాల్లోనూ, నెలవారీ ఖర్చుల్లోంచి పొదుపు చేసే భార్యలూ, పీకలదాకా నష్టాల్లో కూరుకు పోయినా షేరు మార్కెట్లో నిలదొక్కుకోవటానికి సీయీవోలు చార్టర్డ్ అక్కౌంటెంట్లూ పడే తంటాలూ కల్పన మీద ఆధార పడేవే.
సమస్య అదికాదు. సినిమాల్లో నేపథ్య గానాలున్నట్టుగా నిజ జీవితంలో ఎక్కడా మనము పాటలు పాడుకోక పోయినా, సినిమా అన్న కళామాధ్యమంలో నేపథ్య గానానికి వుండే విలువని మనమందరమూ గుర్తిస్తాము. ఇక్కడ విషయం పాటా సినిమా నమ్మదగ్గవిగా వున్నాయా లేదా అన్నది కాదు.
సూక్ష్మంగా చెప్పాలంటే, తెలుగు వీర లేవరా అన్న పాట శ్రీ శ్రీ రాసిన పాటల్లో అంత గొప్పదేమీ కాదు అన్నది నా వ్యాఖ్య. ఆమాటకొస్తే ఇదే సినిమాలో పాటలు రాసిన ఆరుద్ర, కొసరాజులు కూడా ఇందులో పాటల కన్నా చాలా చక్కటి సినిమా పాటలు రాసిన సందర్భాలు చాలానే వున్నాయి అన్న విషయం మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ వ్యాఖ్య వ్రాసినప్పుడు దానిని ఒక విమర్శగానో వివరించవలసిన అభిప్రాయంగానో అనుకోకపోవటం నా పొరపాటే.
కొంచెం వివరంగా చెప్పాలంటే , కథ మరొక దగ్గర మొదలు పెట్టక తప్పదు. అల్లూరి సీతారామరాజు సినిమాకీ, అందులో జాతీయ అవార్డు వచ్చిన ఈ పాటకి మనం విస్మరించరాని చారిత్రక భౌగోళిక నేపథ్యం వుంది. సినిమా విడుదల అయినది 1974 లో. విశాలాంధ్ర అవతరించి గట్టిగా ఇరవయి సంవత్సరాలు కూడా కాకుండానే, అప్పటికి అయిదు సంవత్సరాలుగా తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంలో మూల మూలలా భాషా సంస్కృతులలో భేదాల పేరు మీదనే చెలరేగిన తీవ్రమైన అశాంతి (జై తెలంగాణ, జై ఆంధ్రా వుద్యమాలు) ఇంకా సద్దుమణగలేదు. పోలీసు కాల్పుల్లో నాలుగు వందల మంది చని పోయి వుంటారని అంచనా. వేలాది మంది విద్యార్థుల చదువులు, జీవికల మీద ఆశలూ కోల్పోయారు.
అప్పటికి నాలుగు సంవత్సరాల క్రితమే, మైదాన ప్రాంతపు ప్రజలు మన్య ప్రాంతాలలో గిరిజనుల భూములను ఆక్రమించుకుంటున్నారని , దాన్ని అరికట్టక పోతే పెద్ద ఎత్తున తిరుగుబాట్లు వచ్చే ప్రమాదం వుందనీ భావించి రాష్ట్రపతి ద్వారా గిరిజనుల భూములను మైదాన ప్రాంతపు ప్రజల నించి రక్షించటానికి వన్ ఆఫ్ సెవెంటీ (1970 సంవత్సరంలో వచ్చిన మొదటి ఆదేశాలు కాబట్టి వన్ ఆఫ్ సెవెంటీ అన్న మాట) ఇప్పించవలసి వచ్చింది. (ఎవడు వాడు, ఎచ్చటి వాడు, ఇటు వచ్చిన తెలుగు వాడు అన్న శబ్దాలు వినపడుతుంటే క్షమించండి.. మాట వచ్చింది కాబట్టి చెప్పక తప్పలేదు. అవే మన్య ప్రాంత భూములని, అదే వన్ ఆఫ్ సెవెంటీ ఆదేశాలకి వ్యతిరేకంగా గత పది సంవత్సరాలలో మైనింగ్ లీజులకింద, సినిమా నిర్మాతలకి స్టూడియోలూ గట్రా నిర్మించుకోవడానికి లీజులకిందా ఇస్తూ పోతున్నారనీ చాలా కేసులు హై కోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ పడి వున్నాయి).
సినిమా రిలీజయిన నాటికి, దేశ భద్రతకి అంతర్గతంగా విచ్ఛిన్నకర శక్తులవల్లనూ, బాహ్య శక్తుల కుట్ర వల్లనూ ప్రమాదం పొంచి వుందని చెప్పి, శ్రీమతి ఇందిరా గాంధీ నెమ్మది నెమ్మదిగా అధికారాన్ని అంతటినీ తన చేతిలో కేంద్రీకృతం చేసుకుంటూ వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లోనే రాష్ట్రపతి పాలన విధించవలసిన అగత్యం వుందని అప్పటికే చేసి చూపించింది.
ఇటువంటి కల్లోల పరిస్థితిలో, అనేకానేక చారిత్రక భౌగోళిక కారణాల వలన తునా తునకలయిన ప్రజల ఐక్యత నేపథ్యంలో, అల్లూరి సీతారామరాజు సినిమా విడుదలయింది. అటువంటి సందర్భంలో మన్య ప్రాంతంలో మైదాన ప్రాంత ప్రజల వీరోచిత సేవని నిరూపించటంలోనో, నిజ జీవితంలో సాధ్యం కానీ ఐక్యతని సినిమా ద్వారా చూపించటంలోనో నిర్మాతకి ఏదో తక్షణ స్వార్ధం వున్నదని అంత క్రూడ్ గా చెప్పుకోవలసిన పని లేదు కానీ, ఆ నేపథ్యంలో ఈ సినిమా ఏం సాధించింది? ఎందుకు అంత గుర్తింపు పొందింది, ఈ సినిమాని ఏ ప్రజలు ఎందుకు ఆదరించారు? అందులో శ్రీ శ్రీ పాట పాత్ర ఏమిటి అన్న ప్రశ్నలు వేసుకోవటం అవసరం. ఆ ప్రశ్నలు వేసుకుంటున్నప్పుడు, రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఈ రోజు నెలకొన్న పరిస్థితులేమిటి అన్న గ్రహింపు కూడా వుండడం అవసరం.
ఇంతకు ముందు నేను సూచన ప్రాయంగా చెప్పిన నేపథ్యం అంతా శ్రీ శ్రీ కి బాగానే తెలుసును. అటువంటి పరిస్థితులలో తెలుగు వీరత్వాన్ని, శూరత్వాన్ని, బాహ్య శత్రువుని తరిమి తరిమి కొట్టమని ఉద్బోధిస్తకీ భాష పాట రాయాలంటే శబ్దాడంబరం ద్వారా, భాష పేరిటా, సంస్కృతి పేరిటా, జాతి పేరిటా , మగతనం పేరిటా క్షణికావేశం సృష్టించడం తప్ప వేరే మార్గం లేదు. శ్రీ శ్రీ ని అందుకు మనం తప్పు పట్టనవసరం లేదు కానీ, పాటకు లేని గొప్పదనాన్ని ఆపాదించనవసరం కూడా లేదు.
rama bharadwaj అభిప్రాయం:
February 10, 2010 1:05 am
లోకో భిన్నరుచిహి అన్నది ఆర్యోక్తి. మీకు ఆ పాట మీద అంత గాఢమైన భావనలున్నాయి మరి. అందువల్ల మీకు అలా అర్ధమైనట్టుంది. మీ ప్రశ్నలకి జవాబులు శ్రీశ్రీ చెప్పాలి. ఏం చేస్తాం మీకా అవకాశం మరి లేదు. మీకు అర్ధమైన పధ్ధతిలో ఆ పాట నాకు అర్ధం కాలేదు.
రమ.
tatiraju venugopal అభిప్రాయం:
February 25, 2010 3:10 pm
కాస్త ఆలస్యంగా చూసాను. వీడియో బావుంది. స్వయానా శ్రీశ్రీ గారు ‘పాట’ను చదువుతూ ఉంటె థ్రిల్లింగ్ గా ఉంది. ప్రతి మనిషి లో ఏక వచనం, సింహా లై లో బహు వచనం ఇవన్నీ శ్రీ శ్రీ గారు తన ‘పాడవోయి భారతీయుడా’ పాటల సేకరణలో చెప్పనే చెప్పారు. సింహంలా అని ఉంటే సరి పోయేది అని అన్నారు కూడా. ప్రతి మనిషి అని అంటునప్పుడు ఒకడే ఎందుకు ఇద్దరూ, ముగ్గురూ కావొచ్చుగా. శృంఖలాలు పగుల గొట్టటం, తొడలు గొట్టడం ఒక మనిషి పైనే మోపేస్తే ఎలా? ఒకడి శృంఖలాలు పగల గొట్టేందుకు ఇంకొకడు తొడలు గొట్టి ముందుకు రాడూ? నట శేఖరుడు కృష్ణ సినీ జీవితంలో ఒక మైలు రాయి అల్లూరి కథ. ఇప్పుడు రాళ్ళు రువ్వడమా? అన్నీ వాస్తవంగా ఏ సినిమా ఉండదు. మొన్నటి అన్నమయ్య , రామదాసులు అంతేగా? ప్రయత్నం అనేది మెచ్చుకోదగ్గది. పాటల్లో తప్పులు అన్ని కాలాల్లో ఉన్నవే- బహు తీపి, ఎన్నెన్ని హొయలో అన్నన్ని లయలు, పాటల పల్లకిలో ( శ్రీశ్రీ గారు మాత్రం ‘కళ్ళలో పెళ్లి పందిరి కనపడ సాగే- పాటలో ఆ తర్వాత పంక్తి ‘పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే’ అనే చెప్పారు. పల్లకీ,బాకీ, బాణీ,తుపాకీ, ఆచూకీ - ఈ పదాలన్నీ దీర్ఘాంతాలనీ కొందరు కొత్త కవులు ఎరుగక పోవడం గమనించారా? దిన పత్రికలూ అంతే-
-తాతిరాజు వేణుగోపాల్
rama bharadwaj అభిప్రాయం:
February 26, 2010 2:27 pm
వేణుగోపాల్ గారూ మీరన్నది నిజం. భాషా విరించి అయిన శ్రీశ్రీకి ఏకవచనమూ..బహువచనమూ గురించి తెలియదని ఎత్తిపొడుపుగా అనడం తెలిసిన వారికీ, తెలియని వారికీ మధ్య ఉన్న తేడాని చెబుతుంది.
తెలుగు లిఖిత సాహిత్యం ఒక ఎత్తుగా పెట్టి తన సంకీర్తనా సాహిత్యాన్ని దానికి మించి సృష్టించిన అన్నమాచార్యుడు తన పదాలలో భాషలో , వాక్య విన్యాసాలలోనూ చూపించిన స్వతంత్రత ఎంతో ధీటైనది. కవికి మిగిలిన వారికన్నా ప్రయోగాలు చేయడంలోనూ.. పోనీ కొన్ని రకాల”తప్పులు” చేయడంలోనూ తన కవిత్వంలో సాధ్యం! అతని ప్రభుత్వమ్ అక్షరాల మీద ఘనమైనది. దాని గురించి మహా అయితే చర్చించుకోవలసిందే తప్ప అంతకుమించి నెరసులు ఎన్నే పనిని ఎవరూ చేయరు. అలా చేయకపోవడం అనేదికూడా ఒక సాహిత్య మర్యాద. శ్రీశ్రీనికూడా మేం అనగలం అని చెప్పుకోవాలనే సరదా కొందరికి ఉండొచ్చు. కానీ వారి తప్పులెన్నే గుణాలకన్నా మించినది శ్రీశ్రీ అక్షరం! “మనిషి” అన్నదాన్ని బహువచనంలో గ్రహించడానికి అక్కడ అవకాశం ఉందని ఎవరికైనా తెలుస్తుంది.అయినా లౌల్యం వారిచేత ఆ పని చేయనివ్వదు. అందువలన శ్రీశ్రీని ఏదైనా అని కాసింత గుర్తింపు పొందుదామన్నది ఒక ఆశ.
ఒప్పుకుంటే ఇలాంటి వారు అన్నమయ్య గారి వాక్యాలనీ..ఆయన వాడిన “దుష్ట సమాసాలనీ” అలాగే తనదైన పధ్ధతిలో[ వ్యాకరణం ఒప్పని పధ్ధతిలో] అన్నమయ్య రాసిన వాక్యాలనీ కూడా వీళ్ళు మార్చేద్దామని ఉబలాట పడనూ వచ్చు!”తప్పులెన్నువారు తండోపతండంబులు”కదా?
కవిత్వంలో కవి భావప్రేరితుడే గానీ..భాషాపీడితుడు కాలేడు. కవిత్వం గురించి తెలిసిన వారికీ..కల్పన గురించి తెలిసిన వారికీ ఈ సంగతులు తెలుస్తాయి. మిగతా వారికి తెలియవు. వాళ్ళకి మహా కవిత్వాలలోని “కల్పన”- పెళ్ళాల దగ్గర విషయాలని దాచి కాకమ్మ కబుర్లుల చెప్పే మొగుళ్ళ అబధ్ధాలూ..పొట్టకూటికి చెప్పే అబధ్ధాలూ..దొంగలెఖ్ఖలు చెప్పే వారి అబధ్ధాలూ కూడా ఒక్కలాగే కన్పిస్తాయి. “కల్పన” అన్నది అంత తేలికగా కన్పించే వారికీ..అందులోని తారతమ్యాలు తెలియని వారికీ వచ్చే సందేహాలు మరి ఈ స్థాయిలోనే ఉంటాయి. నవ్వుకుని ఊరుకోవాలంతే!! తన “ప్రజ” లో ఇలాంటి ప్రశ్నలని తీసుకుని శ్రీశ్రీ చాలా హాస్యంగా జవాబులు చెప్పనే చెప్పాడు కూడా!!
రమ.
ఒక అజ్నాత(న) పాఠకుడు అభిప్రాయం:
February 27, 2010 2:57 pm
ఆంగ్లభాష వ్యాకరణం ప్రకారమూ, మరియూ తెలుగు భాష వ్యాకరణం ప్రకారమూ “ప్రతి మనిషి” అనే ప్రయోగం ఏక వచనం మాత్రమే అగును. ఇచ్చట “ప్రతి” అనేది కర్తా విశేషణం. “మనిషి” అనేది కర్త. ఇచ్చట కర్త ఏకవచనంలో మాత్రమే ఉందని పెద్దలందరూ గ్రహించవలయును. ఇచ్చట తెలుగు భాష వ్యాకరణం గురించి మాత్రమే చర్చిస్తున్నామని తెలుసుకొనవలయును. “Every man” అనేది ఆంగ్ల భాషలో ఎటుల ఏకవచనముగా పరిగణింతురో, అటులనే “ప్రతి మనిషి” అనేది తెలుగు భాషా వ్యాకరణ సూత్ర ప్రకారం ఏకవచనం మాత్రమే. ఇచ్చట వ్యాకరణ సూత్రాలను మాత్రమే ఉటంకిస్తున్నామనియూ, మరియే అదనపు ఉద్దేశ్యమూ లేదనియూ అందరూ గమనించ ప్రార్థన.
విధేయుడు,
ఒక అజ్నాత(న) పాఠకుడు
rama bharadwaj అభిప్రాయం:
February 28, 2010 12:34 am
అజ్నాత పాఠక మహాశయునకు !! అక్కడ వాక్యం “ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగులగొట్టి..చురకత్తులు పదును పెట్టి…” అన్న దానిలోని ప్రతీ విశేషణమ్ కూడా బహువచనలోనే కవి ఎందుకని రాసేడో చూడాలి. ఆయన ఏకవచనమ్ ప్రకారమే అయితే “తొడలు” అనీ..శృంఖలాలు” అనీ ” చురకత్తులు” అనీ అన్నిటినీ బహువచనంలో నిర్వహించడు. ఆ వాక్యం బహువచన సూచిక మాత్రమే!! అక్కడ ప్రతి వ్యక్తీ అన్నది బహువచనము లోనే కవి ఉద్దేసించాడని ఆ విశేషణాలు మొత్తం చెబుతూనే ఉన్నాయి. మనం చేయవలసిందల్లా దాన్ని గ్రహించడమే!! శ్రీశ్రీ ఆంగ్ల వ్యాకరణముననుసరించి తెలుగు వాక్యములు రాసిన కవి కాడు గావున ఆయనని తెలుగు భావుకునిగా గ్రహించి మీరు తరింతురు గాక! మీకు వ్యాకరణమ్ మీద చాలా పట్టు ఉన్నట్లైతే మీరు కవిత్వాన్ని చదవడమ్ మానేసి చిన్నయ సూరి గారిని అను నిత్యమూ పఠింతురు గాక!!
రమ.
చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:
February 28, 2010 6:51 am
రమగారూ,
తనమీద తనకు నమ్మకం లేని వాళ్ళు, ఇతరుల మీద పువ్వులు వేసి పూజించో, రాళ్ళు వేసి నిరసించో తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవటానికి తాపత్రయపడతారు. ఎవరు ఏమి చేస్తున్నారో సర్వే చేసి నిరూపించటానికి సాధ్యం కాని విషయం కాబట్టి వదిలేస్తే మంచిది.
నటశేఖర కృష్ణ , టికెట్లు కొనుక్కుని సినిమా చూసిన ప్రజలు - ఈ రెండు కాగడాల మధ్యన ప్రజ్వరిల్లుతున్న అఖండ జ్యోతి శ్రీ శ్రీ రాసినపాట అనటమే తప్ప, ఈ పాట గురించి మీకున్న అవగాహన ఏమై వుంటుందా అని ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు. మహాకవి సృష్టిని బేరీజు వేయటానికి మీరు వాడే కొలమానాలు ఇంత పేలవంగా వుంటే ఏమి మాట్లాడాలో తెలియక, మీరు కిందటిసారి రాసిన అభిప్రాయానికి నేను జవాబు చెప్పలేదు. ఇంకొంచెం వూరుకుంటే అన్నమాచార్యుల దగ్గర నించి ఇంకా వెనక్కి వెళ్ళేటట్లున్నారు కాబట్టి మాట్లాడ వలసి వస్తోంది.
తెలుగు వీర లేవరా అన్న పాట తెలుగు భాషా పరమైన జాతీయతని వు ద్బోధించే గీతం. ఆ పాట రాసే నాటికి ఆయన తెలంగాణ ప్రాంతంలో వావిలాల గోపాల కృష్ణ గారితో కలిసి తెలంగాణ వుద్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వున్నారు. విరసం సంస్థకి అధ్యక్షుడైనాడు. ఈ కారణాలన్నిటి వలనా, ఆ పాటని ఆనాటి రాజకీయ నేపథ్యంనుంచి వేరు చేసి చూడటం నా వల్ల కాదు. అలాగచూడమని ఆయన కూడా కోరుకునే వాడు కాదనుకుంటాను. మీరు అలాగని కోరుకోక పోవటమే కాక, అట్లా చూడటానికి నిరాకరించిన వాళ్లంతా నిరక్షర కుక్షులయి వుంటా ర నుకుంటున్నారు. అంధకారం కమ్ముకుని వస్తున్న రోజులు అవి. వచనంలో 1970 ల వరకూ కుటుంబరావు గారి లాంటి వాళ్ళు నిర్వహించిన పాత్ర ఆ తరువాత దాదాపుగా మాయం అయి పోవటం ఆ అంధకారంలో ఒక భాగమే. కొత్త దీపాలు వెలగలెదని కాదు కాని ఆ చీకట్లలో ఎవరు ఎలాటి దీపాలు వెలిగించారు అన్నది అడగడానికి ఇప్పటికింకా చాలా మంది తటపటాయిస్తారు. ఇన్నేళ్ల తరవాత రాళ్ళు విసరడమా అన్నది కాదు. అలాటి లెక్కలు కట్టడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది అన్నది .ఆలోచించ వలసిన విషయం అని నేనను కుంటే ఆలోచించ వలసి రావటమే మీకు వింతగా వున్నట్లుంది. కనుకనే సంభాషణ ముందుకి సాగడం లేదు.
మీ అభిప్రాయాలు చూసిన తరువాత దేశమంతా ఇన్ని సాయిబాబా గుళ్ళుండగా లేనిది , శ్రీ శ్రీ కి కూడా ఒక దర్గా కట్టి మొక్కుకునే భక్తులుంటే ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి లే అనిపిస్తోంది.
విషయం సజావుగా సాగి వుంటే, శ్రీశ్రీ కవిత్వాన్ని అప్పుడప్పుడు తెలుగు రాని వాళ్ళకి వినిపించి సంతోష పడి వూరుకునే వాడిని. నా కర్మ కొద్దీ, ఆయనకి సమకాలికులైన ఇతర భాషల్లోని కవులు కొంత మందిని చదివాల్సి రావడమూ, ఏవో కారణాల వలన ఎప్పుడో కంఠస్థం చేసి వదిలేసిన తెలుగు ప్రబంధాలలోనివీ, తమిళ దివ్య ప్రబంధంలోనివీ ముక్కలు తెరలు తెరలుగా మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవలసి రావటం, ప్రత్యేకించి తెలుగు భాషలో దేశభక్తి గురించి, సంకుచిత ధోరణులూ, అభ్యుదయ ధోరణుల గురించి అడపా దడపా ఏదో చర్చ రావడం ఇలాటి వాటి వలన శ్రీశ్రీ గురించి మళ్ళీ ఆలోచించ వలసి వచ్చింది.
ఈలోపల, తెలుగు భాష ఏనాటికైనా జాతీయ అధికార భాషగా గుర్తించబడుతుందని ఆయన చెప్పిన మాటలు కూడా కళ్ళ బడ్డాయి. (అది చదివి కళ్ళు తిరిగాయి అని కూడా చెప్పాలి. నా మాతృభాష జన జీవనానికి చలన సూత్రం కావాలి అని ఒక కవి అంటే సంతోషించాలి కానీ, నా మాతృ భాష ఇతర మాతృ భాషలు మాట్లాడే వాళ్ళ జీవితాలను కూడా శాసించాలి అని ఒక కవి కోరుకుంటే ఆయన కవిత్వాన్ని ఆమోదించే ముందు కొంచెం జాగ్రత్త గా చదవాలి అని నా గుండె చెప్తుంది. )
కాల క్రమేణా, నేను నిర్మించుకున్న మనో ప్రపంచంలో శ్రీ శ్రీ ని ఒక పది మెట్లు కిందికి దించక తప్పలేదు.
నేను రాసిన మొదటి సారే స్పష్టంగానే చెప్పానని అనుకున్నాను. సరిపోలేదోమో నని వివరించి మళ్ళీ చెప్పాను. ఏకవచన బహు వచనాలూ, వాస్తవికతా ఇట్లా తప్పులు లెక్కించు కుంటూ పోతే ఎప్పటికీ తేలదు కానీ, ఈ పాటలో వున్న అసలు సమస్య ఇందులో వున్న భావజాలంలోని సంకుచితత్వం. ఆ సంకుచితత్వానికి పూర్తి కారణం శ్రీశ్రీ కాదు. ఆయన పాఠకులూ, ఆయన శ్రోతలూ , ఆయనని అభిమానించినవారూ, ఆయన పాటలు రాసిన సినిమాల నిర్మాతలూ కూడా పెద్ద ఎత్తున బాధ్యత వహించ వలసి వస్తుంది. అందుకే నేను వేసిన ప్రశ్నలకి ఆయనే సమాధానం చెప్పుకోవలసిన పని లేదు. తప్పు మీది. మీరు జవాబు చెప్పలేక ఆయన మీదికి తోసేస్తున్నారు.
కేవలం నా వునికిని నిరూపించుకోవడానికి సాహిత్య రంగంలో చెయ్యి చేసుకునేంత వెసులుబాటు వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా కూడా రొజు వారీ జీవితంలో వుండని వాళ్ళలో నేనూ ఒకడిని. రాయక తప్పని పరిస్థితి వచ్చిన రోజు, రాయ వలసిన పద్ధతిలో, బాధ్యతగానే దీస్ని గురించి మళ్ళీ రాస్తాను. అప్పటివరకూ, సెలవు.
ఒక అజ్నాత(న) పాఠకుడు అభిప్రాయం:
February 28, 2010 6:11 pm
“ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగులగొట్టి..చురకత్తులు పదును పెట్టి…”
అ. ప్రప్రథమంగా విన్నవించవలసింది, తెలుగు భాష వ్యాకరణం ప్రకారం, “తొడలు”, “శృంఖలాలు”, “చురకత్తులు” అనేవి విశేషణాలు కావు. అవి కర్మలు (direct objects). ఇది ముందుగా అర్థం జేసుకోవలయును. “గొట్టి”, “పగులగొట్టి”, “పదును పెట్టి” అనేవి క్రియలు. ఒకే కర్తకు బహు క్రియలు గలవు. ఇది చాలా సరి అయిన విషయమే. అటులనే విశేషణానికి ఏకవచనం, బహువచనం అనేవి వుండను. వచనం అనేది నామవాచకానికి (noun) మాత్రమే ఉండుని. కర్త యొక్క వచనాన్ని అనుసరించి, క్రియా రూపంలో తేడా ఉండును. “రాముడు అరటిపళ్ళు తినెను”, “రాముడూ మరియూ కృష్ణుడూ అరటిపళ్ళు తినిరి” అనే వాక్యములో కర్త వచనము బట్టి, క్రియా రూపములు, “తినెను”, “తినిరి” అని వుండును. గావున విశేషణానికి వచనం లేదు.
ఆ. ఒక వాక్యములో కర్త ఏక వచనంలో వున్నప్పుడు కర్మ అదే వచనంలో వుండనక్కర లేదు. కర్తా, క్రియా రూపం మాత్రమే ఒకే వచనంలో వుండవలయును. “రాముడు అరటిపళ్ళు తిన్నాడు” అన్న వాక్యంలో వున్న కర్మ బహువచనంలో వుంది. అది సరి అయినదే. తప్పు ఎంత మాత్రమూ కాదు. “రాముడూ మరియూ కృష్ణుడూ కలిసి ఒక బొమ్మను తయారుజేసెను” అన్న వాక్యంలో కర్త(లు) బహువచనం. కర్మ (బొమ్మ) ఏకవచనం.
ఇ. ఒక మనిషికి రెండు తొడలు గలవు. ఒక మనిషికి కాళ్ళకూ, చేతులకూ వేరు వేరు శృంఖలాలు వుండగలవు. ఒకే ఒక చురకత్తి బదులు, బహు చురకత్తులు పదును బెట్టవచ్చును ఒక దాని తరువాత ఒకటిగా. ఏకవచనంలో వున్న కర్త (మనిషి)కి బహువచనంలో కర్మలు వుండటం తప్పు కాదు.
ఈ. ఇచ్చట ఉదహరింపబడిన వాక్యంలో ఎటువంటి తప్పూ లేదు. వాక్యం చక్కగానే వున్నది. నేను వ్యాకరణం ప్రకారం “ప్రతి మనిషి” అనేది ఏకవచనం మాత్రమే ననియూ, బహువచనం ఎంత మాత్రం కాదనియూ మాత్రమే ఉటంకించాను. ఇది ఒక భాషకు సంబంధించిన విషయం గావున, భాషా జ్నానం ప్రకారం నేనట్టు చెప్పి ఉంటిని.
ఉ. మీరు, “శ్రీశ్రీ ఆంగ్ల వ్యాకరణముననుసరించి తెలుగు వాక్యములు రాసిన కవి కాడు గావున ఆయనని తెలుగు భావుకునిగా గ్రహించి మీరు తరింతురు గాక! ” అని అని ఉంటిరి. ఆంగ్ల వ్యాకరణం అనుసరించి తెలుగు వాక్యములను కవి రాయవలెను అని నేను ఉటంకించలేదు. మీరట్లు అపోహ పడి నా మీద ఇటువంటి ఆభాండములు వేయుట విజ్నులయిన మీకు భావ్యము కాదు. అర్థము తెలియజేయగలందుకు మాత్రమే ఆంగ్ల వ్యాకరణం కూడా ఉదహరించితిని. అంతెయును గాక, కర్త, క్రియ, కర్మ, విశేషణం, వచనం వంటి విషయాలలో రెండు భాషల వ్యాకరణం ఒకదానిని ఒకటి పోలి ఉండును. సులభంగా గ్రహించుటకు మాత్రమే అంగ్ల భాషా వ్యాకరణమును వివరించితిని. అందువలన ఇటువంటి వ్యక్తిగత దూషణలు మీకు శోభ నివ్వవు. సాహిత్య చర్చలో కొంచెం సంయమనం అవసరం.
ఊ. ఆఖరుగా మీరు, “మీకు వ్యాకరణమ్ మీద చాలా పట్టు ఉన్నట్లైతే మీరు కవిత్వాన్ని చదవడమ్ మానేసి చిన్నయ సూరి గారిని అను నిత్యమూ పఠింతురు గాక!!” అని నన్ను వ్యక్తిగతంగా దూషించితిరి. ఇది నాకు మిక్కిలి ఖేదము కలిగించెను. నా వ్యాఖ్యానంలో నేను మిమ్ములను ఒక చిన్న మాట చేత కూడా దూషించలేదు. నన్ను దూషించుటకు మీకు ఎటువంటి హక్కు కలదో నాకు ఈ జన్మమున అర్థము కాదు. నాకు సలహా ఇచ్చే ఆగత్యం మీకు ఎంత మాత్రమూ లేదని నేను ఎంత గానో నమ్ముతూ ఉన్నవాడను. మీరు సాహిత్య సంయమనం పాటించకుండా, ఇటుల రహాదారి మీద ఒకరితో ఒకరు కలియబడి, కలహించుకున్నట్లు చర్చించిన, మీ మీద ఈమాట సంపాదక వర్గానికి ఆరోపణ చేయడం తప్ప వేరే మార్గము లేదు.
ఋ. అజ్నాత పాఠకులకు కూడా అభిప్రాయములు ఉండుననియూ, అవి వెలిబుచ్చు హక్కూ, అర్హతా వారికి ఉండుననియూ మీరు గమనించకపోవుట బహు శోచనీయమైన విషయము. ఒకరిని అవమానించే హక్కు ఎవరికీ ఎంత మాత్రమూ లేదు. కావున మీరు ఇక మీ వాఖ్యలు విషయమునకు మాత్రమే పరిమితం జేయగలరని ఆశిస్తున్నాను. ఒకరు తమకు ఎంత జ్నానం కలదు అని నమ్మినా, లేని జ్నానం ఎంతో ఉండి ఉంటూనే ఉండును. ఏ ఒక్కరూ సర్వ జ్నాని కాలేరు అని నేను బాగుగా నమ్మువాడను. ఎవరి జ్నానమునకు తోచినట్టు వారు వారి అభిప్రాయములను వెలిబుచ్చుట, అటులనే ఇంకొకరు వెలిబుచ్చిన అభిప్రాయములను గౌరవించుట నాగరీక లక్షణమని నేను వేరే నొక్కి ఒక్కాణించవలసిన ఆగత్యం ఎంత మాత్రమూ లేదు. ప్రతి ఒక్కరి వాఖ్యలూ విషయమునకు మాత్రమే పరిమితం అయి ఉండవలయు. అది వ్రాసిన వారికి సంబంధించి ఉండి ఉండకూడదు. ఇది మీరు గ్రహించగలరని ఆశిస్తున్నాను.
ఇట్లు,
నమస్కారములతో
అజ్నాత(న) పాఠకుడు.
rama bharadwaj అభిప్రాయం:
March 1, 2010 12:34 am
వ్యాకరణాభిలాషులు గారికి!! నేను చాలా క్లుప్తంగానే జవాబు చెప్పేను. దాని మీద మళ్ళీ నాకు చాటభారతమ్ అంత వివరణలతో ఏమీ పని లేదు. ఇంక జ్నానమ్ అజ్నానమ్ ల ప్రసక్తి తమరే తెచ్హారు. మిమ్మల్ని మీరు అజ్నాత పాఠకుని గాను.. అజ్నాన పాఠకుని గానూ చెప్పుకున్నారు.
చాకిరేవు వారికి,!! మీ అభిప్రాయం మీద కూడా నాకు మళ్ళీ కొత్తగా చెప్పే అదనపు భావాలేమీ లేవు. నా అదృష్టం కొద్దీ [దురదృష్టంగా మాత్రం కాదు] మీ లాగే నేను సైతం ఇతర భాషా కవిత్వాలని క్షుణ్ణంగా చదువుకున్నదాన్ని. అందువలన శ్రీశ్రీ విలువ నాకు ఎక్కువ తెలుసు.
రమ.
[ఈ కామెంట్ ఎడిట్ చేయబడింది - సం.]
tatiraju venugopal అభిప్రాయం:
March 2, 2010 3:48 pm
‘ప్రతి’ వాదం ఇంత భయంకరమా?
‘ పాడవోయి భారతీయుడా ’ ( శ్రీశ్రీ సినీమా పాటలు , పద్యాలూ -మొదటి సంపుటి -శ్రీశ్రీ ప్రచురణలు -1983) సంకలనం లోని మొదటి పాట అయిన ‘ పాడవోయి భారతీయుడా ’ కింద శ్రీశ్రీ గారిచ్చిన వివరణ ఇలా ఉంది - ‘’తెలుగు వీర లేవరా - అనే పాటతో ఈ సంపుటిని మొదలు పెట్టక పోవడానికో చిన్న కారణం ఉంది . అందులో - ప్రతి మనిషి తొడలు గొట్టి —–సింహాలై గర్జించాలి అనడంలో వ్యాకరణ దోషం ఉంది (ప్రతి మనిషి ఏక వచనం , సింహాలై బహు వచనం . సింహంలా గర్జించాలి ఆంటే సరిపోతుంది . సాహిత్య రీత్యా మాత్రమే కాక సంగీత పరంగా కూడా ). వచ్చే సంపుటి —లో —సవరణ ఉంటుంది . సినీమా పాటల్లో పెద్ద పెద్ద దూడలకే ఎవరూ కేర్ చెయ్యరని నాకు తెలుసు . నేను చేస్తాను .” (ఇక్కడ పాడినవారు ఘంటసాల అని మాత్రమే ముద్రితమైంది . సుశీల గారి పేరు లేదు ).
దరిమిలా రెండవ సంపుటి ‘ తెలుగు వీర లేవరా ’ (1996) లోని తొలి పాట ‘తెలుగు వీర ’ అయ్యి ‘సింహంలా ’ అనే సవరణతోనే వెలు వడింది ( ఇక్కడ పాడిన వారు ఘంటసాల అని మాత్రమే ఉంది . రామకృష్ణ పేరు లేదు . గమ్మత్తు ఏమిటంటే -ఈ సంపుటికి ముందు మాట రాసిన వారు గాయని సుశీల గారే ) .
( ఈ రెండవ సంపుటిలో వడ్డాది వారి పాట ‘చల్లని రాజా ఓ చందమామ ’ , కొసరాజు గారి ‘దేశమ్ము మారిందోయి కాలమ్ము మారిందోయి ’, మూడవ సంపుటిలో భుజంగరాయ శర్మ గారి పాట ‘కలిమి నిలవదు లేమి మిగలదు ’ ఈ రెండూ శ్రీశ్రీ గారివిగా భ్రమించి ముద్రించడం తప్పే . ఇక్కడ ఈ తప్పులకు శ్రీశ్రీ బాధ్యులు కారు ).
విశేషమేమిటంటే - తొలి సంపుటిలోని తొలి పాట లోనూ , రెండవ సంపుటి లోని తొలి పాట లోనూ ‘ప్రతి మనిషి ’ అన్నది చోటు చేసుకోవడమే . చూడండి - పాడవోయి భారతీయుడా ’ పాటలో ‘ప్రతి మనిషి మరియొకని దోచుకొనే వాడే ’ అని ఉంటుంది కదా . మొదటిది స్టేజి సాంగ్ అయితే రెండవది మార్చింగ్ సాంగ్ కనుక శ్రీశ్రీ లోని చిన్నయ్య సూరి కాస్తా పర వస్తు అయ్యారు .
రామాయణంలో పిడకల వేట - ఇటీవల ఒక టీవీ ఛానెల్లో ఒక కుర్ర గాయకుడు మల్లాది వారి ‘మది శారదా దేవి మందిరమే ’ పాటను అద్భుతంగా ఆలపించినా తరువాత ట్రైనరు అనబడు ఒక వర్ధమాన గాయని ‘ఆఖరి లైన్లో గుఱుతెఱిగిన కాదు గురునెరిగిన అని పాడాలి ’ అని అన్నారు .తాను పాడింది తప్పు కాదని ఆ అబ్బాయికి తెలిసినా బిక్క మొహం వేయక తప్ప లేదు . ఈనాటి అజ్ఞ్యాన తిమిరాంధకారానికి మల్లాది వారు ఎంతగా నవ్వుకొంటున్నారో ఏమో ? నిజానికి ఆ ఆఖరి లైన్లో - వర దాయిని కానీ గుఱుతెఱిగిన మన - మది శారదా దేవి మందిరమే ’ అని ఆ అబ్బాయి పాడినట్టే ఉంది .
ఉన్న తప్పుని ఒప్పుకోవడం గొప్ప . లేని తప్పుని చొప్పించడం నేరం .
ఇలా ఈ వివరాలు ఇస్తున్నానో లేదో ఒక టీవీ ఛానల్ శ్రీశ్రీ గారి మీద డాక్యుమెంటరీ తీసి నందులు గెలుచుకుంది అని విన్నాను. కృష్ణ శాస్త్రి గారి ‘మాట’ ఒక్క రికార్డ్ గా నైనా దాచుకోలేక పోవడం మన దురదృష్టం అని శ్రీశ్రీ అన్నారు. శ్రీశ్రీ ఆ మాటకొస్తే అదృష్టవంతులే.
-డాక్టర్ తాతిరాజు వేణుగోపాల్
rama bharadwaj అభిప్రాయం:
March 3, 2010 1:51 am
వ్యాకరణం కన్నా కవిహృదయానికి ప్రాముఖ్యతనివ్వడం అన్నది ఒక సరసగుణం! ! నేను శ్రీశ్రీవిషయంలో చెప్పినది అదే!! పైగా శ్రీశ్రీ తాను స్వయంగా వివరణ ఇచ్చాకా మరింక అది చర్చకి రాకూడదు. అది ఒక మర్యాద.
సాహిత్యంలో వ్యాకరణ దోషాలు ఎన్నుకుంటూ పోతే మహామహులు చాలరు. “ఎమితిని సెపితివి కపితము” అని అల్లసాని పెద్దనని రామలింగడు వెక్కిరించాడని ప్రతీతి. అందువల్ల పెద్దన కవిత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయింది.
అలాగే అన్నమాచార్యులవారి వేల సంకీర్తనలలో వ్యాకరణ దోషాలు మెండుగానే దొరుకుతాయి. కానీ ఆయన పదాల ప్రాముఖ్యతకి అవేమీ అడ్డురాలేదు. రావు.
కవితా సంపన్నత ముందు ఇలాంటివి బహుచిన్నవని..లోకంవాటిని పట్టించుకోదనీ చెప్పడం నా ఉద్దేశ్యం!
శ్రీశ్రీకున్న అపార భాషా పరిజ్నానం తెలిసిన వారు “శ్రీశ్రీ తప్పుచేసేడోచ్ ” అని చాటనఖ్ఖరలేదు అన్నది నా భావం! తప్పు అన్నది ఒప్పు చేసే ప్రయత్నం నేను చేయలేదు. ఆయన మిగతావి అన్నీ “బహువచనం”లో పదాలని రాసేడు గనక అది వ్యక్తి గురించి కాక సమిష్టి పోరాటానికి ఆయన ఆ పాటని లక్ష్యించాడు గనక
ఆ “ప్రతి మనిషి ని ” మందికి గుర్తుగా గ్రహిస్తే చాలు అన్నది నా సూచన.
నేను కవితాసౌదర్యానికి వశురాలిని. దాని ముందు ఇతర దోషాలు నాకు ఎక్కవు. ఉత్తమ కవులందరికీ ఉత్తమ భావుకులకందరికీ ఇది అనుభవంలోకి వచ్చే విషయమే!!
రమ.
చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:
March 3, 2010 2:23 am
వాదం వచ్చిన ప్రతిసారీ ఇంత భయంకరంగా వుండనవసరం లేదు వేణుగోపాల్ గారూ. :)
చిన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో లో వార్తలు చదివే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయి వుంటారనుకుంటుండే వాడిని. ఒక సారి ఒక అనౌన్సర్ పొరపాటున ‘సిబ్బంది’ అనడానికి బదులు ‘సిద్దంబి’ అనడం నేను స్పష్టంగా విన్నాను. ఆ రోజంతా కనపడ్డ వాళ్లందరికీ రేడియో లో వార్తలు చదివే ఆయన చేసిన పొరపాటు గురించి చెప్పుకుంటూ తిరిగాను. నేను అట్లా ప్రచారం చేసినందు వల్లన ఆ అనౌన్సర్ ఖ్యాతికి ఏమీ నష్టం వచ్చి వుంటుందనుకొను. నిజానికి ఆ పొరపాటు పట్టుకోవటం వలన నా దృష్టిలో కూడా అనౌన్సర్లు గొప్ప వాళ్ళు అయి వుంటారన్న నమ్మకం కూడా ఏమీ తగ్గలేదు. కాక పోతే, గొప్ప వాళ్ళు కూడా మామూలు మనుషులే అన్న జ్ఞానం మాత్రం నాకు వచ్చింది.
అట్లాగే, శ్రీశ్రీ రాసిన పాటలో పొరపాటు దొర్లిందట అని ఒక పది మంది వింతగా చెప్పుకుంటే అందులో పెద్ద నేరమేమిటో నాకు అర్ధం కావటం లేదు. దాని వలన శ్రీశ్రీ కి వచ్చిన నష్టమేమీ లేక పోగా, ఒకరికో ఇద్దరికో శ్రీశ్రీ కూడా మానవమాతృడే అన్న స్పృహ కలుగుతుంది. అది మంచిదే.
అట్లా చెప్పుకునే వాళ్ళ మీద తెలిసిన వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు విరుచుకు పడితే - ఆహా , ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద నేరంగా లెక్క కట్టి ఇంత వుద్రేక పడుతున్నారంటే, అసలు విషయం ఇంకెదో వుంది వుంటుంది అన్న అభిప్రాయం కలిగే ప్రమాదం కూడా వుంటుంది.
ఇక పోతే, అచ్చు తప్పులు , వ్యాకరణ పొల్లులూ దిద్దుకోవడం రచయితకి కనీస బాధ్యత. రచయిత గొప్పదనానికి అదేమంత పెద్ద తార్కాణం కాదు.
శ్రీ శ్రీ , ఒకటీ రెండూ కాదు, ఏకంగా కొన్ని తరాల తెలుగు యువతీ యువకులని ప్రభావితం చేసిన కవి. ఇది ఎలాటి ప్రభావమూ, ఈ ప్రభావం మంచికొచ్చిందా చెడ్డకొచ్చిందా, ఏ కవితా ఎప్పుడూ ఏ ప్రయోజనాన్ని సాధించింది, ఇలాటి విషయాలని మాట్లాడుకోవలసిన అవసరం ఈ రోజున వున్నది. అవకాశం కూడా కొద్ది కొద్దిగా కనపడుతోంది.
బాధ్యత కల మనుషులు, ఆ అవకాశాన్ని చేజారనీయకుండా మాట్లాడాలి. మాకు తెలుసు, మీకు తెలియదు, మాకున్న రసజ్ఞానం మీకు లేదు, శ్రీశ్రీ ని అంచనా వేసే టంత గొప్పవాళ్ళా మీరు ? అంటూ శ్రీశ్రీ వ్యాకరణ దోషం గురించి చెప్పుకున్న వాళ్లంతా రాళ్ళు విసురుతున్న అలాగా జనం అన్నట్టు కలియబడితే, జవాబు చెప్పక తప్పదు.
పి.ఎస్.
మొసళ్ళ గుంపుల మధ్య అలవోకగా బ్రతకడం అలవాటయిపోయిన వాడిని కాబట్టి నామీద వేస్తే సంభాళించుకోగలిగాను కానీ, మీరిలాగ అలవాటుగా ఇంటి పేర్లతో గాలాలు వెయ్యరనే ఆశిస్తున్నాను. విషయం శ్రీరంగం వదిలిపెట్టి కంచి దోవ పట్టటం ఎవరికి మాత్రం మంచిది ?
చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:
April 4, 2010 10:40 pm
‘శ్రీ శ్రీ రచనలపై కేవీయార్ ‘శీర్షికతో — ఆంధ్రజ్యోతి ఏప్రిల్ 5 - వివిధ పేజీ (నాలుగో పేజీ) లో 1985 లో కడియాల రామమోహన రాయి - కేవీయార్ తో చేసిన ఇంటర్వ్యూ వుంది.
ఈ పేపర్ ద్వారా PDF డౌన్ లోడ్ చేసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలి.
l