ఈమాట » కలైన గోర్వెచ్చని పాట

Expand to right
Expand to left

కలైన గోర్వెచ్చని పాట

ఓ తాత పదమెత్తి పాడుతుంటే
అలసి గూటికి చేరిన పక్షులు
రెక్కలు సరిచేసుకుంటూ సేదదీరేవి
దాలిలో మునగదీసుకున్న కుక్కపిల్లలు
చెవులాడించుకుంటూ చూస్తుండేవి
బోదెలో కప్పలో
గట్టుపైచేరి వళ్ళారబెట్టుకుంటుండేవి

పాటతో పాటు వేళ్ళుకదిలేవి
నడుం కదిలేది
పాటపూర్తయ్యేసరికి
వెన్నెల విరగబూసేది
నేస్తున్న నులకమంచం పూర్తయ్యేది

సన్నని పురిపేనిన నులకతో
అల్లిన కౌశలమంతా
రాజమందిరాలలో పరచిన
తీవాసీలా పరుచుకునేది

చేనునుంచో కూలినుంచో
తిరిగొచ్చిన అమ్మో
బాప్పో, పెద్దో, చిన్నమ్మో, మామ్మో
సన్నికల్లుపై నూరిన
మిరపకాయల పచ్చడితో
కూరేదైనా వండి వడ్డించేది

నడుం వాల్చిన తాత చుట్టూ పిల్లలు
ఆ కథలకు పదాల రాగాలకు
వూకొడుతూ వూకొడుతూ
గోర్వెచ్చని కలలకోసం
నిద్రలోకి జారిపోయేవారు
కలచెదరకుండా
ఆకులు, చుక్కలు కావలి కాసేవి

ఆ తాత పాడిన పదం
అప్పుడప్పుడూ నాకు జోల పాడుతుంటుంది
మెలివేసిన మీసం ఊయలూపుతుంటుంది
ఆ నులక కౌశలం కోసం
ఎప్పుడూ ఆత్రంగా వెతుకుతుంటాయి నా కళ్ళు

 

(8 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. N N Muralidhar అభిప్రాయం:

    January 4, 2010 7:02 am

    చాలా బాగా వ్రాసారు.

  2. అపూర్వ అభిప్రాయం:

    January 4, 2010 9:52 am

    నులక కౌశలంకోసమేనా?? తాత పదాలు అల్లిన చిత్రం మాసిపోయిన గ్రామాన్ని వెతకటంలేదా?????

  3. sailajamithra అభిప్రాయం:

    January 5, 2010 10:08 am

    Really realistic poem. I appreciate this.. good john keep it up.

  4. rajendra kumar devarapalli అభిప్రాయం:

    January 19, 2010 1:17 am

    ఈ మధ్య కాలంలో చదివిన కవితల్లో అత్యంతాఅహ్లాదాన్ని పంచిన కవిత ఇది.నులకమంచం పేనటం ఏ రాజభవనాల్లోని తివాచీలకూ తీసిపోదు,కలలు చెదరకుండా ఆకులు చుక్కలు కావలి కాయటం అన్నభావనే ఎంతో ఆత్మీయంగా ఉంది.కానీ జాన్ గారు మీరు ఇకపైన నులకకౌశలం కోసం వెతుకుతూనే ఉండాలేమోనండి!ఇంకెక్కడి నులక మంచాలు?
    మంచి కవితను మాచే మరలామరలా చదివింపజేసినందుకు గాను ధన్యవాదాలు.

  5. అరుణ అభిప్రాయం:

    January 27, 2010 8:29 am

    అలసి గూటికి చేరిన పక్షులు
    రెక్కలు సరిచేసుకుంటూ సేదదీరేవి
    దాలిలో మునగదీసుకున్న కుక్కపిల్లలు
    చెవులాడించుకుంటూ చూస్తుండేవి
    బోదెలో కప్పలో
    గట్టుపైచేరి వళ్ళారబెట్టుకుంటుండేవి

    మంచి పద చిత్రం

  6. v v b rama rao అభిప్రాయం:

    January 30, 2010 9:11 am

    this is a good poem - nostalgia for joyful times that would never come again. Contentment and hard work were the qualities of that bygone era. Send me the telugu poem in pdf and i’d render it into english when find a little free time.

    good wishes
    rama rao, noida-7

  7. siva rama prasad అభిప్రాయం:

    February 24, 2010 2:37 pm

    బాగున్నది మీ కవిత. దాలి అంటె? నిఘంటువు వెదికితే పాలు మరిగించడానికి పిడకల ప్రోవు అని ఉంది. బాప్ప అంటె అత్త కద. మా కళింగాంధ్రలొ అత్త. నిజమే, నులక మంచాలు పట్టె మంచాలు మరచి పొయాము. ప్లై ఉడ్ మంచాల షోకు వచ్హినది. ఆ అల్లిక ఎంత (artistic) కళాత్మకంగ ఉండేది diamond shape తొ రెండేసి వరసలతొ చిత్రం గీసినట్టుగా. పోయిన రోజుల్ని గుర్తుకు తెచ్చారు.

  8. జాన్‌ హైడ్‌ కనుమూరి అభిప్రాయం:

    February 25, 2010 8:58 am

    శివరామ ప్రసాద్ గారు
    నా బాల్యంలో చూసిన కొన్ని మర్చిపోలేని చిత్రాలను అక్షరీకరించే ప్రయత్నంచేసాను. సాధారణంగా కుక్కలు, పిల్లులు పడుకోవటానికి చిన్న గుంటలాగా చేసుకుంటాయి. అలాగే పల్లెల్లో ఆరోజుల్లో పొయ్యిలు బయట వుండేవి. అందులోని నిప్పు ఆరిపోయాక అందులో కూడా వీలును బట్టి పడుకొనేవి. అలా - దాలి అన్న పదం గుర్తు, నేను నిఘంటువును చూడలేదు. అవును బాప్ప అంటే అత్త(నాన్న వైపు). పాతరోజుల్ని గుర్తు తేగలిగినందుకు సంతసిస్తున్నాను.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a