కుటుంబరావు నవలల్ని పరిశీలిస్తూ, అంపశయ్య నవీన్5, కుటుంబరావుది సైంటిస్టు దృష్టే కాని ఆర్టిస్టు దృష్టి కాదు, సమస్యలని శాస్త్రీయంగా విశ్లేషిస్తాడు కాని ఉద్రేకాలతో కొట్టుకొనిపోడు, అయినా పాఠకులకి సాహిత్యం కొంత ఉద్రేకాన్నివ్వాలి, అది లేకపోవడం కుటుంబరావు రచనల్లో ఒక లోపమని విమర్శించారు. ఇది స్థూలంగా నిజమే అయినా, కుటుంబరావు అలాంటి సంఘటనలని చిత్రించినప్పుడు, జీవితం గురించి ఏదో ఒక వ్యాఖ్యానం చేస్తాడు. ఆలోచించే కొలదీ, అది మన గుండెల్ని తాకుతుంది.
కన్నతండ్రి మీద ఏమాత్రం సానుభూతి చూపని కూతురి ప్రవర్తన ఏ తండ్రినైనా కలచివేసేదే. డాక్టరు తన బాధని వెలిబుచ్చే తీరు మన కంటితడి పెట్టిస్తుంది: “ఎడం ఎడంగా నాటిన మొక్కలు కూడా పెరిగిన కొద్దీ దగ్గిరపడి కలుసుకుంటాయి. మనుషులు పెరిగిన కొద్దీ దూరమవుతారు. నర్సు మనసు నాకు తెలియటం లేదన్నది కాస్త ఆందోళన కలిగిస్తున్నది.” అంతలోనే సర్దుకొని, తన ఆందోళన మాట దేవుడెరుగు, తనేం చేస్తే న్యాయమని అడుగుతాడు. నర్సుని కొన్నాళ్ళు తాత దగ్గరకి పంపడమే మంచిదని సూర్యం సలహా ఇస్తే, అదేదో తనే తీసుకెళ్ళి దింపి రమ్మని కోరతాడు. నర్సుని బెజవాడలో తాత దగ్గర చేరుస్తాడు సూర్యం. అక్కడ నాలుగు రోజులు ఉండి తిరిగి వస్తుందని ఆశించిన సూర్యానికి, ఆ అమ్మాయి మూడు నాలుగు నెలల పాటు అక్కడే తిష్ట వెయ్యాలనుకోవడం, అసలు వాళ్ళ అమ్మా నాన్నలని తలుచుకోకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఇక ఉండబట్టలేక నర్సుని, మీ నాన్న గారింట్లో నువ్వు మెంటల్గా బాధపడ్డావా? అని అడుగుతాడు. అది ఒక జైలు అంటుంది నర్సు. ఎప్పటి నుంచి, తన తాతని మొదటిసారి చూసినప్పటి నుంచేమోనని అడుగుతాడు. అసలు బుద్ధెరిగినప్పటి నుంచీ అది జైలేనంటుంది నర్సు. సూర్యం నిర్ఘాంతపోతాడు.
వాళ్ళ నాన్న, అమ్మనీ తననీ పల్లెత్తుమాట కూడా అనకుండా సర్కసు చేయించాడనీ, అంతకన్నా తల్లీ తండ్రీ తరచుగా కీచులాడుకునే ఇంట్లో ఎక్కువ సుఖముంటుందనీ, డాక్టరు కుటుంబ సౌఖ్యమంతా ఆయన ఆదర్శపు పునాదులమీద ఆధారపడి ఉందనీ, తల్లీ కూతుళ్ళు పౌడరు రాసుకున్నా, ఓ సిల్కు చీర కట్టుకున్నా ఆయన నరకయాతన పడతాడని తెలిసి వాళ్ళిద్దరూ ఆ చెర అనుభవించారనీ నర్సు చెప్తుంది. తాత నగలతో మొదటిసారి అలంకరించినప్పుడు, తనలో ఇంత అందముంది, తనూ అందరిలా ఎందుకుండకూడదని తనలో తాను కుమిలిపోయానంటుంది.
సూర్యం నర్సుకి డాక్టరు గారెంత నిస్వార్థపరుడో, విశాల దృక్పథం కలవాడో, కూతురు లేని ఇంట్లో ఉండటానికి ఎంత జంకాడో చెప్పి ఆయనని నిందించవద్దంటాడు. ఆయన ఆదర్శాల మీద నమ్మకం లేకపోయినా తెలిసీ తెలియని వయసులో వాటిని అరువు తెచ్చుకోవడాన నర్సుకి తన జీవితం జైలు లాగా అనిపించిందనీ, దానికి ఆమే కారకురాలనీ చెప్తాడు. నర్సుకిది అంతగా రుచించదు. కాని నర్సు, సూర్యం ప్రేమించుకుంటారు, దగ్గరవుతారు. క్రమంగా నర్సు తాత ఐశ్వర్య ప్రపంచంలో కూరుకుపోతుంది. కుటుంబ బాంధవ్యాలని కూడా ఆర్థికదృష్టి నుండే చూస్తుంది. డాక్టరు భార్య మళ్ళీ గర్భవతి అని తెలుసుకున్న వెంటనే ఈ వయసులో వాళ్ళకి పిల్లలేంటి, అని హేళన చేస్తుంది. అంతకన్నా ముఖ్యంగా, నీచంగా, ఆ పుట్టేది అబ్బాయి అయితే, తాత ఆస్తి తనకి సంక్రమించదేమోనని భయపడుతుంది. ఈ విషయం తాతకి తెలియకముందే, ఆస్తినంతా తన పేర రాయించుకోవడం మంచిది కదా అంటుంది.
తోబుట్టువుకి కూడా తాత ఆస్తిలో హక్కు ఉంటుంది కదా అని సూర్యం అంటే, తనేమైనా పిశాచా, ఆస్తి తన పేర ఉంటే తాత అనుమతితో అవసరం లేకుండా తన వాళ్ళని బాగా చూసుకోడానికి వీలుంటుందని సమర్థించుకుంటుంది. డాక్టరు ఎప్పుడూ బయటకి వెళ్ళని కూతురు వెళ్ళి ఎలా ఉంటోందో, ఉత్తరమైనా రాయలేదే అని మధనపడతాడు. సూర్యం హెచ్చరిస్తే, ఎన్నో సార్లనుకున్నాను రాయాలని, ఏం రాయాలో ఎట్లా రాయాలో తెలియటం లేదంటుంది నర్సు. చివరకి నర్సుకీ సూర్యానికీ పెళ్ళవుతుంది – డాక్టరే రిజిస్టరు మ్యారేజి చేయిస్తారు. మరి కొద్దిరోజులకే లాయరు మంచానపడి మరణిస్తాడు; డాక్టరే తండ్రి తలకు కొరివి పెడతాడు. తాత ఆస్తికంతా నర్సే వారసురాలవుతుంది. డాక్టరు వేరే వాళ్ళ దగ్గర అసిస్టెంటుగా చేరి, తర్వాత మళ్ళీ తనే ప్రాక్టీసు పెట్టీ బాగా రాణిస్తారు. అయితే ఆయన ఇంటి వాతావరణంలో పెద్ద మార్పేమీ ఉండదు – ఇంకొంచం ఫర్నీచరు, చాలా పెద్ద లైబ్రరీ. నర్సు ఇంట్లో ఖరీదైన వస్తువులకేమీ లోటు లేదు, సంస్కృతి మాత్రం శూన్యం. తనని, అంటే సూర్యాన్ని, చాలా మంది మిస్టర్ నర్సు అంటారని తనకు తెలుసు అనడంతో నవల ముగుస్తుంది.
నర్సు లోలోన మధనపడ్డా, పాఠకులకి అది నవల మధ్యదాకా తెలియదు. తన లోపల రగులుతున్న అసంతృప్తిని నిగూఢంగా ఉంచడంలో కుటుంబరావు మంచి శిల్పాన్ని చూపించారని అంపశయ్య నవీన్ అన్నారు. ఆ తరువాత ఆమె ప్రవర్తనని అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు. డాక్టరు గారి ఆదర్శమైన వ్యక్తిత్వంలోనూ అర్థం కానిది లేదు. పిల్లల పెంపకంలో ఎంతటి విద్యావంతులైనా పొరబాటు పడొచ్చని మనకి కనువిప్పు కలిగిస్తాడు. సూర్యం చివరిదాకా చాలా మార్పులకి గురవుతాడు. ముందర డాక్టరు వలన అబ్బిన సాహిత్యాభిమానమూ, ఉన్నత భావాలూ, సంస్కారవంతుణ్ణి చేస్తాయి. కాని డాక్టరు జీవితం పరిమితమైనదని, తను వేరే అనుభవాలని కోరుకుంటాడు. నర్సుకి దగ్గర కాకముందు కొంత చవకబారు ప్రేమాయణం సాగిస్తాడు. నర్సుని ప్రేమించిన తర్వాత కూడా, మంచీ చెడూ విచక్షణ చూపిస్తాడు. చివరకి అతను నర్సుకి వశమయిపోవడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అంపశయ్య నవీన్, సూర్యం పాత్ర ఇలా హఠాత్తుగా పతనమై పోవడాన్ని అంగీకరించడం కష్టమన్నారు. అంగీకరించడం కష్టమేమో కాని, పాత్ర చిత్రణ అనుచితంగా లేదు, వచ్చిన మార్పు హఠాత్తుగా జరిగినదీ కాదు. నర్సు మనసు వక్రంగా పని చేసినా, ఆమె సూర్యం దగ్గర ఏదీ దాచలేదు; అతనికి ఆమె పట్ల అసహ్యమూ, జాలీ కూడా ఒకేసారి కలిగాయి. ఈ కర్ణ-దుర్యోధన సంబంధం అప్పటి నుండి, ఇప్పటికీ (సూర్యం కథ చెప్పేనాటికి నలభై ఏళ్ళ వయసు వాడు) నడుస్తుందంటాడు. అలా ఆ సంబంధాన్ని ఎందుకు నడవనిచ్చాడు? దానికి అతనిలా సమాధానం చెప్పుకున్నాడు: ప్రేమించినవాడికి రెండే మార్గాలు – ఉన్న మనిషిని ఉన్నట్లుగా ప్రేమించాలి, లేదా ప్రేమపాత్ర గుణాలుంటే వాటిని సంస్కరించుకోవాలి. వేరే మనిషిని సంస్కరించడం అసంభవమంటాడు సూర్యం. అందుచేత నర్సుని ఉన్నపళంగానే ప్రేమించాడు. అంతమాత్రాన నర్సుకి పూర్తిగా లోబడి ఉండాలా, తనకో వ్యక్తిత్వమంటూ లేని జీవితం గడపాలా, అన్నదానికి సరయిన సమాధానం దొరకదు – నర్సు అంటే మోహం, ఆమె ప్రభావం, మోతాదుకి మించి ఉండి ఉండాలి.
కుటుంబరావు చాలా రచనల్లో నాకు కొట్టొచ్చినట్లు కనిపించే విషయం – ఆయన పాత్రలు వయసుకి మించి ఎదిగి ఉంటాయని. నర్సు పదో తరగతి చదివే వయసొచ్చేటప్పటికే ఆస్తిపాస్తుల గురించి చేసే వక్రమైన ఆలోచనలూ, సూర్యం డిగ్రీ చదువు పూర్తి కాకముందే జీవిత సమస్యలకి డాక్టరుగారికిచ్చే సలహాలూ, వయసుకి మించిన పరిపక్వతని చూపిస్తాయి. ఇవి వాస్తవమా అన్న సందేహాన్ని కలుగజేస్తాయి. కుటుంబరావు పుంఖాను పుంఖంగా రాసిన కథల్లో, నవలల్లో, మనసుకి హత్తుకుపోయి గుర్తుండే పాత్రలు లేవని ఆయన అభిమానులు కూడా అసంతృప్తి పడతారు. తనకి పాత్రలకన్నా పాత్రల మధ్య ఉండే సంబంధాలంటే యావ జాస్తి, అని చెప్పుకున్నాడు. ఈ నవలలో డాక్టరు, నర్సు, సూర్యం, గుర్తుండే పాత్రలే నని నా అభిప్రాయం. కాని ఈ నవల ఇప్పటికీ నిలిచి పోవడానికి ముఖ్య కారణం, ఆ పాత్రల మధ్య సంబంధాల ఛాయలు మన సమకాలీన బాంధవ్యాలలో ఉండటమే. అది కొంత విచారంతో పాటు మరికొంత వికాసాన్ని కూడా ఇస్తుందని నా నమ్మకం.
(ఈ వ్యాసానికి ఆధారం, శ్రీశ్రీ, కొకు, గోపీచంద్ శత దినోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 26, 2009 న డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ ఆధ్వర్యాన జరిగిన సభలో నేను చేసిన ప్రసంగం.)
సంప్రదించిన పుస్తకాలు
- “కుటుంబరావు సాహిత్యం – మొదటి సంపుటం,” లో ఐశ్వర్యం నవల. సంపాదకుడు కేతు విశ్వనాథరెడ్డి. విశాలాంధ్ర, ద్వితీయ ముద్రణ, 1990.
- “జి. వి. కృష్ణారావు రచనలు, ఐదో సంపుటం – నాటికలు, నాటకాలు,” లో భాసుని ప్రతిమ కి తెలుగు అనువాదం. ప్రభాస పబ్లికేషన్స్, తెనాలి, 1999.
- భాసుని చారుదత్తం కోసం వెతికితే నాకు Woolner, Sarup ల ఇంగ్లీషు అనువాదం దొరికింది.
- “లేఖలు, కొడవటిగంటి కుటుంబరావు వ్యాస ప్రపంచం – 8,” విరసం, 2002. పేజీ 36. (కవిగా కాళిదాసు అఖండుడే కాని, నాటకాలలో మాత్రం భాసునిదే పై చెయ్యి, భాసుడి నాటకాలు చదివి కాళిదాసు నాటకాలు చదివితే చక్కెర తిని దంటు నమిలినట్లుంటుందని, కృష్ణాబాయికి రాసిన ఉత్తరంలో ఉంది).
- “నవీన్ సాహిత్య వ్యాసాలు,” లో కొడవటిగంటి కుటుంబరావు నవలలు – ఒక పరిశీలన అన్నఅధ్యాయం. ప్రత్యూష ప్రచురణలు, 2001.
