“ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ

వయా ఫ్రాన్సిస్కో క్రిస్పీలో, పేవ్మెంట్ మీది ఒక కఫే

“ఏం చేశారు నిసీ లండన్ లో?” అడిగాతడు , మష్రూమ్ రేవియోలీ తింటూ.

“చెప్పులకోసం వేట”

“అదేంటి?”

“లండన్ లో కంబర్లేండ్ హోటెల్లో ఉండటం నాకిష్టం. హైడ్ పార్కులో రోజూ కాసేపు నడవవొచ్చని. కానీ, నేను సరైన షూ తెచ్చుకోటం మర్చిపోయాను. అంతకు ముందు ప్రయాణంలో పాదం మీద చిన్న పుండు పడింది. చాలా చిన్నదే, నేను చిన్ననెప్పి కూడా ఓర్చుకోలేను. బాండ్ స్ట్రీట్, ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్లో చెప్పుల షాపులు చాలా ఉంటాయి కదా అని బయలుదేరాను. మొదట కనపడిన షాపులో వాళ్ళు చెప్పిన చెప్పులు కొన్నాను. అవి వేసుకుని నడిస్తే పాదాల మీద వేరొక చోట పుండు పడింది. అప్పుడు అక్కడ బేండ్ఎయిడ్ వేసి, మళ్ళీకొంత దూరం నడిచి మళ్ళీ చెప్పుల షాపుకి వెళ్ళాను. మళ్ళీ అక్కడి వాళ్ళ సలహాతో ఇంకో రకం షూ.”

“అవన్నీ మోసుకుంటూ నడిచారా?”

“నేనెందుకు మోస్తాను? నేనేం గాడిదనా? ఎక్కడి కక్కడే చెత్తకుండీలున్నాయిగా!”

“కొన్నకొత్త చెప్పులన్నీ పారేశారా?”

మరి! పారెయ్యక! పనికి రాని చెప్పులు ఉంచుకుని ఏం ప్రయోజనం? బేగ్‌లో బేండెయిడులు ఐపోయాక ఫార్మసీకి వెళ్ళి, మళ్ళీ ఫ్రెష్ బేండెయిడ్లు కొనుక్కుని, వెనక్కి కేబ్‌లో కంబర్లేండ్ హోటెల్‌కి వెళ్ళాను.”

అతని లేతవన్నె పొడుగు జుట్టు గాల్లో ఎగురుతోంది. అతడు నవ్వుతూ, ఆమె మాటలు వింటూ మధ్య మధ్యలో ఆమె గ్లాసులోకి వైను ఒంపుతున్నాడు. వెయిటర్ని పిలిచి మళ్ళీ తినటానికి ఏం కావాలో తెప్పిస్తున్నాడు. ఆమె అతని మాటల్లో యాసను బట్టి అతని దేశమేదో తెలుసుకోటానికి ప్రయత్నిస్తున్నది.

“ఐనా ఏం విచిత్రం? ఏం అతిశయం? ఇంత చదువుకున్నవారు, ఈ ఊళ్ళన్నీ తిరుగుతున్నారు, సరైన చెప్పులు కొనుక్కొలేరండీ? చదువుకున్న ఆడవాళ్ళు ఇంత అమాయకంగా ఉంటారా?”

“అదేం కాదు. అతిశయమేం లేదు. తెలియనితనం ఉంది. నేను వేసుకున్న ఈ బట్టలూ, నగలూ, ఈ వస్తువులు ఇవేవీ నేను ఎంచి కొనుక్కున్నవి కావు. నా మీద ప్రేమ ఉన్న వారు ప్రతి వస్తువూ ఎంచి వారే కొనేవారు. నేనిప్పటి వరకూ…”

ఆమె కళ్ళ వెంట కన్నీళ్ళు బొటబొటా కారిపోయాయి. ముఖం పక్కకు తిప్పుకుంది. మౌనంగా తనను తనే సంబాళించుకుంది. అతడి ముఖం వివర్ణమయ్యింది. నిట్టూర్చి, చేతిలోని కప్పుపై చిన్నగా రిథమిక్‌గా వేలితో కొట్టటం మొదలెట్టాడు.

ఆమె మళ్ళీ తనవంక చూశాక ఆమె విశాలమైన కళ్ళలోకి చూస్తూ స్నేహంగా “Physician! Heal thyself!” అన్నాడు. ఆమె ‘ అంతేగదూ మరి!’ అన్నట్టు నవ్వుతూ తల ఉపింది.

“ఇంతకీ మీకు చెప్పులు ఎక్కడ దొరికాయి?”

“ఫిరెంజీ లో. అక్కడికి వెళ్ళిన మర్నాటి నుండీ మళ్ళీ అదే పని. నాకు డాంటే లేడు, మిఖలాంజెలో లేడు. గ్రాండ్ హోటెల్‌కి దగ్గర్లోనే ఉన్న షాపింగ్ ప్రదేశం – వియా టోర్నబోనీ, ఆ పక్కన చిన్ని సందులూ అన్నీ తిరిగి చివరకు ప్రాడా షూ కొన్నాను. ఇవిగో” అని కాళ్ళు జాపి చూపెట్టింది.

“ఇప్పుడు ఇక్కడ రోమ్ లో నడవటానికి సౌకర్యంగా ఉందా?”

“ఎలా ఉంటుందీ? అవస్థగా ఉంది. కొత్త చెప్పులు ఎక్కడైనా సుఖమిస్తాయా? ప్రయాణాల్లో కొత్త చోట్ల ఎక్కువగా నడవాలంటే తప్పనిసరిగా పాతబడిన చెప్పులు ఉండాలి. ఇంకోసారి ఈ విషయం మర్చిపోను” నవ్వింది.

అతని కళ్ళలో కూడా నవ్వు. “రోమ్‌లో సిస్ట్టీన్ ఛేపెల్, పేంథియాన్, కలీసియం ఇవేవీ దర్శించకుండానే తిరిగి వెళ్ళేట్లున్నారు. పొయెట్రీ, కీట్సూ, అదీ ఇదీ అంటారు. మీ కాళ్ళు నెప్పి అని చెప్పరు. ఇంతసేపు చూశాను. ఏమీ తినరు. మీ హోటెల్‌కి చాలా దగ్గర్లో ఉన్నాం. అక్కడిదాకా నడవగలరా?” అన్నాడతను.

“పర్లేదు నడుస్తాను. ఈ వీధుల్లో, ఈ రాళ్ళమీద జారిపడకుండా ఇప్పటికి నా షూ తగినంత అరగదీశాను” అందామె.

చక్కని దీపాల వీధుల్లో, అటూ ఇటూ తిరుగుతున్న రోమన్లనూ , ఇతర దేశపు టూరిస్టులనూ చూస్తూ, కాబుల్ స్టోన్ పేవ్మెంట్ల మీద నడుస్తూ వారిద్దరూ ఆమె హోటెల్ ఇంటర్ కాంటినెంటల్ వియా సెస్టినాకి వచ్చారు.


నిసి లాబీలో కౌంటర్ దగ్గర ఆగి, “వీరు నా స్నేహితులు. నాతో పాటు కొంచెం సేపు పైకి వస్తారు. మీకేం అభ్యంతరం లేదు కదా?” అని రిసెప్షనిస్టుని అడిగింది .

“మడామ్! మీతో గెస్టు ఉన్నట్లు మాకు తెలియచేసినందుకు థేంక్సు. ఆయనకు గాని, మీకు గాని ఫోన్ కాల్స్ వస్తే ఆపి ఉంచమంటారా? మీ గదికి కనెక్ట్ చెయ్యమంటారా?” అని అడిగింది రిసెప్షనిస్టు.

నిసి అతని వంక చూస్తూ, “తప్పక కనెక్ట్ చెయ్యండి. ఏమీ పరవాలేదు” అని చెప్పి ముందుకు నడిచింది. అతడు ఒక్క నిముషం ఆగి, తన వాలెట్లోంచి ఒక కార్డు తీసి రిసెప్షనిస్టు ముందు ఉంచి, నిసిని అనుసరించాడు .

రిసెప్షనిస్టు తన పక్క అతనితో, “ఓహో! మన హోటెల్‌కి ఈ రాత్రి ఎవరొచ్చారో చూడు!” అని ఇటాలియన్లో అనటం అతని చెవిన బడి నవ్వుకున్నాడతను. చక్కగా అలంకరించి, అందంగా ఉన్న ఆమె హోటెల్ గదిలో ఒక సోఫాలో అతను హాయిగా, ఎంతో పరిచయస్తుడిలా కూర్చున్నాడు.

“నేను స్నానం చేసి వస్తాను. నా పాదాలు చంపేస్తున్నాయ్. వెట్ బార్ లోంచి మీకు కావలసిన డ్రింక్ తీసుకోరూ” అని చెప్పి నిసి బాత్ రూమ్ లోకి వెళ్ళింది .

“పీనట్స్ మాత్రం తినకూడదు. గుర్తుంది”

ఆమె స్నానం చేసి, సిల్క్ గౌన్ వేసుకుని, జుట్టు బ్రష్ చేసుకుని గదిలోకి వచ్చేసరికి , క్లబ్ సోడా తాగుతున్న అతడు ఒక గ్లాసు ఆమెకు కూడా అందించాడు. ఆమె మీదుగా తేలిక సుగంధాలు తేలి వచ్చి గదంతా అల్లుకున్నాయి.

“చాలా అందంగా ఉంది సుమా మీ డ్రెస్.”

నిసి తన గ్లాసు మంచం పక్కన బల్లమీద ఉంచి, మంచం మీద కూర్చుని, “మీరేమనుకోపోతే నేను కొంచెం నా పాదసేవ చేసుకోవాలి” అంటూ సొరుగులోంచి ఆయింట్మెంట్లూ, బేండ్ ఎయిడ్లూ తీసింది.

“ఈ పని నాకు బాగా వచ్చు. నన్ను చెయ్యనివ్వరూ?” ఆమె పాదాల మీద ఎర్రగా చర్మం కొట్టుకుపోయిన గుర్తులున్న చోటల్లా ఆయింట్మెంట్ రాసి బేండ్ ఎయిడ్లు నేర్పుగా అతికించాడు.

“అవును, అందమైన పాదాలు మచ్చలు పడకుండానే ఉంచుకోవాలి. అందమైన పాదాలు సుమా మీవి”

బైట చీకటి దట్టమయింది. టెరేస్ మీది రెస్టరాంటులో దీపాలు వెలిగాయి. బల్లల దగ్గర కూర్చున్న మనుషులు, అటూ ఇటూ తారాడే వెయిటర్లూ అస్పష్టంగా కనిపిస్తున్నారు.

“చీకటి పడింది. మీరు ఇక వెళ్ళొద్దూ?”

“నేనిక్కడ ఉంటేనేం? ఈ రాత్రికి ఇక్కడే ఆగిపోతేనేం?” అన్నాడతను.

“ఎందుకు?” అందామె విస్తుపోతూ.

“ఎందుకా? ఏమో మరి! ఒకప్పుడు నాకు ఒక కవయిత్రి ఇలా చెప్పారు బహుశా అందుకేమో!”

సుఖముల రాత్రు లవిరళముగ
ముఖమల్ పరుపుల మీద…

“ఏమంటారు?”

ఆమె కళ్ళు ఆశ్చర్యంతో ఇంకా పెద్దవయ్యాయి. “ఈ కవిత మీరెక్కడ చదివారు? ఎలా చదవగలిగారు? ఏ పుస్తకం లోనూ ప్రచురించబడలేదే?”

“ఏం వింత ప్రశ్నలడుగుతారు? పుస్తకంలో ముద్రిస్తేనే కవితా? ఇంటర్నెట్ అందరిదీ కాదూ?”

“మీరు తెలుగువాళ్ళూ కారే? మీరెలా చదవగలిగారు? ”

“మళ్ళీ వింత ప్రశ్న! మీరు కీట్స్ ఇంగ్లీష్ కవిత్వం ఎలా చదివారు? తెలుగు భాష, తెలుగు వాళ్ళకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదా?”

అతను లేచి వెళ్ళి , పక్క మీద దిళ్ళు తడిమి చూస్తూ, కంఫర్టర్లు పక్కకు తోసి, పడుకుని, చక్కని తెలుగులో “ఎంత మెత్తగా ఉంది ఈ పడక. చాలా సుఖంగా ఉంది. ఎందుకు నేను వెళ్ళటం?” అంటూ ఆమె కేసి చూస్తూ చేతులు జాపాడు.

“రండి. వచ్చి ఇలా పడుకోండి. ఆ కవయిత్రి మీద మీకు నమ్మకం లేదా? ఆమె మీకూ ఆప్తురాలే అనుకున్నానే! రండి, సందేహం దేనికి?”

ఆమె అతని వంక ఒక్క క్షణం పాటు వింతగా చూసి, ఏమనుకుందో, అతని పక్కనే వెళ్ళి పడుకుంది. తల అతని ఛాతీ మీద ఉంచింది. అతను ఆమెను దగ్గరగా హత్తుకుని ఆమె జుట్టులోనికి చేతులు పోనిచ్చి మెత్తగా నిమిరాడు. చెంపల మీద మెత్తని ముద్దులు పెట్టాడు. ఒళ్ళంతా మెత్తగా నిమిరాడు.

“పాదాలకు ఎన్ని పట్టీలు వేస్తే ఏం లాభం? మీ మనసంతా తూట్లు పడి ఉన్నది. నొప్పి మనసుకైతే పట్టీలు కాళ్ళకు వేస్తున్నారా? ఏం గొప్ప డాక్టర్లు మీరు? ఎన్ని రోజులు? ఎన్ని నెలలు? ఎన్ని సంవత్సరాలయింది? మీరు కలత లేకుండా నిద్రపోయి? హాయిగా నిద్ర పొండి” అని పక్కనే ఉన్న “జాన్ కీట్స్ – లిరిక్ పోయెమ్స్” అన్న పుస్తకం తీసి మంద్రంగా –

 O soothest Sleep! if so it please thee, close
In midst of this thine hymn my willing eyes,
or wait the amen, ere thy poppy throws
Around my bed its lulling charities.
Then save me, or the passed day will shine
Upon my pillow, breeding many woes,-
Save me from curious Conscience, that still lords
Its strength for darkness, burrowing like a mole;  

ఆ తీయని కంఠస్వరానికి, మధురమైన కవిత్వానికి, ఎంతగానో అలసిపోయి ఉన్న ఆమె సేద తీరింది. కొన్ని నిమిషాల్లో ఆమెకు హాయిగా నిద్ర పట్టింది. పొద్దున్నే లేచి చూస్తే అతను లేడు. ఎప్పుడు వెళ్ళిపోయాడో ఏమో.

ఆమె మనసు ఎంతో ప్రశాంతిగా ఉంది. గదిలోని తెరలు తొలగించి, కిటికీలు తెరిచి సూర్యరశ్మిని లొపలకు రానిచ్చింది. బ్రేక్‌ఫాస్ట్ తెప్పించుకుందామనుకుంటూ, బల్ల మీద ఉన్న ఫోను వద్దకు నడిస్తే, ఫోన్ కింద రెపరెపలాడుతూ ఒక చిన్న నోట్.

దాని మీద తెలుగు అక్షరాల్లో-

 సుఖముల రాత్రు లవిరళముగ
ముఖమల్ పరుపుల మీద
అనఘు డనంగుడు, ప్రియతమ!
తమితో, మన కమరించునోయి.
కాదనబోను! నీ కౌగిళ్ళ కైపులు.
వద్దనలేను! చెక్కిళ్ళ నీవుంచు
చక్కెర ముద్దుల తీపులు.
సౌందర్యమే సౌఖ్యము ;
సౌఖ్యమే -జీవిత సాఫల్యమని
ఎంచు కీట్స్ మధుర కాంక్షా నవతా
యువతా కవితా కల్పనా జగతి లోనే
నన్నుంచుమా! ప్రియతమా!  

దాని కింద ఇంగ్లీష్‌లో – “నేను ప్రేమించిన ఈ కవయిత్రికి, నా ధన్యవాదాలు తెలుపగలరు” అని రాసి ఉంది. దాని క్రింద ఉన్న సంతకం చూసిన ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది. ఈ సంతకం తను అంతకు ముందు చూసింది. అతని ముఖం ఆమె కళ్ళ ముందు కదలాడింది. ఎక్కడ చూసింది ఇతన్ని. ఏ పత్రికలో ఇతని బొమ్మ, ఈ సంతకం చూసింది తను? ఆమెకు అతనెవరో అప్పుడు హఠాత్తుగా తెలిసింది. ఆమె నివ్వెరపోయింది.

తన మీద అతనికి ఎంత దయ! ఎంత కరుణ! మరి తనకు మాత్రం ఎందుకు మనుషులంటే ఇంత మరుపు?

( డాక్టర్. నిసీ షామల్ డైరీ నుంచి – అక్టోబర్ 6, 2008)