డి. టి. ఏల్. సీ. – కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాల పై సమీక్ష

సియాటిలుకు చెందిన కొడవళ్ళ హనుమంతరావు గారు “ఐశ్వర్యం – ఆదర్శం: ఐశ్వర్యం నవలపై ఓ పరిశీలన” అనే అంశాన్ని ఎన్నుకొని మాట్లాడారు. సమాజంలో మార్పులు రాలేదని కొకు నిరుత్సాహపడి ఉంటారని కొడవళ్ళ అన్నారు. ఐశ్వర్యం నవలలోని పాత్రలు ఒక డాక్టరు, అతని తండ్రి క్రిమినల్ లాయరు, డాక్టరు కూతురు, డాక్టరు వద్దకు వచ్చే ఒక రోగి సూర్యం. అతను చివరకు డాక్టరు కూతురిని పెండ్లి చేసికొంటాడు. డాక్టరు నిక్కచ్చి మనిషి. ఆయనకు సాహిత్య వ్యసనం ఉంటుంది. తన మొదటి రోగి చనిపోగా అతని భార్యను మళ్ళీ పెళ్ళి చేసికోవడం తండ్రికి పట్టదు. సాహిత్యాన్ని అభిమానించేవాడు నిజ జీవితంలో కూడా ఆసక్తిని చూపిస్తాడు అంటాడు డాక్టరు. భాసుడు అంటే కొకుకు ఇష్టం అని ఈ నవల వలన తెలుస్తుంది అని చెప్తూ ఆ నవలను వివరంగా కొడవళ్ళ చర్చించారు.

కొకు పైన ప్రసంగించినవారిలో చివరివారు తిరుపతికి చెందిన మంగాపురం విష్ణుప్రియ. ఈమె సాంఘికసేవలో మహిళా ఉద్యమాలలొ ఎన్నో ఏళ్ళుగా పని చేస్తున్నారు. మహిళామార్గ్, స్త్రీగర్జన వంటి పత్రికలకు సంపాదకులు. “వివాహ వ్యవస్థకు కొకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను చేశారా?” అనే ప్రశ్నకు జవాబును అన్వేషిస్తూ మాట్లాడారు. తనతో పని చేసేవారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆమెను ఈ విషయాలపై మాట్లాడడానికి ప్రోత్సహం ఇచ్చాయి. ఉదాహరణగా – పెళ్ళైన ఒక నెలలోపల విడాకులు తీసికొని ఐదేళ్ళు ఒంటరిగా ఉండి మళ్ళీ పెళ్ళి చేసికొని మళ్ళీ బాధ పడుతున్న వనిత ఒకామె. పెళ్ళైన రెండేళ్ళ తరువాత భర్త ఒక సహోద్యోగినితో చనువు పెంచుకోవడం వల్ల ఇల్లు వదలి హాస్టల్ చేరి తన భర్త సాహచర్యాన్ని పొందిన అమ్మాయితో స్నేహాన్ని పెంచుకొన్న ఇంకొక మహిళ. భర్తయొక్క మితిమీరిన ప్రేమతో ఉక్కిరిబిక్కిరియై బయటి ప్రపంచంతో మళ్ళీ సంబంధం పెంచుకోవాలనుకొనే మూడో స్త్రీ – ముగ్గురు స్త్రీలను ప్రస్తావించారు.

స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఎక్కువైతే వివాహ వ్యవస్థలో మార్పు రావచ్చునని కొకు భావించినట్లుందని అంటూ విష్ణుప్రియ కొకు రాసిన మూడు కథలను దీనికై ఎన్నుకొన్నారు. అవి- స్వార్థబుద్ధి (1945), పెళ్ళి వ్యవహారం (1960), చెడిపోయినమనిషి (1968). పెళ్ళి లేకుండా పిల్లలు ఎందుకు ఉండరాదు? చెయ్యవలసింది చేయడం, కావలసింది తీసికోవడం ఎందుకు తప్పు? ఆర్థిక భద్రత, పిల్లలకు మంచి పెంపకము ఉంటే పెళ్ళి చేసికోవచ్చు, విడిపోవచ్చు కూడా. పెళ్ళానికి డబ్బు ఇవ్వలేనివాడు, పోషించలేనివాడు, భరించలేనివాడు ఎందుకు పెళ్ళి చేసికోవాలి? స్త్రీల ఇంటి చాకిరికి, శ్రమకు, పిల్లల పెంపకాలకు కూడా విలువ కట్టారు ఈ కథలలో కొకు. మూడవ కథలో స్త్రీపురుషులు స్వేచ్ఛగా కలిసి ఉండడంలో తప్పు లేదంటారు కొకు. పెళ్ళి లేకుండా సహజీవనం ఉండవచ్చు. కుటుంబం లేకుండా సహజీవనం ఉండవచ్చు. పెళ్ళి ఉంటుంది, అందులో స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఇవన్నీ ఈ కథలలో వచ్చే కొత్త అంశాలని వక్త చూపించారు.

మూడవ సదస్సు: శ్రీశ్రీ సాహిత్యం

శ్రీశ్రీపై సదస్సుకు వెంకటయోగి నారాయణస్వామి సమన్వయకర్తగా వ్యవహరించారు. ముందుమాటలో నారాయణస్వామి తనకు 1982లో శ్రీశ్రీ కవితతో పరిచయము ఎలా జరిగిందో వివరించారు. మొట్టమొదట చదివినప్పుడు పదాలు అర్థం కాకపోయినా కవిత్వంలోని శబ్దసౌందర్యం, నడక, గతి ఆకర్షించాయి అన్నారు. వ్యక్తిగతంగా తను బడిలో పడిన అగచాట్లకు సమాధానాన్ని శ్రీశ్రీలో వెదుక్కొన్నాను అన్నారు. శ్రీశ్రీని వ్యక్తిగతంగా కలుసుకొందామని అనుకొన్న సమయంలో ఆ కవి మరణాన్ని విని తన ఆత్మీయుల నొకరిని కోల్పోయినట్లు భావించారట. శ్రీశ్రీగురించి వచ్చిన ఒక కవితను వినిపించారు.

మొట్టమొదటి వక్తగా నేను శ్రీశ్రీ కవిత్వంలోని ఛందస్సును గురించి మాట్లాడాను. శ్రీశ్రీ ఛందస్సును గూర్చి చెప్పిన పలుకులను జ్ఞప్తికి తెచ్చాను. “ఛందస్సు గుఱ్ఱంవంటిది. గుఱ్ఱం ఎటు తీసుకుపోతే అటల్లా వెళ్ళిపోయేవాడు ఆశ్వికుడు కానట్లే ఛందస్సు లాగుకుపోయినట్లు వ్రాసేవాడు సంవిధానజ్ఞుడు కాడు! మరి ఆ ఛందస్సును లొంగించుకొని దానిచేత చిత్రవిచిత్ర రీతులలో కదను త్రొక్కించినవారినే ప్రశంసిస్తాము. ఒక విధంగా చూస్తే నేను వాడిన ఛందస్సులన్నీ శ్రీశ్రీయాలే. “సైన్సులాగే కవిత్వానికి కూడా ప్రయోగాలు లేనిదే అభివృద్ధి లేదు” అన్న శ్రీశ్రీ వాక్యం ఆయన ఛందఃపటిమను తెల్పుతుంది. వాక్యం రసాత్మకం కావ్యం అని ఎలా అంటారో, అలాగే వాక్యం లయాత్మకం ఛందస్ అని చెప్పవచ్చు. శ్రీశ్రీ మొట్టమొదట వాడిన సాంప్రదాయిక ఛందస్సులకు ఉదాహరణలను చూపినాను. తరువాత గణ ఛందస్సువలెనే మాత్రాఛందస్సులో కూడా గణాలు ఉంటాయని, గురజాడ ముత్యాలసరాలు పుట్టిన సంవత్సరమే జన్మించిన శ్రీశ్రీ ఈ ఛందస్సుకు పెట్టిన మెరుగులను వివరించాను. శంకరాచార్యులు రాసిన చతుర్మాత్రాగణాల స్తోత్రాలు, మిశ్రగతి స్తోత్రాలు కూడా శ్రీశ్రీని ప్రభావితం చేసినవని ఉదాహరణలను ఇచ్చాను. తరువాత శ్రీశ్రీ కవితలను కొన్నిటిని తీసికొని అందులోని గతులను, మాత్రాగణాలను విడమరచి చెప్పాను. శ్రీశ్రీపై జయదేవుని అష్టపదుల ప్రభావం కూడా ఉన్నదని ఒక రెండు ఉదాహరణలను చూపాను. శ్రీశ్రీ చెప్పిన “నేను ఈ శతాబ్దానికి పర్యాయపదం, కవితాసృష్టికి పరిశోధన కేంద్రం” అనే వాక్యాలతో నా ప్రసంగాన్ని ముగించాను.

తమ్మినేని యదుకులభూషణ్‌ వీడియో ద్వారా “శ్రీశ్రీ మహాప్రస్థానం – కదనం, కథనం” అనే విషయంపై మాట్లాడారు. కవిత్వం అర్థప్రధానం, సంగీతం నాదప్రధానం అని మొదలు పెట్టారు. కవిత్వంలో అల్పాక్షరాలలో అనంతార్థం ఉండాలి. కవిత్వం భావకవిత్వం (1927-1933), ప్రభావ కవిత్వం (1933 తరువాత) అని రెండు విధాలు అన్నారు. ఆంగ్ల కవులైన Swinburne, Poe, Gibson, Mayfield, ఫ్రెంచి కవి Bolero శ్రీశ్రీని చాలా ప్రభావితం చేశారు. స్విన్‌బర్న్ శ్రీశ్రీల మధ్య చాలా సన్నిహితత్వం ఉంది అన్నారు. ఇద్దరికీ ఛందస్సుపైన అపారమైన అధికారం, శబ్దాలపై మమకారం. శ్రీశ్రీ ఒక రాత్రి కవితలో పో ప్రభావం కనబడుతుంది. కదనాన్ని కవిత్వంలో ఒప్పించిన తీరు “కవితా, ఓ కవితా”, “ఆకాశదీపం” లాటి కవితలలో గమనించవచ్చు. పో కవిత్వంలో సౌందర్యం ప్రధానమైతే శ్రీశ్రీ కవితలో శ్రామిక వర్గం ప్రధానం. ఈ వైరుద్ధ్యం తరువాతి కాలంలో శ్రీశ్రీని స్విన్‌బర్న్, మేఫీల్డ్‌ల వైపు ఆకర్షించింది. కానీ ఆ పిదప కాలంలో మంచి కవిత్వాన్ని శ్రీశ్రీ రాయలేక పోయారు అని అభిప్రాయపడ్డారు. నారాయణస్వామి భూషణ్‌ భావాలతో ఏకీభవించలేకపోయారు.

విన్నకోట రవిశంకర్‌ “శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు” అనే విషయంపైన మాట్లాడారు. జీవితంలో మృత్యువు అనివార్యమైనది. ఆదికవినుండీ ఆధునిక కవి వరకు మృత్యువు ఒక కవితావస్తువు. మృత్యువును సామాన్యముగా ఒక అమూర్త భావనగా కవులు వాడారు. శ్రీశ్రీ సుప్తాస్తికలు అనే ఖండికలో ఇది కనిపిస్తుంది. మిగిలిన కవితలలో శ్రీశ్రీ మృత్యువును ఒక మరణముగా మాత్రమే చిత్రిస్తారు. బాటసారి కవితలోని మరణాన్ని స్పష్టముగా తెలియజేసే చివరి పంక్తులకు గురజాడ పూర్ణమ్మ కవితలో సందిగ్ధముగా పూర్ణమ్మ చావును చిత్రించే ఆఖరి వాక్యాల మధ్య భేదాన్ని ఎత్తి చూపారు. శ్రీశ్రీ ఎప్పుడూ మానవుడు మరణాన్ని జయిస్తాడనే విశ్వాసం కలిగినవారు. ఆశ నిరాశలను ప్రస్తావిస్తూ శ్రీశ్రీ చేదు పాట, కేక, దేనికొరకు వంటి కవితలను రాశారు. ఒంటరితనాన్ని భయాన్ని ఎత్తి చూపే కవిత నిద్ర. నిస్సహాయత, నిరాశలను ప్రతిఫలిస్తూ రాసిన కవిత ఒక రాత్రి. నిరాశ మాత్రమే కాదు, ఉద్యమాలపైని కవితలలో ఆశ, విశ్వాసం ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీశ్రీ అనువాద కవిత్వంలో, చిత్ర గీతాలలో వైవిధ్యము ఉన్నది. ఛందస్సులో ఎన్నో ప్రయోగాలు- ముఖ్యంగా కంద పద్యాలలో- చేశారు శ్రీశ్రీ. అతడు గొప్ప ప్రయోగశాలి. శ్రీశ్రీ కవిత్వాన్ని నిష్పాక్షికముగా లోతుగా బహుముఖంగా విమర్శించాలి అని రవిశంకర్‌గారు తన ఆశను వ్యక్తీకరించారు. ఆ తరువాత నారాయణస్వామి “కవితా ఓ కవితా”ను ఆవేశముతో భావపూర్ణంగా చదివారు.

హెచ్చార్కే “ఉద్యమాలు వున్నా లేకున్నా కవిత్వం ఉంటుంది, శ్రీశ్రీ వుంటారు” అనే విషయంపైన రాసిన ప్రసంగాన్ని వారి తరఫున శ్రీనివాస్‌ చదివారు. శ్రీశ్రీ కవిత్వంలోని సంగీతం తనను ఆకర్షించిందని ఆరంభించారు. కేవలం ఉద్యమాలు అనే కిటికీ గుండా కవిత్వాన్ని చూడరాదు. ఇస్మాయిల్‌గారి ‘చెట్టు’ను చదివాక కవిత్వంలో ఉద్యమానికన్న అతీతమైనది ఏదో ఉంది అని తోచింది. ఉద్యమాలలో ఎక్కువ ఆసక్తి ఉన్నా అది మాత్రమే శ్రీశ్రీ కవిత్వం కాదు. తాను శ్రామిక వర్గానికి దోహదుడు మాత్రమే కానీ అనుచరుడు కాదు. దానితో చేతులు కలుపుకొన్న కవి మాత్రమే. ఎవరిని గురించి రాసినారో వాళ్ళకు ఆ సందేశం అందినది. 1990ల పిదప చాల మంది ఉద్యమకారులు తమ ఉనికిని విరసం, స్త్రీవాద, దళిత ఉద్యమాలతో ముడి పెట్టుకొన్నారు. చాలా మంది కవులు కూడా మూగపోయారు. శ్రీశ్రీలో ఉద్యమేతర కవి కూడా ఉన్నాడు. ఉద్యమంతో ఒక విధమైన detachmentను అవలంబించగల శక్తి శ్రీశ్రీకి ఉండినది. ఉద్యమస్పర్శ లేని ‘ఒక రాత్రి, ‘ఆకాశదీపం’ లాటి పద్యాలు ఎన్నో ఉన్నాయి. ఏ అర్థంలో వేమనను ప్రజాకవి అంటారో అలాగే శ్రీశ్రీని కూడా ప్రజాకవి అని పిలువవచ్చు. శ్రీశ్రీని ఉద్యమకవిగా కాక ఒక గొప్ప తెలుగు కవిగా అందరూ పరిగణిస్తే బాగుంటుందని ముగించారు. సమాజపు దైనందిన జీవితంలో భాగస్వామియైన శ్రీశ్రీలాటి కవి తప్పక మహాకవియే అన్నారు నారాయణస్వామి.

వెల్చేరు నారాయణరావు “దూరంనించి శ్రీశ్రీ” అనే విషయంపై మాట్లాడారు. శ్రీశ్రీలాటివారు చేసిన కార్యాలవల్ల కలిగిన మంచిని, ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. శ్రీశ్రీ తాను రాసిన కవిత ఇక్కడ అమెరికాలో ఉండే మనలను ఉద్దేశించి కాదు, అతడు ప్రభావితం చేయాలనుకొన్న వర్గం వేరు. మధ్యతరగతి పుట్టడానికి ఈ రచయితలు కారణం. వాళ్ళు బోధించిన వాటిలో కొన్ని మనకు కావాలి, కొన్ని మనకు అక్కర్లేదు. మహాకవి అంటే ఎవరు అని ప్రశ్నించారు. ఒక వచనములో ఒకే అర్థం ఉన్నా, ఒక పద్యంలో ఎన్నో అర్థాలు ఉంటాయి. ఇది కవిత్వపు విశిష్ఠత. శబ్దానికి అర్థానికి గల సంయోగము చాల ముఖ్యమైనది. శ్రీశ్రీ ఎన్ని రకాల కవిత్వం రాశారు అనే ప్రశ్నను ముందు పెట్టారు. తెలుగు కవిత్వంలో 20వ శతాబ్దములో రెండు మార్పులు వచ్చాయి, ఒకటి ఆధునికత, మరొకటి సామ్యవాదము. ఆధునికతలో వ్యక్తిత్వం ప్రధానాంశం, సామ్యవాదంలో ఆ వ్యక్తిత్వం వర్గంలో మిళితమయి పోతుంది. కాని శ్రీశ్రీ ఆధునిక కవితను, సామ్యవాద కవితను రెంటినీ వ్రాశారు. అది ఆ కవిలోని గొప్ప విశేషం. తెలుగులో ఆధునిక కవులు మార్క్సిస్టులుగా ఉండి ఉండక పోతే ఇంకా గొప్ప కవులు అయివుండేవారని వెల్చేరు ప్రతిపాదించారు. ఆలోచింపజేసే కవిత్వం చాలా కాలం బతుకుతుంది. వేగంతో ఉద్యమాన్ని ప్రోత్సాహం చేసే కవిత్వం అలా చాలా కాలం నిలువదు. ప్రశ్నోత్తరాల సమయంలో వీరు మరొకటి చెప్పారు- రచయిత పద్యాలవల్ల, కథలవలన సంఘములో మార్పులు రావు. కానీ వ్యాసాలవలన ఇది సాధ్యమవుతుంది. రచయితలు సమాజములో మార్పులు తేలేరు, కాని వారు పాత్రలను సృష్టించి ఒక అద్దంగా సంఘం ముందు ఉంచగలరు అన్నారు.

చివరి వక్త సమన్వయకర్త నారాయణస్వామి. వారు “శ్రీశ్రీ- సమకాలీన ప్రాసంగికత” అనే విషయంపైన మాట్లాడారు. ప్రపంచ సంఘటనలవల్ల ప్రభావితమై తాను కవిత్వం రాశానని శ్రీశ్రీ చెప్పుకొన్నారు. ప్రజాకవిత్వానికై గురజాడ చూపిన మార్గాన్ని వెడల్పు చేసినారు శ్రీశ్రీ. కవితా వస్తువులో పతితులను, భ్రష్టులను ప్రవేశ పెట్టారు శ్రీశ్రీ. ఇది ఒక పెద్ద మార్పు, గొప్ప మార్పు. సమాజపుటంచులలో నివసించే ప్రజలను ఈ రాజ్యం మీరేలమని ప్రబోధించారు శ్రీశ్రీ. కొత్త ఆలోచనలను కవిత్వంలో ప్రవేశ పెట్టారు. కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అన్నారు శ్రీశ్రీ. వీరి దృక్పథము స్థానికము మాత్రమే కాదు, అంతర్జాతీయం కూడా. మహాకవులు discoveries చేస్తారు. దేశమంటే మట్టి కాదోయ్ అని గురజాడ ఒక discovery చేస్తే, ‘మహాప్రస్థానం’లో ఎన్నో పద్యాలలో శ్రీశ్రీ discoveries మనకు కనబడతాయి. ‘ఖడ్గసృష్టి’లో భాషా సరళత ఎక్కువ. యువకులు, ఉద్రేకాలతో ఉన్నవారు యువకుడైన శ్రీశ్రీతో మాత్రమే కాదు, వృద్ధుడైన శ్రీశ్రీతో కూడా నడిచారు. శ్రీశ్రీ కవితలను మాత్రమే కాదు వ్యాసాలను కూడా రాశారు. వేమన, గురజాడ, తిక్కనలను తెలుగు దేశంలో మహాకవులుగా పేర్కొన్నారు. అన్ని కవితాయుగాలలో పోరాడే ప్రజల పక్కనే ఉన్నారు శ్రీశ్రీ. భవిష్యత్తుకు తన కవిత్వాన్ని ఒక సంపత్తిగా అర్పించారు. కవిత్వాన్ని democratize చేసిన కవి అతడు అని పొగిడారు. ఎన్నో శ్రీశ్రీ కవితలను నారాయణస్వామి తమ ప్రసంగంలో పాడారు.

నాలుగవ సదస్సు: గోపీచంద్ సాహిత్యం

గోపీచంద్ రచనల పైని సదస్సుకు శ్రీమతి ఆవుల మంజులత సమన్వయకర్త. ఆమె రచయిత నవలలపై పరిశోధనలు చేశారు. గోపీచంద్ ఒక మూలతత్త్వాన్వేషి అని అన్నారు. గోపీచంద్‌పైన అతని తండ్రి రామస్వామి చౌదరి ప్రభావము చాలా ఉందని చెప్పారు. ఆచంట జానకిరాం వారికి మిత్రుడు. అతనితో అరవిందుల ఆశ్రమాన్ని దర్శించి వారి రచనలచే ప్రభావితులయ్యారు. గోపిచందుకు జీవితము సాహిత్యము వేరు కాదు. అతని కథలలో ఒక ప్రత్యేకమైన శిల్ప వైచిత్రి కనబడుతుంది. వారి బ్రదుకు ఒక తాత్త్విక ప్రయాణము అని చెప్పవచ్చును అన్నారు మంజులత.