అమ్మ ఉత్తరం

పిల్లి అయింది. కుక్క అయింది. ఈ మధ్య మన కాంపౌండులో వున్న పిల్లల్ని దగ్గరకి తీయడం మొదలు పెట్టారు నాన్న. ఏదో పోగొట్టుకున్న దాన్ని రకరకాలుగా పొందాలని చేసే ప్రయత్నాలే ఇవి. ఆ పిల్లలకి చాక్‌లెట్లూ, బిస్కట్లూ కొని పెడతారు.

“తాత గారూ, తాత గారూ!” అంటూ వాళ్ళూ ఈయన వెంటబడి తిరుగుతారు. ఈయన వాళ్ళతో కేరం బోర్డు ఆడుతారు. వాళ్ళకి కధలు చెబుతారు. వాళ్ళకి ఫొటోలు తీస్తారు. నీ చిన్నప్పటి సంఘటనలు కధలుగా చెబుతారు వాళ్ళకి. నువ్వు చిన్నప్పుడు ఇంట్లో చెప్పకుండా సర్పవరం ఎలా వెళ్ళిందీ, ఒక్కడివీ మొదటి సారి సినిమాకి ఎలా వెళ్ళిందీ, ఇంట్లో ఎలా మాట్టాడేవాడివీ లాంటి విషయాలు కధలుగా చెబుతారు. ఆ పిల్లల్లో కొందరికి నువ్వు మావయ్యవి, కొందరికి బాబాయివి, మరి కొందరికి అంకుల్‌వి.

నీకెప్పుడైనా నీ చిన్నప్పటి సంగతి ఒకటి చెప్పానా? చెప్పలేదనుకుంటాను. ఎప్పుడు చెప్దామన్నా, గుండె గొంతుకలో కొట్టుకుని చెప్ప లేక పోయేదాన్ని. చెప్పటం కన్నా రాయడంలో వున్న సంతోషం ఇప్పుడు అర్థ మవుతోంది.

నీకప్పటికి మూడు నెల్లు నిండి నాలుగో నెల వచ్చింది. అప్పుడు మనం మునిగంటి వారింట్లో ఓ వాటాలో అద్దెకి వుండే వాళ్ళం. వాటా అంటే ఏం లేదు, ఒక గదీ, చిన్న వంటిల్లూ. అంతే. ఆ గదిలోనే అందరం పడుకునే వాళ్ళం. ఒకరోజు తెల్లవారు ఝామున కిటికీ తలుపు గాలికి తెరుచుకుని, నీకు చల్ల గాలి కొట్టింది. గ్రహించిన వెంటనే కిటికీ తలుపు మూసేశాను. అప్పటికే జరగకూడని అనర్థం జరిగి పోయింది. నీ ఊపిరి తిత్తుల్లో బాగా కఫం పేరుకు పోయింది. సరిగా గాలి పీల్చు కోలేక అవస్థ పడి పోయావు. మర్నాటికి అది ఎక్కువై పోయింది.

“ఏమండీ! పిల్లాడు ఊపిరి పీల్చుకోలేక అవస్థ పడుతున్నాడండీ! ఎగశ్వాస, దిగశ్వాసగా వుంది వాడికి. డాక్టరు దగ్గరకి వెళదామండీ!” అన్నాను నాన్నతో దుఃఖం ఆపుకోలేక.

నాన్న కూడా నిన్ను గమనిస్తూనే వున్నారు. ఆ రోజుల్లో డాక్టరు ఫీజు చాలా తక్కువే అయినా, దానికే తడుము కోవాల్సిన పరిస్థితి! నాన్న ఇల్లు గల వారబ్బాయితో పనికి ఆలస్యంగా వస్తానని కబురంపించారు. చొక్కా తొడుక్కుని, బయటికి వెళ్ళి, ఎక్కడో కావల్సిన డబ్బు సర్దుబాటు చేసుకుని వచ్చారు. నిన్ను ఎత్తుకుని ముందర నాన్నా, వెనకనే నేనూ. ఎలా నడిచామో మాకే తెలియలేదు ఆ రెండు మైళ్ళూ. మనసు మనసులో లేదు మరి.

నిన్ను చూసిన డాక్టరు, “పిల్లాణ్ణి కొంచెం ముందరే తీసుకు రావాల్సిందమ్మా!” అన్నాడు.

“నిన్ననే మొదలయిందండీ. ఇవాళ్టికి ఎక్కువై పోయింది” అన్నాను బాధగా.

“ఊపిరి తిత్తుల్లో బాగా కఫం పేరుకు పోయింది. మందు ఇస్తాను. కొంచెం బ్రాంది కొని, రెండు, మూడు గంటలకు ఓ మూడు చుక్కలు పట్టించండి. ఒంట్లో వేడి పుడుతుంది. రెండ్రోజులు పోయాక మళ్ళీ చూద్దాం” అన్నాడు డాక్టరు. మొదటి వంతు మందు అక్కడే పోశాం నీకు.

డాక్టరిచ్చిన మందు తీసుకుని, పిల్లాణ్ణెత్తుకుని బయటికి నడిచాను. నాన్న డాక్టరుతో మాట్టాడుతూ అక్కడే కాస్సేపున్నారు. కొంత సేపటికి నీకు కాస్త నెమ్మదించినట్టుగా నాకనిపించింది. తగ్గిపోతుందన్న ధైర్యం కూడా కలిగింది.

“ఏమంటారు డాక్టరు గారు? అంతసేపేం మాట్టాడారూ?” అనడిగాను నాన్నని.

“ఏం లేదు! పిల్లాడి గురించే జాగ్రత్తలన్నీ చెప్పారు. పద, ఇంటి కెళదాం” అన్నారు నాన్న. నాన్న గొంతులోని విషాదానికి కాస్త ఆశ్చర్యం వేసినా, అదేదో నీకు జబ్బు చేసినందుకే అని అనుకున్నాను.

నన్నూ, నిన్నూ ఇంట్లో దించి, మళ్ళీ బయటి కెళ్ళి, చాలా సేపటికి బ్రాంది సీసాతో తిరిగి వచ్చారు నాన్న. నెల మధ్యలో అనుకోని ఖర్చులు. అదీగాక వున్న డబ్బుతో రెండ్రోజుల కిందటే చాలా సరుకులు తెచ్చారు. ఎందుకంటే ఆ మర్నాడే మీ తాత ఆబ్దీకం. ప్రతీ ఏడాదీ క్రమం తప్పకుండా పెడుతున్నాం.

“పోనీ ఈ ఏడాదికి ఆబ్దీకం మానేద్దామా? పిల్లాడికి ఒంట్లో బాగోలేదు కదా?” అనడిగారు నాన్న. నీకప్పటికే మొదటి మూడు చుక్కల బ్రాంది పోసేశాను. నీకేమీ కాదని నాకు గట్టి నమ్మకం.

“ఎందుకండీ అనవసరంగా క్రమం తప్పడం? పిల్లాడికి తగ్గి పోతుందిగా? మందు వేశాము. బ్రాంది చుక్కలు పోశాము. టైముకి మళ్ళీ మందూ, బ్రాందీ పోస్తాను. రేపటి కల్లా పూర్తిగా తగ్గిపోతుంది. నేను చులాగ్గా వంట చేసేస్తాను. ముందరే బ్రాహ్మలకి కూడా చెప్పేశారు కదా?” అన్నాను నాన్నకి ధైర్యం చెబుతూ. నాన్న ఇంకేమీ అనలేక తలాడించారు. ఇంటిగలాయనొచ్చి పిల్లాణ్ణి చూసి, కాస్సేపు నాన్నతో బయట మాట్టాడారు. నువ్వు మంచి మగతలో వున్నావు. బ్రాందీ వల్లే అని అనుకున్నాను.

“నీకేదో చిన్న జబ్బు చేసింది. మందు వేశాం. తగ్గి పోతుంది” అన్న ధ్యాస తప్ప వేరొకటి లేదు.

ఆ మర్నాడు తెల్లవారు ఝామునే లేచి మడి కట్టుకున్నాను. నిన్ను మడి బట్టల్లో ఓ వారగా పడుకోబెట్టుకుని, వేళకి మందు వేస్తూనే వున్నాను. ఛాతీ ఎగరేయడం ఇంకా పూర్తిగా తగ్గలేదు. నిన్ను కనిపెట్టుకుంటూనే, నాలుగు కూరలూ, నాలుగు పచ్చళ్ళూ, వుత్త పెసర పప్పూ, గారెలూ, అరిశలూ, పరమాన్నం చేశాను. ఎంత పనో అది! నాన్నా, ఆబ్దీకం పెట్టే బ్రాహ్మలూ ఆబ్దీకం రోజు రాత్రీ, అంతకు ముందు రోజు రాత్రీ భోజనం చెయ్యకూడదు. ఉత్త ఫలహారం తోనే సరి పెట్టుకోవాలి. ఎంత కొంచెంగా చేసినా అందరికీ సరి పోయేట్టు చెయ్యాలి. ఎవరికి తగ్గించినా మళ్ళీ నిష్ఠూరం వస్తుంది. తెల్లవారు ఝాము నాలుగింటికి లేచి మొదలు పెడితే, వంట అయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు దాటుతుంది. అందరి భోజనాలూ పూర్తయ్యే సరికి మూడో, నాలుగో అవుతుంది సాయంకాలం. వంట మధ్యలో వుండగానే బ్రాహ్మలు వచ్చేశారు. ఇల్లుగలాయనా, నాన్నా వాళ్ళతో మాట్టాడారు కూడా.

ఎప్పుడూ లేనిది, అప్పుడు మాత్రం బ్రాహ్మలు ఒకటే కంగారు పెట్టారు, “తొందరగా కానివ్వండమ్మా” అంటూ.

నాన్నని కూడా, “కానియ్యండి, కానియ్యండి” అంటూ ఒకటే హడావిడి చేశారు. నాకయితే కాస్త ఆశ్చర్యం కలిగింది. అయినా పొట్టకూటి కోసం వేరే ఎక్కడన్నా, ఇంకో పనికి వెళ్ళాలని కంగారు పడుతున్నారు కామోసనుకున్నాను. మొత్తానికి ఆబ్దీకం తంతు ముగిసింది. బ్రాహ్మల భోజనాలయి పోయాయి. నాన్న భోజనం కూడా అయిపోయింది. మడి విడిచి ముందు గదిలోకి వచ్చి, నిన్ను ఒళ్ళోకి తీసుకున్నాను. ఇంకా మగతలోనే వున్నావు నువ్వు.

“మొత్తానికి కార్యం జయప్రదంగా పూర్తయిందండీ” అంటూ బ్రాహ్మలు నాన్నిచ్చిన దక్షిణ తీసుకుని వెళ్ళారు. వాళ్ళ మాటలు అప్పుడర్థం కాలేదు. ఆ సాయంత్రం ఇంటావిడ చెప్పింది.

“డాక్టరు నలభై ఎనిమిది గంటలు గడిస్తేనే గానీ పిల్లాడి విషయం ఏ సంగతీ చెప్పలేమన్నాడమ్మా! మీ ఆయన నువ్వు బాధ పడతావని నీకా విషయం చెప్పలేదు. బ్రాహ్మలకి కూడా ఆ విషయం తెలిసింది. ఆబ్దీకం కార్యక్రమం మధ్యలో వుండగా, పిల్లాడి కేమన్నా అయితే, ఆ తంతు చెడిపోతుందని బ్రాహ్మలూ కంగారు పడ్డారు, నిన్నూ కంగారు పెట్టారు. దేవుడి దయ వల్ల పిల్లాడికేం కాలేదు” అని.

ఆ మాటలు విని ఆశ్చర్య పోయాను. ఆ బ్రాహ్మల మీద ఎంతో కోపం కూడా వచ్చింది. “పిల్లాడి కన్నా తంతులెక్కువా?” అని అందర్నీ తిడదామనుకున్నాను గానీ, ధైర్యం లేక, నాలో నేనే కుములుకుని నిన్ను గుండెలకి హత్తుకున్నాను. నేనను కున్నట్టుగానే నువ్వు తేరుకుని, ఆరోగ్యవంతుడి వయ్యావు. అందుకే ఇప్పటికీ నీకు చల్లగాలి పడదు.

ఈ విషయం గుర్తొచ్చి నప్పుడల్లా, నాకు చాలా కష్టంగా వుంటుంది ఈ నాటికీ.

ఇవన్నీ రాస్తుంటే మనసు ఒక రకంగా తేలిక పడుతోంది. ఇవన్నీ ఎప్పటికీ ఫోనులో మాట్టాడగలిగే దాన్ని కాదు. పక్కన కూర్చుని చెప్పే కబుర్లు కూడా కాదు. రాయగలిగే కబుర్లు మాత్రమే ఇవి. కంప్యూటర్ యుగంలో ఫోన్ల తోటీ, ఈమెయిళ్ళ తోటీ మనుషుల మధ్య ఎంత దూరం ఏర్పడుతోందో అర్థమవుతోంది. ఉత్తరాల్లో మాత్రమే రాసుకోగలిగే విషయాలు ఈమెయిళ్ళలోనూ, ఫోన్లలోనూ సాగవు ఎప్పటికీ. మనసు పంచి రాసుకోలేక పోతే, ఏం సంతోషంగా వుంటుందీ?

ఇలా ఎంత సేపైనా రాసుకు పోవచ్చనిపిస్తోంది. చాలా ప్రశాంతంగా వుంది కూడా. ఇంకో రకంగా దిగులు మొదలయింది. నువ్వెళ్ళి మూడేళ్ళయింది. రెండేళ్ళు చదువన్నావు. తర్వాత ఉద్యోగానికి వీసా అన్నావు. కొత్త ఉద్యోగం అన్నావు. ఆర్నెళ్ళకే ఉద్యోగం పోయిందన్నావు. మళ్ళీ కొత్త ఉద్యోగం అన్నావు. ఆర్థిక మాంద్యం అన్నావు. ఇలా ఏవేవో అంటూనే వున్నావు. నీమీద బెంగ ఎక్కువై పోయింది. ఒక్కసారి రారా! ఏవో కష్టాలు ఎప్పుడూ వుంటూనే వుంటాయి. ఆత్మీయుల మధ్య గడిచి పోయిన కాలం మాత్రం తిరిగి రాదు. నిన్ను చూడాలని ఎంతో కోరిగ్గా వుంది. నీకు వండి పెట్టాలని, నాన్న ఈ మధ్య ఏవో కొత్త వంటలు కూడా నేర్చుకున్నారు. మా బంగారు తండ్రివి కదూ? ఒక్కసారి వచ్చి వెళ్ళమ్మా!

ఇప్పటికే చాలా పెద్ద ఉత్తరం అయింది. నాన్న సోఫా లోనే టీవీ చూస్తూ గుర్రు పెడుతున్నారు. లేపి మంచం మీద పడుకోమని చెప్పాలి. రేపు నాన్న కూడా ఈ ఉత్తరం చదివాక పోస్టు చేస్తాను. నీకు నెమ్మదిగా అందుతుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త. దేని గురించీ దిగులు పెట్టుకోకు. అన్నీ సరిగ్గానే జరుగుతాయి. ధైర్యంగా వుండు. నువ్వు కూడా ఈ ఉత్తరానికి జవాబు ఫోనులో ఇవ్వద్దు. చిన్నదైనా సరే, ఉత్తరమే రాయి. పోస్టుమేన్ చేతికి ఒక ఉత్తరం అందిస్తే ఎంత బాగుంటుందీ! అది అందుకుని కుర్చీలో కూర్చుని చదువుతుంటే ఇంకెంత బాగుంటుందీ! వేళకి భోజనం చెయ్యి.

ఇంతే సంగతులు.

ఇట్లు,
మీ అమ్మ


అమ్మ ఉత్తరం చదివిన వెంటనే భాస్కరం ఫోను తీశాడు. “కోహినూర్ ట్రావెల్సాండీ? ఇండియాకి ఒక టికెట్ కావాలండీ!” అన్నాడు గబ గబా.


రచయిత జె. యు. బి. వి. ప్రసాద్ గురించి:

2003 నుంచీ రెగ్యులర్‌గా వ్రాస్తున్న జెయుబివి ప్రసాద్ గారి కథలు ఇండియాలో పత్రికలలోనూ, అమెరికాలో వెబ్, ప్రింట్ పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి.

 ...