పిల్లి విషయం అయింది కదా? ఇప్పుడు కుక్క సంగతులు రాస్తాను. మన పక్కింటి వాళ్ళ పిల్లలు ఒక కుక్క పిల్లని పెంచడం మొదలు పెట్టారు. అది గోధుమ రంగులో ముచ్చటగా వుంది చూడ్డానికి.
“పేరేం పెట్టార్రా దానికి?” అనడిగాను వాళ్ళని.
“దీనికి టెండూల్కర్ అని పేరు పెట్టాం అమ్మమ్మ గారూ!” అని వాళ్ళు గొప్పగా చెప్పారు. వాళ్ళ తెలుగు వ్యాకరణానికి నవ్వొచ్చింది. మగైనా, ఆడైనా జంతువుని, ‘అదీ’, ‘ఇదీ’ అనే అంటారెందుకో?
“నోరు తిరక్కుండా అదేం పేరర్రా?” అనడిగాను ఆశ్చర్యంగా.
“సచిన్ టెండూల్కర్ అంటే మాకిష్టం! అందుకే ఆ పేరు పెట్టాం అమ్మమ్మ గారూ!”
కుక్కకి తన పేరు పెట్టడం సచిన్ టెండూల్కర్‌కి గౌరవమో, అవమానమో అర్థం కాలేదు నాకు. మొత్తానికి ఆ కుక్కకి మాత్రం గౌరవమే అని అర్థం అయింది ఆ పిల్లల మాటల వల్ల.
ఒకసారి పక్కింటి వాళ్ళు రెండ్రోజులకని ఏదో ఊరెళ్తూ, వాళ్ళ టెండూల్కర్‌ని మనింట్లో వదిలేసి వెళ్ళారు. ఆ రెండ్రోజుల్లో అది నాన్నకి దగ్గరయి పోయింది. ఆయన తిండి పెడితే తింది. ఆయన మంచం కిందే పడుకుంది. ఆయన ఎటు వెళ్తే, తోకాడిస్తూ అటే వెళ్ళింది. ఆయన దానికో పళ్ళెం ప్రత్యేకంగా పెట్టి, అందులో తిండి పెట్టేవారు. అది తింటున్నంత సేపూ దానితో కబుర్లు. ఆయన భోజనం చేస్తుంటే, దూరంగా కునికి పాట్లు పడుతూ, ఆయన్నే చూస్తూ కూర్చునేది. ఆయన మంచం ఎక్కే వరకూ, నిద్ర పోయేది కాదు.
రెండ్రోజులు పోయాక వాళ్ళొచ్చి టెండూల్కర్‌ని తీసుకు పోయారు. కొన్ని రోజులు గడిచాయి.
“అమ్మమ్మ గారూ! టెండూల్కర్‌ని మా పాలబ్బాయికి ఇచ్చేస్తున్నాం పెంచు కోవడానికి” అంటూ పిల్లలు గోల గోలగా చెప్పారు.
“అయ్యయ్యో! ఎందుకలా? ఏమైందీ?” అడిగాను ఆత్రంగా.
“మరండీ! మరండీ! టెండూల్కర్‌కి రాచ్చిప్పలో తిండి పెడితే తినడం లేదండీ! వుత్త నీళ్ళు మాత్రం తాగుతోంది. అస్తమానూ గొలుసు విప్పెయ్యమని అరుపులు. నాన్న భరించ లేక, “పాలవాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళే పెంచుకుంటారు” అని అన్నారు. అందుకని వాళ్ళ కిచ్చేస్తున్నాం” అంటూ దిగులుగా వాళ్ళ గోడు వెళ్ళ బోసుకున్నారు.ఆ రెండ్రోజులూ నాన్న దాన్ని గారాబం చేసి చెడ గొట్టేశారు. దాని ప్రత్యేక పళ్ళెంలో తిండీ. తినేటప్పుడు బతిమాలుతూ, గారాబం చెయ్యడం. ఆ సూకరాలు నేర్చుకున్న కుక్క ఓ రాచ్చిప్పలో ఇంత చద్దన్నం పడేస్తే తింటుందా మరి?
వాళ్ళ మాటలు వింటున్న నాన్న ఇక ఆగలేక, “మేం పెంచుకుంటాం. మాకిచ్చేయమని చెప్పండి మీ అమ్మా, నాన్నలకి” అన్నారు ఆత్రంగా. పిల్లలు గోల చేసుకుంటూ వెళ్ళారు ఆ వార్త అందించడానికి. ఆ మరుసటి రోజు నాన్న టెండూల్కర్‌ని ‘దత్తత’ చేసుకున్నారు. తర్వాత రోజుల్లో నాన్న దాన్ని చేసిన గారాబం అంతా, ఇంతా కాదు. మనుషుల్లో కూడా అలాంటి గారాబం చెయ్యరు.
మొట్ట మొదట నాన్న చేసిన పని ఆ కుక్క పేరు మార్చడం. “ఈ రోజు నించీ దీని పేరు బుజ్జి. టెండూల్కర్ కాదు” అని ప్రకటించారు. ఆ కుక్క “బుజ్జి” అన్న పేరుకే అలవాటు పడిపోయింది. నాన్న దానిక్కూడా కారప్పూస అలవాటు చేసేశారు. దాని తిండి మీద కారప్పూస చల్లి తీరాల్సిందే. తర్వాత దాని పక్కన కూర్చుని, “బుజ్జీ, బుజ్జీ! మా మంచి బుజ్జివి కదమ్మా? తినమ్మా, తినమ్మా!” అంటూ పసి పిల్లల్ని గారం చేసినట్టు చేస్తేనే గానీ, తినేది కాదు. అదీగాక నాన్న పెడితేనే గానీ తిండి తినేది కాదు. ఏ రోజైనా నాన్న బయటికి వెళ్ళి ఆలస్యం చేస్తే, ఆయన వచ్చే వరకూ తిండి తినకుండా ఎదురు చూడ్డమే దాని పని.
ఆ బుజ్జికి ఇంకో విచిత్రమైన అలవాటు చేశారు నాన్న. కొబ్బరి అంటే ఆ కుక్కకి ఎంత పిచ్చో! చిన్న చిన్న కొబ్బరి ముక్కలు దాని తిండి మీద రెండ్రోజుల కొకసారి చల్లాల్సిందే. లేకపోతే అదీ, దాంతో పాటు మీ నాన్నా దిగులెట్టేసుకునే వారు.
“మీ బుజ్జి కిందటి జన్మలో ఏ గుళ్ళోనో పూజారి అయి వుంటుంది. కొబ్బరి మీద కుతి ఈ జన్మలో కూడా పోలేదు మరి దానికి” అంటూ వేళాకోళం చేసేవారు పక్కింటి వాళ్ళు.
దాని కెప్పుడూ గొలుసు కట్టలేదు, బయటకి కాలకృత్యాల కోసం తీసుకెళ్ళడానికి తప్ప. ఇల్లంతా దర్జాగా తిరుగుతూ వుండేది. ఓసారి నాన్న బుజ్జిని సోఫా ఎక్కించి, తన పక్కనే కూర్చో పెట్టుకున్నారు. అది చూసి నేను లబలబ లాడి పోయాను.
“అయ్యయ్యో! అయ్యయ్యో!” అంటూ గావు కేకలెట్టాను. “ఏమైందేమయిందం”టూ నాన్నా కంగారు పడ్డారు.
“అదేమిటీ కుక్కని సోఫా ఎక్కించారూ?” అడిగాను చాలా అయిష్టంగా. నాన్నకీ కొంచెం కోపం వచ్చింది.
“కుక్కేమిటీ కుక్క? మనిషిని ‘మనిషీ’ అని పిలిస్తే ఎట్టా వుంటుందీ? నీకో పేరుంది కదా? అది పెట్టి గాక, నిన్ను ‘మనిషీ’ అని పిలిస్తే, నువ్వూరుకుంటావా? నోరు లేనిది కదా అని, దాన్నలా అంటావా? దానిక్కూడా ఓ పేరుంది, చక్కగా ‘బుజ్జి’ అని. ‘బుజ్జీ’ అని పిలవాలి గానీ, ‘కుక్కా’ అని పిలవడం ఏమిటీ? నాకు నచ్చట్లేదు బాబూ!” అని నాన్న కూడా అయిష్టంగా అన్నారు.
ఆయన తీసిన లా పాయింటుకి ముచ్చట పడాలో, మూర్ఛ పోవాలో అర్థం కాలేదురా!
“సరే! మన బుజ్జిని సోఫా ఎక్కించారేమిటీ? ఇంటి నిండా దాని వెంట్రుకలే! శుభ్రం చేయలేక ఛస్తున్నాను. ఇప్పుడు సోఫా మీదా, మంచాల మీదా కూడా బుజ్జి వెంట్రుకలు వుంటాయి. ఏం బావుంటుందీ? దాన్ని పెరట్లోనే వుంచి పెంచకూడదూ?” అన్నాను ఆరోపణగా.
“పోదూ! నీదంతా చాదస్తం! శుభ్రం పని నేను చూస్తాలే. పెరట్లోనే వుంచు కునేటట్టయితే, అసలు పెంచు కోవడం ఎందుకూ?” అంటు నాన్న నా మాటలు కొట్టి పడేశారు.
ఆయన ఇష్టానికి అడ్డు తగల లేక వదిలేశానా విషయం గానీ, ఇల్లంతా పిల్లి వెంట్రుకలూ, కుక్క వెంట్రుకలూ వుండటం నచ్చేది కాదు. జంతువులంటే నాకూ ముద్దే గానీ, శుభ్రమే వుండదు వాటి సావాసంతో. అయితే, వంటిట్లోకి మాత్రం రానిచ్చే దాన్ని కాదు. ఇల్లు శుభ్రం, కుక్క శుభ్రం అంతా నాన్నే చూసుకునే వారు. ఆ కుక్క నన్ను మనింట్లో ఓ అతిధిలా చూసేది. అదే నాకాశ్చర్యం!
ఓ రోజు వారగా వేసున్న తలుపు తీసుకుని, రోడ్డు మీద కెళ్ళి, ఓ లారీ కింద పడింది.
నాన్న చాలా రోజులు బెంగ పెట్టు కున్నారు. భోజనాలకి కూర్చున్నప్పుడల్లా అవే గుర్తొచ్చేవి. తరుచు కళ్ళలో మెదులుతూ వుండేవి. రోడ్డు మీద పిల్లి గానీ, కుక్క గానీ కనిపించిందంటే చాలు, మా కళ్ళలో నీళ్ళు. చాలా బాధగా వుండేదిరా. చాలా కాలం పట్టింది తేరుకోవడానికి. ఆ అనుభవాల తర్వాత మళ్ళీ జంతువుల జోలికి పోలేదు. ‘హమ్మయ్య’ అని నిట్టూర్చాను. జంతువులంటే ఇష్టం వున్నా, వాటితో సహవాసం నచ్చేది కాదు నాకు. వాటిని వేరేగా వుంచే పరిస్థితులు లేవు కదా?