నింగి-నేల
నేలంటే మరేమీ కాదు
నిదురించే నీటి గుండెలపైకి
ఆప్యాయంగా కప్పిన
ఆకుపచ్చని దుప్పటి
అమరిన ముక్కలన్నిటినీ
అతిజాగ్రత్తగా కూర్చి
అంతిమంగా పరిష్కరించిన
అనాది ప్రహేళిక
ఒకోసారి
నేలమీంచి చూసే ఆకాశం కన్నా
ఆకాశంలోంచి చూసే నేలే
అందంగా ఉంటుంది
నిజానికి
నేల, నింగి
ఒకరి అందానికొకరు అసూయపడుతూ
యుగాలు గడిపిన ఇద్దరు వనితలు
నిరంతరం
చూపులతోనే అభినందించుకొంటున్నా
ఎప్పటికీ కలవని
ఇద్దరు ప్రేమికులు
mOhana అభిప్రాయం:
November 2, 2009 1:20 pm
నింగీ నేలా వేద కాలంనుండి ప్రేమికులుగానే పరిగణించబడుతున్నారు. నేను దీనిని నన్నయ హంసగీతికలులో కూడా ప్రస్తావించాను. సామాన్యముగా నేల వనిత, నింగి పురుషుడని భావన. ఇందులో మీరు ఇద్దరిని వనితలుగా చిత్రించారు. ఇది ఒక కొత్త ఊహయే! ఇందులో నాకు తెలియని గూఢార్థాలు ఏమైనా ఉన్నాయా?
విధేయుడు - మోహన
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
November 3, 2009 2:18 am
మంచి కవిత్వం రాసే అతికొద్ది కవుల్లో రవిశంకర్ గారొకరు. ఆయన పేరు చూడగానే మంచి కవిత చదువబోతామన్న ధీమా వస్తుంది. కానీ ఈ కవితలో అగమ్యగోచరమైన ఖాళీ వుంది. అసంపూర్ణమైన పోలికలు కనిపించాయి.
మోహన రావుగారికొచ్చిన సందేహమే నాకూ వచ్చింది. ఒక పాదంలో ఇద్దరు వనితలంటూ చెప్పి, చివరి పాదంలో ఇద్దరు ప్రేమికులుగా చెప్పడంతో, నేలా, నింగీ లని స్త్రీ, పురుష ద్వయంగా వర్ణించారేమిటా అని అనుకున్నాను. ( ఇద్దరు స్త్రీలు ప్రేమించుకోకూడదా? అని మాత్రం నన్నడగకండి) పోలికలు గతిభేదం తప్పినట్ట్లుగా అనిపించిది.
sky baba అభిప్రాయం:
November 24, 2009 9:48 am
పొయెమ్ బాగుంది. తెలుగు పత్రికలకి కూడ పంపండి. ఇంకా ఇ-పత్రికలు చూసేంత మన పాఠకులు ఎదగలేదు కదా.. నేనే ఇన్ని రోజులకు మీ పొయెం చూశాను..
naren g అభిప్రాయం:
January 13, 2010 11:55 pm
ఆప్యాయంగా కప్పిన
ఆకుపచ్చని దుప్పటి
చాలా బాగుంది, రవిశంకర్ గారు. గ్లోబల్ వార్మింగ్ పుణ్యమాని,నిర్ధాక్షణ్యంగా మంచు తలగడలు కరిగి పోయి దుప్పటీ ని ముంచే పరిస్థితి రాకూడదని కూడా కోరుకుందాము.
నారాయణ గరిమెళ్ళ