ఎవరి బిడ్డ ఇది?

నాల్గు రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఆ రోజు సెలవిచ్చేస్తున్నట్లు రత్తాలుకి చెప్పేశారు. రత్తాలిని ఇంటికి తోడుకుపోడానికి రాములు హాస్పిటల్‌కి వచ్చాడు. రత్తాలుకి, ఒంట్లో హార్మోన్లు ప్రభావం తగ్గడానికి, పాలు ఇగిరిపోవడానికి…ఇలా ఏవేవో అవసరమైన మందులు రాసి ఇచ్చారు డాక్టర్లు. అన్నీ సద్దుకుని, లాంజ్ లోకి వచ్చి కూర్చుని సరితా సాగర్ల రాకకోసం ఎదురుచూస్తున్నారు రాములూ, రత్తాలూను. వాళ్ళు రత్తాలుకి ఒప్పందం ప్రకారం ఈ రోజున మరో లక్ష ఇవ్వాల్సి ఉంది.

వస్తామన్న టైం దాటినా కూడా సరితా సాగర్లు రాకపోడంతో, వారి రాక కోసమే ఎదురుచూస్తున్న ఆ ఆసుపత్రి సిబ్బాంది మనసుల్లో అలజడి మొదలయ్యింది. వెంటనే సాగర్ ఇచ్చిన కాంటాక్టు నంబర్‌కి ఫోను చేసారు వాళ్ళు. కొడుక్కి టైఫాయిడ్ రావడం, భర్త ఇనస్పెక్షన్ కాంపుకి తప్పనిసరిగా వెళ్ళవలసి రావదంతో, సరళకు వారం రోజులుగా ఇల్లు విడిచి బయటకు రావడానికి వీలుకాని పరిస్థితి వచ్చింది. ఫోను ఎడతెగకుండా రింగౌతూండడంతో, కొడుకు మంచం కనిపెట్తుకుని ఉన్న సరళ లేచివెళ్ళి ఫోన్ తీసింది.

“రెండు గంటలకు ముందే వాళ్ళు ఇక్కడనుండి వెళ్ళిపోయారు. వాళ్ళ అమెరికా ప్రయాణం కూడా ఈ రోజే. హాస్పిటల్కి వెళ్ళి, పిల్లాడిని తీసుకుని అటు నుండి అటే ఎయిర్ పోర్టుకి వెళ్ళిపోతాము అని చెప్పారు. ఇంకా అక్కడకు రాలేదా ” అంటూ ఎదురడిగింది సరళ.

హాస్పిటల్ సిబ్బంది గుండెల్లో రైళ్ళు పరుగులు పెట్టాయి. వెంటనే కొంతమందిని ఎయిర్‌పోర్టుకి పంపించారు వాళ్ళు. ఎందుకైనా మంచిదన్న ముందు జాగ్రత్తతో, చీఫ్ గైనకాలజిస్టు పసివాడిని రత్తాలుకి అప్పగించమని ఆయాచేత పంపించింది. కాని రత్తాలు ఆ బిడ్డను అందుకోలేదు.

“నా కాంట్రాక్టు ఐపోయింది కదమ్మా” అంది రత్తాలు నిదానంగా.

“కన్నదానివి కదా! ఆ తల్లి వచ్చి బిడ్డను అందుకునే వరకూ నువ్వు చూసుకోడం బాగుంటుంది” అంది ఆయా గడుసుగా.

రత్తాలుకి కోపం వచ్చింది. “నాకు మీరు సెప్పిందే కదమ్మా! నా కడుపులో ఉన్నంతసేపే ఈ బిడ్డ నాది, పుట్టిన తరువాత నాకే సంబంధం లేదనీ! మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నా రేమిటి? ఈ పది నెలలూ నా గుండె తడి ఆరిపోడం కోసం నేను ఎంత శ్రమ పడ్డానో మీకేం తెలుస్తుంది? ఇక వీడు నాకేమీ కాడు” అని నిక్కచ్చిగా చెప్పేసింది. అంతలో ఎయిర్ పోర్టుకి వెళ్ళినవాళ్ళు ఫోను చేశారు, “మే మిక్కడ ఎంక్వైరీలన్నీ పూర్తిచేసి, వాళ్ళు ఏ ఫ్లైట్ ఎక్కారో తెలుసుకునే సరికి, వాళ్ళు ఎక్కిన విమానం రన్‌వే మీదకు వెళ్ళిపోయింది. దానిని అక్కడే ఆపి, వెనక్కి రప్పించే అధారిటీ మనకు లేకపోడం వల్ల మేమేమీ చెయ్యలేకపోయాము. సారీ” అంటూ.

ఆ మాటలు విని ఉసూరు మన్నారు ఆసుపత్రి యాజమాన్యం. వాళ్ళకు రావలసిన డబ్బు వాళ్ళు ముందే వసూలు చేసుకున్నారు, కాని ఇప్పుడీ పసివాడు వాళ్ళకి ప్రోబ్లం అయ్యాడు. ఏం జరిగిందన్నది తెలియకపోయినా, ఆసుపత్రి వాళ్ళ మొహాలు చూసి, ఏదో జరగకూడనిది జరిగినట్లు గ్రహించాడు రాములు. వెంటనే కూర్చున్న చోటునుండి లేచి నిలబడ్డాడు. రత్తాలుకి చెయ్యి అందిస్తూ, “రావే రత్తాలూ, పోదాం. ఇక లే, నడు” అంటూ ఆమెను లేవదీసి, నెమ్మదిగా ఆటో దగ్గరకి నడిపించాడు రాములు. ఈ ఊబి నుండి తన భార్యను ఎంత తొందరగా తీసుకు వెడితే అంత మంచిది అని అర్థమైపోయింది.

ఆటో ఎక్కుతూ, “బిడ్డ ఏదీ… అని ఇరుగుపొరుగులు అడిగితే ఏంచెప్పాలి” అంటూ నసికింది రత్తాలు. “పురిటికందును పురిట్లోనే ఎన్నెమ్మ కొట్టేసిందని చెప్పు” అన్నాడు రాములు చిరాకుపడుతూ. రత్తాలు మరి మాట్లాడలేదు. ఆటో వెళ్ళిపోయింది.

ఆయా చేతుల్లో ఉన్న పసివాడు కేరుమంటూ గుక్కపట్టి ఏడవసాగాడు.

*(ఈ కథలోని వైద్య విజ్ఞానానికి సంబంధించిన విషయాలూ, లీగల్‌గా ఉన్న విషయాలూ రెండున్నర సంవత్సరాల క్రితం ‘ఈనాడు ఆదివారం’లో, ఇండియాలోని సంతాన సాఫల్య కేంద్రాల గురించి వ్రాయబడిన వ్యాసం ఆధారం – రచయిత.)