“రత్తాలూ” అంటూ ఎంతో ఆర్ద్రంగా పిలిచింది సరళ. చేస్తున్న పని ఆపి, “అమ్మా, పిలిచారా” అంటూ వచ్చింది రత్తాలు.
“నేనో మాట చెపుతా, నువ్వేం తప్పుగా అనుకోకు. అది నేను నీ మంచి కోరే చెపుతున్నా” అంటూ మొదలెట్టింది సరళ. ” నిన్ననే మాకు ఓ కబురు వచ్చింది, అయ్యగారి ఫ్రెండు కుటుంబంతో సహా పని మీద ఈ ఊరు వస్తున్నారుట!వాళ్ళకి నీ అవసరం ఉంది. నీ పుణ్యం బాగుండి ఈ అవకాశం నీకు వచ్చింది అనుకో… ఇంతకీ అది నీకు ఇస్టమైతేనేలే…”
ఆశ్చర్య పోయింది రత్తాలు. “అదేంటమ్మా ! చెప్పడానికి మరీ అంత ఇదైపోతున్నారు ! వాళ్ళకి కూడా పని చెయ్యాలా? నేను రెడీయే నమ్మా. ఈ టైంలో నాకు పని దొరికితే చాలు, ఎంత కష్టమైనా పడతానమ్మా.” అంది.
“అది మామూలు పని కాదే పిచ్చిమొద్దూ! చెప్పేది జాగ్రత్తగా విని, సరిగా అర్ధం చేసుకో… వాళ్ళూ మా వయసు వాళ్ళే, కాని పిల్లలు లేరు. ఎంత డబ్బున్న వాళ్ళైతే మాత్రం, నట్టింట బిడ్డ నడయాడని ఇల్లు అదేం ఇల్లులే! ఇప్పుడు బిడ్డ కావాలని దోరాడుతున్నారుట! వాళ్ళు అదే పని మీద వస్తున్నారు ఇక్కడికి.”
“ఔనా అమ్మా! ఎవరినైనా పెంచుకోవాలనుకుంటున్నారా?”
“అబ్బ! ఆగవే బాబూ, చెప్పనియ్యి! వీళ్ళకు కావలసింది అలాంటి పిల్లలు కారు. అమ్మా నాన్నల పోలికలతో ఉన్న స్వంత పిల్లలుట! వీళ్ళు చాలా పెద్ద ప్లానుమీద వస్తున్నారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, వీళ్ళకి, బిడ్డని పది నెలలూ కడుపులో ఉంచుకుని మోసి, కని వీళ్ళకు అప్పగించేందుకు ఒక అమ్మ కడుపు అద్దెకు కావాలిట! దానికి వాళ్ళు ఎంత డబ్బైనా ఇస్తారుట! అర్ధమయ్యిందా” అంది సరళ.
ముక్కుమీద వేలేసుకుని, ఆశ్చర్యంతో నోరు తెరిచేసింది రత్తాలు. కొంచెంసేపు ఆగి అంది, “మరీ సోజ్జం కబుర్లు చెప్పబోకండమ్మా! ఎవరి బిడ్డని వాళ్ళే మొయ్యాలి, వాళ్ళే కనాలి గాని, వేరేవాళ్ళు కడుపున మోసి కనడం ఏమిటమ్మా” అంది రత్తాలు ఆశ్చర్యం తలమునకలౌతూoడగా.
“నీ మొహంలేవే! నీకు తెలిసింది కాస్తే తప్ప, భూమ్మీద ఇంకే వింతలూ ఉండవా ఏమిటి?” మాట అందుకుని వివరించి చెప్పింది సరళ. రత్తాలుకి సరళ చెప్పిందంతా అర్ధం కాకపోయినా, సంగతి మాత్రం బాగానే తెలిసింది. “నాకు తెలియక అడుగుతున్నా గాని సరళమ్మగారూ, మరి వేవిళ్ళూ, పురిటి నొప్పులూ ఎవరు పడాలంటా” అంది రత్తాలు దీర్ఘం తీస్తూ.
“బాగానే ఉంది ప్రశ్న ! ఏ తల్లి బిడ్డను మోస్తోందో ఆ తల్లికే ఉంటాయి అవన్నీ. అందుకే, బిడ్డ కావాలనుకున్న వాళ్ళు, ఆ తల్లికి బోలెడు డబ్బు ఇచ్చి, బిడ్డ పుట్టాక బిడ్డను తీసుకుంటారు. ఇప్పుడు అయ్యగారి ఫ్రెండ్సు వస్తున్నది ఆ పని మీదే! వాళ్ళకొక బేబీని కని ఇవ్వడానికి ఒక అమ్మకడుపు అద్దెకు కావాలిట! కడుపున మోసి కన్నందుకు ఒక లక్ష, ఖర్చులకోసం మరో లక్ష రూపాయలు ఇస్తారు వాళ్ళు. అవసరంలో ఉన్నావని, మీ అయ్యగారు , నీకా పని వీలౌతుందేమో అడగమన్నారు. నువ్వు “సరే” నంటే ,ఆ బిడ్డను మోసే పని నీకు అప్పగించే ఏర్పాటు మేము చేస్తాము. బాగా అలోచించుకు చెప్పు” అంది సరళ.
నోట మాట రాలేదు రత్తాలుకి. అవాక్కై నిలబడి పోయింది. రెండు లక్షలు అంటే మాటలా! పైగా, తమ కుటుంబం ఇప్పుడున్న పరిస్థితిలో ఆ డబ్బు అవసరం తమకు ఎంతో ఉంది. తనకు ఏ విధంగానూ సంబంధం లేని ఆ బిడ్డను తన కడుపున మోసి, కని వాళ్ళకు అప్పగిస్తే, ఆ రెండు లక్షలూ తనవౌతాయి. కాని తను ఇలాంటి పనులకు తలపడితే, అది తన మావకు అపచార మౌతుందేమోనని బాధ పడింది రత్తాలు. ఆమాటే సరళతో అంది కూడా.
సరళ నవ్వింది. “వెర్రి మొహమా, అల్లా ఎల్లా అవుతుందే? ఆ కుటుంబంలో పెద్దవాళ్ళెవరితోనూ నీకు ఏ సంబంధం లేదు. నువ్వసలు వాళ్ళని కళ్ళతో చూడకపోయినా ఫరవా లేదు, తెలుసా! నీ కున్న సంబంధమల్లా, పుట్టబోయే బిడ్డతో మాత్రమే. అది కూడా ఆ బిడ్డ భూమి మీదకు వచ్చేవరకే. ఆ తరవాత నువ్వెవరో, వాళ్ళెవరో! మీ మామ కంతా చెప్పి, మీ నిర్నయ మేమిటో రేపు నాకు చెప్పు. అవసరంలో ఉన్నావు కదాని నీతో చెప్పా. నువ్వు కాదంటే మరొకళ్ళకు చెపుతా. రేపే నువ్వు నాకు ఏ మాటా చెప్పాలి” అంది ఆమె ఖరాఖండీగా.
రత్తాలు ఇంటి కొస్తూనే సరళమ్మ చెప్పిన మాటలు అతని చెవిని వేసింది. ఆ మాటలు వింటూనే తల కొట్టేసినట్లుగా “నేను బ్రతికి ఉండగా నువ్వు పరాయి బిడ్డని కడుపున మొయ్యడమేమిటి, ఎవరు విన్నా నవ్విపోగలరు” అంటూ మండి పడ్డాడు రాములు.
“సరళమ్మ నా కంతా వివరంగా చెప్పారు. డబ్బున్న మారాజులు తాము కష్టపడకుండా, తమ బిడ్డని పెంచడానికి పాలతల్లిని ఆయాగా పెట్టుకుంటారు కదా! ఇదీ అలాంటిదేననుకో. వాళ్ళు మనకు రెండు లక్షలు ఇస్తారుట – సరళమ్మ చెఫ్ఫింది. ఏది ఏమైనా, నువ్వు కాదన్న పని ఏదీ నేను చెయ్యను, సరా! నా రోసిన వాడు నీరొయ్యకపోడులే. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు” అంది నిరాశగా రత్తాలు. ఆ మర్నాటికి రాములు పూర్తిగా వీగిపోయాడు. “ఏం చెయ్యనే రత్తాలూ ! గుండె దడ దడ లాడుతోందే! నువ్వే ఏదో ఒకటి నిరుకు చేసుకు సెప్పెయ్యవే” అన్నాడు నిస్సహాయంగా.
“మనంటోల్లకు రెండు లక్షలు శానా డబ్బు. సంతోషంగా ఒప్పేసుకో మామా. మనం ఏ తప్పూ చసెయ్యటం లేదు. మనం జేస్తున్నది మంచే అనుకో. బెంగ తీరుతుంది” అంది రత్తాలు ఓదార్పుగా.
ఆ తరవాత పనులన్నీ చకచకా జరిగిపోయాయి. సరళ, రత్తాలు భారాన్ని తనమీద వేసుకుంది. ఆమెను వెంట తీసుకుని ముందే ఎంచి ఉంచుకున్న “ఫెర్టిలిటీ క్లినిక్”కి వెళ్ళింది. అక్కడి డాక్టర్లు రత్తాలుని రకరకాల పరీక్షలు చేశారు. అన్నింటిలోనూ ఆమెకు మంచి రిజల్ట్సు వచ్చాయి. రత్తాలుకి హెపాటైటిస్ బి, సి లాంటివి ఏమీ లేవు.ఎయిడ్సు పరీక్షలో ఆమెకు నెగటివ్ వచ్చింది. ఆరోగ్య లక్షణాలు కూడా సలక్షణంగా ఉన్నయి. “ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి వారి నిబంధనల ప్రకారం, రత్తాలు, పరాయి బిడ్డను తన గర్భాన పది నెలలూ మోసి, కని ఇవ్వడానికి చాలిన అన్ని అర్హతలూ ఉన్న వ్యక్తిగా నిర్ధారించ బడింది” అంటూ ఆమెకు ‘క్లీన్ అండ్ గ్రీన్’ చిట్ ఇచ్చారు డాక్టర్లు. వెంటనే ఆ వార్త సరితా సాగర్లకు చేరిపోయింది.
రత్తాలుని గర్భధారణకు సిద్ధంగా తయారుచెయ్యడానికి చేయవలసిన చికిత్సలన్నింటినీ ఒక లిస్టులా తయారుచేసి, వాటిని తేదీలవారీ ఒక టైంటేబుల్లా పట్టిక రాసి సరళ కిచ్చారు డాక్టర్లు. దాని ప్రకారం సరితా సాగర్లు ఇండియా రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇండియాలో డాక్టర్లు రత్తాలుకి హార్మోన్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. సుమారు పదిహేను రోజుల వైద్యంతో రత్తాలు గర్భం పిండానికి అనుకూలంగా మారింది. డాక్టర్లు చెప్పిన సమయానికి సరితా సాగర్లు ఇండియా వచ్చేశారు. సరైన సమయంలో వాళ్ళు సరిత నుండి అండాన్ని లేబరేటరీలో సాగర్ వీర్య కణాలతో సంయోగపరచారు. ఆ విధంగా ఏర్పడిన పిండాన్ని, నేర్పుగా రత్తాలు గర్భాశయంలో ప్రవేశపెట్టారు. అక్కడున్న అనుకూల వాతావరణంలో ఆ పిండం స్థిరపడింది.
ఇది కూడా ఒక కాంట్రాక్టు లాంటిదే కదా. ఇది బేబీకి జీవమిచ్చిన తల్లితండ్రులకూ, ఆ బిడ్డను గర్భాన ధరించి పెంచి, జన్మనిచ్చేందుకు తన కడుపును అద్దెకిచ్చిన తల్లికీ, దీనికంతకూ పూచీపడి నిర్వహించిన ఆసుపత్రికీ నడుమ జరిగిన ఒక కాంట్రాక్టు లాంటిది కావడం వల్ల కాగితాలమీద సంబంధిత నియమాలూ, నిబంధనలూ రాసుకుని ముగ్గురూ సంతకాలు చెయ్యవలసి ఉంది. అంతే కాకుండా, ‘బిడ్డ పుట్టేవరకే గాని పుట్టాక ఆ బిడ్డతో తనకు ఏ సంబంధమూ లే’ దని ప్రత్యేకంగా వ్రాయబడిన ఒప్పందంపైన రత్తాలును సంతకం చెయ్యమన్నారు. అలాగే అన్ని కాగితాల మీదా వాళ్ళచేత సంతకాలు చేయించి, ఎవరికి చెందిన పేపర్లు వాళ్ళకి ఇచ్చారు.
సరితా సాగర్ల ముఖాలు ఆనందంతో విచ్చుకున్నాయి. సరిత, రత్తాలు చేతులు రెండూ పట్టుకుని, “రత్తాలూ, నీ మేలు జన్మలో మర్చిపోలేను! వేళకు చక్కగా భోజనం చెయ్యి, పళ్ళూ, పాలూ విడవకుండా తీసుకో. ఎవరితోటీ తగవులు పేచీలు తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఇవిగో లక్ష రూపాయలు, ఖర్చులకు ఉంచు. బిడ్డను మేము తీసుకున్నప్పుడు నీకు మరో లక్ష ఇస్తాము. నీకే సందేహం వచ్చినా సరళమ్మని అడిగి తెలుసుకో. డబ్బు నీది, బిడ్డ మాది…అన్నది మర్చిపోకు సుమీ” అంటూ రత్తాలుకి చెక్కు అందించింది.
రత్తాలు నెమ్మదిగా తను చేస్తున్న పనులన్నీ మానేసింది, ఒక్క సరళమ్మగారి ఇంటిపని తప్ప. డాక్టర్లు ఇచ్చిన డేట్ల ప్రకారం సరళే వెంట ఉండి రత్తాలుని హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళేది. రోజు రోజుకీ రత్తాల్లో వస్తున్న మార్పులను చూస్తూ, ఎప్పటి కప్పుడు ఇ-మెయిల్ ద్వారా అమెరికాకి వార్తలు పంపేది సరళ.
మూడు,నాలుగు నెలలు గడిచే సరికి, కర్ర సాయంతో కొద్దిగా మసలుతున్నాడు రాములు. రత్తాలుకు మనసులో ప్రశాంతత ఏర్పడింది. నెమ్మదిగా రోజులు గడుస్తున్నాయి. టైంటేబుల్ ప్రకారం సరళ వెంట రత్తాలు హాస్పిటల్‌కి వెళ్ళి వస్తోంది. నాల్గు నెలలు రాగానే కడుపులో బిడ్డ కదలికలు మొదలయ్యాయి. రత్తాలు బిడ్డ తన్నినప్పుడల్లా పనిగట్టుకుని, “ఈ బిడ్డ నాది కాదు, నాది కాదు” అని తల్చుకుని నిర్లిప్తంగా ఉండిపోయేది. మరికొన్నాళ్ళు గడిచేసరికి రాములు కాలికి వేసిన ప్లాస్టర్ తీసేశారు. కర్ర సాయంతో నెమ్మదిగా నడవగల్గుతున్నాడు.
రత్తాలుకి ‘డ్యూ డేట్’ ఇచ్చారు. ఆ వార్త అమెరికా వెళ్ళింది. డ్యూ డేట్ ఇంకా మూడు రోజులు ఉండగానే ఇండియా వచ్చారు సరితా సాగర్లు. పూర్ణ గర్భంతో భారంగా మసలుతున్న రత్తాలును చూసి వాళ్ళు చాలా సంతోషించారు. బిడ్డ ఎప్పుడు పుడతాడా, ఎప్పుడు వాడిని చూద్దామా – అని వాళ్ళు తహతహ లాడుతూ ఎదురు చూస్తున్నారు. డ్యూ డేట్‌కి ఒకరోజు ముందే నొప్పులు వచ్చాయి రత్తాలుకి. కాయకష్టం చేసిన శరీరమేమో పురుడు తొందరగానే వచ్చింది. మగ పిల్లాడు పుట్టాడు. బిడ్డను చూసుకోవాలన్న తహతహతో ఉన్న సాగర్ దంపతులు పరుగున వచ్చారు. నర్సు బిడ్డను ఎత్తి వాళ్ళకు చూపించింది. కాని బిడ్డని చూసిన ఆనందం వాళ్ళకు కలుగలేదు, పాపం! ఎవరైనా సరే, తమ బిడ్డలు తమలాగే ఉండాలనుకోడం సహజం. సాధారణంగా అదే జరుగుతుంది కూడా. కాని, ఒక్కొక్కప్పుడు, మనలో నిద్రాణమై ఉన్న ఎన్నో తరాలనాటి జీన్సు ప్రభావం వల్ల, పుట్టిన పిల్లలకు కొన్ని తరాలవెనుక ఆ వంశంలో పుట్టిన వారెవరివో పోలికలు వచ్చే ప్రమాదం ఉంది. ఆ పిల్లల్లో తల్లితండ్రుల పోలికలు కనిపించవచ్చు, కనిపించకపోనూవచ్చు.
సరితాసాగర్లు స్ఫురద్రూపులు. వాళ్ళు తమలాగే అందమైన బిడ్డ పుడుతుందని ఆశించారు. కాని కొడుకుని చూసుకుని నిర్ఘాంతపోయారు. వాళ్ళు ఆశించిన విధంగా కాకుండా పుట్టిన పిల్లాడు వేరేగా ఉన్నాడు. నల్లని మేని చాయ, ఒళ్ళంతా విపరీతమైన నూగు, హేర్ లిప్! ఇవి చాలవన్నట్లు ఒక చేతికి ఆరు వేళ్ళు…. చాలా వికృతంగా కనిపిస్తున్నాడు ఆ పిల్లాడు. వాడిని చూస్తూనే నీరుకారిపోయారు, నిరాశతో మొహ మొహాలు చూసుకున్నారు సరితా సాగర్లు.
కళా విహీనంగా ఉన్న వాళ్ళ మొహాలవైపు చూసి చెప్పింది అక్కడే ఉన్న డాక్టర్, “మీరేం ఇదవ్వకండి. ఫరవాలేదు, పిల్లాడికి మూడవనెల వచ్చేసరికి ఇమ్యూన్ సిస్టం మెరుగౌతుంది. అప్పుడు ఆపరేషన్ చేసి అంగుడుని మామూలు స్థితికి తీసుకు రావచ్చు. అంతవరకు జాగ్రత్తగా చెంచాతో పాలు అంగుడులో పోసి తాగించ వలసి ఉంటుంది. ఈ ఒంటి రంగు క్రమంగా తగ్గుతుంది. పప్పీ ఫర్ కూడా ఎక్కువ రోజులు ఉండదు, రాలిపోతుంది” అంది వాళ్ళకు ఓదార్పు నివ్వాలని.
కాని వాళ్ళు దానిని నమ్మ లేదు. అదంతా బిజినెస్ టాక్‌గా భావించారు. తన మనోభావాలేమీ వ్యక్తమవ్వకుండా బిగపట్టుకుని “పిల్లాడిని మేము ఎప్పుడు తీసుకెళ్ళవచ్చు” అని అడిగాడు సాగర్ నిర్లిప్తంగా.
“బాలెంతరాలిని నాల్గవరోజున ఇంటికి పంపేస్తాము. పిల్లాడు ఇక్కడే ఉంటాడు. ఆ తరువాత మీరిద్దరూ మరో నాల్గు రోజులు క్లాసులకు రావలసి ఉంటుంది. పిల్లాడికి పాలు ఎలా తాగించాలో, పసివాడికి తల్లితండ్రులుగా మీ బాధ్యతలు ఏమిటో…అన్నీ, మీకు నేర్పిస్తాం. మీరు కూడా ఈ కొత్త జీవితానికి అలవాటుపడాలి కదా” అంది ఆ లేడీ డాక్టర్.