వానకూడా వింతే!
చుట్టపు చూపుగా వచ్చినవాళ్లు
చూసి పోవాలే తప్ప
ఉండి పోకూడదు
గదులు ఖాళీలుండవు
మదులూ ఖాళీలుండవు
కొంప కొల్లేరయినా
ఊరు వేగై అయినా
కొలువు తప్పదు
చెదిరిపోతుందని తెలిసినా
ముస్తాబు తప్పదు
వీధి గుమ్మంలోంచి
వెళ్ళిపోవాల్సిన వానలకి
నగరమెప్పుడూ సిద్ధం కాదు
డ్రైనేజీల్లేని నగరాలు
గొడుగుల్లేని జవరాళ్ళు
తడిసి తడిసి ప్రవహించడమేతప్ప -
వెలుతుర్లేని చీకట్లో
చెప్పకుండా వచ్చి వెళ్ళిపోతే మంచిది
ఉదయానికీ ఉద్యమానికీ
అడ్డు పడకూడదు
వానని ప్రేమించడానికి
ఆకుపచ్చని అడవిని ఊహించడానికి
స్థిమితం కావాలి
ఎప్పుడైనా వాన కురిసినరోజు
సెలవు ప్రకటిస్తే బావుణ్ణు
ఇంటిముందు కాగితప్పడవల్తో
దారాల వానలో
గెంతులేయచ్చు
ఘల్లునమోగే జల్లులో
జవరాలిలా
Dhanya అభిప్రాయం:
September 4, 2009 8:05 am
చాలా బాగుంది
చిన్నమయ్య అభిప్రాయం:
September 4, 2009 8:06 am
మన పైకప్పు కారనంతవరకూ వానకి స్వాగతమే! చుట్టపుచూపు తప్పనంతవరకూ, చుట్టాలూ ఆత్మీయులే! చుట్టాలొస్తే సెలవివ్వాలని వానతో ముడిపెట్టి బాగా సెలవిచ్చేరు.
అవేంశర్మ అభిప్రాయం:
October 23, 2009 5:02 am
ఎప్పుడో జారిపోయిన బాల్యం గురించి వానలో ఎదురు చూడడం గొప్పగా వుంది. జీవితంలో మర్చిపోయిన వాటిని పిల్లల ద్వారా తీర్చుకోవడానికి ఎదురు చూడొచ్చు. వాన ఎంతో మందిని ఉత్సాహపరిచింది. ఇది ఇలా కొనసాగుతూనే వుంటుంది. ఎదురు చూపులే జీవితానికి ప్రాణం.
yadlapalli Bharath kumar అభిప్రాయం:
October 31, 2009 2:39 am
నేను తెలుగు సాహిత్యాభిమానిని. చాలా రోజుల నుండి ఇలాంటి మంచి సాహిత్యం ఉన్న ఒక వెబ్ సైట్ కోసం వెతుకుతున్నాను. దాదాపు అన్ని అంశాలు నాకు నచ్చాయి. మీ కవిత చాలా సరళమైన పదాలతో వుండటం వలన నాకు బాగా నచ్చింది.
మారేపల్లి భిక్షం అభిప్రాయం:
March 7, 2010 6:21 am
నేను ఒక సాహిత్యాభిమానిని.ఎంత కాలమో ఈ అన్వేషణ ఇలాంటి వెబ్ సైట్ కోసం అనుకున్నాను .కాని చాల అ తొందరగా లభించింది.నేను ఇలాంటి సుందర వర్ణణాతితమైన కవితల కోసం ఎదురుచూస్తున్నాను.
వాన గురించి వర్ణన ఒక వింతగా అనిపించింది.చాలా చక్కటి వర్ణనలతో వర్ణించారు.