ఈమాట » తెలుగు నిఘంటువు గురించి…

Expand to right
Expand to left

తెలుగు నిఘంటువు గురించి…

చిన్నప్పుడు, హైస్కూలులో చదువుకునే రోజుల్లో, పెద్ద పెద్ద మాటలు కంఠతా పట్టి, సహపాఠకులతో మాట్లాడేటప్పుడో, ఎవరికన్నా ఉత్తరాలు రాసేటప్పుడో, ఆ మాటలు వాడెయ్యటం గొప్పనుకునే రోజుల్లో, అదొకపనిగా ఇంగ్లీషు డిక్షనరీ చూస్తుండేవాడిని. కాలేజీకి వెళ్ళిన తరువాత తెలిసింది; వాడుకలో లేని మారుమూల మాటలు, పదుగురితో మాట్లాడేటప్పుడు, పదుగురికోసం రాసేటప్పుడూ వాడటం ఆరోగ్యకరం కాదని!

మా రోజుల్లో విద్యార్థులు వాడుకోటానికి తెలుగు నిఘంటువు లేదు. మా తెలుగు మేష్టారే నిఘంటువు, మా పాలిట పెన్నిధి. ఆయన ఉభయభాషాప్రవీణ, శతావధాని, కవీ కాబట్టి పుస్తకంలో ప్రతిపద్యానికీ ప్రతిపదార్థం చెప్పేవారు. మేము రాసేసుకొనేవాళ్ళం. ఇప్పుడనిపిస్తున్నది, ఆయనకి శబ్దమంజరి, ఆంధ్రభాషార్ణవము, ఆంధ్రనామసంగ్రహం కంఠతా వచ్చి వుండాలి. ఒకవేళ అటువంటి ‘నిఘంటువులు’ ఉన్నాయని ఎవరన్నా చెప్పినా, అవి అందుబాటులో ఉన్నా, మాకు వాటిని చదవడం రావాలి కదా! ఆ పుస్తకాలేవీ వచనంలో ఉండేవి కావు; పద్యాల్లో ఉండేవి. ఒక పద్యంలో పదాలకి అర్థం తెలుసుకోడానికి మరో పద్యం చదవడం రావాలికదా! అది అప్పుడు.

ఇంతకీ, అసలు విషయం చెప్పబోయే ముందు, తెలుగులో నిఘంటువుల చరిత్ర క్లుప్తంగా గుర్తు చేస్తాను. ఆకారాదిక్రమంలో వచనంలో తెలుగు నిఘంటువు అవసరం అని గుర్తించి, పరవస్తు చిన్నయసూరిగారు, బహుజనపల్లి సీతారామాచార్యులు గారూ ప్రయత్నించారు. ఆపని పూర్తికాలేదు. తరువాత సీతారామాచార్యులు గారు శ్రీ శబ్దరత్నాకరము పొందుపరిచారు. “పూర్వ నిఘంటువులకంటె నిది బహువిధముల మేలైనదనుటకు సందేహములేదు,” అని జయంతి రామయ్య పంతులు శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రథమ సంపుటం (1936) తొలిపలుకులో శబ్దరత్నాకరం గురించి రాశారు. “కానీ, ఈ నిఘంటువు సమగ్రమైన నిఘంటువు కాదు. ఇందులో అర్థాలకు ఇచ్చిన ఉదాహరణలు చాలా తక్కువ. అట్లాగే, సి. పి. బ్రౌన్‌ పొందుపరిచిన తెలుగు - ఇంగ్లీషు నిఘంటువు (ప్రథమ ముద్రణ ప్రతి) కూడా సమగ్రమైన నిఘంటువు కాదు. ఇందులోనూ ఉదాహరణలు చాలా తక్కువ,” అని కూడా రాశారు.

‘తెలుగు భాషలో ఉన్న శబ్దరూపాలని, అర్థ భేదాలనీ సప్రమాణంగా తెలుపునట్టి బృహన్నిఘంటువు’ అవసరాన్ని గుర్తించి, 1930 ప్రాంతంలో అందుకు కావలసిన ధనసహాయం పూర్తిగా తానే చేస్తానని ప్రతిజ్ఞ చేసి, ఆంధ్ర సాహిత్య పరిషత్తుని ఆ పనికి ప్రేరేపించినది పిఠాపురం రాజా శ్రీ సూర్యారావు. ఆయన సహాయానికి కృతజ్ఞతాసూచకంగా ఈ బృహన్నిఘంటువుకి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు అని పేరు పెట్టారు.

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు మొదటి సంపుటం 1936లో విడుదలయ్యింది. 1949కి మొదటి నాలుగు సంపుటాలు, 5, 6, 7 సంపుటాలు 1957 లోను, ఆఖరిగా ఎనిమిదవ సంపుటం 1974 లోను విడుదలయ్యాయి. కారణాలు ఏమయితేనేం, సర్వ సమగ్రమైన తెలుగు నిఘంటువు ప్రచురించటానికి సుమారు నలభై సంవత్సరాలు పట్టింది! ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1979-82 మధ్య కాలంలో ఈ నిఘంటువుని పునర్ముద్రించారు. అదేదో మొక్కుబడికా అన్నట్టు, పూజల్లో ‘అక్షతాం సమర్పయామి’ అన్న ధోరణిలో 5000 కాపీలు మాత్రం పునర్ముద్రించారు. ఆ తరువాత మళ్ళీ అచ్చువేసినట్టుగా లేదు. మనకి ఉన్న ఈ ఒకే ఒక సమగ్రమైన నిఘంటువు ఈ రోజున మనకు దొరకదు. ఇది హాస్యాస్పదమే కాదు; అవమానకరం కూడాను!

ఈ నిఘంటువుని సంశోధన చేసి, పరిష్కరించి ప్రచురించాలని, వాడుకలో లేని మాటలని గుర్తించాలని, ఈ లోగా వాడుకలోకి వచ్చిన కొత్త తెలుగు పదాలని చేర్చాలని, వాటి వ్యుత్పత్తులు ఇచ్చి శబ్దసాధనకి అనుగుణంగా చెయ్యాలనీ, ఆధునీకరించి అందంగా అచ్చువెయ్యాలనీ, ఇలా రకరకాల సలహాలు ఇవ్వడానికి ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ మంచి సలహాలే! ఇవికాక ఇంతకన్నా మంచి సలహాలు కూడా ఉండి ఉంటాయి. సందేహం లేదు. అయితే, ఈ నూతన ప్రచురణకి కావలసిన హంగామా అంతా ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో జరగాలి గదా! ఒకవేళ శ్రీకారం చుట్టి ఈ పని మొదలుపెట్టినా, మార్పులు చేర్పులన్నీ పూర్త య్యేటప్పటికీ కనీసం పది-పదిహేను సంవత్సరాలు పడుతుందంటే మీరు కాదనరనుకుంటాను.

అంటే, బహుశా 2020 - 2025 నాటికి కొత్త సూర్యరాయాంధ్ర నిఘంటువు (New and Improved) బయట పడవచ్చు. అదీ నమ్మకం లేదు.

అందుకని, ప్రస్తుతానికి ఉన్న నిఘంటువుని పునర్ముద్రించి అందుబాటులోకి తేవడం పాపం కాదు. అది అంత కష్టమైన పని కూడా కాదు. తెలుగు విశ్వవిద్యాలయం ఈ పనికూడా చెయ్యలేని స్థితిలో ఉంటే, తానా(TANA) - ఆటా (ATA) వంటి సాంస్కృ తిక సంస్థలు ఈ పనికి పూనుకోవడం అవసరమంటాను. బ్రౌన్ నిఘంటువు (ఐతే, ఆన్లైన్ లో ఉన్నది ప్రథమ ముద్రణ ప్రతి కాదు. కుదించబడిన బ్రౌణ్యం)లాగానే, సూర్యరాయాంధ్ర నిఘంటువునునూ ఆన్లైన్లో ఉంచే ఏర్పాటు కూడా ఒక మంచిపనే.

ఇది, నా ఉచిత సలహా! మీరేమంటారు?

 

(33 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. rama bharadwaj అభిప్రాయం:

    September 1, 2009 2:57 pm

    1957 లో ముసునూరి వేంకటశాస్త్రి గారు ఒక 80000 పదాలతో..”శబ్దార్ధ దీపిక” ని రూపొందించారు. ఉన్న వాటిల్లో చాలా ఉపయోగకరమైన..చాలా కృషి తో కూడిన నిఘంటువు ఇది. ఇలాంటి నిఘంటువు గురించి తెలిసిన వారు కూడా తక్కువ అనుకుంటాను. ఈ నిఘంటువు గనక అచ్చులో లభ్యమైతే ఎంత మందికో ఉపయోగంగా ఉంటుంది.దీన్ని ముద్రించగల్గితే తెనుగు వారికి చాలా మేలు చేసిన వారౌతారు.1430 పేజీలకు పైబడి ఉన్న పుస్తకం ఇది.

    రమ.

  2. Sowmya అభిప్రాయం:

    September 1, 2009 11:30 pm

    ఆహా…మంచి తెలుగు నిఘంటువు ఆన్లైను లో దొరికితే ఎంత బాగుండు… ఎంచక్కా నెట్లో చదువుతున్నప్పుడు అర్థంకాని పదం కనబడ్డ ప్రతిసారీ ఆ నిఘంటువుకు వెళ్ళి చూడొచ్చు. ప్రస్తుతం ఉన్న వాటిలో ఏదీ నా సందేహాలను పూర్తిగా తీర్చడంలేదు :(

  3. mOhana అభిప్రాయం:

    September 2, 2009 5:29 am

    మంచి నిఘంటువు ఎంతైనా అవసరమే. నేను సూర్యాంధ్రరాయ నిఘంటువును
    నా కళ్లతో ఇంతవరకు చూచింది లేదు :-) కాని ఎనిమిది సంపుటాల నిఘంటువు సామాన్య విద్యార్థులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో? సామాన్య విద్యార్థికి కావలసింది చేతిలో పెట్టుకొని తిప్పి చూసికొని పదాలకు అర్థాలు తెలిసికొనేటట్లు ఉండే ఒక నిఘంటువు. అలాటిది ఎక్కడైనా ఉందేమో? జీ. ఎన్‌. రెడ్డిగారిచే పరిష్కరించబడి 1989లో తెలుగు విశ్వవిద్యాలయంచే ప్రచురించబడిన 868 పుటల “తెలుగు నిఘంటువు (విద్యార్థులకోసం)” బహుశా ఈ కొరతను తీరుస్తుందేమో?
    విధేయుడు - మోహన

  4. Dr.R.P.Sharma అభిప్రాయం:

    September 2, 2009 12:41 pm

    తెలుగు నిఘంటువుల విషయంలో ‘ఈ మాట’ వారి ఆవేదనలో ఎంతో అర్థం ఉంది. తెలుగు భాషకు ప్రాచీనభాషాహోదా వచ్చి ఒక సంవత్సరం పూర్తి కావచ్చిన ఈ సందర్భంలో ప్రస్తావించడం సందర్భోచితం కూడా. ఏ భాషాభివృద్ధికైనా నిఘంటువుల అవసరం ఎంతైనా ఉంది. తెలుగులో సంప్రదాయ నిఘంటువులతో పాటు కొన్ని ప్రత్యేక నిఘంటువులను సిద్ధం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకుగాను ప్రత్యేకంగా పండితసభలను ఏర్పాటు చెయ్యాలి.

    ఇక మీరన్నట్లు ఇది చాలా సమయాన్ని తీసుకునే ప్రయత్నం. అయినా వాటిని వేగంగా పూర్తి చెయ్యడానికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి. విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాలు విషయాలను పంచుకోవాలి. అక్కడ ప్రతీ ఆచార్యుడి పర్యవేక్షణలో విద్యార్థిగణాలను ఏర్పాటు చేసి, ప్రాజెక్ట్ వర్క్ గా ఇచ్చి సేకరణలు చేయించాలి. వాటిని ఆ ఆచార్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. వారికి కెటాయించిన విషయంలో ఎవరికి వారు వేగంగా పని పూర్తి చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఇంటర్ నెట్ ద్వారా సమాచార వినిమయం చేసుకోవాలి.దీనివల్ల విద్యార్థులకూ చక్కని శిక్షణ కలుగుతుంది. పనిలో వేగం పెరుగుతుంది. ఇటువంటి వాటివల్ల ఎన్నో రకాలైన నిఘంటువులను సిద్ధం చెయ్యడానికి అవకాశం ఉంది.
    ఇక ఆన్ లైన్ లో నిఘంటువులు దొరికితే ఎంత బాగుండూ? అనేది మంచి ఆశనే. ఒక్క నిఘంటువులే కాదు తెలుగులోని ప్రతి పుస్తకం ఆన్ లైన్ లో లభించాలనేది నా కోరిక. అలా లభించడం తెలుగువాడికి ఎంత అదృష్టం?
    ప్రస్తుతం ఆన్ లైన్ లో ఎక్కడో ఒకదగ్గర లభిస్తున్న శబ్దరత్నాకరం వంటి కొన్ని నిఘంటువులను తెలుగుపరిశోధన వెబ్ సైట్ సేకరించి ఒకేచోట అందుబాటులోకి తెచ్చింది.

  5. rama bharadwaj అభిప్రాయం:

    September 2, 2009 2:10 pm

    నేను ప్రస్తావించిన “శబ్దార్ధ దీపిక” చాలా మంచి నిఘంటువు. సీతారామాచార్యుల వారి “శబ్ద రత్నాకరం” కన్నా పదాల్ని వివరంగా పేర్కొన్న
    నిఘంటువు. ముసునూరి వేంకటశాస్త్రి గారి మూడవ ముద్రణని 1957 లో సికింద్రాబాద్ నించి దాచేపల్లి నరసయ్య& బ్రదర్స్ వారు
    ప్రచురించారు. ఆనాటి ప్రముఖ పండితులు ఈ నిఘంటువు ప్రాశస్త్యం వివరించి
    పేర్కొన్నారు. బ హుజనపల్లి వారి నిఘంటువుని మ ద్రాసు మిషనరీ సంస్థలు
    ప్రచురించిన కారణాన దాని ప్రతులు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. అదే ముసునూరి వేంకటశాస్త్రి గారి “శబ్దార్ధ దీపిక” ఉపయోగం అధికమైనప్పటికినీ..దాని పున: ప్రచురణ జరగనందువలన అది ఎక్కువ గా అందుబాటులోకి రాలేదు గనక ఇవాళ దాన్ని గురించి శ్రధ్ధ
    పెట్టటం మంచిది. ఏ గ్రంధాలయంలోనైనా. ఈ నిఘంటువు ప్రతి .ఒక్క కాపీ దొరికినా
    కనీసం..నెట్ లో పెట్టైనా..దీన్ని నలుగురి ప్రయోజనానికీ వీలుగా మళ్ళీ అందుబాటు
    లోకి తేవాల్సిన అవసరంవుంది. సూర్యరాయాంధ్ర నిఘంటువు కన్నా..బ్రౌణ్యం
    కన్నా..శబ్దరత్నాకరం కన్నా కూడా..ముసునూరి వారి “శబ్దార్ధదీపిక “ఉపయోగం
    ఎక్కువ .గనకనే దీని గురించి మరొకసారి చెబుతున్నాను. నిఘంటువుల గురించి
    తెలిసిన వాళ్ళు దీనిని సంపాదించి పరిశీలించ గలరు.
    రమ.

  6. Veluri Venkateswara rao అభిప్రాయం:

    September 2, 2009 6:14 pm

    మిత్రులందరికీ నమస్కారం.

    నేను ముందుగానే మనవి చేసుకున్నాను; మంచిమంచి సలహాలు కోకొల్లలుగా వస్తాయని. అయితే, ఈ మంచిమంచి సలహాలన్నీ ఆచరణసాధ్యాలా అన్నదే నా అనుమానం.
    విధ్యార్థులకు పనికి వచ్చే నిఘంటువు పునర్ముద్రించడం వద్దని ఎవరు అనగలరు? లేదా, విధ్యార్థులకి పనికి వచ్చే మరొక నిఘంటువు తయారుచేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అంటే నేను కాదంటానా?
    ఆ మాటకొస్తే ఉన్న నిఘంటులన్నీ ఇంటర్నెట్ లో పెట్టించి అందరికీ “ఉచితం”గా అందుబాటులోకి తేవడం మంచిది కాదని ఎవరు అనగలరు? ఇవన్నీ మంచి సలహాలే!

    పోతే, నేను సూర్యరాయాంధ్ర నిఘంటువు, బ్రౌణ్యం (మొదటిముద్రణ ప్రతి) లను ప్రత్యేకించి ప్రస్తావించడాని ముఖ్యకారణం: ఈ రెండు నిఘంటువుల కాపీరైట్ సాహిత్య అకాడమీ వారికి ఉండేది. ఇప్పుడు సాహిత్య అకాడమీ లేదుగా! ఆ కాపీరైట్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి చేతిలో ఉన్నది. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా? ప్రభుత్వం వారు కావాలనుకుంటే, ఈ రెండు నిఘంటువులనీ వెంటనే పునర్ముద్రించి అందుబాటులోకి తేవచ్చు. అంతకన్నా మంచిపని. ఈ రెండు నిఘంటువులనీ ఇంటర్నెట్ లో పెట్టించి అందరికీ “ఉచితం” గా అందుబాటులోకి తేవచ్చు. ఆతరువాత, తీరిగ్గా ఈ నిఘంటువులను సంశోధించి, పరిష్కరించడానికి పూనుకోవచ్చు. ఆపేరుమీదైనా ఇంకా బ్రతికిఉన్న కొద్దిమంది పెద్ద పండితులకీ(?) కాస్త భుక్తి దొరుకుతుంది.

    ఒకవేళ, ప్రభుత్వం వారు అల్లాంటి మంచి పనులు చెయ్యడం మాకు అలవాటు లేదు అని ఒప్పుకుంటే, అప్పుడు లాభాపేక్షలేని ఏ “సాంస్కృతిక” సంస్థో (ఆటా, తానాలవంటివి అని నాభావం!) ఈ పనికి పూనుకోవచ్చు. కాపీరైట్లు పేరుతో ప్రభుత్వం వారు అడ్డం రామని హామీ ఇస్తే చాలు, శుభం! ప్రభుత్వం వారు “అమ్మ పెట్టాపెట్టదు; అడుక్కో తినానివ్వదు,” అన్న స్థితిలో ఉంటే, అది చాలా విచారకరమైన విషయం.

    ఇతర నిఘంటువులకి కాపీరైట్ ఎవరితో ఉన్నదో కనుక్కొని, వారికి తగు పారితోషికం ఇచ్చి ( ఇప్పించి) అచ్చు వెయ్యడమో, లేకపోతే ఇంటర్నెట్లో పెట్టించి అందరికీ “ఉచితం” గా అందుబాటులోకి తేవడమో చేస్తే, (ఈ పని ఎవరు చేస్తారు అన్నది ప్రశ్న!) అంతకన్నా కావలసినది ఏమున్నది?

    అయితే, ఈ కాపీరైట్ వ్యవహారాలు పరిష్కరించడంలో అడ్డంకులు చాలా ఉన్నాయని నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను.

    విధేయుడు,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  7. rama bharadwaj అభిప్రాయం:

    September 3, 2009 1:01 pm

    ఒక సలహా ఆచరణ సాధ్యం ఎలా అవగలదో అందులోని సాధక బాధకాలతో సహా ఆలోచించ గలిగితేనే ఆ సలహాకి అrthaమూ పరమాrthaమూనూ!!

    కొత్త నిఘంటువులు తయారు చేసుకోగలిగితే మంచిది. అది జరగనప్పుడు కనీసం ఉపయోగించగల నిఘంటువుల్ని మళ్ళీ ఉపయోగంలోకి తెచ్చుకోవటమ్ ఉత్తమం. డబ్బు పెట్టి అచ్చు వేయగల సంస్థలకి కాపీరైటు వ్యవహారాలు పరిష్కరించడం మరీ కష్టమైన విషయం కాదు. సంప్రదింపులు ఒక సంస్థ తరుపున జరిపే వారుంటే..అన్నీ సాధ్యమే!! అడుగే కదపకుండా నడకే సాధ్యం కాదు కద!!

    ఇకపోతే, తెలిసిన సమాచారాన్ని నలుగురి దృష్టికీ తేవటం “ఉచిత సలహా” లాంటిది కాదు.

    రమ.

  8. Sreenivas Paruchuri అభిప్రాయం:

    September 3, 2009 5:45 pm

    ఆకారాదిక్రమంలో వచనంలో తెలుగు నిఘంటువు అవసరాన్ని పరవస్తు (BTW his three mss were never published!), బహుజనపల్లిల కంటే ఒక 60-70 ఏళ్ళ ముందే గుర్తించిన మనిషి మామిడి వెంకయ్య. ఆయన తయారు చేసిన “ఆంధ్ర దీపిక” 1816 నాటికే అచ్చయ్యింది. Probably this is the first alphabetical dictionary in Indic languages.

    తెలుగు నిఘంటువుల చరిత్రపైన చాలా పొడుగాటి వ్యాసమే రాయవచ్చు. A good summary is provided in: వెలగా వెంకటప్పయ్య “తెలుగు నిఘంటువికాసం” (తె.సా.అ,, హైదరాబాదు, 1975). This book also provides an extensive list of various dictionaries published in Telugu over 150 years.

    “[సూర్యరాయాంధ్ర నిఘంటువు] ఆ తరువాత మళ్ళీ అచ్చువేసినట్టుగా లేదు” అన్న మాట కూడా నిజం కాదు. 1987 ప్రాంతం వరకు 8 సంపుటాలుగా, తరువాత 6 సంపుటాలుగా (కేవలం 300 రూపాయిలకే, దానిపైన మరల 10 శాతం రాయితీతో!) తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించి అమ్ముతున్నారు. గత 2-3 సంవత్సరాలలో చెప్పలేం కాని 2005-06 వరకు పూర్తి సెట్ మార్కెట్‌లో అందుబాటులో వుంది.

    ముసునూరి వారి నిఘంటువులన్నీ (ఆయన 1971లో 2 భాగాలుగా చేసిన “ఆంధ్రనామ సర్వస్వము - అచ్చతెనుగు నిఘంటువు” కలుపుకొని) 2035 వరకు కాపీరైట్ చట్టం క్రిందకొస్తాయి. “కాపీరైటు వ్యవహారాలు పరిష్కరించడం మరీ కష్టమైన విషయం కాదు.” లాంటి వాక్యాలు రాయడం తేలిక. కొన్ని నిఘంటువులకి, చాలా పుస్తకాల పునర్ముద్రణకి హక్కుదారులను సంప్రదించిన అనుభవంతో చెప్తున్న మాటలివి!

    శ.రత్నాకరం “మ ద్రాసు మిషనరీ సంస్థలు ప్రచురించిన కారణాన దాని ప్రతులు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి.” అన్న మాట నిజం కాదు. శ.ర, దానిని అసలు కూర్చినదెవరు, దాని మూలాలేమిటి, రాస్తూ పోతే మరో పెద్ద వ్యాసమవుతుంది.

    “ఆంధ్ర నిఘంటుత్రయము - సటీకము” అన్న పేరుతో “ఆంధ్రనామ సంగ్రహము, ఆంధ్రనామ శేషము, సాంబ నిఘంటువు” ఇప్పటికీ ముద్రణలో వున్నాయి. అలాగే విద్యార్థి కల్పతరువు లాంటి నిఘంటువులు కూడా.

    Theres no copyright on CPB’s dictionary. Nor on Bahujanapalli’s. The copyright for సూర్యరాయ… is claimed by Telugu university.

    చివరిగా వేలూరిగారు ప్రతిసారి తానా, ఆటాల మీదెందుకు పడతారో అంతు చిక్కని విషయం.

    Here is an open request to one and all. Get us the CR permission from TU and we will put సూర్యరాయాంధ్ర on-line in one year’s time. For other dictionaries that don’t fall under CR law, watch these pages.

    – పరుచూరి శ్రీనివాస్
    – వాడపల్లి శేషతల్పశాయి

  9. rama bharadwaj అభిప్రాయం:

    September 4, 2009 1:10 am

    శబ్దరత్నాకరం నిఘంటువు కూర్పు గురించీ..బ హుజనపల్లి సీతారామాచార్యుల వారి పేర అది చెలామణీ అవటం గురించీ ఆదిగా గల సమ స్త దుమారాలూ..నాకు తెలుసు. కానీ ప్రస్తుత విషయం అది కాదు గన్క
    వాటి ప్రస్తావన నేను తేలేదు.

    కాపీరైటు అన్న ది పరిష్కరించలేని సమ స్య గానే ఉంటే వాటి కాల పరిమితి
    దాటేదాకా ఎదురుచూస్తూ ఉంటే..ఈ లోగా వాటి ప్రయోజనం కొండెక్కాల్సిందే!!
    నిఘంటువుల ప్రచురణ డబ్బుల్తో కూడిన వ్యవహారం గాన..దాన్ని గురించి ఎంత బాధ్యత కలిగినా..ఎంత ఆసక్తి కలిగినా వ్యక్తులెవరూ వ్యవహరించగలిగే విషయాలు కావు. ఏ సంస్థలైనా సరే చేస్తే అవే చేయాలి మరి.ఇవన్నీ మీరన్న ట్టు కష్టపడితేనే గానీ అందుబాటు లోకి రావు.అయితే ఆ కష్టం ఎవరు పడతారూ?? అన్న ది సైతం అంతే ముఖ్యమైన విషయం.”శబ్దార్ధ దీపిక” ని రూపొందించే అనుభవంలో తన ఆరోగ్యం ఎంతగా పాడైపోయిందీ ప్రస్తావిస్తారు ముసునూరి వారు. అంత కష్టం ఆయన పడితే ఆయనకు ఆర్ధికంగా ఏమీ ఒన
    గూరింది లేదు..అనారోగ్యం తప్ప.

    రమ.

  10. mOhana అభిప్రాయం:

    September 4, 2009 11:17 am

    There is a Telugu-English dictionary by the Rev P Percival published in 1862 and also a dictionary of mixed Telugu that contains words from other languages (mainly Urdu) by C P Brown published in 1854 available for free download from Google. The latter బ్రౌణ్య is quite interesting. Regards! - mOhana

  11. జవిక్ శాస్త్రి అభిప్రాయం:

    September 4, 2009 12:29 pm

    రమగారు, వేలూరిగారూ, పరుచూరిగారూ ఒక విషయం అర్థం కాదండీ - సంస్థల దగ్గర జనాల దానం డబ్బులున్నాయనా, లేక మన డబ్బులు ఖర్చు కాకూడదనా - చిన్నపనికీ, పెద్దపనికీ వాటి ప్రస్తావన ఊరకే ఎందుకు ? మన జేబులో డబ్బులు ఖర్చు కాకూడదు అని నియమం ఉన్నట్టయితే గాడిద కాళ్ళు కూడా పట్టుకోవచ్చు…..ఏ పనయినా ఒక వ్యక్తి మొదలెట్టాల్సిందే, సంస్థలు కాదు. అలా సంస్థలకోసం చకోర పక్షిలా ఎదురు చూడ్డం ఎక్కువయిన రోజు, కురిసే వానలు తక్కువైపోతాయి. సారాంశం అర్థమయ్యిందనే అనుకుంటున్నాను.

    అసలు పనంటూ మొదలెడితే ఆసక్తి ఉన్న జనాలు, మీలాటి వారో, మరెవరో జేరతారూ. పనీ ఆటంకాలెదురయినా సాగుతుందీ. ముసునూరి వారు డబ్బులకోసం చూసుకుని ఉంటే, నిఘంటువూ ఉండేదీ కాదు -మీరు ఇప్పుడు ఆయన్ని తలచుకునేవారూ కాదు. ఒక వేళ మన సామర్థ్యం మీద మనకే నమ్మకం లేకపోతే - అంటే తగిన “టెక్నాలజీ” బలం లేదూ అనుకుంటే, చేసిన, చేస్తున్న పనిని ప్రూఫ్ రీడింగో ఏదో ఒకటి చేసి ఆ పనికి సాయపడొచ్చు. ఇంతలేసి దస్త్రాలు దస్త్రాలు కామెంట్లు రాసేవాళ్ళకు ఆమాత్రం సమయం దొరకకపోదు అని అనుకోను, అసలు సాయం చెయ్యాలి అనే తపనే లేకపోతే తప్ప.

    దుమారాలు, గాలివి కానివ్వండి, ఇసుకవి కానివ్వండి, టెంటులో దూరిన ఒంటెల సంగతి పక్కన బెట్టి, ముందు కాపీరైట్ల సంగతి చూడాల్సిందే. ఎవడు కనిపెట్టాడో కానీ, ఈ కాపీరైట్లు (ఆపైన “ఇంటలెక్చువల్” మోసగాళ్ళనుంచి కాపాడుకోటానికి అని దానికో మేలిముసుగు) - సిద్ధాంతం, శాస్త్రం ప్రకారం ఒక అవిడియా తమరి బుర్రలో ఉన్నంతవరకే తమరిది, ఒకసారి దాన్ని బయటకు తోలేసాక ప్రపంచానిది. ఏం సిద్ధాంతమో, ఏం శాస్త్రమో ఆ ఏడుకొండలవాడికే తెలియాలె అంటే మటుకు, ఇక్కడ చిద్విలాసమే! సరే ఎలాగూ ఒకడు ఈ కాపీరైటు అనేది కనిపెట్టి గొర్రెల మంద మీదకు తోలాడూ, గొర్రెలు తలూపాయి, వాటివెంటే నడుస్తున్నాయి. మరి నాణ్యమయిన ఉన్ని కావాలంటే, ఆ గొర్రెల తోలు తీయాల్సిందే. అంటే కాపీరైటు తోలు తీయాల్సిందే. అంటే ఆ కాపరి వెనక పడాల్సిందే, ఊలు తెచ్చుకోవాల్సిందే.

    ఉపయోగం సంగతి తరువాత, కొండెక్కినా, చెట్టెక్కినా చేసేదేమీ లేదు. కాపోతే ఓ పని చెయ్యచ్చండోయి, మన ఈమాట సంపాదక వర్గంలోని సభ్యులు, పెద్ద తలకాయలు పూనుకుంటే, పర్సనల్ ఇంఫ్లుయెన్సుతో , కాపరికి ఆశచూపో, అది కుదరకపోతే వాతలెట్టో దారికి తీసుకురావచ్చు. పూనుకోవాలి మరి. చెప్పొచ్చావులే ఆ పని చేసి చేతులు మూతులు ఇక్కడ కాల్చుకున్నోళ్ళు ఉన్నారు అంటే చేసేదేమీ లేదు. నాకు తెలిసిన వారితో ప్రయత్నం ఆరంభించాను. ఎంతవరకూ సాగ దీయగలనో చూస్తాను. ఆపైన ఒక గుంపులాటిదేదయినా మొదలెడితే రోజుకో గంట సమయం వెచ్చించగలను.

    అదండీ క్ఌప్తంగా సంగతి (ఇదేంటీ ఇలా క్లుప్తం ఇలా రాశాడనుకుంటున్నారా? నేను ఎప్పుడూ ఇలానే రాస్తాను, మర్చిపోయిన ” ఌ ” ని గుర్తుచేసుకుంటూ) . ఇది రాయటానికి పట్టిన సమయం సుమారు 4 నిముషాలు. 4 నిముషాల్లో ఇంత రాయగలిగితే అరగంటలో ఏ పనికయినా ఇంకెంత సాయం చెయ్యొచ్చో అని అబ్బురపడవచ్చు. ఇంతే సంగతులు చిత్తగించవలెను. రేపు ఇదే టపాని మళ్ళీ వీక్షించి, ఎవరయినా సమాధానమో కార్యాచరణప్రణాలికో రాస్తే, దానికి సంసిద్ధత వ్యక్తం చేయటానికి సదా సిద్ధం అని తెలియచేసుకుంటూ

    జవిక్ శాస్త్రి (జలసూత్రం విక్రమార్క శాస్త్రి )

  12. K. V. S. Ramarao అభిప్రాయం:

    September 4, 2009 3:55 pm

    Most of the posts here on Copyright issues show total ignorance about this concept. While I don’t claim to be expert on this, I did attend Law school for some time (but do not practice Law) and have the basic background to make a reasonable interpretation of legal documents. With this, let me clarify a few points: a) the “fair use” doctrine allows any one who legally obtained a copyrighted object to make copies for non-commercial use; the applicability of this in the present context is that it is ok to make an electronic copy of a book without the author’s permission (assuming the original was obtained by legal means) and use it for purposes where the user does not make any monetary or other gains out of this, b) this does not mean that one can distribute any copyrighted object’s copies for free; the opposing factor to be considered is whether the market for the object is adversely impacted by any such action; for instance, if a book has not sold a single copy in the last 10 years, a case can be made that one can distribute its copies for no gain and still not have any adverse impact on the market for that book (not totally foolproof but puts some ground to stand on). One practical consequence is that no one should be afraid of making an electronic copy of a dictionary for future use, particularly if there is a possibility that that book will be lost forever otherwise. Once such a copy is made, one can then think of the next step, i.e., how far can its distribution go. Obviously, there can be no monetary gain. And, it shouldn’t adversely impact the market. This would indicate that an unrestricted distribution by posting on the web may be going too far but restricted to a small group, particularly for educational or research purposes, may be justifiable. Again, legally speaking, all these issues matter only if there is a good chance that the person holding copyright can sue you. Even then, to limit exposure, there are ways to form legal entities that remove individuals as potential targets.

    Bottom line: if there is a book we fear may be lost forever due to the unreasonable behavior of the copyright holder, any one who has the means can go ahead and may make a copy, either electronic or on another medium. In the worst case, that copy can be kept unseen by any one else until the copyright expires.

    For a more authoritative but legal description of the “fair use” doctrine, pls see http://www.law.cornell.edu/uscode/pdf/uscode17/lii_usc_TI_17_CH_1_SE_107.pdf

  13. Rohiniprasad అభిప్రాయం:

    September 4, 2009 5:02 pm

    నేను ముసునూరివారి లఘుశబ్దార్థదీపికతో ప్రస్తుతం పనికానిస్తున్నాను. ఇది నాకు హైదరాబాద్‌లో 1982లో 20 రూపాయలకే దొరికింది. ఆ తరవాత 1997లో తెలుగు యూనివర్సిటీతో సంబంధం ఏర్పడినప్పుడు సూర్యారాయాంధ్ర నిఘంటువు ఆరు సంపుటాలూ కొనుక్కున్నాను. అక్కడి మిత్రులు మంచి డిస్కౌంట్ కూడా ఇప్పించారు. సూర్యారాయాంధ్ర నిఘంటువు చూస్తున్నప్పుడు మనం కొన్ని పదాలకి మామూలుగా అనుకునే అర్థాలు తప్పనీ, అసలు అర్థం వేరే ఉందనీ తెలిసేది. ఇవికాక చిన్నవి thesaurus వంటివి కూడా దుకాణాల్లో దొరుకుతున్నాయి. కొంతవరకూ వీటితో పని జరిగిపోతుంది. నిఘంటువులు దగ్గరుండడం తెలుగు రాయడం, చదవడం చేసేవారికి చాలా ఉపయోగకరమే. ఆన్‌లైన్ సదుపాయం ఎప్పుడో ఒకప్పుడు ఏర్పడుతుందనే అనుకుంటున్నాను. సామాన్యంగా రచయిత మరణించిన 50 ఏళ్ళ తరవాత కాపీరైట్ ఉండదు. అంతవరకూ రచయిత వారసుల హక్కులను గౌరవించడంలో తప్పులేదనుకుంటాను.

    నేను కాలనిర్ణయ్‌లో ప్రచురించే వ్యాసాలకు రచయితలకూ, వారి వారసులకూ అడ్రస్ కనుక్కుని తప్పక పారితోషికం అందించే ఏర్పాట్లు చేస్తూ ఉంటాను. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకసారి నేను పి.వి.నరసింహారావుగారి వ్యాసానికి అలా చెయ్యబోతే ఆయన జవాబు రాసి, సున్నితంగా అవసరం లేదని అన్నారు.

  14. K. V. S. Ramarao అభిప్రాయం:

    September 4, 2009 7:58 pm

    One more point I forgot to mention in my previous comment (this is in the context of what is called the No Electronic Theft (NET) Act): prior to NET Act, even wilful, wide, distribution of unauthorized copyrighted material, as long as no financial gain is expected, was not considered an infringement (in rough terms). This Act closed that loophole, but opened a new one - it removed financial gain as a necessary condition; but the total value of the “stolen” material should exceed $1000 in a 180 day period to attract its applicability. This is an escape valve for many of the situations that the other posters have been worried about.

    My point is: don’t let the phantom fear of Copyright stop you at the very first step of a sequence of steps that may ultimately lead to distribution over the web. There are many intermediate stages that are quite safe.

    In principle, one can reprint a book without permission, as long as the total “value” of all the copies is no more than $1000, and the reprinter gets no financial gain out of it. For instance, you reprint a book valued at Rs. 50 and print 1000 copies (assuming a $1 = Rs 50 conversion, for simplicity) and give them all away for free, you should be alright under the above Act !

  15. బొల్లోజు బాబా అభిప్రాయం:

    September 5, 2009 1:48 am

    అప్రస్తుతమైన చిన్న సందేహం
    బ్రౌణ్ నిఘంటువు కన్నా ముందే, ఒక ఫ్రెంచ్ అధికారి తెలుగు నిఘంటువును (తెలుగు - ఫ్రెంచ్ మరియు తెలుగు -ఇంగ్లీషు) తయారు చేసాడని, అది ఇప్పుడు లూవ్రె మ్యూజియంలో ఉందనీ మా యానంలో పెద్దలు చెప్పుకోవటం నాకు తెలుసు. నిజమేనా.. మరొక అభియోగం ఏమిటంటే ఈ ఫ్రెంచి అధికారి కూర్చిన తెలుగు ఇంగ్లీషు నిఘంటువే బ్రౌణ్ నిఘంటువు తయారీకి ప్రేరణ అయ్యిందనీ.
    మిత్రులు ఎవరైనా విషయాల్నిత్తెలుసుంటే పంచుకోగలరు.

    పరుచూరి శ్రీనివాస్ గారు ఏమైనా చెపుతారని ఆశిస్తాను.
    భవదీయుడు
    బొల్లోజు బాబా

  16. బొల్లోజు బాబా అభిప్రాయం:

    September 5, 2009 2:12 am

    the work is undertaken by frech jesuit missionaries. they produced two telugu-sanskrit dictionaries in 1750 and 1760. three telugu french dictionaries in 1727,1750 and 1800 respectively. father pierrede la lane also produced a telugu grammer book in 1729 from pondicherry. All these six works are preserved in the national library in paris in manuscript form.

    reference:: the telugus of yanam and masulipatnam. author jbp more.

    i was told by elders of yanam that there was also a telugu english dictionary compiled by the french people in the above said peak periods. and it formed a base to brown dictionary.

    can any body throw some light on this?

  17. Sreenivas Paruchuri అభిప్రాయం:

    September 5, 2009 6:22 pm

    బాబా గారు,

    బ్రౌన్ నిఘంటువుపైనున్న అభియోగాల గురిచి మరో సారి వివరంగా మాట్లాడుకుందాం.. మీరు ప్రస్తావించిన, సంస్కృత, తెలుగు నిఘంటువుల వివరాలు ఈ క్రింది పుస్తకం/కాటలాగ్ లో చూడవచ్చు. గత 6 నెలలుగా ఈ కాటలాగ్ on-line లో లభ్యం.

    Manuscrits telugu : catalogue raisonné / établi par Gérard Colas et Usha Colas-Chauhan. - Paris : Bibliothèque Nationale de France, 1995. - 117 pp. : Ill. - ISBN 2-7177-1928-8

    http://gallica.bnf.fr/ark:/12148/bpt6k2557038
    http://groups.yahoo.com/group/racchabanda/message/20634
    http://groups.yahoo.com/group/racchabanda/message/1500

    Regards,
    Sreenivas

  18. బొల్లోజు బాబా అభిప్రాయం:

    September 6, 2009 2:09 pm

    శ్రీనివాస్ గారూ
    థాంక్సండీ మంచి సమాచారం ఇచ్చారు.
    మీరిచిన్న లింకులోని పుస్తకం కాటలాగులాగ ఉన్నది. ఆఖరున ఇచ్చిన ప్లేట్ లలో ఆనాటి ఫ్రెంచి వారు తెలుగునేర్చుకొని వాటి తర్జుమాలను వ్రాసుకోవటం అబ్బురపరచింది. రెండిటి చేతి వ్రాతా ఒకరిదే ననుకొంటున్నాను. గమనించారా?

    ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉండిన తెలుగు వారిలో ఎవరైనా శ్రమిస్తే వాటి మ్యాను స్క్రిప్టులు సేకరించగలిగే అవకాసం ఉంటుందనిపిస్తుంది. గోపీ గారి టైములోలా మరీ ఎక్కువగా శ్రమించక్కరలేదేమో ఈ కాలంలో. ఈ కేటలాగుని కూడా ఎవరో ఎడిట్ చేసినట్లు అనిపిస్తున్నది. అక్కడక్కడా తెలుగుయూనివర్సిటీ అంటూ ఆరుద్ర సమగ్రాంద్ర సాహిత్యం అంటూ రిఫరెన్సులు కన్పించాయి.

    any how i knocked a right door. it seems you are in touch with these affairs since february 2009.
    i once again wonder you zeal and passion for telugu.

    bolloju baba

  19. బొల్లోజు బాబా అభిప్రాయం:

    September 6, 2009 2:11 pm

    మరొక విషయం నే లేవనెత్తిన బ్రౌణ్ నిఘంటువు ప్రేరణ గురించి కూడా ఏదో ఒక ముగింపు పలికేయండి. సాధికారికంగా ఉంటుంది. :-) టెన్షను తట్టుకోలేక పోతున్నాను.

  20. Anuradha Jayanti అభిప్రాయం:

    September 9, 2009 9:32 am

    Dear Sir,
    I have an idea. These days email has become a daily routine for half the planet, and out of them I can say with confidence many are Telugu. I am subscribed to this email called wordsmith for English, which is compiled by Anu Garg. Everyday she gives a word and writes about the history, and usage. Why can’t we do the same for Telugu? It would be great if you can start such a group and I am sure there will be so many people happy to subscribe and learn our beloved language.
    Regards,
    Anuradha Jayanti

  21. Rohiniprasad అభిప్రాయం:

    September 9, 2009 12:24 pm

    http://eenadu.net/sahithyam/main.asp
    అనూరాధగారు చెప్పినలాంటిది ఈనాడువాళ్ళు చేస్తున్నట్టున్నారు.

  22. Srinivas Nagulapalli అభిప్రాయం:

    September 15, 2009 2:51 pm

    చాలా మంచి అంశం, అవసరమయ్యే విషయంపై వ్యాసం. చాలా కృతజ్ఞతలు.

    తెలుగు నిఘంటువు అంటే ఒకే రకం font, style లో అచ్చేసిన అక్షరాల కుప్ప అనుకునే నాకు, తూమాటి దొణ్ణప్ప గారు పిల్లలకోసమని చేసిన కృషి బాగా నచ్చింది. పదాలకు సరళమైన అర్థాలేకాక, వీలైనన్ని బొమ్మలు ఇవ్వడం వారి నిఘంటువులో మాత్రమేనేమో తెలియదు. ఇంకా మెరుగైన నిఘంటువులు కావాలి, రావాలి. ఏది బాగుందో తేల్చుకోవడం, పోల్చుకోవడం choice ఉంటేనే! చెట్లు లేని కాడ ఆముదం చెట్టే గొప్ప చందాన దొరికిందే భాగ్యం ఇప్పటి స్థితి.

    ఇంగ్లీషు సామెత “Use it or lose it” అన్నది ఒక్క physical abilities, mental abilities కు మాత్రమే కాదనిపిస్తుంది. పదాలు జనాలు వాడితేనే నిలుస్తాయి. సరిగ్గా వాడడానికి మంచి నిఘంటువుకు మించిన సాయం లేదు. తెలుగు భాషాజ్ఞానం ఎక్కువగా ఉన్న తక్కువమంది తోనే ఇది సాధ్యం. సంస్థలు సంఘాలు, ఎకాడమీలు ప్రోత్సాహం, డబ్బు ఇచ్చినా_ అసలు ఇంకే పని చేసినా ఎక్కువ డబ్బులు, పేరు వచ్చే రోజుల్లో_ ఈ పని నెత్తుకెత్తుకునే తెగువ, స్ఫూర్తి, దానికోసం సుధీర్ఘంగా శ్రమించే శక్తి, పూర్తికాకుండా పంచుకోవడానికి వీలుకాని ప్రాజెక్టు వ్రతం_ అంతా నిస్వార్థ భాషాసేవ అని కూడా అనిపిస్తుంది!
    _____
    విధేయుడు
    _Srinivas

  23. Rohiniprasad అభిప్రాయం:

    September 15, 2009 5:12 pm

    Use it or lose it అనేది ఎంత నిజమో నాకు తెలుగు విశ్వవిద్యాలయంవారి మాండలిక వృత్తి పదకోశాలు కొని చదివినప్పుడు అర్థమయింది. సంస్కృతంతో సంబంధం లేనటువంటి అచ్చతెలుగు పదాలు ఎన్ని వేలున్నాయో అవి చూస్తేతప్ప తెలియదు. అయితే నిత్యజీవితంలో మనకు తగలని విషయాల, వస్తువుల గురించిన మాటలు ఎన్ని ఉన్నప్పటికీ మనం వాటిని ఉపయోగించే సందర్భం రాకపోవచ్చు. అయినా వాటిని చూసినప్పుడు కొత్తపదాలు ఎలా తయారుచేసుకోవచ్చో కొంత తెలుస్తుంది.

    ఆత్మగౌరవాన్ని ఒక ఉద్యమంగా చేపట్టిన తమిళులు ఎన్నో పదాలను సంస్కృతంపై ఆధారపడకుండా తయారుచేసుకుని ఉపయోగిస్తున్నారు. మనకు ముఖ్యమంత్రి నియామకం దగ్గర్నుంచి ప్రతి విషయమూ ఉత్తరాదిలోనే నిర్ణయం జరగాలి.

  24. Kameswara Rao అభిప్రాయం:

    October 1, 2009 8:52 am

    ఇంత చర్చా అయ్యాక ఇప్పుడు నేనడిగేది చొప్పదంటు ప్రశ్నలా ఉంటుందేమో కాని, అడక్కుండా ఉండలేకున్నాను. ఇక్కడ చర్చిస్తున్న ఈ నిఘంటువులు అసలు ఎవరికోసం?
    బడిలో పిల్లలకోసమా? వాళ్ళకి తెలుగు నిఘంటువు చూసే అవసరమూ తీరికా రెండూ లేవు.
    తెలుగు చెప్పే పంతుళ్ళకీ, తెలుగు సాహిత్యాభిమానులకీనా? వీళ్ళకైతే ప్రాచీన కావ్యాలని అర్థం చేసుకోడానికి తప్పిస్తే వేరే ఏమైనా అవసరం ఉంటుందా? దానికి ఇప్పటికే ఉన్న శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్ర నిఘంటువు సరిపోతాయి కదా? (పరుచూరిగారు చెప్పినట్టు, సూ.ని. అచ్చులోనే ఉంది నాలుగేళ్ళ కిందటివరకూ)
    పోనీ తెలుగు టీవీ, పేపర్ల జర్నలిస్టులకా? హహహ :)
    ఇక మిగిలింది తెలుగురాని వాళ్ళు తెలుగు నేర్చుకోడానికి. సాధారణమైన తెలుగు పదాలకి అర్థాలు కావాలంటే బ్రౌణ్యం 90% వరకూ సరిపోతుందనే అనుకుంటాను. బ్రిటిషు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత, తెలుగులో సృష్టించబడ్డ కొత్తపదాలన్నీ ఇంచుమించుగా ఇంగ్లీషునుంచి వచ్చినవే కాబట్టి వాటిని అర్థం చేసుకోడం పెద్ద కష్టం కాదు. మరీ సంస్కృత పదాలైతే సూ.ని సరిపోతుంది. మాండలిక పదాలైతే ఆయా పదకోశాలు తిరగెయ్యాలి.
    ఇంకా కొత్త నిఘంటువులు ఎవరికోసం చెప్పండి?
    అంచేత నా ఉద్దేశంలో కొత్త నిఘంటువు కోసం ఆలోచించే కన్నా, ఉన్నవాటిని డిజిటైజ్ చేసి ఇంటర్నెట్లో పెట్టే ప్రయత్నం అత్యుత్తమమైంది. దీనికి నేను సైతం ఏమైనా చెయ్యడానికి సిద్ధం.

  25. అనిలు అభిప్రాయం:

    October 4, 2009 10:41 pm

    తెలుగుఁ వారికిఁ జాలినంత తెలుఁగుబాస కలదు; వారు పరభాషా దాస్యమునకుఁ జేతులొగ్గవలసినది లేదు” అంటు, “అచ్చతెలుగు కోశము” (రెండు సంపుటాలు) ని 1979 లో పోతుకుచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి (శ్రీ శ్రీనివాస భవనశ్రీ - నెం 22-7-7, మోటుపల్లి వారి వీధి, కొత్తపేట, తెనాలి-522 201, గుంటూరు జిల్లా, ఆం. ప్రదేశ్ ) గారు వెలువరించారు. ఆవుల సాంబశివరావు గారు కృతికర్త. ధర (50+50) వంద రూపాయలు.
    మనకి నిఘంటువులు లేకపోలేదు. కాని వాటిని పట్టించుకుంటున్నామా అన్నది ప్రశ్న.

  26. Srinivas Nagulapalli అభిప్రాయం:

    October 8, 2009 12:58 pm

    ఇంటర్నెటులో నిఘంటువులుంటే నిజంగా ఎంతో మేలు. బ్రౌన్‌ నిఘంటువు (అసమగ్రమైనా) తెలిసిందే.

    అర్థాలు చెప్పి వాటికి పద్యాలనుదహరించే నిఘంటువులున్నాయి. కాని, పదాలు సరిగ్గా, అందంగా, స్పష్టంగా వచనంలో వాడడానికి సూచనలిచ్చే నిఘంటువులు లేవు, English లో usages చెప్పినట్లు. చిన్ని ఉదాహరణ: చెరువుకు “గండి” పడి వరదలు అని వార్త. “గండి” కి 1)బిలము 2) రంధ్రము 3) సందు 4)నీళ్ళు ఎక్కువైనప్పుడు కట్ట తెగుట అర్థాలు ఉన్నాయి(శబ్దరత్నాకరములో) . 4వ అర్థమే ఎక్కువగా వాడడం తెలుసు. ఒక గోడకో, బట్టకో రంధ్రం పడితే “గండి పడింది” అనడం వినలేదు_అనొచ్చో లేదోతెలియదు. Usages ఇస్తే ఇట్లాంటివి మెరుగ్గా తెలుసుకునే అవకాశం ఉందనిపిస్తుంది.

    తెలియని పదాల అర్థాలనే కాక, తెలిసినట్టు అనిపించే పదాలు సైతం సార్థకంగా వాడడానికి నిఘంటువులు ఉపయోగపడుతాయి కదా. ఆ దృష్టితో ఇంకొంత సాయం చేయడానికి, భాష వాడుకను మరింత పటిష్టపరుస్తూ చేయూత నివ్వడానికి మార్గదర్శకంగా కొత్త నిఘంటువులు ఉంటే లాభం అని కూడా అనిపిస్తుంది.
    _________
    విధేయుడు
    Srinivas

  27. బొల్లోజు బాబా అభిప్రాయం:

    October 10, 2009 7:14 am

    అంచేత నా ఉద్దేశంలో కొత్త నిఘంటువు కోసం ఆలోచించే కన్నా, ఉన్నవాటిని డిజిటైజ్ చేసి ఇంటర్నెట్లో పెట్టే ప్రయత్నం అత్యుత్తమమైంది. దీనికి నేను సైతం ఏమైనా చెయ్యడానికి సిద్ధం

    కామేశ్వరరావు గారి అబిప్రాయం అద్బుతంగా ఉంది.
    నా అభిప్రాయాలు:
    తెలుగులో థిసారస్ లాంటి నిఘంటువు (దానిని నిఘంటువనచ్చా?) ఉన్నాయా? ఉంటే, పెద్దలు తెలుపగలరు. ఇంటర్‌నెట్ కు సంబందించి విక్షనరీ, బ్రౌన్ నిఘంటువులు సరిపోతాయనే అనిపిస్తుంది. విక్షనరీ లో బ్రౌన్ నిఘంటువులోలేని కొన్ని ఆధునిక పదజాలాన్ని కూడా పొందుపరచటాన్ని గమనించాను. ఆధునికావసరాలకు తగ్గట్టుగా కొంత మార్పు చేసారు

    ఇక పోతే,
    పర్యాయపదకోSaM ఇంటర్నెట్లో లేదు. దానికొరకు పెద్దలెవరైన దృష్టి పెట్టినట్లయితే నేనో వందపేజీలు టైపు చెయ్యటానికి సిద్దం.
    అచ్చుగా థిసారస్ ఫార్మెట్ లో తెలుగులో ఏమైనా పుస్తకాలున్నాయా అనేది తెలిసిన వారెవరైనా తెలుప గలరు. లేనట్లయితే ఆ దిశలో ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో

    బొల్లోజు బాబా

  28. Srinivas Nagulapalli అభిప్రాయం:

    October 10, 2009 10:50 pm

    ఉన్నవాటిని, అంటే, మనకు దుకాణాలలో దొరికేవాటిని digitize చేసి ఇంటర్నెటులో పెట్టడం మన ఉద్దేశం కాదనుకుంటాను.

    ఎంతో కొంత ధరకు, కాదు, కొంత ధరకే దొరికే వాటిని digitize చేయడం మూలాన కలిగే ఇంటర్నెటు సౌకర్యానికి, ఆ పాటి కాపీలు అమ్ముకొని బతికే ప్రచురణకర్తల ఆదాయానికి గండికొట్టడం మన ఆలోచన కాదని కూడా అనుకుంటున్నాను.
    ____
    విధేయుడు
    -Srinivas

  29. Kameswara Rao అభిప్రాయం:

    October 11, 2009 5:42 am

    పదాల ప్రయోగానికి ఉదాహరణలు కొన్ని కొన్ని పదాలకి బ్రౌణ్యంలో కనిపిస్తాయి. శబ్దరత్నాకరం ప్రధానంగా ప్రాచీన కావ్య భాషని దృష్టిలో పెట్టుకొని తయారుచెయ్యబడింది కాబట్టి కావ్యాలలోని ప్రయోగాలు కొన్ని పదాలకి అందులో ఉన్నాయి. ప్రతి పదానికీ ప్రయోగాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే చాలా పెద్ద నిఘంటువు తయారవుతుంది. నేను మళ్ళీ అడిగిన మొదటి ప్రశ్ననే అడుగుతాను. అలాంటి నిఘంటువు ఎవరికి ఎంతవరకూ ఉపయోగపడుతుంది?
    పర్యాయపదకోశాలు పెద్దవేమైనా తెలుగులో ఉన్నాయా అన్నది నాకు తెలియదు కాని “విద్యార్థికల్పతరువు”లో పర్యాయపదాలూ, నానార్థాలూ ఉంటాయి. ఇంటర్నెట్లో Search సౌలభ్యం ఉన్న నిఘంటువులు ఇంచుమించు Thesaurus ప్రయోజనాన్ని అందిస్తాయి. ఏదైనా పదానికి సంబంధించిన పర్యాయపదాలు కావలిస్తే ఆ పదంతో Search చేస్తే సరిపోతుంది. పదకేళి నింపడానికి ఇంటర్నెట్లో ఉన్న బ్రౌణ్యం ఉపయోగించేవాళ్ళకి ఈ విషయం అనుభవమే. అంచేత ప్రత్యేకించి పర్యాయపదకోశాలు ఇంటర్నెట్లో అవసరం లేదనుకుంటాను.
    ఇంటర్నెట్లో బ్రౌణ్యం కాకుండా మరో రెండు ఉపయోగకరమైన సైట్లు:

    ఈ రెంటికీ Search సౌలభ్యం ఉంది.
    నా దృష్టిలో ముఖ్యంగా డిజిటైజ్ చెయ్యాల్సిన నిఘంటువులు మాండలిక పదకోశాలు, వృత్తిపదకోశాలు. వీటి ద్వారా ఈ లాభాలుంటాయి (ముఖ్యంగా ఇంటర్నెట్లో వస్తున్న సాహిత్యానికి):

    • మాండలికంలో రచనలు చేసేవాళ్ళకీ చదివేవాళ్ళకీ చాలా సౌకర్యంగా ఉంటుంది. అటువంటి రచనలకి మంచి ప్రోత్సాహం కలుగుతుంది.
    • వృత్తి పదకోశాల ద్వారా చాలా మరుగున పడిపోయిన పదాలు తెలుస్తాయి. అవి తెలియక వాటి స్థానంలో ఇంగ్లీషు పదాలని వాడే చోట్ల మళ్ళీ ఆ తెలుగు పదాలకి వాడుక కలిగే అవకాశం ఉంది.
    • కొత్త సాంకేతిక పదాలు సృస్ఠించుకోడానికి ఇప్పటికే ఉన్న వృత్తిపదకోశాలు దారి చూపిస్తాయి.

    మాండలిక, వృత్తి పదకోశాలు కొన్ని Digital Libraryలో ఉన్నాయి కాని వాటికి Search సౌలభ్యం లేకపోవడంతో వాడటానికి అనువుగా లేవు. వాటిని యూనీకోడీకరించి Searchable చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీని గురించి నలుగురూ ఆలోచిస్తే మంచిది.

  30. Srinivas Nagulapalli అభిప్రాయం:

    October 11, 2009 1:33 pm

    కామేశ్వరరావుగారు,
    Telugu Etymology Database లింకులు (సంస్కృత నిఘంటువుతో) బాటు తెలిపినందుకు చాలా కృతజ్ఞతలు.

    ఇటువంటి links (comments లోనే ఉండిపోక), ఒక చోట చేర్చి FAQ or Frequently Used Links అనో ఇంకేదో పేరుతో “ఈమాట” (లైబ్రరీలో?) పెట్టడం ఎక్కువమందికి, ఎక్కువగా అందుబాటులోఉంటుందేమో
    సంపాదకులు ఆలోచించ మనవి.

    మరుగున పడిపోయే మాండలిక, వృత్తి పదకోశాలను digitize చేసే ఆలోచన చాలా బాగుంది. దానికి కావలసిన అనుమతి (తెలుగు విశ్వవిద్యాలయం నుంచి), copyrights తెలిసిందానికన్నా నాకు తెలియనిదే ఎక్కువ.

    ఇక పదాలకు వాడుకలిస్తే నిఘంటువు పెద్దదే అవుతుంది, నిజమే. నిఘంటువు పెద్దదవడం ఇంత పాత భాషకు సహజమూ, మంచిదే కదా,

    ఇది ఎవరికి ఉపయోగం ప్రశ్నకు కొంత బాధపడి ఊరుకుందాం
    అనుకున్నా, గోడు చెప్పుకోకపోతే తెలియదని రాయడం. ఇటువంటివి నాకైతే ఉపయోగం. నాలాగా భాష వచ్చీ రాని వారు, ఎవరిని అడగాలో తెలియక తికమక పడేవారు, లోపల సందేహం ఉన్నా బయటకు అడగడానికి జంకే వారు, బాగా తెలిసిన పదాలైనా ఇంకొకరికి (పిల్లలకు?) చెప్పాలన్నప్పుడు precise పదాలు టపీమని దొరకక ఇబ్బందిపడేవారు, అయినా సొంతానికి కొంత కృషిచేసి నేర్చుకుందామనుకునే వారికందరికీ ఇటువంటి నిఘంటువులు సాయపడతాయనుకుంటున్నాను.
    ________
    విధేయుడు
    _Srinivas

  31. gaddeswarup అభిప్రాయం:

    November 2, 2009 5:50 pm

    Some links
    patrika padakosam
    Adhunika Vyavahara Kosam
    gwynn
    brown
    Check also
    Srisodhana
    Telugu Parisodhana has also made many books available online or has links to them
    English-Telugu Dictionary Technical and Scientific by Digavalli Siva Rao partly available at google books

  32. వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:

    April 26, 2010 10:31 pm

    శబ్దరత్నాకరము డిజిటైజ్‌ అయ్యింది - దీని నుంచి, బౌణ్య నిఘంటువులనుంచి, బూదరాజు ఆధునికవ్యవహారకోశం నుంచి, కొన్ని పారిభాషికపదావళులనుంచి ఒకే interface ద్వారా పదములను, అర్థములను వెతకుటకు http://www.andhrabharati.com/dictionary వాడవచ్చు.


    వాడపల్లి శేషతల్పశాయి
    కాలెపు నాగభూషణరావు

  33. lyla yerneni అభిప్రాయం:

    May 4, 2010 3:46 pm

    శబ్దరత్నాకరము డిజిటైజ్‌ అయ్యింది - దీని నుంచి, బౌణ్య నిఘంటువులనుంచి, బూదరాజు ఆధునికవ్యవహారకోశం నుంచి, కొన్ని పారిభాషికపదావళులనుంచి ఒకే interface ద్వారా పదములను, అర్థములను వెతకుటకు http://www.andhrabharati.com/dictionary వాడవచ్చు.


    వాడపల్లి శేషతల్పశాయి
    కాలెపు నాగభూషణరావు

    Fantastic. A remarkable achievement. Congratulations.

    A feature which interests me in e-reading is - when the reader’s finger hover over an unfamiliar word, a dictionary opens up and gives the meaning of the word. Can this magazine and andhrabharati.com collaborate and make it possible here? I do hope to read/listen the content at various Telugu sites, on demand, electronically on multiple devices/subscriptions that I pay for in US. I have not bought Kindle or I-Pad yet. I may buy I-pad and subscribe to Kindle book store. Besides individuals owning them, I would think these devices will be available for rentals pretty soon. (like ear phones are available for a small price, in aeroplanes.) Readers will read on, in the languages they like. Content ( whoever provides it) is and will always be the king.

    Thanks
    lyla

    PS:
    Love the content at andhrabharati.com., which I can read silently. Great material. Love the content at ‘eemaata’ too, along with the repetitive twitter that goes on:-)

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a