పెళ్ళైన మూణ్ణెల్లకి తీర్ధక స్వామిని చూడ్డానికి విశాఖని బయల్దేరదీసేడు మిగారుడు. పుట్టింటి వారు పెట్టిన నగలన్నీ అలంకరించుకుని, కూడా నలభై మంది సేవకులతో విశాఖ బయల్దేరింది. దిగంబర స్వామిని చూడగానే విశాఖ ఏవగించుకున్నది.
“నన్ను ఇలాంటి వార్ని చూడ్డానికా ఇక్కడకి తీసుకొచ్చింది?” అంది మామగారితో.
“అమ్మా వీరే మన కుటుంబాన్ని కాపాడే గురువులు” అన్నాడు మిగారుడు.
“ఛీ, ఛీ” అంటూ విశాఖ బయటకి నడిచి మామగారికోసం ఆగకుండా ఇంటికెళ్ళిపోయింది.
“చూసావుగా నీ కోడలెలాంటిదో? అనుభవించు. ఇలాంటివాళ్ళని వెంటనే విడిచిపెట్టాలి” అన్నాడు తీర్ధకుడు.
మొహం జేవురించుకుని ఇంటికి బయల్దేరేడు మిగారుడు. ఇంటికెళ్ళేసరికి గుమ్మం బయట నుంచుని, బిక్ష కొచ్చిన బౌద్ధ సన్న్యాసితో చెప్తోంది విశాఖ, “అయ్యా ఈ ఇంటాయన ఎంగిలి కూడు తింటాడు, మీరు మరో చోటు చూసుకోండి భిక్షకి.”
అసలే అవమానంతో వస్తున్న మిగారుడీ మాట వినగానే కోపంగా లోపలకి వెళ్ళి కోడలితో “నువ్వు నా ఇంట్లో ఉండడానికి తగవు. వెంటనే పుట్టింటికి వెళ్ళిపో” అన్నాడు.
“మీరు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి నేను దాసీ దాన్ని కాదు. నా కూడా వచ్చిన దాసీలని పిలిపించండి.”
దాసీ జనం రాగానే చర్చ మొదలు పెట్టేరు. “మీ అమ్మాయి నేను ఎంగిలి కూడు తింటానని చెప్పింది.”
“నేను చెప్పినదాని అర్ధం మీరు పూర్వకర్మ ఫలం అనుభవిస్తున్నారని” విశాఖ సమాధానంతో మిగారుడు కొంచెం మెత్తబడ్డాడు.
“ఇంకా ఏమైనా తప్పులు జరిగాయా నా మూలాన?” అడిగింది విశాఖ.
లేదని మిగారుడు చెప్పగానే విశాఖ బయల్దేరింది పుట్టింటికి, నాకు గౌరవం ఇవ్వని చోట నేను ఉండను అంటూ. మిగారుడు మెట్టు దిగి బతిమాలవలసి వచ్చింది. కొన్ని షరతుల మీద విశాఖ మామగారింట్లో ఉండడానికి ఒప్పుకుంది. అందులో కొన్ని తాను రోజూ బౌద్ధ సన్న్యాసులకి భిక్ష ఇవ్వగలగాలి,భగవానుణ్ణి రెండు పూట్లా చూడగలగాలి. వీటన్నింటినీ మిగారుడు నోరు మూసుకుని ఒప్పుకోవలసి వచ్చింది, కోడల్ని ఇంట్లో ఉంచుకోవడం కోసం.
రోజుకి రెందుసార్లు కోడలు చూసే ఆ బుద్ధుడిలో చూడ్డానికి ఏముందో అనే సందేహం మిగారుణ్ణీ తొలుస్తూనే ఉంది. ఇదే విషయం తీర్ధకుడి దగ్గిర ప్రస్తావించేడు. మిగారుడి నోట బుద్దుడి పేరు వినగానే తీర్ధకుడు కంగారు పడ్డాడు. మిగారుడు కూడా బుద్ధుడి శిష్యుడైతే ఇంక తీర్థక స్వామి రోడ్డుమీద బిచ్చం ఎత్తుకోవల్సిందే.
“వద్దు, నువ్వు కోడలు రమ్మన్నా బుద్ధుడ్ని చూడొద్దు. చూస్తే నరకానికి పోతావు” అన్నాడు తీర్ధకుడు. కానీ పదే పదే అడగడంతో తీర్ధకుడే అన్నాడు, “నీకంతగా బుద్ధుడి దగ్గిరకి వెళ్ళాలనుంటే వెళ్ళు కానీ ఆయన కనపడకుండా కళ్ళకి గంతలు కట్టుకో.”
కళ్ళకి గంతలు కట్టుకుని తన వెంట వచ్చే మామగారిని చేయి పట్టుకు నడిపిస్తూ విశాఖ బుద్ధుణ్ణి చేరింది. వచ్చే మిగారుణ్ణి చూడగానే భగవానుడి మొహంలో చిర్నవ్వు తొణికిసలాడింది. విశాఖ పక్కనే కూర్చుని బుద్ధుడు చెప్పే విషయాలు వినడం మొదలు పెట్టేడు మిగారుడు. పక్కనే కూర్చున్న పెద్దమనిషి మిగారుడి చెవిలో సణగడం మొదలు పెట్టేడు.
“కొన్ని ప్రశ్నలకి సమాధానం ఒకటే ఉంటుంది. కానీ కొన్నింటికి రెండు, మూడు సమాధానాలుంటాయి. కొన్నింటికి అసలు సమాధానాలే ఉండవు. అందరి ప్రశ్నలకి సమాధాలు చెప్పే ఈ బుద్దుడు కొన్నింటికి చెప్పలేడు. అయినా ఇక్కడి మూర్ఖులందరూ ఈయన్ని భగవానుడనే పిలుస్తారు. ఇప్పుడే ఈయన మనలాటి వాడే అని ఋజువు చేయగల్ను తెల్సా?”
“అలాగా? మా గురువులు వద్దంటున్నా నేను వచ్చేను మా కోడలు తీసుకొస్తే. మీరు కనక అలా ఋజువు చేస్తే నేను వెంటనే వెళ్ళిపోతాను ఇక్కడ్నుంచి.”
“అయితే ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఇదిగో పక్షిని పట్టి తెచ్చేను. దీన్ని వేళ్ళ మధ్య ఇరికించుకుని బుద్ధుణ్ణి అడుగుతాను. ఇది బతికి ఉందా? చచ్చిపోయిందా అని. బతికి ఉంది అంటే చంపేస్తాను. చచ్చిపోయింది అంటే వదిలేసి అందరికీ బతికిందని చూపిస్తాను. ఈ రెండే కదా సమాధానాలు? అప్పుడు ఈయన కిటుకు బయట పడుతుంది. ఏమంటారు?”
“సరే చూద్దాం. మంచి దారి కనుక్కున్నారు బుద్ధుణ్ణి పరీక్షించడానికి. అడగండి.”
పెద్దమనిషి ఒక్కసారి లేచి మాట్లాడుతున్న బుద్ధుడితో అన్నాడు, “మీ శిష్యులు చెప్పడం ప్రకారం మీరు అన్నీ తెల్సినవారు అయినా కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేరు. సమాధానం మీకు తెలిసీ చెప్పరో లేకపోతే తెలీదో మరి. నా చేతిలో పక్షి చూసేరా? ఇది బతికుందా, చచ్చిపోయిందా చెప్పగలరా? మీ జ్ఞానం ఎంతో ఒకసారి చూద్దాం.”
ఒకసారి పెద్దమనిషికేసి నిశితంగా చూసేడు భగవానుడు. చచ్చిపోయిందని చెప్తే పక్షిని వదిలేస్తాడని, బతికుందని చెప్తే దాన్ని చంపేస్తాడని గ్రహించడం బుద్ధుడికి తెలియదా? రెండే సమాధానాలుంటాయనుకున్న పెద్దమనిషిని నిరాశ పరుస్తూ మూడో విధంగా ఇలా అన్నాడు బుద్ధుడు.
“త్వచ్చిత్త ప్రతిబద్ధమే వైతత్ జీవతి వా వేతిచ” (నీ చిత్తం మీద ఆధారపడి ఉంది ఇప్పుడు అది బతికిందా, చచ్చిందా అనే విషయం).
పెద్దమనిషి మారు మాట్లాడకుండా కూర్చున్నాడు. మిగారుడి మొహంలో ఏదో కొట్టవచ్చిన ఆనందం. కోడలు మంచి చోటుకు తీసుకొచ్చిందనో మరొకటో. వెంటనే ఇంకొకరు ప్రశ్న అడగడం మొదలు పెట్టేరు. “భగవాన్, ఈ సృష్టి ఎలా ఏర్పడింది? ఈ క్రమంలో ఏర్పడింది? ఇలగే కొనసాగుతుందా? లేకపోతే లయమై పోతుందా? లయం అయితే తర్వాత ఏమిటి?”
“భిక్షూ, నువ్విక్కడ చేరినప్పుడు నీకు ఇలాంటి ప్రశ్నలకి సమాధానం ఇస్తానని చెప్పేనా?”
“లేదండి”
“సరే విను. ఒకడికి విషం అంటించిన బాణం తగిలింది. వాణ్ణి వైద్యుడి దగ్గిరకి తీసుకెళ్ళడానికి జనం అందరూ పరుగెట్టుకొచ్చారు. అయితే వాడు, ’ఉండండి. నన్ను వైద్యుడి దగ్గిరకి తీసుకెళ్ళే లోపుల నాకు అనేక విషయాలు కావాలి. ఎవరు బాణం వేసినవాడు? వాడి రంగు తెలుపా, నలుపా? ఏ కాలు ముందు పెట్టి బాణం వేశాడు? వాడు లావా, సన్నమా, పొడుగా పొట్టివాడా’ అనేవి అడుగుతూ కూర్చుంటే ఏమౌతుంది?”
“చచ్చి ఊరుకుంటాడు”
“అర్ధం అయింది కదా? నీకు జన్మ రాహిత్యం కావాలా? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలా తేల్చుకో మరి.” ముగించేడు బుద్ధుడు.
ఇదంతా వింటున్న మిగారుడు ఒక్కసారి లేచి గంతలు విప్పిపారేసి భగవాణుణ్ణి చూసేడు. ఆయన మొహంలో కనిపించే తేజస్సు చూడగానే ఇంకేమీ కావాలనిపించలేదు. నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయేడు. భగవానుడి మొహంలో ఎప్పటిలాగానే చిర్నవ్వు. కొంచెంసేపటికి తేరుకుని మిగారుడిలా అన్నాడు “భగవాన్, తీర్థక స్వామి చెప్పినట్టుగా కళ్ళకి గంతలు కట్టుకుని వచ్చాను. కానీ ఇప్పుడు తెలుస్తోంది మా కోడలు ఎంత మంచిదో. ఆమె వల్లే మిమ్మల్ని చూసే అదృష్టం కల్గింది నాకు. మీరు ఇక్కడే ఉండడానికి నా ధనం అంతా ఇచ్చేస్తాను. నన్ను కూడా మీలో చేర్చుకోండి.”
కోడలి కేసి తిరిగి మళ్ళీ ఇలా అన్నాడు మిగారుడు, “అమ్మా ఈ రోజునుంచీ నువ్వే నన్ను కాపాడాలి. నాకు భగవానుడి మీద భక్తి శ్రద్ధ ఉండేలాగ నన్ను చూస్తూ ఉండు. నువ్వు నా తల్లి లాంటి దానివి.”
కూర్చున్న జనం అంతా ఒక్కసారిగా “జై మిగార మాతా” అని అనడం ఆనందుడికి వినిపించింది. సాలోచనగా బుద్ధుడికేసి చూసాడు. పిల్లలు పుట్టకుండా మాత ఎలా అవుతుందో మొదట విశాఖని చూడగానే బుద్ధుడు చెప్పిన వైనం గుర్తొచ్చింది
భగవానుడి మొహంలో మందహాసం చెరిగిపోకుండా అలాగే ఉంది.