ఈమాట » నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన

Expand to right
Expand to left

నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన

సీ.   కడచిన యామిని పిడుగువడ్డ సగంబు
            మాఁడిన తలయైన మద్దిచెట్టుఁ
      బోలినదానిని, ముంచెత్తు వానలు
            సగములో వచ్చినం జల్లనారి
      పోయిన కాష్ఠంబుఁ బోలిన దానిని,
            గహనంబులోఁ గుంటగట్టులోన
      మట్టలెండి జలాన మాఁగిన చిట్టీతఁ
            బోలినదానిని, సోలుదాని

తే.   నెడపెడగ వాయువులు వీవనిట్లు వచ్చు
      వాయువున వంగుచును నట్లువచ్చు వాయు
      పూరణమున నాఁగుచు నాఁగి మొరయుచున్న
      వేణువల్మీక గుల్మంబుఁ బోనిదాని

ఈ పద్యం కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో ఆరణ్యకాండ పంచవటీ ఖండం లోనిది.

ఈ పద్యంలో కవి ఎవరినో వర్ణిస్తున్నాడని అర్థం అవుతూనే వున్నది. ఇందులో నాలుగు ఉపమానాలు ఉన్నాయి. మొదటిది - గడిచిన రాత్రి మద్ది చెట్టు మీద పిడుగు పడింది. ఆ చెట్టు పూర్తిగా ధ్వంసం కాలేదు. తల సగం మాడిపోయింది. మద్ది చెట్టంటే పొడుగ్గా గంభీరంగా ఉంటుంది. అది సగానికి సగం అశనిపాతంతో కాలిపోయింది. సగం తగలబడ్డ చెట్టు ఎంత వికారంగా ఉండాలో అంత వికారంగానూ ఉంది అది.

రెండో పోలిక - శ్మశానమే పరిహార్యమైన ప్రదేశం. అశౌచానికి ఆటపట్టు. అటువంటి కాటిలో కాలుతున్న కాష్ఠం గుండెల్లో భయంతో పాటు అసహ్యమూ కలిగించేది. ఒక శవం చితిమీద కాలుతూ వుండగా పెద్దవాన వచ్చినందున పూర్తిగా కాలకముందే ఆ చితి ఆరిపోయింది. ఎంత జుగుప్స కలిగించాలో అంత జుగుప్సాకరంగానూ ఉంది ఆ సగం కాలిన కాష్ఠం.

మూడో పోలిక - అడవిలో అక్కడక్కడా నీళ్ళు నిలిచిన కుంటలుంటాయి. అలాంటి ఒక కుంట గట్టున ఒక చిన్న ఈత చెట్టు - చిట్టీత చెట్టుంది (చిట్టీతలు ఏపుగా కాండంతో పెరగవు. పొదగానే ఉంటాయి). దాని మట్టలు వంగి కుంటలోని నీళ్ళలో కొన్ని తడుస్తున్నాయి. మరికొన్ని మట్టలు నీళ్ళలో మాగి, క్రమంగా నీరు తగ్గి పొయ్యేసరికి, బైటపడి, ఎండి రంగు మారిపోయాయి. మొత్తానికి ఆ చిట్టీత చెట్టు - ఎత్తు తక్కువా, కుంట గట్టు మీద మాగిన మట్టలతో - ఎంత ఏహ్యంగా వుండాలో అంత ఏహ్యంగానూ వుంది.

ఇక నాలుగో పోలిక - అడవిలోని ఒక వెదురు పొద. మరీ పొడుగుది కాదు. పొద మొదట్లో పుట్టలు పెరిగాయి. అడ్డగోలగా గాలులు వీస్తున్నాయి. అటునుంచి వచ్చే గాలికి వెదుర్లు ఇటు వంగుతున్నాయి. ఇటునుంచి వచ్చే గాలితో అటు వంగుతున్నాయి. అలా వంగుతూ, ఆగుతూ పరస్పరం రాపిడితో ఎండుటాకుల గలగలలతో, వింత వింత శబ్దాలతో ఊళలు వేస్తున్నాయి. అటువంటి వేణు వల్మీక గుల్మం ఏమీ కనులకు ఇంపు కలిగించే దృశ్యం కాదు.

పిడుగు పడి సగం కాలిన మద్ది చెట్టూ, సగం కాలిన కాష్ఠమూ, మట్టెలెండిన చిట్టీతా, పుట్టలోంచి వెళ్ళకొచ్చి గాలి కూగుతూ చెవికింపు గాని శబ్దాలు చేసే వెదురు పొదా - ఒళ్ళు జలదరించే ఈ ఉపమానాలతో విశ్వనాధ వర్ణించింది - ముక్కూ చెవులు తెగిన తర్వాత స్వీయ రాక్షస రూపంలో భోరున విలపించే శూర్పణఖను.

బహూశా విశ్వనాథ సత్యనారాయణ రావణాసురుడంతటి వాడు. ఈమాట నేను చులకన భావంతో అనడం లేదు. ఆయన సర్వజ్ఞత, సమర్థతల మీద అపారమైన గౌరవంతో అంటున్నాను. ఆయన ఊహాదృష్టి ప్రసరించని ప్రదేశం ఈ చతుర్దశ భువనాల్లో ఉండి వుండదు. ఆయన ఊహలూ, కల్పనల అపురూపత మరే కవిలోనూ కానరాదు. ఆయన ఊహల లోతూ, చుట్టుకొలతా, వైశాల్యమూ కొంచెం అవగాహనలోకి రావాలంటే ఋతుసంహార కావ్యంలో ఆయన ఋతువులను వర్ణించిన తీరు పరికిస్తే చాలు. ఇక రామాయణ కల్పవృక్షమైతే ఆయనే స్వయంగా చెప్పుకున్నట్లు ‘సకలోహ వైభవ సనాథ’మే. ఆ! ఆయన రాసిందంతా ఇంతకు ముందెవ్వరో రాసిన రామాయణమూ, అలాంటి పాత కథలే గదా అని కొట్టిపారేసేవారు సైతం ఆయన బహుముఖీనమైన వైదుష్య విస్తృతికి విస్తుబోతారు. “వేదములలోని విమలార్థ చయము వాదించు నా కైత - దాని శత్రువై వరలు నీ జగము” అని ఆయన తన ప్రాథమ్యాన్ని స్పష్టం చేసి ‘తాంబూలాలిచ్చేశాం’ అని చెప్పిన తర్వాత, ఇక ఇతరులు ‘తన్నుకు చావడం’ తప్ప చేసేదేమీ వుండదు.

రామాయణ కల్పవృక్షం మరో రామాయణమే. వాల్మీకిని అనుసరించి రాసిన రామకథే. కానీ చాలా చోట్ల తన సొంత ఆలోచనలతో మార్పులు చేసుకున్నాడు విశ్వనాథ. ఉదాహరణకు, వాల్మీకి కైక ఒక సామాన్య మాత. కొడుక్కి రాజ్యం సంపాదించి పెడదాం అనుకునే తల్లి. దానికోసం ఎంతకైనా వెనుదీయని మానవి. కాని, విశ్వనాథ కైక ఒక మహా మనీషి. ధర్మరక్షణా, రాక్షస సంహారమూ అనే మహార్థాల కోసం తాను తెలిసి తెలిసీ అపకీర్తిని తలమోయ నిచ్చగించిన కారణ జన్మురాలు. ఈ రహస్యం ఆమెకూ, రామునికీ మాత్రమే తెలుసు. వాల్మీకీ విశ్వనాథల దృష్టిలో ఈ తేడాకు కారణం ఒక్కటే. వాల్మీకి రాముడు ఒక గొప్ప మానవుడు. విశ్వనాథ రాముడు సాక్షాత్తూ భగవంతుడు.

అలాగే విశ్వనాథ వాల్మీకిని మార్చి రాసిన మరో ఘట్టం పరశురామ గర్వభంగం. వాల్మీకి సీతారామ కళ్యాణానంతరం పరశురాముని ప్రవేశం చేయిస్తే, విశ్వనాథ కళ్యాణాత్పూర్వమే పరశురాముని శృంగభంగం కావిస్తాడు. తనకు పూర్వపు అవతారాన్ని సంపూర్తిగా పరిసమాప్తి కావించి, అతనిలోని వైష్ణవాంశను రాముడు తనలోకి పూర్తిగా ఆవాహన చేసుకున్న పిమ్మటనే రామునికి సీతావివాహ యోగ్యతను కల్పించదలచాడు విశ్వనాథ. మొత్తానికి ఇలాంటి మార్పులు అవాల్మీకాలైనా ఔచితీవంతాలే కాబట్టీ ఇబ్బందేమీ లేదు.

ఇక పద్యనిర్మాణం సంగతికి వస్తే, బాహ్య నిర్మాణం విషయంలో విశ్వనాథ అంత పట్టింపు ఉన్నవాడు కాదు. ఒక మంచి పదాన్ని తెచ్చి పొదుగుదామని అనుకోడు. ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు “నిత్యవేగి నా చేతము - శబ్దమేరుటకు నిల్వదు” అని. ఆయన హృదయంలోంచి భావాలు బయటకు దూకుతాయి. ఛందస్సు ఆయనకు బానిస కాబట్టి ‘జీ హుకుం’ అంటూ వచ్చి ఆ భావాలను గణాలూ యతిప్రాసల మధ్య అమర్చిపోతుంది. పద్యానికి ధార అవసరం అని ఆయన అనుకోడు. ‘రసము వేయిరెట్లు గొప్పది’ అనేది ఆయన మతం.

విశ్వనాథ పద్యాలను పైపై అందాల కోసం చదవకూడదు. మహాద్భుతమైన కల్పనల కోసం చదవాలి. అపురూపమైన ఊహల కోసం చదవాలి. కథానిర్వహణ శిల్పంలోని నేర్పు కోసం చదవాలి. తెలుగు పల్లెల్లో, పొలాల్లో, తాపుల్లో చిన్నతనంలో తాను చూసిన సొగసులనూ, అందాలనూ కవిత్వంలో కుప్ప వోసిన తీరు చూడ్డం కోసం చదవాలి. తెలుగిండ్లలోని ఆచారాలనూ, వాడుకలనూ, పలుకుబడులనూ, కథల్లో, పద్యాల్లో పొదిగిన సౌందర్యం కోసం చదవాలి. సంభాషణల్లో వ్యావహార ధోరణికి ఛందస్సుతో సాహచర్యం చేయించిన చాతుర్యాన్ని ఆనందించడం కోసం చదవాలి. పై పద్యం అలాంటిదే. చూశారుగా, ఎంత విచిత్రమైన ఉపమానాలను సృష్టించాడో. అవి పూర్తిగా విశ్వనాథవే, వాల్మీకివి కావు. వాల్మీకి ఈ సందర్భంలో శూర్పణఖను గురించి అనేక విశేషణాలు వాడాడు, అదీ ఆమె ముక్కు చెవులు కోయకముందు - దారుణా, వృద్ధా, భైరవస్వరా, దుర్వృత్తా, అప్రియదర్శినీ, కామమోహితా, ఇవాం విరూపాం, అసతీం, అతిమత్తాం, మహోదరీం, రాక్షసీం - ఇలా. కర్ణ నాసికా ఖండనం తర్వాత శూర్పణఖకు తీసిన ఛాయాచిత్రం - విశ్వనాథ రాసిన పై పద్యం.

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం అనే సుధాపాయసాన్న భాండంలో పైన చెప్పిన పద్యం ఒక్క మెతుకు మాత్రమే. పట్టి చూడండి.

[ఊసు: సెప్టెంబరు 10, 1895 శ్రీ విశ్వనాథ జన్మదినం - సం]

 

(10 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. lyla yerneni అభిప్రాయం:

    September 3, 2009 1:22 am

    ఇతిహాసాలు, తెలుగు పద్యాలు, వాటిని ఆధారంగా తీసుకు చేసే రచనలు చదవటం నాకు చాలా ఇష్టం. చదివాక సరదాగా చర్చలోకి దిగకుండా ఎలా?
    విశ్వనాథ రచనలు బాగా ఇష్టమే నాకు. ఐనా ఈ పద్యం, ఈ సందర్భంలో, ఈ క్రింది కారణాల వల్ల నాకు నచ్చలేదు.

    “దుర్ముఖి, మహోదరి, విరూపాక్షి, తామ్ర మూర్ధజ, విరూప, భైరవ స్వర,
    దారుణ, వృద్ధ, యర్కప్రసూన కైశిక, రుండమాలా కాంచి, వసాకజ్జల యయ;కంకణ” - అని అప్పటికే శూర్పణఖను వర్ణించి ఉన్నాడు కవి. ఇంత సుందరి శూర్పణఖకు ముక్కూ చెవులూ కోసినంత మాత్రాన ఇంక ఆమెకు కొత్తగా వచ్చే వికారరూప మేమిటి! మళ్ళీ అంత కష్టపడి శూర్పణఖను ఎవరికోసం వర్ణిస్తున్నట్లు?

    ఇంతకీ ఇక్కడ ఇవ్వబడిన సందర్భంలో,
    ఈ రాక్షస స్త్రీని చూస్తున్నదెవరు! ఇంకో రాక్షసుడే. స్వయానా ఆమె తమ్ముడు ఖరుడు.
    ఏదో సగం కాలిన మద్ది, సగం కాలిన కాష్ఠం, ఏదో ఎండిన మట్టల బుల్లీత చెట్టు, పుట్టలున్న వెదురు గుబురు- ఖరుడికి శూర్పణఖ ఇలా ఎందుకు కనిపిస్తుంది! మనుషుల కన్నమద్దిచెట్లు పెద్దవి గానూ, చెట్ల కన్నా రాక్షసులు ఇంకా ఎంతో, ఎంతో పెద్దగానూ ఉంటారనుకున్నా. కాదా? Pygmy రాక్షసులా వీళ్ళు?
    ఎంత ఉన్నత శరీరం లేకపోతే రావణుడు కైలాసగిరిని ఎత్తుతాడు? శూర్పణఖ, ఖరుడు, దూషణుడు, అతని పినతల్లి సంతానమేగా?

    ఏమైనా,
    వాల్మీకి రాసిన రామాయణాన్ని తిరగరాస్తూ -వల్మీకాలున్న వెదురు తోపు లాగా శూర్పణఖ ఉందంటం - విశ్వనాథకు ఉచితమంటారా? :-)
    పైగా ఆ తర్వాత పద్యంలో,
    ఖరుడు ముక్కూ, చెవులూ తెగి ఏడుస్తున్న పెద్ద అప్పగారిని - హెల్త్ ఇన్స్యురెన్స్ లేకుండా హాస్పిటల్ కి వచ్చిన పేషెంటును చూసినట్లు చూస్తూ- “వనమూలికల్ వెదకి గాయము మాన్పుకొనంగ రాదె..” అంటాడేమిటీ, అదీ నచ్చలేదు :-)

    మరియు,
    వ్యాస రచయిత రామాయణం రాసిన విశ్వనాథను రావణాసురుడితో పోల్చటం చూశాక - విశ్వనాథ సత్యనారాయణ గాని - ‘Paradise Lost’ చదివి ఒకవేళ John Milton ని Satan తో పోలిస్తే ఎలా ఉంటుందో - అప్పుడు ఆ ఇద్దరు కవులకూ ఎంత :-) రావణ రామ యుద్ధం జరిగేదో- perhaps all hell will break loose in the Poets’ Heaven, after reading this essay even now - అని ఊహిస్తూ,

    ఈ అభిప్రాయము వెలిబుచ్చినందుకు అది దూషణగాను, నన్ను ఖరము గాను, కాకున్న శూర్పణఖ గాను ఎంచరనీ, విశ్వనాథ - “కల్పవృక్ష రహస్యములు” అన్న పుస్తకంలో వారే తొలిపలుకులో విమర్శకుల గురించి చెప్పినట్లు -విమర్శ చేసిన నన్ను ఒక పామరస్త్రీ గా మాత్రమే పరిగణిస్తారనీ ఆశిస్తూ,

    పద్యం బాగోక పోయినా, వ్యాసం బాగుందని తెలుపుతూ,

    లైలా

  2. rama bharadwaj అభిప్రాయం:

    September 3, 2009 12:40 pm

    నాకు నచ్చిన పద్యం అన్న శీర్షికలోకి వాల్మీకీ, విశ్వనాthaల తారతమ్యం అనే అంశం ఎలా చొరబడిందో!! విశ్వనాtha మంచి పద్యాలు అనేకం ఉండగా, ఈ పద్యమే బృందావనరావు గారికి నచ్చటం ఆయన అభిరుచిని తెలియజేస్తోంది.

    ఉపమానం ఉపమానం కోసమే గొప్పది కాలేదు. అందులోని స్వారస్యంలో ఒక ఒప్పుదల ఉండాలి. అటువంటి ఒప్పుదల అన్పించక పోవటమే ఈ పద్యంలోని వెలితి. ఆ వెలితిని లైలా బాగానే చెప్పారు.

    రమ.

  3. Kameswara Rao అభిప్రాయం:

    September 6, 2009 9:24 am

    విశ్వనాథ తరఫునో లేదా బృందావనరావుగారి తరఫునో వకాల్తా పుచ్చుకొని వాదించడానికి నేను రాలేదు. లైలాగారి అభిప్రాయాన్ని తప్పుపట్టాలన్న ఉద్దేశమూ లేదు. ఎవరి అనుభూతి వారిది. ఈ పద్య సందర్భాన్ని మరికొంత వివరించాల్సిన అవసరం ఉందనిపించి ఇది రాస్తున్నాను.

    శూర్పణఖ ముక్కూ చెవులూ తెగిన వెంటనే ఖరదూషణుల దగ్గరికి వచ్చినప్పటి పద్యం కాదిది. అలా వచ్చినప్పుడు శూర్పఖని చూసిన ఖరుడు మొదటగా అనే పద్యం ఇది:
    ఇటులిది యేమమ్మా! ముకు
    పుటముల నెత్తురులు గారు? ముక్కుం జెవులుం
    గటకట! యిట్లేలయ్యెను
    పటువెవ్వడు నిన్ను నిట్టి పాటుం బరుపన్

    అంతే! అంతకన్నా మరే వర్ణనా అక్కడ లేదు. మరి యీ పద్యం ఎప్పుడు వస్తుంది?

    ఖరుడు దురుముఖుడు మొదలైన పద్నాలుగు మంది ముఖ్య సేనాపతులను వారి సేనలతో సహా రామ లక్ష్మణుల పనిపట్టమని పంపిస్తాడు. వాళ్ళతోపాటు శూర్పణఖనీ తోవ చూపించడానికి పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళి రాముడి చేతిలో ఊకుమ్మడిగా ఒక్క క్షణంలో చచ్చిపోతారు, శూర్పణఖ కళ్ళముందే! దానితో ఆమె రోదన మరింత తీవ్రమవుతుంది. ఇంతకుముందు ఆమె ముక్కూచెవులు కోయబడినప్పుడు ఆమెకి కలిగిన బాధ కొంతవరకూ ఎక్కువగా శారీరకమైనది, ఆ పైన ఉన్నదల్లా అవమానం. ఇప్పుడు కలిగిన బాధ అది కాదు. ఆమె మొత్తంగా నిర్వీర్యురాలైంది. ఇప్పుడు ఆమె మనసంతా దైన్యం నిండిపోయింది. ఇప్పుడామెకి ఉన్నది క్రోధమూ కాదూ, అవమానమూ కాదు. తీవ్ర భయమూ, నిరాశ, విస్మయమూ. తను ప్రాణాలతో ఉండికూడా లేనట్టే, జీవచ్ఛవం అన్నమాట. ఈ పద్యంలో వర్ణించబడ్డ అవస్థ అది. అది శారీరకమైన రూపాన్ని కాదు వర్ణిస్తున్నది.
    ఇక ఆమెని చూసిన ఖరుని మనస్థితి ఏమిటి? తన సేన వాళ్ళని సంహరించి ఉంటుందన్న పరిపూర్ణమైన నమ్మకం అతనిది. అంచేత ఇంకా శూర్పణఖ ఎందుకలా దీనంగా కనిపిస్తోందో అతనికి తెలియలేదు. ఆమె ముక్కు చెవులు కోసి ఉండడం వల్లనే అలా కనిపిస్తోంది అనుకుంటున్నాడు. అది అతనికి చిరాకు తెప్పించింది. అందుకే తర్వాత పద్యంలో ఏదైనా వనమూలికలు పెట్టుకొని గాయం మాన్పుకో, ఇంకా ఎందుకీ దుఃఖం అంటాడు.

  4. రాఘవ అభిప్రాయం:

    September 14, 2009 6:06 am

    చక్కటి పరిచయం. అడగవలసిన ప్రశ్నలు. మంచి సమాధానాలు. బాగుంది, బాగుంది :)

  5. lyla yerneni అభిప్రాయం:

    October 15, 2009 11:37 am

    విశ్వనాథ తరఫునో లేదా బృందావనరావుగారి తరఫునో వకాల్తా పుచ్చుకొని వాదించడానికి నేను రాలేదు. లైలాగారి అభిప్రాయాన్ని తప్పుపట్టాలన్న ఉద్దేశమూ లేదు. -Kameswara Rao

    ఈ పై వాక్యాల నిర్మాణం నాకు ఆసక్తిని కలిగించింది.
    విశ్వనాథ, బృందావనరావు, లైలా - వీరెవ్వరి తరుఫున నేను వాదించటానికి రాలేదు. ఎవరి అభిప్రాయాన్ని తప్పు పట్టాలని లేదు - అని వీరు వ్రాసి ఉండవచ్చును. కాని వారు అలా అనలేదు. ఎందువల్ల అలా అనలేదు. ఇలానే ఎందుకు అన్నారు? అన్న అనుమానం లీలగా కలుగుతుంది నాకు. ;-) కామేశ్వరరావు లాటి భాషాప్రవీణులు ఆషామాషీగా రాయరు. అంచేత నాకు అలాటి అనుమానం వస్తుంది.

    ఐతేయేం, పద్య సందర్భం విపులంగా వర్ణించారు. శూర్పణఖ, ఖరుని మనస్థితులను (పుస్తకంలో లేకున్నా) తెలియజెప్పారు. సంతోషంగా చదువుకున్నాను.
    కానీ, “శూర్పణఖని చూసిన ఖరుడు మొదటగా అనే పద్యం ఇది:” అంటూ ఇవ్వబడిన విశ్వనాధ ఈ క్రింది పద్యం కూడా నాకు నచ్చలేదు. ;-)

    “ఇటులిది యేమమ్మా! ముకు
    పుటముల నెత్తురులు గారు? ముక్కుం జెవులుం..”

    ఎందుకంటే, లక్ష్మణుడు ‘సురియ’ తో శూర్పణఖ ముక్కును, కోసి అవతల పారేస్తే ‘ముకుపుటములు’ ( the flaring walls of nostrils, the wings of nose, alae nasi ) ఇంకా ఆమె ముఖాన ఉండవు. అందువలన.
    లక్ష్మణుడు చేసేది అవమానం కాని, (ముక్కూ చెవులు కొయ్యటానికి తర్వాత ఆయన వేరే కారణం చెబుతాడనుకోండి) ప్లాస్టిక్ సర్జరీ కాదు కదా. (రాక్షస కాంతల ముక్కు నిర్మాణం మానవ స్త్రీ కన్నా వేరేగా ఉంటే, అది ఎక్కడైనా వర్ణించబడి ఉంటే సరే సరి.)

    లైలా

  6. సర్పవరపు రమణి. అభిప్రాయం:

    October 17, 2009 12:30 pm

    ముక్కుకోయడమంటే లైలా గారు “ఊహించినట్టు” మొదలుకంటా నరికిపారేయడము కాదు.దానికి ఒక పద్ధతి పాడూ ఉన్నాయి.మనతెలుగులో సామెతకూడా ఉంది.ముక్కు కోసి సున్నం పెడతాను అని;మొదలు కంటా నరికితే ఇంక సున్నం ఎక్కడ పెడతారు?? అంతే గాక Rhinoplasty (తెగిన ముక్కునతికే శస్త్ర చికిత్స) ప్రాచీన భారతంలో ప్రచలితమైన శస్త్రచికిత్సల్లో ఒకటి.(శుశ్రుత సంహిత లో విపులంగా వర్ణించారు). రావణుడు కూడా శూర్పణఖకు అటువంటి ముక్కు పునర్నిర్మాణ శస్త్రచికిత్స చేయించాడు. ముక్కు పుటాలు లేకపోతే ఈ చికిత్స కుదరదు అన్న విషయం స్వయాన వైద్యులైన లైలా ఎర్నేని (ఈ పేరు చూసి గాభరా పడతాను. లైలా శుద్ధంగా హీబ్రూ పదము ,ఎర్నేని తెలుగు ఇంటిపేరు) గారికి http://books.google.com/books?id=KYv0A2QuRLkC&pg=RA4-PA9&lpg=RA4-PA9&dq=ancient+practince+of+cutting+nose&source=bl&ots=De5cO-Jg7R&sig=okNi7Vdjm8MSvYdLjtltSvEYLa8&hl=en&ei=tdTZSsfbIYPV8Abw3di3BQ&sa=X&oi=book_result&ct=result#v=onepage&q=&f=false">తెలియని విషయం కాదు.

    “ఎందుకంటే, లక్ష్మణుడు ‘సురియ’ తో శూర్పణఖ ముక్కును, కోసి అవతల పారేస్తే ‘ముకుపుటములు’ ( the flaring walls of nostrils, the wings of nose, alae nasi ) ఇంకా ఆమె ముఖాన ఉండవు. అందువలన.లక్ష్మణుడు చేసేది అవమానం కాని, (ముక్కూ చెవులు కొయ్యటానికి తర్వాత ఆయన వేరే కారణం చెబుతాడనుకోండి) ప్లాస్టిక్ సర్జరీ కాదు కదా. (రాక్షస కాంతల ముక్కు నిర్మాణం మానవ స్త్రీ కన్నా వేరేగా ఉంటే, అది ఎక్కడైనా వర్ణించబడి ఉంటే సరే సరి.) “
    కావున ,లైలా గారి రాతల్లో పసలేదు. ఏదో “ఒక ఠస్సా వేసి రంజింపజేద్దామనుకొన్నారు” కానీ అది కుదరలేదు. కామేశ్వరుల వ్యాఖ్యల్లో పొసగనిది శూర్పణఖ నిర్వీర్యురాలు (వీర్యముండేది పురుషులకు; నిశ్చేష్టురాలు అంటే బాగుండేది) కావడం,ఒక డాక్టర్గా లైలా గారు దీన్ని ఎత్తిచూపవలసింది.కానీ వితండవాదంలో తర్కం వెనుకబడుతుంది.కావున వారి బుద్ధి అటు పారలేదు.

    సర్పవరపు రమణి.

  7. Srinivas Nagulapalli అభిప్రాయం:

    October 19, 2009 12:21 pm

    ముక్కు సూటిగా లైలాగారు “ముకుపుటములు” ఎక్కడ, ముక్కేకోసిన తరువాత అన్నobservation కు ఆశ్చర్యంతో ముక్కుపైన వేలువేసుకోవడమే!

    పద్య సంధర్బాన్ని చక్కగా, ఆసక్తితో చదివేటట్లుగా వివరించినందుకు కామేశ్వరరావుగారికి కృతజ్ఞతలు.

    “పిడుగు పడి సగం కాలిన మద్ది చెట్టూ, సగం కాలిన కాష్ఠమూ, మట్టెలెండిన చిట్టీతా, పుట్టలోంచి వెళ్ళకొచ్చి గాలి కూగుతూ చెవికింపు గాని శబ్దాలు చేసే వెదురు పొదా - ఒళ్ళు జలదరించే ఈ ఉపమానాలతో విశ్వనాధ వర్ణించింది - ముక్కూ చెవులు తెగిన తర్వాత స్వీయ రాక్షస రూపంలో భోరున విలపించే శూర్పణఖను.

    వర్ణన బాగుంది. పద్యాన్ని విడమర్చి ఓపికతో సాయపడేటట్టు చెప్పారు కూడా.

    ఇంతైనా వాల్మీకి పద్దతే, కాదు, వాల్మీకి చూపిన ఔచిత్యమే నచ్చింది. దొరికాయి ఊహలు పదాలు అని, దొరికిపోయారు పాఠకులు అని ఏడ్చినట్టున్న శూర్పణఖ ఏడుపును వర్ణించడం, అదీ పలు ఉపమానాలతో, “రామ రామ” ఎందుకో! ఇంకెందుకు సరదాకే కదా!

    వేరే భాషల్లో ,కావ్యాల్లో ఏడుపుకు ఇంత వర్ణన, వివరణ ఉందో లేదో గాని, మనకు రాక్షసుల ఏడుపుకు సైతం సీసాలున్నాయి. పోనీ ఈ ఏడుపువల్ల కథకేమైనా పనికొచ్చే అంశం ఉన్నదా, ఇదిలేకపోతే కథాశిల్పానికి కలిగే లోటేమైనా ఉందా అంటే ఏమీ కనపడదు. అయినా సరదాగా ఉంది. రాక్షసి ఏడుపుకు సైతం ఇంత పెద్ద పద్యం, కాదు ఊహలుచేయడం, నిజంగానే ఎంతో పెద్ద మనసుంటేనే గాని, అంతకుమించి పెద్దపనులేమీ లేకుంటేనేగాని, మధ్యలో రాక్షస phone calls రాకుంటేనేగాని సాధ్యం కాదేమో అనిపిస్తుంది.
    ________
    విధేయుడు
    _Srinivas

  8. D.V.N.Sarma అభిప్రాయం:

    October 19, 2009 7:53 pm

    ఒకే పద్యంలో శూర్పణఖను పొడుగైన మద్ది చెట్టుతోనూ పొట్టి చట్ట్టీత చెట్టుతోనూ
    పోల్చటం లోని ఔచిత్యం ఏమిటి?
    అంధారాధన పనికిరాదు.
    శర్మ.

  9. Ramana అభిప్రాయం:

    October 22, 2009 2:33 am

    పిడుగు పడి సగం కాలిన మద్ది చెట్టు కాబట్టి ఔచిత్య భంగం కాలేదని నా అభిప్రాయం. ఒక చిన్న అనౌచిత్యాన్ని మాత్రమే చూపించి ‘అంధారాధన’ అని ముద్ర వేయడం సమంజసం కాదు.

  10. Srinivas Nagulapalli అభిప్రాయం:

    October 22, 2009 9:32 pm

    సమంజసం కానిది విశ్వనాథ వారి కవితావైభవాన్ని చెప్పడానికి ఎన్నో గొప్ప పద్యరత్నాలున్న కావ్యంలోనుంచి “చున్‌కే చున్‌కే” ఈ పద్యాన్నేఎన్నుకోవడం. సమంజసం కానిది, సరదాకో దురదకో ఎక్కడో ఉన్న ఇట్లాంటి పద్యాన్ని పట్టుకొని విశ్వనాథ కవిత్వాన్ని, చాతుర్యాన్ని తెలుసుకోవడానికి ఇదొక మెతుకువంటిదని ఎత్తిచూపడం. సమంజసం కానిది, “నిర్వీర్యం” అన్న పదానికి లింగవివక్షతను ఆపాదించడం. సమంజసం కానిది, పద్యాన్ని వొదిలేసి ఇంకొకరి బుద్ధి ఎటు పారలేదో, పారాలో చర్చించడం.

    “తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచు బ్రదుకులు తనవిగాన
    చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనది గాన
    తలచిన రామునే తలచెదనేనును, నా భక్తి రచనలు నావి గాన”
    అని పదికాలాల పాటు గుర్తుండేటట్లుగా చెప్పిన విశ్వనాథ గారి పద్యం చదివిన తరువాత, అంతకంటే సమంజసమైనది,తలచినప్పుడల్లా పరవశింపజేసేది, ఆలోచనామృతాన్ని అందజేసేది, కలకాలం నిలిచిపోయే “రామచరితమానస”లో తులసీదాసు చెప్పిన మాటలు.

    “నిజ గిరా పావని కరన కారణి రామ జసు తులసీకరో
    రఘువీర చరిత అపార వారధి పార కవి కౌనేరయో”

    నా వాక్కును (గిరా) పావనం చేసుకోవడం కోసమే రాముని చరితను చెప్పడం. అపారమైన సముద్రం వంటి రఘువీరుని చరితను ఏ కవి అయినా, కాదు, ఎందరు కవులైనా సరే, (వర్ణించి) దాటగాలరా?!”
    __________
    విధేయుడు
    -Srinivas

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a