ఈమాట » అచ్చులో పత్రికలు అంతరిస్తాయా?

Expand to right
Expand to left

అచ్చులో పత్రికలు అంతరిస్తాయా?

అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వాళ్ళకోసం జంపాల చౌదరి గారు ఐదు సంవత్సరాల క్రితం డైజెస్ట్ పద్ధతిలో “తెలుగునాడి” అనే మాసపత్రిక ప్రారంభించారు. తెలుగుదేశపు రాజకీయాలు, విమర్శలు, పాత కథలు, కొత్త కథలు, కవితలు, వ్యాఖ్యానాలు, సినిమా నాస్టాల్జియా, పిల్లలకోసం ప్రత్యేక శీర్షికలూ అన్నీ కలిపి అందమైన కాగితంపై అచ్చు వేసి నెలనెలా అందించారు. క్రిందటి నెలతో ఆ ఒక్క డైజెస్ట్ పత్రిక ఆగిపోయింది. కారణం: చందాదారుల సంఖ్య పెరగలేదు; ప్రకటనల సంఖ్య మాత్రం తగ్గు ముఖం పట్టింది. ఐదు సంవత్సరాలపాటు ధైర్యంగా, పట్టుదలతో పత్రిక ప్రచురించిన తెలుగునాడి సంపాదకవర్గాన్ని అభినందించక తప్పదు.

ఈ సందర్భంలో అమెరికాలో అచ్చులో పత్రికల ప్రచురణ గురించి ముచ్చటించడం అవసరం.

పాశ్చాత్య దేశాలలో అచ్చులో పత్రికలు అంతరిస్తున్నాయి అని చెప్పడం అతిశయోక్తే కావచ్చు. కాని అచ్చులో పత్రికా ప్రచురణకి క్షీణదశ వచ్చింది అని ఘంటాపథంగా చెప్పడానికి ప్రత్యేకమైన ప్రావీణ్యత అక్కరలేదు. టీనా బ్రౌన్‌ అన్నట్టు ‘సముద్ర కెరటాలపై సర్ఫ్ (సవారీ) చెయ్యటానికి సముద్ర శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించనక్కరలేదు’.

అమెరికాలో గత యాభై యేళ్ళలో ఆనవాయితీగా దినపత్రిక చదివే జనాభా సుమారు ఎనభై నుంచి యాభై శాతానికి తగ్గింది. దినపత్రికలకి చందాదారుల సంఖ్య ఏటేటా రెండు శాతంనుంచి ఐదు శాతంవరకూ తగ్గుతోంది. 18-35 సంవత్సరాల వయస్సులో వున్న యువతలో పంతొమ్మిది శాతానికి మాత్రవే దినపత్రిక చదివే అలవాటు ఉన్నది. పత్రికా ప్రచురణ వ్యయం పెరిగింది. ప్రకటనల పరంగా వచ్చే ఆదాయం పల్చబడింది. కొన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన దినపత్రికలు అప్పుల భారంలో మునిగి పోతున్నాయి. ఈ మధ్యకాలంలో నూటయాభైయేళ్ళుగా ప్రసిద్ధికెక్కిన దినపత్రికలు మూతపడ్డాయి; మూత పడని పత్రికలలో పాత్రికేయుల సిబ్బంది పల్చబడ్డది. సిబ్బందితో పాటు పత్రికల సైజు కూడా తగ్గింది.

టెలివిజన్‌, ఇంటర్నెట్, ముఖ్య వార్తలని కాలయాపన కాకుండా తక్షణం అందిస్తున్నాయి. అందుకనే దాదాపు అన్ని ఇంగ్లీషు దినపత్రికలు అచ్చులోనే కాక ఇంటర్నెట్లో కూడా ప్రచురించడం మొదలు పెట్టారు, దినపత్రిక చదివే యువత జనాభా పెంచడం కోసం; తద్వారా వచ్చే ప్రకటనల రాబడి పెరుగుతుందన్న ఆశతోనూ.

అతి వేగంగా పెరుగుతున్న ఇంటర్నెట్ ప్రభావం వల్ల ఇప్పుడు మనకి అలవాటైన పద్ధతిలో దినపత్రిక అనేది సమీప భవిష్యత్తులో ఉండకపోవచ్చు. త్వరలో అచ్చుపత్రికలు ఈ-ఇంక్ తోనో, ఈ-పేపర్ (Flexible OLED) మీదనో రావచ్చునేమో! అప్పుడు అచ్చుపత్రిక అంటే నిజంగా వెదురు గుజ్జు కాగితం పైన అచ్చు వేసింది అవుతుంది. కనీసం అప్పటి దాకా అచ్చులో దినపత్రికలు అంతరించడానికి పైన యిచ్చిన కారణాలు అన్ని రకాల పత్రికల ప్రచురణకీ వర్తిస్తాయని అని నా నమ్మకం.

దినపత్రికలు కేవలం వార్తలకే పరిమితం అయినా, వార్తలకే పరిమితం కాని వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు అమెరికాలో ఎన్నో ఉన్నాయి. అమెరికాలో ప్రతి హాబీని ప్రోత్సహించే వ్యాపార పత్రికలు కోకొల్లలుగా ఉన్నాయి. కార్లకి, షికార్లకి, పుకార్లకీ, అందానికీ, ఆరోగ్యానికీ కూడా పత్రికలున్నాయి. కావాలంటే ఈసారి మీరు డాక్టరు గారి ఆఫీసు కెళ్ళినప్పుడు కాలయాపన చెయ్యడం కోసం వెయిటింగ్‌ హాల్లో పడేసిన పత్రికలు చూడండి. ఎన్నిరకాల పత్రికలు ఎంత అందంగా అచ్చయి వస్తున్నాయో లెక్క కట్టడం కష్టం. వీటి భవిష్యత్తు ఏమిటి?

ఒకటో రెండో మినహా, మిగిలిన పత్రికలన్నీ అచ్చుపత్రికలుగానే ఉండే అవకాశం ఉన్నది. ఇందుకు కారణం చందాదారుల సంఖ్యా కాదు, లబ్ధప్రతిష్టులయిన రచయితల వ్యాసాల ప్రచురణా కాదు. అవి అచ్చులో మనగలగడానికి కారణం వాటిలోని వ్యాపార ప్రకటనలే. ఈ రకం పత్రికలలో, ఏ పత్రిక తిరగేసి చూసినా, నలభై ఐదు నుంచి యాభై ఐదు శాతం పేజీలు వ్యాపార ప్రకటనలతో నిండి ఉంటాయి. ఈ పత్రికలలో వేటికయినా సంవత్సర చందా విడి ప్రతి ఖరీదుతో పోల్చి చూస్తే అతి స్వల్పం. అంటే, చందాదారుల మూలంగా ఈ పత్రికలకి చెప్పుకోదగ్గ రాబడి ఏమీ లేదు. అసలు ఏ పత్రికా చందాదారుల చందా రాబడిపై ఆధారపడి మనలేదు. అయితే, ఈ పత్రికల సర్క్యులేషన్‌ ఎంత ఎక్కువగా చూపగలిగితే ఆ పత్రిక యాజమాన్యానికి వ్యాపార దృష్ట్యా అంత ఉపయోగకరం. ఎందుకంటే, పత్రికలకి ప్రకటనల వలన వచ్చే రాబడి ఆ పత్రికల సర్క్యులేషన్‌ పై ఆధారపడి ఉంటుంది.

ఇవి కాక, కేవలం సాహిత్యం, సంస్కృతి, కవిత్వం, విమర్శ లాంటి “హై బ్రో” విషయాలకి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చే పత్రికల మనుగడ గురించి చూద్దాం. వీటిలో కొన్ని పత్రికలు వ్యాపారసరళిలో ప్రచురించబడేవి. ఈ పత్రికలకి కూడా ప్రకటనల వలన వచ్చే రాబడి సుమారు ఇరవై శాతం తగ్గిందట! ఈ తరహా పత్రికలు ఇప్పటికే ముఖ్యంగా - బ్లాగ్‌ సంస్కృతి - తెచ్చిన మార్పులతో, ఇంటర్నెట్లోకి వచ్చాయి. ఈ పత్రికలు అచ్చుపత్రికలుగా కూడా ఎంతకాలం ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టం. అమెరికాలో “పొయట్రీ” (Poetry Magazine) అనే పత్రికకి ఒకరు నూరు మిలియన్లు దానం ఇచ్చారు. మంచి నాణ్యత గల సాహితీ పత్రిక ప్రచురించడానికి లాభాపేక్ష లేని పెద్ద సంస్థల, లేదా, వ్యక్తుల మద్దతు అవసరం.

అచ్చుపత్రిక కానీయండి, వెబ్‌పత్రిక కానీయండి, వ్యాపార సరళిలో పత్రిక నడపాలంటే, ఆ పత్రికలో విరివిగా ప్రకటనలుండాలి. విరివిగా ప్రకటనలు రావాలంటే సర్క్యులేషన్‌ పెరగాలి. ఎథ్నిక్‌ పత్రికలకి, ముఖ్యంగా ప్రవాస భారతీయుల మాతృభాషలలో ఎథ్నిక్ పత్రికలకి సర్క్యులేషన్‌ ఒక పట్టాన పెరగదు. కారణాలు వెదకడం అనవసరం. నా ఉద్దేశంలో, దేశవ్యాప్తంగా ఎథ్నిక్ పత్రికలు వ్యాపారసరళిలో నడపటం ప్రస్తుతానికి చాలా కష్టమైన పని.

ముగింపుగా రెండు ప్రశ్నలు.

తెలుగునాడి అంతర్జాలంలో కూడా ప్రచురిస్తే ఇంకా నిలిచి వుండేదా? అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న. ఈమాట అచ్చుపత్రికగా కూడా ప్రచురిస్తూ ఉండుంటే ఇప్పటిదాకా మనగలిగేదా?


సంప్రదించిన కొన్ని వ్యాసాలు:

  1. Tina Brown interview as Q & A in The Daily Beast, October 5, 2008
  2. Eric Alterman’s essay, Out of Print in The New Yorker, March 31, 2008
  3. The Economist, “Who killed the newspaper?” August 24, 2008
  4. Randy Dotinga in The Christian Science Monitor, April 25, 2005
 

(14 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    July 1, 2009 6:05 am

    వేలూరి గారికి:

    ఒక ముఖ్యమైన విషయం పై మీ వ్యాసం ఇప్పుడు సందర్భానుసారంగా ఉంది.

    “తెలుగు నాడి” ప్రచురణ ఆగిపోవటం విచారకరం. జంపాల చౌదరి గారు మిగిలిన సంపాదక వర్గం సభ్యులు గత ఐదేళ్ళగా చేసిన కృషికి అభినందనీయులు. తెలుగునాడి ఆఖరి సంచిక ఇంత తొందరగా చూస్తామని అనుకోని అమెరికా తెలుగు ప్రియులకి ఈ వార్త నిరాశని కలిగించింది అనటంలో సందేహం లేదు! కానీ ఈ పరిణామాల వెనుక ఉన్న శక్తులేవి? అన్న ప్రశ్న ఆలోచింపతగింది.

    నిజమే! అమెరికలోనే కాక మరెన్నో చోట్ల అచ్చు పత్రికలకు మనుగడ కష్టమౌతోంది. కానీ, ఇది ఊహించని పరిణామమా? ప్రస్తుతం నడుస్తున్న ఆర్ధిక మాంధ్యమే పూర్తిగా ఈ పర్యవసానాలకి మూలమా? బహుశా కాదని నా అభిప్రాయం.

    ఇంటర్‌నెట్ వాడకంలోకి వచ్చిన దగ్గర నుంచి, అమెరికాలో ఉన్న ఐటి రంగంలోని నిపుణులే, ఇంటర్‌నెట్ యొక్క విశ్వరూపాన్ని సరిగ్గా అంచనా వెయ్యలేకపోయారు. ఇప్పుడు మనం మన జీవితాల్లో చూస్తున్న ఇంటర్‌నెట్ ప్రభావం Tip of the Iceberg మాత్రమే! ఇంటర్‌నెట్‌లో ఇప్పుడు అనేక భాషల్లో (తెలుగుతో సహా) స్వచ్ఛందంగా నడపబడుతున్న అనేక వెబ్ పత్రికల ఆవిర్భావం, ఇంటర్‌నెట్ విశ్వరూపాల్లో ఒక అతి చిన్న అంశం మాత్రమే. ఇప్పుడు ఇరవై ఏళ్ల ప్రాంతంలో ఉన్న అమెరికా తెలుగు కుర్రకారు ఒక్క సెంటు కూడా ఖర్చు పెట్టకుండా ఇంటర్‌నెట్‌లో ఉచితంగా అన్ని రకాలైన సినిమాలు (తెలుగుతో సహా), సంగీతం ఆనందిస్తున్నారు. ఇది పది, పదిహేనేళ్ళ క్రితం ఊహించని పరిణామం.

    వేలూరి వారి చివరాఖరి రెండు ప్రశ్నలకు నా జవాబు:

    “తెలుగునాడి అంతర్జాలంలో కూడా ప్రచురిస్తే ఇంకా నిలిచి ఉండేదా?”. బహుశా అవును. అచ్చులో ఈ ప్రతికను తీసుకు రావడమే ఇప్పుడు ఏర్పడ్డ నిరాశ పరిణామానికి కారణం.

    “ఈమాట అచ్చులో వచ్చుంటే?” - ఈపాటికి కాలగర్భంలో కలిసిపోయేది.

    “ఈ మాట” పుట్టటానికి కారణం మీకు నేను గుర్తు చెయ్యక్కర లేదు కదా!

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  2. Rao Vemuri అభిప్రాయం:

    July 6, 2009 3:27 pm

    అంతర్జాలంలో అప్పనం (free) గా దొరుకుతూన్న సరుకులకి డబ్బిచ్చి కొనుక్కోవలసిన అవసరం ఏముంది? అన్నింటిని అప్పనంగా అనుభవించటానికి అలవాటు పడిపోయేం. ఆంధ్రాలో అయితే “విద్యుత్తుని అప్పనంగా అనుభవించటం మీ జన్మ హక్కు” అని ప్రభుత్వమే ప్రజలని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుంటోంది. ఈ దృక్పథం ఇండియా సొత్తేమీ కాదు. తొంభయి తొమ్మిదేళ్ళు నిండి, కాటికి కాళ్ళు జాపుకున్న వ్యక్తి కూడ భీమా కంపెనీ చెల్లిస్తున్నాది కదా అని తొమ్మిది మిలియన్లు ఖర్చు అయినా, వైద్యం చెయ్యమంటాడు. “గూగుల్‌”లా ఏదో కొత్త పంథా “బిజినెస్‌ మోడల్‌” కనిపెట్టే వరకూ అంతర్జాల పత్రికలకి, అచ్చు పత్రికలకి ఈ దుస్థితి తప్పేటట్లు లేదు.

  3. rama bharadwaj అభిప్రాయం:

    July 6, 2009 11:32 pm

    మీకంతా మరి ఇప్పుడు ఇంత కష్టంగా అన్పిస్తోంది కదా!! మరి ఈ సంగతిని గురించే కదా నేను మరొక విధంగా హెచ్చరించానూ!! రాసే వాళ్ళ కృషి ని కూడా పత్రికలు “అప్పనంగానే”..కొట్టేయ్యాలని చూడటం లేదూ??! ఎందరి రచయితల ఊహా శక్తిని ఊరికే ఆశించడం లేదూ అన్ని పత్రికలూనూ? ఇది మాత్రం ఎవరికీ ఇబ్బందిని కల్గించనేలేదే??రాసేవాళ్ళ contribution ని చాలా casual గా చూడబట్టే కదా ఎక్కువ వైవిధ్యం ఉన్న రచనల్ని పత్రికలు సంపాదించలేకపోతున్న దీ?? పత్రికలు ఆగిపోయేయంటే ఆగిపోవూ?! మీరెంత “అప్పనంగా” అందిస్తున్నామని అనుకుంటూన్నా..ఒకనాటికి ఈ webzines కి కూడా ఈ పరిస్థితి తప్పదు. అంతేకాదు మంచి రచనల విషయంలోనూ..కవి, రచయితల విషయంలోనూ వారివారి పుస్తకాల్ని “కొని” చదివే విషయంలోనూ కూడా తెలుగువారిలో కొనసాగుతున్న ఉదాసీన త వల్ల తెలుగులో ఉత్తరోత్తరా వారి సంఖ్య కూడా క్షీణించే ప్రమాదం లేకపోలేదు. “ఎందుకు రాయాలీ?..”ఎవరి కోసం రాయాలీ??” అని సున్నిత స్వభావులైన వారు భావించే వీలుంది.ప్రోత్సాహం అన్న ది పనిచేసే వారికి చాలా అవసరం. ఆ దృక్పధాన్ని ఆ జాతి ఎమ్ త గాడంగా కలిగి ఉంటే ఆ జాతిలో..ఆ భాషలో సృజనకి సంబధించిన అన్ని రంగాలూ వికశిస్తాయి..లేదా అనివార్యంగా క్షీణిస్తాయి. ఇది తప్పదు.విజ్నులైనవారు ఈ అన్నింటిని గురించి ఆలోచించాలి..విస్తృతంగా చర్చించాలి. ఏదో “కాలక్షేప వ్యవహారం” లాగా న డిపే ఏ పత్రికలకైనా చివరికి ఈ పరిస్థితి తప్పదు. అందుకని ముందుచూపు అవసరం!!

    రమ.

  4. రాఘవ అభిప్రాయం:

    July 7, 2009 3:14 am

    తెలుగునాడి అంతర్జాలంలో కూడా ప్రచురిస్తే ఇంకా నిలిచి వుండేదా?

    నేను భారతదేశంలోనే ఉండడం వల్లనో, లేక ఈ పత్రిక భారతదేశంలో దుకాణాల్లో కనబడకపోవడం వల్లనో ఏమోగానీ, నా వఱకూ నాకు తెలియనే తెలియదండీ తెలుగునాడి అనే పత్రిక కూడా ఉందని!
    మీ ప్రశ్నకి నా సమాధానం… అంతర్జాలంలో “కూడా” ప్రచురిస్తూ ఉంటే కాగితపుటచ్చు ఆగిపోయినా అంతర్జాలంలో కనీసం కొనసాగగలిగేదేమో!

    అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న. ఈమాట అచ్చుపత్రికగా కూడా ప్రచురిస్తూ ఉండుంటే ఇప్పటిదాకా మనగలిగేదా?

    అచ్చు పత్రికగా కూడా ప్రచురిస్తే ఇంకా భేషుగ్గా ఉండేది. అచ్చు పత్రికగా మాత్రమే ప్రచురిస్తే బహుశా మఱొక తెలుగునాడిని తలపించి ఉండేది.

    అసలు నేను ఇంతవఱకూ తెలుగునాడి చదవలేదు కాబట్టి తెలుగునాడి ఆగిపోవడం గుఱించి ఏమీ మాట్లాడలేను. కానీ భాషాసేవ చేసే ఒక పత్రిక ఆగిపోయిందే అన్న బాధ మాత్రం ఉంది.

  5. Srinivas Nagulapalli అభిప్రాయం:

    July 7, 2009 6:03 pm

    ‘తెలుగునాడి’ ఆగిపోవడానికి కారణాలను మన దగ్గరే ఉన్న చెట్టంత మనిషి, జంపాలగారు వివరిస్తే బాగుంటుంది. కాని, ‘తెలుగునాడి’ నడవడానికి, అంటే కనీసం వెయ్యి మంది చందాదారులతో నడవడానికి, చిన్న కారణం చెప్పగలను. ఏమీ లేదు- marketing! వజ్రమైనా, గిట్టుబాటుధరకు వ్యాపారికావాలేమో!

    మొత్తం అమెరికా దేశంలోని భారతీయ కూరగాయల దుకాణాలలో cashier దగ్గర కాపీలు పెడితే, ప్రతిపది మందిలో ఒక్కరైనా, తెలుగు రానివారైనా సరే, అట్టచూసో, అందం చూసో(అదే బాపుబొమ్మల అందం!), మొహమాటపడో- కొన్నా, వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం, పత్రిక నడవడం పెద్ద విషయం కాదు. పత్రిక నడవడం కాదు, నడవకపోవడానికే పెద్ద కారణాలు వెతకాలనుకుంటాను, ఆర్థిక మాంద్యం ఇవ్వాళున్నస్థితి కాని, ఐదు ఏళ్ళుగా చందాదారుల సంఖ్య పెరగకపోవడానికి అది కారణం కాదనే అనిపిస్తుంది.
    ==========
    విదేయుడు
    -Srinivas

  6. Veluri Venkateswara Rao అభిప్రాయం:

    July 12, 2009 10:19 am

    మొదటివిషయం:

    తెలుగునాడి పత్రిక నిర్వాహకులు ఆంధ్రదేశంలో రచయితలకు పారితోషికం ఇస్తూనే ఉన్నారు. తెలుగునాడి డైజెస్ట్ పద్ధతిలో పత్రిక. ఆంటే, అందులో అచ్చయిన చాలా వ్యాసాలు, చాలా కథలు — ఇవన్నీ రెండవసారి ప్రచురించబడ్డాయి. ఒకసారి ప్రచురితమైన ప్రచురణలు తిరిగి ప్రచురించి తెలుగుదేశంలో పత్రికలతో సమానంగా ( అంతకన్నా ఎక్కువగానే అని విన్నట్టు గుర్తు) తెలుగునాటి రచయితలకు వాళ్ళు పారితోషికం ఇస్తున్నారు. అయినా తెలుగునాడి మూతపడింది. అచ్చుపత్రికలు మూతపడటానికి కొన్ని ముఖ్యకారణాలు నేను సంపాదకీయంలో ముచ్చటించాను.

    రెండో విషయం :
    I request the eemaaTa readers to read an article by Malcolm Gladwell, titled, Priced To Sell, in the most recent issue of The New Yorker
    (The New Yorker, July 6 & 13, 2009) . I wish I had the issue at hand when I was writing my editorial.

    అభివాదాలతో,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  7. K. V. S. Ramarao అభిప్రాయం:

    July 13, 2009 10:02 am

    వేలూరి గారు ఇలాటి వ్యాసం “ఈమాట” లో రాయటం ఆశ్చర్యకరం. ఐతే ఇది “వెబ్ కల్చర్ ” మన జీవనవిధానాన్ని పూర్తిగా మార్చేస్తున్న సంధి సమయం గనుక ఈ సందర్భంలో ఈ విషయం గురించిన చర్చ సమంజసమే నేమో.
    కాగితపు పత్రికలకు కాలం చెల్లిందన్న విశ్వాసమే “ఈమాట” ఆవిర్భానికి మూలం అని పదేపదే చెప్పనక్కర లేదు. వేలూరి గారు వారి వ్యాఖ్యలో ఉట్టంకించిన “న్యూయార్కర్ ” లోని పుస్తకపరిచయం కూడ వెబ్ మీద అప్పనంగా దొరుకుతుంది - దానికి పుస్తకం అక్కర్లేదు - ఇక్కడ క్లిక్ చెయ్యండి - http://www.newyorker.com/arts/critics/books/2009/07/06/090706crbo_books_gladwell .
    వెబ్ మీద ఉన్న “కంటెంట్ ” ఏదైనా సరే ఫ్రీ గా దొరకాలి అనేది దాదాపుగా అందరూ అంగీకరించిన సత్యం ఐపోయింది. ఎక్కడిదాకానో ఎందుకు, “ఈమాట” ఫ్రీ పత్రికే కదా ! ఈ “సత్యం” వల్ల ఇప్పటికే కలిగిన ఉపయోగం ముందు కొందరికి కలిగిన “నష్టాలు” చాలా తక్కువ అని నా అభిప్రాయం. అంతేకాదు, అలా నష్టపోతున్నా మనుకునే వారు ఇంకెవర్నో నిందించటం ఆపి కొత్త మార్గాలు వెదుక్కోవటం అవసరం. వెబ్ విప్లవం రాకముందు ఏదైనా జర్నల్ లో వచ్చిన ఒక టెక్నికల్ పేపర్ కాపీ సంపాయించాలంటే ఎంత భగీరథయత్నం అయేదో చాలా మందికి స్వానుభవమే. అదే ఇప్పుడు ఎలాటి టెక్నికల్ పేపర్ ఐనా (కనీసం నాకు ప్రత్యక్షంగా తెలిసిన కంప్యూటర్ సైన్స్ రంగంలో) పట్టుకోవటానికి ఒక నిమిషం పట్టదు. అలాగే, మనం ఏదైనా ఒక కొత్త విషయం గురించి పరిశోధన చెయ్యాలన్నా అదిప్పుడు ఎంతో తేలిక. ఇలాటివి ఇదివరకు అసాధ్యాలు.
    రమ గారు లేవదీసింది దీనికి లంబంగా (”అర్థాగొనల్ ” కి అనువాదం) ఉన్న విషయం. రచయిత్రులకు పారితోషికం విషయం. పత్రికల మనుగడే ప్రశ్నార్థకం ఐతే ఇక వారిచ్చే పారితోషికాల మాట చర్చనీయమా అని సందేహం కలగొచ్చు కాని ఇవి రెండూ వేర్వేరు విషయాలు. ఆర్థికంగా సామర్థ్యం వున్న పత్రికలు తప్పక పారితోషికాలియ్యవలసిందే. కాని పత్రికే ఫ్రీ అయి, మరే విధమైన ఆదాయమూ ఆ పత్రిక్కి లేకపోతే వారు పారితోషికాలు ఎలా ఇవ్వగలరు? ఒకవేళ ఎవరో దానం చేసో లేక సంపాదక వర్గమే సొంత డబ్బు వేసో ఇచ్చినా అది ఎక్కువ కాలం నిలబడే పద్ధతి కాదు. పత్రికల వారి లాగానే రచయిత్రులు కూడ ఆర్జనకి ఇతర మార్గాలు కనుక్కోవాలి.
    ఇది సంధి కాలం కనుక అలాటి మార్గాలు ఇంకా స్పష్టంగా లేవు. ఐతే సినిమాల దెబ్బకు తోలుబొమ్మలాటలు ఎలా మూలబడ్డాయో వెబ్ దెబ్బకు కాగితపు పత్రికలు, వాటికి సంబంధించిన వారూ దెబ్బతినటం తప్పదు. ఎంత త్వరగా ఇది గుర్తించి ఎవరికి అనుకూలమైన మార్గం వారు చూసుకుంటే అందరికీ అంత మంచిది - అని నా అభిప్రాయం.

  8. rama bharadwaj అభిప్రాయం:

    July 13, 2009 11:17 pm

    ఇక్కడ చర్చ పత్రికల మనుగడ. వెబ్ లో కొనక్కరలేకుండా “అప్పనంగా” దొరుకుతున్నప్పుడు పత్రికల్ని “కొని” ఎవరు చదువుతారని వాపోయిన వారు వేమూరి వారు. “అప్పనంగా” అన్నమాట free అన్న మాటకి దాదాపు సమానార్ధకమే అయినా విశాఖపట్ణం ప్రాంతంలో దాన్ని కాస్త ఉక్రోషంగానూ..కోపప్రకటన లోనూ ఉపయోగిస్తారు. ఈమాట వేమూరి వారు పత్రికల్ని కొని చదివి నిలబెట్టుకోని చందాలు కట్టని పత్రికల కృషిని గుర్తించని తెలుగుల పట్ల కోపప్రకటన గానే వాడేరు. ఆయన బాధ..లేదా కోపం నాకు అర్ధం అవుతాయి కూడా! అవి సమంజసమైనవేనని నేననుకుంటూనే..ఆ కోపానికి అటూ ఇటూ ఉన్న విషయాల్ని కూడా ఈ సందర్భంలో మరోసారి గుర్తు చేసాను. అంతేగానీ పత్రికలు ఇచ్చిన డబ్బుల్తోనే కవులూ రచయితలూ సంసారాలు చేస్తున్నారనీ కాదు. రేపు ఈ పత్రికలన్నీ ఆగిపోతే రాసేవాళ్ళ బతుకులు వీధిన పడిపోతాయనీ కాదు.
    రాసే వారు లేందే..ఏ పత్రిక్కీ మనుగడ లేదు. అలా ఉంటుందని ఎవరైనా అన్నా..అనుకున్నా..అది వట్టి దబాయింపు..బుకాయింపు మాత్రమే!! పత్రికా నిర్వాహకులకందరికీ ఈ సంగతి బాగా తెలుసు. మాకు రచనల్తోనీ..రచయితల్తోనీ అవసరం లేదని ఏ పత్రికల్ వాళ్ళైనా అన గలరా?? అనలేరు. ఏనాడైనా రచయితలు పత్రికల మనుగడకి అంతే అవసరం. అదే రచయితలు[కొత్తకొత్తగా రాస్తున్న వారు తప్ప] డబ్బుల కోసం కాక పోతే పత్రిక్కి పంపనఖ్ఖర లేదు. బెంగాల్ లో రచయితల కోసం రచయితలే little magzines పేర చిన్న కరపత్రాల వంటివి న డిపిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. చాలా పెద్ద కవులు వాటిలోనే తమ కవిత్వాన్ని ప్రచురించారు. పత్రిక స్వభావాన్ని బట్టి దాని ఆశయాన్ని బట్టి..దాన్ని బతికించుకుందికి రచయితలే ముందుకొచ్చారు. ఇంక కొని చందాలు కట్టే పత్రిక ఉద్దేశ్యం బట్టీ..దాని పాఠక వర్గ స్వభావాన్ని బట్టీ అది ఎన్నాళ్ళు న డిచేదీ నిర్ణయమైపోతుంది మరి..
    .రమ.

  9. t rao అభిప్రాయం:

    July 30, 2009 2:54 am

    With a bit of determination, financial, and marketing tricks, certainly a small print Telugu magazine can be run. I know at least one Hindi magazine is brought out in print like that (from Prof. Ram Chaudhari). The issues that affect major US Newspapers/magazines and those that are pertinent to small non-English language publications could be different. After all (there is a Telugu proverb) a storm can damage large banyan tree - but small shrubs and even tall palm trees withstand cyclones and typhoons.
    I and many writers always appreciate the views of Rama Bharadwaj. If one has feelings for the death/dearth of inert paper/print - sure, one can have a fountain of welled/swelled feelings for any and all writers who pour out their concentrated labors into any medium.

  10. Chandra అభిప్రాయం:

    August 4, 2009 10:11 am

    పత్రిక/పుస్తక ప్రచురణ భవిష్యత్తుపై ఆసక్తి ఉన్నవారికి -
    http://www.neh.gov/news/humanities/2009-07/WhatIf.html
    http://thegoldennotebook.org/

  11. lyla yerneni అభిప్రాయం:

    August 5, 2009 11:24 am

    పత్రిక/పుస్తక ప్రచురణ భవిష్యత్తుపై ఆసక్తి ఉన్నవారికి -
    http://www.neh.gov/news/humanities/2009-07/WhatIf.html
    -Chandra

    Below is an excerpt from the artcle.

    “The result was a dynamic read for participants and onlookers. A rolling margin for commentary remained in place next to the page of text being commented on. It also allowed further remarks, comments on the comments, to be added, all next to the relevant passage. One of the collaborating readers said of the experience, “It was those lengthy, sometimes tangled conversations in the margins which were the most exciting feature of the project.”

    ఆర్టికల్ బాగుంది. చాలా పెద్దది ఇంకా అంతా చదవలేదు. కాని అందులోని ఈ పై విషయం గమనిస్తారని రాస్తున్నాను.
    ఈ మాట మేగజీన్లో, పాఠకుల అభిప్రాయాల్లో కొన్నాళ్ళ క్రితం జరిగింది ఇదే. పాఠకులు కొందరు -పత్రికలో ప్రచురించిన రచనల కన్నా కొన్నిసార్లు వాటి మీద రాసిన అభిప్రాయాలు ఇంకా సరదాగా ఉన్నాయన్నారు. అది నిజం.
    కొత్త ప్రచురణ మీడియంలో అనుకోని లాభాలు మనకు లభిస్తాయి. అవి మనకు అక్కర్లేదా? అనుకోకుండా పెనిసిలిన్ కనిపెడ్తే, అలెక్సాండర్ ఫ్లెమింగ్ -అబ్బే దీని కోసం కాదు నేనీ ఎక్స్పెరిమెంట్ మొదలెట్టింది అని చెప్పి ఆ మందుని తీసికెళ్ళి అవతల పారెయ్యలేదు. సైంటిస్టులూ కోప్పడలేదు. అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈ మాట ఇప్పటి కొత్త పాఠకులు మరింత తెలివైన వారై, వారి కామెంట్లు, కామెంట్ల మీది కామెంట్ల వల్ల పత్రికలో రాతలు పదునెక్కితే పత్రిక చదివేవారు ఎక్కువవుతారు. రాసే వాళ్ళూ ఇంకా ఆసక్తి కలిగించేలా రాస్తారు.

    లైలా.

  12. చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    January 31, 2010 4:42 am

    జీవితంలో అనుకోకుండా ఎదురయిన విరామం.

    పనీ పాటా లేకుండా కూర్చోవలసి రావటంతో తెలుగు సాహిత్యంలో ఏం జరుగుతోందో తెలుసుకో వాలని కుతూహలం పుట్టుకొచ్చింది. ఎక్కడో వీపుమీద చీమ పాకినట్టు మొదలయి, జరజరా పాకి మాడులోకి అంటుకుంది.

    తెలుగులో రెండు రకాల పత్రికలు వున్నాయి. సౌలభ్యం కోసం వాటిని గబ్బు పత్రికలు, వెబ్బు పత్రికలుగా వర్గీకరించుకోవచ్చును. గబ్బు పత్రికలు మళ్ళీ రెండు రకాలు. సమస్త జ్ఞాన రంధ్రాలనీ మూసుకుంటే తప్ప భరించ లేనివి కొన్ని. ముక్కు వొక్కటీ మూసుకుంటే చడవగలగినవి మరి కొన్ని. ఈ రెండో రకం పత్రికలలో మురుగుతో పాటు అడపా దడపా బంగారమ్ముక్కలు కూడా కొట్టుక వస్తవి. వాటిని జల్లెడ పట్టి ఏడాదికో రెండేళ్ళకో ఎవరో వొకరు సంకలనాలు ప్రచురిస్తూ వుంటారు. అటువంటి సాహిత్య కార్మికులకి మన సమాజంలో తగిన గుర్తింపు లేదు.

    వెబ్బు పత్రికలు గబ్బు పత్రికల చావుకి వచ్చాయా అన్నది పై వ్యాసమూ దాని మీద చర్చకూ మూలాంశము. దీనివలన తెలుగు సాహిత్యానికి ఏదో మేలు జరుగుతుందని నమ్మటానికి నాకేమీ అభ్యంతరం లేదు. అదేంటో నాకు సరిగా తెలియక పోవటం వలన ఆ విషయాన్ని విజ్ఞులకే వదిలేస్తాను.
    వెబ్ పత్రికల వలన ప్రచురణా సంస్కృతులలో రాగల పరిణామాలు, వాటిని ఎట్లా ప్రయోజనకరంగా దిద్దుకోవచ్చును అన్న విషయం ఎవరూ ప్రస్తావించలేదు. (రమా భరద్వాజ్ గారూ - ఇది వుతుకుడు కాదు).

    1. ప్రచురణ అన్నది ఒక కాల చక్రానికి లోబడి వుంటుంది. టెక్నాలజిలో మార్పుల వలన ఆ కాల చక్రం మారిపోతుంది. పాఠకుల అభిప్రాయాలు వెంట వెంటనే ప్రచురితమవుతాయి. పేజీల పరిమితి వుండదు. మధ్యలో పోస్ట్ ఆఫీసు ప్రమేయం వుండదు కాబట్టి రచయితల కృషి ఫలం కూడా సంపాదకులకీ , విమర్శకులకీ, ఆపైన పాఠకులకీ తొందరగా అందుతుంది.

    2. వెబ్బు పత్రికలు అందరికీ అందుబాటులో వుండవు. పుస్తకం చేతిలో పట్టుకుని , పక్క మీద బోర్లా పడుకునో, దిండుమీద చేరబడో, వరండా లోనో బాల్కనీలోనో బస్సులోనో చదువుకునే వెసులుబాటు వుండదు. (నా చిన్నప్పుడు మా అమ్మా నాన్న కొనుకున్నవో, లైబ్రరీ నుంచి తెచ్చుకున్నవో పుస్తకాలు ఎవరూ చూడకుండా మంచం కింద దూరి చదువుకొనే అవకాశం లేక పోయి వుంటే నేను ఎంత అజ్ఞానిని అయివుందునో తలచుకుంటే వొళ్ళు గగుర్పొడుస్తుంది).

    ఈ రెండు విషయాలనే తీసుకున్నా వెబ్బు పత్రికలు తెలుగు సాహిత్యంలో వొక ప్రయోజనకరమైన దిశా నిర్దేశం చెయ్యగాలవని ఆశించవచ్చు. గబ్బు పత్రికలలో ప్రచురించబడటానికి ప్రస్తుతం తెలుగులో సాహిత్య కృషికన్న ఎక్కువగా సంపాదకులతో, విమర్శకులతో, వునికివాద రాజకీయ సంఘాలతో, ఎన్.జి. వో. లతో, ఒక్క మాటలో చెప్పాలంటే నానా రకాల మఠాలతో, ముఠాలతో, పీఠాలతో సంబంధాలు ఏర్పరచుకోవాల్సి వస్తోంది.

    ఈ విష సంస్కృతిలో నిలదొక్కుకోవాలంటే , రచయిత (త్రు) లు అసాధారణమైన ప్రజ్ఞావంతులు, అసామాన్యమైన నైతిక స్థైర్యం కలిగి వున్న వాళ్ళూ, దార్శనికులూ అయి వుండాలి. కొత్త తరం సాహిత్య కర్షకులపైన ఇంత భారం మోపటం భావ్యం కాదు. అందుకే వెబ్బు పత్రికలు - అనుకోకుండా, మన చేతిలో పడ్డ కొబ్బరి కాయలుగా భావించి, కోతి సాయంగా కొత్త వారధులు కట్టడానికి శ్రమించడం మంచిది.

    చాకిరేవు ఉపేంద్ర

    పి.ఎస్.
    కొబ్బరి కాయనించి వారధికి ఎట్లా వచ్చానని ఎవరూ అడగరు అనే నమ్మకం, పొగరు బోతు తనం నాకు రావటానికి ముఖ్య కారణం ఈ మధ్య కాలంలో వచ్చిన తలా తోకా లేని అనేకానేక తెలుగు రచనలే అని గమనించగలరు.

  13. e.bhaskaranaidu అభిప్రాయం:

    April 4, 2010 10:49 am

    ఇప్పుడొస్తున్న అచ్చు పత్రికల్లొ కాల్పనిక సాహిత్యం వాసి చాల తక్కువగా వున్నట్టు నాకనిపిస్తుంది. నేనెంతో మేధావినని అనుకోవడంలేదు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి నిర్మించిన సినిమాని ఒక నేల టికెట్టు ప్రేక్షకుడు “ఛీ” అనే ఒక మాటతో తీసి పారెయ్యగలడు. అలాంటిదే ఇదీను. ఆ కారణంగానే ఇటువంటి పత్రికలు కొంత వరకు ప్రాచుర్యాన్ని కోల్పోతున్నాయని నాకనిపిస్తుంది. రాబోవు కాలంలో వెబ్ పత్రికలు ఇంకా ప్రాచుర్యంలోనికి రాగలవని నా భావన. ఎలాగంటే నేటి యువతలో సాహిత్యాభిలాష అంతగా లేకపోవడం, వారికి అంత సమయం లేకపోవడం, వారికి ఓపిక కూడ లేకపోవడం వంటి కారణాలు చెప్పుకోవచ్చు. ఇక వెబ్ పత్రికలు రాను రాను ప్రాచుర్యంలో కొంత ప్రాచుర్యాన్ని పొందడానికి కారణం: …వాటిని చదివే వారు సాహిత్యాభిలాష కలవారు, విశ్రాంత జీవులు, మేధావులు కావచ్చన్నది నా అభిమతం. అంతర్జాలం ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే బహుళ ప్రచారమవుతున్నందున రాను రాను అవి పురోగమించ వచ్చనిపిస్తుంది. కనుక రాబోయే కాలంలో వెబ్ పత్రికలదే రాజ్యమని నాకనిపిస్తున్నది.

  14. chakirevu upendra అభిప్రాయం:

    April 11, 2010 10:36 pm

    ఈ మాటనూ, ఇలాంటిదే మరొక వెబ్ పత్రిక ప్రాణహితనూ కొంత కాలంగా గమనిస్తుంటే ఈ విషయం తట్టింది. ఈ రెండు పత్రికలలోనూ పాఠకులు పాల్గొనడానికి రెండు మార్గాలు ఏర్పాటు అయినాయి. 1) ప్రచురణల క్రింద వ్యాఖ్యలద్వారా , 2) చర్చా వేదికల ద్వారా. సర్వ సాధారణంగా ప్రచురణ చదివిన తరువాత వెంటనే తట్టిన విషయాలని ఆ క్రింద వ్యాఖ్యల రూపంలో పాఠకులు వ్రాసేస్తారు. ఈ వ్యాఖ్యలే చర్చలకి దారి తీస్తుంటాయి. చర్చా వేదికలని వుపయోగించుకోవాలంటే ఫోరంలో సభ్యత్వం రిజిస్టర్ చేసుకోవాలి. ఫోరంలో సభ్యులు తమంత తాముగా పత్రిక సంచికల్లో ప్రచురితమైన రచనలతో సంబంధం లేకుండానే స్వతంత్రంగా చర్చ మొదలు పెట్టే అవకాశం ఉన్నా, సభ్యత్వం లాగిన్, రచననించి దూరంగా మరో పేజీ లోకి వెళ్ళటం అనే ఒక చిన్న చిన్న సాంకేతిక అడ్డంకులు వుండటం వల్లనో లేక పూర్తి స్థాయి చర్చ నడపడానికి కావలసిన చొరవా, ఆసక్తీ , సావకాశమూ లేక పోవటం చేతనో - పాఠకులు ఎవరూ పెద్దగా వీటిని ఉపయోగించుకుంటున్నట్టు కనపడదు. ఎవరూ ఉపయోగించుకోని చర్చా వేదికలు - ఇంట్లో పనికిరాని సామాన్ల గది లాగా, సింగపూర్ లో ‘స్పీకర్స్ కార్నర్’ లాగా కనపడతాయి. దీన్ని సవరించడానికి రెండు సలహాలు -

    1) పత్రిక లాండింగ్ పేజీ లోనే - ప్రశ్నలూ జవాబులూ లాంటి ఒక శీర్షికని ప్రారంభించవచ్చు. దాని క్రింద ఉప శీర్షికలు పెట్టుకునే అవకాశం కల్పిస్తే - ప్రచురితమైన రచనలతో నేరుగా సంబంధం లేని వ్యాఖ్యలన్నీ అందులోకి వెళ్లిపోతాయి. ఎవరో ఒకరో ఇద్దరో ఎక్స్పర్టులు మాత్రమే జవాబులు చెప్పాలన్న నియమమేమీ వుండకుండా అందరూ పాల్గొనే వీలుంటుంది కాబట్టి — ప్రశ్నలూ , జవాబులే ఒక చర్చా వేదికగా ఉపయోగ పడుతుంది.

    2) చర్చా వేదికలలో ‘ప్రచురితమైన రచనలపై చర్చలు’ అన్న పేరుతో ఒక వేదికని ఏర్పాటు చేసి - ప్రస్తుతం ప్రచురణల కింద వ్రాయబడుతున్న వ్యాఖ్యలని దానిలోకి నేరుగా ఇంపోర్ట్ చేసెయ్యవచ్చు.

    ఈ రెండు మార్గాలకీ వుద్దేశ్యం ఒకటే - వ్యాఖ్యలూ, చర్చలూ అన్న రెండు రెండు శీర్షికలనూ కలిపి వేయటం. సాధ్యా సాధ్యాలు మీరు ఉపయోగిస్తున్న కంటెంట్ మానేజ్మెంట్ సిస్టమ్ మీద ఆధార పడి వుంటాయనుకుంటాను. ఆలోచించ గలరు.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a