ఈమాట » పడమట సంధ్యారాగం

Expand to right
Expand to left

పడమట సంధ్యారాగం

ఇవాళ రోజు రోజంతా వేస్టే.

మీటింగులో పేపర్లన్నీ పరమ బోరింగా ఉన్నాయి, ఒక్క ఫుల్లర్‌ ప్రెజెంటేషన్‌ తప్ప. సాయంత్రం ఠంచన్‌గా ఆరుకొట్టంగానే సుందరం బయట పడ్డాడు. వాంకూవర్‌ గాలి చల్లగా చెంపలకి తగులుతున్నది.

“కీ ఈజ్ అన్డర్ ది వెల్‌కమ్‌ మాట్. మేక్‌ యువర్‌ సెల్ఫ్ ఎట్ హోమ్‌. ఐ వోన్ట్ బి హోం అన్‌టిల్‌ టుమారొ ఆఫ్టర్‌ నూన్‌. - యెస్‌.”

లంచ్ టైంలో రిసెప్షనిస్ట్ ఇచ్చిన మెస్సేజ్ కాయితం సుందరం మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు. టాక్సీ ఎక్కి సరాసరి సఫూరా ఎపార్ట్ మెంట్‌కి వచ్చాడు. తాళం తీసుకొని లోపలికొచ్చాడు. సఫూరా ఎపార్ట్మెంట్ మొత్తం ఆరువందల చదరపుటడుగులుంటుందేమో. పొరపాటున రెండు ఈగలు గనక ఒకేసారి లోపలికొస్తే, అటునించి ఇటు, ఇటునించి అటూ స్వేచ్చగా ఎగరడానికి కూడా స్థలం చాలదు. ఎదురుబొదురు గోడలకి తలకాయలు కొట్టుకొని వాటంతట అవ్వే చస్తాయి. మన ప్రమేయం అనవసరం. సుందరం తన అనాలజీకి నవ్వుకుంటూ ఫ్రిజ్‌ లోనించి రెండు ఐస్‌ క్యూబులు తీసి గ్లాసులో పడేశాడు. ఆవిరులొస్తున్న ఐస్‌ క్యూబులమీద స్కాచ్‌ పోస్తున్నప్పుడు వచ్చే చిటపట శబ్దం సుందరానికి మహ ఇష్టం.

ఒక ఫుల్‌ బెడ్‌. పక్కనే గోడవారగా లేజీ బాయ్ రిక్లైనర్‌, ఆట్టోమన్‌. బెడ్‌ పక్కనే నైట్ టేబుల్‌. దానిమీద రీడింగ్‌ లైట్‌ పక్కనే బంగారపు రంగులో యాన్‌టిక్‌ టెలిఫోన్‌. నైట్ టేబుల్ మీద నఫీసా హాజి రాసిన మొదటి నవల , ది రైటింగ్ ఆన్‌ మై ఫోర్‌హెడ్‌. బెడ్‌కి ఎదురుగుండా రెండు ఆఫీసు కుర్చీలు, వర్క్‌ టేబుల్‌. సుందరం రెండు సిప్పులు స్కాచ్‌ తాగాడు. సఫూరా ఇంట్లో ఎప్పుడూ రకరకాల సారాయాలు ఉంటాయి. సింగిల్‌ మాల్ట్ స్కాచ్‌. “నాకోసమే స్కాచ్‌ కొంటుంది,” పైకే అనుకుంటూ, మరో రెండు సిప్పులు తాగాడు. స్కాచ్‌ గ్లాస్‌ కుడిచేతిలోంచి ఎడమచేతిలోకి మార్చి, నైట్ టేబుల్‌ మీదపెట్టాడు, గ్లాసు మీద తన బొటనవేలి ముద్రకేసి చూస్తూ. ఎడమచేత్తో నవల తిప్పి చూసాడు. అట్టమీది ఫొటోలో హాజీ చాలా అందంగా ఉంది. ముందు కవర్ బ్లర్బ్‌లో ఆఖరి వాక్యం మీద ఎర్ర మాజిక్ మార్కర్ గీతలు.

ది చాయిస్ ఈజ్ నాట్ ఆల్వేస్‌ అవర్‌ ఓన్‌, అండ్ దట్ ఫెయిత్ ఈజ్‌ నాట్ జస్ట్ యాన్‌ ఇంటలెక్చువల్ ప్రిఫరెన్స్‌.

పుస్తకాన్నక్కడే పడేసి సుందరం హమ్మయ్య అనుకుంటూ లేజీ బాయ్‌లో వాలాడు. బెడ్ మీద బోలెడు ఉత్తరాలున్నాయి. సుందరం ఓ ఉత్తరం తీసాడు. తప్పే. ఇంకోళ్ళ ఉత్తరాలు చదవడం ఇల్లీగల్‌. ఇమ్మోరల్‌.

పరాయి వాళ్ళెవ్వళ్ళూ చదవకూడని రహస్యాలున్న ఉత్తరాలయితే, సఫూరా అలా బెడ్ మీద ఎందుకు పడేస్తుంది?

ఎయిర్‌మెయిల్‌ ఉత్తరం. పార్‌ అవియన్‌ లోగో. ఎక్కడనుంచి వచ్చిందో సరిగా తెలియటల్లేదు. అరడజను పోస్టల్‌ ముద్రలున్నాయి. కవరు తెరిచే ఉంది. సఫూరా లెటర్ ఓపెనర్‌ వాడి ఉండాలి. సుందరం కవర్లోంచి ఉత్తరం బయటకి తీసాడు. ఎక్కడనుంచి వచ్చిందో చూద్దామన్న కుతూహలం తప్ప, ఉత్తరం చదువుదామన్న ఉద్దేశం ఏ కోశానా లేదు. ఇది అంత ఇల్లీగల్ కాదు గాని ఇమ్మోరల్‌.

ఉత్తరం చాలా చిన్నది. ఇంతచిన్న ఉత్తరానికి కవరెందుకో? కార్డు రాస్తే పోలా?

తీరా చూస్తే ఉత్తరం తిరకాసు భాషలో ఉంది. అక్షరాలు చూడటానికి ఉర్దూ అక్షరాల్లా ఉన్నాయి. తారీకు కూడా ఆ భాషలోనే రాయాలా? అరబిక్ అయ్యుండచ్చు. సఫూరా ఇరానీ కదూ? సుందరానికి ఒకేఒక్క ఉర్దూ అక్షరం తెలుసు. అలీఫ్. ఉత్తరం మొత్తంలో అలీఫులు చాలానే ఉన్నాయి. ఉత్తరం కింద సంతకం రెండు పొడి అక్షరాల్లో ఉంది. అదీ తురకంలోనే! ఎవరై ఉంటారబ్బా?

సుందరం ఆరేళ్ళ క్రితం ఇంటర్నేషనల్‌ బయర్స్ సెమినార్లో మాట్లాడాడు, వాంకూవర్లో. సఫూరాతో అప్పుడే పరిచయం. సుందరానికి ఉద్యోగం పేరున వాంకూవర్ రావడం బాగా పరిపాటే. అప్పటినుంచీ వాంకూవర్ వచ్చినప్పుడల్లా సఫూరాతో గడిపేవాడు. అలా సుందరానికి ఆరేళ్ళుగా సఫూరా తెలుసు. బాగానే తెలుసు. చాలా బాగానే తెలుసు. అందువల్ల తన ఉత్తరాలు చదవడం అంత ఇమ్మోరల్ కాదు.

సుందరం మరో ఉత్తరం తీసాడు. ఇదేదో గ్రీటింగ్ కార్డల్లే ఉన్నది. చిన్న చేటంత కార్డు. కార్డు మీద ఒక పక్క మూడు రంగుల ఫొటొ. స్విమ్మింగ్ పూల్ దగ్గిర అర్థనగ్నంగా కూచున్న అమ్మాయిలు అబ్బాయిలూ. ఆకుపచ్చ సిరాతో రాసిన చిన్న ఉత్తరం.

“థాంక్స్ ఫర్ ఎవ్విరిథింగ్. ఇమ్మెన్స్‌లీ ఎంజాయ్డ్ దిస్ టైమ్‌. విల్ సీ యు ఇన్‌ సిడ్నీ ఇన్‌ త్రీ మంత్స్‌. బెస్ట్.”

కెఎచ్. ఎ. అని పొడి అక్షరాల సంతకం. కె కాపిటల్‌, ఎచ్ చిన్న అక్షరం. ఎ పెద్ద అక్షరం.

ఎవరై ఉంటారబ్బా? సిడ్నీ ఆస్త్రేలియానా, సిడ్నీ కెనడానా? సుందరం నుదుటి మీద చిరుచెమట తుడుచుకొని మరో డబుల్ స్కాచ్‌ పోసుకున్నాడు, మిగిలిన ఐస్‌ ముక్కల మీదే. సఫూరా పై చదువుల కోసం ఇరాన్‌ నుంచి వచ్చానని చెప్పినట్టు గుర్తు, పదేళ్ళ క్రితం. ఇరానా? లెబనానా?

మరో ఉత్తరం. కవరు మీద బ్రిటీషు రాణి బొమ్మ. కవర్ లోనుంచి ఉత్తరం తీస్తుండగా టెలిఫోన్‌ మోగింది.

టెలిఫోను తీసుకోవాలా, వద్దా? టెలిఫోను కాల్ ఖచ్చితంగా తన కోసం కాదు. తను ఇక్కడ ఉన్నట్టు సఫూరాకి తప్ప మరెవ్వరికీ తెలియదు. తను అపార్ట్‌మెంట్‌కి వచ్చానో లేదో అని రింగ్‌ చేస్తూన్నదా? నోప్‌. దట్ ఈజ్‌ ఇంపాసిబుల్‌. నేను కంపెనీ మీటింగ్‌ లో రాత్రి పదిన్నర వరకూ ఉంటానని సఫూరాకి తెలుసు.

గ్యారంటీగా ఈ టెలిఫోన్‌ కాల్‌ సఫూరాకే. సఫూరా రేపు మధ్యాన్నానికి గాని తిరిగి రాదే? పోనీ, టెలిఫోను తీసుకొని సఫూరాకి మెసేజ్ తీసుకుంటే? సరి సరి. ఆ పిలిచిన వాళ్ళకి పెద్ద కథ చెప్పాలి. తను ఎవరో చెప్పుకోవాలి. సఫూరా ఎపార్ట్ మెంట్‌లో తను ఎందుకున్నాడో చెప్పాలి. వాళ్ళు సఫూరా నాన్నో అమ్మో దగ్గిర బంధువులో అయితే! ఓ డియర్‌ గాడ్‌.

టెలిఫోను ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ అంటూ ఆగకండా మోగుతోంది. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఆన్సరింగ్ మెషీన్‌ పెట్టుకుంటారు; సఫూరా ఎందుకు పెట్టుకోలేదో?

ఆన్సరింగ్ మెషీన్‌ ఉంటే ఎంత సుఖం! మనం ఇంట్లో ఉన్నా కూడా పిలుస్తున్నవాళ్ళెవళ్ళో తెలుసుకున్న తరవాత మనకి ఇష్టమయితేనే సమాధానం చెప్పచ్చు. ఇష్టం లేకపోతే వాళ్ళ మానానికి వాళ్ళని వదిలెయ్యచ్చు. ఏమో! ఆన్సరింగ్ మెషీన్‌ పెట్టుకోకపోవడం కూడా ఒకరకంగా తెలివైన పనేనేమో.

స్మార్ట్. వెరి స్మార్ట్. సఫూరా ఈజ్ వెరి వెరి స్మార్ట్.

టెలిఫోను ఇంకా మోగుతూనే ఉన్నది, ట్రింగ్‌ ట్రింగ్ ట్రింగ్ అంటూ. ఎవరూ సమాధానం చెప్పకపోతే, ఆ పిలిచే వాళ్ళు పిలవడం మానేయచ్చుగా. బహుశా ఇప్పుడు పిలుస్తున్న వాళ్ళకి సఫూరా తెలియదేమో. ఇదేదో పెద్ద మాన్షన్, టెలిఫోను దగ్గిరకి వచ్చి సమాధానం చెప్పడానికి చాలా టైమ్‌ పడుతుందనుకోవచ్చు. నాన్‌సెన్స్.

టెలిఫోను మోగటం ఆగటల్లేదు. ట్రింగ్ ట్రింగ్‌ ట్రింగ్. ఇలా ఎంతసేపు మోగుతుందో. ఎన్నిసార్లు మోగింతర్వాత పిలుస్తున్నవాళ్ళు డయల్‌ చెయ్యడం మానేస్తారో. ఇప్పటికి ఎన్నిసార్లు మోగిందో లెక్కపెట్టలేదు. ఈ పాటికి కనీసం పదిసార్లన్నా ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ అని మోగింది. పోనీ ఇప్పటినించీ లెక్కపెడితే?

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, పదకొండు.

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, పన్నెండు.

ఆ పిలిచేవాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేరని సమాధాన పరుచుకోరేమా అని మనం అనుకోవడం కూడా తప్పే. ఇంట్లో నేను ఉన్నానుగా. శబాష్‌. ఇంట్లో నేను ఉన్నానని తెలిస్తే ఈ పాటికి తప్పకండా సమాధానం చెప్పుతానని వాళ్ళు అనుకోవడం తప్పేమీ కాదు.

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, పదిహేను.

మళ్ళీ మరోసారి. పదహారు.

పోనీ ఇప్పుడు రిసీవర్ ఎత్తి సమాధానం చెప్పితే? పదిహేడు.

ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు రిసీవరు తీసుకొని సమాధానం చెప్పడం మర్యాద కాదు. ఒకవేళ సమాధానం చెప్పినా, ఎందుకింత ఆలస్యం అయ్యిందని వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి?

ఇంట్లో నేను ఉండికూడా టెలిఫోను తియ్యటల్లేదనే అనుమానం ఆ పిలిచే వాళ్ళకి వచ్చిందేననుకో. వీడు టెలిఫోను తియ్యడు అని తెలిసికూడా డయల్ చెయ్యడం మానరేం? ఇదంతా నాపిచ్చి గానీ, వాళ్ళకి నామీద అనుమానం ఎందుకు వస్తుంది? వస్తే గిస్తే సఫూరా మీదే ఆ అనుమానం రావాలి. సుందరం గ్లాసెత్తి స్కాచ్ అంతా నోట్లో పోసుకున్నాడు. రూములో వేడిగా ఉంది హీటర్ తగ్గించాలేమో.

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, పంథొమ్మిది. ఇరవై.

ఈ సారి దట్టంగా ఐస్ వేసి గ్లాసు నిండా స్కాచ్ నింపాడు.

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, ఇరవై మూడు.

ఒక్కొక్క విడతకీ మూడుసార్లు ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ అని మోగితే అది లోకల్ కాలా, ఇంటర్నేషనల్ కాలా?

ఇరవై ఐదు. జీసస్‌!

ఇదేదో సఫూరాకి ఆ పిలిచే వాళ్ళకీ మధ్య సీక్రెట్ కోడ్ అయిఉంటుంది. ఆ సిడ్నీ గ్రీటింగు కార్డు వాడేమో. ఆ గ్రీటింగ్ కార్డ్ పంపించింది మగవాడేనన్న గ్యారంటీ ఏమిటి?

ఆ కార్డు చాలా రొమాంటిగ్గా కూడా ఉంది.

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, ఇరవై ఏడు.

సీక్రెట్ కోడ్. వీళ్ళిద్దరిమధ్య సీక్రెట్ కోడ్ ఉండి ఉంటే అది ఏమిటై ఉండచ్చు, చెప్మా? ప్రతిరోజూ నేను సరిగ్గా సాయంత్రం ఎనిమిది గంటలకి పిలుస్తా. ఇరవై రింగుల తర్వాత నువ్వు రిసీవర్ తీసుకుంటే, ఆ రాత్రి నేను రాకూడదు. అంతకన్నా ముందే తీసుకుంటే నేను రావచ్చన్న మాట.

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్, ఇరవై తొమ్మిది. రిసీవర్ తీసి వెంట నే పెట్టేస్తే? నో వే.

ముప్ఫై.

టెలిఫోను మోగడం మానేసింది. మై గుడ్‌నెస్‌. ముప్ఫై రింగులతో టెలిఫోను మోగడం మానేస్తే, వీళ్ళ ఇద్దరి మధ్యా కోడ్ అర్థం ఏమిటి? అబ్బా, ఎందుకింత వేడిగా ఉంది రూములో.

కొంపదీసి సఫూరా ఏ ఇరానీ ఏజెంటో కాదు కదా? మరి ఆ అరబిక్ ఉత్తరం ఏమిటి? సిడ్నీ ఉత్తరం కూడా ఎవడో సీక్రెట్ ఏజెంట్ రాసిందే అయి ఉండాలి. ఇంకా ఈ తిరకాసు భాష ఉత్తరాలు ఎన్నున్నాయో? బెడ్ మీద ఉత్తరాలన్నీ తీసి చూస్తే? అసలు ఆ ఉత్తరాలన్నీ ఎత్తుకొనిపోతే? ఎత్తుకుపోయి సి.ఐ.ఎ. కి పంపిస్తే? మిగిలిన ఉత్తరాలు కూడా చూస్తే ఏముంటుందో, అయినా ఎందుకు అదో లేనిపోని బెడద కాదూ. చిన్నప్పుడు, ఇండియాలో పీస్ కోర్ వాలంటీర్లని చూసినప్పుడల్లా అనేవాళ్ళు, వీళ్ళంతా సి.ఐ.ఏ. ఏజెంట్లని.

ఇక్కడనుంచి ఎంతత్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. సఫూరా! యూ స్లై డాగ్‌! యూ స్లై బి_!

సఫూరాతో పరిచయం ఉన్నదని బయటపడితే, మన పని ఖతం. ఉద్యోగం ఊడిపోతుంది. జైల్లో పడేస్తారు. ఏ జైల్లో పడేస్తారో కూడా ఎవడికీ చెప్పరు.

పాపం సంధ్య గతి ఏం కాను? పిచ్చిమొహంది. పరమ అమాయకురాలు. అంగలకుదురు నుంచో , ఆముదాలవలస నుంచో వచ్చింది. వెర్రిబాగుల్ది. కంద కోసం ఊరంతా వెతికేది కందా బచ్చలకూరా ఇగురంటే నాకు ఇష్టం అని. నేను నిజంగా… ఛీ! ఛీ!

సుందరం గట గటా స్కాచ్ తాగేసి గ్లాస్ బయట శుభ్రంగా తుడిచాడు. చేతి గడియారం చూసుకున్నాడు. తొమ్మిదిన్నర.

సఫూరా ఎపార్ట్మెంటుకి తాళంవేసి బయట పడ్డాడు. బయట చీకటిగా ఉంది. సన్నగా చినుకులు పడుతున్నాయి. రోడ్డుకి అవతల వైపున పబ్లిక్ ఫోను పక్కనే ఎవడో ఓవర్ కోట్ వేసుకొని నిలబడి ఉన్నాడు. అటూ ఇటూ తారట్లాడుతున్నాడు. బహుశా వీడే సఫూరాని పిలుస్తూ ఉండచ్చు. సీక్రెట్ కోడ్. ముప్ఫై రింగులతో ఆపేశాడు. అర్థం ఏమిటో?

పదినిమిషాలవరకూ ఖాళీ టాక్సీ కనపడలేదు. అటు రోడ్డుమీద ఉన్నవాడు తనకేసే చూస్తున్నాడు.

ఖాళీ టాక్సీ కనబడంగానే ప్రాణం లేచి వచ్చింది. వాంకూవర్ నుంచి చికాగోకి రెడ్ ఐ ఫ్లైట్ దొరికింది.

అమ్మయ్య! పొద్దున్నే ఆరు గంటలకల్లా చికాగో. ఇంటికొచ్చి జాకెట్ జేబులన్నీ వెతుక్కున్నాడు, తాళం చేతులకోసం. డార్న్‌ ఇట్. హాండ్ కారీ సఫూరా అపార్ట్మెంట్లో వదిలేసాడు.

బెల్ కొట్టాడు. ఒకటి. రెండు. మూడు. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. ముప్ఫై.

విసుగెత్తి యదాలాపంగా తలుపు తోసాడు. వీధి తలుపు తెరుచుకుంది.

సంధ్య ఇంట్లో లేదు.

 

(18 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Venkat అభిప్రాయం:

    July 3, 2009 2:17 am

    ఏమి చెప్పాలనుకున్నారో అసలు అర్థం కాలేదు.

  2. MJ Thatipamala అభిప్రాయం:

    July 5, 2009 7:58 am

    మంచి కథ. అనుమానం పెనుభూతం అంటారు. ముగింపు బాగుంది, అక్కడ 30సార్లు ఫోను మోగడం, ఇక్కడ 30సార్లు డోరు బెల్లు కొట్టడం, సంధ్య ఇంట్లో లేకపోవటం…
    కథ పేరుకి, కథావస్తువుకి పొంతన కుదరలేదేమో?!

  3. M.S.Prasad అభిప్రాయం:

    July 8, 2009 1:53 am

    ఈ కధలో చివరి ఒకటో-రెండో పేజీలు సంపాదకులు ఎక్కడో పారవేసుకొని ఉన్నవాటినే యమర్జెంటుగా ప్రచురించినట్లు తోస్తోంది. ధారా వాహికగా తదుపరి సంచికలో మిగిలిన భాగం (దొరికితే) ప్రచురిస్తారని ఆశిస్తాను. కధ ఇంతే అని బుకాయిస్తే మాత్రం ఇది ఈమాట పాఠకులపై ప్రయోగించిన Practical Joke అని భావించాల్సి వుంటుంది.

    భవదీయుడు

  4. Kiran అభిప్రాయం:

    July 8, 2009 8:55 am

    ఇలాంటి కథల కన్నా పొడుపు కథలు బెటరు. వచన కవిత్వం పేరుతో, కథల పేరుతో గాలి రాయడం పెద్ద ఫేషనైపోయింది, “హింట్లు చూసి కథ రాయుము”, “బొమ్మ చూసి కథ రాయుము” టైపులో సగం కక్కిన భోజనం లాంటి కవితలూ, కథలూ పత్రికల్లో చెలామణీ చెయ్యడం చూస్తే పాఠకుల్ని ఎంత వెర్రోళ్ళనుకుంటారో కదా ఈ రచైతలు అనిపిస్తుంది.

    సాఫ్ట్ వేర్లు డెవలప్ చేసేటప్పుడు User Friendly Interfaces కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉపయోగించేవాడికి అర్థం కాకపోతే ఎంత గొప్ప సాఫ్ట్ వేర్ అయినా చెత్తకిందే లెక్క. ఒక్క ఈ అతితెలివి రచయితలే End Users ని లోకువ సరుకుగా లెక్కగడతారు. అందుకే సాహిత్యం అంతరించిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అతి తెలివిగా రాసే కథలూ, కవితలూ రాసినవాళ్ళే చదూకుని మిగతా జనాభా అంతా వెర్రోళ్లనుకుని తృప్తి పడుతూ బతుకుతారు.

  5. yasasvi అభిప్రాయం:

    July 9, 2009 10:41 am

    కధ అని అన దగ్గ ఒక్క లక్షణమూ లేని దీన్నీ “కధ” పేరుతో అచ్చు వేయటం చూస్తే ముఖ్య సంపాదకుల రచన అయినందువల్లనేమో అన్నింటినీ పక్కకు పెట్టి ప్రచురించిన ట్టు గా తెలిసిపోతోంది. ఈమాట వాళ్ళు చెబుతున్న స్థాయి ..ప్రమాణం లాంటివి ముఖ్య సంపాదకుల్కి మాత్రం వర్తించదా? సొంత పత్రిక అన్న ధైర్యమా? పాఠకులు వెర్రివాళ్ళన్న ఎగతాళా?? ఆశ్చర్యం!! మేం ఇద్దరు ముగ్గురు అభిప్రాయాల్ని తీసుకున్నాకానే..రివ్యూ చేయించాకానే ఒక రచనని అచ్చు వేస్తాం అని ఈమాట “స్థాయి”ని గురించి చెప్పిన వారికి మరి..ఈ రచనని కధ గా ఒప్పుకున్న ఆ రివ్యూ చేసిన వారు అయినా చెప్పాలి.. ఇందులో ఏముందో?!ఎలా దీన్ని ప్రచురించారో? ఎదరివాళ్ళ రచనలకి ఒక విధానమూ..వారి రచనలకి మరో విధానమూ పాటిస్తారని తెలిపేలా ఉందిది.

    యశస్వి.

  6. అఫ్సర్ అభిప్రాయం:

    July 12, 2009 4:32 pm

    వేలూరి కథ మీద జరుగుతున్న చర్చలో వొక ముఖ్యమయిన అంశాన్ని గుర్తు చెయ్యడానికి ఈ రెండు ముక్కలూ రాస్తున్నాను. కథలో వర్ణనాత్మకత , నాటకీయతల మీద ఇంకా మనకి చాలా మోజు వుంది. తెలుగు కథ తక్షణం వదిలించుకోవాల్సిన లక్షణాలు ఇవి రెండూను. వేలూరి కథ గొప్ప కథ అవుతుందా లేదా అన్నది కాసేపు పక్కన పెట్టి, ఈ కథ శిల్ప పరంగా వొక అనాటకీయ/ అవర్ణనాత్మక శిల్పాన్ని మన ముందు పెడుతుంది. వస్తువు పరంగా డయాస్పోరా కథ అంటే నాస్టాల్జియా మాత్రమే అన్న పరిమితిని దాటి, ప్రవాస జీవితంలోని ఇప్పటి సంక్లిష్టతని ఈ కథ తాకుతుంది. ఇందులో సఫూరా ముస్లిం దేశం నించి రావడం ఈ కథలో అదనపు సంక్లిష్టత. ఈ కథలో రచయిత వర్ణించిన సెట్టింగు నించి , ఇంకా నాటకీయతనీ, వర్ణనల్ని గుప్పించి దీన్ని వొక అనుభూతి కళా ఖండంగా మార్చవచ్చు. ఆ అవకాశాన్ని రచయిత చేజేతులా వదులుకున్నట్టు మనకి అర్ధం అవుతూనే వుంది.

    నా ప్రశ్న ఏమిటంటే: కథలో వర్ణన/ నాటకీయత పరిమితులు ఏమిటి? తెలుగు కథ ఆ రెండిటి మధ్య ఆడుతున్న దాగుడు మూతల్లో చాలా కాలంగా అసలయిన వాస్తవికతకి దూరం అవుతోంది. వొక్క అనవసరమయిన వాక్యమూ లేకుండా కథ రాయడం ఇవాల్టి అవసరం. వేలూరి కథ ఆ అవసరాన్ని గుర్తు చేసింది. ఈ లక్షణం ఇంకా కొంత పరిపక్వ దశలో ఇదే సంచికలోని మాచిరాజు సావిత్రి కథలో కనిపిస్తుంది.
    ఈ కథకి పెట్టిన శీర్షిక గురించి నాకూ అభ్యంతరం వుంది. మొదట: అది డయాస్పోరా మీద వచ్చిన వొక సినిమా పేరు కావడం. రెండు: ఈ కథ పరిధిని ‘సంధ్యా పాత్రకి మాత్రమే పరిమితం చేస్తుంది ఈ శీర్షిక. ఇందులో సంధ్య ఎంత ముఖ్యమో, సఫూర కూడా అంతే ముఖ్యం. సుందరం యాంటీ- హీరో లక్షణం అంత కంటే ముఖ్యం.

    యాంటీ హీరో తనం ఈ కథలోని వర్ణనా , నాటకీయతల వ్యతిరేకతలో భాగమే. పెట్టె బయటి నించి ఆలోచిస్తే ఈ కథ కొంత అర్ధం అవుతుందేమో? ఈమాట పాఠకులకు ఆ మాత్రం సహనం వుందని నా నమ్మిక.

    అఫ్సర్

  7. Maddipati Krishna Rao అభిప్రాయం:

    July 12, 2009 7:56 pm

    చైతన్యస్రవంతి శైలిలో సాగిన కథపై ఉత్తర, దక్షిణ ధృవాల్లాంటి అభిప్రాయాలు రావడం వింత కాదనుకుంటాను. ఇలాంటి కథలు బాగా నచ్చనైనా నచ్చుతాయి లేకపోతే అసలు అర్ధంకాక చిరాకైనా కలిగిస్తాయి. శైలిని సరిగా నిర్వహించలేకపోతే రెండవ రియాక్షన్‌కు రచయిత బాధ్యత అవుతుంది. కానీ, సరిగా అర్ధం చేసుకోవడంలో పాఠకుల బాధ్యత కూడా చాలానే ఉంటుంది. ఉదాహరణకు, ఈ కథను అర్ధం చేసుకోవడానికి/అనుభవించడానికి పాఠకులు సుందరం పాత్రలో పరకాయ ప్రవేశం చెయ్యాలి. కథకు నాయకుడు, పరమార్ధం, ముగింపు, నీతి, వగైరా సూత్రాలు (లక్షణాలు?) ఖచ్చితంగా ఇలా ఉండాలి అనుకునే పాఠకులకు ఈ కథ నచ్చకపోవచ్చు. కానీ సుందరం ‘మొరాలిటీ జారుడు బల్ల’పై ప్రయాణం అతని వ్యక్తిత్వాన్ని ఊహింపజేస్తుంది. దానికి సాపేక్షంగా సఫూరా, సంధ్య ల వ్యక్తిత్వాలనూ విశదీకరిస్తుంది. కథలో చెప్పినదానికంటే పాఠకుల ఊహకు ఒదిలేసిందే ఎక్కువ. ఐతే ఆ ఊహలను నడిపించే మార్గాన్ని ఎన్నెన్నో పొరల్లో చూపిస్తున్నారు రచయిత. ఇంతకన్నా ఎక్కువ చెప్పుంటే కథ క్షీణించిపోయుండేదని నా అభిప్రాయం. తిరిగి చదివినకొద్దీ పొరల్లో దాక్కున్న కథ కనిపిస్తూంది. చక్కటి డయాస్ఫోరా కథనిచ్చినందుకు హేట్సాఫ్ మాష్టారూ!

    కథలో రెండు చిన్న టెక్నికల్ తప్పులున్నాయని నాకనిపించింది. మొదటిది ఫోన్ 30 సార్లు మ్రోగడం. నాకు గుర్తున్నంత వరకూ, ఉత్తర అమెరికా టెలిఫోన్లు ఇదివరలో 15 సార్లకంటే ఎక్కువ రింగయ్యేవి కాదు. (ఇప్పటి సంగతి నాకు తెలియదుగాని, ఇదివరలో కొన్ని ఆన్సరింగు మెషీన్లు ఆపేసి ఉంటే 15వ రింగుకి ఆటోమేటిగ్గా ఆన్ అయ్యి, మెసేజి తీసుకునేవి!). ఇప్పుడూ అంతేనో కాదో టెస్టు చెయ్యాలి! రెండవది, హేండ్ కారీ మరచిపోయి విమాన ప్రయాణం చెయ్యడం. సాధారణంగా టిక్కెట్లు అందులోనేగా ఉంచేది. పోనీ టిక్కేట్టు కోటు జేబులో ఉన్నాయనుకుందామంటే, మరీ చేతులూపుకుంటూ విమానం ఎక్కే వాళ్ళనెంతమందిని చూశాం? ఇవి పెద్ద లోపాలని అనలేను గాని, కథా గమనంలో పంటికింద రాయై అనవసరంగా భూమార్గం పట్టించాయి నన్ను!

    కృష్ణారావు

  8. సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    July 13, 2009 12:26 am

    పై వ్యాఖ్యలు చూసాక ఇది రాయాలానిపించింది. వెస్ట్రన్ కథ పరిణామం చెందినంతగా తెలుగు కథ కాలేదు. కధంటే ఇలాగే వుండాలని మన పెద్దలు నిర్ణయిచేశారు. కథంటే మొదలుండాలి. నాయకుడుండాలి. శిల్పం వుండాలి. ముగింపుండాలి. చివర్లో ఓ సందేశముండాలి. సూక్తిముక్తావళుండాలి. ఏ మాత్రం బుర్రకి పదును పెట్టకుండా అరటిపండొలిచినట్లుండాలి. ఇలా ఎవరికి తోచింది వారు చెప్పారు. చెప్పడమే కాదు, మనకలాంటి కథలు చదవడమే నేర్పించారు. అందువల్ల తెలుగు కథ వారు ఏర్పరిచిన చట్రంలోనే ఇరుక్కుని ఊపిరాడకుండా వుంది.

    ఈ కథ చాలా మంచి కథని అనను కానీ వైవిధ్యమున్న కథ. డయాస్పోరా కథల కోవకి చెందిన కథ. ఎవరికీ తెలియదనుకుంటూ తప్పులు చేసుకు పోయే ఒక పాత్రకొచ్చే మానసిక సంఘర్షణ కనిపించింది. తను చేసే ప్రతీ దానికీ ఒక కారణం ( జస్టిఫికేషన్ ) వెతికే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ కారణం ఏదైనా కావచ్చు. అది అనుమానమవ్వచ్చు. భయం కావచ్చు. లేదా తనకి తను సర్దిబుచ్చుకునే మనస్తత్వం కావచ్చు. ఇవన్నీ ఈ సుందరం పాత్రలో కనిపించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనలోనే ( అంటే ప్రవాస భారతీయులు ) కనిపించే పాత్ర. సుందరానికి సఫూరాతో అక్రమ సంబంధమున్న సంగతి ఎవరికీ తెలియదనుకుంటూ గడిపే క్యాజువల్ మనస్తత్వ చిత్రీకరణలో, చేసే పనిని సమర్ధించుకునే నైజం చూపించారు. చాలామంది మగాళ్ళు భార్యలు వెర్రిబాగుల ఇల్లాళ్ళుగా జమకట్టి, తాము ఏం చేసినా గ్రహించలేరు. పైగా వారూ ధైర్యం చెయ్యరని అనుకుంటూ వుంటారు. వారు పరస్త్రీతో ఎలా అక్రమ సంబంధ పెట్టుకుంటారో మరో మగాడు కూడ తమ స్త్రీలతో అలా చేసే అవకాశముంది కదా? అన్న చిన్న విషయాన్ని విస్మరిస్తారు. పైపెచ్చు తమ తమ క్రియలకి కారణాలు వెతుకుతారు. ఇదీ ఈ కథలో నాకు కనిపించిందీ, అనిపించిందీ!
    ఈ కథలో సుందరం యాంటీ హీరో! ఒక నెగిటివ్ షేడ్సున్న వ్యక్తి. ముగింపు మరీ ఒక్క వాక్యంలో తేల్చేయడంతో పాఠకుల్ని ఆలోచించ నీయకుండా అయోమయంలో నెట్టేసింది. “సంధ్య ఇంట్లో లేదు. ” అన్న వాక్యం ఏ రకంగానైనా ఊహిచుకునేలా చేసిందంతే! బహుశా కథలో వున్న అతి క్లుప్తతవల్ల ఈ అయోమయం ఏర్పడిందేమోనని నా అభిప్రాయం. ప్రతీ వాక్యమూ ఓపిగ్గా చదివి అర్థం చేసుకుంటేనే ఈ కథ ఎక్కుతుంది. లేదా ఇదీ కధేనా అనిపిస్తుంది.

  9. Ravikiran Timmireddy అభిప్రాయం:

    July 13, 2009 5:39 am

    ఒక సంఘటన, ఒక సంఘర్షణ కథెందుకు కాగూడదు? “సంధ్య ఇంట్లో లేదు” అనే వాక్యానికి పొడిగింపు, వివరణ ప్రతి పాఠకుడు ఈ కథలో తనకు తాను ఇచ్చుకునే ముగింపు మీద ఆధారపడి ఉంటుందేవో కదా. అల్లికలో మరికొంచం జాగ్రత్త అవసరవే కానీ, కథ బాగనే వుంది.

  10. Maddipati Krishna Rao అభిప్రాయం:

    July 13, 2009 6:41 am

    ఈ కథ గురించి కిరణ్ గారి అభిప్రాయం పై నేను ముందు వ్రాసిన అభిప్రాయంలో వ్రాద్దామనుకున్నాను కానీ, కథ గురించి నేను చెప్పదలుచుకున్నది మరుగున పడుతుందని ఆపేశాను:

    పొడుపు కథలు, భేతాళ కథలు, కాశీ మజిలీ కథలు, ఇత్యాదులన్నీ ముఖ్యంగా కొస మెరుపు కథలు. ఈ కథలో కొస మెరుపున్నా, అంతవరకూ సాగిన కథకు ఆఖరి సన్నివేశం కంటే ఎక్కువ విలువుందని నా అభిప్రాయం. ఆఖరి సన్నివేశం 360వ డిగ్రీ మాత్రమే! పుస్తకం వెనకాల ఉన్న కోట్ దగ్గర్నుంచి, ఇల్లీగల్ ఇమ్మోరల్, అంత ఇల్లీగల్ కాదు గాని ఇమ్మోరల్, అంత ఇమ్మోరల్ కాదు, నుంచి స్లై డాగ్, స్లై బి_ వరకు సాగిన ప్రస్థానంలో రచయిత వదిలిన క్లూలు నిజంగానే పాఠకుణ్ణి ‘హింట్లు చూసి కథ రాసుకో’ మనడమే! పాఠకుల మీద ఎంత నమ్మకం, గౌరవం లేకపోతే రచయిత తన కథను అలా ఊహలకొదిలేస్తారు చెప్పండి?

    సాఫ్ట్‌వేర్ తయారు చేసేవారు చేసేది పనిముట్లన్న సంగతి మరచిపోకూడదు. పనిముట్లే ఇల్లు కాదుగదా! (వాడే సాఫ్ట్‌వేరే వ్యాపారం కానట్టు). ఇక్కడ రచయిత చేసింది పనిముట్టు కాదు. చైతన్య స్రవంతి అనే సాహిత్య పనిముట్టుతో వేసిన చిత్రం. అందులో పాఠకులాక్కావల్సింది వారినే వెతుక్కోమంటున్నారు!

    కృష్ణారావు

  11. lyla yerneni అభిప్రాయం:

    July 13, 2009 10:53 am

    “సంధ్య ఇంట్లో లేదు. ”

    సంధ్య ఇంట్లో లేదా? ఏమయ్యింది? బెడ్రూం లో వస్తువులన్నీ ఎక్కడి వక్కడే ఉన్నయి. రోజూ వాడే పర్సు -డ్రెస్సరు మీదే ఉంది. ఇంట్లో వేసుకు తిరిగే చెప్పులు -అక్కడే మంచం పక్కనే ఉన్నయ్యి . గరాజ్. గరాజ్ .. ..- గరాజ్లో టయోటా కేమ్రీ కారు ఉందా ? కారూ అక్కడే ఉంది. సంధ్య అప్పుడప్పుడూ లేక్ పక్కనే సైకిలు తొక్కుతుంది. ఆ సైకిలు , ఆ సైకిలు - ఉంది, అదిగో ఆ మూలగా గార్బెజ్ బిన్నుల పక్కనే ఉంది. అదే మూల, బట్టలు ఆరెయ్యటానికని కొనుక్కొచ్చిన పొడుగాటి తాడు అక్కడే ఉండాలే . అది లేదు . అప్రయత్నంగా అతను గరాజ్ సీలింగు దూలాల వంక చూశాడు. గుండె దడదడ లాడింది.
    సంధ్యా, సంధ్యా ! అంటూ గభిక్కున …

    ఏం పాఠకులండీ? రామాయణంలో పర్ణశాలలో సీత కనపడక పోతే అక్కడ వాల్మీకి కథ ఆపితే - సీత ఏమైయ్యిందో అని మధన పడరూ. సీతా! సీతా! అంటూ రాముడితో పాటు అటూ ఇటూ పరిగెట్టరూ. ఏం పాఠకులండీ?

    కథలు కథలుగా చదువుకునే పాఠకులేరీ. అందరూ విమర్శకులే. ఏ వల్లంపాటి కధా శిలపం, కథా విమర్శ -పుస్తకాలో చదివేసుకుని - ఇది కథేనా? శైలి బాగుంది . Keep it up. వస్తువు శూన్యం. సంభాషణలు - అసలు తెలుగు వాళ్ళూ ఇలా మాట్లాడుకోరు. ఈ కథలో నాకు ముగింపు చదవక ముందే తెలిసి పోయింది. కథ వాస్తవానికి దూరంగా ఉంది. వాస్తవానికి మరీ ఇబ్బంది కలిగించేంత దగ్గిరగా ఉంది. కధాకధన విధానము బాగుంది ….అంటూ ఏంటేంటో రాస్తారు.

    ఏం పాఠకులండీ! కథలు ఇలానా చదువుకుంటారు?

    పోనీ మళ్ళీ చందమామ కథలన్నా చదవండి. :-)

    లైలా

    [పై వ్యాఖ్యలపై వచ్చిన ప్రతివ్యాఖ్యలను చర్చావేదికలో ఉంచాము - సం.]

  12. మాలతి అభిప్రాయం:

    July 15, 2009 2:51 am

    నేను కూడా చాలాకాలం కథకి సన్నివేశాలూ, సంఘర్షణలూ, గట్రా వుంటాయన్న ఉద్దేశ్యంతోనే వ్యాఖ్యలు చేస్తూ వచ్చేను కానీ ఈమధ్య మాత్రం అది న్యాయం కాదనిపిస్తోంది నాకు. ముఖ్యంగా ఈరోజుల్లో కథలు అవునా కాదా అనిపించేవి చాలా వస్తున్నాయి. వాటిని చదివి ఆనందించే పాఠకులూ వుంటున్నారు.
    వేలూరికథ చదివినప్పుడు నాకు రెండు కథలు గుర్తొచ్చాయి. Samuel Becket రాసిన Waiting for Godot, అదే నమూనాలో వివిన మూర్తిగారు రాసిన భగవంతునికోసం. ఇలాటిరచనల్లో పాఠకుడిని పట్టి ఊపేసే కథ వుండదు కనక కథనం -చెప్పేతీరు - బలంగా వుండాలి, ఈకథ నాకు ఎక్కడా విసుగనిపించలేదు. ఒకటి రెండు చోట్ల హాస్యం, చమత్కారం కూడా చోటు చేసుకున్నాయి.
    పైన చెప్పిన రెండుకథల్లోనూ కేవలం ఒకపూట ఒకమనిషి ఆలోచనలు నమోదు చేయడమే రచయితలు చేసినపని. చెప్పుకోదగ్గ “కథ” ఏమీ లేదు, వేలూరివారిరచనలో కొంతవరకూ కథ వుంది.
    సుందరం అనే ఒక ఉద్యోగిజీవితంలో ఒక సాయంసంధ్యవేళ. ఇందులో రెండు సన్నివేశాలున్నాయి. సుపూరఉత్తరాలు చదువుతున్నప్పటి గల్టీ ఫీలింగ్ అతను ఆమెతో పెట్టుకున్న అక్రమసంబంధంతాలూకు గిల్ట్‌ కావచ్చు. అవి చదువుతూ, తనని తాను సమర్థించుకోడం తన అక్రమసంబంధాన్ని సమర్థించుకుంటున్నట్టు కనిపిస్తుంది.
    సుందరానికి భార్య అంటే గౌరవంలేదు. జాలో, హేళనో మరేదో కానీ గౌరవం మాత్రం లేదు.
    శీర్షిక మాటకొస్తే, ప్రాచుర్యంలో వున్న అందాలమాట పక్కన పెట్టి చూడండి. ఒకరోజులో సాయంసంధ్య పగటినించి రాత్రివేపు నడిపించేది. సుందరానికి రెండుసంబంధాలలోనూ ఎదురయింది చీకటే. సుపూరా తాళం ఎక్కడుందో చెప్పి తనసుముఖతని వెల్లడించినా అతనికోసం ఇంట్లో ఎదురుచూస్తూ కూర్చోలేదు. తరవాతయినా రాలేదు! Red-eye flight తీసుకుని ఇంటికి వస్తే, ఇంట్లో సంధ్య లేదు. ఎలా చూసినా అతనికి మిగిలింది చీకటే, శూన్యం!

    పీర్ రెవ్యూగురించిన సందేహం నాక్కూడా కలిగింది. ఈమాటవారు తమ అభిప్రాయాలని మరొకసారి రెవ్యూ చేసుకుంటున్నారు అనుకోవచ్చా?

  13. రాఘవ అభిప్రాయం:

    July 15, 2009 2:55 am

    కథని అర్థం చేసుకునే శక్తి నాకు లేదో ఏమో తెలియదు కానీ, — మొదటిసారి చదివితే నాకు ఈ కథ ఏమీ అర్థం కాలేదండీ. అర్థం కాలేదు కదా అని — రెండవసారి చదవడం ప్రారంభించాను. అలా మొదలుపెట్టగానే కథలోని మొదటి వాక్యం నన్ను వెక్కిరించినట్టు అనిపించి ఠక్కున ఆపేసాను. :(

    ఎవరైనా కాస్త ఉప్పందించి సహాయం చేయగలరని ఆశిస్తూ…

  14. lyla yerneni అభిప్రాయం:

    July 15, 2009 6:12 am

    ఒకరోజులో సాయంసంధ్య పగటినించి రాత్రివేపు నడిపించేది. సుందరానికి రెండుసంబంధాలలోనూ ఎదురయింది చీకటే. -మాలతి అభిప్రాయం

    సుందరానికి “కుడి ఎడమల కుసుమ పరాగం” దొరకలేదంటారు. :-)

    వేలూరి కథ చదివి ఉల్లసించిన వారు - మాలతి రాసిన కథ “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” గాని చదివితే మళ్ళీ రంజిస్తారు. నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం నెట్ లో ఉంది. మొదటగా 1987లో, ఆంధ్రప్రభ వార పత్రికలో వేశారట.ఆ కథ చదివి చాలా బాగుంది. శభాష్! అనుకున్నాక, మాలతి పుస్తకం -
    “Telugu Women Writers 1950 -1975″ -వెంటనే నా బుక్ షెల్ఫ్ నుండి బైటకు లాగాను.
    వివరాలు కావాలంటే రచనలు చేసిన వారే సరిగ్గా చెపుతారు కదా.

    లైలా

  15. మాలతి అభిప్రాయం:

    July 15, 2009 7:52 am

    పైన నావ్యాఖ్యలో పొరపాటు. భగవంతునికోసం కథ రాసినవారు త్రిపురగారు. వివిన మూర్తిగారు కాదు. ఇద్దరు రచయితలకీ క్షమాపణలు. - మాలతి.

    లైలా ఆ కథ 22 ఏళ్లక్రితం రాసేనని స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు.

    [కథ అసలు పేరు భగవంతం కోసం - సం.]

  16. Sowmya అభిప్రాయం:

    July 16, 2009 2:36 am

    “పొరపాటున రెండు ఈగలు గనక ఒకేసారి లోపలికొస్తే, అటునించి ఇటు, ఇటునించి అటూ స్వేచ్చగా ఎగరడానికి కూడా స్థలం చాలదు. ఎదురుబొదురు గోడలకి తలకాయలు కొట్టుకొని వాటంతట అవ్వే చస్తాయి. మన ప్రమేయం అనవసరం.”
    - :)) Good one!
    కథ బాగుంది. I enjoyed reading it.

  17. Prem అభిప్రాయం:

    July 28, 2009 7:09 am

    Its been sometime that I read contemporary Telugu literature. I am not sure how I feel about this story here. I like the way the author started off but I think somewhere in the process he lost what he wanted to convey. Also, I am wondering whether this is something on the lines of the way Jeorge Louis Borges writes. Starting something and leaving it off just like that leaving the responsibility with the reader to finish the story.
    Guess its a good effort poorly executed.

  18. chandra అభిప్రాయం:

    April 29, 2010 10:02 pm

    సంధ్య ఎక్కడికి వెళ్లి ఉంటుందో నాకు తెలిసింది. మొగుడు వచ్చే సరికి చక్కగా కూర చేద్దామని బచ్చలి ఆకు కోసం కొట్టుకి వెళ్లింది.

    చంద్ర.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a