ఈమాట » రాగమాలిక

Expand to right
Expand to left

రాగమాలిక

ఈ రాగమాలిక రచనల్లో కొంతమంది గమ్మత్తైన ప్రయోగాలు చేసారు. తంజావూరు శంకరయ్యరనే సంగీతకారుడు రంజని రాగమాలికని స్వరపరిచారు. ఇందులో వాడిన రాగాలన్నీ రంజని పేరుతోనే ఉంటాయి. అవి రంజని, శ్రీరంజని, మేఘరంజని, జనరంజని. చాలా మంది వాగ్గేయకారులు ఈ రాగమాలికల్ని స్వరపరిచారు. సుబ్రహ్మణ్య భారతి రచించినవాటిని రాగమాలికల్లోనే స్వరపరిచారు. అలాగే గోపాలకృష్ణ భారతి కూడా రాగమాలికలు రచించారు. రాగమాలిక రచనలే కాకుండా రాగమాలికా వర్ణాలు కూడా ఉన్నాయి. పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ స్వరపరిచిన ‘వలచి వచ్చిన‘ అనే రాగమాలికావర్ణం అత్యంత ప్రసిద్ధమైనది. ఈ రాగమాలికలో పల్లవి కేదారంలోనూ, అనుపల్లవి శంకరాభరణంలోనూ, ముక్తాయి స్వరం కళ్యాణి, బేగడలో, చరణం కాంభోజి రాగంలోనూ ఉంటాయి. మిగిలిన చిట్టస్వరాలు వరుసగా యదుకుల కాంభోజి, బిలహరి, మోహన, శ్రీ రాగాల్లో ఉంటాయి. పల్లవీ, అనుపల్లవీ, ముక్తాయి స్వరాల్లో వాడిన రాగాలని ప్రత్యేకంగా చూస్తే కాకలి నిషాదం(ని3) స్వరం అన్ని రాగాల్లోనూ వుంది. అలాగే చరణమూ, చిట్టస్వరాల్లో చతుశృతి రిషభం (రి2) , పంచమం(ప) ఆధారంగా మిగతా రాగాలన్నీ కలిపారు. ఈ రాగమాలికలో పల్లవిలోంచి అనుపల్లవీ, అనుపల్లవిలోంచి ముక్తాయి స్వరాలూ ఒకదాంట్లోంచి ఇంకోటి సెలయేటి ప్రవాహంలా సాగుతాయి. అలాగే చరణమూ, మిగతా చిట్టస్వరాలు కూడా.

ఇవే కాకుండా, ప్రొఫెసర్ సాంబమూర్తి ‘దిన రాగ మాలిక’ అనే వర్ణాన్ని రచించాడు. ఇందులో “రక్తి రాగములైన బిలహరి, ధన్యాసి, మధ్యమావతి, కళ్యాణి, పూర్వకళ్యాణి, కేదారగౌళ, మోహన, భూపాళములు గల” అని అనుపల్లవుంటుంది. అలాగే పార్థసారధి ‘నక్షత్ర రాగ మాలిక’ అనే రాగమాలిక రచించారు. ఇందులో ఒక్కో ఆవర్తనానికీ ఒక్కో రాగం వాడారు. తాళం మాత్రం ఒకటే ఉంటుంది. సాంబమూర్తి వినూత్నంగా రాగమాలికలో స్వరాలన్నీ కర్ణాటక సంగీత పరంగా బాణీ మాత్రం వెస్ట్రన్ సంగీత పరంగా ఒక రాగమాలిక రచించారు. ఇలా అనేకమంది వాగ్గేయకారులు రాగమాలికలని రచించారు. సాధారణంగా కర్ణాటక సంగీత కచేరీల్లో ఈ రాగమాలికలు వింటూ ఉంటాం. స్వాతి తిరునాళ్ రచించిన ‘భావయామి రఘురామం‘ అనే ప్రసిద్ధి చెందిన రాగమాలిక తరచు కచేరీల్లో పాడుతూనే ఉంటారు. స్వాతి తిరునాళ్ ‘కళ్యాణి ఖలు యద్కథ త్రిజగదం’ అనే రాగమాలిక శ్లోకాన్ని రచించాడు. ఇందులో వాడిన రాగాల పేర్లు కళ్యాణి, మోహన, సారంగ, శంకరాభరణం శ్లోకం ప్రతీ పాదంలోనూ వస్తాయి.

ఇంతకు ముందు చెప్పినట్లు ఈ రాగమాలికల్లో రాగం మారుతుంది కానీ తాళం మాత్రం ఒకటే ఉంటుంది. అలాకాకుండా రాగం ఒకటే ఉండి తాళం మాత్రం ప్రతీ అంగానికీ మారడాన్ని తాళ మాలిక అంటారు. ఈ తాళమాలికలో ప్రత్యేకమైన రచనలేవీ కనిపించక పోయినా, మనోధర్మ సంగీతంలో తాళమాలిక కనిపిస్తుంది. తిరువత్తియూర్ త్యాగయ్యర్ అనే ఒకాయన ఒకే రాగంలో ప్రతీ చరణాన్నీ వేర్వేరు తాళాలతో పాడి కచేరీ చేసినట్లుగా చెబుతారు. ఇవే కాకుండా ప్రతీ అంగానికీ రాగమూ, తాళమూ మారే ప్రక్రియని రాగ తాళమాలిక అని వ్యవహరిస్తారు. ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి రామస్వామి దీక్షితార్ 108 రాగతాళ మాలిక రచించారు. నాకు తెలిసినంతవరకు ఇదొక్కటే కర్ణాటక సంగీతంలో ఉన్న రాగతాళ మాలిక. ఇందులో ఉపయోగించిన ప్రతీ రాగం పేరూ సాహిత్యంలో కనిపిస్తుంది.

ఈ రాగమాలిక ప్రక్రియ నాయకరాజుల కాలంలో నృత్య నాటికలూ, యక్షగానాలతో మొదలయ్యింది. నృత్యనాటికల్లో సన్నివేశానికి తగ్గట్టుగా వివిధ రసాల్నీ పాటలో చూపడానికి ఎక్కువగా వాడేవారు. మధుర నాయకరాజుల కాలంలో వెంకట సోమయాజి గారి తిరుమలయ్య రచించిన చిత్రకూట మహత్మ్యం అనే యక్షగానంలో రాగమాలికని వాడినట్లుగా వుంది. మధుర నాయక రాజుల తరువాత వచ్చిన తంజావూరు మహారాష్ట్ర రాజుల కాలానికి ఈ రాగమాలిక నృత్యనాటికల్లో భాగమయ్యింది. ఆ కాలంలో ఈ రాగమాలిక ప్రక్రియని ప్రతీ ఒక్కరూ అనుసరించారు. కానీ త్యాగరాజు రచించిన నృత్యనాటికల్లో ఒక్కొక్క రాగం ఒక్కొక్క రసాన్ని చూపడానికి వాడినా రాగమాలిక రచన కనిపించదు. అన్నమాచార్య కీర్తనలనీ సాహిత్యాన్ని బట్టి రాగమాలికల్లా (ఉదా: ‘ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన’ కీర్తన - బృందావని, మాయమాళవ గౌళ) స్వరపరిచారు.

ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ రాగమాలికను థిల్లానలో వాడి కొత్త ప్రయోగం చేసారు. ఇందులో అమృతవర్షిణి, మోహనం, కానడ, హిందోళ రాగాలున్నాయి. ఇదే కాకుండా శృతి బేధం చూపుతూ తాయ థిల్లాన అనే మరో పద్ధతిలో రాగమాలిక రచించారు. అలాగే గతి భేదాన్ని చూపిస్తూ మరో రాగమాలిక, ‘అంబా మామవ’ అనే శుద్ధ రాగమాలికా కృతీ, తిరుపతి వేంకటేశ్వరునిపై ‘గాన లోల’ రాగమాలిక కృతినీ రచించారు.

ఈ రాగమాలిక ప్రయోగం కేవలం శాస్త్రీయ సంగీతానికే పరిమితం కాలేదు. భావగీతాల్లోనూ, జానపద గీతాల్లోనూ, సినిమా పాటల్లో కూడా ఈ రాగమాలికా ప్రయోగం తరచు వింటూనే ఉంటాం. కాకపోతే సినిమాల్లో చరణాలని బట్టి రాగాలు వాడడం కనిపిస్తుంది. కొన్ని పాటల్లో రెండూ లేదా మూడూ రాగాలు మాత్రమే కనిపిస్తాయి. పాత సినిమా పాటలు శాస్త్రీయ సంగీత రాగాలనుసరించి వరుసలు కట్టేవారు. అందువల్ల వివిధ రాగాల వాడకం పాటల్లో కనిపిస్తుంది. మునుపటి సంగీత దర్శకులు రాజేశ్వర రావు, పెండ్యాల, ఘంటసాల స్వరపరిచిన పాటల్లో ఈ రాగమాలిక ప్రయోగం కనిపిస్తుంది.

మల్లీశ్వరి సినిమాలో ఉషాపరిణయం యక్షగానంలో బిలహరి, మోహన, కేదారగౌళ, ముఖారి, హిందోళం వంటి రాగాలు కనిపిస్తాయి. రహస్యం సినిమాలో గిరిజా కళ్యాణం యక్ష గానంలో నాట, శ్రీ, కాంభోజి, అఠాణ, వసంత, రీతిగౌళ, బేగడ, సరస్వతి, హిందోళం, హంసధ్వని, సావేరి, సామ, సురటి, మధ్యమావతి రాగాలున్నాయి. సువర్ణ సుందరి సినిమాలో ‘హాయి హాయిగా ఆమని సాగే‘ పాటలో కూడా సోహిని, బహార్, జోన్‌పూరి, యమన్ వంటి రాగాలు కనిపిస్తాయి.

సినిమా పాటల్లో వాడే రాగమాలికలకీ, శాస్త్రీయ సంగీత రాగమాలికా కృతులకీ చాలా తేడా ఉంది. శాస్త్రీయ సంగీతంలో రాగ మాలికల్లో అన్య స్వర ప్రయోగాలు చేయకుండా రాగ లక్షణాలని పూర్తిగా పాటిస్తారు. సినిమా సంగీతంలో కొన్ని సార్లు అన్య స్వర ప్రయోగాలు చేస్తారు. అంటే, సినిమా పాటల్లో కేవలం రాగ మూర్ఛన (స్కేల్) ని మాత్రమే పాటిస్తారు తప్ప పూర్తి రాగాన్ని వాడరు. ఒక్కోసారి స్వర వర్జితాలు కూడా చేస్తూ ఉంటారు. ఫలానా సినిమా పాట ఈ రాగంలో ఉందీ అంటే ఆ పాట కేవలం రాగ మూర్ఛనని మాత్రమే పాటిస్తోందని అర్థం చేసుకోవాలి. సినిమా పాటలలో కూడా కొన్ని పాటలు పూర్తి రాగ లక్షణాలని పాటించి స్వరపరిచారు. కానీ, వాటి సంఖ్య చాలా తక్కువనే చెప్పచ్చు. కొన్ని సినిమా పాటల్లో రాగమాలికలు:

  • అనార్కలి: రాజశేఖరా (చక్రవాకం, హిందోళం)
  • అమెరికా అమ్మాయి: ఆనంద తాండవ మాడె (వసంత, అఠాణ)
  • ఉండమ్మా బొట్టు పెడతా: రావమ్మ మహాలక్ష్మి (నీలాంబరి, మధ్యమావతి, మోహన)
  • తూర్పు-పడమర: స్వరములు ఏడైనా (కామవర్ధిని, హిందోళం, సింధుభైరవి, చక్రవాకం)
  • జయభేరి: యమునా తీరమున (బేహాగ్, కాపి)
  • పంతులమ్మ: మానస వీణా మధు గీతం (పంతువరాళి, రేవతి)
  • పాండురంగమహత్మ్యం: జయ కృష్ణా ముకుందా మురారీ (మోహన, కళ్యాణి, ఆరభి, హిందోళం)
  • బావామరదళ్ళు: ముక్కోటి దేవతలు ఒక్కటై నారు (కాంభోజి, యదుకుల కాంభోజి, కానడ, గౌరీ మనోహరి, మాయా మాళవ గౌళ, నాటకురంజి)
  • భక్త ప్రహ్లాద: జీవము నీవేకదా (ఖరహరప్రియ, హిందోళం, మలయమారుతం)
  • మల్లీశ్వరి: నెలరాజా వెన్నెల రాజా (శ్రీ, కానడ); ఆకాశవీధిలో హాయిగా యెగిరేవు (భీంపలాస్, కళంగద, కీరవాణి, హంసానంది); పోయి రావే తల్లి (పీలు, శహన, పున్నాగవరాళి)
  • మంచిమనసులు: శిలలపై శిల్పాలు చెక్కినారు (ఉదయ రవి చంద్రిక, కాంభోజి, కీరవాణి)
  • వాగ్దానం: శ్రీ నగజా తనయం (కానడ, శంకరాభరణం, మోహన, తోడి, కేదారగౌళ, శ్రీ, కళ్యాణి)
  • విప్రనారాయణ: మేలుకో శ్రీరంగ (బౌళి, మలయమారుతం); ఎవ్వడే అతడెవ్వడే (భైరవి, మోహన, కాపి, వసంత)
  • శంకరాభరణం: రాగం-తానం-పల్లవి (చారుకేశి, సారంగ, దేవగాంధారి, కాంభోజి)
  • శివరంజని: అభినవ తారవో (శివరంజని, మలయమారుతం, సరస్వతి, కళ్యాణి)
  • శ్రీ కృష్ణ తులాభారము: భలే మంచి చౌక బేరము (కాపి, భాగేశ్వరి, మోహన, భాగేశ్వరి, హంసానంది, గౌళ, కాపి)
  • సప్తపది: అఖిలాండేశ్వరి (షణ్ముఖప్రియ, అఠాణ, సరస్వతి, దుర్గ(శుద్ధ సావేరి))
  • సిరివెన్నెల: ఈ గాలి ఈ నేల (శివరంజని, అమృతవర్షిణి)
  • లలితగీతాలు: పుష్ప విలాపము (శివరంజని కళ్యాణి, పంతువరాళి, పహాడి, మార్వా, బాగేశ్వరి)

పైనుదహరించిన పాటలే కాకుండా ఇంకా అనేక పాటల్లో రాగమాలిక ప్రయోగం కనిపిస్తుంది. పూర్వపు సినిమాల్లో ప్రతీ సంగీత దర్శకుడూ వివిధ రాగాల్లో రాగమాలికలా స్వరపరచడముంది. చాలామంది సంగీత ప్రియులు ఈ రాగమాలికల్ని ఇష్టపడతారు ఎందుకంటే వీటి వల్ల ఎక్కువ రాగాలని పాడిన అనుభూతి వస్తుంది. అన్ని రాగాలూ అందర్నీ అలరించినా అలరించకపోయినా రాగమాలిక మాత్రం ఎప్పటికీ జనరంజకమే.


ఆధార గ్రంథాలు:

  1. A Dictionary of South Indian Music and Musicians - Sambamoorthy, P. - Madras, Indian Pub. House, 1952.
  2. సమగ్రాంధ్ర సాహిత్యం – ఆరుద్ర - తెలుగు అకాడమీ - హైద్రాబాదు - 2004.
  3. గాంధర్వ వేదము - సంగీత రత్నాకరం - చర్ల గణపతి శాస్త్రి - ఆంధ్ర విశ్వవిద్యాలయం - విశాఖపట్టణం.
  4. గాన కళా బోధిని - పార్థ సారధి - బాలసరస్వతి బుక్ డిపో - మద్రాసు - 1965.
  5. సంగీత విద్యా దర్పణం - ఏకా సుబ్బారావు - మహలక్ష్మి బుక్ కార్పోరేషన్ - విజయవాడ.
  6. A history of British diplomacy in Tanjore - Rajayyan, K. - Madras University, 1969
ముందరి పేజీ(లు) 1 2
 

(10 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. mOhana అభిప్రాయం:

    July 1, 2009 11:49 am

    మంచి వ్యాసం. మద్రాస్ విశ్వవిద్యాలయంలో బయోఫిసిక్స్ ప్రాధ్యాపకులుగా ఉన్న డాక్టర్ శ్రీనివాసన్ గారు ఒకప్పుడు ఒక పేపర్‌లో చెప్పిందేమంటే (సాంబమూర్తిగారికి ఇందులో కృతజ్ఞతలు కూడా తెలిపారు, పేపరు రీప్రింటు ఎక్కడుందో వెదకాలి). రాగమాలికలకు ఉపయోగించే రాగాల స్వరాల frequencies మధ్య correlation coefficient ఎక్కువగా ఉంటే ఒక రాగంనుండి మరో రాగానికి వెళ్లడము సులభం అని. అందుకేనేమో సామాన్యంగా ఈ రాగాల మధ్య ఒక స్వరంలో మాత్రం మార్పు ఉంటే మధురంగా ఉంటుంది. అంటే ఇవి రాగాల మధ్య point mutation లాటి్ది అని అనుకొంటా :-)
    విధేయుడు - మోహన

  2. ramabharadwaj అభిప్రాయం:

    July 2, 2009 10:42 am

    బ్రహ్మానందంగారూ!! మీరు అన్నమయ్య దేసిసూళాది రాగమాలిక..తాళమాలిక లో ఉన్న దానిని గమనించిట్టులేదు. చాలా అపురూపమైన సూళాది అది..”వలెవలెనని వలచితినట” అన్నది..చూడండి.
    రమ.

  3. M.S.Prasad అభిప్రాయం:

    July 5, 2009 8:50 pm

    అనుపమ రాగ మాలికల హారము నేరిచి గూర్చి తెచ్చి మా
    మనముల కింపు గూర్పగ సమంచిత రీతిని జూపినట్టి మీ
    ఘన వ్యవసాయ తత్పరత గాంచి, గణించి, నమస్కరించి, యెం
    తన పులకించి, మించిన ముదం బెద నెక్కొన ప్రస్తుతించెదన్

    మీ ఈ వ్యాసం ద్వారా బ్రహ్మానందం కలిగించి అన్వర్ధ నామధేయులయ్యారు. అనేకానేక అభివందనలు ధన్యవాదాలు. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పల్లవి తప్ప అంతా మరచిపోయిన “నిత్య కళ్యాణి నిగమాంత సంచారిణి” రాగమాలికను పూర్తి పాఠం ఇచ్చినందుకు చాల కృతజ్ఞతలు.
    ఒక చిన్న సందేహం తీర్చగలరని ఆశిస్తున్నాను. కృష్ణా ముకుందా మురారి (పాండురంగ మహాత్మ్యం) రాగ మాలికలో లలిత లలిత మురళీ స్వరాళీ అనే చిరణం తరువాత పల్లవి శ్రుతి మారుతుంది (ఎక్కువ శ్రుతిలోకి సంధింప బడుతుంది) దీనికి కారణం ఏమిటి? సంగీత దర్శకుని ప్రతిభ/అసమర్ధతా? చరణాంతం తరువాత పల్లవి మొదలుపెట్టిన శ్రుతిలోకే అనుసంధింప బడాలి గదా.

    భవదీయుడు

  4. సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    July 12, 2009 11:08 pm

    మోహన రావు గారూ,

    మీకు శ్రీనివాసన్ గారి వ్యాస దొరికితే నాకూ ఒక కాపీ పంపించండి. కర్ణాటక సంగీతంలో గణితం/ధ్వని శాస్త్రం గురించి రాయాలని ఎప్పటినుండో ఉన్న కోరిక. వీలయితే చెప్పండి. ఇద్దరం కలిసి రాద్దాం.
    మీకు రాగమాలిక నచ్చినందుకు సంతోషం.

  5. సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    July 12, 2009 11:14 pm

    రమ గారూ,

    మీరు చెప్పిన అన్నమయ్య “దేశ సూళాది” రాగమాలిక, తాళమాలిక నాకు లభ్యం కాలేదు. మీ వ్యాఖ్య చూసాక, అన్నమయ్య కీర్తనల పుస్తకాలన్నీ తిరగేసినా దొరకలేదు. మీదగ్గరుంటే పంపగలరా? లేదా ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. తెప్పించుకుంటాను.
    అన్నమయ్య రాగమాలికని గుర్తుచేసినందుకు మరోసారి ధన్యవాదాలు.

  6. సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    July 12, 2009 11:41 pm

    ప్రసాదు గారూ,

    మీరిలా పద్యాలు కట్టి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏదో నాకు తెలిసింది రాసానంతే! వ్యాసం నచ్చిందని చెప్పారు. సంతోషం. నే పడ్డ కష్టాన్ని తీసేయడానికి ఆ రెండు ముక్కలు చాలు. మీలాగ నేనూ సంగీత విద్యార్థినే! కాబట్టి అంతేసి పెద్ద మాటలనవసరం.

    ఇహ, మీరడిగిన ప్రశ్న - కృష్ణా ముకుందా మురారి పాట గురించి. తెలుసున్నది చెబుతాను. రాగమాలిక ప్రధాన లక్ష్యం వివిధ రసాలని వివిధ రాగాలతో సంయమనం చేయడం. రస ప్రధాన రాగాలనెన్నుకొని పాట కట్టడం. ఇక్కడ రసమే పాటకి దిశానిర్దేశకం చేస్తుంది. కాబట్టి రసం మారినప్పుడల్లా పాటకి సంబంధిచిన శృతీ, లయా తదనుగుణగా మార్చుకోవచ్చు. అది సంగీత దర్శకుడి ప్రతిభ మీదే ఆధారపడుంటుంది. చరణాంతం పల్లవి మొదలుపెట్టిన శృతిలోనే వుండాలన్న నియమం రాగమాలికకి లేదు. సాంబమూర్తి గారు ఒక రాగమాలిక రాసారు. పేరు గుర్తురావడంలేదు. అందులో రాగం మారినప్పుడల్లా పల్లవి కూడా అదే రాగంలో మారుతూ వస్తుంది. ఇదేవిధంగా మీరుదహరించిన పాటా కట్టుండే అవకాశముంది. ఆ పాటలో శృతి మార్చడానికి కారణం సన్నివేశానికనుగుణంగా జరిగిందనే అనుకుంటున్నాను. ఎక్కడైనా దొరికితే బాలమురళి స్వరపరిచిన శృతి భేద రాగమాలిక వినండి. మీకు మరింతగా అర్థమవుతుంది.
    సినిమా పాటలో రాగమాలిక నాకు నచ్చిన రాగమాలికల్లో ఇదొకటి.

  7. rama bharadwaj అభిప్రాయం:

    July 13, 2009 9:04 am

    బ్రహ్మానందం గారూ!! మీరు అన్నమయ్య మొత్తం సంపుటాల్ని 29 ని సేకరించుకోండి. “వలె వలెనని వలచితినట” అన్న ది ఆ సూళాది. ఇది 25 వ సంపుటము లో478 వ సంకీర్తనగా ఉంది.27 వ సంపుటపు పీఠికలో కూడా దీని ప్రస్తావన వచ్చిన చోట ఈ సూళాది పాఠం ఇవ్వబడివుంది. ఈ సూళాదిని ” దేశి సూళాది” గా అన్నమయ్య పేర్కొన్నారు. సప్తరాగమాలిక..సప్త తాళమాలికలో ఇది కూర్పబడివుంది.రాగమాలికలోని రాగాల క్రమం ఇది: “మాళవిగౌళ; రామక్రియ; వరాళి; బౌళి; పాడి; నాట; శ్రీ రాగం; ఇంక తాళమాలిక క్రమం”ధృవ;మఠెం;రూపకం;ఝంపె;తివుడ;ఆట;ఏక తాళాలు.వీటిని పట్రాయని సంగీతరావు గారు వారి కుమార్తె కొచ్చర్లకోట పద్మావతి గారితో కలిపి గానం చేసారు. S.R. జానకీరామన్ గారు కూడా దీనిని గానం చేసారట. నేనిచ్చిన ఈ వివరాలన్నీ..జయప్రభ గారి ఇటీవలి విశ్లేషణ.అయిన… అన్నమయ్య 2nd volume నించి గ్రహించాను.వీలుంటే అన్నమయ్య గారి పదాల మీద ఆమె చేసిన విశ్లేషణని చదవండి. మొత్తం.. రెండు సంపుటాలు అవి. అన్నమయ్య సాహిత్యం మీద ఇష్టం ఉన్న ఎవరైనా తప్పక చదవదగ్గవి.
    రమ.

  8. సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    July 13, 2009 10:35 am

    రమ గారూ,

    మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. నావద్ద అన్నమయ్య 20 సంపుటాలున్నాయి. ఇవి టి.టి.డి వారి మొదటి ప్రచురణవి. ఆతరువాత వచ్చినవి నాకు దొరకలేదు. తిరుపతెళ్ళినప్పుడు అక్కడ పుస్తకాల షాపులో కూడా లేవు. జయప్రభ గారి పుస్తకం తెప్పించుకుంటాను. మీరు చెప్పిన 29వ సంపుటి ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా?

  9. rama bharadwaj అభిప్రాయం:

    July 13, 2009 10:15 pm

    బ్రహ్మానందమ్ గారూ!! దొరికితే T.T.D వారి వద్దే దొరకాలి.మీరు అక్కడే try చెయ్యండి.వారు అన్నమయ్య సాహిత్యాన్ని మొత్తంగా 29 సంపుటాలుగా ప్రచురించారు.ఐతే అవి ఇవాళ total set గా కొనేందుకు లభ్యం కావడం లేదని విన్నాను. వాటి పునర్ముద్రణని మళ్ళీ అన్నమయ్య ప్రాజెక్టు వారు చేస్తే తప్ప అన్ని volumes నీ కలిపి సేకరించుకోవటం ఆయన సాహిత్యాన్ని చదవాలనుకునే వారికి కష్టమే! తి.తి.దే..వారు అన్నమయ్య సాహిత్యాన్ని మళ్ళీ అందంగా తప్పులు లేకుండా అచ్చువేయాలి. అది చాలా అవసరం అని తెలుగువారంతా అడిగితే తప్ప ఆ ప్రాజెక్టు వారిలో కదలిక రాదేమో!! ఇది చాలా ముఖ్యమైన విషయమని మనవాళ్ళు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. ఇవాళ అందుబాటులో
    ఉన్న ఆ 14000 సంకీర్తనలనైనా అర్ధ తాత్పర్య స హితంగా తెనుగువారికి..మరీముఖ్యంగా రేపటి తరాల వారికి అందించటానికి.ఈనాటి సాహితీ జిజ్నాసువులూ..విజ్నులూ..చదువుకున్నవారూ…తెనుగు భాషా ..సంస్కృతీ విషయంలో గౌరవం కలిగిన వారంతా శ్రధ్ధతో పూనిక వహించకపోతే …జరిగే నష్టం మాత్రం అపారమైనది..పూడ్చుకోలేనిదీను.

    రమ.

  10. Srinivas Vuruputuri అభిప్రాయం:

    July 16, 2009 3:46 am

    “29వ సంపుటం” కామిశెట్టి శ్రీనివాసులు గారి వెబ్ సైట్ అన్నమయ్యపేటికలో దొరుకుతుంది (ఇవాళ ఎందుకో ఈ సైటు “తెరుచుకోవటం లేదు”)

    అన్నమయ్య గారిదే మరో రాగమాలిక ఉన్నదట - దశావతార సూళాది అని. ఈ సూళాది ఓ పెద్ద శిలా లేఖనమట. ప్రథమోపలబ్ధ స్వర సహిత సంకీర్తన శిలాలేఖము అనే పేరుతో TTD వారు ప్రచురించారు (www.archives.org లో PDF ప్రతి ఉపలబ్ధము)

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a