కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి
దిగులు లేదు
ఎంత చీకటి పడనీ
ఈ అడివి దారి
ఈ చీకటి వంతెన
అలవాటు కాకపోతేనేం?
దీన్ని దాటడానికే
ఈ శరీరాన్ని కూడదీసుకున్నా.
గుర్తేనా నీకు?
ఏ మునిమాపు పొలం లోనో
చెట్ల గుబురు లొ చిక్కడిపోయి
వొక వెర్రి పాట పాడుకుంటూ
చీకటిని దాటేయ్యడం?
వొక్కో సారి
దిక్కులు మారిన ప్రయాణంలో
వెనక్కి తిరగాల్సిన ముఖంమీద
అనేక భయాల ముడతలు
సంశయాల నీడలు
మరణమే
ఈ క్షణానికి నయమనిపించే దిగాలుతనం
గుర్తేనా నీకు?
మధ్యలోనే బతుక్కి
ఎర్ర జండా వూపి
వొక మిత్రుడు
మరీ భయానకమయిన ఆ పొద్దుట
రైలు పట్టాల మీద ముక్కలయి
కనిపించినప్పుడు
ఏ పదాలు రాసుకున్నానని?
వొక్క మాటా పెగల్లేదు కట్టెదుట.
మధ్యలోనే ప్రయాణాలు
ఆగిపోవడం
ఈ బతుక్కి కొత్త కాదు కదా?!
మరీ బలహీనమయిన రాత్రి
అతను - ఎవరైతేనేం ?
నిశ్సబ్దంగా పై దూలానికి
నిండయిన తన శరీరాన్ని
వేలాడ దీసి వొక చివరి నవ్వు
మా మొహాల మీద రువ్వి వెళ్ళిపోయినప్పుడు
అప్పుడయినా ఏం చేశామనీ?
వాక్యాలన్నీ చేతలుడిగిపోవడం తప్ప.
చిరునవ్వు
సగంలో తెగిపోవడం
అప్పటికింకా కొత్తే !
అయినా సరే..
చెయ్యడానికేమీ లేదుగా!
చిన్న చీకట్లు
పెద్ద మరణాలు ఎలా అవుతాయో
ఎప్పటికీ అర్ధం కాదు
కొన్ని మరణాలు
పెద్ద చీకటిలా ముసురుకోవడం
రోజూ తెలుస్తూనే వుంది.
నాన్నా,
చివరి సారిగా నీళ్ళతో కడగమని
అందరూ నన్ను నీ నిర్జీవ శరీరం ముందుకి
నెట్టిన ఆ మరణ క్షణం నిన్న రాత్రి కలలో.
నిద్రలోంచి తెగిపడ్డాను
గాఢమయిన చీకట్లోకి.
ఏడుస్తూ వుండిపోయాను
తెల్లారే దాకా.
చీకటీ వంతెనా
దిగులు పొలాలూ
ఖాళీ ఆకాశాలూ
అన్నీ నువ్వే.
అనగలనా..దిగులు లేదు…అని
అలవాటు కాని చీకటిలో
నిలబడి.
Seshagiri Rao Devaguptapu అభిప్రాయం:
July 1, 2009 3:00 pm
చాలా బాగుంది మీ కవిత. హృదయ బాధ అనుభవించితె గానీ రాదిటు వంటి కవిత. భాదల మీద అభిప్రాయం చె ప్ప గ ల ధై ర్యం లే దు లే దు నాకు లే దు
శేషగిరి రావు.
hrk అభిప్రాయం:
July 1, 2009 5:08 pm
ఏడుస్తూ వుండిపోయాను పద్యం చదివి చాల సేపు. ఇన్ని మరణాలూ ఏమీ నేర్పవు మనకు. ఎప్పటికప్పుడు ‘అలవాటు కాని చీకటిలోనే, కొత్త కొత్త చీకట్లలోనే నిలబడ’క తప్పదు. మరణించిన వాళ్లూ ఏమీ నేర్పరు మనకు. చనిపోని ప్రేమను రగిల్చి వెళ్లడం తప్ప. అఫ్సర్, నీతో నొప్పిని పంచుకుంటున్నా, పంచుకోడానికి నొప్పి మాత్రమే వుంటం వల్ల.
హెచ్చార్కె
Pasunoori Ravinder అభిప్రాయం:
July 2, 2009 5:34 am
“చీకటి వంతెన
దిగులు పొలాలు
ఖాళీ ఆకాశాలు”
వెనక్కి తిరిగి చూసుకునే గడియలే నిజంగా బతికిన క్షణాలు
అక్షరాల్లో బ్రతుకును చూపించడం అందరి వల్ల కాదు.
అందుకేనేమో కవిత్వానికి, కన్నీళ్ళకి దగ్గరి సంబంధం ఉందనిపిస్తది.
ఓ మంచి కవితను చదివే అవకాశాన్ని కల్పించిన అఫ్సర్ గారికి అభినందనలు
Subbarao Nanduri అభిప్రాయం:
July 2, 2009 6:59 am
అఫ్సర్ గారికి,
అభినందనలు. మీ కవితలో పదప్రయోగం, భావగాఢత బాగుంది. కానీ తర్కం ఏదీ? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు వ్రాశారు. ఎవరితో? మీ నాన్నతోనా? పాఠకుడితోనా? మీలో మీరే మాట్లాడుకుటున్నారా? నేను ఆధునిక కవిత్వం చదవను. ఇప్పటి ట్రెండ్ ఇదేనేమో నాకు తెలియదు. విప్పి చెబితే వచనం. కప్పి చెపితే కవిత్వం ఇంతేనా తేడా?
శ్రీశ్రీ, దేవులపల్లి, కుందుర్తి, తిలక్ , నండూరి, వీళ్ళందరి కవితలూ సూటిగా, తర్కబద్దంగానే ఉంటాయి కదా? తర్కం లేకుండా కేవలం పదాల పోహళింపుతో, భావగాఢతతో కవిత బతకదేమో? ఇప్పటి కవితలు పాఠకుల హృదయాల్లో నిలబడటం లేదేమో? ఇదంతా మీరూ మిగతా కవులూ ఆలోచించాల్సిన విషయం. నేను కవిని కాను కనుక నాకు అన్నీ సందేహాలేగానీ వాటిని పరిష్కరించగల సామర్ద్యం లేదు.
మరోసారి అభినందనలతో,
నండూరి వెంకట సుబ్బారావు.
బొల్లోజు బాబా అభిప్రాయం:
July 2, 2009 8:41 pm
కొన్ని వాక్యాలు ఆలోచనల్ని గాలనం చేస్తాయి. జీవితాన్ని వెంటాడతాయి. ఒక వాక్యం కోసం ఓ జీవితకాలం ఎదురుచూస్తే తప్పేమిటీ అని భూషణ్ గారు ఒకసారి ప్రశ్నించారు. కవి ఎంతో కొంత కష్టపడి వ్రాస్తున్నప్పుడు చదువరి దానిని అర్ధం చేసుకోవటానికి శ్రమిస్తే తప్పేమిటి అని అలోక్ గారు అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ వ్రాసిన ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం అన్న వాక్యం నేను మొదటిసారిగా చదివి ఇరవైఏళ్లు అవుతున్నా ఇంకా అది తడితడిగానే తగుల్తూంటుంది.
అఫ్సర్ గారు వ్రాసిన ఈ కవితలో ఒక జీవితం ఉంది. ఒక అనుభవం ఉంది. హృదయాన్ని కుదిపేసిన ఒక ఉప్పెన ఉంది. మరణం భౌతికమైనదే కాకపోవచ్చుగా.
ఇంకా
వెర్రిపాటలు పాడుకొంటూ చీకటిని దాటివేయగల తెంపరితనమూ
చిరునవ్వులు మధ్యలో తెగిపోవటాలు ఇంకా అనుభవంలోకి రాని పసితనం ఉంది.
చిన్న చీకట్లు పెద్దమరణాలు ఎలా అవుతాయో తెలీనితనం ఉంది.
ఉలిక్కిపడి నిద్రలోంచి చీకట్లోకి తెగిపడ్డం ఈ కల్లోల జీవనం మనకిచ్చే “బహుమానం”.
బహుసా తడికలిగినవారికే అది అనుభవమౌతుందేమో.
బొల్లోజు బాబా
yasasvi అభిప్రాయం:
July 3, 2009 6:21 am
కవిత్వంలో”తర్కం” వెతికే పాఠకుడున్నందుకు ఆశ్చర్యపడ్డాను. కవిత్వం గురించి తెలియదని ఒప్పుకున్నారు గనక కానీలెమ్మనుకున్నాను.
యశస్వి.
Subbarao Nanduri అభిప్రాయం:
July 3, 2009 6:46 am
వాక్యం రసాత్మకం కావ్యం అని నాకు తెలుసు. నిజంగానే అలాంటి వాక్యాల కోసం జీవితకాలం ఎదురుచూడాల్సిరావడం, ఒక నూక గింజకోసం బుట్టెడు ఊకను తినాల్సిరావడం ఇబ్బంది కాదూ?
కవి కష్టపడి కవిత్వం వ్రాయడం ఎందుకు? సరే కవులకూ , రచయితలకూ కూడా “ప్రసవ వేదన” ఉంటుందని ఒప్పుకుందాం. కానీ అంతవేదనా తన భావాలు పాఠకుడి హృదయానికి హత్తుకొనేలా చెప్పడానికే గానీ పాఠకుడి మేథస్సుకు ప్రహేళికలివ్వడానికి కాదు గదా? మనం కవిత్వం చదవాలంటే దానికి తగ్గ మానసిక నేపథ్యాన్ని సిద్ధం చేసుకొని ఉండాలా? ఇవన్నీ కవులకే ప్రయోజనం కలిగించే ప్రశ్నలు. వీటికి సహేతుకమైన సమాధానం వెతకగలితే కవిత్వం పూర్వవైభవము సంతరించుకుంటుంది. అలా కానప్పుడూ చివరకు నానీలే బదుకుతాయి. అసలు ఆ రకంగా చూస్తే సామెతలకన్నా మంచి కవితా వాక్యాలు దొరకవేమో.
[ఈ అభిప్రాయంపై వచ్చిన సాటి పాఠకుల అభిప్రాయాలు చర్చావేదికలోకి మార్చాము - సం.]
Sowmya అభిప్రాయం:
July 16, 2009 2:48 am
“అనగలనా..దిగులు లేదు…అని
అలవాటు కాని చీకటిలో
నిలబడి. ”
-బాగుంది.
bandla madhavarao అభిప్రాయం:
July 16, 2009 3:07 am
అఫ్సర్ భయ్యా మా నాన్న ను ఒక్క సారి గుర్తుకు తెచ్చావు. నిజమే మనకళ్ల ముందే ఎన్నో ప్రయాణాలు ఆగిపోతూనే ఉంటాయి. సాగిపోవడం తప్ప నేర్చుకోలేని వాళ్లం. కనీసం పదాలలోనైనా తలుచుకొని తలుచుకొని కదిలిపోయే అవకాశం కల్పించావు. కృతజ్నతలు.
Lakshmi Nageswar Dasari అభిప్రాయం:
April 7, 2010 6:14 am
చాలా బాగుంది.