ఈమాట » ఏడు గంటల వార్తలు

Expand to right
Expand to left

ఏడు గంటల వార్తలు

‘బాంబ్’ అని పెద్దగా అరిచి ఒక్క గెంతులో టేబుల్ కిందికి దూరాను. ‘భయపడకు. బాంబు కాదది. ఇప్పుడు బాంబులు పడడం లేదు. యుద్ధం జరిగినప్పుడు పడిన బాంబుల వలన ఇంటికప్పు దెబ్బతిన్నది. అందుకే కూలిపోయింది. భయంలేదు. యుద్ధం ముగిసిపోయింది’, నాన్న మెల్లిగా చెప్పాడు. ఇప్పుడు నాకు నాన్నంటే ఇష్టం పెరిగింది. కానీ ఆయన చెప్పింది నేను పూర్తిగా నమ్మలేకపోయాను.


మా అమ్మమ్మ వాళ్ళింటి వీధిలోనే ఆసుపత్రి ఉంది. అంబులెన్సు నుంచి రోగులను స్ట్రెచర్‌పై ఆసుపత్రిలోకి తీసుకెళ్ళడాన్ని కిటికిలోంచి అబ్బురంగా చూసేదాన్ని. రోగులని ఎప్పుడు ఎర్ర దుప్పటితో కప్పి ఉంచేవారు. రోగుల శరీరంపైన ఉండే రక్తం కనపడకుండా ఉండడానికే ఆ ఎర్ర దుప్పటి కప్పుతారని నాకు తర్వాత మిలిగాన్ మేడం చెప్పారు. నేను ఓ మూల గదిలో కూర్చుని - చారల పిల్లి ఓర్లాండో ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. ఓర్లాండో సెలవలకి ఊరెళ్ళడం, ఓర్లాండో తోటలు కొనడం భలే కథలు. సెలవలు, ఊళ్ళూ తోటలు - రోగులు, రక్తం కన్నా, గోడలు లేని మొండి ఇళ్ళు, కూలే కప్పుల గదులకన్నా హాయిగాను వాటికెంతో దూరంగాను ఉంటాయి.


ట్రాలీ బస్సులో మాకెదురుగా ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతడికి ముక్కు లేదు. మామూలుగా కనపడకుండా ఉండే ముక్కుగొట్టాలు అతని ముఖంలో నాకు కనిపించాయి.

‘అలా కళ్ళప్పగించి చూడకు. అతను యుద్ధంలో గాయపడ్డాడు’ చెప్పిందమ్మ. అతడు పెద్ద కోటు వేసుకుని ఉన్నాడు. అతడి ఎడమ చేతి వైపు ఖాళీగా ఉంది. కోటు భుజం దగ్గర పిన్ను పెట్టి ఉంది.

కొంతమంది ఊతకర్రలతో నిలబడి ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక కాలు లేదు. లేదా మోకాలి వరకే ఉన్నాయి. పాదాల వరకు దుప్పటి కప్పేసుకుని కొంతమంది చక్రాల కుర్చీలో ఉన్నారు. మరికొంతమందికి చూపులేని కళ్ళని కప్పుతూ పట్టీలు ఉన్నాయి.

నేనిప్పుడు చారల పిల్ల్లి సెలవలకి ఊరెళ్ళే కథ, బావురు కప్ప కారు నడిపే కథ కాకుండా ప్లాస్టిక్ సర్జరీలపై రాసిన పుస్తకాలు చదువుతున్నాను.


నేను మొదటి సారిగా జర్మనీకి వెళ్ళినప్పుడు భయాన్ని గెలిచాననుకున్నాను. నేను, నా నేస్తం కే లాంబ్రెట్టా పై, ఈస్టర్ రోజులలో వెళ్ళాం. మంచులో చలికి చేతివేళ్ళు కొంకర్లు పోయాయి. ఒక సత్రంలో ఆగాం. ఒక లావాటి ఆవిడ అక్కడక్కడా పళ్ళు లేని నోరుతో నవ్వుతూ మమ్మల్ని ఆహ్వానించింది. ఆమె నోట్లోంచి దాల్చినచెక్కా, లవంగపు వాసనొచ్చింది. ఓ పెద్ద కర్ర పొయ్యి పెంకులకి చేతులు ఆన్చి చలికాచుకున్నాం. ఇరుకైన చెక్క మెట్లెక్కి ఓ విశాలమైన గదిగుండా వెళ్ళాం. ఆ గదిలో చాలామంది మగవాళ్ళు, ఒకే రకమైన యూనిఫాం వేసుకొని వరుసగా కుర్చీలలో కూర్చుని ఉన్నారు. ఆ యూనిఫాం నలుపో, ఊదానో. ఆ గదిలో తడిసిన ఉన్ని, చెమట కలిసిన వాసన ఘాటుగా కొట్టింది. నల్లబల్ల మీద గీసిన ఓ బొమ్మని ఓ కర్రతో చూపిస్తూ ఓ వ్యక్తి తన ఎదురుకుండా కూర్చున్న వాళ్ళకి ఏదో చెబుతున్నాడు. అది ఓ సైనిక వాహనం తాలుకు నమూనా. పెద్ద పెద్ద చతురస్రాలు, చిన్న చిన్న వృత్తాలు.

మేం పడుకునే గదిలోకి రాగానే మా మంచం అంచు మీదే కూర్చున్నాం, కళ్ళు విప్పార్చుకొని. ‘‌వాళ్ళెవరై ఉంటారో? నాజీలా?’ ఈ మధ్యే విడుదలైన యుద్ధపు సినిమాల్లోని సన్నివేశాలు నా కళ్ళ ముందు మెదిలాయి. జైళ్ళ దృశ్యాలు, వేధింపుల దృశ్యాలు, చెప్పలేని అమానుష చర్యల దృశ్యాలు… మా అమ్మ మాట వింటే బాగుండేది. నేనిక్కడకి రాకుండా ఉండాల్సింది. నా ఆత్మవిశ్వాసం తృటిలో సడలిపోయింది. కే భయంతో తన చేతిరుమాలుని ముళ్ళేస్తూ, విప్పుతూ ‘ఆ బొమ్మ టాంకే కదా?’ అంది. ‘ఆరు చక్రాలా, ఎనిమిదా? పక్కనుంచి పొడుచుకొస్తూ తుపాకులే గదా? అది టాంకే’.

మేము తలుపు గడియ పెట్టుకున్నాం. కుర్చీని గడియ కిందికి నెట్టాం. నేను రాత్రంతా మేలుకునే ఉన్నాను, ఎవరైనా గదిలోకి చొరపడతారేమోనని చెవులు రిక్కించి, బాంబులు, బుల్లెట్ల రొద కోసం, సైనికుల సెయ్‌గ్ హెయ్‌ల్ శాల్యూట్ల అరుపుల కోసం. తెల్లారాక మాకు గది చూపించినావిడని అడిగాం, రాత్రి జరిగిన ఆ సమావేశం దేని గురించని. అప్పుడు తెలిసింది వారంతా అగ్నిమాపక దళం సిబ్బందని. నల్లబల్ల మీది ఆ బొమ్మ ఫైరింజను. పక్కన ఉన్నవి తుపాకులు కావు, నీళ్ళ గొట్టాలు. మా మూర్ఖత్వానికి మేము నవ్వుకున్నాం. యుద్ధం జీవితం పట్ల మన దృక్పధానికి రంగులు పులుముతుంది.


కొన్నేళ్ళ తర్వాత మా కుటుంబమంతా ఓ చిన్న కారులో ఐర్లాండ్‌కి వెళ్ళాం. ఎందుకైనా మంచిదని కారు వెనక అద్దానికి పెద్ద ఆస్ట్రేలియా జెండా అంటించాం. ఈల వేసే పోస్టాఫీసు ఆవిడ, ఫిడేల్ వాయించే హెల్త్ ఇన్స్‌పెక్టర్, బోథ్‌రాన్ వాయించే మెకానిక్ అందరూ వాళ్ళ సంగీతాన్ని మేము పాడడానికి చేసిన ప్రయత్నాలను మెచ్చుకున్నారు. ముసలివాళ్ళు చేసే జానపదుల నాట్యాలు చూడటం కోసం చిన్న చిన్న పూరిళ్ళ హోటళ్ళకి తీసికెళ్ళారు, ‘ఐరిష్ చుక్క ఒకటి వేసుకుంటారా?’ అని అడిగేవారు.

పండగలప్పుడు మైదానాలలో షామియానాల కింద కెనెడియన్లు, జర్మనులు, డచ్‌, అమెరికన్లు, ఇంగ్లీషువారు, ఐరిష్ కలసిపోయి తెలిసిన పాతపాటల్ని గుంపుగా పాడారు. కల్సిపోయి ఆడారు. ఒకే గొంతుతో, ఒకే రాగంలో, ఒక్కటిగా శాంతితో, దీపాలు పోయినప్పటి చీకట్లో కొవ్వొత్తులు, కాగడాలు పైకెత్తిన చేతులతో అటూ ఇటూ ఊపుతూ.

సరిహద్దును దాటాం, తగలబడిన కార్లూ, బస్సులను దాటుకుంటూ. దారంతా కావాలని పెట్టిన గోతుల్లో, ఆ కుదుపుల్లో మేమేమన్నా బాంబులు తెస్తుంటే అక్కడే పేలిపోడానికి. ఓ ఇంగ్లీషు సైనికుడు మమ్మల్ని ఆపాడు. కిటికిలోంచి మా అబ్బాయి వైపు గురి చూస్తూ తుపాకీ గొట్టాం. స్నేహం, సోదర భావన మాలో ఒక్కసారిగా నీరుగారిపోయాయి.

‘నీ చేతిలో ఆ పెట్టె ఏమిటి బాబూ?’

‘‌మాండలిన్’ మా అబ్బాయి గొంతు పీలగా మాటలు పెగలకుండా.

‘‌తెరిచి చూపించు’, తుపాకీ గొట్టం ఇంకొంచెం ముందుకొచ్చింది. తెరిస్తే మెత్తటి మృదువైన నీలి రంగు గుడ్డ పై పసిడి రంగులో మెరుస్తున్న గిబ్సన్ మాండలిన్.

‘‌మాండలిన్‌ని పైకి తీసి దాని కింద ఏదైనా ఉందేమో చూపించు’

మా అబ్బాయి కళ్ళలో భయం నేను చూడలేకపోయాను. వాడి బాధల్లా ఆ మాండలిన్ ఏమైపోతుందనే. మాండలిన్‌ని సున్నితంగా పైకి తీసాడు. ఆ సైనికుడు లోపలంతా జాగ్రత్తగా తడిమి చూసాడు.

‘‌సరే. లోపల పెట్టేసుకో’ అంటూ పెద్దవాళ్ళ కేసి చూశాడు సైనికుడు.

‘ఎక్కడినుంచి వస్తున్నారు?’

‘స్లైగో’

‘‌స్లైగో? అక్కడేం చేసారు?’

‘పాటలు పాడొస్తున్నాం’

‘‌మీ కారు డిక్కీ వెదకాలి’

ఎందుకని మేమడగలేదు. అతడికి కావల్సినదేది మా దగ్గర దొరకలేదు. వెళ్ళిపోవచ్చన్నట్లుగా చేయి ఊపాడు. మేము ఫెర్రీ ఎక్కాక కాని మళ్ళీ కుదుట పడలేదు. ఆ తర్వాత దిన పత్రికలో లార్డ్ మౌంట్‌బాటన్‌ని స్లైగో తీరంలో పడవ మీద పేల్చేసారని వార్త.


పొడుగైన భవంతులలోకి దూసుకొస్తూ ప్రయాణీకుల విమానాలు. పొగ, దుమ్ము, పరిచయమైన అవే ఆకారాల్లో, మబ్బుల్లా దట్టంగా. కిటికీల గుండా మంటలు బైటికి నాలికలు చాస్తూ. నేల కూలుతున్న భవంతులకు దూరంగా ఆడా మగా, పిల్లలు పెద్దలు అంతా రోడ్ల మీద కెమేరాలు దాటి పరిగెత్తుతున్నారు. వాళ్ళ బట్టలు, శరీరాలు తెల్లని పొడితో కప్పబడిపోయి. కళ్ళలో భయం, అదే. చూసేవారు నమ్మలేకపోతూ అరుస్తూ ఏడుస్తున్నారు.


నాన్నా, నువ్వు చెప్పింది తప్పు. నాకు అప్పుడే తెలుసు నాన్నా. బాంబులు పడుతునే ఉంటాయి. రెక్కలు చల్లగా మృదువుగా ఉన్నప్పటికీ విమానాలు ఎప్పటికీ మనుషులని చంపుతునే ఉంటాయి.


నా పీడకలల్లో నేనింకా లండన్ నగరపు అండర్‌గ్రౌండు కోసం పరిగెడుతునే ఉంటాను పరిచిన ఆ నాపరాళ్ళ బండలపై. బయటకు వెళ్ళే దారి నాకు తెలియదు. సాయం కోసం అడుగుదామన్నా ఎవరూ ఉండరు. నా బాల్యమంతా ఇక్కడే దాక్కొన్నాను. అయినా ఈ అండర్‌గ్రౌండ్ నాకు పరిచయం కాదు, నాకు ఊరటనివ్వదు.


లండన్ ప్రజలు కెమెరాలను దాటుకుంటూ తూలుతూ నడుస్తున్నారు. అవే ముఖాలు, తెల్లటి దుమ్ముతోటో, కట్లతోటో, రక్తంతో, గాయాలపై పట్టీలతో, అండర్ గ్రౌండ్ నుంచి మళ్ళీ మళ్ళీ బైటకి వస్తున్నాయి. అంబులెన్సులు సైరన్లతో స్ట్రెచర్లపై మనుషులని ఆసుపత్రికి తీసికెళుతున్నాయి. రోగులను తగరపు దుప్పట్లతో కప్పుతున్నారు, కాని అవి రక్తాన్ని కనబడకుండా ఆపగలవా? రోడ్డు మీద ఓ డబుల్ డెక్కర్ బస్సు నిలువుగా చీలిపోయి ఉంది - తినడానికి కోసిన మామిడిపండులా, పొట్ట పగిలిన బయటకి కనిపిస్తున్న పేగుల్లా బస్సు సీట్లు ప్రపంచానికి కనిపిస్తూ. ఈ రోజును చూడవలసి వచ్చిన తన దౌర్భాగ్యాన్ని పెద్దగా ఏడుస్తూ ప్రపంచంతో ఒక మనిషి పంచుకుంటున్నాడు.


మార్కెట్ ప్రాంతాలలో పసిబిడ్డలు ముక్కలైపోతున్నారు. హోటళ్ళలోను, బార్లలోను టూరిస్టులు బలవుతున్నారు. తమ ఇళ్ళూ, వూళ్ళను వదిలి పోతున్న వారిపై ఆకాశం నుంచి బాంబుల వర్షం, పోలీసు స్టేషన్ల ఎదుట ఆత్మాహుతి దళాల ఘాతుకాలు - ఇవన్నీ ఇప్పుడు కెమెరాలో. మొబైల్ ఫోన్ కెమెరాలలో, వీడియో కెమెరాలలో, టివి కెమెరాలలో. ఇవన్నీ మన కోసం, మన వినోదం కోసం… నా గతాన్ని రోజూ గుర్తు చేయడం కోసం…

నాన్నా, బాంబులు ఇంకా పేలుతూనే వున్నాయి. ప్రతీ రోజు ఏడుగంటల వార్తలలో వినిపిస్తూనే వున్నాయి. నాన్నా, పాదాలు గాల్లో తేలుతూ పరిగెత్తిన ఆ పాప జీవితాంతం ఆ యుద్ధంతో కలిసే బతకక తప్పదు.


[మూలం: Jackie Tritt రచించిన Seven O’clock News అన్న కథ.]

ముందరి పేజీ(లు) 1 2


కొల్లూరి సోమ శంకర్

రచయిత కొల్లూరి సోమ శంకర్ గురించి: పుట్టింది కృష్ణా జిల్లా గుడివాడలో. పెరిగింది హైదరాబాదులో. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో విద్యాభ్యాసం. అనేక కథలు, వ్యాసాలు, అనువాదాలు ప్రచురించబడ్డాయి. "మనీప్లాంట్" అనే భారతీయ కథల అనువాద సంకలనం వెలువరించారు.  ...

 

(2 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. mohanrazz అభిప్రాయం:

    July 1, 2009 5:03 am

    excellent story!!!!

  2. M.S.Prasad అభిప్రాయం:

    July 8, 2009 3:51 am

    చాలా బాగుంది. రచయిత గారి సెలెక్షన్ అభివందనీయం.

    భవదీయుడు

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a