పెట్టె బయట
“అదికాదు. పొడుపుకథ అంటే దాంట్లో ఏదో గూడార్థం ఉందన్నమాట. నీకు తెలుసా, అనూప్?” అంటూ కొడుకువైపు తిరిగింది. తెలియదంటూ తల అడ్డంగా ఆడించాడు అనూప్.
“లేదు, తెలుస్తుంది, మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించు,” అని మళ్ళీ చదివింది రాజ్యం, “కిట కిట తలుపులు, ఏం? కిటారు తలుపులు, అర్ధం అయిందా?” అనడిగింది, కొడుకు మొహంలోకి చూస్తూ. అనూప్ మళ్ళీ అయోమయంగా చూశాడు.
“వేసిన, మూసిన చప్పుడు కావు.”
కనురెప్పలు అల్లల్లాడించాడు అనూప్. “ఏమో తెలియదు.”
పక పకా నవ్వేసింది రాజ్యం. “ఇప్పుడు నువ్వు చేశావే, అదే!”
“ఏమిటది?” అనడిగాడు రవి కుతూహలంగా.
“నేను వీడిని నీకు తెలుసా అనడిగితే వాడేం చేశాడూ?”
“ఏం చేశాడు?” అనడిగాడు రవి.
“ అలా కళ్ళ రెప్పలు ఆడించాడా లేదా?”
“ఆఁ, ఆడిస్తే?”
“అవే మరి తలుపులు. కిటకిట తలుపులు, కిటారు తలుపులు - కళ్ళకు రెప్పలు తలుపుల్లాంటివే కదా? కాని, అవెన్ని సార్లు వేసి మూసినా, ఏమీ చప్పుడు చెయ్యవు. కాబట్టి కనురెప్పలు అని దీనర్ధం.”
“హే! భలే బావుంది!” అంటూ చప్పట్లు కొట్టాడు అనూప్.
అమ్మ ప్రోత్సాహం మూలానేమో, అనూప్ స్కూల్లో కొత్త రిడిల్స్ నేర్చుకున్నప్పుడల్లా వాటిని ఇంట్లో వెంటనే చెప్పడం అలవాటు చేసుకున్నాడు. ఆ రోజు రవి ఇంటికి రాగానే, “Daddy, what has four legs, a head, and leaves?” అనడిగాడు.
“ఏమిటో నువ్వే చెప్పు,” అన్నాడు రవి మందకొడిగా.
“A table!” అని నవ్వాడు అనూప్. ఆ విజయోత్సాహంతో, మళ్ళీ, “What has four fingers and a thumb, but is not alive?” అనడిగాడు.
“అబ్బ! ఏమిట్రా నీ గోల!” అని విసుక్కున్నాడు రవి.
చినబుచ్చుకున్న అనూప్, “a glove,” అని నెమ్మదిగా గొణిగాడు.
ఓదార్పుగా కొడుకు తల నిమిరి రాజ్యం, “ఎందుకు పాపం వాణ్ణలా కసురుకున్నారు?” అని రవినడిగింది.
“లేకపోతే ఏమిటీ nuisance?అర్ధం పర్ధం లేకుండా ఈ riddles? వాటికేమయినా logic ఉందా?”
“ఎందుకు లేదూ? జాగ్రత్తగా ఆలోచించాలంతే.”
“ఈ పిచ్చి ప్రశ్నలకు ఆలోచించడం కూడా ఒకటి!” ఎకసెక్కంగా అన్నాడు రవి.
కొంటెగా నవ్వింది రాజ్యం. “మీక్కావలింది తర్కవాదమైతే, ఇది వినండి,”
“పర్వతశ్రేష్ట పుత్రిక పతి విరోధి
యన్న పెండ్లాము అత్తను గన్నతల్లి
పేర్మిమీరిన ముద్దుల పెద్దబిడ్డ!
సున్న మించుక తేగదే సుందరాంగి!”
“Nonsense!” మండిపడ్డాడు రవి.
దాంతో రాజ్యానికి రోషమొచ్చింది. “నాన్సెన్సెందుకయింది? పర్వత శ్రేష్టపుత్రిక అంటే పార్వతి. ఆమె పతి అంటే శివుడు. అతని విరోధి అంటే మన్మధుడు. అతని అన్న అంటే బ్రహ్మ …”
“మన్మధుడి అన్న బ్రహ్మా? నేనెప్పుడూ వినలేదు,” అని అడ్డొచ్చాడు రవి.
“ఎందుక్కాదు? మన్మధుడు విష్ణుమూర్తి కొడుకు. బ్రహ్మ కూడా విష్ణుమూర్తి బొడ్డులోంచి పుట్టాడు కదా, మన్మధుడి ముందరే? అందుకే అతని అన్న.” రవి దగ్గరనుంచి సమాధానమేమీ లేకపోవటంతో మళ్ళీ తన వివరణ అందుకొంది రాజ్యం.
“సరే! బ్రహ్మ వరకూ వచ్చాము కదా? బ్రహ్మ పెళ్ళాం అంటే సరస్వతి. ఆమె అత్త అంటే లక్ష్మీదేవి. ఆమె తండ్రి సముద్రుడు. అతని పెద్ద కూతురు అంటే జ్యేష్టాదేవి. అంటే దరిద్ర దేవతన్నమాట. అంత మర్యాదగా ఆ బావగారు తన మరదలిని పిలిచి సున్నం తెమ్మని ఆడిగాడన్నమాట!”
“ఈ బావగారూ మరదలూ ఎక్కడనుంచి వచ్చారు?”
“ఓ, నేను చెప్పటం మర్చిపోయాను. ఇలా అని ఒక బావగారు తన మరదలి పిల్లతో అన్నాడుట.”
“Feminisits రాని ముందర రోజుల్లో అనుంటాడు. అందుకే బతికిపోయాడు.”
మళ్ళీ కొంటెగా నవ్వింది రాజ్యం. “ఫెమినిజమనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందనుకుంటున్నారా? ఆ మరదలు ఏం సమాధానం చెప్పిందో వినండి మరి,” అంది.
“శతపత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతువాహన వైరివైరి! సున్నంబిదిగో”
రవి పరధ్యానంగా ఉండి ఏమీ సమాధానమీయలేదు. అది గమనించకుండానే తన ధోరణిలో చెప్పుకు పోయింది రాజ్యం.
“శత పత్రంబులంటే కలువ పువ్వులు. వాటి మిత్రుడు సూర్యుడు. అతని కొడుకు కర్ణుడు. అతనిని చంపిన వాడు అర్జునుడు. అర్జునుడి బావ కృష్ణుడు. ఆతని సూనుడు, అంటే కొడుకు, మన్మధుడు. మన్మధుడి మామ చంద్రుడు. ఆ చంద్రుణ్ణి తలలో పెట్టుకునేవాడు శివుడు. అతని కొడుకు వినాయకుడు. వినాయకుడి వాహనము ఎలుక. దానికి వైరి, అంటే శత్రువు, పిల్లి. పిల్లికి శత్రువు కుక్క. కాబట్టి, ఓ కుక్కా! ఇదిగో నీ సున్నం! అని బదులిచ్చిందావిడ. ఆవిడేం తక్కువ తినలేదు.”
నవ్వుతూ రవివైపు చూసిన రాజ్యం ఆశ్చర్యపోయింది. అతనీ లోకంలోనే ఉన్నాట్టు లేడు. “ఏం? ఆ లాజిక్కు మీకు నచ్చలేదా? చాలా పకడ్బందీగా ఉన్నది కదా?” అని రవిని చిన్నగా తట్టి అడిగింది.