పెట్టె బయట

పట్టువదలని రవి, కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో గూడా విచారిద్దామనుకున్నాడు గానీ, అప్పటికే వాటిలో చాలా వాటికి admissions పూర్తయిపోవడం మూలానా, వాళ్ళు కూడా అనూప్‌ని కిండర్ గార్డెన్ లోనే చేర్చుకుంటామనడంతోనూ, అతను ఓటమినంగీకరించక తప్పలేదు. అయిష్టంగానే అనూప్‌ని కిండర్ గార్డెన్ లో చేర్పించాడు.

“ఇక్కడ వీడేం నేర్చుకుంటాడు? ఉన్న చదువంతా మర్చిపోయి, అమెరికన్ బడుధ్ధాయిల్లాగా తయారవుతాడు,” అని రాజ్యం దగ్గిర విసుక్కున్నాడు.

“అమెరికన్లందరూ బడుధ్ధాయిలెందుకయ్యారు? వాళ్ళలో మాత్రం తెలివిగల వాళ్ళూ, బాగా చదువుకున్న వాళ్ళూ లేరా ఏమిటి?” అని అనునయించబోయింది రాజ్యం.

కానీ రవి చప్పరించేశాడు. “ఆఁ, నా మొహం. అంత తెలివి గల వాళ్ళయితే మన లాంటి వాళ్ళనెందుకు అరువు తెచ్చుకుంటారు?”

రవి ధోరణి చూస్తే రాజ్యానికి కూడా కొంచెం ఆందోళన కలిగింది. “అయితే వీడిని తీసుకుని నేను ఇండియా వెళ్ళిపోనా? చక్కగా అక్కడి బళ్ళోనే వాడిని వేయచ్చు.”

గతుక్కుమన్నాడు రవి. కొడుకు భవిష్యత్తు కోసం భార్యను వదులుకునేందుకు సిద్ధంగా లేడు మరి. “ఆఁ ఎందుకులే, లేనిపోని ఖర్చు. అసలు అక్కడ స్కూళ్ళల్లో వీడిని చేర్చుకుంటారో లేదో కూడా అనుమానమే. మనం ఇప్పటికే చాలా అశ్రధ్ధ చేశాం. ఇక్కడికొచ్చినందుకు ఇక్కడి పధ్ధతి పాటించకతప్పదు. ఇదీ కొన్నాళ్ళు చూద్దాంలే.” అన్నాడు.

భర్త మాటలు రాజ్యానికేమీ ఊరట కలిగించలేదు. అనూప్ చదువు ఎలా సాగుతుందో, తమ స్వార్ధానికి వాడి భవిష్యత్తు బలి అవుతుందా అని దిగులుపడింది. కానీ, స్కూల్లో చేరిన వారంరోజుల లోపునే ఆనూప్ లో మళ్ళీ హుషారూ, చురుకుదనం తిరిగి రావడం, రోజూ ఇంటికి రాగానే స్కూల్లో జరిగినదల్లా ఉత్సాహంగా తలితండ్రులతో చెప్పడం చూసేసరికి, రాజ్యలక్ష్మి మనసు కొంచెం కుదుటపడ్డది.


రవి ఆఫీసు గొడవల్తో చిరాకుగా ఉన్నాడు.

“Innovative thinking కావాలిట వీడికి. ఆసలు thinking ఏమిటో తెలిస్తేగా అది innovative అవునో కాదో తెలిసేందుకు!” అంటూ విరుచుకుపడ్డాడొక రోజు.

“ఎవరి మాట?” అనడిగింది రాజ్యం.

“వాడే. మా మానేజర్ గాడే.”

“అదేమిటండీ. మానేజరన్నాక కొంచెం గౌరవమిచ్చి మాట్లాడాలికదా?” మానేజర్ ని పట్టుకుని ‘వాడు’ అనడం నచ్చలేదు రాజ్యానికి.

ఇంకా రెచ్చిపోయాడు రవి. “ఏం చూసివ్వాలి గౌరవం? నాకంటే ఎక్కువ చదివాడా? ఎక్కువ అనుభవమున్నదా? కేవలం వాడి american accent కోసం వాడిని మానెజర్ని చేశారు.” ఇది పాత పాటే కాబట్టి ఆ విషయాన్నిక వదిలేసింది రాజ్యం.

“ఇంతకీ ఏం జరిగింది?” రవి కూడా కొంచెం సర్దుకున్నాడు. “ఏముందీ? ఏదో మాకు market share పడిపోతోందట. అందుకని కొత్త productని కనిపెట్టాలిట. దానికి ఇప్పుడు మేము చేస్తున్న పనేమీ పనికిరాదట. అసలు మా ఆలోచన క్రమమే సరిగ్గా లేదట. అందుకని ఏదో innovativeగా ఆలోచిస్తే తప్ప లాభం లేదంటూ పెద్ద లెక్చరిచ్చాడు ఇవ్వాళ.”

“ఇన్నొవేటివ్ అంటే?” సందేహంగా అడిగింది రాజ్యం.

“నా బొంద. వాడికి తెలిసేడిస్తేగదా! ఇక్కడిదంతా ఒక ఫాషనైపోయింది. ఇన్నేళ్ళుగా పనికొచ్చిన పధ్ధతులేవీ ఇప్పుడు నచ్చవుట. ఇప్పుడు కొత్తగా ఏదో పొడిచెయ్యాలని వీడి ఉద్దేశం. మనం అనూప్ స్కూల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళన్నారు కదా, మేం పిల్లలచేత బట్టీ పెట్టించం, వాళ్ళ creativityని పెంపొందిస్తామని? ఇదీ అల్లాంటిదే,” అన్నాడు విసుగ్గా.

ఇంతలో అనూప్ అక్కడకొచ్చాడు. “ఇవ్వాళ ఒక కొత్త riddle నేర్చుకున్నాను,” అన్నాడు వాళ్ళ అమ్మ ఒళ్ళోకి గెంతుతూ.

“రిడిల్ అంటే?” రాజ్యం అడిగింది.

“Riddle అంటేనా?” అంటూ ఎల్లా చెప్పాలో తెలియక అనూప్, ఇదిగో!” అని, “what’s full of holes but still holds water?” అనడిగాడు.

“వాట్స్ ఫుల్ ఆఫ్ హోల్స్ బట్ స్టిల్ హోల్డ్స్ వాటర్?” అని మళ్ళీ మననం చేసుకుంది రాజ్యం. “ఏమిటబ్బా? నాకేం తట్టటం లేదు,” అని రవి వేపు చూసి, “మీకు తెలుసా?” అనడిగింది. రవి ఇంకా చిరాగ్గా ఉన్నాడు. “ఏమిటి తెలిసేది? ఏదో పిచ్చి ప్రశ్న!” అని విసుక్కున్నాడు.

“ఫుల్ అఫ్ హోల్స్ అంటే చిల్లులు చిల్లులుగా ఉండటం కదా? దాంట్లో నీళ్ళెలా ఉంటాయి?” అని రాజ్యం పైకే తర్కిస్తూంటే, ఉత్సాహంగా గంతులు వాశాడు అనూప్, “నీకు తెలియదూ! నీకు తెలియదూ!” అని అరుస్తూ.

“అవును, నిజమే. నాకు తెలియదు,” ఒప్పేసుకుంది రాజ్యం. “ఏమిటి మరి నువ్వు చెప్పు” అనడిగింది.

“A sponge!” అంటూ పడీ పడీ నవ్వాడు అనూప్.

“స్పాంజా? కానీ స్పాంజిలో చిల్లులేవీ?” అన్నది రాజ్యం. వెంటనే వంటింట్లోకి వెళ్ళి సింకు దగ్గర స్పంజిని తెచ్చి ఆమె కళ్ళ ముందర ఆడించాడు ఆనూప్.

“ఇవన్నీ చిల్లులేకదా? కానీ నువ్వేమైనా తుడవాలంటే దీన్నే వాడతావు. అప్పుడా నీళ్ళన్నీ దీంట్లోకే వెళతాయి,” అంటూ మళ్ళీ పక పకా నవ్వాడు.

రాజ్యానిక్కూడా ముచ్చటవేసి “భలే బావుందే ఇది! రిడిల్ అంటే పొడుపు కథన్నమాట. నా చిన్నప్పుడు నేనూ బోలెడు నేర్చుకున్నాను.” అని చెప్పింది. అమ్మకి కూడా రిడిల్స్ వచ్చనేటప్పటికి అనూప్‌కి కుతూహలం పుట్టుకొచ్చింది.

“ఏం riddles నేర్చుకున్నావు నువ్వు?” అనడిగాడు. “ఉండు, ఒక్క క్షణం ఉండు,” అంటూ ఆలోచనలో పడ్డది రాజ్యం. రెండు నిముషాల తర్వాత, “ఆఁ, ఇదొక మంచిది,” అంటూ చదివింది.

“తండ్రి గర గర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు మనవలు బొమ్మరాళ్ళు ఏమిటదీ?”

తెల్ల మొహం వేసేశాడు అనూప్. “ఏమో నాకు తెలియదు.”

రవి వేపు తిరిగింది రాజ్యం. “మీకు తెలుసా? మీరు చెప్పగలరా?”

“ఏమిటీ?” వింతగా చూశాడు రవి. “తండ్రి గర గరా? అదేమిటి? తల్లి పీచు పీ… ఏమిటిదీ? అసలు దీనికి అర్ధం పర్ధం లేదే!”

“అయ్యో అది చాలా ప్రసిధ్ధి చెందిన పొడుపు కథండీ. మీకు తెలియదా? మీరు విప్పలేరా?”

“సరే, ఏమిటో చెప్పు,” అన్నాడు రవి, తనకు తెలియదని ఒప్పుకోకుండానే.

“పనసపండూ!” విజయగర్వంతో అంది రాజ్యం.

“పనసపండా? పనసపండుకీ, నువ్విప్పుడు చెప్పిందానికీ ఏమిటి సంబంధం?”

“ఎందుకు సంబంధం లేదూ? పనసపండు పైన గరగరగా ఉంటుంది, లోపల చూస్తే పీచు పీచుగా ఉంటుంది. కాబట్టి అవి రెండూ తల్లి తండ్రులు. కానీ అవన్నీ తీసేస్తే, లోపల మంచి పనస తొనలుంటాయు. అవి బిడ్డలన్నమాట”

“మరి మనవలు బొమ్మరాళ్ళేమిటి? “ అన్నాడు రవి అడ్డొస్తూ.

“తొనల లోపల గింజలుంటాయి కదా? వాటిని బొమ్మ రాళ్ళన్నారు. బిడ్డల లోపలున్నాయి కాబట్టి వాటిని మనవలన్నారు,” అని వివరించింది రాజ్యం.

“సరేలే. ఇదంతా ఏదో గందరగోళంగా ఉన్నది. ఇంత కష్టమైనవి చిన్నవాడికేం తెలుస్తాయి?” అన్నాడు రవి. “అయినా పనసపళ్ళ గురించి అమెరికాలో పుట్టిపెరిగిన పిల్లాడికేం తెలుస్తాయి? అందుకే వాడు చెప్పలేక పోయాడు,” అని దబాయించాడు.

“నిజమే,” ఒప్పుకుంది రాజ్యం. రెండు మూడు క్షణాలు ఆలోచించి చెప్పింది “సరే. ఇప్పుడు నేనొక పొడుపు కథ చెప్తాను. అది అందరికీ తెలుస్తుంది. అనూప్‌కి కూడా తెలుస్తుంది – “కిట కిట తలుపులు కిటారు తలుపులు వేసిన మూసిన చప్పుడు కావు.”

“ఏ తలుపులు వేసినా, మూసినా చప్పుడు కావు. ఇక్కడ అన్నిటికీ బాగా oil వేస్తారు,” అని లేచి వెళ్ళి గది తలుపు వేసీ, మూసీ చూపించాడు రవి. కొంచెం ఉడుక్కుంది రాజ్యం.