గోవిందా! గోవిందా!

ఫ్లాట్ఫారం మీద తిరుగుతున్న భక్తులు కొందరు అకస్మాత్తుగా “గోవిందా! గోవింద!” అంటూ ముక్త కంఠంతో ఓ పొలికేక పెట్టారు. ఉలిక్కిపడ్డట్లై ప్రస్తుతానికి వచ్చారు భార్యా భర్తలు.పిల్లల్ని లేవగొట్టే ప్రయత్నంలో పడింది జానకి. సామాను తీసుకుని గుమ్మం దగ్గరికి నడిచాడు సీతాపతి. రష్ తగ్గాక రైలు దిగొచ్చు లెమ్మని వేచి ఉన్న పోలియో వచ్చిన అబ్బాయి, అతని తల్లితండ్రులూ అప్పుడే దిగుతున్నారు. వాళ్ళని చూడగానే సీతాపతి మనసులోకి ఒక ఆలోచన వచ్చి, ముల్లులా కుట్టింది.

” ఆ పెట్టెలో డబ్బు ఈ అబ్బాయికి ఇచ్చినా సద్వినియోగమై ఉండేది కదా! కాని, భవిష్యత్తు ఏమిటో తెలియని తప్పు నాది కాదు, ఆ దేవదేవుడిదే! గోవిందా! గోవింద!” అనుకున్నాడు మనసులో.


టాక్సీ బేరం చేసుకుని కొండ పైకి వెళ్ళి, ముందే బుక్‌చేసి ఉంచుకున్న కాటేజ్ చేరుకున్నారు సీతాపతి, కుటుంబం. ఆ రోజు స్వామి వారికి ప్రియమైన శనివారం కావడంతో, కల్యాణ కట్టకు వెళ్ళి మొక్కు తీర్చుకోవాలనీ, అప్పటికప్పుడే దైవ దర్శనం చేసుకోవాలని పట్టుపట్టింది జానకి. వెంటనే వాళ్ళు స్నానాలు చేసి తయారైపోయారు. అదృష్టం బాగుండి, కల్యాణకట్ట దగ్గర పని తొoదరగానే జరిగిపోయింది. పిల్లవాడికి జుట్టు తీయించడంతోపాటుగా, మొక్కు తీర్చడంలో జరిగిన జాప్యానికి వచ్చిన అపరాధ భావంతో సీతాపతి కూడా తన తలనీలాలు ఇచ్చాడు. జానకీ, కూతురూ తలో మూడు కత్తెరలూ ఇచ్చి తమ భక్తిని నిరూపించుకున్నారు. కాటేజ్‌కి తిరిగి వచ్చి మళ్ళీ స్నానాలు కానిచ్చి, ముస్తాబై వెళ్ళి దైవ దర్శనం చేసుకోడం కోసం క్యూలో నిలబడ్డారు.

అది మంచిరోజు కావడంతో క్యూ చాలా పొడుగ్గా ఉంది. ఆ వరసలో వెళ్ళాలంటే ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. రాత్రంతా ప్రయాణం చేసి ఉన్నారేమో, పిల్లలు బడలికతో వాడిన తోటకూర కాడల్లా వేల్లాడిపోసాగారు. ఇలా కాదని దర్శనానికి దగ్గర దారులు వెతికాడు సీతాపతి. తలకొక వంద చొప్పున ఇచ్చి, దగ్గర దారి టిక్కెట్లు కొన్నాడు. దాంతో తొందరగానే గర్భ గుడి దగ్గరికొచ్చారు. సింహద్వారానికి మొక్కి గడప దాటి, ప్రవహిస్తున్న నీళ్ళలో నడిచి వెళ్ళే సరికి కృతక ఓంకార నాదం వినిపించసాగింది. అక్కడనుండి తొందరగా నడవమని భక్తులకు హెచ్చరికలు చెపుతూ తోసేస్తూ వుండే వాలంటీర్ల సంఖ్య కూడా పెరిగింది.అక్కడికి చేరిన యాత్రీకుల హృదయాలు భక్తి భావంతో బరువెక్కి ఉండడంతో ఎవరెంత హెచ్చరించినా, గర్భవతుల్లా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తోపుళ్ళను ఓపుకుంటూ కదులుతున్నారు.

చివరికెలాగో జానకి సీతాపతులు పిల్లలతో స్వామి దగ్గరకి చేరుకున్నారు. ఎదుట నున్న వాళ్ళ తలల పైనుండి, కనీ కనిపించకుండా వున్నాడు ఆ దేవదేవుడు. సీతాపతికి గాలి స్థంభించి పోయినట్లనిపించింది. ఓంకారమే జగత్తు మొత్తం నిండిపోయి ఉన్నట్లు తోచింది. స్వామిని ఎదురుగా కళ్ళారా చూడాలని తహతహలాడాడు. అక్కడున్న వారందరి పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. ఇది అది అని చెప్పలేని ఏదో ఉత్సుకతతో జనం ముందు ముందుకి జరిగి స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు. స్వామికి ఎదురుగా వచ్చిన సీతాపతి కళ్ళు పైకి లేపి నిండుగా అలంకరించబడి ఉన్న ఆ దివ్యరూపాన్ని కళ్ళారా చూడాలని ప్రయత్నించాడు. అంతలోనే వాలంటీర్లు జబ్బపట్టుకు అతన్ని పక్కకి నెట్టేశారు, వెనకాలే జానకిని కూడా. వెనకవాళ్ళు ముందుకు వచ్చేశారు. ముందు వాళ్ళు ముందుకి కదలక తప్పలేదు. ఉసూరుమన్నారు సీతాపతి, జానకీ. దీనికోసమేనా ఇంత దూరం వ్యయప్రయాసలకు ఓర్చి వచ్చింది, అనిపించింది వాళ్ళకి. కాని అంతలోనే వాళ్ళు హుండీ ఉన్న చోటుకి వచ్చేశారు. అక్కడితో, వాళ్ళ ఆలోచనల దారి మారింది.

వాళ్ళ తరఫున మొక్కుల్ని హుండీలో వెయ్యమంటూ, తమమీద నమ్మకం ఉంచి అప్పగించిన స్నేహితులూ, ఇరుగుపొరుగువారూ గుర్తు వచ్చి, జానకీ సీతాపతులకు గుండెలు బరువెక్కాయి. వాళ్ళందర్నీ పేరు పేరునా తలుచుకున్నారు మనసులో. తమకు తోచిందేదో హుండీలో అందరి పేరు మీదా వేసి అక్కణ్ణుంచి కదిలారు. కొంచెం అటుపైగా దేవస్థానం వారు తలో కాస్తా ప్రసాదం చేతిలో ఉంచారు. అక్కడే ఉన్న అరుగుమీద విశ్రాంతిగా కాసేపు కూర్చుని, ఆ ప్రసాదం నోట్లో వేసుకోడంతో వాళ్ళకు మొక్కు చెల్లించిన తృప్తి కల్గింది. కాళ్ళసందుల్లోంచి దేవుణ్ణి చూశాగా! అన్నాడు అబ్బిగాడు. వాడి బోడిగుండు తడిమి ఆ చెయ్యి ముద్దు పెట్టుకున్నారు ఆ తల్లీ, తండ్రీ. మొక్కు తీర్చుకున్న సంతోషం వారి మనసుల్లో నిండిపోయింది.

ఆ తరువాత లడ్డూల వేట మొదలయ్యింది. దేవస్థానం వాళ్ళ షాపు దగ్గర పెద్ద క్యూ ఉంది. చచ్చిచెడి ఆ క్యూలో పడి వెడితే, డబ్బు తీసుకుని తలకొక లడ్డూ అంటూ లెక్కపెట్టి మరీ ఇచ్చారు వాళ్ళు. ఇంక ఎంత బ్రతిమాలినా, ససేమిరా ఇవ్వడం కుదరదు పొమ్మన్నారు. ఆ లడ్డూల్ని చూసి బిత్తరపోయాడు సీతాపతి. లడ్డూ ఉరవ చూస్తే, తమ పెళ్ళైన కొత్తలో దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఇచ్చిన లడ్డూలో సగం కూడా లేదు ఇప్పటి లడ్డూ.

“ఇంత చిన్నవేమిటి! ఈ నాలుగూ ఏమూలకీ రావు. మనకి మొక్కులందించిన వాళ్ళకి మనం ప్రసాదమైనా ఇవ్వాలా వద్దా! బ్లాకులో కొనాలి, తప్పదు” అంది జానకి. వెర్రి మొహం పెట్టుకు భార్య వైపు అదోలా చూశాడు సీతాపతి. దాన్ని అపార్ధం చేసుకున్న జానకి రుస రుస లాడింది.

“మీరు మరీనండీ! జరిగిందేదో జరిగిపోయింది. దానికి మనమేం చెయ్యగలం? కనీసం మనం వాళ్ళకి కొంచెం ప్రసాదాలైనా ఇస్తే బాగుంటుంది కదా. ఇక్కడ పీనాసితనం చేయకండి. ఔనంటారా, కాదంటారా, చెప్పండి” అంది.

“అదికాదే బాబూ! దేవుడి ప్రసాదం బ్లాకులో అమ్మడమా! అలాగైతే అది ప్రసాదం ఎలాగౌతుందీ అని ఆలోచిస్తున్నా, అంతే. కొంటాలే” అన్నాడు సీతాపతి ఇంకా అదోలానే.

వాళ్ళు బయటికి వచ్చేసరికి కొందరు, సినిమాహాళ్ళ దగ్గర బ్లాకులో టిక్కెట్లు అమ్మేవాళ్ళల్లా చుట్టుముట్టి, “లడ్డూ కావాలా, లడ్డూ కావాలా” అంటూ వీళ్ళ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. జానకి అరడజను కావాలంది. కాని సీతాపతి, పది లడ్డూలకు ఆర్డర్ చేశాడు.

వెంటనే జానకి “నేను ఆరంటే మీరు పదంటారేం” అంది.

“నీ తస్సాదియ్య, ఆగవే బాబూ! అవంటే నాకు చచ్చేటంత ఇష్టం. ఈ తిరుపతి లడ్డూకున్న రుచి మరే లడ్డూకీ రాదు. నీకిష్టం లేకపోతే మానెయ్. నేనూ పిల్లలూ నాల్గునాళ్ళు దాచుకు తింటాం. ఈ ఫారమ్లాయే వేరు. ఇలా ఇల్కెవలూ చెయ్యలేలు” అన్నాడు సీతాపతి నోరూరుతూండగా.

జానకి నవ్వింది. ఆ రాత్రికి కాటేజీలో ఉండి, తిరుమల అంతా తిరిగారు. అక్కడే కావలసినవన్నీ కొనుక్కుని , తిరుగు ప్రయాణమై కుటుంబమంతా మరునాటికల్లా ఇంటికి తిరిగి వచ్చేశారు.

వీళ్ళు యాత్ర ముగించుకుని తిరిగి వచ్చినట్లు ఎలా కబురందిందో ఏమో, ఒక్కొక్కళ్ళూ వచ్చి, పలుకరించి, కుశల ప్రశ్నలడిగి వెళ్ళడం మొదలుపెట్టారు. అందరిదీ మొదటి ప్రశ్న దర్శనం బాగా అయిందా అనే. సమాధానం అయింది అనే. తిరుమల కబుర్లు చెప్పి, కొంచెం లడ్డూ ముక్క, స్వామివారి చిన్న పటం, యాత్రా తోరం ఇచ్చి చిరునవ్వుతో అందర్నీ సాగనంపింది జానకి.

సాయంకాలం శాంత వచ్చింది. వస్తూనే, జానకిని కౌగిలించుకుని, “వొదినా, నీ మేలు ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. ఆవేళ నీ చేతికి మొక్కుకున్న డబ్బు ఇచ్చి, స్వామివారి హుండీలో వెయ్యమని చెప్పి వెళ్ళానా, నేను ఇల్లు చేరే సరికి రాజు దోరాటం తగ్గి ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. కాసేపట్లో కళ్ళు తెరిచి, “అమ్మా దాహం” అని అడిగి గ్లాసుడు నీళ్ళు తాగి పడుకున్నాడు. అంతా ఆ ఏడుకొండలవాడి దయ. మీ అన్నయ్యగారు సరేలే, ‘నువ్వటెళ్ళావో లేదో, డాక్టర్ ప్రసాద్ వచ్చి ఇంజక్షన్ చేసి, మందులు రాసి ఇచ్చి వెళ్ళాడు. అరగంటలో గుణం కనిపిస్తుందని చెప్పాడ్లే. అది ఆయన దయ’ అన్నారు. ఎడ్డెమంటే తెడ్డెం! నువ్వు చెప్పు వదినా! మందు అంత తొందరగా గుణమిచ్చిందంటే, అది స్వామి మహిమ కాక మరేమిటిట! మీరు వడ్డి కాసుల కోసం ఇచ్చిన వందా ఇదిగో” గుక్కతిప్పుకోకుండా అంటూ శాంత ఒక వంద కాగితాన్ని తీసి జానకివైపుగా చెయ్యిచాపి అందించింది.

ఆ నోటు తీసుకోవాలో, వద్దనాలో తెలియక వెర్రిమొహం వేసుకుని భర్త వైపు చూసింది జానకి. ఏమని చెప్పాలో అర్ధం కాక తెల్లమొహం పెట్టుకుని గోడనున్న వెంకటేశ్వరస్వామి పటం వైపు చూశాడు సీతాపతి.

శాంత చేతిలోని వంద రూపాయల నోటు ఫానుగాలికి నవ్వినట్లుగా రెపరెపలాడింది.