గోవిందా! గోవిందా!

మర్నాడు తొందరగా తెమిలి భోజనాలు చేసేశారు. ఇరుగుపొరుగుల కందరికీ వీడ్కోలు చెప్పి, మొక్కుబళ్ళు మొత్తం ఉంచిన పెట్టె పట్టుకుని వచ్చి టాక్సీ ఎక్కింది జానకి. పిల్లలు రైలెక్కబోతున్న సంతోషంతో కేరింతలు కొట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు స్టేషన్‌లో తిరుమలా ఎక్సుప్రెస్‌ ఎక్కింది సీతాపతి కుటుంబం. వీళ్ళు ఎక్కి కూర్చున్న కాసేపటికే రైలు కదిలింది. కంపార్టుమెంటులో ఉన్న అమాంబాపతు తుప్పతలల భక్త జనం యావన్మందీ ముక్త కంఠంతో “గోవిందా గోవింద” అంటూ ఏకగ్రీవంగా పెద్దగా కేక పెట్టారు. కిటికీ వార కూర్చుని ఏదో పుస్తకం శ్రద్ధగా చదువుకుంటున్న యువకుడు, చిరాకుగా మొహం చిట్లించుకున్నాడు.

మొక్కు పెట్టుకుని జుట్టూ గడ్డం విపరీతంగా పెంచేసి ఉన్న ఒక భక్తుడు అది చూసి ఉడుక్కున్నాడు. “ఇదిగో అబ్బాయా! ఈ బండి ఎందుకెక్కావు, ఇది భక్తుల బండని తెలీదా” అన్నాడు కోపంగా.

ఆ అబ్బాయికి కూడా కోపం వచ్చింది. “వెళ్ళాల్సింది తిరుపతి ఐనప్పుడు, ఈ బండి కాక ఏ బండి ఎక్కాలి? ఎంత భక్తి ఉంటే మాత్రం అంత గట్టిగా అరవాలా, ఆ అదురుకు రైలు పట్టాలు తప్పకుండా ఉన్నందుకు సంతోషించాలి” అన్నాడు కసిగా.

అక్కడున్న వాళ్ళలో ఒక పెద్దాయన టప టపా లెంపలేసుకున్నాడు. “అపచారం నాయనా, అపచారం! అలా ఎప్పటికీ జరగదు. స్వామి ఆపద్బాంధవుడు. నమ్మిన భక్తులను దగా చెయ్యడు. ఇక్కడున్న వారిని ఎవరినైనా అడుగు, స్వామి కృప వల్ల కొండల్లాంటి ఆపదలు మంచులా ఎలా విడిపోయాయో చెప్పి, నీ కళ్ళు తెరిపిస్తారు.”

“నా కళ్ళు తెరిచేఉన్నాయి. ఎవరూ తెరిపించవలసిన పనిలేదు. మీరే తెలుసుకోవాలి. ఏ పనైనా జరగడం జరక్కపోవడం అన్నవి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సుతో ఉంటాయి. మీరంతా మొక్కులు చెల్లించుకోడానికి బయలుదేరారంటే, మీ కోరికలు తీరాయనే కదా అర్ధం! తక్కిన సగం మందీ కోర్కెలు తీరక నిరాశతో ఇళ్ళల్లోనే ఉండిపోయి ఉంటారు. అలాంటి కుటుంబాల్లో మాదీ ఒకటి. మా అమ్మ పెట్టుకున్న ఏమొక్కూ కూడా మా నాన్నని కేన్సర్ బారినుండి రక్షించలేకపోయింది. అందుకే నాకు ఈ మొక్కులన్నా మొలతాళ్ళన్నా నమ్మకం పోయింది”.

“తప్పు బాబూ! అలా మాట్లాడకూడదు. ఒక్కొక్కప్పుడు మన కర్మానుభవం ఎక్కువ పట్టుతో ఉండి, దైవకృపకు అడ్డం నిలుస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా, చేసిన పాపాలు ఊరికే పోవు. జన్మ జన్మలా కట్టి కుడుపకుండా వదలవు. అందుకే, ఏ కష్టం వచ్చినా, మనవాళ్ళు ‘ఇది ఏనాడు చేసుకున్న పాప ఫలమో’ అంటారు! సరిగా అర్ధం చేసుకో బాబూ” అంది ఆ కంపార్టుమెంట్‌లో ఉన్న ఒక ఇల్లాలు అతని మాటలకు రవంత బాధపడిపోతూ.

“బాగానే ఉంది మీరు చెప్పేది వినడానికి. ఇలాగే పరస్పర విరుద్ధంగా ఏవేవో చెప్పి చివరకు మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామేమో ఆలోచించండి. మనల్ని సృష్టించింది దేవుడు కాదు, మనమే దేవుణ్ణి సృష్టించాం అనిపిస్తుంది. తనకున్న మంచిచెడ్డలన్నీ ఆయనకీ ఆపాదించి, ఒక రూపాన్ని కల్పించి, కథలల్లి ప్రచారం చేస్తున్నాడు మనిషి. మనం దేవునికే ఉపచారాలంటూ చంచాగిరీ చేస్తూ, ముడుపులు పేరుతో లంచమిచ్చి పనులు చేయించుకోవాలని చూస్తున్నామంటే, ఇక మన దేశంలో కరప్షన్ మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లక ఏమౌతుందిట” ఆమెకు వెంటనే జవాబు చెప్పాడు ఆ అబ్బాయి ఉద్వేగంతో.

ఆ కంపార్టుమెంట్‌లో హాహాకారాలు చెలరేగాయి . అందరూ తలోమాటా మాట్లాడసాగారు. కొందరికి చాలా కోపం వచ్చి అతని వైపు కొర కొరా చూశారు. ఇంకా మాట్లాడితే, ఇక తన ఆబోరు దక్కదు అనిపించిందేమో, వెంటనే లేచి పై బెర్తు మీదికి ఎక్కి గొణుక్కుంటూ వెనక్కి తిరిగి పడుకున్నాడు ఆ కుర్రాడు. ఒక్కసారిగా భక్తులందరూ విజయోత్సాహంతో గొంతెత్తి గట్టిగా ‘గోవింద’ కొట్టారు. చాలా సేపటివరకు ఆ గోవిందుల కలకలం అలా సాగుతూనే ఉంది.

రాత్రంతా ప్రయాణం చేసి, తెల్లవారేసరికి గూడూరులో ఆగింది రైలు. మళ్ళీ బయలుదేరబోతుండగా, అప్పుడే ఫ్లాట్ఫారం మీదకి వచ్చిన ఒక కుటుంబం, కదుల్తున్న రైలు బండిని అందుకుని పెట్టెలో ఎక్కబోయారు. ఆడమనిషి ఒక చేత్తో పెట్టె మరొక చేత్తో ఒక కర్ర పట్టుకుంది. వాళ్ళ కొడుకు కాబోలు, ఆమె భర్త పదేళ్ళ కుర్రాడిని చంకనెత్తుకుని ఉన్నాడు. మొత్తానికి ఎలాగైతేనేం వాళ్ళు పెట్టెలో ఉన్న ప్రయాణీకుల సాయంతో లోపలకు రాగలిగారు. ఆమె పెట్టె దించి ఉస్సురని నిట్టూర్చింది. అతడు పిల్లాడిని కిందకు దించగానే వాళ్ళ అమ్మ కర్ర అందించింది. ఆ కర్ర ఆసరాతో నిలబడ్డాడు ఆ పిల్లాడు. రైలుపెట్టె తిరుపతి ప్రయాణీకులతో కిట కిటలాడుతోంది, ఎక్కడా కూర్చునే చోటు లేదు. ఒక పుణ్యాత్ముడు లేచి ఆ అబ్బాయికి చోటిచ్చాడు.

దగ్గరలోనే కూర్చుని ఉన్న జానకి ఆమెను, “మీరూ తిరుపతేనా? మొక్కుందా” అని పలకరించింది. ఆమె ఏమీ మాట్లాడకుండా భర్త వైపు చూసింది.

“లేదమ్మా! మా కష్టాలు మొక్కులతో తీరేవి కాదమ్మా. మాకు వీడొక్కడే బిడ్డ. మా అదృష్టం బాగోక వీడికి పోలియో వచ్చింది. కాలు ఔడు, నాలా కాయకష్టం చేసి బ్రతకలేడు, చదువు చెప్పిస్తే ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాడనే ఆశతో బడిలో వేశా. డబ్బు బోలెడు కట్టాల్సి ఉంది. మా నాయన సాయం చేస్తాడేమో అడగడం కోసం మా ఊరు వెడుతున్నాం. తిరపతిలో దిగి బస్సుమీద వెళ్ళాలి” అన్నాడతను.

అతని మాటలు అక్కడున్న వాళ్ళ మనసుల్ని కదిలించాయి. పెదవి విరుస్తూ అందరూ తలలడ్డంగా వూపారు. లాభసాటి వ్యాపారంగా మారిపోయిన విద్యారంగాన్ని దుయ్యబట్టి, భావిభారత పౌరుల్ని తీర్చి దిద్దవలసిన విద్యాలయాలకు పట్టిన దుర్గతిని గురించి, పట్టని ప్రభుత్వం గురించి తలోమాటగా వాపోయారు. ఈ చర్చతో కాలం తెలియకుండా గడిచిపోయింది. రైలు తిరుపతిని సమీపించింది. తిరుమల దర్శనం కాగానే భక్తులు ఇంకోసారి “గోవిందా! గోవింద!” అంటూ దైవ నామ స్మరణ చేసి నెమ్మదిగా దిగే సన్నాహంలో సామాను సద్దుకోడం మొదలుపెట్టారు.

ప్రయాణం ఒక కొలిక్కి వచ్చినందుకు ‘అమ్మయ్య’ అనుకున్నారు జానకీ సీతాపతులు. జనం లేచి గుమ్మం దగ్గరకి చేరుకోడం మొదలుపెట్టారు. కిటికీ పక్క సీట్లు ఖాళీ కాగానే అక్కడ చేరిపోయారు పిల్లలు. సీతాపతి బెర్తు కిందనున్న పెట్టెలు బయటికి లాగాడు. జానకి సామాను లెక్క పెట్టింది. ఒకటి తక్కువ కావడంతో మళ్ళీ మళ్ళీ లెక్కేసింది.

“ఏమండీ మొక్కుబళ్ళు ఉంచిన పెట్టె ఏదండీ” అని అరిచింది, ఆర్తనాదం లాంటి కంఠస్వరంతో.

సీతాపతి కంగారుగా పైనాకిందా వెతికాడు. కాని అది ఎక్కడా కనిపించలేదు. నిర్ఘాంతపోయారు ఇద్దరూ. భయం భయంగా చూశాడు భార్య వైపు సీతాపతి.

“దాన్ని ఆ మూలకంతా పెట్టా కదే! ఏమైపోయిందే” అని బుర్ర గోక్కున్నాడు.

“బాగానే ఉంది వరస! నన్నడుగుతారేమిటి? నా కెల్లా తెలుస్తుంది” అంటూ ఎదురడిగింది జానకి.

బిక్కమొహం పెట్టాడు సీతాపతి. రైలు దిగే జనం, కంగారుపడుతున్న ఆ దంపతులవైపు ఒక్కక్షణం సానుభూతితో చూసి తమ దారిన తాము వెళ్ళిపోసాగారు. సీతాపతి పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు.

“ఏమండీ, పోనీ పోలీసులకు రిపోర్టు ఇద్దామా?”

“పోలీసులకా? అలా చేస్తే వాళ్ళు కేసు, గీసు అంటూ మనల్ని ఇక్కడే కట్టి పడేయ్యగలరు. అంతేకాదు, “ఆ పెట్టెలో ఏమున్నాయి” అని అడుగుతారు. కరెక్టుగా చెప్పాలి మనం. పిసరంత తేడా కూడా రాకూడదు, ఏమనుకుంటున్నావో!” సీతాపతి కంగారుపడ్డాడు.

“అమ్మో! అవన్నీ మనo ఇప్పి చూస్తే కదా చెప్పేందుకు! ఇచ్చినవి ఇచ్చినట్లుగా పొట్లాలు కట్టి పెట్టేశాం, ఇప్పుడెల్లాగ?”

“అదే నాకూ తెలియడం లేదు. పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందిట… అలాగుంది మన పని”

“అయ్యో, అలా దిగులు పడకండీ. నేను చెప్పేదొకసారన్నా విని అర్ధం చేసుకోండి. దేవుడి సొమ్మది, ఆయనే దాన్ని తీసుకెళ్ళిపోయాడనుకుని నోరు మూసుకుందాం” అంది జానకి తుని తగవుగా.

“నేను కాంపుకి పట్టుకెళ్ళే వి.ఐ.పి. సూట్కేసు కదే పోయింది! చూస్తే, పోయీ భూతం చెట్టు కొమ్మనుకూడా పట్టుకుపోయింది అన్నట్లుగా ఉంది, అయ్యో!” అన్నాడు సీతాపతి ఇంకా దిగులుగానే .