ఈమాట » కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి?

Expand to right
Expand to left

కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి?

నిజానికి కవిత్వ వివేచనలో ఈ లాంఛనాలకి ఏ ఉపయోగమూ లేదు, ఉండకూడదు. అందుచేత, ఒక కవి రచనకీ అంతకు పూర్వం వున్న కవిత్వానికీ ఏర్పడే సంబంధం ఎలాంటిది - కొత్తగా రాయబడిన రచనకి అంతకు ముందున్న రచనల నేపథ్యం ఏ పద్ధతిలో ఏర్పడుతుంది - అందువల్ల ఇటు కొత్త రచనా, అటు పాత రచనా కూడా ఎలాంటి మార్పులకు లోనవుతాయి, అన్న అంశాలు పరిశీలించవలసి వుంది. ఈ రకం పరిశీలన ద్వారా ‘ప్రభావం’, ‘అనుకరణ’ లాంటి మాటలకి కవితా వివేచనలో ఎలాంటి ఉపయోగం వుందో పరిశీలించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.

ఈ పనిలో భాగంగా రెండు వచన పద్యాలు వివరంగా పరిశీలిస్తాను. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ 1963లో రాసిన ‘ప్రార్థన‘. తెలుగులో చాలా మంచి పద్యాల్లో ఇది ఒకటని అందరూ ఒప్పుకుంటారు. దరిమిలా, 1981లో ప్రచురించబడిన రేవతీదేవి శిలాలోలిత అనే పుస్తకంలో ‘దేవుడూ‘ అనే పద్యం ఆ పుస్తకం చదివిన వారందరి దృష్టినీ ఆకట్టుకుంటుంది. ఇది కూడా తెలుగులో మంచి కవిత్వం అని చదివిన వారందరూ ఒప్పుకుంటారు.

ప్రార్థన

దేవుడా!
రక్షించు నా దేశాన్ని
పవిత్రులనుండి పతివ్రతలనుండి
పెద్దమనుషులనుండి పెద్దపులులనుండి
నీతుల రెండు నాల్కలు సాచి బుసలు కొట్టే
నిర్హేతుక కృపా సర్పాలనుండి
లక్షలాది దేవుళ్ళనుండి వారి పూజారులనుండి
వారివారి ప్రతినిధులనుండి
సిద్ధాంత కేసరులనుండి సిద్ధులనుండి
శ్రీ మన్మద్గురు పరంపరనుండి

దేవుడా!
నలభై కోట్ల నిజమైన ప్రాణం వున్న
మనుష్యులతో నిండిన దేశం నాది
ఆకలీ బాధలూ ఆందోళనలూ సమస్యలూ
విరివిగా వున్న విచిత్రసౌధం మాది
కడుపు నిండుగా ఆహారం గుండె నిండుగా ఆశ్లేషం
బ్రతుకు పొడుగునా స్వాతంత్ర్యం
కొంచెం పుణ్యం కించిత్ పాపం
కాస్త కన్నీరూ మరికాస్త సంతోషపు తేనీరూ
చాలు మాకు తండ్రీ
సరదాగా నిజాయితీగా జాలి జాలిగా
హాయి హాయిగా బ్రతుకుతాం
మాకు నటనలు వద్దు మా చుట్టూ కటకటాలు వద్దు
గొప్పలూ గోసాయి చిట్కాలు వద్దు

దేవుడా!
కత్తివాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా
ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు
మానవ చరిత్ర పుటలలో నెత్తురొలికి
మాసిపోయిన అక్షరాలని వివరించు
రహస్య సృష్టి సానువులనుండి జారిపడే
కాంతి జలపాతాన్ని చూపించు
మమ్మల్ని కనికరించు
చావుపుట్టుకల మధ్య సందేహం లాంటి
జీవితంలో నలువైపులా అంధకారం
మంచి గంధం లాగ పరిమళించే మానవత్వం
మాకున్న ఒకే ఒక అలంకారం
మజిలీ మజిలీకి అలిసిపోతున్నాం
మలుపు మలుపుకీ రాలిపోతున్నాం
ఆశల వెచ్చని పాన్పుమీద స్వప్నాల పుష్పాలు జల్లుకుని
ఆదమరచి కాసేపు విశ్రమించడాని కనుమతించు తండ్రీ!

-దేవరకొండ బాలగంగాధర తిలక్, అమృతం కురిసిన రాత్రి సంకలనం (1968) నుంచి.

ఈ రెండు పద్యాలూ ఒకదానితో ఒకటి చాలా పోలికున్న పద్యాలు. రేవతీదేవి రాసిన పద్యం తిలక్ రచన కన్నా తరవాత ప్రచురించబడింది కాబట్టీ, తిలక్ రచన రేవతీదేవి చదవకుండా వుండడం అసంభవం కాబట్టీ, రేవతీదేవి మీద తిలక్ ‘ప్రభావం’ వుందనాలి.

దేవుడూ

దేవుడూ
నన్ను రక్షించు
నీ భక్తుల్నుంచి
నన్ను రక్షించు

దేవుడూ
నన్ను రక్షించు
గాంధీ భక్తుల్నుంచి
మార్క్స్ భక్తుల్నుంచి
ఫ్రాయిడ్ భక్తుల్నుంచి
సార్త్ర భక్తుల్నుంచి
బాబాల భక్తుల్నుంచి
సైన్సు భక్తుల్నుంచి
విశ్వనాథ భక్తుల్నుంచి
శ్రీశ్రీ భక్తుల్నుంచి
చలం భక్తుల్నుంచి
నన్ను రక్షించు

దేవుడూ
నన్ను రక్షించు
నానారకాల భక్తకోటి నుంచి
నన్ను రక్షించు
ఇందర్నుంచి రక్షించినందుకు
నేన్నీ భక్తిలో పడితే
ఒద్దు దేవుడూ
నువ్వు నన్ను రక్షించొద్దు
నన్ను నేనే రక్షించుకుంటాను

అప్పుడు
నన్ను రక్షించు అని
నువ్వే నన్ను అడగాల్సొస్తుంది

(రేవతీదేవి, శిలాలోలిత సంకలనం (1981) నుంచి.

ఈ రెండు పద్యాలూ పరిశీలించి చూద్దాం. రేవతీదేవి పద్యం, తిలక్ పద్యం ఎరగని వాళ్ళు చదివినా మంచి పద్యమే అంటారు. తిలక్ పద్యం, రేవతీదేవి పద్యం రాకముందు కూడా ఎలాగూ మంచి పద్యమే కదా. కానీ, ఈ రెండు పద్యాలూ ఒకదాని ‘ప్రభావాన’ మరొకటి అంతకు ముందు కన్నా మంచి పద్యాలు అవుతాయి. ఒక దాని అర్థప్రదేశం మరొకదాని అర్థప్రదేశం వల్ల సంపన్నతరం అవుతుంది. ఈ రెండింటిలో ఏ పద్యం లేకపోయినా రెండో పద్యం అర్థం కాస్త సన్నగిలుతుంది.

బహిరంగ కవిత్వం, అంతరంగ కవిత్వం అని కవిత్వంలో ఒక విభాగం చెయ్యొచ్చు.. ఒక పద్యంలో వినిపించే గొంతును బట్టి ఈ విభాగం ఏర్పడుతుంది. శ్రీశ్రీ ‘మరో ప్రపంచం’ పద్యం బహిరంగ కవిత్వం. ఆయనదే ‘నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా’ పద్యం అంతరంగ కవిత్వం. బహిరంగ కవిత్వం ఒక్కరూ ఏకాంతంలో చదివితే అది ఆ మర్నాడు ఇవ్వబోయే ఉపన్యాసానికి తర్ఫీదు యత్నంలాగా ఎబ్బెట్టుగా వినిపిస్తుంది. అంతరంగ కవిత్వం చాలా మంది ముందు బిగ్గరగా చదివితే నడి బజారులో ప్రేమిస్తున్నట్టు చిరాకుగా వుంటుంది. (అయితే, ఒక్క సభలో కూర్చున్న వందలాది మందిని కూడా, చదివే గొంతుక ద్వారా, విడదీసి వాళ్ళని వాళ్ళ వాళ్ళ మానసిక ఏకాంతాలలోకి పంపించి, పదిమంది కలిసి కూర్చున్నామనే స్పృహ లేకుండా చెయ్యడం సాధ్యం).

ఈ విభాగాల దృష్ట్యా చూస్తే, తిలక్ పద్యం బహిరంగ కవిత్వం, రేవతీదేవి పద్యం అంతరంగ కవిత్వం.

తిలక్ పద్యం గొంతుక పెద్దది. తిలక్ దేవుడు దూరంగా వున్నాడు. అందుకే ‘దేవుడా!’ అనడం. పద్యం కోరేది కూడా ‘రక్షించు నా దేశాన్ని’ అని. ‘నా’ అని ఏకవచనం వాడినా ఇది మన కర్థమయ్యేది ‘మా’ అనే. (నా దేశం అనే మాటలో ‘నా’, ఆంగ్ల సంప్రదాయపు ఫలితం. తెలుగులో, మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న మొదలైన మాటల్లోలా ఉమ్మడి ఆస్తులుగా పరిగణించబడే వాటికన్నిటికీ బహువచనం ‘మా’ వాడటమే అలవాటు. ఆ ఇంటికి తానొక్కడే యజమాని అయినా, ఆ తల్లికీ, తండ్రికీ తానొక్కడే కొడుకయినా సరే, ‘మా’ వాడటమే తెలుగు పద్ధతి. అయినా, కవితా సందర్భ బలం వల్ల ఈ పద్యంలో ‘నా’ ఎబ్బెట్టుగా వినిపించదు). పద్యంలో తరవాత వచ్చే మాటలన్నీ హేళనతో నిండినవీ, నిందల్లా వినిపించేవీ. గంభీరమైన నడకతో కూర్చినవి ఈ మాటలు:

“పవిత్రుల నుండి పతివ్రతల నుండి
పెద్దమనుషుల నుండి, పెద్ద పులుల నుండి
నీతుల రెండు నాల్కలు సాచి బుసలు కొట్టే
నిర్హేతుక కృపా సర్పాల నుండి
లక్షలాది దేవుళ్ళ నుండి, వారి పూజారుల నుండి
వారి వారి ప్రతినిధుల నుండి
సిద్ధాంత కేసరుల నుండి, సిద్ధుల నుండి
శ్రీ మన్మద్గురు పరంపర నుండి”

ఇందులో పైకి గౌరవంగా వినిపించే మాటలన్నీ పరమ హేళనగా వుండే మాటలు. వీటిలో కనిపించే హుందా అంతా కపటపు హుందా. నిజంగా వుండే అర్థం, ఇక్కడ వేళాకోళంగా వుండే సందర్భానికి వెనకాతల వుంది. పూర్వం ఈ మాటలు గౌరవంగా వాడబడినవి. అవి అలా వాడబడబట్టే ఇక్కడ ఈ మాటలకి హేళనార్థం రావడానికి వీలయ్యింది. ఆ గౌరవ నేపథ్యం ఈ హేళనార్థానికి అస్తిత్వం కల్పించింది.

రేవతీదేవి పద్యంలో దేవుడు పక్కనే వున్నాడు. అందుకనే ‘దేవుడూ’ అని పిలవటం. ఈ పద్యపు గొంతుక చిన్నది. ‘నీ భక్తుల్నించి రక్షించు’ అని ఒక మనిషి కోరిక లాంటి చిన్న కోరిక. ఈ మాటకి తిలక్ పద్యంలో వున్నంతగా హేళనార్థం వుండక్కరలేదు. ఇందులో ‘భక్తులు’ అనే మాటలో హేళనార్థం వుందా అంటే లేదు, లేదా అంటే వుంది. పూర్వం ‘భక్తులు’ అనే మాటకి వున్న గౌరవార్థం సాగి అందులో ఈ హేళనార్థం చోటు చేసుకుంటుంది. తిలక్ పద్యంలో ఆ పెద్ద మాటలకి పూర్వం వున్న హుందాను దూరంగా నెట్టేసి ఆ స్థానంలో హేళనార్థం వచ్చి కూర్చుంటుంది.

“దేవుడూ
నన్ను రక్షించు
నీ భక్తుల్నించి
నన్ను రక్షించు”

అన్న మాటల్లో దేవుడితో చనువూ, దగ్గిరతనమూ తిలక్ పద్యంలో దేవుడి దూరం వల్లా, గౌరవం వల్లా మరింత పదును దేలతాయి. (తిలక్ పద్యంలో “పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి” అని పుస్తకాల భాషలో వుండే ‘నుండి’, రేవతీదేవి పద్యంలో మనం మాట్లాడుకునే ‘నుంచి’ గా మారిపోతుంది). ఈ మాటల్లో వుండేది మామూలుతనం, తిలక్ మాటల్లో వుండేది గాంభీర్యం. ఈ మామూలుతనం ఆ గాంభీర్యపు నేపథ్యంలో పద్యత్వాన్ని పొందుతుంది. తిలక్ పద్యపు పెద్ద గొంతుక ఆవరణలో రేవతీదేవి పద్యపు మామూలు గొంతుక కవిత్వం అవుతుంది. ఇంకో మాటల్లో చెప్పాలంటే తిలక్ పద్యపు అర్థప్రదేశం రేవతీదేవి పద్యానికి ఒక అర్థప్రదేశాన్ని కల్పిస్తుంది.

దగ్గరగా వున్న దేవుడితో సమానంగా మాట్లాడే మనిషి దేవుణ్ణి దాదాపు తనతో సమానంగా చూస్తాడు (లేదా చూస్తుంది). అందుకే రేవతీదేవి పద్యం చివర:

“ఇందర్నుంచి రక్షించినందుకు
నేన్నీ భక్తిలో పడితే
ఒద్దూ దేవుడూ
నన్ను నువ్వు రక్షించొద్దు
నన్ను నేనే రక్షించుకుంటాను”

అని చెప్పి, గొంతు మార్చి, ఇంకా చిన్న గొంతుకతో,

“అప్పుడు
నన్ను రక్షించు అని
నువ్వే నన్ను అడగాల్సొస్తుంది”

అంటుంది. అంటే, దేవుడి స్థానంలో మనిషి, మనిషి స్థానంలో దేవుడూ వుంటారన్న మాట. రేవతీదేవి పద్యంలో ఇంత దగ్గర తనానికీ, దేవుడూ మనిషీ ఒకరి ఇబ్బందులు మరొకరు పొందడానికీ బలం ఇచ్చేది తిలక్ పద్యంలో దేవుడికీ మనిషికీ నిత్యసత్యంగా వుండే దూరమే. ఆ దూరమే లేకపోతే తిలక్ పద్యం లేదు. ఆ పద్యంలో దేవుడు ఎప్పుడూ దేవుడే. మనుషులు ఎప్పుడూ మనుషులే. ఆ దేవుడు సర్వశక్తి మంతుడూ, పరమ దయాళువూ అయిన తండ్రి. రేవతీదేవి దేవుడు మనిషికి దగ్గరగా వున్న, మనిషికున్న ఇబ్బందులే పడగల స్నేహితుడు.

ఇకపోతే, రేవతీదేవి పద్యం వచ్చాక తిలక్ పద్యం కూడా మారుతుంది. దాని అర్థప్రదేశం అంతకు ముందు అందులోని పదాలకున్న గౌరవ గాంభీర్యాల నేపథ్యంలో ఏర్పడిందని ఇంతకు ముందు చూశాం. తిలక్ పద్యం బహిరంగ కవిత్వంలోకి చేరుతుందని కూడా గమనించాం.

రేవతీదేవి పద్యం వచ్చి, తిలక్ పద్యంలో బహిరంగ కవిత్వపు వైశాల్యాన్ని ఏమీ మార్చకుండా, దానిలో ఒక విలక్షణమైన అంతరంగ కవిత్వపు ఛాయని అదనంగా చేరుస్తుంది. తిలక్ పద్యం జనులందరి ఉమ్మడి ప్రార్థనగా వుంటునే, ఒక్కడి ప్రార్థనగా మారుతుంది. ఇంతకు ముందు ‘మా’గా బహువచనపు ప్రజా సమూహపు గొంతుతో వినిపించే పద్యం, ‘నా’ అనే అర్థాన్ని కూడా ఇముడ్చుకొని, చదివే వారి ఒక్క గొంతుకలా కూడా భాసిస్తుంది.

తిలక్ పద్యం ఒకవేళ లేదనుకోండి. లేదా పాఠకుడు ఆ పద్యాన్ని చదవలేదనుకోండి. రేవతీదేవి పద్యం అప్పుడు కూడా కవిత్వమే, సందేహం లేదు. అయితే అప్పుడు అది కవిత్వం అవడానికి తెలుగు భాషలో వున్న ఇతర పద్యాల అర్థప్రదేశాలు నేపథ్యాన్ని కల్పిస్తాయి. అపుడు ఆ పద్యపు అర్థం, తిలక్ పద్యం చదివిన పాఠకుడికి అనుభవమయే రూపంలో వుండదు. ఇంకోరకంగా వుంటుంది.

మొదటి దాని ప్రభావం రెండో దాని మీద వుందని మనం చెప్పుకునే రెండు పద్యాలు - రెండూ మంచి పద్యాలే అయినప్పుడు - ఒకదానికొకటి ప్రవర్ధకాలు అవుతాయి. మరీ ముఖ్యంగా, అప్పటికే రాసేయబడిన పద్యం, ఆ తరవాత రాయబడిన పద్యం వల్ల పెరగడం గుర్తించవలసిన విషయం. అలాగే, తరవాత రాయబడిన పద్యం, ఆ పూర్వ పద్యపు నేపథ్యంలో, అది లేకుండా వుంటే దానికి వుండాని ఒక కొత్త అర్థప్రదేశానికి ఆకృతి కల్పించుకోవడం కూడా గుర్తించవలసిన విషయం.

‘ప్రభావం’ అంటే కవిత్వానికి సంబంధించినంత వరకూ ఉపయోగపడే అర్థం ఇది. ఈ క్లిష్టతని గమనించని అర్థంలో వాడే ‘ప్రభావం’ అనే మాట, దానికి తోబుట్టువులైన ‘అనుసరణ’, ‘అనుకరణ’, ‘కాపీ’ ఇత్యాదులతో సహా, మంచి సాహిత్య విమర్శలో వాడవల్సిన ఊహలు కావు.

ముందరి పేజీ(లు) 1 2

రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌ లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నారు. పాతికేళ్ళపైగా అక్కడే ఉన్నారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాసారు. ...

 

(6 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. బొల్లోజు బాబా అభిప్రాయం:

    July 3, 2009 6:27 am

    ఈ వ్యాసంద్వారా కవిత్వాన్ని బహిరంగ, అంతరంగ కవిత్వాలు అని రెండు రకాలుగా విభజించవచ్చని తెలుసుకొన్నాను.
    కవిత్వంలోని టోన్ సన్నగా, బిగ్గరగా ఎలా ఉంటుందో చక్కటి ఉదాహరణనిచ్చారు.
    ధన్యవాదములు.
    బొల్లోజుబాబా

  2. M.S.Prasad అభిప్రాయం:

    July 3, 2009 11:13 pm

    ప్రభావం, అనుసరణ, అనుకరణ అనేవి ఏ మాత్రం తప్పు కాదు. మీ ఈ అభిప్రాయం సరైనదని నేను భావిస్తున్నాను. కవిత్వమే కాదు ఏ శాస్త్ర పురోగతి కైనా ఇవి అత్యంత ఆవశ్యకాలు. ముందు తరాల వారి విజయ రహస్యాలను ఆకళించుకొంటూ, వారి విజ్ఞానాన్ని మనది చేసుకొని దానిని మన తెలివితేటలతో ఇంకొంచెం ఉద్దీపనం చేయడమే పురోగమనం. మీ రిచ్చిన ఉదాహరణలోని రేవతీ దేవి గారు తిలక్ మహాశయుని కవితను చదివిన తరువాతనే తమ కవితను వ్రాసారనుకోండి. అప్పుడు ఆమె తన దైన శైలిలో దానిలోని భావ ప్రకటనా విధానాన్ని ఇంకా మెరుగు పరచారేమో ఆలోచించండి. మెరుగు కాదని కొందరనుకున్నా ఆమెకూ ఆమె లాంటి మరికొంతమందికి అది మెరుగైనదే అని అనిపించవచ్చుగా. అప్పుడు ఆమె తిలక్ మహాశయునితో సమానమైన లేదా మెరుగైన కవయిత్రి అని ఒప్పుకోవలసి వుంటుంది. కాలమొక్కటే ఇటువంటి సందిగ్ధతలను నివారిస్తుంది.

    భవదీయుడు

  3. lyla yerneni అభిప్రాయం:

    July 8, 2009 9:46 pm

    ముఖ్య సంపాదకులకు:

    ఈ వ్యాసము సంజీవిని. ప్రచురించిన మీకు నమస్సులు.

    This is a rerun I believe, but it is a new one for me. This essay stole my heart .
    Narayana Rao takes couple of well liked Telugu poems as examples and explains the phenomenon of ‘ intertextuality ‘ in Poetry/Literature in a calm, composed, unhurried prose. This Telugu essay teaches. It clarifies. There is control, and coherence. The essayist really explains, what he sets out to explain. And in that fulfilment of his promise - the evenness of his tone, the lack of anxiety to dominate or be dominated, this essayist becomes very attractive and exciting.

    ఈ వ్యాసం నేను చాలా సార్లు చదవాలి. ఇంగ్లీషులో నా దగ్గరున్న లిటెరరీ థియరీ పుస్తకాలు మళ్ళీ చదివి, ఈ విషయమ్మీద ప్రశ్నలుంటే అప్పుడు అడుగుతాను.

    లైలా

  4. Srinivas Nagulapalli అభిప్రాయం:

    July 9, 2009 12:24 pm

    మంచి వ్యాసం, ఏన్నో విషయాలను తెలియజేసారు.

    ఒక్క మాట, వ్యాసం ఉద్దేశానికి సంబంధించింది కాబట్టి ప్రస్తావించడం.

    “ఒక కవి పెద్ద కవో, చిన్న కవో నిర్ణయించడానికి సాహిత్య విమర్శ పరిభాషలో ఏర్పడిన లాంఛనాల కోవలోకే వస్తాయి- స్వతంత్ర రచన, ప్రభావం, అనుకరణ, అనువాదం, కాపీ, ఫోర్జరీ- ఇలాంటి మాటలన్నీ” అని అన్నారు. విమర్శలు కవిత గొప్పదో చిన్నదో అనే కాని, రాసింది పెద్ద కవో, చిన్న కవో అని కాదనుకుంటాను. అవార్డులు, పురస్కారాలు ఫలానా కవితకు, కథకు, నవలకు ఇస్తున్నామనే చెప్పుకుంటాం, ప్రకటించుకుంటాం కదా, వ్యక్తికి ఇచ్చినప్పటికినీ.

    “‘ప్రభావం’ అంటే కవిత్వానికి సంబంధించినంత వరకూ ఉపయోగపడే అర్థం” అన్నది కవిత్వానికే కాక జీవితానికి కూడా వర్తించే మంచి మాట.
    ===========
    విధేయుడు
    -Srinivas

  5. Sowmya అభిప్రాయం:

    July 16, 2009 2:54 am

    వ్యాసం ఇంకా పూర్తిగా చదవలేదు కానీ, ఇక్కడ్ “ప్రార్థన”, “దేవుడు” కవితలకి లింకులు లేవు. అంటే, అవి మళ్ళీ ఆ పేజీకే వస్తున్నాయి. దేవుడు కవిత ఉన్నా ప్రార్థన ఈమాటలో ఉందో లేదో నాకు తెలీదు :)

    [కవితలకి లింకులు వేరే పేజీకి తీసికెళ్ళవు. కవితలు రెండూ హైస్లయిడ్ పాప్ అప్ విండోలలో తెరుచుకుంటాయి వ్యాసం ఉన్న పేజీలోనే. ఫైర్‌ఫాక్స్ లోనూ ఐ.ఈ. లోనూ ప్రయత్నించాము. లింకులు సరిగ్గానే పని చేస్తున్నాయి. మీరు ఇప్పడికీ చూడలేకపోతే మాకు తెలియజేయండి - సం. ]

  6. ఉష అభిప్రాయం:

    August 21, 2009 1:55 am

    బాబా గారి మాటే నాదీను. సంతోషంగా వుంది యధాలాపంగా ఇటు వచ్చి ఈ శీర్షిక చదవగలిగినందుకు. నా కవితనిక్కడ ప్రస్తావించటం దుస్సాహసమేమో తెలియదు కానీ మీరు చర్చించిన ఆ రెండు కవితలు చదవక మునుపే అసలు వాటి వునికినెరుగక మునుపే నేను వ్రాసుకున్న కవిత “దేవా! కానుకగా నా మరుజన్మ నీకిచ్చేస్తా,” http://maruvam.blogspot.com/2009/06/blog-post_23.html

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a