పునరపి

ఆఫీసు నుంచి వస్తూ, ముందర ఇండియన్ గ్రోసరీస్ లో కూరగాయలు కొంది. తర్వాత డే కేర్ నుంచి బాబును పికప్ చేసుకుంది, లేకపోతే వాడితో కలిసి షాపింగ్ కష్టమైతుంది అని. స్కూలు విశేషాలు మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు. బాబుకు తినడానికి స్నాకిచ్చి, టీవీ ఆన్ చేసి, బాబుని దానిముందు కూర్చోబెట్టింది. ఇంటికి రాగానే స్నాక్ తింటూ బార్నీ చూడటం బాబుకి ఇష్టం. తన పనీ సులువౌతుంది. తను టీ పెట్టుకుని త్రాగింది. సింక్‌లో గిన్నెల్ని డిష్ వాషర్లో సర్దింది. ఆ పూటకు వండాలనుకున్న కూరలు కట్ చేసింది. పొద్దుటిక్కూడా కూరలు తరిగి, జిప్‌లాక్ బ్యాగుల్లో పెట్టి ఫ్రిజ్‌లో పడేసింది. బాబు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చెప్పే ముచ్చట్లని వింటూ, ప్రశ్నలకి సమాధానాలిస్తూ, వంట చేయడం మొదలు పెట్టింది.

లత జీవితం సాయంత్రం రొటీన్ లో పడింది.

రాఘవ ఫోన్ చేసి, అరగంటలో ఇంటికొస్తున్నానని చెప్పాడు. గబగబా జ్యూసర్లో ఫ్రూట్స్ కట్ చేసి వేసి ఆన్ చేసింది. సాధారణంగా సాయంకాలం ఇంటికి రాగానే రాఘవ జ్యూస్ తాగుతాడు. హాల్లో పడున్న పిల్లవాడి ఆట బొమ్మలను బాస్కెట్లోకి సర్దింది. చపాతీలకు పిండి రెడీ చేసింది.

ఇంతలో రాఘవ వచ్చేసాడు.

రాఘవ ఆఫీసునుంచీ వస్తూ వస్తూ జిమ్ కి వెళ్ళొస్తాడు. తను ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత నిస్తాడు. వేళకు తినడం, నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం. ఇద్దరికీ ‘హాయ్’ చెప్పి, “లతా, కాస్త టీ పెట్టు” అన్నాడు. జిం బేగ్ ప్రక్కన పెట్టి, షూస్ విప్పుకుంటూ బాబును ఆ రోజు స్కూలు విశేషాలు అడిగాడు.

మౌనంగా జ్యూసర్ ఆపేసి, టీ పెట్టింది.

పెళ్ళైన కొత్తల్లో ఒకసారి, ఇలాగే… రాత్రి పూట చపాతీ తింటాడని, అన్నం వండలేదు. ఆ వేళ ఎందుకో, చపాతీ వద్దు అన్నం తింటానన్నాడు. ఎలాగూ చపాతీ రెడీ చేశాను కదా, ఈ ఒక్కపూట అడ్జస్ట్ కమ్మని అడిగినప్పుడు జరిగిన రభస లతకు ఇంకా జ్ఞాపకమే. పది రోజులు ఇంట్లో అపరిచితుడిగా తిరిగాడు. పిలిస్తే పలకడు. మరో మనిషి ఇంట్లో ఉందన్న ధ్యాస లేకుండా తన పనులు తాను చేసుకుంటూ గడిపేవాడు. అప్పట్లో లత కూడా కాస్త మొండిగానే ఉండేది. కొత్తకదా! పదిరోజులకు లతకు పరిస్థితి కొంత వరకు అర్థమైంది. తనే ఒక మెట్టు దిగి రాజీ కొచ్చింది.

అప్పట్నుంచీ, ఎన్నోసార్లు, ఎన్నో విషయాల్లో ఇద్దరి మధ్యా గొడవలు జరిగేవి.

చిన్న చిన్న పనికిరాని విషయాల గురించిన పంతాలే చినికి చినికి గాలి వానలయ్యేవి. రోజుల తరబడి మాటల్లేకుండా ఉండిపోయేవారు. కాపురమన్నాక గొడవలు సహజం. ఎవరో ఒకరు సర్దుకోకపోతే సహజీవనం కష్టం. కాకపోతే ఇక్కడ ప్రతిసారి లతనే రాజీకి రావాల్సివచ్చేది. ఎందుకలా తనే ప్రతిసారి తల ఒగ్గాల్సి వస్తోందని లత చాలా సార్లు ఆలోచించింది. మంచి చదువుంది. ఉద్యోగం ఉంది. దాదాపు భర్త సంపాదించినంత తనూ సంపాదిస్తోంది. అయినా ఎందుకీ చెప్పు క్రింద తేలు బ్రతుకు అని చాలా సార్లు అనుకుంది. ఒంటరి బతుకు బతకలేనేమోనన్న భయమో, లేక బంధాలు అంత తొందరగా తెగవన్న వెరుపో. మొత్తానికి భర్తను అంటిపెట్టుకునే ఉంటోందిప్పటి వరకు.

రాఘవ టీ తాగి స్నానానికి వెళ్ళాడు. తను వచ్చేసరికి చపాతీలు కాల్చడం మొదలు పెట్టింది. రాఘవ, బాబు తింటూంటే లత వేడి వేడిగా చపాతీలు చేసి అందించింది. వాళ్ళిద్దరూ తిన్నాక కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటారు. బాబుకు, రాఘవకు పాలు వేడి చేసి ఇచ్చి లత డిన్నర్ చేసింది. బాబు పాలు త్రాగాక పడుకోబెట్టి, స్టోరీ చదివి నిద్రపుచ్చి, మరో సారి కిచెన్ సర్దుకుని హాల్ లోకి వచ్చింది లత.

అప్పటికే రాఘవ్ సోఫాలో జారగిలబడి టీవీ లో వార్తలు చూస్తున్నాడు, “లతా… సినిమా లేమైనా తెచ్చావా?” అనడిగాడు.

“గ్రోసరీ షాప్ నుంచి ఒక డివిడి తెచ్చా… ఇక్కడే పెట్టానే… ఏమైందబ్బా” అంటూ లత టీవీ దగ్గర నిలబడి, డివిడి కోసం అటూ ఇటూ చూసింది.

“లతా! నువ్వలా నుంచుంటే టీవీ కనిపించడంలేదు… మనం ఇంకా పెద్ద టీవీ కొనాలేమో” పక పకా నవ్వాడు రాఘవ. గభాలున ప్రక్కకు తప్పుకుని, రాఘవ వైపు చూసింది లత.

“నాలాగా నువ్వూ జిమ్ము కెళ్ళొచ్చు కదా” అన్నాడు రాఘవ. లతకు ఏమనాలో అర్థం కాలేదు. అలాగే ప్రక్కనున్న సోఫాలోకి జారిపోయి కూర్చుంది.

మళ్ళీ రాఘవే, “నీ మంచి కోసమే కదా చెబుతుంది” అన్నాడు.

లత మారు పలకలేదు. ఒక్క సారిగా కోపం ఉవ్వెత్తున లేచింది. మొగుడితో మాట్లాడదామనుకుంది. పోట్లాడదామనుకుంది. కానీ… మరుక్షణంలోనే నిస్సత్తువ కమ్ముకుంది. కోపం, బాధ, నిస్సత్తువగా మారి మౌనంగా మిగిలిపోవడం కొత్త అలవాటు కాదు.

లత ఆలోచించింది. ఎప్పుడు వెళ్ళాలి తను జిమ్ కి? ఉదయం నుంచీ రాత్రి దాకా, గోడ మీద గడియారంలో ముల్లులా పరుగులు తీస్తూ… ఎప్పుడు వెళ్ళాలి? సెల్ ఫోన్లో అలారం మ్రోగింది… రేప్రొద్దున సమయానికి లేవాలంటే, వెంటనే నిద్రపోవాలి. నీరసంగా, కాళ్ళీడ్చుకుంటూ పడగ్గదిలోకి వెళ్ళింది.

మంచానికి ఒక అంచున అరుణ్… పొంగబోయే దుఃఖ సముద్రానికి చెలియలి కట్టలా!


రచయిత కె. వి. గిరిధరరావు గురించి:

కె. వి. గిరిధరరావు అమెరికాలో స్థిరపడిన ప్రముఖ తెలుగు కథకుడు, కవి. నేటితరం అమెరికా తెలుగువారి అనుభవాలు, దృక్పథాలను విశ్లేషిస్తూ రచనలు, వ్యాసాలు, కవిత్వం రాస్తుంటారు. డ్రైవింగ్‌ లెసన్‌, అసలేం చేశానని?!, ది ట్రాప్‌ (ఆడియో కథ) వంటి చక్కటి కథలు రచించారు. 2011లో తానా (TANA) సభల సావనీరుకు సంపాదకత్వం వహించారు. కథ 2016 సంపుటిలో ఆయన కథలు చోటు చేసుకున్నాయి. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి జీవనశైలిని తన రచనల్లో ప్రతిబింబిస్తారు.

 ...