కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 8: దిగ్భ్రమ కలిగించే గూడెల్ మేధోక్రీడ

ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ (IAS)

వంద సంవత్సరాల క్రితం, అమెరికాలో ఆధునిక వైద్యం పేరిట బూటకం సాగుతుండేది. కేవలం డబ్బు సంపాదించడం కోసం కుప్పలు తెప్పలుగా వైద్య కళాశాలలు నెలకొల్పారు. కార్నగీ ఫౌండేషన్ దేశంలోని వైద్యవిద్య బాగోగులని పరిశీలించమని అబ్రహం ఫ్లెక్స్‌నర్ అన్న విద్యావేత్తని కోరింది. ఆయన దేశంలోని నూటయాభయి పైగా ఉన్న వైద్య కళాశాలలని సందర్శించి, ఓ కటువైన నివేదిక(Flexner Report)సమర్పించాడు. వైద్య విధానాన్నీ, బోధనా పద్ధతుల్నీ క్షాళన చెయ్యవలసిన అవసరం ఉందంటూ తీవ్ర పదజాలంతో అప్పటి వైద్యవిద్యని విమర్శించాడు. వైద్యం శాస్త్రీయ పద్ధతులలో నేర్పాలనీ, జబ్బుల గురించీ, రోగుల గురించీ, వైద్యం గురించీ శాస్త్రీయమైన పరిశోధన జరగాలనీ, వైద్యులు కాదలచుకున్న వాళ్ళు కనీసం ఆరేళ్ళ పాటు కాలేజీ విద్య నభ్యసించాలనీ, వైద్య విద్యా ప్రమాణాలు ఎలా పెంచాలో వివరంగా చర్చించాడు. ఆ నివేదిక మూలంగా అనతి కాలంలో దాదాపు అన్ని వైద్య కళాశాలలూ మూసివేశారు. నూతన వైద్య విద్యా విధానాలతో కొత్త కళాశాలలని స్థాపించారు. ఇప్పుటికీ ఫ్లెక్స్‌నర్ ప్రవేశపెట్టిన విధానాల ననుసరించే అమెరికాలో వైద్య విద్యాబోధన చేస్తారు. ఆధునిక వైద్యంలో ప్రపంచంలోకెల్లా అమెరికా అగ్రస్థానంలో ఉండటానికి ముఖ్య కారణం ఫ్లెక్స్‌నర్ నివేదికే అనంటే అతిశయోక్తి కాదు.

అదే కాలంలో లూయిస్ బాంబర్గర్ అని ఒక వ్యాపారస్తుడు న్యూజెర్సీ రాష్ట్రంలోని నువార్క్ నగరంలో దివాలా తీస్తున్న ఓ దుకాణాన్ని వేలంపాటలో కొని దక్షతతో వృద్ధిలోకి తెచ్చాడు. చుట్టుపక్కల దానికి మంచి డిపార్ట్‌మెంటల్ స్టోరుగా పేరొచ్చింది.; వ్యాపారం రాణించింది. వ్యాపారంలో భాగస్తుడు సొంత చెల్లెలి భర్తే. భర్త చనిపోవడంతో వ్యాపారాన్ని అమ్మేయాలని చెల్లెలు, క్యారలైన్ బాంబెర్గర్ ఫల్డ్, తీర్మానించుకుంది. వారి అదృష్టం బావుంది; 1929లో, స్టాక్ మార్కెట్ మరో ఆరు వారాలలో కూలిపోతుందనగా, మేసీ కంపెనీ (Macy’s) బాంబెర్గర్ స్టోరుని పాతిక మిలియన్ డాలర్లకి కొన్నది. బాంబెర్గర్లు అనేక సేవాకార్యాలకి విరాళాలిచ్చేవారు. తమ డబ్బులో 15 మిలియన్ల డాలర్ల విరాళంతో ఓ వైద్య కళాశాలని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఫ్లెక్స్‌నర్ తల్లిదండ్రులు జర్మనీ నుండి అమెరికాకి వలస వచ్చిన యూదులు. మిగిలిన యూదులతో వాళ్ళకి దగ్గర సంబంధాలుండేవి. బాంబెర్గర్ల స్నేహితుడొకరు వాళ్ళకి ఫ్లెక్స్‌నర్‌ని పరిచయం చేశాడు. ఫ్లెక్స్‌నర్ అప్పటికే అమెరికాలో ఉన్నత విద్య, పరిశోధనల గురించి ఆలోచనలు చేస్తున్నాడు; ఆదర్శప్రాయమైన ఆశయాలు పెంచుకున్నాడు. తను కన్న కలలు నిజం కావాలంటే, ఓ కొత్తరకమైన విద్యాసంస్థని నెలకొల్పడమే మార్గమని నిశ్చయించుకున్నాడు. వైద్యకళాశాల కంటే అది ఉన్నతమైనదనీ, వారి విరాళం సార్థకమవుతుందనీ బాంబెర్గర్లని ఒప్పించాడు.

ఆ సంస్థలో ప్రపంచంలో ఎక్కడినుండయినా మేధావులు వచ్చి చేరవచ్చు. పాఠాలు చెప్పక్కర్లేదు; రోజువారీ పరిపాలనా బాధ్యతలు చేపట్టనవసరం లేదు; వారు చెయ్యాల్సిందల్లా, వాళ్ళకి చేతనయిన ఒకే ఒక పని – ఆలోచించడం. అది పాండిత్యానికి పెట్టినిల్లు కావాలి. దాతలు నగరానికి దగ్గరలో పెట్టాలని కోరారు. కాదు, నగరానికి దూరంగా, ప్రశాంత వాతావరణమున్న ప్రిన్స్టన్ పట్టణమే తగిన చోటని ఫ్లెక్స్‌నర్ నచ్చజెప్ఫాడు. ఆవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ (IAS) మొదలయింది.

విజ్ఞానశాస్త్రాలలో కెల్లా గణితం చవకైనది – పెద్ద పెద్ద ప్రయోగశాలలూ, ఖరీదైన పరికరాలూ అవసరం లేదు; కలమూ కాగితమూ చాలు. అలాగే అభ్యర్థులని ఎంచుకోవడం కూడా తేలిక – ఎవరు గొప్పవాళ్ళు అన్నదాని మీద ఏకాభిప్రాయం మిగిలిన శాస్త్రాలలో కన్నా గణితంలోనే సులువు అని ఫ్లెక్స్‌నర్ భావించాడు. అందువలన మొదట ఏర్పరిచినది గణిత విభాగమే. పెట్టిన కొద్దికాలంలో ఐన్స్టయిన్ వచ్చి చేరడంతో సంస్థకి ప్రతిష్ఠ వచ్చింది. అదే సమయంలో హిట్లర్ ధాటికి తట్టుకోలేక అనేక మంది మేధావులు యూరప్ వదిలి పారిపోతున్నారు. వాళ్ళలో అనేకమంది ప్రముఖులకి I.A.S నీడనిచ్చింది. వేల్ (Weyl), ఫాన్ నోయ్‌మన్ (von Neumann) – వారిలో కొందరు. అక్కడకే గూడెల్ కూడా ముందర స్కాలర్ హోదాలో తాత్కాలికంగా వచ్చాడు.

కాని 1939లో గూడెల్ తిరిగి వియన్నా చేరేటప్పటికి అక్కడి రాజకీయ పరిస్థితులు బాగా విషమించాయి. నగరం నాజీల వశమయింది. హిట్లర్ పాతపద్ధతులను రద్దు చేసి కొత్త నిబంధనలు పెట్టాడు. వాటిలో భాగంగా గూడెల్ ఉద్యోగం ఊడింది. కొత్తగా దరఖాస్తు పెట్టుకున్నాడు. దానిని అధికారులు వెంటనే మంజూరు చెయ్యలేదు. కారణం – అధికారులు సందిగ్ధంలో పడడం; గూడెల్ నాజీలకి వ్యతిరేకంగా ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు కాని, గూడెల్ పీహెచ్. డీ ఓ యూదు కింద చేశాడు. మరి గూడెల్‌ని నమ్మాలా? వద్దా?!

ఓ రోజు నాజీ రౌడీలు గూడెల్‌ని బజారులో పట్టుకుని దౌర్జన్యం చేశారు – గూడెల్ యూదుల సహచరుడని. వాళ్ళావిడ దుండగులని తరిమి కొట్టవలసి వచ్చింది. అప్పుడిక వియన్నాలో ఉండకూడదని నిర్ణయించుకొని IASకి వస్తానని అక్కడి వాళ్ళకి తెలియ చేశాడు. ఇంత జరిగినా, గూడెల్‌కి నాజీల దుర్మార్గం గురించి ఏమీ అవగాహన ఉన్నట్లు లేదు; నాజీల మూలంగా యూదులు పడిన బాధల గురించి సున్నితంగా మాట్లాడినవాడు కాదు.

వియన్నా వదలాలంటే, జర్మనీ అధికారులు అనుమతి ఇవ్వాలి. అమెరికా రావడానికి అమెరికా ప్రభుత్వం వీసా ఇవ్వాలి. రెండూ కష్టమే. అమెరికా ప్రభుత్వానికి, గూడెల్ ప్రొఫెసరు కాకపోయినా, అలా నిజాన్ని కాస్త సాగదీసి చెప్పి, జర్మనీ వాళ్ళకి గూడెల్ మేధావి వర్గానికి చెందిన ఆర్య జాతీయుడు కావడం వల్ల యుద్ధం చెయ్యడం కంటె పరిశోధనలు చేస్తే మంచిదని, మొత్తానికి IAS అధికారులు రెండు ప్రభుత్వాలనీ ఒప్పించారు. చివరకి గూడెల్, అట్లాంటిక్ మీదుగా వస్తే ఇంగ్లాండు వాళ్ళు జర్మనీవాడని పట్టుకుంటారేమోనని, రష్యా, జపానుల వైపుగా దీర్ఘ ప్రయాణం తర్వాత భార్యతో సహా అమెరికా చేరుకున్నాడు – 1940 మార్చిలో. మరలా అతను యూరపులో అడుగుపెట్టలేదు!

అమెరికా జీవితం

భాష కొత్త, దేశం కొత్త. గూడెల్, అడేల్ కొద్ది మంది మిత్రులతో తప్ప చుట్టుపక్కల వాళ్ళతో పెద్ద స్నేహ సంబంధాలు పెంచుకోలేదు. గూడెల్ స్వతహాగా ఒంటరితనాన్ని అభిమానించే రకం. ఆడెల్ నోటి దురుసుతో, అధికారం చలాయించే రకం. ఆవిడ కుటుంబం వైపు వాళ్ళకి కాన్సర్ రావడాన, తమకు పిల్లలు వద్దని గూడెల్ కోరుకున్నాడు. ఆమెకి పిల్లలు లేని లోపం బాధగా ఉండేది. కాని గూడెల్ జీవితానికి కావలసిన సంరక్షణ ఇచ్చింది. అతను తన పరిశోధనలలో నిమగ్నం కావడానికి కావలసిన వాతావరణం కల్పించింది. అతని అవసరాలు తీర్చి ఆదరణతో చూసింది.

Einstein Godel
గూడెల్, ఐన్‌స్టయిన్ (1950లో)

వచ్చిన రెండేళ్ళలో గూడెల్, ఐన్‌స్టయిన్ మంచి స్నేహితులయ్యారు. వారిద్దరూ విభిన్నవ్యక్తిత్వాలు కలవాళ్ళు. ఐన్‌స్టయిన్ కలగలపుగా, నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. గూడెల్ ఒంటరి, సీరియస్ మనిషి; ఇతరులని నమ్మేవాడు కాడు. గూడెల్‌కి గణితం మినహా బయట ప్రపంచంలో ఎలా వుండాలో సరిగా తెలియదు. ఐన్‌స్టయిన్ అది గుర్తించి అవసరమైన సాయం చేసేవాడు.

గూడెల్ అమెరికా పౌరసత్వపు ఇంటర్వ్యూ కెళ్ళే ముందర, అందరిలాగే, అమెరికా ప్రభుత్వం గురించీ, రాజ్యాంగం మీదా చదువుకుని పరీక్షకు తయారయ్యాడు. గూడెల్ ఏ పని చేసినా క్షుణ్ణంగా చేసేవాడు. అమెరికా రాజ్యాంగాన్ని కూలంకషంగా చదివాడు. దాంట్లో ఓ తార్కిక అసంబద్ధత కనుక్కున్నాడు! ఇక దాని గురించే మధనపడటంతో మిత్రులకి ఆందోళన కలిగింది – ఇంటర్వ్యూలో ఏం చెప్పి, అనవసరంగా ఏ గొడవలో ఇరుక్కుంటాడోనని. గూడెల్ మనసు వేరే దాని మీద మరల్చడానికి ఐన్‌స్టయిన్ తోడుగా వెళ్ళి శతవిధాలా ప్రయత్నించాడు. చివరకి జడ్జి గోడెల్ని, “యూరప్ లో వచ్చినట్లు అమెరికాలో కూడా నియంతృత్వం వచ్చే అవకాశం ఉందా?” అని అడిగాడు. “ఎందుకు లేదు?”, అంటూ గూడెల్ అమెరికా రాజ్యాంగంలో ఉన్న అసంబద్ధత దానికెలా దారితీయవచ్చో వివరించ పూనుకున్నాడు. అంతకు ముందు ఐన్‌స్టయిన్‌కి కూడా ఆ జడ్జే పౌరసత్వం ప్రదానం చెయ్యడాన, ఆయన కనుసైగల మూలంగా గూడెల్ విపరీత స్వభావం అర్థమయి, అంతటితో పోనిచ్చి పౌరసత్వం ఇచ్చాడు.

గూడెల్‌కి IASలో చాలా కాలం ప్రొఫెసరు పదవి లభించలేదు. తగిన గుర్తింపు రానందుకు గూడెల్ కొంతకాలం డిప్రెషన్‌కి లోనయ్యాడు. అతనికి ఆహారం విషయంలో జీర్ణ సమస్యలుండేవి. దానికితోడు పరులు తనమీద కుట్రలు పన్నుతున్నారనీ, ఇంట్లో దొంగలు పడ్డారనీ, దెయ్యాలున్నాయనీ, ఇలా అనేక భ్రమలు పెంచుకొని అనారోగ్యం పాలయ్యేవాడు. ఒకసారి ఆసుపత్రిలో ఉండగా అతని గురించి ఆందోళన పడిన IAS డైరెక్టరు ఆపెన్‌హైమర్, గూడెల్‌ని ఉత్తేజపరచాలంటే ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తే, ప్రొఫెసరు పదవి ఇవ్వాలని మిత్రులు సూచించారు. గూడెల్ ప్రొఫెసరు కాకుండా, మనం ప్రొఫెసర్లు గావడం సిగ్గుపడాల్సిన విషయం అని ఫాన్ నోయ్‌మన్ అంతటి వాడే అన్నాడు. అయితే అకడెమిక్ గొడవల మూలానా, గూడెల్‌కి పాలనా బాధ్యతలు తెలియవనీ కొందరు విముఖత చూపారు. అప్పుడు, ఆపెన్‌హైమర్‌కి ఓ ఆలోచన వచ్చింది.

ఐన్‌స్టయిన్ పేరు మీద అవార్డు ఇచ్చే కమిటీలో ఆపెన్‌హైమర్, గూడెల్ మిత్రులు – ఐన్‌స్టయిన్, ఫాన్ నోయ్‌మన్, సభ్యులు. ముందర మిత్ర పక్షపాతమనిపించినా, గూడెల్ సాపేక్ష శాస్త్రంలో చేసిన పరిశోధనలకి తగినవాడేనని నిర్ధారించుకున్నారు. అయితే అప్పటికే వేరేవారికివ్వాలని (Julian Swinger) నిర్ణయించుకున్నారు. చివరకి, ఇద్దరికీ ఇవ్వాలని నిశ్చయించడంతో గూడెల్‌కి శాస్త్ర సమాజంలో గుర్తింపు లభించింది. దాని మూలంగా కొంత డబ్బు కూడా వచ్చింది. ఆపెన్‌హైమర్ ఆశించినట్లుగానే, గూడెల్ ఉత్సాహభరితుడయ్యాడు.

గూడెల్ విశ్వశాస్త్రం (Cosmology) మీదా, ఫిలాసఫీ మీద రచనలు చేశాడు. లైబ్నిట్జ్(Leibniz) అంటే మక్కువ చూపాడు. కాని లైబ్నిట్జ్ రచనలు ప్రచురించకుండా ఎవరో కుట్ర పన్నారని ఆరోపించాడు! ఎప్పుడూ ఏదో ఒకదాని మీద గూడెల్‌కి అనుమానంగా ఉండేది.