ప్రచురణకి వచ్చే రచనల గురించి
From: The Chief Editor
Subject: ప్రచురణకి వచ్చే రచనలని పరిష్కరించడానికి సూత్రాలు
మైడియర్ మామూలు సంపాదకులూ:
మిగతా మీరంతా కష్టపడి పనిచేస్తారనీ, ముఖ్యునిగా ఖ్యాతి మాత్రం నాకనీ నేను పబ్లిక్‌లో అప్పుడప్పుడూ అనే మాట పూర్తిగా నిజం కాదని మీకు తెలుసు. ఈ మధ్య మీకు పనితో పాటూ చీవాట్లు కూడా ఎక్కువ అవుతున్నాయని నాకెందుకో అనిపిస్తున్నది. నా బాధ్యతగా, మీ పని సులువు చేయడం కోసంగా కొన్ని సూత్రాలను ఈ మెమోతో జత చేస్తున్నాను. వీటిని అమలు చేస్తే చీవాట్ల మాటెలావున్నా శ్రమ ఖచ్చితంగా తగ్గుతుందని నా స్వానుభవం. ఈ మెయిల్ మీకోసం మాత్రమే. నా అనుమతి లేకండా దీనిని ఎవరికీ చూపించవద్దు, మీ స్పౌసులకూ కూడా! ఇది మీ కళ్ళకు మాత్రమే. ఎస్సెమ్మెస్సులో చెప్పాలంటే FYEO.
-ము. సం.
అయాచిత రచయితలు
మనకి అయాచితంగా (unsolicited) రచనలు పంపే వారు చాలామంది ఉన్నారు. ఈ రచయితలు తెలుగు భాషలో మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు. ఒక్క మాటలో చెప్పవలసిన విషయాన్ని మూడు వాక్యాల నిడివికి పెంచగల సమర్థులు. ఇటువంటి రచనలని పరిష్కరించడానికి సులువైన చిట్కాలు ఏమీ లేవు (అప్పుడప్పుడూ పూర్తిగా మనమే తిరిగిరాయడం కాకండా) కొన్నినియమాలు తప్ప.
- ఈ అయాచిత రచయితలు కొంతమంది “ఆమె చెప్పింది,” అన్న వాక్యం సూటిగా చెప్ప డానికి బదులు, “ఆమె ఉదాసీనంగా, ప్రబలంగా, వాగ్విభవంగా, కర్కశంగా చెప్పింది,” అని అనవసరమైన క్రియావిశేషణాలని జోడించి రాస్తారు. కథలో ఒక పాత్ర, సందర్భానుసారంగా ఏమాటలు అనాలో రాయలేని వాళ్ళు రచనావ్యాసంగం వదిలిపెట్టి మరొక లాభసాటి వ్యాపారంలోకి దిగటం మంచిది. ఒక పాత్ర ఒకే సమయంలో ఇన్ని రకాల చిత్తక్షోభలు వ్యక్తపరచడం అసాధ్యం. ఒక్క యన్. టీ. రామారావు గారికే అది సాధ్యం; ఇప్పుడు ఆయన లేరు. అందుచేత, పరిష్కర్తలుగా మీరు ఆ వాక్యాన్ని, “ఆమె చెప్పింది”, అని మార్చడం సబబు.
- కొన్ని కథలలో పాత్రల సంభాషణలు క్లిషేలుగా స్టీరియోటిపికల్ గా ఉండటం కద్దు. అటువంటి వాటిని సవరించడానికి నియమం సున్న. మీమనసుకి క్లిషేగా, స్టీరియోటిపికల్ గా కనిపిస్తే, వెంటనే సదరు సంభాషణలని కత్తిరించండి.
- కొందరు రచయితలు, చాలా వాక్యాలు, కానీ, మరియూ అనే మాటలతో ప్రారంభిస్తారు; ఇలా మొదలుపెట్టడంలో ఏదో గొప్ప సాహితీ ప్రయోజనం ఉన్నదన్న భ్రమతో! మరియూ, కానీతో వాక్యాన్ని మొదలుపెట్టడం అప్పుడప్పుడు పరవాలేదు. కానీ, ఎల్లవేళలా పనికి రాదు. అటువంటి వాక్యాలని కత్తిరించి పరిష్కరించడం విధిగా చెయ్యాలి.
- ఉత్తమ పురుషలో చెప్పిన కథలు పాఠకులకి చిరాకు కలిగిస్తాయి. ముఖ్యంగా, కథ చెప్పేవాడి పేరు, రచయితపేరూ ఒకటే కాకపోతే! అటువంటి కథలు పరిష్కరించేటప్పుడు రచయిత పేరన్నా మార్చండి; లేదా, కథ చెప్పేవాడి పేరు రచయిత పేరుగా మార్చండి.
- కొందరు రచయితలు, ముఖ్యంగా వ్యాస రచయితలు, చెప్పిందే చెప్పుతారు. పదేపదే చెప్పుతారు. ‘ఇంతకుముందు చెప్పినట్టుగా’ అని మనకి గుర్తుచేస్తూ వెనకపేజీలో రాసింది మళ్ళీ రాస్తారు. వీళ్ళకి పాఠకుల జ్ఞాపకశక్తి మీద నమ్మకం తక్కువ. నిజం చెప్పాలంటే ఈ రచయితల ఉద్దేశంలో పునరుక్తి రచనకి పుష్ఠి కలిగిస్తుందనే నమ్మకం ఎక్కువ. విమానంలో ఫ్లైట్ అటెండెంట్ సీట్ నిలువుగా పెట్టుకోమని, ట్రే టేబుల్ మడవమనీ, సీట్ బెల్ట్ పెట్టుకోమనీ పదేపదే చెప్పడం ఎంతమంది వింటారు గనక! అలాగే ఉంటాయి వ్యాసాల్లో కొన్ని పునరుక్తులు. అందుకనే పునరుక్తి చాలా హీనమైన దోషం అంటాను. Snip repetitions mercilessly. Period. ముఖ్యంగా కవితలలో పునరుక్తి పనికిరాదు. కత్తిరించేయండి. పునరుక్తి పనికిరాదు. కత్తిరించేయండి.
- ఒక్కొక్కసారి కొద్దిమంది రచయితలు ఒక పాత్ర సంభాషణలో వాక్యాన్ని మధ్యలో విరిచి - insertion చేర్చి - ఆ వాక్యాన్ని పూర్తి చేస్తారు. ఉదాహరణకి ఈ వాక్యం చూడండి: “నాకు”, ఆమె అన్నది, ” ఆవకాయ తినాలని ఉన్నది”, అని. ఇటువంటి విరుపుడులు అప్పుడప్పుడు ఇంగ్లీషు వాక్యాలతో చేస్తే బాగానే ఉంటుందికానీ, తెలుగులో ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇటువంటి పనులకి అసలు కారణం: ఈ రచయితలు ఇంగ్లీషులో చవకరకం రొమాన్సులు చదవడం. “నాకు ఆవకాయ తినాలని ఉన్నది”, అని ఆ వాక్యాన్ని మార్చడం సంపాదకులుగా మన కర్తవ్యం.
- కొన్ని కథలలో సంభాషణలు స్క్రీన్ ప్లే ఫక్కీలో ఉంటాయి. నాటక రచయిత నటీనటుల కోసం రాసినట్టు ఉంటాయి. ఉదాహరణకి, ఈ మధ్య ప్రచురణకి వచ్చిన కథలో ఒక భాగం చూడండి, కథావస్తువు సంగతి సరేసరి!
“నేను బయటికి పోతున్నాను, కూరలేమైనా కావాలా?” అని అతను ఆడిగాడు.
“ఫ్రిజ్ నిండా కూరలున్నాయి, ఏమీ అక్కరలే!” అని ఆవిడ సమాధానం ఇచ్చింది.
అతను వెంటనే అన్నాడు, “మరయితే నే వెళ్ళొస్తా” అని.
ఆవిడ వెనక్కి తిరగకండా, “మీరు గనక ఆ కొరియన్ కొట్టువేపుకెడితే కొత్తిమిరి కట్టలు కొనండి, అక్కడ చవక” అని అన్నది.
“సరే” అన్నాడు అతను, చెప్పులు వేసుకుంటూ.
“వాడిపోని కొత్తిమిరి చూసి మరీ తెండి” అని ఆవిడ అంది.
“సరే అల్లాగేలే ” అని అన్నాడు అతను కాస్త విసుగ్గా.
“అన్నట్టు మరిచిపోయాను. చవగ్గా ఉంటే బాగా నీళ్ళున్న ఎండుకొబ్బరికాయొకటి పట్టుకోరండి. రేపు శనివారం, దేవుడికి కొట్టాలి” అని ఆవిడ అంది.కొటేషనులకి అటు, ఇటూ “ఆమె అన్నది, అతను చెప్పాడు,”- ఇవి అనవసరం. వెంటనే కత్తిరించడం అవసరం.
- అందుకని, ఈ విధంగా, కాబట్టి, అసలు విషయం ఏమిటంటే, ఉదాహరణకి, ఇకపోతే, ఇటువంటి మాటలని అతిగా వాడడం, ముఖ్యంగా కథలలో వాడడం రచయిత అపరిపక్వతకి ఉదాహరణలు. ఇటువంటి అనవసరపు మాటలు, సందర్భానుసారంగా కత్తిరించడం ఆవశ్యకం. ఇందుకు రచయిత అనుమతి పొందడం అనవసరం.
- కొందరు కథారచయితలు కథని అర్థంతరంగా ఒక cryptiక్లుప్తంగా వాక్యం రాసి ముగిస్తారు. ఉదాహరణకి: “ఆమె గోడకేసి తీక్షణంగా చూస్తూ నిలబడిపోయింది”, “కళ్ళల్లో నీళ్ళు నిండి, ఆమెకి సముద్రఘోష వినపడలేదు”, “ఆమె సిగరెట్టు కాలుస్తూ నిలబడి పోయింది, వెనక్కి తిరగకండా వెళ్ళిపోతున్న అతని నీడకేసి చూస్తూ”. ఇటువంటి రచయితలు ఈ మధ్యనే ఓ. హెన్రీ కథలు చదివి బాగా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయారని ఎవరికైనా తెలిసిపోతుంది. అటువంటి ముగింపులని పరిష్కరించేటప్పుడు చాలా సటిల్ గా రచయితతో సంభాషించాలి. ఓ. హెన్రీ కథల్లో ముగింపులని కాపీ కొడుతున్నారని మీరు డైరెక్టుగా చెప్పకూడదు.
- మాటల గారడీ, అంటే ‘పన్’, కథల్లో ఉండకూడదు. అటువంటి చీప్ కథలని తిరస్కరించడం ఉత్తమం.
- అయాచిత రచయితలకి మీరు చేసే ప్రతి సవరింపూ, కత్తిరింపూ నిర్మొహమాటంగా చెప్పండి. కాకపోతే నచ్చచెప్పండి. వారు కూడా ఏమీ అనుకోరు. పైగా చెప్తే మెచ్చుకుంటారు కూడా. ఐతే, అలా ఒకటీ రెండు కథలు మనం ప్రచురించిన తర్వాత వారితో మనం ప్రవర్తించే తీరు మార్చుకోవాల్సి వుంటుంది (క్రింది పాయింట్లు చూడండి).
మనం కథలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటల్లేదనే అపోహ (ఇది అపోహ మాత్రమే) చాలామంది పాఠకులకి ఉన్నది. అందుకని, ఇక ముందునుంచీ ప్రతి సంచికలో మనం ప్రచురణకి తిరస్కరించిన రచనల సంఖ్య చెప్పడం మంచిదనే అభిప్రాయం కొంతమంది సీనియర్లు నాతో వెలిబుచ్చారు. అది అంత మంచిపని కాదు. అసలు మంచిపని కాదు. అంతే కాదు, మనం తిరస్కరించిన రచనలు ఆంధ్రాలో అచ్చు పత్రికలలోను , అమెరికాలో ఇతర వెబ్ పత్రికలలోనూ ప్రచురించబడిన వైనం మనకి తెలిసినా మనం పబ్లిగ్గా ఎవరికీ చెప్పకూడదు.
యాచిత రచయితలు
యాచిత (Solicited) రచయితలు చాలామంది ప్రిమా డొనాలు అని అనుకోవడంలో తప్పేమీ లేదు. వాళ్ళందరూ సీనియర్ రచయితలు. ఒక రచయిత సీనియర్ రచయిత ఎప్పుడవుతాడు అన్నది చాలా వివాదగ్రస్తమైన విషయం. కొందరి ఉద్దేశంలో ఒకటో రెండోకథలు, అరో పరకో కవితలూ అచ్చవంగానే, వాళ్ళు సీనియర్ రచయితలం అనే భ్రమలో ఉండటం మనకి తెలుసు. అటువంటి వాళ్ళ రచనలని పరిష్కరించడం, పంక్చుయేషన్ మార్పు చెయ్యడంతో సహా, అతి జాగ్రత్తగా చెయ్యాలి.
- యాచిత/సీనియర్ రచయితల్లో చాలామందికి సహనం కన్నా అహం ఎక్కువ. అందుచేత, వారితో ఉత్తరప్రత్యుత్తరాలు చేసేటప్పుడు మెలుకువ అవసరం. “మీరు రాసిన సదరు వాక్యాలు పెద్దపెద్ద పండితులకి అర్థం అవవచ్చు. సాధారణ పాఠకుడికి అవి బోధపడవు. మీ వ్యాసం/కథ/కవిత ఎక్కువమంది చదివి ఆనందించాలంటే, ఈ చిన్ని సవరణలు అవసరమేమో అని మాకనిపిస్తున్నది” అని ఆ రచయిత అహాన్ని దువ్వడం (దీనినే ఇంగ్లీషులో స్ట్రోకింగ్ అంటారు) అవసరం. మీరు చేసిన సవరణలు, ఎంత కటువైనవయినా సరే! ఈ స్ట్రోకింగ్‌కి కావలసిన అణుకువలు, మెళుకువలూ మీకు తెలియకపోతే కొన్ని బ్లాగులు చదవి (ఏ బ్లాగులు చదవాలో మీకు వేరే మెయిల్ లో పంపుతాను) నేర్చుకోవడం అవసరం. యాచిత రచయితలందరూ గాల్‌బ్రయిత్, నాట్ హెంటాఫ్, కె.బి, యెన్.వి, కె.జె., అప్ డైక్, స్టీవెన్ కింగ్ లలా సంపాదకులుచేసే మార్పులన్నింటినీ సహృదయతతో ఆహ్వానించరు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. Fred Allen అనీ టీవీ కమెడియన్, ఎడిటర్లు తన స్క్రిప్టు మారిస్తే ఏమన్నాడో తెలుసునా? He said, “Where were they when the damn paper was blank?”
- కొద్దిమంది సీనియర్ రచయితలు సంపాదకుల పనిని ససేమిరా సహించరు; హర్షించరు.

ప్లాట్నిక్ ముఖప్రీతి పద్ధతి
అటువంటి సమయలో ప్లాట్నిక్ ముఖప్రీతి పద్ధతి అనుసరించడం శ్రేయస్కరం. ఉదాహరణగా, ఆర్థర్ ప్లాట్నిక్ రాసిన ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎడిటింగ్ పుస్తకం (32పే.) నుంచి తీసుకున్న ఈ బొమ్మ చూడండి. పుస్తకం మీదగ్గర లేకపోతే (నన్ను పంపించమని అడగకుండా) మీరు తెప్పించుకోండి.
- యాచిత రచయితలు, అయాచిత రచయితలలో కొద్దిమంది, రచన మధ్యలో పరదేశీయ పదాలు, జాతీయాలు గుప్పిస్తారు. ముఖ్యంగా, ఫ్రెంచ్, లాటిన్, సంస్కృత పదాలు. సాధ్యమైనంతవరకూ వాటిని తెలుగులోకి తర్జుమా చేయడం మంచిది. అందుకు ఆ రచయిత ససేమిరా ఒప్పుకోక పోవచ్చు. అప్పుడే ఎడిటర్లుగా మీ రాజకీయ కౌశలం ఉపయోగించాలి.
- ప్రిమా డొనాలు కొంతమంది కథలో, కాకరకాయలో పంపించేటప్పుడు ప్రతీసారీ వాళ్ళ బయోడాటా మీకు గుర్తు చేస్తారు వారి ఎకడెమిక్ డిగ్రీలతో సహా; రెండువందల కథలు, పధ్నాలుగు నవలలు, ఐదు కవితా సంకలనాలు, ఆరు వ్యాస సంపుటాలు, ఒక విమర్శనా గ్రంథం వగైరా వగైరా అని. అటువంటి అహంభావ రచయితల దగ్గిరనుంచి రచనలు యాచించే బాధ్యత నాకు వదిలిపెట్టండి. వాళ్ళు తెగడినా పొగడినా భరించడం నా బాధ్యత. అయినా, మాకూ పెహడిగ్రీలున్నై, వాళ్ళ తిట్లు మేమూ భరించగలం, మా చర్మం మందం అని మీరు అనుకుంటే, అది మీ ఖర్మ.
- ప్రిమా డొనాలతో ఇంకొక చిక్కు కూడా ఉన్నది. వాళ్ళు సాధారణంగా కర్త్రర్థక వాక్యాలు రాయరు. ఉదాహరణకి, “వలలుడు వంటలు వండెను”, అని రాయరు. దానికి బదులుగా కర్మర్థక వాక్యాలు రాస్తారు. అంటే, “వలలునిచేత వంటలు వండబడెను”, అని రాస్తారు. అటువంటి వాక్యాలని మార్చండి. రచయితకి సవరించిన ప్రతి పంపేటప్పుడు, మీ సవరణలు కాపీలో మరో రంగులో చూపించకండి. నల్ల సిరాలోనే మార్పులన్నీ చేసి రచయితకి పంపిస్తే తన రచనలో మార్పులేమీ చెయ్యలేనే భ్రమ కలుగుతుంది. ఇది చిన్నతరహా మోసం. తప్పేమీలేదు. ఆనర్ కోడ్ ఉల్లంఘించామని భయపడటానికి, ఇవేమీ అమెరికా స్కూళ్ళలో పరీక్షలు కావు.
- కొందరు యాచిత రచయితలు పబ్లిగ్గాను, పరోక్షంగాను మనమీద అపవాదులు, నీలాపనిందలూ వేశారు, వేస్తారు; మనకి కొందరు అభిమాన రచయితలని, మరికొందరంటే చిరాకనీ. అది నిజం. అయితే కొందరిపై అభిమానానానికి కారణం, వారి వయసు, లింగబేధమూ/సామ్యమూ, సహజీవనంలో స్వ/పర లింగాల ప్రత్యేక యెంపిక కానీ కారణం కాదు. ఈ అపవాదులకి కారణం మీరు వారి అహం దెబ్బతీయడం. ఈ ఉత్తరంలో సూత్రాలే కాక, వేరేగా ఈ ఒక్క విషయం మీదే ఇంకో మెమో మీకు పంపుతాను త్వరలో.
[ఈ మధ్య కాలంలో మన పత్రికలో అశ్లీలత పెరిగిందనే అభాండం ప్రచారంలోకి వచ్చింది. కథలలోను, కవితల్లోనూ అశ్లీల పదాలు వున్నాయన్న సందేహం వస్తే, ఆకథ చివరో, కవిత చివర్లో ‘మా పత్రిక అశ్లీలతని సహించదు. ప్రోత్సహించదు.’ అని డిస్‌క్లైమర్ రాయడం మంచిది. అశ్లీల పదాలు పరాయి భాషలో ఉంటే పరవాలేదు. (సాహిత్యంలో అశ్లీలత పై నేను ఒక బృహత్‌వ్యాసం మొదలు పెట్టాను. త్వరలో దానిని ప్రచురిద్దాం)]
కవితలు
మనకి కవితలు పుట్టగొడుగుల్లా వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కసారి Andy Rooney అన్న మాటలు నిజమే సుమా అనిపిస్తాయి.
“We need more plumbers and electricians than we need poets - but we need poets too. There are more bad poets than bad electricians and plumbers. May be, poets ought to be licensed”
- Andy Rooney (in Common (non)sense, 2002, BBS Public Affairs, New York).
- పైమాటలు ఉమ్మడిగా కవులందరికీ చెప్పవద్దు. కవులలో చాలామంది సాత్వికులు. వాళ్ళ మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు.
- కొద్దిమంది కవులకి ఈ విషయం ఘంటాపథంగా చెప్పవలసిన అవసరం ఉన్నది. అటువంటి కవులు ఎవరో మీకు తెలుసు. “నా కవితలో మార్పు చెయ్యగల సమర్థులు ఈ భూప్రపంచకంలో లేరు”, అని మెయిల్ కొట్టే కవులెవరో నాకు తెలుసు, మీకు తెలుసు. అది అందరికీ బాకా ఊది చెప్పడం అనవసరం.
మనకి వచ్చే ఉత్తరాలు
- కొందరు ప్రైవేట్గా ప్రేమలేఖలు రాస్తారు. ఉదాహరణకి, నాకు వచ్చిన ఒక ప్రైవేట్ ఉత్తరం, ” నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, సంస్కృతం అసలే రాదు; ఈ సంపాదకపదవి నీకు కట్టబెట్టిన వాళ్ళు ఉత్త చవటలు”, అని. ఇటువంటి ఉత్తరాలకి సమాధానం ఇవ్వనవసరం లేదు. ఒక వేళ సమాధానం ఇద్దామనే కుతూహలం కలిగితే, ఇదిగో ఫార్ములా సమాధానం: మీ ఉత్తరం. చాలా సంతోషం. అభినందనలతో - అని రాయండి. (అతను/ఆమె మీకు ఈ జన్మలో మళ్ళీ ఉత్తరం రాయడు/రాయదు అని హామీ ఇస్తున్నాను)
- ప్రాకృతంలోనో, దేశ్యంలోనో, లహండ లోనో కొందరికి పెద్ద పెద్ద ఉత్తరాలు రాయడం గొప్ప సరదా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అన్నట్టుగా, అప్పుడప్పుడు అలాంటి ఉత్తరాలు చదవడానికి సరదాగానే ఉంటాయి కానీ, అదే వరసలో తండోపతండాలుగా, ప్రతి కథ మీద, ప్రతి వ్యాసం మీద, ప్రతి కవిత మీదా, ప్రతి సంపాదకీయం మీదా రాస్తే విసుగొస్తుంది, మీకూ నాకే కాదు; పాఠకులకి కూడా. నా సలహా, Cut them out.
- ఎడిటర్లని మందలిస్తూ, తూలనాడుతూ వచ్చే ఉత్తరాలు ప్రచురించడం అవసరం. వాటికి ఎడిటర్లు సమాధానం ఇవ్వడం అనవసరం.
- ఫలానా వాడి కథని, ఫలానా రచయిత్రి వ్యాసాన్ని, నేను మొదటినుంచీ చివరిదాకా సవరించి పరిష్కరించాను అని ప్రైవేటుగా కాని పబ్లిగ్గా బ్లాగుల్లో కాని ఏ ఎడిటరూ/ మాజీ ఎడిటరూ చెప్పకూడదు. ఆ రహస్యం రచయితకి, ఎడిటరుకీ మధ్యనే ఉండిపోవాలి. అది Editorial etiquette; editorial code & protocol.
[ఇది రాయాలనే ఊహ ఇచ్చిన ‘ఉత్తర’ కుమారులందరికీ ధన్యవాదాలు]
darla అభిప్రాయం:
May 2, 2009 10:32 am
నమస్కారం,
వెంకటేశ్వరరావు గారు వ్యాసంలో అక్కడక్కడా ఆధునిక అప్పకవి కనిపించినా, చాలా విషయాలను సూటిగా స్పష్టంగా చెప్పారు. మన తెలుగు వ్యాసాలను ఎం.ఎల్.ఏ స్టైల్ షీట్ కూడా తెలియని/ అసలు పాటించన పరిశోధన వ్యాసాలు మాత్రమే అధికంగా ప్రచురితమవుతున్నాయి. కవిత, కథ, వ్యాసాల్లో వాక్యాల గురించి కొన్నింటిని ప్రస్తావించారు. పునర్తుక్తి గురించి రాశారు. కావ్యాలంకార సంగ్రహం లో ప్రత్యేకించి దోష ప్రకరణం ఉంది. అందులో ఉన్నవన్నీ శాశ్వత ప్రామాణికాలని అనలేం, కానీ, అత్యధిక శాతం అవి ప్రామాణికాలే! ఇలాంటి వన్నీ మన భాషా, సాహిత్యాలను మరింత ముందుకు తీసుకువెళతాయి. అలాగే ఇలాంటి వ్యాసాలు కూడా కొందరినైనా కదిలిస్తాయి.
మంచి ప్రయత్నం. అభినందనలు అనలేను…. ఇంకా వారికంటే చాలా చిన్నవాణ్ణి. ఉపయోగపడే వ్యాసం అని మాత్రం చెప్పగలను.
దార్ల
Srinivas Nagulapalli అభిప్రాయం:
May 2, 2009 10:08 pm
నమస్కారం
చమత్కారంగా చక్కగా తెలిపారు, ఒక్కటి మాత్రం అర్థం కాలేదు.
“ముఖ్యంగా కవితలలో పునరుక్తి పనికిరాదు. కత్తిరించేయండి.”
అన్నదొక్కటి వ్యంగ్యమో హాస్యమో నిజమో తెలియని (దు)స్థితి.
వచనంలో పునరుక్తి వద్దనేది అర్థంచేసుకోగల్గినా, కవితలలో_ మనకున్న ఎన్నో తెలుగు, తెలుగేతర కవితలలో, అందంగానే కనబడుతుంది, స్పష్టంగానే వినపడుతుంది, సమంజసంగానే అనిపిస్తుంది కదా పునరుక్తి! అపార్థం చేసుకున్నాననేమో అని అనుమానం, అంతకన్నా దాన్ని సరిచేసుకోడానికే ఈ ప్రయత్నం.
To be or not to be: that is the question” అనే అంటాం కాని ఎంత Elements of Style ఘోషించినా To be or not: that is the question” అని అనం కదా! “మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది” అనీ, “భజ గోవిందం, భజగోవిందం, గోవిందం భజ” అనీ, “సంభవామి యుగే యుగే” అనీ, “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ” అనీ, “వాగర్థావివ సంప్రృక్తౌ” అని తిరిగి “వాగర్థ ప్రతిపత్తయే” అనీ, “దేశమంటే మట్టికాదోయ్ దే శమంటే మనుషులోయ్”-పునరుక్తులు లేక్కపెట్టుకుంటూపోతే, కత్తిరిస్తూవుంటే మిగిలేదేమిటో conclusion ఏమిటో తెలియదు!
ప్రార్థన చివర్లో కూడా పునరుక్తే ఓం శాంతిః శాంతిః శాంతిః !
“And miles to go before I sleep, And miles to go before I sleep”
—–
విధేయుడు
-Srinivas
[శ్రీనివాస్ గారూ: మీరు పైన ఉదహరించిన వేటిల్లో కూడా పునరుక్తి దోషం లేదు. -సం.]
Srinivas Nagulapalli అభిప్రాయం:
May 3, 2009 12:32 pm
నమస్కారం
చెప్పిన ఉదాహరణలలో పునరుక్తి దోషం లేదన్నందుకు సంతోషం.
“పునః ఉక్తి పునరుక్తి” అనుకుంటున్నాను. మరి పునరుక్తి ఎప్పుడు దోషంగా
మారుతుందో కొంచెం వివరణ, వీలైతే ఎక్కువ పాపులారిటీ పొందిన కవితలలోనుంచేదైనా సాయపడే ఉదాహరణ దయచేసి తెలుప మనవి. పాయింటు బొత్తిగా అర్థం కాలేదు, నాకొక్కనికే కాదేమో అని కూడా అనుమానం, ప్రయత్నిస్తున్నప్పటికినీ.
____
విధేయుడు
-Srinivas
mOhana అభిప్రాయం:
May 3, 2009 4:34 pm
శ్రీనివాస్ గారు ఉదహరించిన మరో ప్రపంచం అనే రెండు పదాలు మూడు మారులు ఉపయోగించడము పునరుక్తి ఎలా కాదు, మూడు వేరువేరు మరో ప్రపంచాలు ఉంటే తప్ప? అదే విధంగా మూడు మారులు భజ గోవిందం అన్నది పునరుక్తి కాదా? వేరు వేరు అర్థాలలో ఉపయోగిస్తే తప్ప పై పదాలు పునరుక్తి దోషం కాదా? దేశంలాటి ఒక పదాన్ని మరల మరల వాడితే పునరుక్తి కాదు, ఎందుకంటే అది వాక్య నిర్మాణానికి కావాలి. లేక నేను బాగా అర్థం చేసికోలేదా పునరుక్తిని గురించి? మన జీవితమే ఒక పునరుక్తి కదా? మొన్నటిలా నిన్న, నిన్నటిలా ఈరోజు. అదే ఆఫీసు, అదే పని, అవే కష్టాలు, అవే నష్టాలు. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే భూమి, అదే ఆకాశం. పునరపి జననం పునరపి మరణం, భజ గోవిందం, భజగోవిందం! - విధేయుడు - మోహన.
[పునరుక్తిని నిఘంటు అర్ధంతో కవిత్వంలో వాడరు. కేవలం పదం పునరుక్తమైతేనే దోషం కాదు. ఒక భావానికి ఊనిక కోసమో, తూగు కోసమో పదాల్ని తిరిగి వాడడం ఇటరేషన్. చెప్పదలచుకున్న విషయాన్నే మళ్ళీ మళ్ళీ అనవసరంగా చెప్పడం రిడండన్సీ. పునరుక్తి అన్న పదాన్ని ఈ రిడండన్సీ అన్న అర్ధంలో వాడతారు. ఇది మొనాటనీ కాదు. మరికొంత చర్చ అవసరం అనుకుంటే దయచేసి చర్చావేదికను ఉపయోగించుకోగలరు. - సం.]
Meher అభిప్రాయం:
May 4, 2009 3:15 am
Typical editors’ jargon. వాక్యాల్నీ, వ్యాకరణాన్నీ, విరామచిహ్నాల్నీ పట్టించుకున్నంతగా రచన మొత్తంగా పాఠకునిపై కలిగించాల్సిన అనుభూతిని ఎక్కడా నొక్కిచెప్పకపోవడం ఆశ్చర్యం. బహుశా అది ఇలా టెస్ట్‌ట్యూబ్ సమీకరణాల్లో పట్టుబడేది కాకపోవడం వల్లనేమో. అయినా ప్రస్తావిస్తే బాగుండేది. లేకపోతే ఈ ఉత్తరాన్ని అందుకున్నవారు ఇలాంటి నియమాల్ని scalpels లాగా చేతబూని రచనల మీద పడతారు. సంపాదకులంతా వీటికి కట్టుబడితే జాయ్స్ “యులిసెస్”, రాబీ గ్రియే “జెలసీ” లాంటి రచనలు బయటపడేవి కావు.
మెహెర్
చావాకిరణ్ అభిప్రాయం:
May 4, 2009 4:39 am
ఇంత ఘాడ పానియాన్ని సేవించిన తరువాత కూడా ఈ మాటకు రచనలు పుంఖాను పుంఖాలుగా వస్తుంటే అది మాత్రం నిజ్జంగా మనకు కవి, రచయిత మంద ఎక్కువ అయిందన్న దానికి సూచనే అని అనిపిస్తుంది.
-ఇంకో వ్యాఖ్య వ్రాయాలి, సమయం ఉన్నప్పుడు. కాకుంటే ఇవే విషయాలు రచయిత దృష్టిలో నుంచి చూస్తూ.
rama bharadwaj అభిప్రాయం:
May 5, 2009 10:21 am
అయ్యా ముఖ్య సంపాదకుల వారూ..!!
మీకూ..మీ స హ..లేదా ఉప సంపాదకులకు మరో సులువు చెప్పాలని అన్పించింది. మీరెటూ సున్నిత మనస్కులు అయివుండరు గనక, కాస్త నిశ్చింత గానే చెబుతున్నాను. అదేమంటే..అసలు ఇన్ని సూచనలిస్తూ.. కత్తిరిస్తూ..ఇలాంటి అవస్థలన్ని పడేకన్నా..ఆ కధలూ..కవితలూ..వ్యాసాలూ..వాక్యాలూ..మీరే రాసేసుకుంటే పోలా??
మీకు ఇతరుల రచనల్ని సంస్కరింఛే శ్రమ తప్పుతుంది. పాఠకులకి మీ శత..స హస్ర నిషేధాల బరువూ తప్పుతుంది. పెద్ద రచయితలు మీకు రాయరు. ఔత్సాహికులని మీరు రాయనిచ్చేలా లేరు. చూడబోతే..మీరు కవులకెల్ల కవి లాగానూ..విమర్శకులకెల్ల… విమర్శకులుగానూ..పాఠకులని మించిన పాఠకుని గానూ కన్పిస్తున్నందున..మీ పత్రికని మీ సూచనల మేరకు మీరే బాగా నడుపుకోగలరు.
రమ.
Srinivas Nagulapalli అభిప్రాయం:
May 6, 2009 8:00 am
“యాచిత/సీనియర్ రచయితల్లో చాలామందికి సహనం కన్నా అహం ఎక్కువ. కొద్దిమంది సీనియర్ రచయితలు సంపాదకుల పనిని ససేమిరా సహించరు; హర్షించరు.” అన్న వాక్యాలు, “ప్రచురణకి వచ్చే *రచనలు* గురించి” అనే శీర్షిక పెట్టి, రచనలను గాలికొదిలేసి, రచయితల యొక్క సహనాలు, అహంభావాలు, వారు ఏమి సహిస్తారు, ఏమి హర్షించరు అనే అంశాలను పాయింట్లవారీగా నొక్కి చెప్పడం ఎంచుకున్న శీర్షకకు ఏ విధంగా అవసరం, ఉపయోగం?
____
విధేయుడు
-Srinivas
rama bharadwaj అభిప్రాయం:
May 7, 2009 9:43 pm
నాకు కూడా నాగులపల్లి శ్రీనివాస్ గారికి వచ్చిన సందేహమే వచ్చింది. “రచయితలు” అన్న మాట చాలా విలువైనది కావాలి పత్రిక్కి. రచయిత లేకుండా పత్రికకి మనుగడ ఉండదు. బయటికి ఎన్ని పెద్ద కబుర్లు చెప్పినా వైవిధ్యమైన రచయితని ఆకట్టుకోగల చతురత ..పత్రికా సంపాదకులకి ఉండాల్సిన ముఖ్య లక్షణం. పేరు పెట్టకుండా. ఈమాట ముఖ్య సంపాదకుడు చేసిన..సీనియర్ రచయితలు..అహాల..ప్రస్తావన …రచయితల మీద అర్ధంలేని అభాండంగా కన్పిస్తోందే తప్ప అందులో రచయితల పై ఏ కోశానా గౌరవం ధ్వనించలేదు. తమ పత్రికా లక్ష్యాలకి సరిపడా రచనలు ఆ పత్రికలో కన్పించకపోతే ఆ లోపం పత్రిక లోనే ఉన్నదని అర్ధం. “సంపాదకుడంటే నాకింపారెడు భక్తి గలదు ఎంచేతన గా..సంపూర్ణ మనుజుడాతడు..చింపాంజీకన్న నయము సిరిసిరిమువ్వా!! అని తన కంద పద్యంలో.. శ్రీశ్రీ మరి అందుకే అన్నాడు. అస్తు.
రమ.
గిరి అభిప్రాయం:
May 9, 2009 4:23 pm
వేలూరి (ము.సం) గారికి,
మీరు మీ మామూలు సంపాదకులకు రాసిన ఉత్తరం నిజంగానే “పొరపాటున” బహిర్గతమైందని, అవి నిక్కచ్చిగా రచయితలపైన మీ అభిప్రాయాలే అని నమ్మేవాళ్ళం కొంతమందిమి వున్నాము. మాకు జోకు చెప్పేముందు ఇది జోకనీ, స్పూఫ్ రాసేముంది ఇది స్ఫూఫనీ మీరు చెప్పకపోతే, మీరు రాసినవి నిజంగా మీ సంపాదకులకు మీరిచ్చే సూచనలే అని మేమనుకోడంలో తప్పేముంది? ఇటువంటి అభిప్రాయాలు మీకు నిజంగానే ఉండివుంటే ఇలా బైటికి చెప్పేంత ప్రజ్ఞావంతులనేమో మీకు ప్రైవేటుగా ప్రేమలేఖ మీ టాలెంట్ గురించి అలా వచ్చింది. మా లాంటి వాళ్ళం చాలామందిమి మా సాహిత్య వ్యాసంగాలనీ, మా ఉత్తరాలనూ (అందులో మేము ప్రకటించే అభిప్రాయాలనూ) చాలా సీరియస్ గా తీసుకుంటాము. అందుకనీ ఈ సారి నుంచీ, మీరేదైనా స్పూఫులు రాస్తే ముందుగానే చెప్పండి. అలా చెప్పకపోతే, ఆ తర్వాత మాలాంటి ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తముల ఉత్తరాలు చదువుకుని మిగతా సాధారణ పాఠకులు నవ్వుకోడమూ, తల గోడ కేసి కొట్టుకోడమూ చెయ్యల్సొస్తుంది. మీకింకా జ్ఞానోదయం కాకపోతే, ఈసారి ఆ “ఉత్తర” కుమారుల ఉత్తరాలను అలాగే సంకలించి మళ్ళీ “పొరపాటున” బహిర్గతమయ్యేలా ప్రచురించుకోండి. (ఫైవ్‌స్టార్ గైడులా పనికొస్తుంది మీ సంపాదకులకు అని మేం నమ్ముతాం మళ్ళీ).
- గిరి
rama bharadwaj అభిప్రాయం:
May 9, 2009 9:06 pm
మొత్తంగా ఈమాట సంపాదకవర్గానికి,
పత్రిక మీద విసుర్లువేయడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఒక పాఠకురాలిగా ఈమాటని చదువుతున్నప్పుడు నాకు కలిగే భావనలని మీకు తెలియజేస్తే..అది ఇటుపై మీకేమైనా ఉపయోగపడొచ్చని నా పరిశీలనని నిర్మొహమాటంగా స్పష్టంగా మీముందుకు తీసుకురావాలని అనుకున్నాను.ఇవి మీకు ఉపయోగపడతాయనే నా నమ్మకం.
ముందుగా పత్రిక నడిపే మీ కృషిని అభినందిస్తూనే ఈ సూచనలు చేస్తున్నానని మీరు గుర్తుంచుకోగలరు.
1. మీ పత్రిక లో వైవిధ్యం లేదు. కొత్త పేర్లు..ఎప్పుడూ కన్పించవు. ఎప్పుడు ఆ రాసే నలుగురే రాయటం చూస్తాం. అది మీ పత్రిక లో మొనోటనీకి కారణం అయింది.
2. మీ పత్రిక లో వచ్చే వ్యాసాల్లో వైవిధ్యం [సాహిత్య విషయాల్లో మరీ ముఖ్యంగా], లేదు. సాహిత్యం గురించి చాలా విస్త్రుతమైన విషయాలు చర్చకు రావాలి. అలాగే పరిపక్వత కల్గిన అభిప్రాయాలు వాటిల్లో కన్పించాలి. ఈరెండూ మీ పత్రిక లో లోటుగానే ఉన్నాయి. నిజానికి మీ పత్రిక లోనే కాదు ఇవాళ్టి ఆంధ్రదేశంలోని తెలుగు పత్రికల్లోనూ ఈ అవగుణం బాగా ఉంది. వాటికన్నా మీ పత్రిక భిన్నంగా ఉండాలన్న దే్ మీ లక్ష్యమైతే[మీ పత్రిక ఆశయాల్లో మీరు ప్రకటించుకున్న ట్టు..], మీ కృషి మరింత లక్ష్యవంతం కావాల్సుంది.
3. మీ ముఖ్య సంపాదకుల వారి గొంతులో ఉండాల్సిన సంయమనం తరుచూ లోపించటం మీ పత్రిక్కి పెద్దలోటు. ఒకవేళ రాయాలని అనుకునేవారు కూడా ఆయన వాగైఖరివలన ఆగిపోయే ప్రమాదం వుంది…………రమ.
malathi nidadavolu అభిప్రాయం:
May 10, 2009 12:11 pm
బాగుంది చర్చ. ఒక్కవిషయంమీద భిన్న అభిప్రాయాలు రావడం మంచిదే. వేంకటేశ్వరరావుగారు తమదైన శైలిలో చమత్కారంగానూ. విపులంగానే చర్చించేరు. అన్ని కోణాలూ కవర్ చేసేరు. నామటుకు నాకు ఒక్కటే తక్కువ అనిపిస్తోంది. సంపాదకులు ఇస్తున్న సలహాలో సూచనలో కూడా ప్రచురించేస్తే, పాఠకులకి ఆలోచించుకోడానికి మరింత ప్రస్పుటం అవుతుంది కదా.
Srinivas Nagulapalli అభిప్రాయం:
May 11, 2009 6:47 am
రచయితలకు, పాఠకులకు సూచనలు already ఇచ్చారు కదా!
నచ్చనివి, నచ్చినవి ఎన్నైనా ఉండొచ్చు. అసలు అనవసరంగా రచయితల ఇష్టాలు, అహాల ప్రస్తావనతో దారితప్పిన రచనలాగే, దమ్మిడీ ఆదాయం లేకుండా ఎంతో శ్రమ, పరిశ్రమ, సమయంతోనే సాధ్యమయ్యే పత్రికా నిర్వహణను కాదని దుమెత్తిపోయడం కూడా ఎందుకో మనసొప్పడం లేదు.
రాజుగారి క్షీరాభిషేకానికి నావంతు నీరిస్తే లోటేముందంటే నీరే మిగిలినట్లు, సంపాదకులు, పాఠకులు, రచయితలందరూ తలుస్తే, చేయేస్తేనే పత్రికకు
వైవిధ్యం, వైభవం అనిపిస్తుంది.
____________
విధేయుడు
-Srinivas
Veluri Venkateswara Rao అభిప్రాయం:
May 11, 2009 10:06 am
పొగిడిన వారికి ఒక నమస్కారం. తెగిడిన వారికి అనేక నమస్కారాలు. ఈ వాద ప్రతివాదాలు చదువుతుంటే, విశ్వనాథ సత్యనారాయణగారు చెప్పిన చాటుపద్యం గుర్తుకొచ్చింది.
తొలినాళుల పద్యార్థము
తెలియనిచో పాఠకునిది తెలియమి. ఈ నా -
ళుల వ్రాసిన కవి దోషము.
కలి గడచినకొలది చిత్రగతులన్ చెలగున్
విధేయుడు, — వేవేరా
పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:
May 11, 2009 1:33 pm
వేలూరి గారికీ పాఠకోత్తములకీ నమస్కారములు.
నేను ఈ వ్యాసం చదివినంత సేపూ కడుపుబ్బేలా నవ్వుకున్నానే తప్ప పెత్తనపు వృశ్చికం నన్ను కుడుతోందని అనుకోలేదు. అలా అనుకున్నా కన్నంలో దొంగలాగా ఉండి పోయాను.
గిరిగారు ఎవరో తెలియదు గానీ మహాత్ముల్లా సెలవిచ్చారు. ఇది జోకు అని కనుక ప్రకటించకుండా ఛలోక్తులు విసిరితే నాలాంటి వారికి బోధపడదు సరికదా అనవసరంగా రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.
అసలు తెలుగు వారికి ఛలోక్తులెందుకు చెప్పండి? ఎవరైనా హాస్యాస్పదంగా ఎందుకు రాయాలి? ఇంకెప్పుడైనా రాస్తారా ఇలాంటి పొరబాటు ఉత్తరాన్ని?
మీ ఊళ్ళో వినాయకుడి గుడి ఉంటే కారు ఆపి దిగి, గుంజీళ్ళు తీసి, చెంపల మీద లెంపకాయలేసుకుని ఇంకెప్పుడూ ఇలా రాయనని నా లా ఒట్టుపెట్టుకోండి. ఆ తర్వాత మీ కర్తరీ ప్రయోగాన్ని మాని వచ్చింది వచ్చినట్లు అందరు సంపాదకుల్లాగా సర్వం జగన్నాథం అని చేతులెత్తి దణ్ణం పెట్టుకుని అచ్చెయ్యండి.
రచయితల సంగతి నా లాంటి నోటిదురుసు వెధవలకి అభిప్రాయ వేదిక పై అప్పగించి మీరు తప్పుకోండి. అప్పుడు చూడండి ఊచ కోత, కాదు దవ్వకోత, కాదు దూట కోత. ఏదో ఒక కోత లేండి.
మీరేదో మంచి చేద్దామని చర్చావేదికలూ గట్రా ప్రారంభించినట్లున్నారు. ఆ పప్పులేం ఇక్కడ ఉడకవు. కత్తులు దుయ్యాలి, పదిమందిని (ముఖ్యంగా మిమ్మల్నీ, మీ ఉప సంపాదకుల్నీ, మీ పత్రికనూ) దుయ్యబట్టాలి. ఖబడ్దార్!
ఇకపోతే మీరిచ్చిన సలహాలను మీరే పాటించి రచయితల్ని మాత్రమే కాక ఉచితమైన అభిప్రాయాలను తెలియజేసే నాలాంటి అభిప్రాయోత్తములను కూడా దువ్వితే మేము విజృంభించమని,మీపై ధ్వజమెత్తమని హామీ ఇస్తున్నాను.
నేను మీరిచ్చిన “పాఠకులకు సూచనలు” చదువలేదు. నామమాత్రంగా దాని పక్కన గల పెట్టెలో ప్రమాదవశాత్తు ముద్రవేయుట జరిగిందని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.
ఈ ఒక్కసారి మాత్రము మీ విశాల హృదయమతో ఈ సందేశాన్ని అనుమతిస్తారని భావిస్తూ
పామర్తి సత్యనారాయణ
malathi nidadavolu అభిప్రాయం:
May 12, 2009 2:30 am
నా వ్యాఖ్యలో స్పష్టంగా లేనిది -. ఒకరచనమీద ఆరచయితకి ప్రత్యేకంగా, ప్రైవేటుగా ఆ రచనని పరిపుష్టం చెయ్యడానికి సంపాదనలు ఇస్తున్న సూచనలు. వాటివల్లే కదా రచయితల అహంకారం ప్రసక్తి వచ్చింది.
Srinivas Nagulapalli అభిప్రాయం:
May 12, 2009 6:13 am
“సంపాదనలు” ఇవ్వడం లేదు, శ్రమించే సంపాదకులకు, రచయితలకు:-)
అచ్చు తప్పని తెలిసినా చెప్పడం మన్నించాలి. రచనలగురించి ప్రసక్తి కదా. తీసుకొస్తేనే ప్రసక్తి, తీసుకురాకపోతే విరక్తి. ఏమో!.
____
విధేయుడు
_Srinivas
rama bharadwaj అభిప్రాయం:
May 12, 2009 11:15 am
పొరపాటుగానే అయినా ఒక ముఖ్య విషయం ప్రస్తావనకు రావటం మంచిదే అయింది. అది “సంపాదన”.గురించి. లోకం మొత్తంమీద తన శ్రమకి తగిన “కూలి” ఏ కోశానా.. గిట్టనిది ఒక్క తెలుగు రచయితకే… అన్న ది జగద్విదితం!! తెలుగుదేశంలోని పత్రికల్లో మంచి కవితకీ.. కాని కవితకీ కూడా ఒకటే రేటు. మీరు ఎంత గొప్ప కవితనైనా రాయండీ..మీకు వారిచ్చేది..ఒక 150రూపాయలు మాత్రమే!! గొప్పవ్యాసం రాసినా అంతే పారితోషికం.!! మరి ఇది రచయిత బుధ్ధి పరిశ్రమని కారుచౌకగా దోచుకోవటమే కదా? ఈమాట లో అచ్చయ్యే వాటికి “అంతర్జాతీయ ప్రమాణాల”కి ధీటుగానే ధర చెల్లిస్తారేమో..నాకు తెలీదు మరి.
నా ఉద్దేశ్యంలొ మంచి రచనలు రావాలంటే మంచి పారితోషికం చాలా ముఖ్యం. అక్కడ మార్పు లేకుండా..ఏమీ కిమ్మనకుండా.. “పెద్ద రచయితలు” రాయడంలేదని ఊరికే వగచినా..అనవసరంగా రచనలు పంపని వారిని ఆడిపోసుకున్నా… లాభం ఏముంటుందీ??
రచనలు కావాలీ..కానీ వారి అక్షరానికి కిట్టుబాటు ధర కల్పించం..అన్న వైఖరి అయాచితంగా రచయితల కల్పనాశక్తిని దోచుకోవటమే అవుతుంది. అందుకే పత్రికలకి అరుదుగా తప్ప చెప్పుకోదగ్గ రచనలు రానిది.ఈపాటి భాగ్యానికి వచ్చిన రాతల్తో సరిపెట్టుకుని నడుపుకోవటమే పత్రికని. అందుట్లో పస లేదని అనుకున్నా ఫలితమేముందీ?? ఊరికే వచ్చింది ఉత్తమం కాదా?!ఆలోచించండి.
రమ.
[విస్తృత చర్చకు వీలుగా ఈ అభిప్రాయం చర్చావేదికలో కూడా వుంచబడింది.]
mOhana అభిప్రాయం:
May 12, 2009 1:08 pm
సంపాదన లేని సంపాదకులు,
రాబడి లేని రచయితలు,
తీరుబడి లేని పాఠకులు
Made for each other!
విధేయుడు - మోహన
రాకేశ్వర రావు అభిప్రాయం:
May 20, 2009 9:18 am
ఈ వ్యాసం మీరు ఒక ఏఁడాది ముందు వేసుంటే, నా తరఫునుండి మీకు ఒక బాణం మినహాయింపుగలిగేది. నేను ఈ-మాటకు పంపేముందు ‘దాన్ని’ ఇద్దరు బుల్లి సంపాదకులకు పంపాను. వారిదగ్గర ఈ చిట్కాల చిట్టా లేక పాపం కాదనలేకపోయారు. నా కవిత ఎంత సక్సో (ఈ పదప్రయోగం తప్పుటకాలేదు, దాని వలన అశ్లీల పాళ్ళు పెరగకుండ ప్రార్థన ) నాకు తరువాత తెలిసిందనుకోండి. స్నేహితుల్ని సంపాదకులుగా పెట్టుకోకూడదన్నమట :). ఇలా పలు సార్లు పలు చోట్ల యాచాయాచితాలుగా జరిగిందనుకోండి. అయినా నేర్చుకునేవయస్సుగా, పర్వాలేదు.
చాలా ధైర్యం కావాలి ఒక పూర్తి స్థాయి ఈ-పత్రికకు ఇలాంటి వ్యాసం ప్రచురించడానికి. ఇలాంటివి సాధారణంగా నాలాంటి విప్లవాత్మక బ్లాగర్ల బ్లాగుల్లో కనిపిస్తుంటాయి. అక్కడుకూడా వెటకారమాడినప్పుడు జనులు గర్హించేవారు. అతిథి దేవోభవః అన్నట్టు రచయితదేవోభవః అని ఏదైనా సూక్తి పాటిస్తాయేమో ఈ పత్రికలు అనుకుంటే పప్పులో కాలేసినట్టేనన్నమట.
ఏదీ ఏమైనా ‘కొన్ని’ మంచి ఆచరణీయ సూక్తులు చెప్పారు. యాచిత రచయితల అహాల గుఱించి సగటు పాఠకునికి పెద్ద పట్టింపు లేకపోయినా, రచనల గుఱించి చేసిన సూక్తులు ఆచరణీయములుగా బాగున్నాయి (పునరుక్తి వ్యాఖ్యలకు వర్తించదుగదా కంపఁదీసి). కానీ మీరు FYEO అని మీ మామూలు సంపాదకులుకుఁ జెప్పి మఱీ ఈ ఉత్తరం వ్రాసారు కాబట్టి రచయితల వ్యక్తిత్వాల గుఱించి వ్రాయడం సబబే. కానీ అలా ఎప్వైవోయూ అని చెప్పినా ఎవరో లీకు చేసారంటే, అలాంటి వారికోసం లీకు చేయకూడదంటూ ఇంకో ఎప్వైవోయీ ఉత్తరం వ్రాయవచ్చు. అది లీకైతేనో ???
పునరుక్తి గుఱించి ఒక్క మాట, పైన మోహన గారు, శ్రీనివాసు గారు ప్రస్తావించే పునరుక్తి మీ పునరుక్తి వేఱు వేఱు (మళ్ళీ మళ్ళీ క్షమించగలరు) అనుకుంట. వారు ప్రస్తావించింది అచ్చమైన పునరుక్తి, మీరు ప్రస్తావించింది అదే భావనను పునరుక్తి చేయడం అనుకుంట. ఉదా- నేను ఎప్పుడో వ్రాసిన కాపలాదారు కవితలో అచ్చపునరుక్తి లేకపోయినా, ఒక విషయాన్ని మరలా మరలా (యఱ్ఱ్.. మరలా మరలా క్షమించగలరు) చెప్పినందుకు, పునరుక్తి వచ్చింది రాకేశ్వర తస్మాజ్జాగ్రత్త అని గురువులు హెచ్చిరించడం జరిగింది.
కొసమెఱుపు - ఒక సారి నాతోనొక సదరు బుల్లి సంపాదకులు (’ఒక సదరు’ తప్పైతే క్షంతవ్యుడను) చెప్పారు, “పెట్టుబడిదారువ్యవస్థ వచ్చింతరువాత ఎవరైనా వ్యవస్థాపకులే, బ్లాగులు వచ్చింతరువాత ఎవరైనా రచయితలేనని”. ఎంత నిజం.
మీరాకేశ్వర.
త.క- పాఠక దేవులకు సైతం సూచనలనమట. లెస్స లెస్స.