ఒక తెలుగు పుస్తకం కావాలి
బైబిల్, డిక్షనరీ ల తరువాత అమెరికాలో విరివిగా అమ్ముడు పోయిన పుస్తకం విలియమ్ స్ట్రంక్ (William Strunk, Jr.) ఇ. బి. వైట్ (E. B. White) రాసిన ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్ (The Elements of Style) అనే నూరు పేజీల పుస్తకం. ఇప్పటికి పది మిలియనుల పైచిలుకు కాపీలు అమ్ముడు పోయాయి. ఈ పుస్తకానికి యాభై సంవత్సరాలు నిండాయి. ఇంగ్లీషుమాటల వాడుకకు ఏడు నియమాలు, రచనకి ఉపయోగపడే పదకొండు సూత్రాలు, రచన రూపం నిర్దేశించే కొన్ని వివరాలు, రాసేటప్పుడు చాలామంది చేసే కొన్ని దుష్ప్రయోగాలు - ఇవి, ఈ పుస్తకంలో కూర్చబడ్డాయి.
ఈ పుస్తకం చరిత్ర విచిత్రమైనది. 1919 లో ఇ. బి. వైట్ కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు కాంపొజిషన్ క్లాసులో విద్యార్థి. పాఠం చెప్పే మేష్టారు విలియం స్ట్రంక్. పాఠ్యపుస్తకం మేష్టారు రాసి అచ్చు వేసుకున్న నలభైమూడు పేజీల పుస్తకం - ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్.
ఇ.బి. వైట్, ది న్యూ యార్కర్ (The New Yorker) వారపత్రిక సంపాదకుడుగా పనిచేసాడు. 1957 లో వైట్ ఈ పుస్తకాన్ని ప్రశంసిస్తూ ఆ పత్రికలో ఒక వ్యాసం రాసాడు. అప్పటికి ప్రొఫెసర్ స్ట్రంక్ చనిపోయి చాలాకాలం అయ్యింది. మేక్మిలన్ ప్రచురణ సంస్థ ప్రోద్బలంతో వైట్ ఆ పుస్తకానికి సవరణలు చేసి, రచనా రీతి, పద్ధతిపై ఒక కొత్త అధ్యాయం చేర్చి 1959 లో ప్రచురించాడు. ఆ తరువాత ఈ పుస్తకానికి నాలుగు ఎడిషన్లు వచ్చాయి. ఈ సంవత్సరం యాభయ్యవ వార్షిక ప్రతి అచ్చయ్యింది. ఇప్పటికీ ఇది నూరు పేజీల పుస్తకమే!
ఈ పుస్తకంలో సూత్రాలని సంప్రదించని వ్యాసకర్తలు గాని, నవలా రచయితలు గాని, కవులు గానీ ఉండి ఉండరు. ఇది అతిశయోక్తి కాదు. ఉదాహరణకి, రిచర్డ్ ఫోర్డ్ (Richard Ford), జే పరిని (Jay Parini), డేవిడ్ రెమ్నిక్ (David Remnik) , డొరొతీ పార్కర్ (Dorothy Parker) , స్టీవెన్ కింగ్ (Stephen King), జాన్ అప్‌డైక్ (John Updike), రాబర్ట్ పిన్‌స్కీ (Robert Pinsky), లాంటి ప్రసిద్ధ రచయితలు ఈ పుస్తకానికి నివాళులర్పించారు.
ఇది ఇంగ్లీషులో రచనలకు సంబంధించిన విషయం. ఇంగ్లీషు రచయితలకి ఉపయోగపడే విషయం. తెలుగులో రాసే వారికి దీని ప్రస్తావన ఎందుకు అని అడగవచ్చు. ఆ ప్రశ్నకి సంజాయిషీ ఇచ్చుకునేముందు, తెలుగులో ఇప్పటి రచనా విధానం గురించి ముచ్చటించుకుందాం.
మనలో చాలామంది వాడుక భాషలో రాస్తారు. అయినా, మాట్లాడినట్టుగానే రాయరు. రాసేటప్పుడు వాక్యనిర్మాణం మాట్లాడేటప్పటి వాక్యనిర్మాణంలా ఉండదు. అలా ఉండాలా, వద్దా అన్న ప్రశ్నని కాస్సేపు పక్కకు పెట్టి, మనం రాస్తున్న భాషకి వ్యాకరణ సూత్రాలు ఏమిటి, ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించుకుందాం. ఇప్పటి వరకూ మనకి వాడుకభాష వ్యాకరణంపై పుస్తకం లేదు. చిన్నయసూరిగారి పుస్తకం మనలాంటి వాళ్ళు రాయడానికి ఉపయోగపడదని మీకు తెలుసు.
అచ్చు యంత్రం రాకముందు తెలుగు రచనలలో విరామస్థాన సూచికలు లేవు. మొట్టమొదటిసారి అచ్చయిన చాలా పాత గ్రంధాలు చూడండి. మాటకీ మాటకీ మధ్య జాగా కూడా ఉండేది కాదు. ఇప్పుడు అలా అచ్చు వేస్తే చదవడం ఎంత కష్టమో ఆలోచించండి. కామా, ఫుల్‌స్టాప్, కోలన్, సెమికోలన్, కొటేషన్ మార్కులు, మాటకీ మాటకీ మధ్య జాగా మొదలైన చిహ్నాల వాడకం పుస్తకాలు విరివిగా అచ్చువెయ్యడం మొదలైన తరువాతనే పెరిగింది. ఇది ఇంగ్లీషు ప్రభావమే. ఇప్పటికీ వాక్యంలో ఎప్పుడు, ఎక్కడ ఏ విరామచిహ్నాలు పెట్టాలో సూచించే పుస్తకం లేదు. అంతే కాదు, వాడుకభాషలో రాసినప్పుడు వాక్యనిర్మాణం ఎట్లా ఉండాలో నేర్పే పుస్తకం లేదు.
ఉదాహరణకి ఈ సంపాదకీయంలో మొట్టమొదటి వాక్యం తీసుకోండి. ఎక్కడెక్కడ కామాలు పెట్టడం అవసరమో, ఎక్కడ అనవసరమో నిర్దేశించే పుస్తకం లేకపోవడం వలన, నా ఇష్టమైన చోట నేను విరామచిహ్నాలు పెట్టుకుంటాను. దీనిని పరిష్కరించే ఎడిటర్ తనకు తోచినచోట తాను విరామచిహ్నాలని పెడతాడు. నా వాక్యనిర్మాణ సరళి, దాని విమర్శ కాసేపు మరిచిపోదాం. నా మొదటి వాక్యంలో ఎక్కడా విరామ చిహ్నాలు పెట్టకపోతే వాక్యం చదివి అన్వయం చేసుకోవడం ఎంత కష్టమో ఆలోచించండి.
స్ట్రంక్ అండ్ వైట్ పుస్తకంలో సూచించిన విరామ సూత్రాలు కొద్ది మార్పులతో మనకి కూడా ఉపయోగ పడతాయి.
పోతే, వాక్యనిర్మాణం. ఆ మొదటి వాక్యమే తీసుకోండి - స్ట్రంక్, ఇ. బి. వైట్ రాసిన ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్ అనే నూరు పేజీల పుస్తకం, బైబిల్, డిక్షనరీల తరువాత అమెరికాలో విరివిగా అమ్ముడు పోయిన పుస్తకం. ఈ రకమైన వాక్య నిర్మాణం సూటిగా ఉన్న నిర్మాణం. బహుశా, పాఠకుడికి తేలికగా అర్థమవవచ్చు. వాక్యనిర్మాణం గురించి వాళ్ళ పుస్తకంలో ఇచ్చిన అన్ని సూచనలూ మనకి ఉపయోగపడవు. నిజమే! పాఠకుడిని దృష్టిలో పెట్టుకొని రచనలని మెరుగు పరిచే కొన్ని సూత్రాలు తెలుగు రచనలకి కూడా ఉపయోగ పడతాయి. ‘ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్’ వంటి పుస్తకం తెలుగులో తయారు చేసుకోవలసిన అవసరం ఉన్నదని నేను నమ్ముతున్నాను. అందుకని ఆ పుస్తకప్రస్తావన తెచ్చాను.
రచనారీతి, పద్ధతి - అంటే స్టైల్ (style) అని నా భావం. వీటిని నిర్దేశించడం ఏ భాష లోనూ సాధ్యమైన పని కాదు. అది వ్యక్తిగత విషయం. మహా కవులెందరో వ్యాకరణ సూత్రాలని ఉల్లంఘించి రాసారు. అటువంటి రచనలు చదివినప్పుడు, వ్యాకరణ సూత్రాలను మరిపించే మహత్తరమైన విశేషమేదో మనమనసుకి హత్తుకొనిపోతుంది. ఆ రచనారీతి అందరికీ సాధ్యం కాదు కాబట్టి, స్ట్రంక్ అండ్ వైట్ పుస్తకం లాంటిది మనకి అవసరం.
రచయితలకేనా ఇటువంటి సూత్రాల పుస్తకం అని అడగచ్చు. ఎడిటర్లకు కూడా ఇటువంటి పుస్తకం అవసరమే! ఇంగ్లీషు ఎడిటర్లకి ఉపయోగపడే పుస్తకం ఆర్థర్ ప్లాట్నిక్ (Arthur Plotnik) రాసిన ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎడిటింగ్, ఎ మోడర్న్ గైడ్ ఫర్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ (The Elements of Editing, A Modern Guide for Editors and Journalists), 1982 లోనే వచ్చింది. కానీ, అందులో చాలా వివరాలు జర్నలిస్టులకి ఉపయోగపడతాయి. జర్నల్స్ సంపాదకులకి అంతగా ఉపయోగపడవు.
తెలుగులో తయారు చేసుకునే పుస్తకం, రచయితలకి, జర్నలిస్టులకి, ఎడిటర్లకి, ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఇది ఎంత చిన్నదిగా ఉంటే అంత మంచిది. ఆఖరిగా మిలియన్ డాలర్ల ప్రశ్న.
పిల్లి మెడలో గంట కట్టేదెవరు?
lyla yerneni అభిప్రాయం:
May 1, 2009 2:10 pm
పిల్లి మెడలో గంట కట్టేదెవరు? -వేలూరి వేంకటేశ్వర రావు
అంటే? అందరికీ పనికొచ్చే ఆ పుస్తకం ఎవరు రాస్తారూ అనేనా? మీరే :-)ఎందుకంటే మీకు చిన్నయ సూరి వ్యాకరణము అంతా అర్థమవుతుంది.
That grammar book also appears to me, as a simplified manual, small in size, written to give guidance to the writers of his time. If it is outdated, update it. Such technical manuals need updating.
Take cinnaya suri’s grammar -simplify, modify, modernize the rules. Discard and add rules , as you see fit and give us the new Telugu grammar/style book / ‘తెలుగులో రాయటమెలా?’ అన్న పుస్తకం.
What is so hard about that? And who says no, if you want to do it? Not me.
లైలా
Rao Vemuri అభిప్రాయం:
May 1, 2009 4:16 pm
నేను నిఘంటువుని నిర్మించిన సందర్భంలోనే ఒక వ్యాకరణం “పుస్తకం”, ఒక స్టయిల్ “పుస్తకం” కూడ రాసుకున్నాను. స్ట్రంక్ ఎలిమెంట్స్ అఫ్ స్టయిల్, వెబ్‌స్టర్ నిఘంటువు నా బల్లమీద ఎప్పుడూ ఉంటాయి. నా స్ట్రంక్ ని ఎవ్వరో కాజేశారు; అదీ మంచికే అని ఊరుకున్నాను. ఇంతకీ ఇన్నాళ్ళూ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకపోవటానికి ఒక కారణం ఉంది. ఇప్పటికే తెలుగు మాటలు నేను మరీ ఎక్కువ వాడెస్తున్నాననీ, ఇంగ్లీషు లేకుండా తెలుగులోనే రాస్తే అర్ధం అయి చావటం లేదనీ నన్ను అందరూ ఆడి పోసుకుంటున్నారు. ఈ పరిస్థితులలో నేను రాసుకున్న శైలి పుస్తకం బయట పెడితే నా మనుగడకే ముప్పేమో అన్న బెదురుతో ఇంతవరకు ఎవ్వరికీ చూపించలేదు.
ఇది వెటకారానికి రాయటం లేదు. నేను రాసిన వ్యాకరణం పుస్తకం ఒకరికి చూపిస్తే, “తెలుగులో Ph. D. లేని నువ్వు ఈ పుస్తకం రాస్తే శంఖంలో పొయ్యని తీర్థంలా విసర్జిస్తారు. అనవసరంగా ఆయాసపడకు,” అని నాకు వారు సలహా ఇచ్చేరు.
కనుక పిల్లికి మెళ్ళో గంట కట్టే దమ్ములు నాకు లేవు. నాలాంటి అర్భకుడిని చూస్తే ఆ పిల్లే పులై కరుస్తుంది. ఈ పని వేలూరి గారే చెయ్యాలని నేను లైలా గారిని సమర్ధిస్తున్నాను.
Srinivas Nagulapalli అభిప్రాయం:
May 1, 2009 8:39 pm
నాకు తెలిసి, అటువంటి ప్రయత్నమే ఒకటి డాక్టర్ చంద్రశేఖరరెడ్డి గారు కొన్నేళ్ళ క్రింద “వార్త” పత్రికలో “మన భాష” శీర్షికగా వ్రాసిన వ్యాసపరంపర అనిపిస్తుంది.
సాధ్యమైనంత ఎక్కువ మందికి సాధ్యమైనంత తక్కువ వెలతో అందించే విధంగా నూరు వారాలపాటు ధారావాహికంగా సాగిన ప్రయత్నం, రచయిత పరిశ్రమకూ, అప్పటి “వార్త” సంపాదకులైన శ్రీ కె.రామచంద్రమూర్తి గారి దార్శనికతకూ, ఇప్పుడు కూడా ఆశ్చర్యపడుతుంటాను. ఆ నూరూ వ్యాసాలను సంకలం చేసి “మన భాష” అనే పేరుతో 2001 లో పుస్తకంగా ప్రచురించారు. అది భాషా పరిజ్ఞాన సాధనకు చాలా ఉపకరమైన రచన అని బూదరాజు రాధాకృష్ణ గారు బహుధా ప్రశంసిస్తూ “పరిచయం” వ్రాసారు. భాషాపరంగా, వాడుక పరంగా అది తెలిపిన ఎన్నో విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి.
Elements of Style లో అన్య భాషాలోనుంచి ఇంగ్లీష్లోకి చేరిన పదాలను ఎట్లా ఏ రూపంగా వాడాలి అన్న ప్రస్తావన లేదు, సంశయాలు లేవు కాబట్టి! కాని తెలుగుకు సంస్కృతానికి పెద్ద సంబంధమే ఉంది. “ఏది తెలుగు - ఏది సంస్కృతం”,
“తద్భవాలా - తత్సమాలా”, “శషలు తెలుగులో లేవు”,
“తత్సమాలు ఏర్పడే పద్దతి” “భాషల పరస్పర ప్రభావం” మొదలగు ఎన్నో అంశాలు, పొరపడే ప్రయోగాలు, పదాలు
ఉన్నాయందులో.
ముఖ్యంగా, పత్రికలో వచ్చింది కాబట్టి సాధారణ పాఠకులకు అందుబాటులో ఉండి, ప్రతి అంశం రెండు పేజీలకు మించకుండా (రెండువైపులున్న ఒక్క పేజీనే!) ఒక చక్కని Style లో ఉంది.
ఎప్పుడు చదివినా ఏవో కొత్త అంశాలు (నాకు!) నేర్పే పుస్తకం. సందర్భం వచ్చింది కాబట్టి దాని ఉనికిని తెలియజేసే ప్రయత్నం
మాత్రమే. ఆ పుస్తకమొక్కటే సరిపోతుందని కాదు. ఆ కృషి మాత్రం గుర్తించదగింది, ఇంకా విస్తరించదగింది అనుకుంటాను.
———
విధేయుడు
-Srinivas
దుప్పల రవికుమార్ అభిప్రాయం:
May 1, 2009 8:48 pm
బూదరాజు రాధాకృష్ణ ‘భాషా స్వరూపం’ “ఈనాడు” అచ్చేసింది. కానీ, అన్ని విలువల్నీ క్రమక్రమంగా వదిలేసిన ఈనాడు ఆ పుస్తకాన్ని కూడా పక్కన పెట్టేసింది. కానీ అది జర్నలిస్టులకు ప్రామాణికంగా పనికొచ్చేది …అస్పష్టత లేని వాక్యం రాయడం కోసం. కాబట్టి ప్రాచీ పబ్లికేషన్స్ పూనుకొని ఆ పుస్తకం కూడా ప్రచురిస్తే మీరన్న దిశలో ఒక మంచి పుస్తకం తెలుగులో విస్తృతంగా చలామణీలోకి వస్తుంది.
sUryuDu అభిప్రాయం:
May 2, 2009 6:50 am
బాగుంది, అనుకోకుండా నిన్న బ్లాగులో కామెంటులో ఈ పుస్తకాన్ని ప్రస్తావించాను, దానికి 50 సంవత్సరాలు నిండాయని చూసుకోలేదు. చాలా మంచి పుస్తకం.
సూర్యుడు :-)
rajasankar kasinadhuni అభిప్రాయం:
May 2, 2009 7:50 am
రచనలు ఎలా ఉండాలి అన్న అంశం మీద సోమర్సెట్ మామ్ (William Somerset Maugham)ఒక మంచి వ్యాసం వ్రాసాడు. ఈ వ్యాసం శీర్షిక “Three aims for writers”. ఈ వ్యాసంలో ముఖ్యంగా చర్చింపబడిన అంశాలు మూడు. అవి “Lucidity, Simplicity and Euphony”. ఒక శిల్పి తన పనిముట్లతో ఒక అందమైన శిల్పాన్ని చెక్కినట్టు, ఒక రచయిత(త్రి) ఈ మూడు పనిముట్లతో ఒక చక్కని రచనని సృష్టింపవచ్చు అని అంటాడు మామ్. అందరూ చదవదగ్గ మంచి వ్యాసం ఇది.
చిన్నయ సూరి తెలుగు వ్యాకరణం మీద పుస్తకం వ్రాయాలని ప్రయత్నించి మూడు సార్లు విఫలమయ్యాడు. నాలుగవ సారి బాల వ్యాకరణం వ్రాయడంలో సఫలీకృతుడయ్యాడు. దీనిని ఆధునీకరించడం అంత తేలిక కాదేమో (though not impoissible for someone like Sri Veluri).
రాజాశంకర్ కాశీనాథుని.
B.R.Bapuji అభిప్రాయం:
May 8, 2009 10:04 pm
Venkateswara rao garu,
Forgive me for writing in English script as I am not familiar with the Telugu typing.
Your concern is genuine.
Though you are looking for a book or a manual that illustrates the rules of speaking and or writing (in other words of Grammar), a similar if not identical book or some sort of manual was brought out by Ranganayakamma garu under the title , ‘vaaDuka bhaaSee raastunnaamaa?’ about 20 years ago and it is being reprinted till today. It is based on ten year data collected from various newspapers, essays and other writings and discussed at length. Some journalists [e.g. Nanduri Ramamohara Rao garu, K.Ramachandra Murthy garu] felt it was very helpful to those who want to write modern colloquial Telugu either in news papers and or other writings.
If you have already read the book and yet feel the need of a separate grammar book or manual you may kindly ignore this piece of information..
B. R.Bapuji.
Professor, Centre for Applied Linguistics and Translation Studies, University of Hyderabad..
[brbapuji@yahoo.com]
afsar అభిప్రాయం:
May 16, 2009 11:58 am
అనేక వెబ్ పత్రికలు, ఇతర కొత్త ప్రచురణ సాధనాలు పెరుగుతున్న ఈ కాలంలో తెలుగులో వొక శైలీ పుస్తకం చాలా అవసరం. ఈ అవసరాన్ని గుర్తించే విలువయిన వ్యాసం రాసినందుకు వేలూరి గారికి ధన్య వాదాలు. రచన - సృజనాత్మకమయినా, విమర్శ నాత్మకమయినా - కొన్ని సూత్రాలకు, నియమాలకు కట్టుబడి వుండడం వల్ల రచనకి అది బలమే. తెలుగు వాళ్లు సహజంగా ఆవేశజీవులు, ఆగ్రహ భావుకులు. విపరీతంగా పొగడ్డమో, తెగడ్డమో అలవాటయిన వాళ్లం. అందుకే, విమర్శ పేరిట వచ్చే చాలా రచనలు చివరికి కేవలం అర్ధ రహితమయిన ప్రశంసలుగా మిగిలిపోతుంటాయి. ఇక తెగడ్డం తూలనాడ్డంతో సరితూగుతుంది.
రాత అనేది సాధనతో సాధించుకునే విద్య. అది అచ్చు కావడానికి ముందే నలుగురు చదవడం వల్ల, నాలుగు మాటలు సరిదిద్దుకోవడం వల్ల మెరుగుపడుతుంది. తెలుగులో ఈ సాంప్రదాయం లేదు. చదివిన నలుగురూ మెచ్చుకుని తీరాలన్న పసితనపు ఉబలాటం తప్ప. పొరపాటున ఎవరయినా వేరే అభిప్ర్రాయం వ్యక్తం చేస్తే, ఇక ఆ వ్యక్తిని మన చదువరుల జాబితాలోంచి తీసి పడేస్తాం. దిద్దుబాట్లు, సరిదిద్దుబాట్లు మనకి నచ్చేలా వుండాలి. తెలుగు రచయితలు, కవులు చాలా మటుకు నిరంకుశ అధికారాల్ని కోరుకుంటారు. కొన్ని తరాలుగా ఇవి మొద్దు బారిన చర్మాలు. వీటి మీద చర్నాకోల లాంటి పదాలూ, వాక్యాలు తప్ప ఇంకేవీ పనిచెయ్యవు. అందుకే, సున్నితమయిన శైలీ పుస్తకాలు ఇక్కడ పనికి రావు.
తెలుగులో అచ్చు అనేది అచ్చోసిన ఆంబోతు లాంటిది. మనకి అచ్చు యంత్రాలు వచ్చాయి గాని, అచ్చు నియమాలు ఏమీ రాలేదు. అచ్చుకి సంబంధించిన భౌతిక ఏర్పాట్లు తప్ప నిజంగా అచ్చు సంస్కృతి రాలేదు. ఆ మాట కొస్తే, తొలి తరం ప్రచురణ కర్తలకి వున్న పాటి సంస్కృతి కూడా ఇవాళ మిగల్లేదు. ఒక రచన అచ్చుకి పంపడానికి ముందు ఏ ఏ దశలు అవసరమో ఆ ఆ దశల పట్ల మనకి శ్రద్ధ లేదు. అందుకే, రంగుల మయంగా కనిపించే ఇవాళ్టి ప్రచురణల కన్నా, ఆ నాటి వావిళ్ల, దేశి, ఆదర్శ, దక్షిణ భాషా సంస్థ ప్రచురణలు అందంగా కనిపిస్తాయి. ఆ అందం వాటి భౌతికత నించి రాలేదు, నిస్సందేహంగా అవి పాటించిన శైలీ నియమాల నించి వచ్చిందే అనుకుంటాను. అచ్చు తప్పులు లేక పోవడం కూడా ఆ నియమాల్లో భాగమే. ముందు తరాల సంపాదకులకు కూడా శైలి పట్ల ఆ గౌరవం వుండేది. ఈ తరంలో ఆ గౌరవాన్ని నిలిపే సంపాదకులు లేరు. అసలు సంపాదకుడి పాత్ర మీదనే ఇప్పుడు గౌరవం లేదు. ముఖ్యంగా అచ్చు గౌరవాన్ని పోగొట్టడంలో తెలుగు దిన పత్రికల పాత్ర పెద్దది. తెలుగు దిన పత్రికలన్నిటికీ నిజానికి శైలీ పుస్తకాలున్నాయి. అవి ఎవరూ పాటించిన పాపాన పోరు. అసలు అక్షరం ముక్క రాయడం వస్తే చాలు అనే స్థితికి దిన్ పత్రికల మార్కెట్ దిగజారి పోయినప్పుడు నిజమే, శైలి ఆందని ద్రాక్ష పండు మాత్రమే ! ఇప్పుడు సాహిత్యాన్ని పోషించేది కూడా ఈ దిన పత్రికలే కాబట్టి, సాహిత్య శైలి కూడా అంతే!
ఈ స్థితిలో వేలూరి వ్యాసం ఒక చూపుడు వేలు. అది కొందరి కళ్ళల్లో గుచ్చుకోవడం సహజమే! కాని, కాస్త నిగ్రహంగా ఆలోచిస్తే, ఈ వేలు ఒక మంచి రచనా సంస్కృతి వైపు దారి చూపిస్తుంది. మంచి ఆలోచనల్ని అక్షరాల్లోకి అనువదించే మంచి రాత ఆ సంస్కృతికి పునాది. ఇది నేర్చుకుంటే వచ్చేది తప్ప సహజ పాండిత్యం మాత్ర) కాదు. ఆ మాటకొస్తే, సహజ పాండిత్యం ఒక ఆత్మ వంచన, భ్రమ. అలా నేర్చుకోవడానికి మన తెలుగు వాళ్లు సిద్ధంగా వున్నారా అన్నది ప్రశ్న. అసలు నేర్చుకోవడం అనే ప్రక్రియ మీద మనకి గౌరవం వుందా? ఆ గౌరవం లేకపోతే , రాత నియమాలు మనకి పనికి రావు.
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
May 17, 2009 8:32 pm
వేమూరి గారి అభిప్రాయం చదివి ఆశ్చర్యపోయాను. తెలుగులో భాషాపరమైన డిగ్రీ ఏదీ లేకుండానే ఆయన నలుగురికీ ఉపయోగపడే నిఘంటువు నొకదానిని నిర్మించారు. మరి ఎవరో ఏదో అంటారని భయపడి శైలి మిద రాసిన పుస్తకాన్ని అచ్చువెయ్యకపోవడమేమిటి? అనుభవజ్ఞులు కూడా ఇలా వెనుకంజ వెయ్యడం చాలా నిరాశ కలిగిస్తుంది.
ఇక్కడ ప్రస్తావించిన - రంగనాయకమ్మ, బూదరాజు, దుర్గెంపూడి ల - పుస్తకాలు చెప్పుకోదగ్గవే కాని, అవేవీ, ఒంటిగా కానీ జమిలిగా కానీ, క్లుప్తత, సమగ్రత లలో Strunk and White కి సాటిరావు. కావాలంటే, “Elementary Principles of Composition,” కి సమాంతరమైనది ఈ పుస్తకాలలో ఏమైనా ఉందేమో చూడండి. వారి ప్రయత్నం ఎంతో మెచ్చుకోదగ్గదే అయినా, దానిని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
అఫ్సర్ గారి లాంటి విద్యావేత్తలు, అలాంటి పుస్తకాలకి ఆదరణ ఉంటుందా లేదా అని అనుమాన పడకుండా, వాటి అవసరాన్ని గుర్తించి దానినో కర్తవ్యంగా తీసుకొని రాయాలి. ఫ్రొఫెసర్ Strunk చేసిందదే.
కొడవళ్ళ హనుమంతరావు
Savithri Machiraju అభిప్రాయం:
May 22, 2009 7:37 am
I think the problem is not lack of a style book in Telugu, but lack of instruction in any kind of writing in any language. Have any of you seen the kind of English writing produced by any of our “English medium” educated graduates? People don’t seem to know even the most basic grammar such as that a sentence should have a subject and verb, Whether in English or Telugu, this requirement doesn’t change.
Other frequent mistakes I have seen, even in published stories, is a confusion between first person and third person when narrating. That is, a story starts out being written in the first person, but part way through, the author starts referring to the first person character in the third person. E,g: “నేను చాలా అలసిపోయాను. నీరసంగా వనక్కి వాలాడు అతను.” Or “ఆమె నిర్లక్ష్యానికి నాకు చాలా కోపం వచ్చింది. ఇలా ఈసడిస్తే తనకెలా ఉంటుంది?”
And finally, we have the wholesale importation of English verb forms and usages, such as the passive voice (which doesn’t exist in Telugu) — e.g.: “అతన్ని ఎవరో చంపారు” అనకుండా, “అతను చంపబడ్డాడు” - or strange imitation of the present progressive tense into Telugu — e.g. “ఆమె స్నానం చేసింది” అనకుండా, “ఆమె స్నానించింది” అనడం.
Talking of tenses, I have also seen quite a lot of confusion of past, present, and future tenses in published Telugu writings.
First let us correct these most elementary grammatical errors, and then we can worry about style. Punctuation, paragraphing, and conciseness are second level skills for which the basis is yet lacking.
But I second the suggestion that Vemuri garu should publish his style book.