రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మనకు తెలియని మన త్యాగరాజు – 5

రచన: సాయి బ్రహ్మానందం గొర్తి
మే 2009

వేదాద్రిసదశ ముదిలియార్

గోవింద మరారూ, త్యాగరాజుల సమావేశం గురించి ఎన్నో వివరాలు ఎం.ఎస్ రామస్వామి అయ్యర్ సేకరించారు. ఈ గోవిందమరారుతో పాటు వడివేలూ, మరో ట్రావెన్ కోర్ ఆస్థాన విద్వాంసుడు నల్లతంబి ముదిలియార్ వెళ్ళినట్లుగా రాసారు. నల్లతంబి ముదిలియార్ అన్న కొడుకు సులోచన ముదిలియార్ నడివయస్సులో ఉండగా త్యాగరాజుని కలిసాడు. సులోచన ముదిలియార్ తంజావూరు బ్రిటీషువారి దగ్గర పనిజేసేవాడు. ఇతను రహదారులు వేయించేవాడు. వంతెనలు కట్టించేవాడు. ఇతని కొడుకు వేదాద్రిసదశ ముదిలియార్ ట్రావెన్ కోర్ హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా పనిజేసాడు. తండ్రితో పాటు కలిసి ఇతని చిన్నతనంలో త్యాగరాజుని దర్శించినట్లుగా ఎం.ఎస్. రామస్వామి అయ్యర్‌కి స్వయంగా చెప్పాడనీ రాసారు.


త్యాగరాజు తపాలా బిళ్ళ

ఈ వేదాద్రిసదశ ముదిలియార్ ద్వారా త్యాగరాజు గురించి రామస్వామి అయ్యర్‌ వివరాలెన్నో సేకరించారు. ఈ సందర్భంలోనే త్యాగరాజు వేదాంత వైఖరి గురించి ఒక ఆసక్తి కరమైన సంఘటనొకటి రాసారు. ఈ సులోచన ముదిలియార్ కి బ్రిటీషు వాళ్ళు తిన్నివెల్లి (తిరునల్వేలి) వంతెన పని అప్పగించారు. ఈ పని మీద తండ్రీకొడుకులిద్దరూ తంజావూరొచ్చారు. అప్పటికే గోవింద మరార్, త్యాగరాజుల సమావేశం గురించి ఎంతగానో విని వుండడంతో తిరువయ్యారు వెళ్ళి త్యాగరాజుని సందర్శించారు. అప్పటికే గోవింద మరారు పండరీపుర యాత్రలో చనిపోయి కొన్ని నెలలయ్యింది. సులోచన ముదిలియార్ ద్వారానే ఈ విషయం త్యాగరాజుకి తెలిసింది. అతిపిన్న వయసులో పోయాడని, “దేవుడు అతని ప్రార్థనలని వినలేదా?” అని త్యాగరాజు బాధపడుతూ ప్రశ్నిస్తే, “సృష్టి సూత్రాలని ఎవరూ మార్చలేరనీ, వాటినెవరూ ఆపలేరనీ చెబుతూ, కేవలం ప్రార్థన వల్ల నియమాలు మారవనీ “- వేదాద్రిసదశ ముదిలియార్ వేదాంత వైఖరిని చెప్పి సులోచన ముదిలియార్ ఊరడించాడనీ, త్యాగరాజు ఆ సందర్భంలో చక్రవాక రాగంలో ఈ క్రింది కృతి చెప్పినట్లుగా రామస్వామి రాసారు.

పల్లవి. సుగుణములే చెప్పుకొంటి
            సుందర రఘురామ

అనుపల్లవి. వగలెరుంగ లేకయిటు
            వత్తువనుచు దురాశచే (సుగుణములే)

చరణం. స్నానాది సు-కర్మంబులు
            వేదాధ్యయనంబులెరుగ
            శ్రీ నాయక క్షమియించుము
            శ్రీ త్యాగరాజ నుత (సుగుణములే)

ఇదే భావన స్ఫురించేలా వనాళి (లేదా వనావళి) రాగంలో ‘అపరాధములనోర్వ’ కృతినీ కూడా స్వరపరిచినట్లుగా అయ్యర్ చెప్పారు.

ఇలా త్యాగరాజుని సందర్శించిన ఎంతోమంది ద్వారా ఎన్నో వివరాలు సేకరించిన ఎం.ఎస్.రామస్వామి అయ్యర్ చరిత్ర తేదీలకీ, సాంబమూర్తి చెప్పిన వాటికీ ఎక్కడా పొంతన లేదు. త్యాగరాజూ, గోవిందమరారూ 1838లో కలిసారన్నట్లుగా రామస్వామి అయ్యర్ రాసారు. రామస్వామి అయ్యర్ చెప్పిన సంవత్సరం కొంచెం అనుమానాస్పదంగానే అనిపిస్తుంది. ఒక పక్క సులోచన ముదిలియార్ కలిసింది 1843 ఆగస్టులో అని చెబుతూ, ఆప్పట్లోనే వారిద్దరి కలయిక వార్తా అనేకమంది ఎంతగానో చెప్పుకున్నారనీ, మరోవైపు గోవిందమరారూ, త్యాగరాజు కలిసిన సంవత్సరం 1838 అని చెప్పారు. సాంబమూర్తి మాత్రం ఈ సంఘటన 1843లోనే జరిగిందని రాసారు తప్ప ఆధారాలివ్వలేదు. ఇది 1843 సంవత్సరం మొదట్లో జరిగినట్లు భావించడానికి ఆస్కారమెక్కువగా వుంది.. ఎందుకంటే అదే సంవత్సరం సుమారుగా జూన్, జులై కాలంలో గోవింద మరార్ పండరీపుర యాత్రలో చనిపోయాడు. ఈ సంగతి ట్రావెన్కోర్ రాజాస్థాన చరిత్ర ప్రతుల్లో ఉంది. ఇదే విషయాన్ని తిరువనంతపురానికి చెందిన టి. లక్ష్మణ పిళ్ళై త్యాగరాజుపై రాసిన వ్యాసాల్లో ప్రస్తావించారు. అందులో ఈ వేదాద్రిసదశ ముదిలియార్ త్యాగరాజుని కలిసినట్లుగా వుంది. ఈయన చెప్పిన తేదీలూ, సంవత్సరాలూ రామస్వామి అయ్యర్ చెప్పిన వాటితో సరిపడ్డాయి. ఇద్దరూ 1838 అని తప్పుగా పొరబడ్డారు.

అలాగే గోవిందమరార్ తో పాటు వడివేలు కూడా వెళ్ళినట్లుగా రామస్వామి అయ్యర్ రాస్తే, సాంబమూర్తి మాత్రం ఇద్దరూ విడివిడిగా కలిసినట్లు రాసారు. రామస్వామి అయ్యర్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యుడు. ఈయనేమో వీణ కుప్పయ్యర్ శిష్యుడు. కాబట్టి రామస్వామి అయ్యర్ చెప్పిన వివరాలు వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశముంది. వాలాజపేట శిష్యులు పొందుపరిచిన త్యాగరాజు జీవిత వివరాల్లో గోవింద మరారు గురించుంది. గోవింద మరారుని ప్రస్తుతించే సందర్భంలో ఎందరో మహానుభావులు కృతిని త్యాగరాజు పాడినట్లుగా చెప్పారు. సులోచన ముదిలియార్, త్యాగరాజు కలిసిన సందర్భాన్ని ఆసక్తికరమైన సంభాషణలతో రామస్వామి అయ్యర్ ఎంతో నాటకీయంగా రాసారు.

వికటకవి కృష్ణయ్యర్

తంజావూరు రాజు శరభోజి ఆస్థానంలో వికటకవి కృష్ణయ్యర్ అనే ఒక విదూషకుడుండేవాడు. త్యాగరాజన్నా, ఆయన పాటన్నా ఈయనకి ఎంతో ఇష్టం. ఈయన వచ్చినప్పుడల్లా త్యాగరాజు శిష్యులతో కలసి కచేరీ ఇచ్చేవాడు. ఓ సారి కచేరీలో హరికాంభోజి రాగంలో ‘దినమణి వంశ తిలక లావణ్య’ కృతిని స్వరపరచి త్యాగరాజు పాడుతుంటే, అక్కడే కూర్చున్న ఒక ప్రేక్షకుడు ఈ ప్రయోగం తప్పనీ, లావణ్య అన్న పదం విశేషణమనీ, కాబట్టి అది ఒక వస్తువు ముందుండాలనీ, కచేరీలో పక్కనున్న వారితో గట్టిగా చెబితే అది త్యాగరాజు చెవిన పడింది. ఆ పాట ముగించేక, ‘దినమణివంశ లావణ్య తిలకా’ అని సాహిత్య పరంగా అర్థం చేసుకోవాలని త్యాగరాజు వివరణిచ్చాడంటూ కృష్ణయ్యర్ తంజావూరు రాజదర్బారులో ఎంతో హాస్యంగా చెప్పాడని, వేదాద్రిసదశ ముదిలియార్ చెప్పినట్లుగా టి.లక్ష్మణ పిళ్ళై రాసారు. సాంబమూర్తి కథనంలో వికటకవి కృష్ణయ్యర్ రావడమూ పాట కచేరీ విషయమూ వేర్వేరుగా రాసారు.

ఒక ఉత్తర దేశపు విద్వాంసుడు

ఓసారి ఉత్తరదేశం నుండి ఒక హిందూస్తానీ సంగీత విద్వాంసుడు తంజావూరు సందర్శించినపుడు, అతని అభ్యర్థనపై, కళ్యాణి రాగంలో ‘సుందరి నీ దివ్య స్వరూపమును’ కృతిని ధర్మసంవర్ధినీ ఆలయంలో పాడితే, తన వద్దనున్న బంగారమూ, కానుకలూ అన్నీ త్యాగరాజుకి కానుకగా ఇచ్చాడనీ సాంబ మూర్తి ‘ది గ్రేట్ కంపోజర్స్’ లో రాసారు, కానీ పేరు చెప్పలేదు. ఏవరికైనా పేరు ప్రఖ్యాతులొచ్చాక వారిమీద అనేక కథలు పుట్టుకు రావడం సహజం. అలాంటిదే ఈ కథ అని అనుకోవాలి.

సంగీత త్రిమూర్తులు

త్యాగరాజు కాలం (1767 – 1847) లోనే సంగీతంలో అనేకమంది ప్రజ్ఞావంతులు ప్రపంచం నలుమూలలా జన్మించారు. తంజావూరు రాజ్యంలో 1700 – 1850 కాలంలోనూ, దక్షిణాదిన కొన్ని రాజ్యాల్లోనూ కర్ణాటక సంగీతం వెల్లి విరిసింది. కర్ణాటక సంగీతానికొక రూపూ, పద్ధతీ వచ్చిందీ కాలంలోనే! త్యాగరాజు జన్మించిన కాలంలోనే తిరువారూర్లో మరో ఇద్దరు సంగీత దిగ్గజాలు పుట్టారు. ఒకరు శ్యామ శాస్త్రి, రెండో వారు ముత్తు స్వామి దీక్షితార్. త్యాగరాజుతో కలిపి ఈ ముగ్గుర్నీ ‘సంగీత త్రిమూర్తులు’ (మ్యూజికల్ ట్రినిటీ) అని అంటారు. శ్యామశాస్త్రి 1762 లో పుడితే, 1776 లో ముత్తుస్వామి దీక్షితార్ పుట్టాడు. ఇందులో చిత్రం ఏమిటంటే ఈ ముగ్గురు వాగ్గేయకారులూ తిరువారూర్లోనే పుట్టారు. దాదాపు ఒకే సమయంలోనే జీవించారు. త్యాగరాజు చిన్నతనంలోనే తిరువయ్యారు మకాం మారిస్తే, శ్యామశాస్త్రి కుటుంబీకులు తంజావూరు వెళ్ళారు. చిన్నతనం అంతా తిరువారూర్ లోనే గడిపిన ముత్తుస్వామి దీక్షితార్ యుక్త వయసులో ఉండగా కొంతకాలం కాశీ లో గడిపాడు.

ఈ ముగ్గురూ ఒకే కాలం వారయ్యుండడం వల్ల “వీరు కలిసారా?”, “ముగ్గురికీ ఒకరికొకరు పరిచయముందా?” అన్న ప్రశ్న సహజంగా పుడుతుంది. ఈ వివరాలు తెలుసుకునే ముందు శ్యామశాస్త్రీ, ముత్తుస్వామి దీక్షితార్ల గురించి కొంత తెలుసుకోడం సముచితంగా ఉంటుంది.

శ్యామశాస్త్రి

శ్యామశాస్త్రి పూర్వీకులు తెలుగు వాళ్ళు. వీరు తంజావూరు రాజ్యానికి వలస వచ్చారు. శ్యామశాస్త్రి తండ్రి విశ్వనాధ అయ్యర్ వృత్తిరీత్యా అర్చకుడు. అప్పటి తంజావూరు రాజు తుల్జాజీ పిలుపు మీద విశ్వనాధ అయ్యర్ తంజావూరు కామాక్షి మందిరంలో అర్చకుడిగా నియమింపబడ్డాడు.

శ్యామశాస్త్రి కుటుంబంలో ఎవరికీ సంగీతంలో ప్రవేశం పెద్దగా లేదు. కాశీ నుండి సంగీత స్వామి అనే సాధువొకాయన చాతుర్మాస దీక్షకై తంజావూరొచ్చినపుడు శ్యామశాస్త్రికి సంగీతంలో వున్న ఆసక్తి చూసి సంగీతం విద్య నేర్పాడు. కేవలం మూడు నెలల్లోనే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించడం చూసి సంగీతస్వామి, తంజావూరు ఆస్థాన విద్వాంసుడైన ఆదియప్పయ్య దగ్గర సంగీతం నేర్చుకోడానికి కుదిర్చాడు. తండ్రి తదనంతరం శేష జీవితమంతా బంగారు కామాక్షి దేవాలయ అర్చకుడిగానే గడిపాడు. సుమారు రెండు వందలకి పైగా కీర్తనలు తెలుగు, సంస్కృత, తమిళ భాషల్లో స్వరపరిచాడు. ఈయనకి అతి తక్కువ మంది శిష్యులున్నారు. వీరిలో ఈయన కొడుకు సుబ్బరాయ శాస్త్రీ, పెరంబూర్ కృష్ణయ్యర్, అలుసూర్ కృష్ణయ్యర్, దాసరి ముఖ్యులు. పంజుశాస్త్రి, సుబ్బరాయ శాస్త్రీ ఈయన కొడుకులు. పెద్దకొడుకు పంజుశాస్త్రి కామాక్షి ఆలయంలో అర్చకత్వం చేసేవాడు. రెండో కొడుకు సుబ్బరాయశాస్త్రి త్యాగరాజు చివరి దశలో ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నాడు.

త్యాగరాజులా కొత్త కొత్త రాగాలు కనుక్కోకపోయినా శ్యామశాస్త్రి ప్రసిద్ధి చెందిన రాగాల్లోనే కృతులు స్వరపరిచాడు. ఆనంద భైరవీ, ధన్యాసి, కల్గడ, కళ్యాణి, కాంభోజి, కాపి, చింతామణి వంటి రాగాల్లో కృతులు స్వర పరిచాడు. సంగీత పాఠాల్లో సరళీ స్వరాలు, జంట స్వరాలు, గీతాలు, స్వరజతులు, వర్ణాలు, కృతులు అనేవి ఒక పద్ధతిలో నేర్పుతారు. వీటిలో స్వరజతి రూపకర్త శ్యామశాస్త్రి. తోడి రాగంలో “రావే హిమగిరి కుమారి”, భైరవి రాగంలో ‘కామాక్షీ అనుదినము’ వంటివి కొన్ని ప్రసిద్ధి జెందిన స్వరజతులు.

ఈ స్వరజతులే కాకుండా విలోమ చాపు తాళాన్ని కూడా శ్యామశాస్త్రి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. సాధారణంగా చాపు తాళం గతి 3 + 4 పద్ధతిలో ఉంటుంది. ఇలా కాకుండా 4 + 3 రీతిలో తాళ గతిని మార్చి కొన్ని కీర్తనలు స్వరపరిచాడు. పూర్వి కళ్యాణి రాగంలో ‘నిన్ను వినగ మరి’, ఫరజ్ రాగంలో ‘త్రిలోకమాత నన్ను’ అనేవి ఈ విలోమ చాపు తాళంలో ప్రసిద్ది చెందిన కీర్తనలు. శ్యామకృష్ణ అన్నది వీరి కృతి ముద్ర. శ్యామశాస్త్రి పుదుకుట్టయి ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడే బొబ్బిలి కేశవయ్యతో సంగీత భేటీ జరిగిందని కొంతమంది రాస్తే, ఆ కథని మరి కొంతమంది త్యాగరాజుతో జరిగినట్లుగా రాసారు. నిజానికది జరిగింది శ్యామ శాస్త్రితో!


శ్యామశాస్త్రి తపాలా బిళ్ళ

శ్యామశాస్త్రి 1827లో కన్నుమూసాడు. తండ్రి పోయిన తరువాతే సుబ్బరాయ శాస్త్రి త్యాగరాజు వద్ద శిష్యుడిగా చేరాడు. త్యాగరాజు అంత్య దశలో తిరువయ్యార్ లోనే ఉన్నాడు. పంజుశాస్త్రి ముగ్గురు కొడుకుల్లో ఒకడైన రామకృష్ణ శాస్త్రి కొడుకు, నటేశ శాస్త్రి ద్వారా శ్యామశాస్త్రి కృతుల ప్రతులు దొరికాయి. పిల్లలు లేని సుబ్బరాయ శాస్త్రి అన్నగారి ఆఖరి కొడుకు అన్నస్వామి శాస్త్రిని పెంచుకున్నాడు. ఈయన దగ్గర నటేశశాస్త్రి తాతగారు స్వరపరిచిన కృతులన్నీ నేర్చుకున్నాడు. ఈ నటేశ శాస్త్రి దాదాపు 94 ఏళ్ళు బ్రతికాడు. ఈయన 1950 లో చనిపోయాడు. ఈయన ద్వారా శ్యామ శాస్త్రి గురించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాంబమూర్తి ఈయన్ని అనేకసార్లు కలిసి శ్యామశాస్త్రి కృతుల వివరాలు సేకరించినట్లుగా రాసారు. అందువల్లే శ్యామశాస్త్రి రచనలు 1915 దాటాకే పదిమందికీ తెలియడం మొదలు పెట్టాయి.

శ్యామశాస్త్రి, త్యాగరాజు మంచి స్నేహితులని సాంబమూర్తి గారు ‘ది గ్రేట్ కంపోజర్స్’ లో రాస్తూ ఓ కథ చెప్పారు. శ్యామశాస్త్రికి తాంబూలం అలవాటు ఎక్కువగా ఉండేది. అస్తమానూ ఉమ్మి వేయడానికి కూర్చున్న చోటునుండి లేచి బయటకు వెళ్ళేవాడు. త్యాగరాజుకి ఎంతో శుభ్రతా నియమాలున్నా శ్యామశాస్త్రి వచ్చినప్పుడు మాత్రం ఆయనకు మినహాయింపుండేదని చెబుతూ కథలా రాసారు. ఇలాంటి కథలకి ఆధారాలేమిటో తెలీదు. శ్యామశాస్త్రి ఆలయ అర్చకుడు. అలా పదిమంది ముందూ తాంబూలం నమిలినా, అక్కడే ఉమ్మి వేసే ప్రవర్తనుంటుందని ఎవరూ భావించరు. ఇలాంటి కథలు పదిమందికీ చెప్పడంలో ఆంతర్యమేమిటో తెలీదు. ఈ కథ ఇద్దరు వాగ్గేయకారుల్నీ ఓ మెట్టు క్రిందకే దింపుతుందని నా అభిప్రాయం. ఈ ఒక్క సంఘటనా తప్ప, సంగీత పరంగా వేరే సంఘటనలు ఎవరూ ఉటంకించలేదు. త్యాగరాజు చరిత్ర రాసిన వెంకటరమణ భాగవతార్ కానీ, ఆయన కొడుకు కృష్ణ భాగవతార్ కానీ, మిగతా శిష్యులు కానీ ఎవరూ శ్యామశాస్త్రి గురించి రాయలేదు.

ముత్తుస్వామి దీక్షితార్

కర్ణాటక సంగీతంలో దీక్షితార్ కుటుంబానికొక ప్రత్యేక స్థానం వుంది. సంగీత త్రిమూర్తుల్లో ఒకరుగా చెప్పుకుంటున్న ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి రామస్వామి దీక్షితార్ ప్రముఖ సంగీత విద్వాంసుడు. ఈయన ‘అష్టోత్తర శత రాగ రత్నమాలిక’ అనే అతి పెద్ద కృతిని స్వరకల్పన చేసాడు. ఇది రాగయుక్తంగా ఆలాపనలతో పాడడానికి ఓ రోజు పైగా పడుతుందని అంటారు. అటువంటి సంగీత విద్వాంసుడింట 1776 లో జన్మించాడు ముత్తుస్వామి దీక్షితార్. హైదరాలీ అకృత్యాలతో తంజావూరు చుట్టుపక్కల వూళ్ళన్నీ ధ్వంసమయిపోతే, రామస్వామి దీక్షితార్ స్వస్థలమైన విరించిపురం వదిలి తిరువదమర్దూరు మకాం మార్చారు. అక్కడ నుండి తిరువారూర్ వచ్చి స్థిరపడ్డారు. ముత్తుస్వామి దీక్షితార్ పుట్టింది తిరువారూర్లోనే!


ముత్తుస్వామి తపాలా బిళ్ళ

ఓసారి మనాలి ముత్తుకృష్ణ ముదలియార్ అనే ఒక యతీంద్రుడు వచ్చినపుడు ఆయన కోరికపై ముత్తుస్వామి దీక్షితార్ని పదిహేడేళ్ళ వయసులో మిగతా కొడుకులిద్దరితోనూ తండ్రి కాశీ పంపించాడు. సుమారు పదేళ్ళు దీక్షితార్ అక్కడే గడిపాడు. అప్పటికే ముత్తుస్వామి దీక్షితార్ పెళ్ళయ్యింది. అన్నలిద్దరూ, చిన్న స్వామి దీక్షితార్, బాలస్వామి దీక్షితార్ ఏడాదిలో తిరువారూరు వెనక్కి తిరిగొచ్చేసినా ముత్తుస్వామి దీక్షితార్ మాత్రం కాశీ లోనే ఉండిపోయాడు. కేవలం గాయకుడు మాత్రమే కాదు, ముత్తుస్వామి దీక్షితార్ మంచి వైణికుడు కూడా.

సుమారు 1801 ప్రాంతంలో తిరిగి తిరువారూరొచ్చాడు. అప్పటికే బాలుస్వామి, చిన్నస్వామిలిద్దరూ జంట విద్వాంసులుగా ప్రసిద్ధి చెందారు. వీరికి మదురై ఆస్థానం నుండి పిలుపు రావడంతో అక్కడకి వెళిపోయారు. అక్కడుండగానే చిన్నస్వామి దీక్షితార్ చనిపోయాడు. అన్నగారి మరణంతో కలత చెందిన బాలుస్వామి కొంతకాలం తీర్థయాత్రలు చేసి ఎత్తియపురం రాజాస్థానంలో చేరాడు. అప్పటివరకూ అవివాహితుడుగానున్న బాలస్వామికి ఎత్తియపురం రాజుగారు దగ్గరుండి పెళ్ళి జేసారు. ఈ వార్త ముత్తుస్వామి దీక్షితార్ చెవినపడి అన్నగార్ని చూడ్డానికని వెళ్ళాడు. అన్నగార్ని కలిసాక ఎత్తియపురం ఆస్థానంలో సంగీత కచేరీ చేసే అవకాశం ముత్తుస్వామి దీక్షితారుకొచ్చింది.

ముత్తుస్వామి దీక్షితార్ తమిళ, సంస్కృత భాషల్లో ప్రవీణుడు. ఈయన స్వరపరిచిన కృతులన్నీ సంస్కృతంలోనే ఉంటాయి. ఒక్క రచనా తెలుగులో లేదు. ముత్తుస్వామి దీక్షితార్ సముదాయ కృతులెక్కువగా రచించాడు. సముదాయ కృతులంటే ఒక స్థలాన్ని కానీ, ఒక ప్రదేశాన్ని కానీ, ఒక దైవాన్ని కానీ వుద్దేశించి రచించినవి. ఇవి గుంపుగా 5 లేదా 6 కృతులు కలిపుంటాయి. నవగ్రహ కీర్తనలు, నవరత్న కీర్తనలూ, పంచలింగ స్థల కృతులూ వీటిలో కొన్ని చెప్పుకోదగ్గవి. ముత్తుస్వామి దీక్షితార్ కృతి ముద్ర – ‘గురు గుహ’. సాధారణంగా కృతుల ఆఖరి చరణంలో వాగ్గేయకారుల ముద్ర కనిపిస్తుంది. కానీ ముత్తుస్వామి దీక్షితార్ కృతుల్లో మాత్రం ఈ ముద్ర పల్లవిలో కానీ, అనుపల్లవిలో కానీ, చరణంలో కానీ వుంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ కొన్ని కృతుల్లో ‘త్యాగరాజ’ అన్నది కనిపిస్తుంది. ఇది చూసి వాగ్గేయకారుడు త్యాగరాజు పై గౌరవంతో రాసిందిగా కొందరు అపోహపడే అవకాశముంది. ఇక్కడ త్యాగరాజు అంటే తిరువారూర్ గ్రామ దైవం ‘త్యాగరాజ స్వామి’ నుద్దేశించని అనుకోవాలి.

ముత్తుస్వామి దీక్షితార్ పై పశ్చిమదేశ సంగీత ప్రభావం కూడా వుంది. దీక్షితార్ అన్నయ్య బాలుస్వామి కచేరీల్లో పక్క వాయిద్యంగా వయులిన్ వాడకాన్ని ప్రవేశ పెట్టాడు. ఎత్తియపురం రాజాస్థానం ద్వారా బ్రిటీషు పాలకుల పరిచయంతో పాశ్చాత్య సంగీతం తెలిసింది. తెలుగులో నిఘంటువు కూర్చిన సి.పి. బ్రౌన్ కి అంకితమిస్తూ 1832లో ముత్తుస్వామి దీక్షితార్ కొన్ని కృతులు స్వరపరిచాడు. అప్పటికి సి.పి. బ్రౌన్ చిత్తూర్ జిల్లాకి కలక్టర్ గా పనిజేసేవాడు. ఈ కృతుల వివరాలూ, ఈ విషయమూ సంగీత సంప్రదాయ ప్రదర్శినిలో ఉన్నాయి. పశ్చిమ సంగీతాధారంగా దీక్షితార్ ‘నొట్టు స్వరములు’ అనేవి స్వరపరిచాడు. ఇంగ్లీషులో నోట్ కాస్తా తమిళంలోకి నొట్టుగా తర్జుమా అయ్యింది. శంకరాభరణంలో ‘సంతతం పాహిమాం’, ‘రామ జనార్ధన’ వంటి నొట్టుస్వర గీతాల్లో కర్ణాటక సంగీతంలో ఉండే గమకాలుండవు. ముత్తుస్వామి దీక్షితార్ సుమారు 400 పైగా కృతులు 120 రాగాల్లో స్వరపరిచాడు. ఈ రాగాలన్నీ వేంకటమఖి సంప్రదాయాన్ననుసరించి వాడుకున్నవే తప్ప కొత్త రాగాలు కావు.

తిరుక్కడైయూర్ భారతి, తేవూర్ సుబ్రహ్మణ్యయ్యర్, శుద్ధ మద్దాళం తంబియప్ప, వీణ వెంకట్రామయ్యర్, కోర్నాడ్ రామస్వామి, తిరువారూర్ అయ్యస్వామి, తంజావూరు చతుష్టయం పొన్నయ్య, చిన్నయ్య, శివనందం, వడివేలు, తిరువారూర్ కమలం, వళ్ళలార్ కోయిల్ అమ్మణి ఈయనకున్న శిష్యగణం. 1935 లో యత్తియపురం రాజ బంధువుల వివాహానికెళ్ళి అక్కడే దీక్షితార్ చనిపోయాడు. ఎ.ఎం.చిన్నస్వామి ముదిలియార్ ‘ఓరియంటల్ మ్యూజిక్’ అనే పుస్తకంలో ఇలా రాస్తారు. “త్యాగరాజ కృతులు చెవిన పడగానే ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ కృతులలాకాదు. ఒకటికి పదిమార్లు విని, శోధిస్తే కానీ ఆ కృతుల్లో గొప్పదనం తెలీదు”.

ఈ త్రిమూర్తులు ఎప్పుడైనా కలిసారా?

శ్యామశాస్త్రీ, త్యాగరాజు మంచి స్నేహితులని చెబుతూ తరచు వీళ్ళిద్దరూ కలిసే వారన్నట్లుగా అనేకమంది రాసారు. ఈ విషయం 1930 తరువాతొచ్చిన రచనల్లోనే ఇది ఎక్కువ భాగం కనిపిస్తుంది. త్యాగరాజు శిష్యులు పొందుపరిచిన వివరాల్లో ఇది లేదు. ఇద్దరూ దగ్గరూళ్ళలోనే ఉండడం వల్ల ఒకరి గురించొకరికి ఖచ్చితంగా తెలిసే అవకాశముంది. అది కేవలం ముఖ పరిచయమేనా లేక సంగీత పరిచయం కూడా ఉందన్న విషయం రూఢిగా చెప్పలేము. సుబ్బరాయ శాస్త్రి త్యాగరాజు శిష్యుడవడం వలన, ఇద్దరి వాగ్గేయకారులకీ ఒకరంటే ఒకరికి అమితమైన గౌరవముందనీ, అందుకే శ్యామశాస్త్రి తన కొడుకుని త్యాగరాజు వద్దకు పంపాడనీ చెప్పారు. పరస్పర గౌరవం మాటటుంచి, సుబ్బరాయ శాస్త్రిని మాత్రం శ్యామశాస్త్రి పంపే అవకాశం లేదు. ఎందుకంటే శ్యామశాస్త్రి 1827 లో చనిపోయాడు. త్యాగరాజు 1829 లో ఉత్తరాది యాత్రలు ముగించుకొచ్చేకే సుబ్బరాయశాస్త్రి త్యాగరాజు వద్ద శిష్యరికం జేసాడు.

ఇహ ముత్తుస్వామి దీక్షితార్ విషయమూ ఇలానే వుంది. త్యాగరాజూ, ఈయన కలిసినట్లు ఎక్కడా మచ్చుక్కి ఒక్క ఆధారమూ దొరకలేదు. కలిసారంటూ కథలున్నా వాటికి విశ్వసనీయత లేదు. తిరువయ్యారు గ్రామదేవత ధర్మసంవర్ధిని దేవాలయానికి ముత్తుస్వామి దీక్షితార్ వచ్చి అక్కడ కచేరీ ఇచ్చిన సమయంలోనే, త్యాగరాజు రామాయణ పారాయణ ముగింపు ఉత్సవమూ జరిగిందనీ, అప్పుడే త్యాగరాజు ఇంటికి దీక్షితార్ వెళ్ళాడనీ, అక్కడే మణిరంగు రాగంలో ‘మమవ పట్టాభి రామ’ కృతిని పాడాడనీ – సాంబమూర్తి ది గ్రేట్ కంపోజర్స్ లో రాసారు. ఇదొక్క సంఘటనే తప్ప త్యాగరాజు శిష్యులు వెంకటరమణ భాగవతార్ కానీ, కృష్ణ భాగవతార్ కానీ, సుందరేశ శర్మా ఎవరూ వీరిద్దరూ కలిసినట్లుగా ఎక్కడా ప్రస్తావించలేదు. రామస్వామి అయ్యర్ కూడా ఎక్కడా రాయలేదు. వడివేలూ, గోవింద మరారూ, గోపాలకృష్ణ భారతీ వంటి ప్రముఖులు త్యాగరాజుని కలిసినట్లుగా రాసిన శిష్యులు, సంగీత స్రష్టలైన శ్యామశాస్త్రీ, దీక్షితార్ల గురించి ఒక్క మాటా రాయకుండా వుండరు. ముగ్గురూ ఇంచుమించు 30 కిలోమీటర్ల పరిధిలో వున్నారు. ఒకరి గురించి మరొకరికి ఖచ్చితంగా తెలిసే ఉంటుందని నా నమ్మకం.

అసలు సంగీత త్రిమూర్తులంటూ వీరికెలా పేరొచ్చిందన్న విషయం చూస్తే, ఇది 1920 తరువాతనే అన్నది స్పష్టమవుతుంది. త్యాగరాజు ఆరాధనోత్సవానికి బహుళ ప్రాచుర్యం లభించినప్పుడు శ్యామశాస్త్రి మనవడు నటేశశాస్త్రి ద్వారా అనేక కృతులు లభించాయి. అప్పటికే ముత్తుస్వామి దీక్షితార్ కృతులు చాలామందికి పరిచయముంది. వీరు కూడా త్యాగరాజులా వాగ్గేయకారులే కాబట్టి ముగ్గుర్నీ కలిపి సంగీత త్రిమూర్తులు (మ్యూజికల్ ట్రినిటీ) అని వ్యవహరిస్తూ వచ్చారు. త్యాగరాజుతో సమంగా ఆయన పక్కనే పీటవేసి శ్యామశాస్త్రినీ, దీక్షితార్ని కూర్చో బెట్టడాన్ని చూసి మంచాళ జగన్నాధరావూ, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మా అభ్యంతరాలు తెలిపారు. త్యాగరాజుతో సమంగా క్షేత్రయ్య, అన్నమయ్య ఉండాలని వారి అభిప్రాయం. మంచాళ జగన్నాధ రావు ‘కర్ణాటక సంగీత వికాసానికి త్యాగరాజు చేసిన సేవ’ అన్న వ్యాసంలో ఇలా రాసారు:

“ఈనాడు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులని అందరూ అనుకుంటూ వున్నట్లు త్యాగరాజస్వామీ, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రుల వారూ కాకుండా క్షేత్రజ్ఞులవారు, దీక్షితుల వారూ, త్యాగరాజ స్వామి అని అనుకోవడం న్యాయమేమో అనిపిస్తుంది. కారణం శ్యామశాస్త్రుల వారి యందు నిరాదరణ కాదు. మహాభక్తులు సంగీత రచయితలు ఎందరో వున్నారు. వారిలో శ్యామ శాస్త్రి వారొకరు. కర్ణాటక సంగీతానికి ఒక స్వరూపాన్ని తీర్చి దిద్దడానికి నేను చెప్పిన సంగీత త్రిమూర్తులు చేసిన సేవ వివరిస్తాను….”

“ప్రాచీన గ్రంధకర్తలు ఉదాహరించిన రాగాల స్వరూపాలు ఇదమిత్థంగా తెలుసుకునే అవకాశం ఎప్పుడో పోయింది. కొంతవరకూ అన్నమాచార్యుల వారు వాడిన రాగాల తాలూకు స్వరూపాలు అక్కడా, అక్కడా దొరుకుతున్నాయి. వాటిలో చాలా రాగాలకి గమకాలను తొలగించడంవల్ల వాటి స్వరూపాలు పూర్తిగా మారిపోయాయి. ఇలామారిన రాగాలకి కొన్ని సందర్భాలలో వేరే వేరే నామకరణాలుకూడా జరిగిపోయాయి. ఇకపోతే ఈ గమకాల తొడుగులు అలంకరించుకోలేని రాగాలు చాలా వరకూ నామరూపాలు లేకుండా పోయాయి. అటువంటి వాటికి ఉదాహరణ: పాడి, టక్క, కొండమలహరి, గుమ్మ కాంభోజి, మెంచ బౌళి, ఆబాలి, అమరసింధు, సాళంగ, హిజ్జిజ్జి, గజ్జరి, తెలుగు కాంభోజి, ముఖారిపంతు, రేవగుప్తి, ఖండె, గౌరీపంతు మొదలయినవి. కొన్ని రాగాలు కొంతవరకు గమకాల పొందికలు అలంకరించుకున్నా అంతంతమాత్రం గానే ఉండి పోయాయి. వీటికి ఉదాహరణ: గౌళిపంతు, మలహరి, నవరోజు, నీలాంబరి, ఆహిరి, ఘంటా, బౌళి కురంజి, ఎరుకల కాంభోజి. వీటిలో చాలా క్లుప్తమైన సంచారాలలో సకృత్తులుగా రచనలు కనబడుతున్నాయి. కాని కొన్ని రాగాలు మాత్రం చాలా చక్కగా గమకాలు అలంకరించుకొని పేర్లు కూడా మార్చుకోకుండా వస్తూ వున్నాయి. కళ్యాణి, శంకరాభరణం, భైరవి, సౌరాష్ట్ర మొదలయినవి.

ఇప్పుడు ఈ పరిశీలనా దృష్టితో గమనిస్తే క్షేత్రజ్ఞుల వారు రచించిన 4200 పదాలను ఎన్ని రాగాలలో పాడి ఉంటారో చెప్పలేము. కానీ ఈ నాడు లభ్యమయిన మువ్వ గోపాల పదాలు పరిశీలిస్తే సుమారు 49 రాగాలు మాత్రమే వాడినట్లు తెలుస్తోంది. ఈ నలభై తొమ్మిది రాగాల్లోనూ క్సేత్రజ్ఞులవారికి తరువాత వారైన దీక్షితుల వారు, త్యాగరాజస్వామి వారు ఎన్నెన్ని రచనలు చేసారు అన్నది గమనిస్తే వారు ముగ్గురు విరాజమానులైన సమయాలలో ఏ రాగం ఎంతెంత మనోరంజకంగా ఉండేదో స్పష్టం అవుతుంది.”

… సంప్రదాయ సిద్ధంగా వాడుకలో వున్న రాగాలన్నిటిలోనూ ముత్తుస్వామి దీక్షితుల వారు రచనలు చేసారు. క్షేత్రజ్ఞులు 49 రాగాలే వాడినా అవి ఎంతో గంభీరతనిండుకొని వున్నాయి. ముత్తుస్వామి దీక్షితులవారు సుమారు 160 రాగాలలో రెండు వందలకు పైగా కీర్తనలు రచించారు. …ఇప్పటి డెబ్భైరెండు మేళకర్తలను మినహాయిస్తే నూటతొంభై రాగాలు సుమారుగా మిగులుతాయి. వీటిలో చాలా వరకూ త్యాగరాజ స్వామీ రచించారు. అసలు వీరు వాడిన రాగాలు సుమారు 220. ఇందులో 45 మేళకర్తల జన్య రాగాలు వీరు ఉపయోగించారు. శ్యామశాస్త్రి రచనల్లో ఇన్ని రాగాలు విస్త్రుతంగా వాడినట్లుగా అగుపించదు…”

సుమారుగా ఇదే అభిప్రాయాన్ని రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారూ వ్యక్తీకరించారు. కాకపోతే ఆయన అన్నమయ్య వాడినన్ని రాగాలు మిగిలిన వాగ్గేయకారులెవరూ వాడలేదని తిరుపతిలో లభ్యమైన రాగిరేకులు చూస్తే అర్థమవుతుందని చెప్పారు. అలాగే శ్యామశాస్త్రి సాహిత్యం కూడా భక్తి సాహిత్యమే తప్ప, వేరే ఏ ప్రత్యేకతలూ సంతరించుకోలేదని అభిప్రాయపడ్డారు. సాహిత్యమయితే పుస్తకరూపంలో దొరుకుతుంది. సంగీతమలా కాదు. ఎంత ధాతు, మాతువులతో రాసినా, గమకాలూ వంటివి ప్రత్యేకంగా చూపించినా పదిమందికీ చేరేది సంగీత రూపమైన పాట ద్వారానే. ఈ సంగీతం ముందు తరాలకందేది శిష్యుల వల్లనే! త్యాగరాజుకీ, ముత్తుస్వామి దీక్షితార్ కీ, శ్యామశాస్త్రికీ శిష్యులు బాగానే వున్నారు. క్షేత్రయ్యకీ, అన్నమయ్యకీ లేరు. బాగున్న కీర్తనలు అంటే వినికిడి యోగ్యంగా వున్నవి ఒకరి ద్వారా మరొకరికి చేరాయి.

ముత్తుస్వామి దీక్షితార్ కృతులూ, శ్యామశాస్త్రి కీర్తనలూ తమిళ సంగీత పరిశోధకులకి లభ్యమవ్వడం వలననూ, వారికి క్షేత్రజ్ఞ, అన్నమయ్యల అన్ని రచనలూ అందుబాటులో లేనందువల్లనూ సంగీత త్రిమూర్తులుగా వారి ముగ్గుర్నీ అభివర్ణించారని నా విశ్వాసం. ఇప్పటికీ క్షేత్రజ్ఞుల వారి పదాలు పూర్తిగా లభ్యం కాలేదు. అన్నమయ్యవి కొన్ని లభ్యమయినా వేలకొద్దీ లభ్యం కాలేదు. ఏదైతేనేం అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగరాజులు ముగ్గుర్నీ తెలుగు వారు త్రిమూర్తులుగా స్వీకరించి, వారు కర్ణాటక సంగీతానికి చేసిన సేవని గుర్తుంచుకుంటే అదే పదివేలు.

ఇహ ఈ త్రిమూర్తులూ ముగ్గురూ, అంటే త్యాగరాజూ, శ్యామశాస్త్రీ, ముత్తుస్వామీ దీక్షితార్ ఒకే సారి ఎక్కడైనా కలిసారా అని ప్రశ్నిస్తే, లేదనే జవాబొస్తుంది. వీరు ముగ్గురూ కలిసుండే అవకాశం వుందని భావించినా, ఎక్కడా ఒక్క చిన్న చారిత్రాత్మక ఆధారమూ దొరకలేదు. కొన్ని కథలు విడివిడిగా రాసారు కానీ, వాటికి ఆధారాలు మాత్రం చెప్పలేదు. అందువల్ల ఏది స్తవమో, ఏది వాస్తవమో తెలియకుండా పోయింది.

చివరి రోజులు

త్యాగరాజుకి మనవడు పంచాపకేశానికి తంజావూరుకి చెందిన గురువమ్మాళ్‌తో సుమారు 1930 ప్రాంతంలో వివాహం జరిగింది. త్యాగరాజు కూతురూ, మనవడూ త్యాగరాజు ఇంట్లోనే ఉండేవారు. 1943 ప్రాంతంలో పంచాపకేశానికి అనారోగ్యం చేసి చనిపోయాడు. దాంతో త్యాగరాజు వంశం అతనితోనే ఆగిపోయింది.

1830 ప్రాంతంలోనే వీణకుప్పయ్యర్ మద్రాసూ, వెంకట రమణ భాగవతార్ వాలజపేటా వెళిపోయారు. ఉమయాల్పురం కృష్ణ భాగవతారూ, సుబ్బరాయశాస్త్రీ వంటి కొత్త శిష్యులొచ్చారు. 1844 సంవత్సరాంతంలో వయసు పైబడి త్యాగరాజు ప్రధాన కార్యదర్శీ, అనుంగు మిత్రుడూ, తంజావూరు రామారావు చనిపోయాడు. ఇతను చనిపోవడానికి రెండేళ్ళముందు (1842 లో) త్యాగరాజుకి తన శిష్యులందర్నీ కలవాలని కోరిక గలిగింది. ఈ కొరిక తీర్చడానికి నడుం కట్టింది తంజావూరు రామారావే! త్యాగరాజుకున్న సుమారు 200 మంది శిష్యుల్నీ, ప్రశిష్యుల్నీ అందర్నీ పిలిచారు. తిల్లైస్థానం రామ అయ్యంగార్, మనంబుచవాది వెంకటసుబ్బయ్యర్ తదితరులు అందరూ వచ్చారు.అనారోగ్యంతో బాధపడుతూ, ప్రయాణం చేయలేక వెంకట రమణ భాగవతార్ త్యాగరాజష్టకం రాసి, కొడుకు కృష్ణభాగవతార్ చేతికిచ్చి ఈ సంగీత సమావేశానికి పంపాడు. శిష్యులందరూ త్యాగరాజు స్వరపరిచిన తలో కృతీ పాడి, గురువు ఆశీర్వచనాలు పొందినట్లుగా సాంబమూర్తి చెప్పారు. ఇదే విషయాన్ని టి.లక్ష్మణ పిళ్ళై కూడా ప్రస్తావించారు. చివరిరోజుల్లో ఎవరైనా సందర్శుకులొచ్చి త్యాగరాజుని పాడమంటే, తననే పాడమని అడిగేవాడనీ తిల్లయిస్థానం రామ అయ్యంగార్ రాసుకున్నాడు.

తంజావూరు రామారావు చనిపోయాక త్యాగరాజు కొత్తగా ఏవీ స్వరపరిచలేదని చెబుతారు. సహానా రాగంలో ‘గిరిపై నెలకొన్న’ కృతొక్కటీ తప్ప. త్యాగరాజు చనిపోడానికి పదిలోజుల ముందు రామదర్శన మయ్యిందనీ, పదిరోజుల్లో తనువు చాలిస్తానని చెప్పాడనీ అంటారు.

పల్లవి. గిరిపై నెలకొన్న రాముని
            గురి తప్పక కంటి
అనుపల్లవి. పరివారులు విరి సురటులచే
            నిలబడి విసరుచు కొసరుచు సేవింపగ (గిరి)
చరణం. పులకాంకితుడై ఆనందాశ్రువుల
            నింపుచు మాటలాడ వలెనని
            కలవరించ కని పది పూటలపై
            కాచెదనను త్యాగరాజ వినుతుని (గిరి)


త్యాగరాజు సమాధి

తను చనిపోవడానికి ముందు రోజు త్యాగరాజు సన్యాసం స్వీకరించాడు. ఆ సందర్భంలోనే చనిపోతే తననెక్కడ సమాధి చేయాలో చెప్పాడనీ, అలాగే సన్యాసులని దహనం చేయరు కనుక తనని సమాధి చేస్తే ఎన్నడుగుల లోతు వరకూ ఉప్పు వేయాలో చెప్పాడనీ సుబ్బరామ దీక్షితార్ రాసారు. ఈ సుబ్బరామ దీక్షితార్ రాసిన ‘త్యాగరాజ స్వామి’ పుస్తకం 1904లో అచ్చయ్యింది. ఈ సుబ్బరామ దీక్షితార్ తన ఎనిమిదో ఏట, త్యాగరాజు ఇంకో నెల్లాళ్ళల్లో చనిపోతాడనగా ఆయన్ని దర్శించాడు. సన్యాసం స్వీకరించినప్పుడు ‘పరమహస పరివ్రాజక శ్రీ బ్రహ్మానంద స్వామి’ గా పేరు మార్చారు. సన్యాసం స్వీకరించిన మరుసటి రోజు పూజానంతరం మనోహరి రాగం లో ఈ క్రింది కృతిని పాడుతుండగా, ఆ తన్మయత్వంలోనే సిద్ధి పొందాడనీ కృష్ణ భాగవతార్ రాసాడు.

పల్లవి. పరితాపము కనియాడిన
            పలుకుల మరచితివో నా (పరి)

అనుపల్లవి. సరి లేని సీతతో
            సరయు మధ్యంబున నా (పరి)

చరణం. వరమగు బంగారు వాడను
            మెరయుచు పది పూటలపై
            కరుణించెదననుచు క్రే-
            కనుల త్యాగరాజుని (పరి)

‘గిరిపై నెలకొన్న’ కృతే చివరిదని కొంతమంది వాదిస్తే, ‘పరితాము కనియాడినే’ చివరి కృతని మరికొందరు రాసారు. త్యాగరాజు మరణించే సమయానికి మరణశయ్య మీదున్న వెంకటరమణ భాగవతారుకి కలలో త్యాగరాజు సమాధి చెందినట్లుగా కనిపించిందని తండ్రి తనతో చెప్పినట్లుగా కృష్ణ భాగవతార్ రాసారు. చనిపోయే ముందురోజు త్యాగరాజు తన గురించి కలత చెందవద్దని శిష్యులకి చెబుతూ, తిరిగి అరవైఏళ్ళ తరువాత తన సంగీతం ప్రాచుర్యంలోకి వస్తుందని చెప్పినట్లుగా చాలా మంది రాసారు.

త్యాగరాజు 1847 జనవరి 6వ తేదీన బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల కాలంలో సిద్ధి పొందాడు. ఆయన పార్థివ శరీరాన్ని తిరువయ్యారుకి తూర్పున కావేరీ నదీ తీరాన శిష్యులందరూ కలసి సమాధి చేసారు. అక్కడే తులసి మొక్కలు సమాధి చుట్టూ నాటి తులసి బృందావనం అని అప్పట్లో వ్యవహరించేవారు.

త్యాగరాజు జాతకం

త్యాగరాజు చనిపోయిన తేదీ ఖచ్చితంగా తెలిసింది కానీ, ఆయన జన్మదినం మాత్రం సుమారు 1920 వరకూ ఇదమిత్థంగా తెలీదు. ఎవరికి తోచిన లెక్కలు వారు కట్టారు. త్యాగరాజు 84 ఏళ్ళు బ్రతికాడనీ కొంతమంది రాస్తే, కొంతమంది 89 ఏళ్ళని రాసారు. మరికొంతమంది 74 ఏళ్ళని చెప్పారు. అసలు త్యాగరాజు జన్మదినం తాలూకు పలువురి సిద్ధాంతాలూ ఏలా వచ్చాయో, అసలు సరైన తేదీ ఎలా తెలిసిందో పరిశీలిద్దాం. అసలు త్యాగరాజు జన్మదినం గురించి కాస్త వివరంగా చెప్పింది ‘త్యాగరాజ – ది గ్రేట్ మ్యుజీషియన్ సైంట్’ రాసిన ఎం.ఎస్.రామస్వామి అయ్యర్. ఈయన తనకి లభించిన వివరాలన్నీ శాస్త్రీయంగా పరిశీలించి త్యాగరాజు జన్మదినాన్ని నిర్ధారించారు.

త్యాగరాజు శిష్యుల్లో ఒకడైన తిల్లైస్థానం రామ అయ్యంగార్ శిష్యుడు పంజు భాగవతార్ ‘త్యాగరాజ చరితం’ అనే పుస్తకంలో – “త్యాగరాజు పుష్య బహుళ పంచమి, ప్రభవ నామ సంవత్సరం కలియుగం 4948న సిద్ధిపొందారు” అని రాసారు. ఆది అండ్ కో శ్రీనివాస అయ్యంగార్, పి.వి క్రిష్ణ స్వామి అయ్యర్ మొదలగు వారు ఇదే తేదీని సంగ్రహించారు. కానీ తంజావూరు ప్రభుత్వ ప్రతుల్లో 1842 అనుంది. దీన్ని వి.నాగమయ్య అనే అధికారి పొందుపరిచారు. ఈయనకీ సమాచారం వేదాద్రిసదశ ముదిలియార్ ద్వారా వచ్చింది. టి.లక్ష్మణ పిళ్ళై మాత్రం జనవరి 6, 1847 అని త్యాగరాజుపై రాసిన వ్యాసాల్లో చెప్పారు. ఈ తేదీననుసరించి ఒక్కొక్కరూ ఒక్కో వయసు చెప్పారు. త్యాగరాజు వయసు, సి.తిరుమలయ్య నాయిడు 75 గానూ, సుబ్బరామ దీక్షితార్ 77 గానూ, నాగమయ్య 82గానూ, లక్ష్మణ పిళ్ళై 80 గనూ, ఆది అండ్ కో శ్రీనివాస అయ్యంగార్ 89 గానూ, పంజు భాగవతార్ త్యాగరాజు వయసు 88 గా చెప్పారు. వేదాద్రిసదశ అయ్యంగార్ ద్వారా రామస్వామి అయ్యర్కి త్యాగరాజు 88 ఏళ్ళు బ్రతికినట్లు చెప్పినందువల్ల, ఆయన పుట్టిన ఏడు 1759 అయ్యుంటుందనీ నిర్ధారించేసారు. చాలాకాలం వరకూ త్యాగరాజు వయసు 88 గానే అందరూ అనుకున్నారు.


త్యాగరాజు జాతకము

వెంకటరమణ భాగవతార్కి కవి వెంకట సూరి అనే శిష్యుడొకాయన ఉండేవాడు. ఇతను త్యాగరాజుదీ, వెంకటరమణ భాగవతార్ల జాతకాలు భద్రంగా పొందుపరిచాడు. నౌకా చరిత్రాన్ని సంస్కృతంలోకి అనువదించిందీ కవి వెంకటసూరే! 1910 తరువాత వెంకటరమణ భాగవతారూ, తంజావూరు రామారావు పేర్లతో వున్న త్యాగరాజు కృతుల తాళపత్ర గ్రంధం వాలజపేట శిష్యులు పొందుపరిచిన వాటిల్లో దొరికింది. ఈ కృతుల చివర్న త్యాగరాజు జాతకం వుంది. ఆ జాతకంలో ఈ క్రింది విధంగా ఉంది.

“స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన గత శకాః, 1689 గత కల్యబ్దః 4858 వ్యవహారిక సౌర చంద్రమానాభ్యాం సర్వజిన్నామ సంవత్సర మేష మాసం 25వ తేదీ వైశాఖ శుద్ధ 6 సోమవారం 14-50 పునర్వసు 6-8 శూల 21-29 తైతుల 14-50 దివి 26-29 ఈ శుభ దినమందు సూర్యోదయది ఘ. 14-56 విఘడియలకు భరద్వాజ గోత్రోద్భవుండునూ శ్రీ మద్రామాయణాది ప్రసంగ నిపుణులగు శ్రీ రామ బ్రహ్మస్వామి వారికి శ్రీమత్ పుణ్య తృతీయ పుత్ర జననం”.

ఈ త్యాగరాజు జాతకాన్ని 1947 లో త్యాగరాజు శతాబ్ది సంచికలో వాడ్రేవు సూర్యనారాయణ సవివరంగా చర్చించారు. శ్రీరాముడి జన్మ నక్షత్రాన్నే (పునర్వసు) త్యాగరాజూ జన్మించాడు. ఇది యాదృచ్చికంగా అనిపిస్తుంది. పైన చెప్పిన ‘1689 గత కల్యబ్దః 4858’ వివరం ఇంగ్లీషు సంవత్సరాల ప్రకారం మే 4, 1767 అవుతుంది.
ఈ వివరాలు లభించాక రామస్వామి అయ్యర్ పరిశోధన సరికాదని తేలిపోయింది.

త్యాగరాజు ఆరాధనోత్సవం

త్యాగరాజు సిద్ధి పొందిన తరువాత ఉమైయాల్పురం శిష్యులు ప్రతీ ఏటా పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యారొచ్చి సమాధిని సందర్శించేవారు. ఇది మాత్రం విధిగా 40 ఏళ్ళు పైగా చేసారు. ఆ తరువాత ఎవరి ఊళ్ళల్లో వాళ్ళే కచేరీలు చేసేవారు. దాదాపు 1905 వరకూ ఇలాగే జరిగింది. సమాధి శిధిలావస్థలో ఉండడం చూసి ఉమైయాల్పురం సుందరేశ భాగవతారూ, కృష్ణ భాగవతారూ సమాధికి మరమ్మత్తులు చేయాలని సంకల్పించారు. సంగీత ప్రియుల వద్దనుండి విరాళాలు సేకరించి ఒక్కడ ఒక పూజార్ని పర్యవేక్షకుడిగా నియమించారు. 1907 తరువాత నుండీ త్యాగరాజు సమాధికి కొత్త రూపొచ్చింది. కొత్త శకమొచ్చింది. త్యాగరాజ ఆరాధన పేరుతో ఉత్సవంగా భజనలూ, సంగీత కచేరీలూ జరపడం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో తిల్లయిస్థానం నరసింహ భాగవతార్ త్యాగరాజు కృతులు సేకరిస్తూ తిరువయ్యారు వచ్చాడు. అక్కడ పంజు భాగవాతార్నీ, తిరుచురాపల్లి గోవిందస్వామి పిళ్ళైని కలిసి త్యాగరాజ ఆరాధనోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. అది చూసి 1908 లో ఉమైయాల్పురం శిష్యులు పంచాపకేశ అయ్యర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంగీత విద్వాంసుల్ని రప్పించారు. దాంతో తిల్లైస్థానం వారికీ, ఉమైయాల్పురం వారికీ విబేధాలొచ్చాయి. నరసింహ భాగవతారంతలా పెద్ద ఎత్తున చేయలేకపోయినా, సమాధి బాగోగులు మాత్రం ఉమైయాల్పురం శిష్యులే చూసేవారు.

ఇద్దరూ రెండు వర్గాలుగా విడిపోయి, తిల్లైస్థానం వాళ్ళు తిరువయ్యారు కళ్యాణ మహల్లోనూ, మరో వర్గం ఉమైయాల్పురం వాళ్ళు తిరువయ్యారు సంస్కృత పాఠశాలలోనూ జరపడం మొదలెట్టారు. ఇలా దాదాపు పదేళ్ళు పైగా నిర్వహించారు. మెల్ల మెల్లగా త్యాగరాజు ఆరాధనోత్సవ విషయం పలువూళ్ళకీ ప్రాకింది. పదిమంది చెవినా పడింది. జనాలు రావడం మొదలెట్టారు. సుమారు 1920 ప్రాంతంలో బెంగుళూరు నాగరత్నమ్మ అనే ఒకావిడ ప్రవేశంతో మరో కొత్త మలుపు తిరిగింది. అదేమిటో తెలుసుకునే ముందు ఈ నాగరత్నమ్మ గురించీ కాస్త తెలియాలి. ఈ క్రింద చెప్పబోయే కథ 1947లో ‘త్యాగరాజు శతాబ్దిసంచిక’లో, అచ్చ తెలుగులో, బెంగుళూరు నాగరత్నమ్మే స్వయంగా రాసుకుంది.


బెంగుళూరు నాగరత్నమ్మ

బెంగుళూరు నాగరత్నమ్మ మైసూరు సంస్థానంలో దేవదాసీగా ఉండేది. ఈవిడకి కర్ణాటక సంగీతం బాగా వచ్చు, కృష్ణ భాగవతార్ శిష్యుడైన బెంగుళూరు మునుస్వామప్ప శిష్యురాలు. త్యాగరాజు కృతులూ నేర్చుకుంది. అప్పట్లో మద్రాసు సంగీత విద్వాంసులకి నిలయంగా ఉండేది. చివరికి ఈ బెంగుళూరు నాగరత్నమ్మ మద్రాసులో స్థిరపడి సంగీత కచేరీలు ఇచ్చేది. ఓ రోజున ఉమైయాల్పురం పంచాపకేశ భాగవతార్ సంగీత కచేరీకని మద్రాసు వచ్చినపుడు నాగరత్నమ్మ వారిని కలిసింది. ఆయన వద్ద త్యాగరాజు చిత్రపటాన్నొకటి ఏడు రూపాయిలకి కొనుక్కుంది. ఓ రోజు రాత్రి నాగరత్నమ్మకి కలలో త్యాగరాజు కనిపించాడు. ఈ విషయాన్ని సంగీత సమాజ కార్యదర్శి మునుస్వామి నాయుడుకి చెప్పింది. సరిగ్గా అదే సమయానికి తంజావూరు నాగరాజ భాగవతార్ హరికథా కాలక్షేపం నిమిత్తమై మద్రాసు వచ్చారు. ఆయనతో ఈ విషయం చెబితే తిరువయ్యారులో త్యాగరాజు సమాధిని సందర్శించమని చెప్పారు. వారితో కలిసి నాగరత్నమ్మ తిరువయ్యారు వెళ్ళి, సమాధిని సందర్శించింది. సమాధి సమీపంలో తుప్పలూ, మొక్కలూ పెరిగి అస్తవ్యస్తంగా కనిపించి, ఇక్కడ త్యాగరాజు మందిరం నిర్మిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన చేసి, పదిమందినీ సంప్రదించింది. తన దగ్గరున్న కొంత ధనాన్ని వెచ్చిచి త్యాగరాజు వంశీకుడైన రాముడు భాగవతార్ కి సమాధి చుట్టూ ప్రాకారం కట్టే పనులు పురమాయించి మద్రాసొచ్చేసింది. ఇది 1925లో జరిగింది.

సుమారు మూడేళ్ళకి సమాధి చుట్టూ ఓ చిన్న ప్రాకారం కట్టారు. దాదాపు పదమూడేళ్ళ వరకూ ప్రతీ ఏటా నాగరత్నమ్మ తిరువయ్యారు వెళ్ళొచ్చేది. 1939లో త్యాగరాజు సమాధి మందిరం నిర్మించాలన్న ఆశయమొచ్చింది. సమాధి కెదురుగా వున్న తోట భూములు తంజావూరు రాజబంధువులైన రాజారాం సాహిబ్ విరాళంగా ఇచ్చారు. ఒక కార్య వర్గాన్ని నియమించి సమాధి మందిరాన్ని కడదామనుకుంది. సమాధిపై రామ విగ్రహం పెట్టాలా? త్యాగరాజు విగ్రహం పెట్టాలా? అన్న సందేహం వచ్చి పదిమందినీ సంప్రదిస్తే, త్యాగరాజు విగ్రహం పెడితే బాగుంటుందనీ తీర్మానించారు. ఈలోగా తిల్లైస్థానం వర్గానికీ, ఉమైయాల్పురం వర్గానికీ మరలా గొడవలొచ్చాయి. నాగరత్నమ్మ ప్రవేశంతో ఇద్దరి మధ్యా గొడవలు సమసిపోయి అందరూ కలిసిగట్టుగా సమాధి మందిర నిర్మాణానికీ, త్యాగరాజు విగ్రహ స్థాపనకీ కృషి చేద్దామని నిశ్చయించుకున్నారు. ఆ విధంగా 1939లో త్యాగరాజు విగ్రహ స్థాపన జరిగింది.


త్యాగరాజు విగ్రహం

ఆ సమాధి దగ్గరలోనే త్యాగరాజ ఆరాధనోత్సవం జరపాలని నిర్ణయించారు. సుమారు 1940 నుండి నేటి వరకూ సమాధి వద్దనే ఆరాధనోత్సవం జరుగుతుంది. సమాధి మందిరం కట్టే సమయంలో లోపల గోడలపైన పాలరాతి ఫలకాలపై త్యాగరాజు కృతులు చెక్కిస్తే బావుంటుందన్న ప్రతిపాదన శ్రీరంగం సుందరం అయ్యర్ చేస్తే అందరూ ఆమోదించారు. అందులోనే వాల్మీకి మంటపాన్ని కట్టి వాల్మీకి విగ్రహాన్నీ ప్రతిష్టించారు. ఈ పన్నెండేళ్ళ వివరాలన్నీ అప్పట్లో కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు ప్రోద్బలంతో నాగరత్నమ్మ ఆంధ్రపత్రికలో ధారావాహికంగా వ్యాసాలు రాసింది.

1940 నుండీ ఆరాధనోత్సవాలు పెద్ద యెత్తున జరిగేవి. అందులో భాగంగా త్యాగరాజు పంచరత్న కీర్తనలని సమాధి వద్ద పాడే ఆచారానికి శ్రీకారం చుట్టారు. అక్కడే హరికథలూ, అన్నదానాలూ జరిపేవారు. 1945 లో రేడియో ప్రసారం కూడా చేసారు. 1946లో చిత్తూరు నాగయ్య ఆయనే స్వయంగా నటించి ‘త్యాగయ్య’ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు. ఆ సినిమా విజయవంతమైన సందర్భంగా నాగయ్య బెంగుళూరు నాగరత్నమ్మని కలిసినప్పుడు తిరువయ్యారులో త్యాగరాజు భక్తులకోసం ఓ వసతి గృహాన్ని చిత్తూరు నాగయ్యే కట్టించారు. బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర అనేకమంది రాసారు. ఈవిడ 1952లో చనిపోయింది. ఈవిడ సమాధి త్యాగరాజు సమాధి ప్రాంగణంలోనే కట్టారు.

తిరుమంజన వీధి – త్యాగరాజు ఇల్లు

త్యాగరాజు తదనంతరం ఆయనున్న ఇంట్లో మనవడి భార్య గురువమ్మాళ్ కొంతకాలముంది. ఆ తరువాత తన బంధువులున్న తంజావూరెళ్ళిపోయింది. ఈవిడ ఆ ఇల్లు ఎవరికీ అమ్మలేదు. 1900 మొదట్లో పోయేవరకూ ఆమె పేరే ఉండేది. ఆవిడ తదనంతరం దాన్ని పంచనదయ్య మునిమనవలు త్యాగరాజ ఆరాధోత్సవ కమిటీ కప్పగించారు. అన్నగారి వాటాని 1828 ప్రాంతంలో ఇద్దరు మహారాష్ట్ర మహిళలకి అమ్మడం జరిగింది. ఆ ఇంటికి సంబంధించిన పత్రాలు 1940 ప్రాంతంలో వెలుగులోకొచ్చాయి. దానిపై హిందూ పత్రిక వారు వ్యాసం కూడా రాసారు.

త్యాగరాజూ, ఆయన అన్నయ్య పంచనదయ్య ఇల్లయితే వాటాలు వేసుకున్నారు కానీ, చట్ట పరంగా పంచుకోలేదు. అది కూడా తిరువయ్యార్ మెజిస్ట్రేట్ ముందర ఒక పత్రం రాసుకున్నారంతే! త్యాగరాజుది రెండంతస్థుల ఇల్లు.


త్యాగరాజు ఇంటి అమ్మకపు పత్రము

సుమారు 1929 ప్రాంతంలో త్యాగరాజుంటున్న పై భాగాన్ని లగూ బాయి, పయమ్మ బాయి అనే ఇద్దరు మరాఠీ స్త్రీలకి అమ్మేసారు. ఈ అమ్మకాల పత్రంలో త్యాగరాజు స్వదస్తూరీతో ఆయన సంతకముంది. తిరువయ్యారు కళ్యాణ మహల్ పేలస్ లో వారసత్వ ఉద్యోగొకాయన ఈ పత్రాన్ని పొందుపరిచాడు. తిరువయ్యారు కళ్యాణ మహల్ పేలస్ లో వారసత్వ ఉద్యోగొకాయన ఈ పత్రాన్ని పొందుపరిచాడు. హిందూ పత్రిక వారికిది లభ్యమయ్యింది.

సర్వధారీ సంవత్సరం 1828 డిశంబరు 18 వ తేదీ, మార్గశిర మాసం పదకొండో రోజున, తంజావూరు వాస్తవ్యులైన శ్రీమతి లాగు బాయి, పయమ్మ బాయీ, తిరువయ్యారు వాస్తవ్యులైన కీ.శే. రామబ్రహ్మం అయ్యర్ కుమారుడు త్యాగబ్రహ్మ ఆయ్యర్, పంచనదబ్రహ్మం ఆయ్యర్ కుమారుడు సుబ్బబ్రహ్మ్మ అయ్యర్ ల మధ్య జరిగిన ఒప్పంద అంగీకార పత్రమిది. త్యాగబ్రహ్మం ఇంటి పై అంతస్థు నివాసాన్ని ముందు చెప్పిన వారికి చెందేలా రాసిన పత్రమిది. ఈ అమ్మకంలో భాగంగా 32 – 3 3/4 వంతుల బంగారమూ, 50 6/16 వెండీ ఇంటి ధరగా నిర్ణయిస్తూ, తిరువయ్యారు మహలు మహారాణి అభయ, అయ్యలు నాయకన్ సమక్షంలో జరిగిన ఒడంబడిక. ఇది ప్రభుత్వ ముద్ర కలిగిన అమ్మక పత్రము.

(త్యాగబ్రహ్మ అయ్యర్ వ్రాలు) (సుబ్బబ్రహ్మ అయ్యర్ వ్రాలు)

సాక్షులు:
1. తిరుమంజన వీధి నివాసస్థులు – రామశాస్త్రి
2. తిరుమంజన వీధి నివాసస్థులు – సాంబశివ అయ్యర్
3. తిరువధి వెంకటరామ అయ్యర్
4. సామ గురుక్కల్ తనయుడు, పంచనద గురుక్కల్
5. పంచాయితీ అధికారి – అయ్యలు నాయకన్

ఈ మూలప్రతి ప్రస్తుతం మదురై సౌరాష్ట్ర సభ వారి ఆధీనంలో ఉంది. ఇదొక్కటే త్యాగరాజు సంతకంతో లభ్యమైన ప్రతి. త్యాగరాజు వాడిన పోతన భాగవత ప్రతి కూడా వుంది కానీ, అది త్యాగరాజు స్వదస్తూరీయో కాదో తెలీదు. అది త్యాగరాజు షష్టి పూర్తి సమయంలో వెంకట రమణ భాగవతార్ కానుకగా ఇచ్చిన ప్రతని కొంతమంది భావిస్తారు. ప్రస్తుతం తిరుమంజన వీధిలో ఇంటిని త్యాగరాజు స్మారక చిహ్నంగా మలచాలని త్యాగరాజ ఆరాధనోత్సవ కమిటీ నిర్ణయించీ, కూలిపోతున్న గోడలకీ, ఇంటి లోపలా మరమ్మత్తులు చేయాలని నిర్ణయించారు. అందులో త్యాగరాజు సంబంధిత వస్తువులుంచి ఒక మ్యూజియంలా తయారు చేద్దామని వారి ఆలోచన. ఈ మరమ్మత్తు పనుల్లో ఉండగా ఎవరో ఈ కమిటీపై కోర్టులో కేసు వేసారు. అందువల్ల మరమ్మత్తు పనులు నిలిపి వేసారు. ప్రస్తుతం ఆ కోర్టు కేసు నడుస్తూ వుంది.

త్యాగరాజు సమాధిపై వివిధ అంశాలను ప్రస్తావిస్తూ విలియం జాక్సన్ ఈ విధంగా అన్నాడు.

“సమాధి వద్ద తన శిష్యులు వర్గభేదాలూ, అసూయలూ, కొట్లాటలూ ఇవన్నీ త్యాగరాజు చూస్తే ఎంతో ఆవేదనచెందుండేవాడనీ కొంతమంది దక్షిణాదులు అనుకుంటారు. సమాధి దగ్గర ప్రశాంతంగా ఉండాలి. త్యాగరాజు తను రామభక్తుణ్ణి గానే చెప్పుకున్నాడు కానీ ఒక సాధువుగా పరిగణించుకోలేదు. ఆయన మీదుండే గౌరవంతో ‘అయ్యవారు’ అంటూ అందరూ సంబోధించేవారు. త్యాగరాజు జీవించిన విధానాన్ని చూసి ఆయన మరణానంతరం త్యాగరాజ స్వామిగా అందరూ పిలుస్తున్నారు.

త్రిమూర్తులుగా పిలవబడుతున్న శ్యామశాస్త్రినీ, ముత్తుస్వామి దీక్షితార్ ని సద్గురు అని పిలవరు. ఎందుకంటే త్యాగరాజు సంగీత కళ ద్వారా దేవుణ్ణి ఎలా స్మరించుకోవాలో చెప్పాడు. భక్తి మార్గాన్ని పాటలో చూపించాడు. త్యాగరాజుని కొంతమంది ‘సద్గురు త్యాగరాజ స్వామి’గా అనుకుంటే, ఆర్.కృష్ణస్వామీ, వెంకటరమణ భాగవతారూ, బెంగుళూరు నాగరత్నమ్మా ఒక దైవంలా భావించారు…”

ఇప్పటికీ ప్రతీ ఏడూ జనవరిలో త్యాగరాజు ఆరాధనోత్సవాలు తిరువయ్యారులో జరుగుతాయి. అక్కడే కాకుండా దేశం నలుమూలలా సంగీత ప్రియులు జరుపుకుంటున్నారు. త్యాగరాజు సంగీతం పదిమందికీ తెలిసినా సంగీత శాస్త్ర పరంగా మరింత పరిశోధనలు జరగాల్సుంది. ఇది విశ్వవిద్యాలయాలవల్లే సాధ్యపడుతుంది. తమిళనాట ఈ పరిశోధనలు జరుగుతున్నా, ఆంధ్రదేశంలో సంగీతమ్మీద ఆశించినంతగా జరగట్లేదనే చెప్పుకోవాలి.

ముగింపు

సంగీతంలో రాగాలు అనంతాలనీ చెబుతూ వుంటారు. ఒకప్పుడు భారతదేశంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి విద్వాంసులు వెళ్ళేవారు. ఆయా ప్రదేశాల్లో వున్న సంగీత కళల వైవిధ్యాలు ఇతర ప్రాంతల వారికి కొత్తగా ఉండేవి. కొత్త సాంప్రదాయాలకు ఆకర్షితులై ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం సాగుతుండేది. దానికి దోహదం చేస్తూ త్యాగరాజు సుమారు 120 పైగా కొత్త కొత్త రాగాల్లో కృతులు స్వరపరిచాడు. వింతరాగాల పేరుతో ఒకటీ లేదా రెండు కృతులే స్వరపరిచినా, భైరవీ, సావేరి, సౌరాష్ట్ర, తోడి, శంకరాభరణం, కళ్యాణి, మధ్యమావతి రాగాల్లో పదిహేను పైగా కృతులున్నాయి. ముఖ్యంగా శంకరాభరణంలో 38 పైగా కృతులునాయి. ఆ తరువాత తోడి రాగంలో ఉన్నాయి. ఈ మేళ కర్త రాగాలు కాకుండా వందపైగా జన్య రాగాల్లో స్వరపరిచాడు. ఈ రాగాల్లో చాలా భాగం హరికాంభోజి లేదా ఖరహర ప్రియ జన్యాలే ఎక్కువగా కనిపిస్తాయి. త్యాగరాజు ద్వారా ఎన్నో కొత్త కొత్త రాగాలు వెలుగులోకొచ్చాయి. కొన్ని సృష్టించబడ్డాయి. సంగీత శాస్త్ర పురోగవృద్ధికి త్యాగరాజు కూర్చిన రాగాలు ఎంతో దోహదం చేసాయి. ఈ విధంగా త్యాగరాజు కర్ణాటక సంగీతాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్ళాడు. వ్యవహారిక భాషా సాహిత్యాన్ని సంగీతంలో అమర్చి తెలుగు భాషకీ వన్నె తెచ్చాడు.


త్యాగరాజు భాగవత ప్రతి

చివరగా – మన జాతీ, మన సంస్కారమూ, మన కళలూ, విద్యలూ కొంతవరకైనా మనం తెలుసుకోవాలి. తరువాత తరాలకి అందజేయాలన్న విధితో ఎంతోమంది గతంలో చేసారు. ఇప్పుడూ చేస్తున్నారు. ముందు ముందు చేస్తారు కూడా. అందువల్లే ఎన్నో వందల సంవత్సరాలనుండీ, ఎన్ని అడ్డంకులొచ్చినా ఎంతమంది విమర్శించినా, ఖండించినా, మన కళలు మహా ప్రవాహంలా సాగుతూనే ఉన్నాయి. ఇది అన్ని దేశాల వారికీ వర్తిస్తుంది. అలా కాకపోతే వాల్మీకి రామాయణమూ, నన్నయ భారతమూ, కాళిదాసు కావ్యాలూ, అన్నమయ్యా, త్యాగరాజుల కీర్తనలూ ఈ రోజున మనకి తెలిసుండేవి కావు. మంచి వస్తువూ, విలువలూ ఉన్న విషయాలెప్పటికీ నశించవు. విలువలు లేని విషయాలు ఎప్పటికప్పుడే కాలగర్భంలో కలిసిపోతాయి.

కర్ణాటక సంగీతమున్నంత కాలమూ త్యాగరాజు జీవించుంటాడు. త్యాగరాజు సంగీతమున్నంత కాలమూ తెలుగు భాషా ప్రతీ ఒక్కరి నోళ్ళలోనూ నానుతూనే ఉంటుంది. ఇది మాత్రం అక్షర సత్యం.

(సమాప్తం)


ఎందరో మహానుభావులు…

ఎంతటి మహాగాయకుడైనా ఒక్కరే పాడితే అది అంతగా రక్తి కట్టదు. అదే పక్క వాయిద్యాలున్నాయనుకోండి. ఆ పాట వినసొంపుగా వుంటుంది. అదే విధంగా రాయడమనే పనికి నేను పూనుకున్నా, ఎంతో మంది చేయూతనిచ్చారు. అమెరికాలో ఉండడం పెద్ద లోటన్న భావనే రానీయకుండా, ఎదురొచ్చి సహాయం చేసారు. అందరికీ కృతజ్ఞతాభివందనాలు. మీ అందరికీ వ్యాసం నచ్చి, కొత్త విషయాలు తెలిసాయనిపిస్తే నేను పడ్డ శ్రమ వృధా కాలేదనుకుంటాను. లేదంటారా, తెలుగువాడైన త్యాగరాజు కర్ణాటక సంగీతానికి చేసిన సేవని మరోసారి స్మరించుకున్నామనుకోండి. ఈ వ్యాసం బావుందనిపిస్తే ఆ ఘనత నాకు సహాయం చేసిన వారికి చెందుతుంది. ఎక్కడైనా తప్పులు దొర్లితే అవి మాత్రం ఖచ్చితంగా నావే!

– ముందుగా త్యాగరాజు గురించి వ్యాసం రాస్తానని విషయం చెప్పగానే నన్ను ప్రోత్సహించిన వేలూరి గారికీ, ఎంతో శ్రద్ధగా, శ్రమ కూర్చి, సమీక్ష చేసిన ఈమాట సంపాదక వర్గానికీ,
– త్యాగరాజు పై వ్యాసం రాస్తున్నానని చెబితే, తను దాచుకున్న పుస్తకాలూ, వ్యాసాలూ పంపి తన చేతలతోనూ, పుస్తకం వేయండంటూ బొమ్మేసిచ్చి తన గీతలతోనూ, నాపై ఎంతో ఆత్మీయత చూపించిన ప్రముఖ చిత్రకారులు బాపు గారికీ,
– సంగీత పరంగా నాకొచ్చిన సందేహాలన్నీ తీర్చి, నన్ను ప్రోత్సహించిన వైణిక గురువు శ్రీమతి సీత నిష్టల గారికీ,
– సుమారు అరవైఏళ్ళ క్రితం నాటి వ్యాసాలు పంపిన హిందూ వార్తా పత్రిక యాజమాన్యానికీ, తంజావూరు సరస్వతీ మహలు గ్రంధాలయంలో ఫొటోలు తీసుకోడానికి అనుమతిచ్చిన ఎస్.రాఘవన్ గారికీ,
– త్యాగరాజు సమాధి వద్ద ఫొటోలకి అనుమతిచ్చిన త్యాగరాజు కుటుంబీయులకీ,
– ఎంతో శ్రమగూర్చి పుస్తకాలు పంపిన మిత్రుడు వెంకట రత్నానికీ,
– వ్యాసం మొదటి భాగం చదివి, ప్రముఖులు రాసిన వ్యాసాలు పంపిన మేడేపల్లి శేషు గారికీ,
– ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుండి మ్యూజికల్ జర్నల్స్ తెప్పించిపెట్టిన స్కాట్ రిచ్ కీ,
– అడగ్గానే సహాయం చేసిన కె.పగల్‌వాన్‌కీ, ఆంధ్రజ్యొతి విలేకరి జి.ఎల్.ఎన్ మూర్తిగారికీ,
– నన్ను ప్రోత్సహించిన మిత్రులు గుండ శివచరణ్‌కీ, వేమూరి వెంకటేశ్వరరావు గారికీ, కందాళం రామానుజాచార్యులకీ,
– పుస్తక ప్రచురణలో సహాయమందిస్తున్న కేతు విశ్వనాధరెడ్డి గారికీ,
– నన్ను ప్రోత్సహించిన మా బావ జొన్నలగడ్డ శేష నారాయణరావుకీ,
– ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నాకు సహయం చేసిన అనేకమంది మిత్రులకీ,
– వ్యాసంలో తప్పులు సరిదిద్దిన వారికీ, తమ అభిప్రాయాలతో నన్ను ప్రోత్సహించిన ఈమాట పాఠకులకీ

…అందరికీ వందనములు.

యాదృచ్చికమో, అదృష్టమో తెలీదు – అయ్యో ఈ పుస్తకం దొరకలేదే అననుకుంటే చాలు, రెండ్రోజుల్లో నాకవి లభించాయి. ఈ త్యాగరాజు వ్యాసం పేరు చెప్పి అనేక కొత్త అనుభవాలు కలిగాయి. మరచిపోలేని అనుభూతులు మిగిలాయి. ఇది మాత్రం నేనూహించలేదు. ఈ వ్యాసం రాయడం నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నాను.
– సాయి బ్రహ్మానందం గొర్తి


Additional References:

  1. పుట్టపర్తి నారాయణా చార్యుల వారి ఇంటర్వ్యూ – ఆరాధన పత్రిక 2004
  2. త్యాగరాజ శత వార్షికోత్సవ సంచిక – 1947: ఆంధ్ర గాన కళా పరిషత్తు – రాజమండ్రి
  3. హిందూ దినపత్రిక సంగీత వ్యాసాలు – 1948
  4. కర్ణాటక సంగీత వికాసానికి త్యాగరాజు చేసిన సేవ – మంచాళ జగన్నాధ రావు – త్యాగరాజ శత వార్షికోత్సవ సంచిక – 1947
  5. శ్రీ త్యాగరాజ స్వామి సమాధి – విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ – త్యాగరాజ శత వార్షికోత్సవ సంచిక – 1947
  6. త్యాగరాజు జాతకం – వాడ్రేవు సూర్యనారాయణ – త్యాగరాజ శత వార్షికోత్సవ సంచిక – 1947
  7. Samgita Sampradaya priyadarSini – Subba Rama Dikshitar, Ettiyapuram, 1904 (Reprinted in 1960 by Madras Music Academy)
  8. Sri Tyagaraja – M.VenkaTramayya, Madras Press, 1963 –
  9. The Oriental Music in Europian Notation – A.M.Cinaswami Mudiliyar, Pudupet, Madras 1893 –
  10. Sri Tyagaraja: A Monograph – Vidya Sundari Bangalore Nagaratnamma Trust. Madras, 1976.
    
   

27అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    M.S.Prasad May 1, 2009 11:27 pm

    వ్యాసకర్తగారికి అనేకానేక ధన్యవాదాలు. ఈ వ్యాసం ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు జగదారాధ్యులైన త్యాగబ్రహ్మం గారి గురించి తెలుసుకున్నాము.

    బ్రహ్మ జ్ఞానము గలుగగ
    బ్రహ్మానందంబు గలుగు భాతిని త్యాగ
    బ్రహ్మజ్ఞానము గూర్చిరి
    బ్రహ్మాండంబైన శైలి బ్రహ్మానందా!

    దశ సహస్ర శత కోటి వందనాలతో
    భవదీయుడు

  2. 2
    Sai Brahmanandam August 13, 2009 12:44 pm

    ఈ మధ్య చెన్నై ఈనాడు వెర్షన్ లో త్యాగరాజు పై వ్యాసాలు వస్తున్నాయి. అందులోనూ కొన్ని కల్పితాలతో వున్నాయి.
    ఈ వ్యాసంలో కొన్ని వాక్యాలు యధాతధంగా నేను రాసిన త్యాగరాజు వ్యాసం నుండి రాసారు. ఇంటర్నెట్ సౌకర్యాలలో ఇదొకటి. గూగిలిస్తే కొండంత సమాచారం కాలు కదపకుండా చక్కగా దొరుకుతుంది.

  3. 3
    Rohiniprasad August 13, 2009 9:27 pm

    Imitation is the best form of flattery! ప్రొఫెషనల్ తెలుగు జర్నలిస్టులందరూ వెబ్ పత్రికలనూ, ముఖ్యంగా ఈమాటనూ శ్రద్ధగా చదువుతారు. సమాచారం పనికొచ్చేదైతే తీసేసుకుంటారు. Acknowledge చెయ్యరు. చందమామ గురించీ, రజనిగారి గురించీ నేను రాసినవి వాళ్ళకి inspirationగానో, ఇతర పద్ధతుల్లోనో పనికొచ్చాయి. ఏదైనా అంతే. నవ్వుకుని ఊరుకోవడం తప్ప మనం చెయ్యగలిగినదేమీ లేదు. We are their unpaid stringers!

  4. 4
    వినీల్ August 14, 2009 5:06 am

    ఈమాటలో వివిధ ఫీచర్లతో బాటు “హాల్ అఫ్ షేం” ఫీచర్ ఒకటి పెట్టి ఇలాంటివి లిస్ట్ చేస్తే సరి. కేవలం సంపాదకులు, రచయితలే కాక బోల్డు మంది నవ్వుకోవచ్చు. మరోసారి ఎవరైనా ఇలా కాపీ చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.

  5. 5
    Rohiniprasad August 14, 2009 10:26 am

    సమాచార వితరణ అనేది మంచిపనే కనక దీన్నంత సీరియస్‌గా తీసుకోనక్కర్లేదేమో. తక్కిన ఇంటర్నెట్ సమాచారంలాగే మనవాళ్ళు ‘విదేశీ’ సైట్లనుంచి ఇటువంటివి స్వీకరిస్తున్నారని సరిపెట్టుకోవచ్చు.
    మన దేశంలోని జర్నలిస్టులకు జీతాలూ తగినంతగా ఇవ్వరు. ఒత్తిడికూడా ఎక్కువే. వారిలో కొందరిని చూసిన తరవాత ఎవరికైనా సానుభూతి కలుగుతుంది. సెర్చ్‌చేసి కొత్త విషయాలను తెలుసుకుని రాసి పంపేంత వ్యవధీ, వనరులూ, సౌకర్యాలూ లేని పరిస్థితిలో ఇలాంటి షార్ట్‌కట్లు తప్పవేమో.
    http://www.dictionary.com వంటిది ఉపయోగించి, జర్నలిజంలో తగిలే పదాల ఉచ్చారణ తెలుసుకోవడం కష్టమేమీ కాకపోయినా మన పెద్ద దినపత్రికల్లో కూడా భయంకరమైన తప్పులు కనిపిస్తూ ఉంటాయి. జర్నలిజంలో ఉత్తమ సంస్కారం అలవడటానికి ఇంకా సమయం పడుతుంది.

  6. 6
    rama bharadwaj August 15, 2009 11:10 am

    తెలుగులో నిస్సమ్కోచంగా నిస్సిగ్గుగా అభిప్రాయాల్ని..పేరు చెప్పకుండా copy కొట్టడం ఎన్నిసార్లో కన్పిస్తుంది. పేర్లు చెప్తే దు:ఖపడతారని ఊరుకోవాలి గానీ..ఇటువంటి పనులు చేసిన వాళ్ళలో మ హా మ హులెందరో!!

    కష్టపడి చదివి..విషయ సేకరణ చేసి..ఒక పుస్తకం రాసేమనుకోండి..దానిలోని ఆలోచనలకీ..ప్రతిపాదనలకీ ఆదరణ వచ్చిందనుకోండి..ఆ తర్వాత మాట్లాడే వాళ్ళంతా ఆ ఆలోచనలూ..ఆ ప్రతిపాదనలూ..వాళ్ళ సొంత అభిప్రాయాల్లా అసలు కృషి చేసిన వారి పేరుని వీలైనంత దాచి పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తూ..నిర్భయంగా ఇతరుల మాటల్ని తమవిగా చెలామణీ చేసుకుంటారు. తెలుగుసాహిత్యసమాజం వీళ్ళ విషయంలో ఏనాడూ..ఖచ్చితంగా వ్యవహరించక పోబట్టీ ఇటువంటి వారి చర్యలు బేఫిఖరుగా కొనసాగుతున్నాయి. mediocrity ప్రధాన కారణం..నిజాయితీ లోపించడం అంతకన్నా ముఖ్యమైన కారణం. గమ్మత్తేమంటే..డబ్బూ..అవకాశాలూ..వచ్చేవి వీరికే!! ఇదేమిటని..ఇలా ఎందుకని ఎవరూ అనక పోవడం..అనుకోకపోవడం తెలుగు వాళ్ళ నైజం గనక వీటిని గురించిన చర్చ నిజంగా ఏనాడూ జరగలేదు. “మనకెందుకులెస్తూ” అన్న ఒక అతి జాగ్రత్త మనస్తత్వం దీనికి కారణం.

    పాపం ఆ “ఈనాడు రిపోర్టర్ ” దొరికాడు. దొరకని దొంగలు” పెద్ద మనుషులుగా చెలామణీలో ఉన్నారు బ్రహ్మానందం గారూ!!

    రమ.

  7. 7
    Sai Brahmanandam August 19, 2009 1:27 am

    రమ గారూ, మీరు చెప్పింది నిజం. రచయితలకి నిజాయితీ కొరవడుతోంది.

    ఈ మధ్యనే ఒక అనువాద కథ మీద ఒక ప్రముఖ రచయిత కాపీ కొట్టాడంటూ సాక్షాలతో సహా చూపించారు. సదరు రచయిత గారూ అదేం పెద్ద తప్పుకానట్టుగా వ్యవహరించి, దర్జాగా అదే పత్రికలో విరివిగా కధలూ, కాకరకాయలూ రాసేస్తున్నారు.
    తెలుగు సాహిత్యం వరకూ ‘కాపీయే రైటు” అన్నది అక్షర సత్యం.
    విషయం కాపీ కొట్టడం ఒక రకం అయితే, యధాతధంగా వాక్యాలనీ కాపీ కొట్టడం మరో రకం. మీరన్నట్లు నిలదీసే వాళ్ళు లేనప్పుడు ఇలాంటివి తప్పవేమో?

    ఈనాడు చెన్నై వారికి ఫోన్ చేసి విషయం చెబితే వారికి అది రాసిన వ్యక్తి పేరు తెలీదని బుకాయించారు. కావాలంటే హైద్రాబాదు ఆఫీసుకి ఫిర్యాదు రాయమని ఓ ఉచిత సలహా పారేసారు. ఇదీ ప్రస్తుత జర్నలిజం తాలూకు విశ్వరూపం.
    పేరూ వూరూ లేని రాతల్ని వేసుకునే పత్రికలు చెప్పే వార్తల్ని ఎవరు విశ్వసించాలి?

    నాకు ఫోన్ కాల్ దండగ తప్ప ఏమీ మిగల్లేదు.
    రోహిణీ ప్రసాదు గారు చెప్పినట్లు “Imitation is the best form of flattery! ” అని సంబరపడాలంతే!

  8. 8
    susila August 19, 2009 8:51 am

    బ్రహ్మానందం గారూ,

    అద్భుతమైన వ్యాసం…
    మీ కృషి అభినందనీయం…
    మీకు అనేకానేక ధన్యవాదాలు…
    1) ఈ వ్యాసాలన్నీ ప్రింటవుట్‌ తీసుకొని, చదువుకోడానికి వీలుగా, మీదగ్గర PDF లాంటిది ఏదైనా ఉంటే దయచేసి ఇవ్వరూ..?
    2) “కన కన రుచిరా…” అనే కీర్తనకి తెలుగులో సాహిత్యం ఇవ్వండి ప్లీజ్‌…
    ధన్యవాదాలతో
    సుశీల

  9. 9
    lyla yerneni August 19, 2009 10:51 am

    “మన దేశంలోని జర్నలిస్టులకు జీతాలూ తగినంతగా ఇవ్వరు. ఒత్తిడికూడా ఎక్కువే.”
    “చందమామ గురించీ, రజనిగారి గురించీ నేను రాసినవి వాళ్ళకి inspirationగానో, ఇతర పద్ధతుల్లోనో పనికొచ్చాయి.” -Rohiniprasad

    మన దేశమంటే? 🙂
    రజని అంటే? ఆ రజనిని గురించి ఒక్కరే ఎలా రాయగలరు? ఇతరులెవ్వరూ ఎందుకు రాయలేరు?
    చందమామ అంటే -ఆకాశంలో పెరుగుతూ తరుగుతూ ఉన్నట్లు భ్రమపెట్టే గోళమేనా? చందమామ అని మొదటిసారిగా అన్నవారెవరు? చందమామ అన్న ఆ పేరు ఒక మాస పత్రికకు పెట్టుకోవచ్చునా? అది కాపీనా ? ఇన్స్పిరేషనా? చంద్రుడికి రాయల్టీ లిచ్చారా? ఏ చందమామను గురించైనా ఎవరైనా ఎన్ని సార్లైనా ఎందుకు రాయకూడదు?
    మీ రచన నిజంగా ‘వాళ్ళకి’ ‘పనికొస్తే’ రచయితగా మీకు వచ్చిన నష్టమేమిటి? మీరు రాసిన రచనకు నష్టమేమిటి? ఘనత పెరగాలే కాని తగ్గదే? ఒక వేళ మీకన్నా బాగా కాని ఇతర రచయితలు రాసారా ఏం? 🙂 రాస్తే గనక పాఠకులకు అది మంచిదేగదా? “మంచి యన్నది పెంచుమన్నా” అన్నారుగా.

    రచయితలూ!

    త్యాగరాజు మీదో ఇంకే రాగరాజు మీదొ రాసిన ఓ నాలుగు మాటలు ఏ వరసలోనైనా ఓ రచయిత రాయనీయండి, అవి ఆ ఒకరి సొంతమై పోతాయా? ఎలా అవుతాయి? ఎందుకు అవ్వాలి? మీకున్న అభిప్రాయాలూ, ఊహలూ, అనుభవాలను, పోలినవి ఇంకెవరికీ ఉండవా? రావా? కలుగవా?
    ఏదీ మీకు ఒక్కరికే వచ్చి, ఇంకెవ్వరూ మానవులకూ ఇంతకు పూర్వమూ ఇక ముందూ రాని, రాబోని, విశేష అభిప్రాయాలు కొన్ని చెప్పండి.

    రాముడి మీదో, సోముడి మీదో మా నాన్నగారో, మా నాన్నమ్మో ఇంకెవరో ఏమైనా అనేశారోమో, అని నాలాటివాళ్ళు ఇంకేం అనకూడదా? రాయ కూడదా? రోజూ నేనేదైనా రాసే ముందు, నాకన్నా ముందు ఎవరేం రాశారో అని గూగులించాలా? ఒకవేళ ఎవరైనా రాస్తే, ఇక ఆ విషయం జోలికి పోగూడదా? మెల్లిగా అసలు రాముడిని వదిలి తర్వాత త్యాగరాజును, త్యాగరాజును వదిలి ఆయన గురించి రాసిన ఆ తర్వాతి రచయితను భజించాలా?

    ఆ త్యాగరాజు, ఆ అన్నమయ్య -మాకు ఈ ప్రపంచంలొని మనుషులతో వారి గుర్తింపుతో పని లేదు -అని రాముడి మీదో, వెంకటేశ్వరుడి మీదో ఏవో అల్లిబిల్లి పాటలు రాసుకున్నారు (?అట-నిజం ఎవడికి తెలుసు గనక?)
    కాని ఈ కళాకారుల సంగీతంలోని తీపి గురించో, వారి జీవిత నిరాడంబరత గురించో రాసే ఇప్పటి రచయితలకు (ఆ రచనల మీద) ఇంత డబ్బూ, డంబరమూ, గుర్తింపు, గుత్తాధిపత్యాల తాపత్రయమెందుకు? 🙂

    ‘మన’ దేశంలో ఇప్పుడు సోషలిజం రాలా? 🙂

    సెప్టెంబరులో DTLC సమావేశానికి వెళ్ళి – “నీదీ నాదని భేదం లేద” నే ఇద్దరో ముగ్గురో తెలుగు ప్రజా కవులూ, రచయితలను స్మరించి, భక్తితో పూజించి, 🙂 రచన చేయటం మీద ప్రజల హక్కులు గురించి తిన్నగా తెలుసుకోవాలి.

    లైలా

  10. 10
    Sai Brahmanandam August 19, 2009 11:55 am

    లైలా గారూ,

    “త్యాగరాజు మీదో ఇంకే రాగరాజు మీదొ రాసిన ఓ నాలుగు మాటలు ఏ వరసలోనైనా ఓ రచయిత రాయనీయండి, అవి ఆ ఒకరి సొంతమై పోతాయా? ఎలా అవుతాయి? ఎందుకు అవ్వాలి? మీకున్న అభిప్రాయాలూ, ఊహలూ, అనుభవాలను, పోలినవి ఇంకెవరికీ ఉండవా? రావా? కలుగవా?
    ఏదీ మీకు ఒక్కరికే వచ్చి, ఇంకెవ్వరూ మానవులకూ ఇంతకు పూర్వమూ ఇక ముందూ రాని, రాబోని, విశేష అభిప్రాయాలు కొన్ని చెప్పండి.”
    అని మీరు రాసారు.
    ఒకరు రాసిన విషయంపై మరొకరు రాయకూడడని ఎవరూ అనలేదు. ఒకే అభిప్రాయాలూ, ఆలోచనలూ ఇద్దరు వ్యక్తులకి రావచ్చు. ఇక్కడ వస్తువు ఒకటే! కానీ భావ వ్యక్తీకరణ ఇద్దరికీ ఒకేలా మాత్రం ఉండదు. ఎక్కడో అక్కడ చిన్న తేడా వచ్చి తీరుతుంది. ఒకే ఆలోచన్ని అక్షరరూపంలో పెడితే చదివే వారు తేడా గమనించ గలరు. మీరన్నట్లు ఏ వస్తువు మీదా ఎవరికీ గుత్తాధిపత్యం వుండదు. నేను త్యాగరాజు గురించి రాసింది కూడా నా సొంతమేమీ కాదు. కాకపోతే చెల్లాచెదురుగా వున్న అనేక విషయాలని సేకరించి వాటికి నాకున్న ఆలోచనా పరిధిలో ఒక అక్షర రూపం ఇచ్చానంతే! నా విషయ సేకరణ గురించి ప్రస్తావించాను కూడా. కానీ నా అభ్యంతరం త్యాగరాజు గురించి రాసినందుకు కాదు, వాక్యాలు, వాక్యాలూ కామాలతో సహా రాయడం మాత్రం ఖచ్చితంగా కాపీయే! ప్రేరణకీ, భావచౌర్యానికీ తేడా వుందనే అనుకుంటున్నాను. ఉదాహరణకి – “ఎల్లలు లేని ప్రపంచానికి ఎలక్ట్రానిక్ పత్రిక” అన్న ఈమాట లోగోని తీసుకొని “ఎల్లలులేని ప్రపంచానికి అంతర్జాల పత్రిక” అని నేను రాస్తే అది కాపీ అవుతుందా? అవ్వదా? కాపీ రైటు చట్ట ప్రకారం అది ఖచ్చితంగా భావచౌర్యమే కాకుండా, మక్కీకి మక్కీ కాపీ కూడా అవుతుందని నా అభిప్రాయం. కాదంటే ఏమీ చెప్పలేను.
    నేనేదైనా ఒక విషయంపై వ్యాసం ప్రతిపాదించానుకోండి, అది తెలిసి మరో వ్యక్తి అదే విషయంపై వ్యాసం రాస్తే దాన్ని ప్రేరణ అనాలా, లేక ఆలోచనల కాపీ అనాలా? ఒకవేళ ప్రేరణ అయితే చెప్పాలి. అలాకాకుండా నా సొంత ఆలోచనే అన్నట్లుగా చెబితే అది బుకాయింపవుతుంది. ప్రేరణకీ, కాపీకి మధ్య తేడా వుందని నా అభిప్రాయం.
    నా రచన నిజంగా ఎవరికైనా ఉపయోగిస్తే మంచిదే! కానీ అది పైకి చెప్పడం కనీస సంస్కారం. అక్కడే రచయితలకున్న నిజాయితీ, నిభద్ధత బయట పడేది. అలాంటి పదాలు మా నిఘంటువుల్నుండి తొలగించామనే వారి సంస్కారానికి చేతులెత్తి నమస్కరించడం తప్ప ఏం చెయ్యగలం చెప్పండి?

    అన్నమాచార్యకే ఈ భావ చౌర్యం బెడద తప్పలేదు. నాలాంటి ఓ మోస్తరు రచయితలెంత చెప్పండి.

  11. 11
    Rohiniprasad August 19, 2009 12:10 pm

    లైలాగారూ, ఎవరేం రాసినా, రాసుకున్నా నాకేమీ ఇబ్బందిలేదని అన్నానుకదా. సిద్ధాంతరీత్యా ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా దేన్ని గురించయినా రాసుకోవచ్చు. మనం లోగడ రాసినది వాళ్ళకి ప్రేరణనిచ్చిందని అనిపిస్తే ఆ సంగతి చెప్పవచ్చుననుకుంటాను. అది నిజమైతే compliment అనే భావిస్తాను.

  12. 12
    Rohiniprasad August 20, 2009 1:07 pm

    సుశీలగారూ,
    కనకన రుచిరా పాట సాహిత్యం, అర్థం కింద ఇచ్చాను.
    http://sangeetasudha.org/
    kana kana ruchi ra – varALi – Adi
    In this pancharatna keertana, Tyagaraja tells how he enjoyed gazing at the beautiful visage of Rama, which has magical power. He gives the examples of merciful deeds of Rama, like bestowing eternal position to Dhruva and giving salvation to Jatayu bird. He says that Rama’s mercy is limitless and adds that even gods Siva, Narada, Sita, Anjaneya, etc. are witness to testify His greatness.

    P kana kana ruchi rA kanaka vasana ninnu || Looking at you again and again is very engrossing, oh golden dressed Rama! ||
    AP dina dina munu manasuna chanuvuna ninnu
    pAlu gAru mOmuna Sree yaPara mahima danaru ninnu || You are in my heart fondly always.
    There is magical power in your tender face. ||
    C kala kala manu mukha kaLa galigina seeta
    kulukuchu Orakannula joochE ninnu || Sita with her beautiful, glossy face is looking at you from the corner of her eye in a graceful way. ||
    C bAlArkabhasu chEla maNi maya
    mAlA lankrita kandhara sarasijAksha varaka
    pOla suruchira kireeTa dhara satatambu manasAraga|| You are bright like the rising sun.
    Your dress is studded with gems.
    Your neck is decorated with garlands.
    Your eyes are like lotus flowers.
    Your cheeks are glossy.
    You wear a crown.
    I look at you heartily always. ||
    C sApatnee mAtayow suruchi chE karNa Soola maina mATa veenula
    churukkana tALaka Sree harini dhyAninchi sukhimpaga lEdA yaTu||
    mruga madalalAma Subha niTala vara jaTAyu mOksha phala da
    pava mAna sutuDu needu mahima delpa seeta telisi valachi sokka lEDAreeti ninnu | Suruchi, the step mother of Dhruva, insulted him very harshly.
    When he prayed Sri Hari was he not blessed with eternal glory?.
    Your forehead has kasturi tilakam (mark of musk on forehead).
    You gave salvation to Jatayu bird.
    Anjaneya, the son of wind god, described your greatness to Sita (in Lanka).
    Was not Sita elated with love and joy? ||
    C sukhAspada vimukhAmbu dhara pavana vedEha mAnasa
    vihArApta sura bhooja mAnita guNAnka chidAnanda
    khaga turanga dhruta radhAnga parama dayA kara
    karuNArasa varuNa laya bhayApa harA Sree raghupatE You are the bestower of happiness.
    Your opponents are blown away like clouds by a gust of wind.
    You are always in the mind of Vaidehi.
    You are intimate to Devatas.
    You are eternal bliss.
    Garuda bird is your vehicle.
    You hold chakra.
    You are ever merciful and it is like a limitless ocean.
    You dispel our fears, oh Sri Raghupati. ||
    C kAminchi prEma meera karamula needu pAda kamalamula
    baTTu konu vAdu sAkshi rAma nAma rasikuDu kailAsa
    sadanuDu sAkshi mariyu nArada parASara Suka Sownaka
    purandhara nagajA Dharaja mukhyula sAkshi gAda
    sundarESa sukha kalaSambudi vAsA sritulakE || Anjaneya who always is at your lotus feet, Siva whose abode is Kailasa chants your name (Taraka Rama) are witnesses to glorify you.
    Indra, Siva, Narada, Parasara, Suka, Sounaka, Purandara, Parvati (Nagaja), Sita (Dharinija) are witnesses to testify your greatness.
    Oh handsome Rama, you live on the ocean.
    Your seekers love to see you. ||
    C satatamu prEmapooritu Dagu tyAgarAja
    nuta mukhajita kumuda hita varada ninnu || You are full of love always.
    You are brighter than the moon.
    You bestow boons.
    You are worshipped by Tyagaraja. ||

  13. 13
    rama bharadwaj August 20, 2009 2:40 pm

    లైలా గారి లాంటి వాళ్ళ అభిప్రాయాల్ని అనుసరించే కాబోలు…తెలుగులో
    “నేనుసైతం” అన్న పాటని మొదలెట్టిన ఒక కవి గారు జాతీయస్థాయిలో అవార్డు తీసేసుకుని ఆ పేరుతో బతికేస్తున్నాడు. ఒక తరం గడిచాకా[లైలాగారి
    మనవల తరం అనుకుందాం..]”నేనుసైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను” అని రాసిందెవరయ్యా? అంటే శ్రీశ్రీ అని చెప్తే ఒప్పుకుంటారేమో
    చూడండీ!! కాదే నానమ్మా దాన్ని ఫలానా తేజం రాసాడే అంటూ చాలా నిజాయితీ గానే సుమా వాదనకి దిగుతారు. అప్పుడు మన లైలాగారు కూడా..[ఆవిడ రాసింది కాదు గనక]..ప్రజాస్వామ్య దృక్పధంతో శ్రీశ్రీ దైతేనేమిరా..మరి కాశీదైతే నేమిరా..అన్న ధోరణిలో శ్రీశ్రీ అనే ఒక కవి ఉండే వాడు..అన్న కధ వైపు పోకుమ్ డానే”ఔనౌన్రా మనవడా” అని వంత పాడేస్తారు.

    ఇందువల్న తెలిసిన నీతి ఏమన్ గా……కాపీలుకొట్టుడు. కావల్సినంత దొంగ
    పేరు కొట్టుడు. టెల్గూస్ కి కాపీ కళ యనిన మిక్కిలి మక్కువ. ideas అనునవి
    ఏమన్నా ఒకరిసొమ్మా?! చేదుకోగల్గిన వాళ్ళ చేవ చాలున్ .

    రేప్పోద్దుట “తందనానాహి” అంటూ మరో కామ్రేడ్ పదం అందుకోవచ్చు.అబ్బే అదేమన్నా అన్నమయ్య కాపీరైటా? కావాలంటే అని చూడండీ..లైలాగారున్నారు కదా!! ఎకసెక్కాలాడ్డానికి. అయితే ఇదే విషయాన్ని షేక్స్పియర్ విషయంలోనో..పోనీ విలియమ్ కార్లోస్ విషయంలోనో
    అని చూడమనండీ!! తెల్లవాడు ఏంచేస్తాడో? తెలుగోళ్ళు కదా!! ఏంచేస్తారూ !!

    రోహిణీ ప్రసాద్ గారికి తన వ్యాసాల దాకానే అభ్యంతరం లేదా?! లేక, తన తండ్రి గారి వ్యాసాల్ని కూడా పేరుచెప్పకుండానే రేప్పొదుట “ప్రేరణ పొందే సుమండీ” తమ రచనల్లో వాడేసుకోవచ్చునా? ఆ ఒక్క రహస్యం ఆయన చెప్పేస్తేనూ..[లైలాగారి లాంటి వాళ్ళు..ఎటూ రెడీ గానే ఉన్నారు గన్క..కాపీదారుల హక్కుల్ని కాపాడ్డానికి].”.నేను సైతం” రెడీ!! అయ్యా బ్రహ్మనందం గారూ!! తొందరపడి మీరెందుకు అసలు కష్టం పడతారూ! కాస్త
    నిదానించి వేచిచూడండి..లైలా గారిలాంటి పెద్ద మనసున్న వాళ్ళుండగా.మన్కేం భయం!! కాపీలు కొడుతూ..మంచి కవులూ..కధకులూ..వ్యాసకర్తలూ..అవడానికి రాచమార్గమే ఉందికదా ఇప్పుడు!! చోరాతురాణాం..న భయం..న లజ్జ!!

    రమ.

  14. 14
    Rohiniprasad August 22, 2009 7:08 pm

    రహస్యమేమీ లేదు. వ్యాసమైనా, కథ అయినా, కామెంటయినా రాస్తున్నదాన్లో రాసేవారి సంస్కారం బైటపడుతూనే ఉందనుకుంటాను.

  15. 15
    Sai Brahmanandam August 22, 2009 10:38 pm

    సుశీల గారూ,

    మీకు త్యాగరాజు వ్యాసం నచ్చినందుకు సంతోషం.
    కాపీ రైటు చర్చల్లో పడి మీ వ్యాఖ్యకి బదులిద్దామనుకుంటూ వాయిదా వేస్తే వచ్చాను.
    పల్లవి: కన కన రుచిరా
    కనక వసన నిన్ను (కన)

    అనుపల్లవి. దిన దినము మనసున
    చనువున నిన్ను (కన)

    పాలు కారు మోమున శ్రీయపార
    మహిమ తనరు నిన్ను (కన)

    కలకలమను ముఖ కళ కలిగిన సీత
    కులుకుచునోర కన్నులను జూచు నిన్ను (కన)

    బాలార్కాభ సుచేల మణి మయ
    మాలాలంకృత కంధర
    సరసిజాక్ష వర కపోల సురుచిర
    కిరీట ధర సంతతంబు మనసారగ (కన)

    సాపత్ని మాతయౌ సురుచిచే
    కర్ణ శూలమైన మాట వీనుల
    చురుక్కన తాళక శ్రీహరిని ధ్యానించి
    సుఖింపగ లేదాయటు (కన)

    మృగ మద లలామ శుభ నిటల వర
    జటాయు మోక్ష ఫలద పవమాన
    సుతుడు నీదు మహిమ తెల్ప
    సీత తెలిసి వలచి సొక్క లేదా
    ఆ రీతి నిన్ను (కన)

    సుఖాస్పద విముఖాంబు ధర పవన
    విదేహ మానస విహారాప్త
    సుర భూజ మానిత గుణాంక
    చిదానంద ఖగ తురంగ ధృత రథాంగ
    పరమ దయాకర కరుణా రస వరుణాలయ
    భయాపహర శ్రీరఘుపతే (కన)

    కామించి ప్రేమ మీర కరముల నీదు
    పాద కమలముల పట్టుకొను
    వాడు సాక్షి రామ నామ రసికుడు
    కైలాస సదనుడు సాక్షి
    మరియు నారద పరాశర శుక
    శౌనక పురందర నగజా ధరజ
    ముఖ్యులు సాక్షి కాద సుందరేశ
    సుఖ కలశాంబుధి వాసాశ్రితులకే (కన)

    సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజ
    నుత ముఖ జిత కుముద హిత వరద నిన్ను (కన)
    రోహిణీ ప్రసాదు గారూ, మీరు అర్థంతో సహా చెప్పినందుకు థాంక్స్ !
    -సాయి బ్రహ్మానందం

  16. 16
    గిరి August 23, 2009 2:25 am

    బ్రహ్మానందం వ్యాసాన్ని వాక్యాలకు వాక్యాలను, కామాలతో సహా కాపీ కొట్టారో కొట్టలేదో నాకైతే తెలియదు! ఈనాడులో వచ్చిన వ్యాసాన్ని, ఈమాటలో వ్యాసాన్ని పోలుస్తూ – ఎక్కడెక్కడ కాపీ కొట్టారో విపులంగా బ్రహ్మానందం గారే వ్రాస్తే, పాఠకులకు సౌకర్యంగా ఉంటుంది.

    కాపీ కొట్టడం నిజమైతే, అది చాలా విచారించదగ్గ విషయం.

    మరో విషయం –

    త్యాగరాజు మీదో రాగరాజు మీదో రాసినది (non-fiction) మరొకరు వ్రాయడానికి, ‘నేను సైతం’ కవితాపాదాలను (fiction) సుద్దాల అశోక్ తేజ సినిమా పాటలో ఉపయోగించుకోడానికి తేడా లేదా? సుద్దాల ‘నేను సైతం’ పాదాలను తనవిగా ఎక్కడైనా చెప్పుకున్నాడా? ఆ పాటకు జాతీయ స్థాయి అవార్డ్ వచ్చింది ఈ తరంలోనా…ముందు తరంలోనా, లేక వెనక తరంలోనా? అవార్డ్ ఇచ్చే వాళ్ళకు, ‘నేను సైతం’ పాదాలు అశోక్ తేజవి కావు అని తెలియవా? అవార్డు ఇచ్చే వాళ్ళు అజ్ఞానులైతే, జ్ఞానులు అజ్ఞానులకు తెలియ చెప్పవచ్చు! చెప్పినా వినకపొతే, నిరసన తెలుప వచ్చు. కానీ మనం అదేమీ చేయం. వ్రాసిన కవి పేరు (అందరికీ తెలిసిన పేరే అయినా) చెప్పడానికే గుండెల్లో దడ?!

    (ఒకవేళ)అవార్డు ఇచ్చిన ఈ తరం వీళ్ళకే ఆ పాట లోని పంక్తులు కొన్ని(లేక పల్లవి) శ్రీశ్రీ వి అని తెలియక పోతే, రాబోయే తరాలకు తెలియక పోవడంలో వింతేముంది!

    త్యాగరాజు జీవితాన్నో, అన్నమయ్య జీవన విధానాన్నో వస్తువుగా తీసుకుని పుస్తకం వ్రాయమని పోటి పెడితే – ఆ పోటీకి ఒక వంద పుస్తకాలొస్తే – వంద పుస్తకాల్లో స్పృశించే అంశాల్లో అస్సలు పోలికలు లేకుండా ఉంటాయా? పుస్తకాల్లో వాక్యాల్లో (విభిన్న రచయితలు వ్రాసినవే అయినా) సారూప్యతలు, (కనీసం) అక్కడక్కడ అయినా ఒకే రకమైన వాక్యాలు లేకుండా ఉంటాయా? పోటీలకు పుస్తకాలు పంపిన వందమంది రచయితలు, త్యాగరాజు/అన్నమయ్య మీద బయట లభ్యమయ్యే (mostlty non-fiction) పుస్తకాల్లోంచే (non-fiction)విషయాన్ని సేకరించి వ్రాయాలి కదా. అలాంటి పరిస్థితుల్లో వంద పుస్తకాలు విభిన్నంగా నాపూర్తిగా ఒక దానికి ఒకటి పోలిక లేకుండా ఉండేందుకు ఎంత వరకు అవకాశం ఉంది?

    ఇంకో ప్రశ్న –

    ‘త్యాగరాజుకు ఇరవైమంది శిష్యులు కలరు.’
    ‘అన్నమయ్య పాట పాడాడు.’
    ‘రాముడు మంచి బాలుడు.’
    అన్న పై మూడు వాక్యాలను తెలుగులో ఎన్ని విధాలుగా వ్రాయగలం? ప్రయత్నించి చూడండి!

    – గిరి

  17. 17
    lyla yerneni August 23, 2009 2:23 pm

    “ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా దేన్ని గురించయినా రాసుకోవచ్చు. మనం లోగడ రాసినది వాళ్ళకి ప్రేరణనిచ్చిందని అనిపిస్తే ఆ సంగతి చెప్పవచ్చుననుకుంటాను. అది నిజమైతే compliment అనే భావిస్తాను ” -Rohiniprasad

    మంచి మాటలు.
    కానీ, తదుపరి రచనకు, ముందరి రచన ప్రతిసారీ ప్రేరణ కానవసరంలేదు. కానప్పుడు అవతలి రచయిత చెప్పే ప్రసక్తే లేదు గదా!

    “నేనేదైనా ఒక విషయంపై వ్యాసం ప్రతిపాదించానుకోండి, అది తెలిసి మరో వ్యక్తి అదే విషయంపై వ్యాసం రాస్తే దాన్ని ప్రేరణ అనాలా, లేక ఆలోచనల కాపీ అనాలా? ఒకవేళ ప్రేరణ అయితే చెప్పాలి. అలాకాకుండా నా సొంత ఆలోచనే అన్నట్లుగా చెబితే అది బుకాయింపవుతుంది. ప్రేరణకీ, కాపీకి మధ్య తేడా వుందని నా అభిప్రాయం.” -Sai Brahmanandam

    వ్యాసం ఎవరితో ప్రతిపాదిస్తే?

    మీరు త్యాగరాజుమీద వ్యాసం రాయాలనుకున్నారు. ఇంకోరు కూడా అదే అనుకున్నారు. ఇంకో వెయ్యివేల జనాభా అదే త్యాగరాజు మీద రాద్దామనుకున్నారు. ఎందుకు రాయకూడదు? శత జయంతి అనో, నివాళి అనో ఒకే మనిషి మీద వందలు వందలు వేల రాతలు రాస్తారు. సభలు చేస్తారు. చేస్తున్నారు కదా? అంతమంది రాసినప్పుడు అందులో సమాచారం చాలా overlapping గా ఉండదూ? మీరు ‘మనకు తెలియని మన త్యాగరాజు’ అని శీర్షిక పెట్టి రాస్తారు ఇంకొకరు ‘మనకు తెలిసిన మన త్యాగరాజు’ అని రాస్తారు. ఇంకోరు ‘మీకు తెలియని మా త్యాగరాజు,’ అనో ‘మాకు తెలియని మీ త్యాగరాజు’ అనో రాస్తారు. ఈ శీర్షికలమీద నిఘా వేసుకుని ఎవరు కూర్చుంటారు చెప్పండి. ఒక్కో వ్యాసంలో -నా పేరు ఉదహరించారా, నా వాక్యాలు కొటేషన్లలో పెట్టారా లేదా, -అని సోదాలు చేసి, పెడితే విర్రవీగి, లేకపోతే అలా పెట్టని వాళ్ళమీద కజ్జాలకు, తెలివున్న రచయితలు ఎవరు పోతారండీ?

    మనకు ఏవో అనవసరపు అనుమానాలు వచ్చినప్పుడల్లా అమెరికానుండి ఇండియాకు ఫోన్ కొడితే, అక్కడ ఎక్కడో మద్రాసులోనో, హైదరాబాదులోనో ఏ తెలుగు విలేఖరి, సంపాదకుని, ఉద్యోగమన్నా ఊడాలా? అప్పుడు ఆ వ్యక్తి త్యాగరాజు లాగా ఊంఛ వృత్తి అవలంబించాలా? రామదాసు లాగా జైలు కెళ్లాలా? అప్పుడు రక్షించటానికి ఏ రాముడొస్తాడు 🙂 చెప్పండి.

    ఏమిటి మీ ఆశయం ఈ త్యాగరాజు పై వ్యాసాలు వ్రాయటంలో?త్యాగరాజు లాగా చక్కని సంగీత సాహిత్యాలు రాసే వాళ్ళు ఎందరో మనకు ఉండాలి అని గాని, త్యాగరాజు వలె అడుక్కు తినవలసిన పరిస్థితికి మరి కొంత మందిని తేవటం కాదు కదా?

    ఒక పని చెయ్యండి. మీరు మరీ బాగా రాసేస్తుంటే, ఇతరులకు అవి మరీ మరీ ప్రేరణ ఇచ్చేసి, అంతగా కామాలూ, ఫుల్స్టాపులతో సహా కాపీ చెయ్యబుద్ధవుతాయేమో. నాలాగా అన్నీ తప్పులు రాయండి. ఎవరూ మీ రచనలు చదవరు. దొంగిలించరు. అప్పుడు మీకు ఈ హైరానా ఉండదు.:-)

    లైలా

  18. 18
    lyla yerneni August 23, 2009 4:04 pm

    “ఇందువల్న తెలిసిన నీతి ఏమన్ గా……కాపీలుకొట్టుడు. కావల్సినంత దొంగ
    పేరు కొట్టుడు.” -rama bharadwaj అభిప్రాయం

    ‘దొంగ పేరు’ కాపీలు కొడితే వస్తుందా. మీరు చెప్పబట్టి ఈ రహస్యం ఇప్పటికి తెలిసింది. :-):-)

    “రేప్పోద్దుట “తందనానాహి” అంటూ మరో కామ్రేడ్ పదం అందుకోవచ్చు.అబ్బే అదేమన్నా అన్నమయ్య కాపీరైటా?”-rama bharadwaj

    తందనాహి లాటి మాటలు, తందనాలు, తదన్నానాలు, తన్నా మన్నాలు, లాటి పదాలూ, మరికొన్ని ఎన్నో పదాలూ ఉపయోగిస్తూ ఎందరో రాయవచ్చు. రాశారు. రాస్తారు. అన్నమయ్య కాని, ఇతర రచయితలు కాని రాసినవి రాసినట్లు భద్రంగా అలాగే ఉంటాయి. అన్నమయ్య రచనలకు వీటి వల్ల ఏం లోటు జరగదు.
    పైగా రచనల్లో భావ సామ్యతలు, పద సామ్యతలు చూపిస్తూ -విమర్శకుల/ కవుల వ్యాసాలొస్తే, అన్నమయ్య పాటలు ఇంకా ఎక్కువ ప్రచారం లోకి వస్తాయి. నాకు లాభాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మీకు నష్టాలు తోస్తే చెప్పండి.

    [లైలాగారి లాంటి వాళ్ళు..ఎటూ రెడీ గానే ఉన్నారు గన్క..కాపీదారుల హక్కుల్ని కాపాడ్డానికి]-rama bharadwaj

    మీరు ఈ మాట పత్రికలో కామెంట్ల మినహా, ఇతర ఏ రచనలు ఎప్పుడు, ఎక్కడ , చేశారో ఇంతవరకూ మీరు చెప్పందే.
    ఒకవేళ మీరు రచయితలై ఉంటే అందులో మీరు కాపీ చేసినవి సందేహించకుండా చెప్పండి. 🙂
    ప్రస్తుతానికి మీ identty loss, property theft ఇలాటివేవీ జరగకుండా, మీ ఆస్థులు, హక్కులు భద్రంగా ఉన్నాయని, మీరు క్షేమంగా, అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారని ఆశిస్తాను. 🙂

    ఒక ప్రశ్న- “సీతమ్మ మాయమ్మ – శ్రీ రాముడు మా తండ్రి” అన్న కృతి త్యాగరాజు లలిత రాగములో రాస్తే ఇప్పుడు వసంత రాగంలో పాడుతున్నారన్న విషయం ” కొత్త సంగీత విద్యా దర్పణములో చదివాను. ఎందుకలా పాడుతున్నారో వివరించి ఆ కృతిని ఆ రాగాలను musicians వినిపించగలరా?

    లైలా

  19. 19
    Sai Brahmanandam August 23, 2009 10:27 pm

    లైలా గారూ,

    ఒకే దృశ్యాన్ని చూసి అనేకమంది ఎలా చిత్రీకరించచ్చో అలాగే ఒకే వస్తువుపై ఎన్ని కథలూ, వ్యాసాలైనా రావచ్చు, రాయవచ్చు. దీన్నెవరూ కాదనరు. ఎటొచ్చీ మీ వాదనతోనే నాకు పేచీ! దానితో సుతారామూ అంగీకరించలేను.

    ఒకరి ఉద్యోగం పోతుందని పోనీలే అనుకునే పరిస్థితి కాదు. జర్నలిస్టు వుద్యోగానికి మరీ అంతగా కాకపోయినా కొంతైనా నిజాయితీ వుండాలి. అవన్నీ తుంగలో తొక్కి చూచి కాపీ విధానాన్ని అనుసరిస్తూ తప్పులేదంటే ఆ పత్రిక వాళ్ళూ ఒప్పుకుంటారా? నేను ఈనాడు వాళ్ళకి కాల్ చేసింది ఆ సదరు రచయిత వుద్యోగం పీకించడానికి కాదు, కేవలం నా నిరసన తెలియజేయడానికే! అదే వ్యక్తి మరో కథనం రాసిస్తే ఆ పత్రికా యాజమాన్యం కాస్త ఓ కన్నేసి చూస్తారనంతే!

    ఎంత మందైనా త్యాగరాజు గురించి రాయచ్చు. రాసారు. రాస్తున్నారు. రాస్తారు కూడా. మీ వాదనెలా వుందంటే కాపీ కొట్టడం తప్పు కాదు కానీ అలా గొంతెత్తడం నేరమన్నట్లుగా వుంది. శుభం. అలాగే కానీయండి. ఈ కాపీ రైటు చట్టాలూ, చట్టిబండలంటూ ఎవరూ వాపోనవసరం లేదు.

    ఈ వాదన పక్కన పెడితే – మీరేసిన సంగీతానికి సంబంధించిన ఒక ప్రశ్నకి నాకు తెలుసున్న జవాబు. ఇది మీకెలా తెలిసిందీ? ఎక్కడైనా చదివారా? లేక ఎవరైనా చెప్పారా? అయితే మీ జవాబు కాపీయే కదా అన్న వాదన్ని లేవనెత్తరని ఆశిస్తూ –

    “సీతమ్మ మాయమ్మ – శ్రీ రాముడు మా తండ్రి” అన్న కృతి త్యాగరాజు లలిత రాగములో రాస్తే ఇప్పుడు వసంత రాగంలో పాడుతున్నారన్న విషయం ” కొత్త సంగీత విద్యా దర్పణములో చదివాను. ఎందుకలా పాడుతున్నారో వివరించి ఆ కృతిని ఆ రాగాలను ముసిచీన్స్ వినిపించగలరా?” అని మీరడిగారు.

    వసంత, లలిత రాగాలు మాయామాళవ గౌళ రాగ జన్యాలు.
    లలిత రాగం ఆరోహణా, అవరోహణా ఇలా సాగుతాయి.
    ఆరోహణ: స రి1 గ3 మ1 ద1 ని3 స
    అవరోహణ: స ని3 ద1 మ1 గ3 రి1 స

    వసంత రాగం ఆరోహణా అవరోహణా కూడా ఇలాగే ఉంటాయి, ఒక్క దైవతం తప్ప.
    ఆరోహణ: స రి1 గ3 మ1 ద2 ని3 స
    అవరోహణ: స ని3 ద2 మ1 గ3 రి1 స

    లలిత రాగంలో శుద్ధ దైవతం వస్తే, వసంతలో చతుశృతి దైవతం వుంది. రెండూ దాదాపు ఒకేలా వినిపిస్తాయి. తేడా కనిపెట్టడం చాలా కష్టం. త్యాగరాజు రచన “సీతమ్మ మాయమ్మ” లలిత రాగంలో రాసినా ప్రస్తుతం అందరూ వసంతలోనే పాడుతున్నారు. దీనిపై అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. రెండు విధాలుగానూ పాడచ్చు. పాడిన వారూ ఉన్నారు. కాకపోతే రెండూ పాటలూ రమారమి ఒకేలా వుంటాయి. వసంతలో కాస్త రసం పాలెక్కువగా వుండి, సాహిత్య భావాన్ని మరో మెట్టు పైకి తీసుకెళుతుంది.
    ముత్తుస్వామి దీక్షితార్ లలిత రాగంలో కొన్ని కృతులు స్వరపరిచారు. దాని ఆధారంగా లలిత రాగం మాయామాళవ గౌళ జన్యంగా భావిస్తూ శుద్ధ దైవతాన్ని చూపించారు. ఎవరు ఈ రాగాల మార్పిడి చేస్తూ పాడడమూ, అందరికీ చెప్పడమూ మొదలేట్టారో తెలీదు ప్రస్తుతం వసంతలోనే అందరూ పాడేస్తున్నారు. దీన్ని లలితలో కూడా చక్కగా పాడచ్చు. నా దగ్గర లలిత రాగంలో ఉన్న పాట లేదు. కానీ గతంలో నేను ఒక కచేరీలో విన్నాను.

    ఇదొక్కటే కాదు చాలా రాగాల విషయాల్లో ఈ వత్యాసాలున్నాయి. ఉదాహరణకి ఆభేరి రాగం ఏ నటభైరవి జన్యమా లేక ఖరహరప్రియ జన్యామా అని పలు వాదాలున్నాయి. బాలమురళి లాంటి విద్వాంసులు ఆభేరిలో చతుశృతి దైవతం వాడి పాడితే మరికొంతమంది శుద్ధ దైవతాన్ని ఉపయోగించారు. రెండూ సరైనవే! వినసొంపుగా పాడేతే ఎలాగైనా పాడుకోవచ్చు.

    -సాయి బ్రహ్మానందం

  20. 20
    rama bharadwaj August 24, 2009 7:13 am

    బ్రహ్మానందం గారూ!! నేను మీ అభిప్రాయం తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నాకు తెలిసి మనం ఒక చోట నించి విషయసేకరణ చేసేటప్పుడు గానీ..మరి ఒకరు రాసిన వాక్యాల్ని స్వీకరించేటప్పుడు వాటిని కొటేషన్ లో ఉంచి చెప్పడం
    గానీ వ్యాసం రాసే వారు పాటించటం కనీస మర్యాద. అలా చేయటం ఆ వ్యాసకర్త గౌరవాన్ని పెంచుతుందే గానీ తగ్గించదు.తన కన్నా ముందు వచ్చిన ముఖ్యమైన వ్యాసాల్ని ఆ తరువాతి వారు వారికి తెలిసినంత వరకూ..mention
    చేయడం సముచితం. పని చేయకపోతే ఎవరూ ఏమీ అనరు గానీ ఆసక్తి తో ఎవరు దీక్షగా ఒక విషయం మీద పనిచేసినా వాళ్ళ కృషిని మనసా అభినందించే సంస్కారం తెలుగు వారిలో [ఇతరుల్తో పోలిస్తే]…తక్కువే!!

    “నీవునేర్పిన విద్యయే నీరజాక్ష” అన్నట్టు లైలాగారి వాదన[కాదు, వితండ వాదన ప్రకారం]..ఎవరు ఎవరి అభిప్రాయాలనైనా వాడేసుకోవచ్చు, అందులో తప్పులేదు. ఆమె వ్యంగ్యాలకి నావి ప్రతి వ్యంగ్యాలు మాత్రమే!! ఆవిడ అభిప్రాయం ప్రకారం “originality” కి అంత ప్రత్యేకత ఏమీ లేదు.ఆమె ఇంగ్లీషులో ఇటువంటి వాదన చేస్తే అప్పుడు వారేమంటారో కూడా చెప్పి ఉండవల్సింది.intellectual sincerity ఎప్పుడైనా విలువైన దే!! అలాకాదంటే అది double standards ని తెలియజేస్తాయి.[ఇంక నా అభిప్రాయం చెప్పాకా..నేను అసలు పేరుకి విలువనిస్తానొ..”దొంగ పేరు” కి విలువ నిస్తానో లైలా గారికి తెలిసిన ట్టే!

    “గిరి” గారూ పేర్లు చెప్పడంలో నాకు “ధడ” ఎందుకుండాలండీ?? నన్నేమన్నా IPC కింద అరెస్టు చేస్తారా??;) సుద్దాల అశోకతేజ కన్నా ముందు త్యాగరాజునీ..రామ దాసునీ వాడుకున్న సుందర్రామ్మూర్తీ..ఇంకా సినారే మాత్రంలేరూ!! “దొరకునా ఇటువంటి సేవా!!” అన్నారు కదా!! కొన్నిచోట్ల ఫర్వాలేదులే అన్పించిన పల్లవే కొన్నిచోట్ల ఇబ్బంది గానూ అన్పిస్తుంది.

    రమ.

  21. 21
    lyla yerneni August 25, 2009 9:04 pm

    బ్రహ్మానందం గారూ!! నేను మీ అభిప్రాయం తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. -rama bharadwaj

    అభిప్రాయము బ్రహ్మానందం గారిది, మీరు కేవలం ఏకీభవించేవారు కావటాన – బ్రహ్మానందం గారి ఆ అభిప్రాయాన్ని quotes లో ఇస్తారా. Thanks.

    “లైలా గారూ, […..] మీ వాదనెలా వుందంటే కాపీ కొట్టడం తప్పు కాదు కానీ అలా గొంతెత్తడం నేరమన్నట్లుగా వుంది.” -Sai Brahmanandam
    ” నేను ఈనాడు వాళ్ళకి కాల్ చేసింది ఆ సదరు రచయిత వుద్యోగం పీకించడానికి కాదు, కేవలం నా నిరసన తెలియజేయడానికే! అదే వ్యక్తి మరో కథనం రాసిస్తే ఆ పత్రికా యాజమాన్యం కాస్త ఓ కన్నేసి చూస్తారనంతే!” – Sai Brahmanandam

    మీ రాతలను కాపీ కొట్టినట్లు ఎవరు ఋజువు చేశారు? ఋజువు చెయ్యకుండా కాపీకొట్టేశారని అపవాదులు (slander/libel) వెయ్యటం మాత్రం నేరం కాదూ?
    ఎందుకు ఆ సదరు రచయిత మీద – రచనలు కాపీ కొడుతున్నాడని అనుమానం, అపనమ్మకం పత్రికాధికారులకు రేకెత్తించటం? ఎందుకా నేరస్థుడి ముద్ర?

    “సీతమ్మ మాయమ్మ, శ్రీ రాముడు మా తండ్రి [….]భాగవతాగ్రేసరు లెవరో వారెల్లరు వర త్యాగరాజునకు పరమ బాంధవులు” అని లలిత రాగంలో రచించి, పాడుకున్న ఆ భక్తుడు త్యాగరాజూ గురించి వ్యాసం రాసిన మీకు – మరి ఆ సీతా రాముల కథ గురించి తెలియకుండా ఉంటుందా.
    అపవాదు మనిషికి ఎంత చెరుపు చేస్తుందో వారి చరిత్ర మనకు చెప్పదూ! రాముడు అపవాదు భయానికి జడిసి సీతను అగ్ని పరీక్షకు గురిచేశాడు అంటారు గదా!
    ఆ తర్వాత, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త కోసం, శ్రీరాముడు తన ఇంట్లో వాళ్ళతో – సీత మీద ఒక కన్నేసి ఉంచండి- అని చెప్పి ఉండాల్సిందా? 🙂 అసలు సీత తప్పేమీ చెయ్యకుండానే! How demeaning!
    సర్లెండి! ఒక చాకలి వెర్రివాగుడుకి, రాముడికి చిర్రెత్తి కాదూ , సీతను ఆడివిలో వదిలి పెట్టించింది. సీతకు పట్టపురాణి పదవి పోయిందీ, జీవితం తారుమారయ్యిందీ – ఆ చాకలి అపవాదు వల్లేగా?. 🙂

    మీరు మీ కాపీరైటు, దొంగతనం దాఖలాలు చూపిస్తూ ‘ఈనాడు’ పత్రిక యాజమాన్యం చెప్పిన మార్గంలోనే మీ అభియోగం ఫైల్ చేసుకోవచ్చు గదండి.
    చౌర్యం ఋజువయ్యేదాకా ఆగాలి. తప్పదు. ఈ లోపలే ‘ఈమాట’ పత్రిక లో ప్రచురించబడిన మీ వ్యాసం నుండి మీ ‘సొంత వాక్యాలు’ ఎవరో రచయిత దొంగిలించినట్లు, ఈ పత్రికలో -అభిప్రాయాల విభాగం లో ‘వాదు’ వెయ్యటం సరి కాదు.

    లైలా

  22. 22
    మల్లాది వేంకటగోపాలకృష్ణ May 10, 2013 8:34 am

    అయ్యా బ్రహ్మానందం గారూ — మీ పేరులోనే బ్రహ్మానందం దాగి ఉన్న కారణంగానే మీరు ఇంతటి గొప్ప ఆనందాన్ని అందరికీ పంచగలిగినారని నా అభిప్రాయం. త్యాగరాజస్వామి పేరును తలచుకోవడానికే కోటి జన్మాల పుణ్యం చేసుకుని ఉండాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఇన్ని విషయాలను ఇంత ఓపిగ్గా మీరు ఎలా తెలుసుకోగలుగుతారు, ఎలా రాయగలుగుతారు. నాహంకర్తా హరిః కర్తా అని టిటిడి ప్రసాద్ గారు చెప్పినట్టుగా చేస్తున్నది నేనుకాదు చేయిస్తున్నది రామభద్రుడే అని మనం మనసావాచా నమ్మినంతకాలం కర్మను ఆ దేవదేవుడే నియంత్రిస్తాడు. ఎప్పడు, ఎక్కడ, ఏం చేయాలో నిర్ణయిస్తాడు. మనల్ని ముందుకు నడిపిస్తాడు.

    పలుమారులు జనియించుచుచు పాపకూపమ్ముల
    బడుచు గతించెనెన్నియో జన్మంబులు నిరర్ధకమ్ములై
    ఈ జన్మంబునకిట్టులీరీతి కన్నులుందెరచి నా రాముని
    కీర్తింప వరమయ్యెనాకునొక సద్గురు త్యాగరాయకృతి.

    – మల్లాది వేంకటగోపాలకృష్ణ శాస్త్రి

  23. 23
    Sivalenka May 9, 2014 10:10 am

    చాల మంచి వ్యాస పరంపర. శ్రీ బ్రహ్మనందం గారికి నమస్కారాలు అనడం మాత్రమే తెలుసు.

    ఈ వ్యాసాలు పుస్తకంగా తెస్తే మటుకు కొందరు వెలిబుచ్చిన అభిప్రాయాలు తప్పక జత పరచండి. అలాగే అక్కడక్కడ 19XX అని పడింది బహుశ 18xx బదులు.

    శివలెంక అయ్యవారు

  24. 24
    Param Kompella June 19, 2014 6:24 pm

    బ్రహ్మానందం గారు,
    వసంత రాగం “సూర్యకాంతం” రాగ జన్యం అని కొన్ని చోట్ల చూసిన గుర్తు. అది సరి కాదా?

  25. 25
    Dr P V Ramana April 12, 2017 11:22 am

    Sai Brahmanandam Gaaru, I am in the process of compiling a curated version of Saint Thyagaraja’s History and other apsects such as Bhakti Yoga and Nada Yoga. This is a part of my ongoing project of Recording all known Carnatic Vocal Music in a teaching format. I have completed about 700 compositions so far, and hope to complete at least 1000 before December 2017, when we wish to launch the free website for advanced learners. This book will also be published at that time. I wish to correspond with you regarding the source material for your most extensive and wonderful essay on Manaku Teliyani Tyagaraju in 5 parts. Can you please give your email id and mobile number? More details about me and my project at http://www.itm.edu and http://www.carnaticheritage.in Thanks in advance and warm regards, Ramana

  26. 26
    నళినీ కాంత్ July 27, 2020 9:09 pm

    చాలా విస్తారమైన వ్యాస పరంపర. త్యాగరాజ స్వామి గురించి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన వ్యాస పరంపర. ఇంతకంటే సరళంగా రాయటం అంటే తేలిక కాదు. మీకు కర్ణాటక సంగీతాభిమాని గా నా నమస్కారం.

    పాత వ్యాఖ్యలలో ఈ వ్యాసం కాపీ కొట్టబడిందని చదివి, అది కూడా ఒక ‘so called’ ప్రముఖ పత్రికలో పడిందని చదివి చాలా చికాకుగా, బాధగా అనిపించింది.

  27. 27
    Anon April 27, 2024 6:31 am

    “కర్ణాటక సంగీతమున్నంత కాలమూ త్యాగరాజు జీవించుంటాడు. త్యాగరాజు సంగీతమున్నంత కాలమూ తెలుగు భాషా ప్రతీ ఒక్కరి నోళ్ళలోనూ నానుతూనే ఉంటుంది. ఇది మాత్రం అక్షర సత్యం.”

    Well said.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • సంగీత పట్నం – కదనకుతూహలం
  • ఊర్మిళ రేఖ
  • తెరమరుగవుతున్న తెలుగు నాటకం
  • కోనసీమ కథలు: వామనుడు
  • ఏకాకితనం

ఇటువంటివే…

  1. మనకు తెలియని మన త్యాగరాజు -1
  2. మనకు తెలియని మన త్యాగరాజు – 2
  3. మనకు తెలియని మన త్యాగరాజు – 4
  4. మనకు తెలియని మన త్యాగరాజు – 3
  5. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్

మే 2009 సంచికలో ...

  • ఇంట్లో ఎవరూ లేరు
  • ఈమాట పాఠకులకు…
  • ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II
  • ఒక తెలుగు పుస్తకం కావాలి
  • ఒక్కతే… మృత్యువు
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 8: దిగ్భ్రమ కలిగించే గూడెల్ మేధోక్రీడ
  • గాలిపటం
  • గృహకల్ప
  • నాకు నచ్చిన పద్యం: ఉత్తర రామాయణంలో సీత
  • పునరపి
  • ప్రచురణకి వచ్చే రచనల గురించి
  • మనకు తెలియని మన త్యాగరాజు – 5
  • మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా
  • మే 2009 సంచిక విడుదల
  • రామన్న
  • వెంటాడుతున్న ఊడుగపూత పరిమళం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ప్రచురణకి వచ్చే రచనల గురించి
ఒక తెలుగు పుస్తకం కావాలి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.