మనకు తెలియని మన త్యాగరాజు – 5

తిరుమంజన వీధి – త్యాగరాజు ఇల్లు

త్యాగరాజు తదనంతరం ఆయనున్న ఇంట్లో మనవడి భార్య గురువమ్మాళ్ కొంతకాలముంది. ఆ తరువాత తన బంధువులున్న తంజావూరెళ్ళిపోయింది. ఈవిడ ఆ ఇల్లు ఎవరికీ అమ్మలేదు. 1900 మొదట్లో పోయేవరకూ ఆమె పేరే ఉండేది. ఆవిడ తదనంతరం దాన్ని పంచనదయ్య మునిమనవలు త్యాగరాజ ఆరాధోత్సవ కమిటీ కప్పగించారు. అన్నగారి వాటాని 1828 ప్రాంతంలో ఇద్దరు మహారాష్ట్ర మహిళలకి అమ్మడం జరిగింది. ఆ ఇంటికి సంబంధించిన పత్రాలు 1940 ప్రాంతంలో వెలుగులోకొచ్చాయి. దానిపై హిందూ పత్రిక వారు వ్యాసం కూడా రాసారు.

త్యాగరాజూ, ఆయన అన్నయ్య పంచనదయ్య ఇల్లయితే వాటాలు వేసుకున్నారు కానీ, చట్ట పరంగా పంచుకోలేదు. అది కూడా తిరువయ్యార్ మెజిస్ట్రేట్ ముందర ఒక పత్రం రాసుకున్నారంతే! త్యాగరాజుది రెండంతస్థుల ఇల్లు.


త్యాగరాజు ఇంటి అమ్మకపు పత్రము

సుమారు 1929 ప్రాంతంలో త్యాగరాజుంటున్న పై భాగాన్ని లగూ బాయి, పయమ్మ బాయి అనే ఇద్దరు మరాఠీ స్త్రీలకి అమ్మేసారు. ఈ అమ్మకాల పత్రంలో త్యాగరాజు స్వదస్తూరీతో ఆయన సంతకముంది. తిరువయ్యారు కళ్యాణ మహల్ పేలస్ లో వారసత్వ ఉద్యోగొకాయన ఈ పత్రాన్ని పొందుపరిచాడు. తిరువయ్యారు కళ్యాణ మహల్ పేలస్ లో వారసత్వ ఉద్యోగొకాయన ఈ పత్రాన్ని పొందుపరిచాడు. హిందూ పత్రిక వారికిది లభ్యమయ్యింది.

సర్వధారీ సంవత్సరం 1828 డిశంబరు 18 వ తేదీ, మార్గశిర మాసం పదకొండో రోజున, తంజావూరు వాస్తవ్యులైన శ్రీమతి లాగు బాయి, పయమ్మ బాయీ, తిరువయ్యారు వాస్తవ్యులైన కీ.శే. రామబ్రహ్మం అయ్యర్ కుమారుడు త్యాగబ్రహ్మ ఆయ్యర్, పంచనదబ్రహ్మం ఆయ్యర్ కుమారుడు సుబ్బబ్రహ్మ్మ అయ్యర్ ల మధ్య జరిగిన ఒప్పంద అంగీకార పత్రమిది. త్యాగబ్రహ్మం ఇంటి పై అంతస్థు నివాసాన్ని ముందు చెప్పిన వారికి చెందేలా రాసిన పత్రమిది. ఈ అమ్మకంలో భాగంగా 32 – 3 3/4 వంతుల బంగారమూ, 50 6/16 వెండీ ఇంటి ధరగా నిర్ణయిస్తూ, తిరువయ్యారు మహలు మహారాణి అభయ, అయ్యలు నాయకన్ సమక్షంలో జరిగిన ఒడంబడిక. ఇది ప్రభుత్వ ముద్ర కలిగిన అమ్మక పత్రము.

(త్యాగబ్రహ్మ అయ్యర్ వ్రాలు) (సుబ్బబ్రహ్మ అయ్యర్ వ్రాలు)

సాక్షులు:
1. తిరుమంజన వీధి నివాసస్థులు – రామశాస్త్రి
2. తిరుమంజన వీధి నివాసస్థులు – సాంబశివ అయ్యర్
3. తిరువధి వెంకటరామ అయ్యర్
4. సామ గురుక్కల్ తనయుడు, పంచనద గురుక్కల్
5. పంచాయితీ అధికారి – అయ్యలు నాయకన్

ఈ మూలప్రతి ప్రస్తుతం మదురై సౌరాష్ట్ర సభ వారి ఆధీనంలో ఉంది. ఇదొక్కటే త్యాగరాజు సంతకంతో లభ్యమైన ప్రతి. త్యాగరాజు వాడిన పోతన భాగవత ప్రతి కూడా వుంది కానీ, అది త్యాగరాజు స్వదస్తూరీయో కాదో తెలీదు. అది త్యాగరాజు షష్టి పూర్తి సమయంలో వెంకట రమణ భాగవతార్ కానుకగా ఇచ్చిన ప్రతని కొంతమంది భావిస్తారు. ప్రస్తుతం తిరుమంజన వీధిలో ఇంటిని త్యాగరాజు స్మారక చిహ్నంగా మలచాలని త్యాగరాజ ఆరాధనోత్సవ కమిటీ నిర్ణయించీ, కూలిపోతున్న గోడలకీ, ఇంటి లోపలా మరమ్మత్తులు చేయాలని నిర్ణయించారు. అందులో త్యాగరాజు సంబంధిత వస్తువులుంచి ఒక మ్యూజియంలా తయారు చేద్దామని వారి ఆలోచన. ఈ మరమ్మత్తు పనుల్లో ఉండగా ఎవరో ఈ కమిటీపై కోర్టులో కేసు వేసారు. అందువల్ల మరమ్మత్తు పనులు నిలిపి వేసారు. ప్రస్తుతం ఆ కోర్టు కేసు నడుస్తూ వుంది.

త్యాగరాజు సమాధిపై వివిధ అంశాలను ప్రస్తావిస్తూ విలియం జాక్సన్ ఈ విధంగా అన్నాడు.

“సమాధి వద్ద తన శిష్యులు వర్గభేదాలూ, అసూయలూ, కొట్లాటలూ ఇవన్నీ త్యాగరాజు చూస్తే ఎంతో ఆవేదనచెందుండేవాడనీ కొంతమంది దక్షిణాదులు అనుకుంటారు. సమాధి దగ్గర ప్రశాంతంగా ఉండాలి. త్యాగరాజు తను రామభక్తుణ్ణి గానే చెప్పుకున్నాడు కానీ ఒక సాధువుగా పరిగణించుకోలేదు. ఆయన మీదుండే గౌరవంతో ‘అయ్యవారు’ అంటూ అందరూ సంబోధించేవారు. త్యాగరాజు జీవించిన విధానాన్ని చూసి ఆయన మరణానంతరం త్యాగరాజ స్వామిగా అందరూ పిలుస్తున్నారు.

త్రిమూర్తులుగా పిలవబడుతున్న శ్యామశాస్త్రినీ, ముత్తుస్వామి దీక్షితార్ ని సద్గురు అని పిలవరు. ఎందుకంటే త్యాగరాజు సంగీత కళ ద్వారా దేవుణ్ణి ఎలా స్మరించుకోవాలో చెప్పాడు. భక్తి మార్గాన్ని పాటలో చూపించాడు. త్యాగరాజుని కొంతమంది ‘సద్గురు త్యాగరాజ స్వామి’గా అనుకుంటే, ఆర్.కృష్ణస్వామీ, వెంకటరమణ భాగవతారూ, బెంగుళూరు నాగరత్నమ్మా ఒక దైవంలా భావించారు…”

ఇప్పటికీ ప్రతీ ఏడూ జనవరిలో త్యాగరాజు ఆరాధనోత్సవాలు తిరువయ్యారులో జరుగుతాయి. అక్కడే కాకుండా దేశం నలుమూలలా సంగీత ప్రియులు జరుపుకుంటున్నారు. త్యాగరాజు సంగీతం పదిమందికీ తెలిసినా సంగీత శాస్త్ర పరంగా మరింత పరిశోధనలు జరగాల్సుంది. ఇది విశ్వవిద్యాలయాలవల్లే సాధ్యపడుతుంది. తమిళనాట ఈ పరిశోధనలు జరుగుతున్నా, ఆంధ్రదేశంలో సంగీతమ్మీద ఆశించినంతగా జరగట్లేదనే చెప్పుకోవాలి.

ముగింపు

సంగీతంలో రాగాలు అనంతాలనీ చెబుతూ వుంటారు. ఒకప్పుడు భారతదేశంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి విద్వాంసులు వెళ్ళేవారు. ఆయా ప్రదేశాల్లో వున్న సంగీత కళల వైవిధ్యాలు ఇతర ప్రాంతల వారికి కొత్తగా ఉండేవి. కొత్త సాంప్రదాయాలకు ఆకర్షితులై ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం సాగుతుండేది. దానికి దోహదం చేస్తూ త్యాగరాజు సుమారు 120 పైగా కొత్త కొత్త రాగాల్లో కృతులు స్వరపరిచాడు. వింతరాగాల పేరుతో ఒకటీ లేదా రెండు కృతులే స్వరపరిచినా, భైరవీ, సావేరి, సౌరాష్ట్ర, తోడి, శంకరాభరణం, కళ్యాణి, మధ్యమావతి రాగాల్లో పదిహేను పైగా కృతులున్నాయి. ముఖ్యంగా శంకరాభరణంలో 38 పైగా కృతులునాయి. ఆ తరువాత తోడి రాగంలో ఉన్నాయి. ఈ మేళ కర్త రాగాలు కాకుండా వందపైగా జన్య రాగాల్లో స్వరపరిచాడు. ఈ రాగాల్లో చాలా భాగం హరికాంభోజి లేదా ఖరహర ప్రియ జన్యాలే ఎక్కువగా కనిపిస్తాయి. త్యాగరాజు ద్వారా ఎన్నో కొత్త కొత్త రాగాలు వెలుగులోకొచ్చాయి. కొన్ని సృష్టించబడ్డాయి. సంగీత శాస్త్ర పురోగవృద్ధికి త్యాగరాజు కూర్చిన రాగాలు ఎంతో దోహదం చేసాయి. ఈ విధంగా త్యాగరాజు కర్ణాటక సంగీతాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్ళాడు. వ్యవహారిక భాషా సాహిత్యాన్ని సంగీతంలో అమర్చి తెలుగు భాషకీ వన్నె తెచ్చాడు.


త్యాగరాజు భాగవత ప్రతి

చివరగా – మన జాతీ, మన సంస్కారమూ, మన కళలూ, విద్యలూ కొంతవరకైనా మనం తెలుసుకోవాలి. తరువాత తరాలకి అందజేయాలన్న విధితో ఎంతోమంది గతంలో చేసారు. ఇప్పుడూ చేస్తున్నారు. ముందు ముందు చేస్తారు కూడా. అందువల్లే ఎన్నో వందల సంవత్సరాలనుండీ, ఎన్ని అడ్డంకులొచ్చినా ఎంతమంది విమర్శించినా, ఖండించినా, మన కళలు మహా ప్రవాహంలా సాగుతూనే ఉన్నాయి. ఇది అన్ని దేశాల వారికీ వర్తిస్తుంది. అలా కాకపోతే వాల్మీకి రామాయణమూ, నన్నయ భారతమూ, కాళిదాసు కావ్యాలూ, అన్నమయ్యా, త్యాగరాజుల కీర్తనలూ ఈ రోజున మనకి తెలిసుండేవి కావు. మంచి వస్తువూ, విలువలూ ఉన్న విషయాలెప్పటికీ నశించవు. విలువలు లేని విషయాలు ఎప్పటికప్పుడే కాలగర్భంలో కలిసిపోతాయి.

కర్ణాటక సంగీతమున్నంత కాలమూ త్యాగరాజు జీవించుంటాడు. త్యాగరాజు సంగీతమున్నంత కాలమూ తెలుగు భాషా ప్రతీ ఒక్కరి నోళ్ళలోనూ నానుతూనే ఉంటుంది. ఇది మాత్రం అక్షర సత్యం.

(సమాప్తం)


ఎందరో మహానుభావులు…

ఎంతటి మహాగాయకుడైనా ఒక్కరే పాడితే అది అంతగా రక్తి కట్టదు. అదే పక్క వాయిద్యాలున్నాయనుకోండి. ఆ పాట వినసొంపుగా వుంటుంది. అదే విధంగా రాయడమనే పనికి నేను పూనుకున్నా, ఎంతో మంది చేయూతనిచ్చారు. అమెరికాలో ఉండడం పెద్ద లోటన్న భావనే రానీయకుండా, ఎదురొచ్చి సహాయం చేసారు. అందరికీ కృతజ్ఞతాభివందనాలు. మీ అందరికీ వ్యాసం నచ్చి, కొత్త విషయాలు తెలిసాయనిపిస్తే నేను పడ్డ శ్రమ వృధా కాలేదనుకుంటాను. లేదంటారా, తెలుగువాడైన త్యాగరాజు కర్ణాటక సంగీతానికి చేసిన సేవని మరోసారి స్మరించుకున్నామనుకోండి. ఈ వ్యాసం బావుందనిపిస్తే ఆ ఘనత నాకు సహాయం చేసిన వారికి చెందుతుంది. ఎక్కడైనా తప్పులు దొర్లితే అవి మాత్రం ఖచ్చితంగా నావే!

– ముందుగా త్యాగరాజు గురించి వ్యాసం రాస్తానని విషయం చెప్పగానే నన్ను ప్రోత్సహించిన వేలూరి గారికీ, ఎంతో శ్రద్ధగా, శ్రమ కూర్చి, సమీక్ష చేసిన ఈమాట సంపాదక వర్గానికీ,
– త్యాగరాజు పై వ్యాసం రాస్తున్నానని చెబితే, తను దాచుకున్న పుస్తకాలూ, వ్యాసాలూ పంపి తన చేతలతోనూ, పుస్తకం వేయండంటూ బొమ్మేసిచ్చి తన గీతలతోనూ, నాపై ఎంతో ఆత్మీయత చూపించిన ప్రముఖ చిత్రకారులు బాపు గారికీ,
– సంగీత పరంగా నాకొచ్చిన సందేహాలన్నీ తీర్చి, నన్ను ప్రోత్సహించిన వైణిక గురువు శ్రీమతి సీత నిష్టల గారికీ,
– సుమారు అరవైఏళ్ళ క్రితం నాటి వ్యాసాలు పంపిన హిందూ వార్తా పత్రిక యాజమాన్యానికీ, తంజావూరు సరస్వతీ మహలు గ్రంధాలయంలో ఫొటోలు తీసుకోడానికి అనుమతిచ్చిన ఎస్.రాఘవన్ గారికీ,
– త్యాగరాజు సమాధి వద్ద ఫొటోలకి అనుమతిచ్చిన త్యాగరాజు కుటుంబీయులకీ,
– ఎంతో శ్రమగూర్చి పుస్తకాలు పంపిన మిత్రుడు వెంకట రత్నానికీ,
– వ్యాసం మొదటి భాగం చదివి, ప్రముఖులు రాసిన వ్యాసాలు పంపిన మేడేపల్లి శేషు గారికీ,
– ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుండి మ్యూజికల్ జర్నల్స్ తెప్పించిపెట్టిన స్కాట్ రిచ్ కీ,
– అడగ్గానే సహాయం చేసిన కె.పగల్‌వాన్‌కీ, ఆంధ్రజ్యొతి విలేకరి జి.ఎల్.ఎన్ మూర్తిగారికీ,
– నన్ను ప్రోత్సహించిన మిత్రులు గుండ శివచరణ్‌కీ, వేమూరి వెంకటేశ్వరరావు గారికీ, కందాళం రామానుజాచార్యులకీ,
– పుస్తక ప్రచురణలో సహాయమందిస్తున్న కేతు విశ్వనాధరెడ్డి గారికీ,
– నన్ను ప్రోత్సహించిన మా బావ జొన్నలగడ్డ శేష నారాయణరావుకీ,
– ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నాకు సహయం చేసిన అనేకమంది మిత్రులకీ,
– వ్యాసంలో తప్పులు సరిదిద్దిన వారికీ, తమ అభిప్రాయాలతో నన్ను ప్రోత్సహించిన ఈమాట పాఠకులకీ

…అందరికీ వందనములు.

యాదృచ్చికమో, అదృష్టమో తెలీదు – అయ్యో ఈ పుస్తకం దొరకలేదే అననుకుంటే చాలు, రెండ్రోజుల్లో నాకవి లభించాయి. ఈ త్యాగరాజు వ్యాసం పేరు చెప్పి అనేక కొత్త అనుభవాలు కలిగాయి. మరచిపోలేని అనుభూతులు మిగిలాయి. ఇది మాత్రం నేనూహించలేదు. ఈ వ్యాసం రాయడం నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నాను.
– సాయి బ్రహ్మానందం గొర్తి


Additional References:

  1. పుట్టపర్తి నారాయణా చార్యుల వారి ఇంటర్వ్యూ – ఆరాధన పత్రిక 2004
  2. త్యాగరాజ శత వార్షికోత్సవ సంచిక – 1947: ఆంధ్ర గాన కళా పరిషత్తు – రాజమండ్రి
  3. హిందూ దినపత్రిక సంగీత వ్యాసాలు – 1948
  4. కర్ణాటక సంగీత వికాసానికి త్యాగరాజు చేసిన సేవ – మంచాళ జగన్నాధ రావు – త్యాగరాజ శత వార్షికోత్సవ సంచిక – 1947
  5. శ్రీ త్యాగరాజ స్వామి సమాధి – విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ – త్యాగరాజ శత వార్షికోత్సవ సంచిక – 1947
  6. త్యాగరాజు జాతకం – వాడ్రేవు సూర్యనారాయణ – త్యాగరాజ శత వార్షికోత్సవ సంచిక – 1947
  7. Samgita Sampradaya priyadarSini – Subba Rama Dikshitar, Ettiyapuram, 1904 (Reprinted in 1960 by Madras Music Academy)
  8. Sri Tyagaraja – M.VenkaTramayya, Madras Press, 1963 –
  9. The Oriental Music in Europian Notation – A.M.Cinaswami Mudiliyar, Pudupet, Madras 1893 –
  10. Sri Tyagaraja: A Monograph – Vidya Sundari Bangalore Nagaratnamma Trust. Madras, 1976.